సర్వసభ్య సమావేశము
ఆత్మీయ వేగము యొక్క శక్తి
2022 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


ఆత్మీయ వేగము యొక్క శక్తి

ఈ రోజు నేను సానుకూల ఆత్మీయ వేగాన్ని కొనసాగించడంలో సహాయపడడానికి మనం తీసుకోగల ఐదు నిర్దిష్ట చర్యలను సూచించాలనుకుంటున్నాను.

ప్రియమైన సహోదర సహోదరీలారా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఈరోజు మీతో మాట్లాడే అవకాశం కొరకు నేను కృతజ్ఞత కలిగియున్నాను. అపవాది యొక్క భీకర దాడుల నుండి మీరు రక్షించబడాలని మరియు మీరు ఎదుర్కొనే ఎటువంటి సవాళ్ళనైనా అధిగమించగలిగే శక్తిని కలిగియుండాలని నేను ప్రతిరోజూ ప్రార్థిస్తున్నాను.

కొన్ని శ్రమలు ఎవ్వరూ చూడలేని లోతైన వ్యక్తిగత భారాలు. మరికొన్ని శ్రమలు చాలా బహిరంగంగా ఉంటాయి. తూర్పు ఐరోపాలో సాయుధ పోరాటం వీటిలో ఒకటి. నేను ఉక్రెయిన్ మరియు రష్యాకు చాలాసార్లు వెళ్ళాను. ఆ ప్రదేశాలు, ప్రజలు మరియు వారి భాషలు నాకిష్టం. ఈ కలహములో నష్టపోయిన వారందరి కొరకు నేను దుఃఖిస్తూ ప్రార్థిస్తున్నాను. కష్టాలలో ఉన్న మరియు మనుగడ కోసం పోరాడుతున్న వారికి సహాయం చేయడానికి ఒక సంఘముగా మేము చేయగలిగినదంతా చేస్తున్నాము. ఈ విపత్తు వల్ల నష్టపోయిన వారందరి కొరకు ఉపవాస ప్రార్థనలను కొనసాగించాలని ప్రతీఒక్కరిని మేము ఆహ్వానిస్తున్నాము. ఏ యుద్ధమైనా ప్రభువైన యేసు క్రీస్తు బోధించి, నిలబడే ప్రతీదాని యొక్క భయంకరమైన ఉల్లంఘన.

మనలో ఎవ్వరూ దేశాలను లేదా ఇతరుల చర్యలను లేదా కనీసం మన స్వంత కుటుంబ సభ్యులను కూడా నియంత్రించలేరు. కానీ మనలో ప్రతీఒక్కరం మనల్ని మనం నియంత్రించుకోగలము. ప్రియమైన సహోదర సహోదరీలారా, మీ హృదయంలో, మీ గృహములో మరియు మీ జీవితంలో చెలరేగుతున్న సంఘర్షణలను అంతం చేయాలన్నదే ఈ రోజు నా పిలుపు. ఇతరులను గాయపరచాలనే కోరికలన్నింటిని పాతిపెట్టండి—ఆ కోరికలు కోపము, అసభ్యకరమైన మాటలు లేదా మిమ్మల్ని పదే పదే గాయపరిచిన వారి పట్ల ఆగ్రహం కావచ్చు. రక్షకుడు మరో చెంపను త్రిప్పమని,1 మన శత్రువులను ప్రేమించమని మరియు మనల్ని బాధించేవారి కోసం ప్రార్థన చేయమని ఆజ్ఞాపించారు2.

చాలా న్యాయంగా భావించబడే కోపాన్ని విడిచిపెట్టడం మిక్కిలి కష్టంగా ఉండవచ్చు. అమాయకులను గాయపరిచే విధ్వంసకర చర్యలు చేసేవారిని క్షమించడం అసాధ్యం అనిపించవచ్చు. అయినప్పటికీ, “మనుష్యులందరిని క్షమించవలెనని”3 రక్షకుడు ఉద్బోధిస్తున్నారు.

మనము సమాధానకర్తయగు అధిపతి యొక్క అనుచరులము. ఆయన మాత్రమే తీసుకురాగల సమాధానము గతంలో కంటే ఎక్కువగా ఇప్పుడు మనకు అవసరము. వ్యక్తిగతంగా మనం శాంతిని మరియు సామరస్యాన్ని కోరుకోనప్పుడు ప్రపంచంలో శాంతి ఉంటుందని మనం ఎలా ఆశించగలము? సహోదర సహోదరీలారా, నేను సూచించేది సులభం కాదని నాకు తెలుసు. అయితే యేసు క్రీస్తు అనుచరులు ప్రపంచమంతా అనుసరించేలా ఆదర్శప్రాయముగా ఉండాలి. ప్రస్తుతం మీ హృదయాలలో మరియు మీ జీవితాలలో చెలరేగుతున్న వ్యక్తిగత సంఘర్షణలను అంతం చేయడానికి మీరు చేయగలిగినదంతా చేయాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.

ఇటీవల బాస్కెట్‌బాల్ ఆటను చూస్తున్నప్పుడు నాకు గుర్తు చేయబడిన ఒక ఆలోచనను చర్చించడం ద్వారా చర్య తీసుకోవాలనే ఉపదేశమును నేను నొక్కి చెప్పవచ్చునా.

ఇరు జట్లు ఒకరిపై మరొకరు ఒకరి తరువాత మరొకరు ఆధిపత్యం సాగిస్తూ ఆ ఆటలో మొదటి సగభాగం కొనసాగింది. తరువాత, మొదటి అర్థభాగంలో చివరి ఐదు సెకన్లలో, ఒక జట్టులోని గార్డు అందమైన మూడు-పాయింట్ల షాట్ వేసాడు. ఒక్క సెకను మాత్రమే మిగిలి ఉండగా, అతని సహచరుడు లోపలికి పంపబడిన బంతిని చేజిక్కించుకొని, గంట మ్రోగేలోపు మరొక బాస్కెట్ వేసాడు! కాబట్టి ఆ జట్టు నాలుగు పాయింట్ల ఆధిపత్యముతో గుర్తించదగిన రెట్టింపు వేగముతో లాకర్ గదిలోకి వెళ్ళింది. వారు రెండవ అర్థభాగంలో ఆ వేగాన్ని కొనసాగించి ఆటను గెలవగలిగారు.

వేగము అనేది శక్తివంతమైన భావన. ఉదాహరణకు, వేగం పుంజుకునే వాహనంలో లేదా అకస్మాత్తుగా వాదనగా మారిన అసమ్మతిలో దీనిని ఒక రూపంలో లేదా మరొక రూపంలో మనమందరం అనుభవించాము.

కాబట్టి “ఏది ఆధ్యాత్మిక శక్తిని రేకెత్తిస్తుంది?” అని నేను అడుగుతున్నాను. సానుకూల మరియు ప్రతికూల వేగము యొక్క ఉదాహరణలను మనము చూసాము. పరివర్తన చెంది, వారి విశ్వాసంలో వృద్ధి చెందిన యేసు క్రీస్తు అనుచరులు మనకు తెలుసు. కానీ ఒకప్పుడు కట్టుబడి ఉన్న విశ్వాసులు త్రోవతప్పారని కూడా మనకు తెలుసు. వేగము ఎటువైపు అయినా ఊగిసలాడవచ్చు.

చెడు మరియు కాలముల సూచనలు తీవ్రతరం అవుతున్న వేగాన్ని ఎదుర్కోవడానికి సానుకూల ఆత్మీయ వేగము మునుపటి కంటే నేడు మనకు ఎక్కువ అవసరము. మహమ్మారులు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు మరియు సాయుధ శత్రుత్వాల ద్వారా సృష్టించబడిన భయం మరియు అనిశ్చితుల మధ్య సానుకూల ఆత్మీయ వేగము మనల్ని ముందుకు సాగేలా చేస్తుంది. అపవాది యొక్క కనికరంలేని, దుష్ట దాడులను తట్టుకోవడంలో మరియు మన వ్యక్తిగత ఆత్మీయ పునాదిని క్షీణింపజేసే అతడి ప్రయత్నాలను అడ్డుకోవడంలో ఆత్మీయ వేగము మనకు సహాయపడుతుంది.

అనేక చర్యలు సానుకూల ఆత్మీయ వేగాన్ని రేకెత్తించగలవు. వాటిలో విధేయత, ప్రేమ, వినయం, సేవ మరియు కృతజ్ఞతాభావం4 అనేవి కొన్ని మాత్రమే.

ఈ రోజు, నేను సానుకూల ఆత్మీయ వేగమును కొనసాగించడంలో సహాయపడడానికి మనం తీసుకోగల ఐదు నిర్దిష్ట చర్యలను సూచించాలనుకుంటున్నాను.

మొదటిది: నిబంధన మార్గంలో ప్రవేశించండి మరియు అక్కడే ఉండండి.

కొంతకాలం క్రితం, నాకు ఒక స్పష్టమైన కల వచ్చింది, అందులో నేను ఒక పెద్ద సమూహాన్ని కలుసుకున్నాను. వారు నన్ను చాలా ప్రశ్నలు అడిగారు, వాటిలో తరచుగా అడుగబడినది నిబంధన మార్గం అంటే ఏమిటి మరియు అది ఎందుకు ముఖ్యమైనది.

బాప్తిస్మము పొందడం ద్వారా మరియు దేవునితో మన మొదటి నిబంధన చేయడం ద్వారా మనం నిబంధన మార్గంలోకి ప్రవేశిస్తాము అని నా కలలో నేను వివరించాను.5 సంస్కారములో పాలుపొందిన ప్రతీసారి, మనపైన క్రీస్తు నామమును తీసుకొంటామని, ఎల్లప్పుడూ ఆయనను జ్ఞాపకముంచుకుంటామని, ఆయన ఆజ్ఞలను పాటిస్తామని మనం మరలా వాగ్దానము చేస్తాము.6 దానికి బదులుగా, ప్రభువు ఆత్మ మనతో ఎల్లప్పుడు ఉండునని దేవుడు మనకు హామీ ఇస్తున్నారు.

తరువాత, మనము దేవాలయములో అదనపు నిబంధనలను చేస్తాము, అక్కడ మనము మరింత గొప్ప వాగ్దానాలను పొందుతాము. విధులు మరియు నిబంధనలు మనము దైవిక శక్తిని పొందేలా చేస్తాయి. నిబంధన మార్గం మాత్రమే ఉన్నతస్థితి మరియు నిత్య జీవానికి నడిపించే మార్గం.

తమ నిబంధనలను ఉల్లంఘించిన వారు ఆ మార్గంలోకి తిరిగి ఎలా చేరుకుంటారు అని నా కలలో ఒక స్త్రీ అడిగింది. ఆమె ప్రశ్నకు సమాధానం నా రెండవ సూచనకు దారితీస్తుంది:

అనుదిన పశ్చాత్తాపము యొక్క ఆనందాన్ని కనుగొనండి.

పశ్చాత్తాపము ఎంత ముఖ్యమైనది? మనము “పశ్చాత్తాపము మరియు ప్రభువు పైన విశ్వాసము తప్ప మరేదియు బోధించరాదని”7 ఆల్మా బోధించాడు. నిత్య మహిమను కోరుకునే ప్రతి జవాబుదారీ వ్యక్తికి పశ్చాత్తాపం అవసరము.8 వాటికి మినహాయింపులు లేవు. ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్‌కు ఇవ్వబడిన ఒక బయల్పాటులో, తమ పిల్లలకు సువార్త బోధించనందుకు ప్రభువు తొలి సంఘ నాయకులను మందలించారు.9 పశ్చాత్తాపము పురోగతికి కీలకము. స్వచ్ఛమైన విశ్వాసం మనలను నిబంధన మార్గంలో ముందుకు సాగేలా చేస్తుంది.

దయచేసి భయపడవద్దు లేదా పశ్చాత్తాపాన్ని ఆలస్యం చేయవద్దు. సాతాను మీ కష్టాలను చూసి ఆనందిస్తాడు. దానిని తక్కువ చేయండి. అతడి ప్రభావాన్ని మీ జీవితం నుండి తీసివేయండి. ప్రకృతి సంబంధియైన మనుష్యుని విసర్జించడంలోని ఆనందాన్ని అనుభవించడాన్ని ఈరోజే ప్రారంభించండి.10 రక్షకుడు ఎల్లప్పుడూ మనల్ని ప్రేమిస్తారు, ముఖ్యంగా మనం పశ్చాత్తాపపడినప్పుడు ప్రేమిస్తారు. “పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను …నా కృప నిన్ను విడిచిపోదు”11 అని ఆయన వాగ్దానము చేసారు.

నిబంధన మార్గము నుండి మీరు సుదూరములో లేదా బహుదూరములో ఉన్నారని మరియు తిరిగి రావడానికి దారిలేదని మీరు భావిస్తే, అది నిజం కాదు.12 మీ బిషప్పును లేదా మీ శాఖాధ్యక్షుడిని కలవండి. అతడు ప్రభువు యొక్క ప్రతినిధి మరియు పశ్చాత్తాపము యొక్క ఆనందాన్ని, ఉపశమనాన్ని అనుభవించడంలో మీకు సహాయం చేస్తాడు.

ఇప్పుడు, ఒక హెచ్చరిక: నిబంధన మార్గానికి తిరిగి రావడం అంటే జీవితం సులభముగా ఉంటుందని అర్థం కాదు. ఈ మార్గం చాలా కఠినంగా ఉంటుంది మరియు కొన్నిసార్లు నిటారుగా పైకి ఎక్కినట్లు అనిపిస్తుంది.13 అయితే ఈ ఆరోహణం మనల్ని పరీక్షించడానికి, మనకు బోధించడానికి, మన స్వభావాలను శుద్ధిచేయడానికి మరియు మనం పరిశుద్ధులుగా మారడంలో సహాయం చేయడానికి రూపొందించబడింది. ఇది ఉన్నతిస్థితికి నడిపించే ఏకైక మార్గం. “దేవుని ఆజ్ఞలను గైకొను వారి ఆశీర్వాదకరమైన, సంతోషకరమైన స్థితిని ఒక ప్రవక్త14 ఇలా అభివర్ణించారు: ఏలయనగా వారు ఐహికమైన మరియు ఆత్మ సంబంధమైన విషయములన్నిటి యందు ఆశీర్వదింపబడియున్నారు; వారు అంతము వరకు విశ్వాసముతో స్థిరముగా ఉన్న యెడల, వారు పరలోకములోనికి చేర్చుకొనబడి …[మరియు] దేవునితో ఎన్నడూ అంతముకాని సంతోషము యొక్క స్థితిలో నివసించెదరు.”15

అనుదిన పశ్చాత్తాపంతో పాటు నిబంధన మార్గంలో నడవడం సానుకూల ఆత్మీయ వేగానికి బలాన్ని చేకూరుస్తుంది.

నా మూడవ సూచన: దేవుని గురించి మరియు ఆయన ఎలా పనిచేస్తారో తెలుసుకోండి.

దేవుని సత్యాలకు మరియు సాతాను అసత్యాలకు మధ్య తేడాను గుర్తించడం నేడు మనకున్న అతిపెద్ద సవాళ్ళలో ఒకటి. అందుకే ప్రభువు మనలను ఈవిధముగా హెచ్చిరించారు, “ఎల్లప్పుడూ ప్రార్థించుము; తద్వారా [మనము] సాతానును జయించవచ్చును, మరియు …అతని పనిలో సహకరించు సాతాను సేవకుల చేతులలో నుండి తప్పించుకొనవచ్చును.”16

దేవునికి మరియు సాతానుకు మధ్య తేడాను వివేచించడానికి మోషే ఒక మాదిరిని సమకూర్చాడు. సాతాను మోషేను శోధించడానికి వచ్చినప్పుడు అతడు మోసాన్ని గుర్తించాడు, ఎందుకంటే అతడు అప్పుడే దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు. సాతాను ఎవరో మోషే త్వరగా గ్రహించి, విడిచివెళ్ళమని అతడిని ఆజ్ఞాపించాడు.17 సాతాను పట్టుదలగా ఉన్నప్పుడు, మరింత సహాయం కోసం దేవునికి ఎలా ప్రార్థించాలో మోషేకు తెలుసు. మోషే దైవిక బలాన్ని పొంది, దుష్టుడిని మరలా ఇలా మందలించాడు, “సాతానా నా నుండి వెళ్ళిపొమ్ము, ఏలయనగా ఈ ఒక్క దేవునినే నేను ఆరాధించెదను.”18

మనము ఆ మాదిరిని అనుసరించాలి. సాతాను ప్రభావాన్ని మీ జీవితం నుండి తీసివేయండి. దయచేసి అతడి “దౌర్భాగ్యపు అగాధము మరియు అంతము లేని శ్రమను”19 వెంబడించవద్దు.

“దేవుని మంచి వాక్యము ద్వారా అనుదినము పోషింపబడని”20 సాక్ష్యము భయంకరమైన వేగముతో కూలిపోగలదు. ఆవిధంగా, సాతాను కుట్రకు విరుగుడు స్పష్టంగా ఉంది: ప్రభువును ఆరాధించడం మరియు ఆయన సువార్తను అధ్యయనం చేయడం వంటి అనుదిన అనుభవాలు మనకు అవసరం. మీ జీవితంలో దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీ సమయములో ఆయనకు న్యాయమైన వాటా ఇవ్వండి. మీరు ఆవిధంగా చేస్తున్నప్పుడు, మీ సానుకూల ఆత్మీయ వేగానికి ఏమి జరుగుతుందో గమనించండి.

సూచన సంఖ్య 4: అద్భుతాలను వెదకండి మరియు ఆశించండి.

“దేవుడు అద్భుతములను చేయు దేవునిగా ఉండుట మానివేయలేదని”21 మొరోనై మనకు హామీ ఇచ్చాడు. తనను నమ్మే వారి జీవితాలలో మధ్యవర్తిత్వము చేయుటకు ప్రభువు ఎంత ఇష్టపడుతున్నారో ప్రతి లేఖన గ్రంథము రుజువుచేస్తుంది.22 ఆయన మోషే కొరకు ఎర్ర సముద్రాన్ని విభజించారు, ఇత్తడి పలకలను తిరిగి పొందడంలో నీఫైకు సహాయం చేసారు మరియు ప్రవక్త జోసెఫ్ స్మిత్ ద్వారా తన సంఘాన్ని పునఃస్థాపించారు. ఈ అద్భుతాలలో ప్రతీఒక్కదానికి సమయం పట్టింది మరియు ఆ వ్యక్తులు వాస్తవానికి ప్రభువు నుండి కోరిన విధంగా అది కాకపోయి ఉండవచ్చు.

అదే విధంగా, “దేనిని సందేహించక”23 మీరు ఆయనను నమ్మినట్లైతే, అద్భుతాలతో ప్రభువు మిమ్మల్ని దీవిస్తారు. అద్భుతాలను వెదకడానికి ఆత్మీయ కార్యము చేయండి. అలాంటి విశ్వాసాన్ని సాధన చేయడంలో మీకు సహాయం చేయమని ప్రార్థనాపూర్వకముగా దేవుడిని అడగండి. యేసు క్రీస్తు “సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు,శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు”24 అని మీకు మీరే దానిని అనుభవించగలరని నేను వాగ్దానం చేస్తున్నాను. మీ జీవితంలో అసాధ్యమైన దానిని చేయడానికి ప్రభువు మీకు సహాయం చేస్తున్నారని గ్రహించడం కన్నా, మీ ఆత్మీయ వేగాన్ని మరింత వేగవంతం చేసే విషయాలు చాలా తక్కువగా ఉంటాయి.

సూచన సంఖ్య 5: మీ వ్యక్తిగత జీవితంలో సంఘర్షణను ముగించండి.

మీ జీవితంలో సంఘర్షణను ముగించమని నేను ఇచ్చిన పిలుపును పునరావృతం చేస్తున్నాను. క్షమించడానికి మరియు క్షమాపణ కోరడానికి అవసరమైన వినయం, ధైర్యం మరియు బలాన్ని సాధన చేయండి. “[మనము] మనుష్యుల అపరాధములను క్షమించిన యెడల, [మన] పరలోకపు తండ్రి [మనలను] క్షమించును”25 అని రక్షకుడు మనకు వాగ్దానము చేసారు.

నేటి నుండి రెండు వారాల తరువాత మనము ఈస్టర్ జరుపుకుంటాము. ఈ మధ్యకాలంలో, మిమ్మల్ని బాధపెట్టిన వ్యక్తిగత సంఘర్షణకు ముగింపు పలకాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము కొరకు ఆయనకు కృతజ్ఞత తెలపడం కంటే మరింత సముచితమైన చర్య మరేదైనా ఉండగలదా? క్షమాపణ ప్రస్తుతం అసాధ్యమని అనిపిస్తే, మీకు సహాయం చేయడానికి యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త రక్తము ద్వారా శక్తిని కోరండి. మీరు అలా చేసినప్పుడు, వ్యక్తిగత శాంతిని మరియు ఆకస్మికముగా పెరుగు ఆత్మీయ వేగాన్ని నేను వాగ్దానం చేస్తున్నాను.

రక్షకుడు సమస్త మానవాళి కొరకు ప్రాయశ్చిత్తము చేసినప్పుడు, ఆయనను అనుసరించే వారు ఆయన స్వస్థత, బలపరిచే శక్తి మరియు విమోచించే శక్తిని పొందగలిగేలా ఆయన ఒక మార్గాన్ని తెరిచారు. ఆయనను వినాలని మరియు ఆయనను అనుసరించాలని కోరుకునే వారందరికీ ఈ ఆధ్యాత్మిక విశేషాధికారాలు అందుబాటులో ఉన్నాయి.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, నిబంధన మార్గంలో ప్రవేశించి, అక్కడే ఉండమని నా హృదయపూర్వక విజ్ఞప్తులతో నేను మిమ్మల్ని కోరుతున్నాను. అనుదిన పశ్చాత్తాపము యొక్క ఆనందాన్ని అనుభవించండి. దేవుని గురించి మరియు ఆయన ఎలా పనిచేస్తారో తెలుసుకోండి. అద్భుతాలను వెదకండి మరియు ఆశించండి. మీ జీవితంలో సంఘర్షణను ముగించడానికి ప్రయత్నించండి.

ఈ లక్ష్యాలపై మీరు పని చేస్తున్నప్పుడు, మీరు ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నప్పటికీ, హెచ్చైన వేగముతో నిబంధన మార్గంలో ముందుకు వెళ్ళగల సామర్థ్యాన్ని నేను మీకు వాగ్దానం చేస్తున్నాను. మరియు శోధనను ఎదిరించడానికి మీకు ఎక్కువ బలము, మరింత మనశ్శాంతి, భయం నుండి విముక్తి మరియు మీ కుటుంబాలలో ఎక్కువ ఐక్యతను నేను వాగ్దానం చేస్తున్నాను.

దేవుడు జీవిస్తున్నారు! యేసే క్రీస్తు! ఆయన జీవిస్తున్నారు! ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు మరియు మనకు సహాయం చేస్తారు. ఈ సంగతుల గురించి మన విమోచకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. 3 నీఫై 12:39 చూడండి.

  2. 3 నీఫై 12:44 చూడండి.

  3. సిద్ధాంతము మరియు నిబంధనలు 64:10; 9వ వచనము కూడా చూడండి.

  4. అపొస్తలుడైన పౌలు చెప్పినట్లుగా, “ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి” (1 థెస్సలోనీకయులకు 5:18.) నిరాశ, నిరుత్సాహం మరియు ఆధ్యాత్మిక అలసత్వం కోసం ఖచ్చితమైన విరుగుడులలో ఒకటి కృతజ్ఞత. మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పగల కొన్ని విషయాలేవి? భూమి అందం కోసం, సువార్త యొక్క పునఃస్థాపన కోసం, ఆయన మరియు ఆయన కుమారుడు ఈ భూమిపై తమ శక్తిని మనకు అందుబాటులో ఉంచిన లెక్కలేనన్ని మార్గాల కోసం ఆయనకు ధన్యవాదాలు చెప్పండి. లేఖనాల కోసం, సహాయం కోసం, బయల్పాటు కోసం మరియు శాశ్వతమైన కుటుంబాల కోసం దేవునికి మనము చేయు విన్నపానికి ప్రతిస్పందించే దేవదూతల కోసం ఆయనకు ధన్యవాదాలు చెప్పండి. మరియు అన్నింటికంటే ఎక్కువగా, దేవుడు ఇచ్చిన తన కుమారుని యొక్క బహుమతికి మరియు యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తానికి ధన్యవాదాలు చెప్పండి, ఇది మనం భూమికి పంపబడిన నియమితకార్యములను నెరవేర్చడానికి వీలు కల్పిస్తుంది.

  5. నిబంధన మార్గాన్ని అర్థం చేసుకోవాలంటే, ఒక నిబంధన దేవునికి మరియు ఆయన పిల్లలలో ఒకరికి మధ్య రెండు వైపులనుండి నిబద్ధతను కలిగి ఉంటుందని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఒక నిబంధనలో, దేవుడు షరతులు విధిస్తారు మరియు మనము ఆ షరతులను అంగీకరిస్తాము. బదులుగా, దేవుడు మనకు వాగ్దానాలు చేస్తారు. అనేక నిబంధనలు బాహ్య సంకేతాలతో—లేదా పవిత్రమైన విధులతో—కూడి ఉంటాయి, సాక్షుల సమక్షములో వాటిలో మనము పాల్గొంటాము. ఉదాహరణకు, బాప్తిస్మము పొందిన వ్యక్తి దేవుని ఆజ్ఞలను పాటించడానికి నిబంధన చేసాడని తెలుపడానికి బాప్తిస్మము అనేది ప్రభువుకు ఒక సంకేతము.

  6. మొరోనై 4:3; 5:2; సిద్ధాంతము మరియు నిబంధనలు 20:77, 79 చూడండి.

  7. మోషైయ 18:20.

  8. మోషైయ 6:50, 57 చూడండి.

  9. సిద్ధాంతము మరియు నిబంధనలు 93:40-48 చూడండి.

  10. మోషైయ 3:19 చూడండి.

  11. యెషయా 54:10; వివరణ చేర్చబడింది; 3 నీఫై 22:10 కూడా చూడండి. దయ అనేది హెస్డ్ అనే హెబ్రీ పదం నుండి అనువదించబడింది, ఇది దయ, కరుణ, నిబంధన ప్రేమ మరియు మరిన్నింటిని కలిగి ఉన్న లోతైన అర్థం కలిగిన శక్తివంతమైన పదం.

  12. కొన్ని పాపాలకు పరిహారం చేయడం సాధ్యమే కానీ మరికొన్నింటికి కాదు. ఒక వ్యక్తి మరొకరిని దుర్భాషలాడినా లేదా దాడి చేసినా లేదా ఒకరు మరొకరి ప్రాణాలను తీసినా, పూర్తి నష్టపరిహారం చేయలేము. ఆ సందర్భాలలో పాపి పూర్తి పునరుద్ధరణ చేయలేడు మరియు అధిక ఋణమును కలిగి ఉంటాడు. బాకీని క్షమించడానికి ప్రభువు సుముఖంగా ఉన్నందున, మనం ఎంత దూరం తప్పిపోయినా ఆయన వద్దకు రావచ్చు. మనం హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడినప్పుడు, ఆయన మనల్ని క్షమిస్తారు. మన పాపాలకు మరియు పూర్తి పరిహారం చేయగల మన సామర్థ్యానికి మధ్య ఉన్న బాకీ ఏదైనా యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తాన్ని వర్తింపజేయడం ద్వారా మాత్రమే చెల్లించబడుతుంది, ఆయన దయ యొక్క బహుమతిని ఇవ్వగలరు. మన బాకీని క్షమించడానికి ఆయన ఇష్టపడడం అనేది ఒక అమూల్యమైన బహుమతి.

  13. 2 నీఫై 31:18-20 చూడండి.

  14. రాజైన బెంజమిన్ నీఫైయుల ప్రవక్త.

  15. మోషైయ 2:41.

  16. సిద్ధాంతము మరియు నిబంధనలు 10:5; వివరణ చేర్చబడింది.

  17. మోషే 1:16 చూడండి; 1-20 వచనాలు కూడా చూడండి.

  18. మోషే 1:20.

  19. హీలమన్ 5:12.

  20. మొరోనై 6:4.

  21. మోర్మన్ 9:15; 19వ వచనము కూడా చూడండి.

  22. “యేసే క్రీస్తు అని [మనము] నమ్మునట్లు” (యోహాను 20:31) రక్షకుని అద్భుతాలను తాను నమోదు చేసాడని అపొస్తలుడైన యోహాను ప్రకటించాడు.

  23. మోర్మన్ 9:21.

  24. యెషయా 40:29.

  25. మత్తయి 6:14.