సర్వసభ్య సమావేశము
యేసును అనుసరించుట: సమాధానకర్తగా ఉండుట
2022 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


యేసును అనుసరించుట: సమాధానకర్తగా ఉండుట

సమాధానకర్తలు మూర్ఖులు కాదు; వారు రక్షకుని విధానంలో ప్రోత్సహించేవారు.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, మనం కల్లోలం, వివాదం గల విచారకరమైన కాలాన్ని అనుభవిస్తున్నప్పుడు మరియు అనేకమందికి తీవ్రమైన బాధ ఉన్నప్పుడు, మన హృదయాలు మన రక్షకుని కొరకు మరియు యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త యొక్క నిత్య దీవెనల కొరకు అధిక కృతజ్ఞతతో నింపబడతాయి. మనం ఆయనను ప్రేమిస్తాము, నమ్ముతాము మరియు ఎల్లప్పుడూ మనం ఆయనను అనుసరించాలని ప్రార్థిస్తాము.

సామాజిక మాధ్యమము యొక్క సవాలు

అంతర్జాలం యొక్క శక్తివంతమైన ప్రభావం ఒక దీవెన మరియు ఒక సవాలు, మన కాలానికి ప్రత్యేకమైనది.

సామాజిక మాధ్యమము మరియు వెంటనే దొరికే సమాచారము గల ప్రపంచంలో, ఒక వ్యక్తి స్వరం అనేకమంది శ్రోతలకు వెంటనే అందగలదు. ఆ స్వరము నిజమైనా, అబద్ధమైనా, అనుకూలమైనా, ప్రతికూలమైనా, దయగలదైనా, క్రూరమైనదైనా సరే వెంటనే లోకమంతా పాకిపోతుంది.

ఆలోచనాపూర్వకమైన మరియు మంచి సామాజిక మాధ్యమ పోస్టులు తరచూ చాలా తక్కువగా శ్రద్ధచూపబడతాయి, కానీ ధిక్కరించు మాటలు మరియు కోపము తరచూ మన చెవుల్లో ధ్వనింపజేయబడుతుంది, అది రాజకీయ వేదాంతం, వార్తలలోని వ్యక్తులు లేదా మహమ్మారిపై అభిప్రాయాలు వేటి గురించి అయినా కావచ్చు. రక్షకుడు మరియు పునఃస్థాపించబడిన ఆయన సువార్తతో కలిపి, ఏ ఒక్కరు లేదా ఏ విషయము ధ్రువీకృతమైన స్వరాల యొక్క ఈ సామాజిక దృగ్విషయం నుండి విడువబడలేదు.

సమాధానకర్తగా అగుట

కొండమీది ప్రసంగము అందరి కొరకు ఇవ్వబడిన సందేశము, కానీ ఆయనను అనుసరించడానికి ఎంచుకొనిన రక్షకుని శిష్యుల కొరకు ప్రత్యేకంగా ఇవ్వబడింది.

చులకన చేసే లోకంలో అప్పుడు, ఇప్పుడు ఎలా జీవించాలో ప్రభువు బోధించారు. “సమాధానపరచువారు ధన్యులు; వారు దేవుని కుమారులనబడుదురు”1 అని ఆయన ప్రకటించారు.

యేసు క్రీస్తు యందు మన విశ్వాసపు డాలు చేత దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు, అనగా శాంతపరచుటకు, చల్లబరచుటకు లేదా నిర్మూలించుటకు మనం సమాధానకర్తలుగా అవుతాము.2

మనం మన వంతు చేసినప్పుడు, మనం “దేవుని కుమారులనబడెదము” అనేది ఆయన వాగ్దానము. భూమి మీదనున్న ప్రతీవ్యక్తి దేవుని “సంతానము,”3 కానీ “దేవుని కుమారులనబడుట” అనగా దానికంటే ఎంతో ఎక్కువ. మనం యేసు క్రీస్తు వద్దకు వచ్చి, ఆయనతో నిబంధనలు చేసినప్పుడు, మనం “ఆయన సంతానము” మరియు “రాజ్యము యొక్క వారసులమవుతాము,”4 “క్రీస్తు యొక్క సంతానము, ఆయన కుమారులు మరియు కుమార్తెలమవుతాము.”5

ఒక సమాధానకర్త ఏవిధంగా అగ్ని బాణములను శాంతపరచి, చల్లబరుస్తాడు? నిశ్చయంగా, మనల్ని అవమానించే వారి ముందు కుంచించుకుపోతూ మాత్రం కాదు. దానికి బదులుగా, దృఢవిశ్వాసముతో మన నమ్మకాలను పంచుకుంటూ మన విశ్వాసంలో మనం నమ్మకంగా నిలుస్తాము, కానీ ఎల్లప్పుడూ కోపాన్ని లేదా అసూయను విడిచిపెడతాము. 6

ఇటీవల, సంఘాన్ని విమర్శిస్తూ గట్టిగా పదాలతో కూడిన అభిప్రాయం వ్యక్తమయిన తర్వాత, జాతీయ పౌర హక్కుల నాయకుడు మరియు శాన్ ఫ్రాన్సిస్కోలోని మూడవ బాప్టిస్టు సంఘం యొక్క పాస్టరైన రెవరెండ్ ఆమోస్ సి. బ్రౌన్ ఇలా స్పందించారు:

“ఆ పదాలు వ్రాసిన వ్యక్తి యొక్క అనుభవాన్ని, దృష్టికోణాన్ని నేను గౌరవిస్తున్నాను. మంజూరే, అతడు చూస్తున్న దానిని నేను చూడడం లేదు.”

“అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారితో కలిపి, ఈ [సంఘ] నాయకులను గూర్చి తెలుసుకోవడం నా జీవితంలో అతిగొప్ప ఆనందంగా నేను భావిస్తున్నాను. నా లెక్క ప్రకారం, వారు మన దేశం అందించగల మంచి నాయకత్వము యొక్క స్వరూపమైయున్నారు.”

చిత్రం
రెవరెండ్ బ్రౌన్‌తో అధ్యక్షులు నెల్సన్

ఆయన ఇంకా ఇలా అన్నారు: “ఇప్పుడున్న విషయాలను బట్టి మనం ఫిర్యాదు చేయవచ్చు. జరుగుతున్న మంచినంతటిని గుర్తించడానికి మనం నిరాకరించవచ్చు. … కానీ, ఈ విధానాలు మన జాతీయ విభజనలను బాగుచేయవు. … యేసు బోధించినట్లుగా, మనం చెడును మరింత చెడుతో నిర్మూలించలేము. మనం ధారాళంగా ప్రేమిస్తాము మరియు మన శత్రువులని మనం అనుకొనే వారిపట్ల కూడా దయతో జీవిస్తాము.”7

రెవరెండ్ బ్రౌన్ ఒక సమాధానకర్త. ఆయన శాంతంగా, మర్యాదగా అగ్ని బాణాలను చల్లబరిచారు. సమాధానకర్తలు మూర్ఖులు కాదు; వారు రక్షకుని విధానంలో ప్రోత్సహించేవారు.8

మనం ప్రేమించే సత్యాలకు వ్యతిరేకంగా గురిపెట్టబడిన అగ్ని బాణాలను చల్లబరచి, శాంతపరచి, ఆర్పుటకు మనకు లోలోపల బలాన్ని ఇచ్చేది ఏది? యేసు క్రీస్తు నందు మన విశ్వాసం ద్వారా మరియు ఆయన మాటలపై మన విశ్వాసం ద్వారా బలం వస్తుంది.

“నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, … మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.

“… పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.”9

కర్తృత్వము యొక్క ప్రాముఖ్యత

సమాధానకర్తలు కావాలనే మన కోరికను రెండు ముఖ్య సూత్రాలు నడిపిస్తాయి.

మొదటిది, మన స్వంత మార్గాన్ని ఎంచుకొనే సామర్థ్యంతో ప్రతీఒక్కరికి మన పరలోక తండ్రి నైతిక స్వతంత్రతను ఇచ్చారు.10 ఈ స్వతంత్రత దేవుని యొక్క గొప్ప బహుమానాలలో ఒకటి.

రెండవది, ఈ స్వతంత్రతతో పాటు, మన పరలోక తండ్రి “అన్ని విషయములలో వ్యతిరేకత ఉండుటను” అనుమతించారు.11 మనం “చేదును రుచి చూచెదము, తద్వారా మంచి బహుమానమును [మనం] తెలుసుకొనెదము.”12 వ్యతిరేకత మనల్ని ఆశ్చర్యానికి గురిచేయకూడదు. మనం చెడు నుండి మంచిని వేరుచేయడాన్ని నేర్చుకుంటాము.

మనం నమ్మేవాటిని చాలామంది నమ్మరని గ్రహిస్తూ, మనం స్వతంత్రత యొక్క దీవెనలో ఆనందిస్తాము. వాస్తవానికి, కడవరి దినాలలో కొద్దిమందే యేసు క్రీస్తు నందు తమ విశ్వాసాన్ని వారి ఆలోచనలు మరియు క్రియలన్నిటికి కేంద్రంగా చేసుకోవడానికి ఎంచుకుంటారు.13

సామాజిక మాధ్యమ వేదికల కారణంగా, ఒక అవిశ్వాస స్వరము అనేక ప్రతికూల స్వరాలుగా కనబడుతుంది,14 కానీ అది స్వరాల సమూహమైనప్పటికీ, మనం సమాధానకర్తల బాటను ఎంచుకుంటాము.

ప్రభువు యొక్క నాయకులు

రాజకీయ, వ్యాపార, సాంస్కృతిక నాయకుల వలె ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహము ప్రాపంచిక ప్రేరణను కలిగియున్నారని కొందరు అనుకుంటారు.

ఏమైనప్పటికీ, మా బాధ్యతలకు మేము చాలా భిన్నంగా వస్తాము. మేము దరఖాస్తుల ద్వారా ఎన్నుకోబడము లేదా ఎంపిక చేయబడము. మా ఊపిరి ఉన్నంతవరకు ప్రపంచమంతటా యేసు క్రీస్తు నామమునకు సాక్ష్యాన్ని వహించడానికి, ఎటువంటి ప్రత్యేక వృత్తిసంబంధమైన సిద్ధపాటు లేకుండా మేము పిలువబడి, నియమించబడ్డాము. మేము రోగులను, ఒంటరివారిని, దిగులుపడ్డవారిని, బీదవారిని దీవించడానికి మరియు దేవుని రాజ్యాన్ని బలపరచడానికి కృషి చేస్తాము. ప్రత్యేకించి, నిత్య జీవితాన్ని వెదికే వారి కొరకు ప్రభువు యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలని మరియు దానిని ప్రకటించాలని మేము కోరతాము.15

రక్షకుని బోధనలు అందరిచేత గౌరవించబడాలనేది మా వినయపూర్వకమైన కోరిక అయినప్పటికీ, తన ప్రవక్తల ద్వారా ప్రభువు యొక్క మాటలు తరచూ లోక ధోరణులకు, ఆలోచనకు విరుద్ధంగా ఉంటాయి. అది ఎప్పుడూ అలాగే ఉంది.16

రక్షకుడు తన అపొస్తలులతో ఇలా చెప్పారు:

“లోకము మిమ్మును [ద్వేషించిన] యెడల మీకంటె ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు. …

“… అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటినన్నిటిని మీకు చేయుదురు.”17

అందరి కొరకు శ్రద్ధ చూపుట

మనలాగే వారు నమ్మినా, నమ్మకపోయినా మన పొరుగువారందరిని మనం స్వచ్ఛంగా ప్రేమిస్తాము మరియు వారిపట్ల శ్రద్ధ చూపుతాము. సమాధానకర్తలుగా ఉంటూ, మంచి మరియు గొప్ప కారణాలను అన్వేషిస్తూ, అవసరంలో ఉన్న వారెవరికైనా సహాయపడేందుకు వివిధ విశ్వాసాలకు చెందినవారు నిజాయితీగా ప్రయత్నించాలని మంచి సమరయుని ఉపమానంలో యేసు మనకు బోధించారు.

ఫిబ్రవరిలో, Arizona Republicలో ఒక శీర్షిక ఇలా వ్యాఖ్యానించింది, “కడవరి దిన పరిశుద్ధుల చేత సహకారమివ్వబడిన ద్విపక్షాల బిల్లు స్వలింగ సంపర్కులు మరియు లింగమార్పిడి చేసుకున్న అరిజోనియన్లను కాపాడుతుంది.”18

కడవరి దిన పరిశుద్ధులుగా మేము, “నమ్మకము మరియు పరస్పర గౌరవం యొక్క ఆత్మలో కలిసి పనిచేసిన విశ్వాసము, వ్యాపారము, ఎల్‌జిబిటిక్యు జనులు మరియు సామాజిక నాయకుల కూటమిలో భాగమైనందుకు సంతోషిస్తున్నాము.”19

“యుద్ధ రేఖలుగా మారకుండా సరిహద్దు రేఖలు ఉండవా?” అని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఒకసారి ఆలోచనాపూర్వకంగా అడిగారు.20

“క్రీస్తు యొక్క సమాధానకరమైన శిష్యులై”21 ఉండేందుకు మేము కృషి చేస్తాము.

స్పందించకూడని సమయాలు

రక్షకునిపై చేయబడిన దాడులలో కొన్ని ఎంత అసూయతో కూడినవైయుండెననగా, ఆయన ఏమీ అనలేదు. “ప్రధానయాజకులును శాస్త్రులును … ఆయనమీద తీక్షణముగా నేరము మోపిరి… ఆయనను అపహసించిరి,” కానీ యేసు “[వారికి] ఉత్తరమేమియు ఇయ్యలేదు.”22 కొన్నిసార్లు సమాధానకర్తగా ఉండడమంటే అర్థము, స్పందించాలనే ప్రేరణను మనం నిరోధించడం మరియు దానికి బదులుగా, మర్యాదగా, ఏమీ అనకుండా ఉండడం.23

ఒకప్పుడు మనతో నిలిచి, మనతోపాటు సంస్కారంలో పాలుపొంది, యేసు క్రీస్తు యొక్క దైవిక నియమిత కార్యం గురించి మనతోపాటు సాక్ష్యమిచ్చిన వారిచేత రక్షకుడు, ఆయన అనుచరులు మరియు ఆయన సంఘం గురించి కఠినమైన లేదా త్రోసిపుచ్చే మాటలు మాట్లాడబడడం లేదా ప్రచురించబడడం మనందరికీ హృదయవిదారకమైనది.24

ఇది రక్షకుడు పరిచర్య చేసినప్పుడు కూడా జరిగింది.

ఆయన అత్యంత ఘనమైన అద్భుతాలు చేసిన సమయంలో ఆయనతో పాటు ఉన్న యేసు శిష్యులలో కొద్దిమంది “మరి ఎన్నడును ఆయనను [వెంబడింపరాదని]” నిర్ణయించుకున్నారు.25 విచారకరమైన విషయమేమిటంటే, రక్షకుని కొరకు తమ ప్రేమలో మరియు ఆయన ఆజ్ఞలను పాటించాలనే తమ నిర్ణయంలో అందరూ స్థిరంగా నిలిచియుండరు.26

కోపము మరియు వివాదము అనే చక్రంలో నుండి బయటకు రమ్మని యేసు మనకు బోధించారు. ఒక ఉదాహరణలో, పరిసయ్యులు యేసును ఎదిరించి, ఆయనను ఎలా నాశనం చేయాలని చర్చించుకున్న తర్వాత, యేసు వారి దగ్గర నుండి వెళ్ళిపోయారు,27 మరియు “బహు జనులాయనను వెంబడింపగా, ఆయన వారినందరిని స్వస్థపరచినప్పుడు”28 అద్భుతాలు సంభవించాయి అని లేఖనాలు చెప్తాయి.

ఇతరుల జీవితాలను దీవించుట

మనం కూడా వివాదం నుండి దూరంగా వెళ్ళిపోగలము మరియు మన స్వంత మూలలో మనల్ని మనం ఒంటరిగా చేసుకోకుండా, ఇతరుల జీవితాలను దీవించగలము.29

డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో లోని బుజి-మాయ్‌లో, మొదట్లో కొంతమంది మన నమ్మకాలను అర్థం చేసుకోకుండా లేదా మన సభ్యుల గురించి తెలుసుకోకుండా సంఘాన్ని విమర్శించారు.

కొంతకాలం క్రితం, నేను, కేథీ బుజి-మాయ్‌లో ఒక ప్రత్యేక సంఘ సేవకు హాజరయ్యాము. మెరిసే కళ్ళు మరియు పెద్ద చిరునవ్వులతో పిల్లలు శుభ్రమైన దుస్తులు ధరించియున్నారు. వారి విద్య గురించి వారితో మాట్లాడాలని నేను ఆశించాను, కానీ వారిలో చాలామంది పాఠశాలకు వెళ్ళడం లేదని తెలుసుకున్నాను. నామమాత్రపు మానవతావాద నిధులతో మన నాయకులు సహాయపడేందుకు ఒక మార్గాన్ని కనుగొన్నారు.30 ఇప్పుడు, బాలికలు మరియు బాలురు, సభ్యులు, అలాగే మన విశ్వాసానికి చెందని వారితో కలిపి 400 కంటే ఎక్కువమంది విద్యార్థులు యేసు క్రీస్తు యొక్క సంఘ సభ్యులైన 16 మంది బోధకుల చేత ఆహ్వానించబడి, బోధించబడుతున్నారు.

చిత్రం
కలంగ ముయా

పధ్నాలుగేళ్ళ కలంగ ముయా చెప్పాడు, “[కొద్దిగా డబ్బు కలిగియుండి,] నేను నాలుగు సంవత్సరాలు పాఠశాలకు వెళ్ళలేదు. … సంఘము చేసిన దానికి నేను చాలా కృతజ్ఞత కలిగియున్నాను. … ఇప్పుడు నేను ఫ్రెంచి చదువగలను, వ్రాయగలను మరియు మాట్లాడగలను.”31 ఈ చొరవ గురించి మాట్లాడుతూ బుజి-మాయ్‌ మేయరు ఇలా అన్నారు, “యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము చేత నేను ప్రేరేపించబడ్డాను, ఎందుకంటే [ఇతర] సంఘాలు కేవలం తమ గురించి మాత్రమే ఆలోచిస్తూ విభజింపబడుతుంటే … అవసరంలో నున్న సమాజానికి సహాయపడేందుకు [ఇతరుల] తో [కలిసి మీరు పనిచేస్తున్నారు].”32

ఒకరినొకరు ప్రేమించండి

నేను యోహాను 13వ అధ్యాయం చదివిన ప్రతీసారి, ఒక సమాధానకర్తగా రక్షకుని యొక్క పరిపూర్ణమైన మాదిరి నాకు గుర్తు చేయబడింది. యేసు ప్రేమతో అపొస్తలుల పాదాలు కడిగారు. తర్వాత, ఆయన ప్రేమించిన వారిలో ఒకడు ఆయనను అప్పగించడానికి సిద్ధపడుతున్నాడని ఆయన ఆలోచిస్తున్నప్పుడు, “ఆయన ఆత్మలో కలవరపడిరి,”33 అని మనం చదువుతాం. యూదా వెళ్ళిపోయినప్పుడు, రక్షకుని ఆలోచనలు మరియు భావాలను ఊహించడానికి నేను ప్రయత్నించాను. ఆసక్తికరంగా, ఆ గంభీరమైన క్షణంలో, తనను “కలవరపెట్టే” భావాల గురించి లేదా నమ్మకద్రోహం గురించి యేసు ఏమియు మాట్లాడలేదు. దానికి బదులుగా, ప్రేమ గురించి ఆయన అపొస్తలులతో మాట్లాడారు, ఆయన మాటలు శతాబ్దాలుగా ప్రవహిస్తున్నాయి:

“మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. …

మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను.”34

మనం ఆయనను మరియు ఒకరిని ఒకరం ప్రేమించెదము. మనం సమాధానకర్తలుగా ఉండెదము, ఆవిధంగా మనం “దేవుని కుమారులనబడెదము” అని యేసు క్రీస్తు నామములో నేను ప్రార్థిస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. మత్తయి 5:9.

  2. ఎఫెసీయులకు 6:16; సిద్ధాంతము మరియు నిబంధనలు 3:8 చూడండి.

  3. అపొస్తలుల కార్యములు 17:28.

  4. మోషైయ 15:11.

  5. మోషైయ 5:7.

  6. అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ చెప్పారు: “క్రీస్తు అనుచరులు నాగరికతకు మాదిరులుగా ఉండాలి. మనం అందరిని ప్రేమించాలి, మంచి శ్రోతలుగా ఉండాలి మరియు వారి మనఃపూర్వకమైన నమ్మకాల పట్ల శ్రద్ధ చూపాలి. మనం వారితో ఏకీభవించకపోయినా, మనం అంగీకరించనట్లు ఉండకూడదు. వివాదాస్పద విషయాలపై మన అభిప్రాయాలు, సంభాషణలు కలహపూరితంగా ఉండకూడదు” (“Loving Others and Living with Differences,” Liahona, Nov. 2014, 27).

  7. “Amos C. Brown: Follow the LDS Church’s Example to Heal Divisions and Move Forward,” Salt Lake Tribune, Jan. 20, 2022, sltrib.com.

  8. “మన జీవితాల్లో క్రీస్తు యొక్క ప్రేమ అతిముఖ్యమైన విషయమైనప్పుడు, మనం విభేదాలను సాత్వీకము, సహనము మరియు దయతో సమీపిస్తాము” అని ఎల్డర్ డేల్ జి. రెన్లండ్ చెప్పారు (“క్రీస్తు యొక్క శాంతి శత్రుత్వాన్ని నిర్మూలించును,” లియహోనా, నవ. 2021, 84).

  9. మత్తయి 5:11–12.

  10. 2 నీఫై 10:23 చూడండి.

  11. 2 నీఫై 2:11.

  12. మోషే 6:55.

  13. 1 నీఫై 14:12 చూడండి.

  14. ఐదుగురిలో ముగ్గురి వరకు వారు చదివి కూడా ఉండని కథకు శీర్షికను పంచుకుంటారని ఇటీవలి సమాచారము చూపుతోంది (see Caitlin Dewey, “6 in 10 of You Will Share This Link without Reading It, a New, Depressing Study Says,” Washington Post, June 16, 2015, washingtonpost.com; Maksym Gabielkov and others, “Social Clicks: What and Who Gets Read on Twitter?” [paper presented at the 2016 ACM Sigmetrics International Conference on Measurement and Modeling of Computer Science, June 14, 2016], dl.acm.org).

  15. మొదట్లో మీ వ్యక్తిగత అభిప్రాయాలు కొన్నిసార్లు ప్రభువు యొక్క ప్రవక్తల బోధనలతో సామరస్యంగా ఉండకపోతే ఆశ్చర్యపడకండి. మనం ప్రార్థనలో మోకరించినప్పుడు, అవి నేర్చుకోవలసిన, అణకువతో ఉండవలసిన క్షణాలు. విశ్వాసంతో, దేవునిపై నమ్మకంతో, కాలం గడిచేకొద్దీ మన పరలోక తండ్రి నుండి మరింత ఆత్మీయ స్పష్టతను మనం పొందుతామని తెలుసుకొని మనం ముందుకు సాగుతాం.

  16. సిద్ధాంతము మరియు నిబంధనలు 1:14-16 చూడండి.

  17. యోహాను 15:18, 21; వివరణ చేర్చబడినది.

  18. “Bipartisan Bill Supported by Latter-day Saints Would Protect Gay and Transgender Arizonans,” Arizona Republic, Feb. 7, 2022, azcentral.com.

  19. Why the Church of Jesus Christ Supports a New Bipartisan Religious Freedom and Non-discrimination Bill in Arizona,” Feb. 7, 2022, newsroom.ChurchofJesusChrist.org.

  20. Russell M. Nelson, “Teach Us Tolerance and Love,” Ensign, May 1994, 69.

  21. మొరోనై 7:3. అధ్యక్షలు గార్డన్ బి. హింక్లి చెప్పారు: “మనం సహించేవారిగా ఉండడమే కాదు, కానీ మనం చూసేలా విషయాలను చూడని వారి కొరకు నిశ్చయాత్మకమైన కృతజ్ఞత గల ఆత్మను మనం తప్పక పెంపొందించుకోవాలి. మన వేదాంతాన్ని, మన నమ్మకాలను, పరలోకపు దేవునిచేత బయల్పరచబడినట్లుగా నిత్య సత్యం గురించి మన జ్ఞానాన్ని మనం ఏవిధంగాను సర్దుబాటు చేసుకోనవసరం లేదు. నెమ్మదిగా, మనఃపూర్వకంగా, నిజాయితీగా, కానీ ఇతరులను ఎన్నడూ అవమానించే విధంగా కాకుండా, సత్యం గురించి మనం మన సాక్ష్యాన్ని చెప్పగలము. … మనలాగే తమ నమ్మకాలు మరియు అలవాట్లలో నిజాయితీగా ఉన్నవారి పట్ల అభినందనను, గౌరవాన్ని చూపడానికి సమ్మతించడాన్ని మనం తప్పక నేర్చుకోవాలి” (“Out of Your Experience Here” [Brigham Young University devotional, Oct. 16, 1990], 6, speeches.byu.edu).

  22. లూకా 23:9-11 చూడండి.

  23. ఎల్డర్ డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్ చెప్పారు: “యేసు క్రీస్తు యొక్క అనుచరులుగా మనం [ఆయన] మాదిరిని అనుసరిస్తాము. మనం ఇతరులను అవమానించము లేదా వారిపై దాడిచేయము. దేవుడిని ప్రేమించాలని, మన పొరుగువారికి సేవ చేయాలని మనం కోరుకుంటాము. దేవుని ఆజ్ఞలను ఆనందంగా పాటించాలని మరియు సువార్త సూత్రాలను బట్టి జీవించాలని మనం కోరుకుంటాము” (“Five Messages That All of God’s Children Need to Hear” [Brigham Young University Education Week devotional, Aug. 17, 2021], 5, speeches.byu.edu).

  24. ఎల్డర్ నీల్ ఎ. మాక్స్‌వెల్ చెప్పారు: “వెయ్యేండ్ల పరిపాలన వరకు సంఘ సభ్యులు ఈ గోధుమలు-గురుగుల పరిస్థితిలో జీవిస్తారు. వారిక ఏ మాత్రం నమ్మని సంఘ సిద్ధాంతాల గురించి మిగిలిన వారికి ఉపన్యాసాలిచ్చే కొద్దిమంది ఆతృత గల వ్యక్తులతో కలిపి, కొన్ని నిజమైన గురుగులు గోధుమల వలె మారువేషాలేస్తాయి. వారు ఏ మాత్రం సహకరించని సంఘ వనరుల ఉపయోగం గురించి వారు విమర్శిస్తారు. వారు ఏ మాత్రం సమ్మతించని సహోదరులకు సలహా ఇవ్వాలని వారు మర్యాదపూర్వకంగా కోరుకుంటారు. ఘర్షణాత్మకంగా, వారిని వారు తప్ప, వారు సంఘాన్ని వదిలేస్తారు, కానీ వారు సంఘాన్ని మాత్రమే వదిలివేయలేరు” (“Becometh As a Child,” Ensign, May 1996, 68).

  25. యోహాను 6:66.

  26. “పాప భోగము [కేవలము] అల్పకాలము కొరకే” (హెబ్రీయులకు 11:24–26 చూడండి).

  27. మత్తయి 12:1-15 చూడండి.

  28. మత్తయి 12:15.

  29. 3 నీఫై 11:29-30 చూడండి.

  30. డాన్ బాస్కో ఫౌండేషన్ వారి సహాయంతో, పాఠశాల కార్యక్రమం బోధనలో మరియు వస్తువులలో విలువైన నైపుణ్యాన్ని పొందింది.

  31. ములేకా అనే ఒక తల్లి ఇలా చెప్పారు: “ఈ కార్యక్రమం నాకిష్టం, ఎందుకంటే ఇది మా పాపకు … చదవడం, వ్రాయడం నేర్చుకోవడానికి మరియు మంచి భవిష్యత్తు కోసం ఆశించడానికి … అవకాశమిచ్చింది. నేను ఆమెను పాఠశాలకు పంపలేకపోయాను, ఎందుకంటే నేను బజారులో జొన్నపిండి అమ్ముకుంటూ … తినడానికి తగినంతే సంపాదిస్తున్నాను. దీనికోసం నేను సంఘానికి చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను.” సహోదరి మోనిక్ అనే ఒక బోధకురాలు ఇలా చెప్పారు: “ఈ కార్యక్రమం ఈ పిల్లల కోసం గొప్ప దీవెనగా వచ్చింది. నా తరగతిలో … చాలామంది అనాథలు. వారు దీనిని ప్రేమిస్తున్నారు, క్రమం తప్పక తరగతులకు హాజరవుతున్నారు మరియు ఇంటిపని చేస్తున్నారు” (Comments and photos supplied by Elder Joseph W. Sitati, Feb. 24, 2022).

  32. 2021, అక్టో. 10న యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము చేత చేపట్టబడిన బుజి-మాయి అక్షరాస్యత కార్యక్రమం గురించి ఒక బహిరంగ సమావేశంలో మేయరు టుంబా లూయిస్ డియోర్ షిపోటా వ్యాఖ్యలు.

  33. యోహాను 13:21.

  34. యోహాను 13:34-35.