సర్వసభ్య సమావేశము
తండ్రి ప్రణాళికలో దైవిక ప్రేమ
2022 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


తండ్రి ప్రణాళికలో దైవిక ప్రేమ

సిలెస్టియల్ రాజ్యములో రక్షణ కొరకు మరియు దాని అత్యున్నత స్థాయిలో ఉన్నతస్థితికి దేవుని పిల్లలను సిద్ధం చేయడమే పునఃస్థాపించబడిన ఈ సంఘము యొక్క సిద్ధాంతము మరియు విధానాల యొక్క ఉద్దేశ్యం.

సువార్త ప్రణాళిక మన పరలోక తండ్రికి తన పిల్లలందరి పట్ల ఉన్న ప్రేమను ప్రదర్శిస్తుంది. దీనిని అర్థం చేసుకోవడానికి, మనం ఆయన ప్రణాళికను మరియు ఆయన ఆజ్ఞలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆయన తన పిల్లలను ఎంతగానో ప్రేమిస్తున్నారు గనుక మన కొరకు బాధపడి, మరణించడానికి ఆయన తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తును మన రక్షకుడిగా మరియు విమోచకునిగా ఇచ్చారు. పునఃస్థాపించబడిన యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘములో, మన పరలోక తండ్రి ప్రణాళిక గురించి మనకు ప్రత్యేకమైన అవగాహన ఉంది. ఇది మర్త్య జీవితం యొక్క ఉద్దేశ్యాన్ని, దానిని అనుసరించే దైవిక తీర్పును మరియు దేవుని పిల్లలందరి అంతిమ మహిమాన్విత విధిని వీక్షించే విభిన్న మార్గాన్ని అందిస్తుంది.

ప్రియమైన సహోదర సహోదరీలారా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. దేవుని పిల్లలందరినీ నేను ప్రేమిస్తున్నాను. “ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది?” అని యేసు అడుగబడినప్పుడు, దేవుడిని ప్రేమించడం మరియు పొరుగువారిని ప్రేమించడం దేవుని గొప్ప ఆజ్ఞలలో మొదటివని ఆయన బోధించారు.1 ఆ ఆజ్ఞలు మొదటివి, ఎందుకంటే అవి మనపట్ల దేవుడు కలిగియున్న ప్రేమను అనుకరించాలని కోరుతూ ఆధ్యాత్మికంగా ఎదగమని మనల్ని ఆహ్వానిస్తాయి. యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘములో మన పరలోక తండ్రి మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు స్థాపించిన ప్రేమపూర్వక సిద్ధాంతం మరియు విధానాల గురించి మనమందరం బాగా అర్థం చేసుకున్నామని నేను ఆశిస్తున్నాను. దేవుని ప్రేమ ఆ సిద్ధాంతాన్ని మరియు సంఘము యొక్క ప్రేరేపిత విధానాలను ఎలా వివరిస్తుందో స్పష్టం చేయడానికి నేను ఇక్కడ చెప్పేది ప్రయత్నిస్తుంది.

I.

మంచి వ్యక్తులు పరలోకం అనే ప్రదేశానికి వెళతారు మరియు చెడ్డ వ్యక్తులు నరకం అని పిలువబడే శాశ్వతమైన ప్రదేశానికి వెళతారని మర్త్య జీవితం తరువాత వచ్చే అంతిమ తీర్పును సాధారణంగా అపార్థం చేసుకుంటారు. కేవలం రెండు అంతిమ గమ్యస్థానాలు ఉన్నాయి అనే ఈ అసత్య ప్రతిపాదన పరలోకానికి అవసరమైన అన్ని ఆజ్ఞలను పాటించలేని వారి గమ్యస్థానం తప్పనిసరిగా నరకమని సూచిస్తుంది.

ప్రేమగల పరలోక తండ్రి తన పిల్లల కోసం ఉత్తమమైన ప్రణాళికను కలిగి ఉన్నారు. దేవుని పిల్లలందరూ—ఇక్కడ పరిగణనలోకి తీసుకోవడానికి చాలా పరిమితమైన మినహాయింపులతో—చివరికి ఒక మహిమ రాజ్యంలో ప్రవేశిస్తారని పునఃస్థాపించబడిన యేసు క్రీస్తు సంఘము యొక్క బయలుపరచబడిన సిద్ధాంతం బోధిస్తుంది.2 “నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు,”3 అని యేసు బోధించారు. ఆ నివాసములు మూడు విభిన్నమైన మహిమ రాజ్యాలలో ఉన్నాయని ఆధునిక బయల్పాటు నుండి మనకు తెలుసు. అంతిమ తీర్పులో మనలో ప్రతీఒక్కరూ మన పనులు మరియు మన హృదయ వాంఛలను బట్టి తీర్పు తీర్చబడతారు.4 దానికి ముందు, మనం పశ్చాత్తాపపడని పాపాలకు బాధపడవలసి ఉంటుంది. లేఖనములు ఆ విషయంలో స్పష్టంగా ఉన్నాయి.5 అప్పుడు నీతిమంతుడైన మన న్యాయాధిపతి ఆ మహిమగల రాజ్యాలలో ఒకదానిలో మనకు నివాసం ఇస్తారు. ఆవిధంగా, ఆధునిక బయల్పాటుల నుండి మనకు తెలిసినది ఏమనగా, అందరు “వారి కార్యములను బట్టి వారు తీర్పుతీర్చబడుదురు, ప్రతి మనుష్యుడు తాను చేయు పనులను బట్టి, సిద్ధపరచబడిన నివాసములలో తన ఆధిపత్యమును పొందును.”6

ఈ మహిమ గల రాజ్యాలలో రెండింటి గురించి తులనాత్మకంగా తక్కువ బహిర్గతం చేయడానికి ప్రభువు ఎంచుకున్నారు. దీనికి విరుద్ధంగా, “సూర్యుని మహిమ”7 అని బైబిలు వర్ణించే మహిమ యొక్క అత్యున్నత రాజ్యాన్ని గురించి ప్రభువు చాలా విషయాలు బయల్పరిచారు.

“సిలెస్టియల్” మహిమలో8 మూడు స్థాయిలు లేదా స్థానాలు ఉన్నాయి.9 వీటిలో అత్యున్నతమైనది సిలెస్టియల్ రాజ్యంలో ఉన్నతస్థితి, అందులో మనం మన తండ్రి మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వలె మారవచ్చు. మన దైవిక సామర్థ్యాన్ని గ్రహించడానికి అవసరమైన దైవిక లక్షణాలను మరియు స్వభావంలో మార్పును అభివృద్ధి చేయడంలో మనకు సహాయపడడానికి, ప్రభువు సిద్ధాంతాన్ని బయలుపరిచారు మరియు శాశ్వతమైన చట్టం ఆధారంగా ఆజ్ఞలను స్థాపించారు. యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘములో మనం బోధించేది ఇదే, ఎందుకంటే ఈ పునఃస్థాపించబడిన సంఘము యొక్క సిద్ధాంతము మరియు విధానాల యొక్క ఉద్దేశ్యం దేవుని పిల్లలను సిలెస్టియల్ మహిమలో రక్షణకు సిద్ధం చేయడం మరియు ముఖ్యంగా, దాని అత్యున్నత స్థాయిలో ఉన్నతస్థితిని పొందేలా చేయడం.

దేవుని యొక్క దేవాలయాలలో విశ్వాసులకు చేయబడిన నిబంధనలు మరియు వాగ్దానము చేయబడిన ఆశీర్వాదాలు కీలకమైనవి. ఇది మన ప్రపంచవ్యాప్త దేవాలయాల నిర్మాణాన్ని వివరిస్తుంది, దాని గురించి ఇప్పుడే గాయకబృందం మధురంగా పాడారు. దేవాలయం యొక్క నిబంధనలు మరియు విధులు ఉన్నతస్థితిని సాధించే దిశగా మనకు మార్గనిర్దేశం చేస్తాయని అర్థం చేసుకోలేక కొందరు ఈ ఉద్ఘాటనపై అయోమయంలో ఉన్నారు. మూడు మహిమ దశల బహిర్గత సత్యం యొక్క సందర్భాన్ని బట్టి మాత్రమే దీనిని అర్థం చేసుకొనవచ్చు. మన పరలోక తండ్రికి తన పిల్లలందరిపై ఉన్న గొప్ప ప్రేమ కారణంగా, ఇతర మహిమగల రాజ్యాలను ఆయన సమకూర్చారు—దాని గురించి ఎల్డర్ క్వింటిన్ ఎల్. కుక్ నిన్న వివరించారు—అవన్నీ మనం గ్రహించగలిగే దానికంటే అద్భుతమైనవి.10

యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము వీటన్నిటిని సాధ్యము చేస్తుంది. ఆయన “తండ్రిని మహిమపరచును మరియు తన హస్తకృత్యములన్నింటిని ఆయన రక్షించును.”11 ఆ రక్షణ వివిధ మహిమ రాజ్యాలలో ఇవ్వబడుతుంది. “అన్ని రాజ్యములకు ఒక ధర్మశాస్త్రము ఇవ్వబడెను”12 అని ఆధునిక బయల్పాటు నుండి మనకు తెలుసు. ముఖ్యముగా:

“సిలెస్టియల్ రాజ్యపు ధర్మశాస్త్రమును గైకొనలేనివాడు సిలెస్టియల్ మహిమను సహింపలేడు.

“టెర్రెస్ట్రియల్ రాజ్యపు ధర్మశాస్త్రమును గైకొనలేనివాడు టెర్రెస్ట్రియల్ మహిమను సహింపలేడు.

“టిలెస్టియల్ రాజ్యపు ధర్మశాస్త్రమును గైకొనలేనివాడు టిలెస్టియల్ మహిమను సహింపలేడు.”13

మరో మాటలో చెప్పాలంటే, అంతిమ తీర్పులో మనం పొందే మహిమ రాజ్యం మన పరలోక తండ్రి యొక్క ప్రేమపూర్వక ప్రణాళికలో మనం పాటించుటకు ఎన్నుకొనే చట్టాలను బట్టి నిర్ణయించబడుతుంది. ఆ ప్రణాళిక క్రింద అనేక రాజ్యాలు ఉన్నాయి, తద్వారా ఆయన పిల్లలందరూ వారు “నివసించగల” రాజ్యానికి కేటాయించబడగలరు.

II.

తన పిల్లలందరి పట్ల మన పరలోక తండ్రి యొక్క ప్రేమతో కూడిన ప్రణాళికను బట్టి మాత్రమే పూర్తిగా అర్థం చేసుకోగలిగే విధంగా ప్రభువు యొక్క పునఃస్థాపించబడిన సంఘము యొక్క బోధనలు మరియు విధానాలు ఈ శాశ్వతమైన సత్యాలను వర్తింపజేస్తాయి.

అందువలన, మనము వ్యక్తిగత స్వతంత్రతను గౌరవిస్తాము. మత స్వేచ్ఛను ప్రోత్సహించడానికి ఈ సంఘము చేస్తున్న గొప్ప ప్రయత్నాల గురించి చాలామందికి తెలుసు. ఈ ప్రయత్నాలు మన పరలోక తండ్రి ప్రణాళికను ముందుకు తీసుకువెళుతున్నాయి. మన స్వంత సభ్యులకే కాకుండా—ఆయన పిల్లలందరికీ ఎంపిక చేసుకొనే విలువైన స్వేచ్ఛను ఆస్వాదించడానికి మనము సహాయం చేస్తాము.

అదేవిధంగా, చాలా దేశాలకు మరియు క్రైస్తవ జనాభాలోకి కూడా సువార్తికులను ఎందుకు పంపుతామని కొన్నిసార్లు మనం అడుగబడతాము. మన సువార్త ప్రయత్నాలకు దీన్ని జత చేయకుండా, మన సంఘ సభ్యులు కాని వ్యక్తులకు అపారమైన మానవతా సహాయాన్ని ఎందుకు అందిస్తాము అని కూడా మనము అడుగబడతాము. తన పిల్లలందరినీ మన సహోదరులు మరియు సహోదరీలుగా గౌరవించాలని ప్రభువు మనకు నేర్పించినందున మనము దీనిని చేస్తున్నాము. మన ఆధ్యాత్మిక మరియు తాత్కాలిక సమృద్ధిని అందరితో పంచుకోవాలని మనము కోరుకుంటున్నాము.

నిత్య సిద్ధాంతం పిల్లలపై విలక్షణమైన దృక్పథాన్ని కూడా అందిస్తుంది. ఈ దృక్పథం ద్వారా పిల్లలను కని, పోషించడాన్ని మనం దైవిక ప్రణాళికలో భాగంగా చూస్తాము. ఇందులో పాల్గొనడానికి శక్తి ఇవ్వబడిన వారికి ఇది సంతోషకరమైన మరియు పవిత్రమైన కర్తవ్యం. కాబట్టి, దేవుని ప్రణాళిక ప్రకారం పిల్లల అభివృద్ధి మరియు సంతోషం కోసం ఉత్తమమైన పరిస్థితులను అందించే సూత్రాలను, అభ్యాసాలను బోధించాలని మరియు వాటి కొరకు పోరాడాలని మనము ఆదేశించబడ్డాము.

III.

చివరగా, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యుక్తముగా కుటుంబ-కేంద్రీకృత సంఘముగా పిలువబడుతుంది. కానీ మన కుటుంబ-కేంద్రీకృతత్వం మర్త్య సంబంధాలకే పరిమితం కాదనే వాస్తవికత బాగా అర్థం కాలేదు. మన వేదాంతానికి శాశ్వత సంబంధాలు కూడా ప్రాథమికమైనవి. వారి అంతిమ గమ్యస్థానం అని దేవుడు కోరేదానికి దేవుని పిల్లలందరు అర్హత సంపాదించడానికి సహాయపడడమే పునఃస్థాపించబడిన సంఘము యొక్క నియమితకార్యం. క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం ద్వారా అందించబడిన విమోచన ద్వారా, అందరూ నిత్య జీవితాన్ని పొందవచ్చు (సిలెస్టియల్ రాజ్యములో ఉన్నతస్థితి), దానిని “విధేయులందరికి దేవుడు అనుగ్రహించును”14 అని తల్లియైన హవ్వ ప్రకటించింది. అది రక్షణ కంటే ఎక్కువ. “దేవుని నిత్య ప్రణాళికలో, రక్షణ అనేది వ్యక్తిగత విషయం; [కానీ] ఉన్నతస్థితి కుటుంబ విషయం”15 అని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మనకు గుర్తు చేసారు.

స్త్రీ పురుషుల మధ్య శాశ్వతమైన వివాహ ఒప్పందాల పట్ల విశ్వసనీయత ద్వారా మాత్రమే ఉన్నతస్థితిని పొందగలమనే దేవుని బయల్పాటు మనకు ప్రాథమికమైనది.16 ఆ దైవిక సిద్ధాంతం మూలంగానే, “లింగం అనేది వ్యక్తి యొక్క పూర్వమర్త్య, మర్త్య మరియు నిత్య గుర్తింపు మరియు ఉద్దేశ్యము యొక్క ముఖ్యమైన లక్షణం.”17 అని మనం బోధిస్తాము.

అందువలనే స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసాలను సజాతీయంగా మార్చే లేదా లింగాన్ని గందరగోళపరిచే లేదా మార్చే మార్పులను వ్యతిరేకించాలని, స్త్రీ పురుషుల మధ్య వివాహ సిద్ధాంతం నుండి వైదొలగడానికి సామాజిక మరియు చట్టపరమైన ఒత్తిళ్ళను వ్యతిరేకించాలని పునఃస్థాపించబడిన తన సంఘాన్ని ప్రభువు కోరారు.

ఈ ప్రాథమిక అంశాలపై పునఃస్థాపించబడిన సంఘము యొక్క సిద్ధాంతాలు తరచూ వ్యతిరేకతను రేకెత్తిస్తాయి. మేము దానిని అర్థం చేసుకున్నాము. మన పరలోక తండ్రి యొక్క ప్రణాళిక “అన్ని విషయాలలో వ్యతిరేకతను”18 అనుమతిస్తుంది, మరియు సాతాను యొక్క అత్యంత తీవ్రమైన వ్యతిరేకత ఆ ప్రణాళికకు అత్యంత ప్రాముఖ్యమైన దానివైపుకు నిర్దేశించబడినది. పర్యవసానంగా, అతడు వివాహాన్ని వక్రీకరించడం, పిల్లలను కనడాన్ని నిరుత్సాహపరచడం లేదా లింగాన్ని గందరగోళానికి గురి చేయడం ద్వారా ఉన్నతస్థితి వైపు పురోగతిని వ్యతిరేకించడానికి ప్రయత్నిస్తాడు. అయినప్పటికీ, దీర్ఘకాలంలో, మన ప్రేమగల పరలోక తండ్రి యొక్క దైవిక ఉద్దేశ్యం మరియు ప్రణాళిక మార్చబడదని మనకు తెలుసు. వ్యక్తిగత పరిస్థితులు మారవచ్చు మరియు దీర్ఘకాలంలో, తమ నిబంధనలను పాటించే విశ్వాసులు వాగ్దానం చేయబడిన ప్రతీదీవెనకు అర్హులయ్యే అవకాశం ఉంటుందని దేవుని ప్రణాళిక హామీ ఇస్తుంది.19

“దేవుని బహుమానములన్నిటిలోకెల్లా గొప్పదైయున్న”20 నిత్యజీవానికి సిద్ధపడడంలో మనకు సహాయపడే ప్రత్యేకమైన విలువైన బోధన ఏదనగా 1995లో కుటుంబము గురించి చేయబడిన ప్రకటన.21 సహజీవనం మరియు స్వలింగ వివాహం వంటి కొన్ని ప్రస్తుత చట్టాలు, అభ్యాసాలు మరియు న్యాయవాదాలకు దాని ప్రకటనలు ఖచ్చితంగా భిన్నంగా ఉంటాయి. తన పిల్లల కోసం తండ్రి యొక్క ప్రేమపూర్వక ప్రణాళికను పూర్తిగా అర్థం చేసుకోలేని వారు ఈ కుటుంబ ప్రకటనను మార్చగల విధానము యొక్క ప్రకటనగా పరిగణించవచ్చు. దీనికి విరుద్ధంగా, కుటుంబ ప్రకటన మార్చలేని సిద్ధాంతంపై స్థాపించబడినదని, మన నిత్య అభివృద్ధిలో అత్యంత ముఖ్యమైన భాగము కాగల కుటుంబ సంబంధాలను నిర్వచిస్తుందని మేము ధ్రువపరుస్తున్నాము.

ఇది పునఃస్థాపించబడిన యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క ప్రత్యేక సిద్ధాంతానికి మరియు విధానాలకు సంబంధించినది.

IV.

మర్త్య జీవితంలో అనేక సంబంధాలు మరియు పరిస్థితులలో, మనలో ప్రతీఒక్కరూ విబేధాలతో జీవించాలి. క్రీస్తు అనుచరులుగా మనం తోటి మనుష్యులను ప్రేమించాలి, మనం నమ్మినవాటిని నమ్మని వారితో శాంతియుతంగా జీవించాలి. మనమందరం ప్రేమగల పరలోక తండ్రి యొక్క పిల్లలం. మనందరికీ మరణానంతర జీవితాన్ని మరియు అంతిమంగా మహిమ రాజ్యాన్ని ఆయన నిర్దేశించారు. తన అత్యున్నతమైన ఆజ్ఞలు, నిబంధనలు మరియు విధులను పాటించడం ద్వారా మనమందరం తన అత్యున్నతమైన ఆశీర్వాదాల కోసం ప్రయత్నించాలని దేవుడు కోరుతున్నారు, ఇవన్నీ ప్రపంచమంతటా నిర్మించబడుతున్న ఆయన పవిత్ర దేవాలయాలలో ప్రాప్తమవుతాయి. నిత్యత్వానికి సంబంధించిన ఈ సత్యాలను ఇతరులతో పంచుకోవడానికి మనం ప్రయత్నించాలి. కానీ మన పొరుగువారందరికీ మనం రుణపడి ఉన్న ప్రేమతో, మనము వారి నిర్ణయాలను ఎల్లప్పుడూ అంగీకరిస్తాము. మోర్మన్ గ్రంథ ప్రవక్త బోధించినట్లుగా, “దేవుని యొక్కయు మనుష్యులందరి యొక్కయు ప్రేమను”22 కలిగియుండి మనము ముందుకు సాగాలి.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గత సమావేశంలో ప్రకటించినట్లుగా: “మన రక్షకుని గూర్చిన జ్ఞానము ప్రతి మానవ ఆత్మకు వ్యక్తిగతంగా మరింత ముఖ్యము మరియు తప్పనిసరి అయిన ఈ సమయాన్ని మించినది ప్రపంచ చరిత్రలో మరేది లేదు. … క్రీస్తు యొక్క శుద్ధమైన సిద్ధాంతము శక్తివంతమైనది. దానిని గ్రహించి, అతని లేదా ఆమె జీవితంలో దానిని అన్వయించుకోవడానికి కోరిన ప్రతీఒక్కరి జీవితాన్ని అది మారుస్తుంది.”23

ఆ పవిత్రమైన సిద్ధాంతాన్ని మనమందరం మన జీవితాలలో అమలు పరచాలని నేను యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్.