సర్వసభ్య సమావేశము
సువార్త సేవ నా జీవితాన్ని శాశ్వతంగా దీవించింది
2022 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


సువార్త సేవ నా జీవితాన్ని శాశ్వతంగా దీవించింది

యువతీ యువకులారా, సువార్త సేవ మీ జీవితాన్ని శాశ్వతంగా ఎలా దీవిస్తుందో మీరు మరియు మీ తల్లిదండ్రులు చూసి, తెలుసుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను.

అధ్యక్షులు నెల్సన్, సువార్త సేవ గురించి మళ్ళీ ఆ సలహాను పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు.

సహోదర సహోదరీలారా, చాలా సంవత్సరాల క్రితం సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు, అకస్మాత్తుగా నా ఎడమ కన్ను మాకులర్ డీజనరేషన్ వల్ల మసకబారింది, క్రమంగా అది ఎక్కువై ఆ కంటి చూపు చాలా తగ్గిపోయింది.

నేను ఈ సవాలును ఎదుర్కొన్నప్పుడు, పాత విషయాలపై క్రొత్త దృక్పథంతో పాటు ఇతర దృష్టుల కొరకు నేను కృతజ్ఞుడిని. నేను నా జీవితంలో వెనక్కి తిరిగి చూసినప్పుడు, చెప్పుకోదగిన వైవిధ్యాన్ని కల్పించిన నిర్దిష్టమైన అనుభవాలను నేను చూడగలిగాను. ఒక యౌవనుడిగా ఇంగ్లండులో నా పూర్తి-కాల సువార్త సేవ నా జీవితాన్ని ఎలా దీవించి, నా ఆత్మీయ గమ్యాన్ని ఎలా ప్రభావితం చేసింది అనేది ఆ అనుభవాలలో ఒకటి.

1930లో ఆర్థిక మాంద్యం వలన కలిగిన ఆర్థిక సవాళ్ళ గురించి, అవి నా తల్లిదండ్రులకు, నా కుటుంబానికి ఎలా దురదృష్టంగా మారాయో నేను ఆలోచించాను. తన ఆటోమొబైల్ డీలర్‌షిప్‌ను కాపాడుకోవడంలో మరియు ఈ కష్టకాలంలో కుటుంబాన్ని పోషించడంలో మా నాన్న ఎంతగా నిమగ్నమైపోయారంటే, కొంతకాలం నా తల్లిదండ్రులు సంఘానికి హాజరు కాలేదు.

ఒక కుటుంబంగా మేము సంఘ సేవలకు హాజరు కాకపోయినా, అది అప్పుడప్పుడు నా స్నేహితులను కలవడం నుండి నన్ను ఆపలేదు.

ఆ రోజుల్లో సువార్తసేవకు వెళ్ళాలనేది నా బలమైన కోరికగా ఉండేది, కానీ దాని గురించి నేను నా తల్లిదండ్రులతో మాట్లాడలేదు.

కళాశాలకు వెళ్తున్నప్పుడు, నేను మరియు అనేకమంది స్నేహితులు సువార్తసేవ చేయాలని నిర్ణయించుకున్నాము. నా తల్లిదండ్రులు ఊరిలో లేనప్పుడు నా బిషప్పును కలిసి, నేను నా సువార్తసేవ దరఖాస్తు పూర్తిచేసాను. నా తల్లిదండ్రులు తిరిగివచ్చినప్పుడు, గ్రేట్ బ్రిటన్‌లో సేవ చేయడానికి నేను పిలువబడ్డాననే వార్తతో వారిని నేను ఆశ్చర్యపరిచాను. ఈ నిర్ణయంపట్ల ఉత్సాహపూరితమైన వారి సహకారానికి మరియు సేవ చేయాలని నిర్ణయించుకోవడంలో సహాయపడిన మంచి స్నేహితుల కొరకు నేను కృతజ్ఞుడిని.

నా సువార్తసేవ నన్ను ఒక మంచి భర్తగా, తండ్రిగా మరియు వ్యాపారంలో సఫలమయ్యేలా సిద్ధం చేసింది. ఆయన సంఘంలో ప్రభువుకు జీవితకాల సేవ చేయడానికి కూడా అది నన్ను సిద్ధం చేసింది.

1985 ఏప్రిల్ సర్వసభ్య సమావేశంలో, యాజకత్వ సభలో మాట్లాడేందుకు నేను నియమించబడ్డాను. యువకులను లక్ష్యంగా చేసుకొని నేను మాట్లాడాను. ఒక సువార్తికునిగా సేవ చేయడానికి సిద్ధపడడం గురించి నేను మాట్లాడాను. “నా సంఘ నియామకాల్లో నేను పొందిన శిక్షణలన్నిటిలో పూర్తి-కాల సువార్తసేవ చేస్తున్న పంతొమ్మిదేళ్ళ వయస్సు గల ఎల్డరుగా నేను పొందిన శిక్షణ కంటే ఎక్కువ ముఖ్యమైనదేదీ లేదు,” అని నేను చెప్పాను.1

ప్రభువుకు మీరు తెలుసు. మీరు సువార్తసేవ చేస్తున్నప్పుడు, ఆయనను బాగా తెలుసుకోవడానికి మీకు సహాయపడే అనుభవాలు మీకు కలుగుతాయి. ఆయన సేవలో మీరు ఆత్మీయంగా ఎదుగుతారు. ఆయన పేరున, ఇతరులకు సేవ చేయడానికి ఆయన పనిమీద మీరు పంపబడతారు. పరిశుద్ధాత్మ నుండి ప్రేరేపణలతో ఆయన మీకు అనుభవాలను ఇస్తారు. ఆయన నామములో బోధించడానికి ప్రభువు మీకు అధికారం ఇస్తారు. ఆయన మిమ్మల్ని నమ్మవచ్చని, మీపై ఆధారపడవచ్చని మీరు ఆయనకు చూపగలరు.

సుమారు ఐదు నెలల క్రితం, బ్రిటీష్ ద్వీపాలలో సువార్తసేవ చేసిన ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ మరియు ఎల్డర్ క్వింటిన్ ఎల్. కుక్, ఆ అందమైన ప్రదేశంలో ఉన్న సభ్యులను, సువార్తికులను సందర్శించడంలో నాతో చేరారు. అక్కడ ఉన్నప్పుడు, యౌవన సువార్తికునిగా నా అనుభవాల గురించి నేను ఆలోచించాను. నా పరలోక తండ్రి మరియు నా రక్షకుడైన యేసు క్రీస్తు నన్ను ఎరుగుదురని, ప్రేమిస్తున్నారని నా సువార్తసేవలోనే తెలుసుకున్నానని నేను సాక్ష్యమిస్తున్నాను.

సెల్వోయ్ జె. బోయర్ మరియు స్టెయినర్ రిఛర్డ్స్ అనే ఇద్దరు అద్భుతమైన మిషను అధ్యక్షులు, వారితోపాటు అంకితభావం గల వారి సహచారిణులు గ్లాడీ బోయర్ మరియు జేన్ రిఛర్డ్స్‌ల చేత నేను దీవించబడ్డాను. గతంలోకి చూస్తే, వారు నన్ను నమ్మారని, నన్ను ప్రేమించారని నేనింకా స్పష్టంగా చూడగలను. వారు నాకు సువార్త బోధించారు. వారు నా నుండి ఎంతో ఆశించారు. ఎదగడానికి మరియు జీవితకాలపు సేవ కొరకు సిద్ధపడడానికి నాకు సహాయపడేందుకు వారు నాకు సవాళ్ళతో కూడిన అనేక నియామకాలను, నాయకత్వ అవకాశాలను ఇచ్చారు.

నా ప్రియమైన భార్య బార్బరాతో కలిసి కెనడా టొరంటొ మిషనుపై అధ్యక్షత్వం వహించమని అధ్యక్షులు స్పెన్సర్ డబ్ల్యు. కింబల్ చేత పిలువబడడం మరియు ఆ సమయంలో మా పిల్లలు మాతో ఉండడం గురించి కూడా నేను ఆలోచించాను. “When the World Will Be Converted” అనే తన ప్రేరేపిత సువార్తసేవ సందేశాన్ని ఇచ్చిన కొద్దికాలానికే 1974, ఏప్రిల్‌లో అధ్యక్షులు కింబల్ మమ్మల్ని సేవ చేయడానికి పిలిచారు.2 ప్రపంచమంతటికి సువార్త ఏవిధంగా తీసుకువెళ్ళబడుతుందనే ఆయన దర్శనాన్ని ఆ సందేశంలో అధ్యక్షులు కింబల్ వివరించారు. ప్రపంచమంతటి నుండి అనేకమంది సువార్తికులను ఆయన పిలిచారు. “ప్రతి మనుష్యుడు … భూలోక వాసులకు హెచ్చరిక స్వరమును ఎలుగెత్తవలెను”3 అని ప్రభువు ఆశించిన దానిని ఆయన మనకు గుర్తుచేసారు. యువకులు సువార్తసేవ చేయాలని ఆశించబడ్డారు అనే దాని గురించి అధ్యక్షులు కింబల్ బోధన ప్రపంచమంతటా ప్రతీ ఇంటిలో చర్చనీయాంశమైంది. ఆ అపేక్ష మారలేదు. ప్రభువు యొక్క అపేక్షను ఈ ఉదయం అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ కూడా పునరుద్ఘాటించినందుకు నేను కృతజ్ఞత కలిగియున్నాను.

యువతీ యువకుల కొరకు సువార్తసేవ చేసే వయస్సును తగ్గించడం గురించి అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ ప్రకటించి దాదాపు 10 సంవత్సరాలైంది.4 నా దృష్టిలో ఈ మార్పుకు మూలకారణం, ఒక సువార్తికునిగా సేవ చేయడానికి జీవితాన్ని మార్చివేసే అవకాశాన్ని మన యువతలో ఎక్కువమందికి ఇవ్వడం.

ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అపొస్తలునిగా నేను, యువకులైన మీకు—సువార్తసేవ చేయాలనుకొనే యువతులకు—సువార్తసేవ చేయడం గురించి ఇప్పుడే మీ తల్లిదండ్రులతో మాట్లాడడం ప్రారంభించమని పిలుపునిస్తున్నాను. సువార్తసేవ చేయడం గురించి మీ స్నేహితులతో మాట్లాడమని మరియు మీ స్నేహితులలో ఎవరైనా సేవ చేయడం గురించి సందేహిస్తున్నట్లయితే, వారిని వారి బిషప్పుతో మాట్లాడేందుకు ప్రోత్సహించమని కూడా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.

మీరు సువార్తసేవ చేస్తారని మరియు ఇప్పటినుండి మీ కోరికలు, చర్యలు, ఆలోచనలను శుద్ధిగా, యోగ్యమైనవిగా ఉంచడానికి మీరు ప్రయత్నిస్తారని పరలోక తండ్రికి మరియు మీకు మీరు వాగ్దానం చేసుకోండి. యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త గురించి బలమైన సాక్ష్యాన్ని సంపాదించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.

ఈ అద్భుతమైన యువత యొక్క తల్లిదండ్రులారా, ఈ సిద్ధపాటు ప్రక్రియలో మీరు ముఖ్య పాత్ర కలిగియున్నారు. సువార్తసేవ గురించి మీ పిల్లలతో మాట్లాడడం నేడే ప్రారంభించండి. మన యువతీ యువకులు సిద్ధపడేందుకు సహాయం చేయడంలో కుటుంబమే అత్యధిక ప్రభావం చూపుతుందని మనకు తెలుసు.

మీరు ఇంకా సువార్తసేవ చేయగల వయస్సులో ఉండి, మహమ్మారి లేదా ఇతర కారణాల వలన ఇప్పటికీ సేవ చేయకపోయినట్లయితే, ఇప్పుడు సేవ చేయమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీ బిషప్పుతో మాట్లాడండి మరియు ప్రభువుకు సేవ చేయడానికి సిద్ధపడండి.

సువార్తసేవ చేసే వయస్సుకు దగ్గరలో ఉన్న యువతీ యువకులందరికీ సేవ చేయడానికి సిద్ధపడడంలో సహాయం చేయమని నేను బిషప్పులను ప్రోత్సహిస్తున్నాను మరియు తగిన వయస్సులో ఉండి, ఇంకా సేవ చేయని వారిని గుర్తించమని కూడా నేను బిషప్పులను ప్రోత్సహిస్తున్నాను. ప్రతీ యువకుడిని, అలాగే సేవ చేయాలని కోరే ప్రతీ యువతిని ఒక సువార్తికునిగా అవ్వమని ఆహ్వానిస్తున్నాను.

ప్రస్తుతం సేవ చేస్తున్న సువార్తికులకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. మీ సువార్తసేవ ప్రపంచవ్యాప్త మహమ్మారి సమయంలో జరిగింది. ఫలితంగా, మీ సువార్తసేవ అనుభవం నా సువార్తసేవ అనుభవం లేదా 2020కి ముందు సేవ చేసిన సువార్తికుల అనుభవాల కంటే భిన్నంగా ఉంది. అది అంత సులువుగా లేదని నాకు తెలుసు. కానీ ఈ కష్టకాలంలో కూడా, మీరు చేయడానికి ప్రభువు ఒక కార్యాన్ని కలిగియున్నారు మరియు మీరు దానిని అద్భుతంగా చేసారు. ఉదాహరణకు, యేసు క్రీస్తు సువార్త యొక్క పునఃస్థాపన గురించి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నవారిని కనుగొనడానికి మీరు సాంకేతికతను క్రొత్త విధానాల్లో ఉపయోగించారు. మీరు శ్రద్ధగా మరియు మీ సామర్థ్యాల ప్రకారం సేవ చేసినప్పుడు, మీ ప్రయత్నాలను చూసి ప్రభువు సంతోషించారని నాకు తెలుసు. మీ సేవ మీ జీవితాన్ని దీవిస్తుందని నాకు తెలుసు.

మీరు మీ సువార్తసేవ నుండి విడుదల చేయబడినప్పుడు, మీరు సంఘ కార్యకలాపాల నుండి విడుదల చేయబడలేదని గుర్తుంచుకోండి. మీ సువార్తసేవలో నేర్చుకున్న మంచి అలవాట్లను వృద్ధిచేసుకోండి, మీ సాక్ష్యాన్ని బలపరచుకోవడాన్ని కొనసాగించండి, కష్టపడి పనిచేయండి, ప్రార్థించండి మరియు ప్రభువుకు విధేయులైయుండండి. మీరు చేసిన నిబంధనలను గౌరవించండి. ఇతరులను దీవించడాన్ని, సేవ చేయడాన్ని కొనసాగించండి.

యువతీ యువకులారా, సువార్త సేవ మీ జీవితాన్ని శాశ్వతంగా ఎలా దీవిస్తుందో మీరు మరియు మీ తల్లిదండ్రులు చూసి, తెలుసుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. మోషైయ యొక్క గొప్ప మిషనరీ కుమారులకు ప్రభువు ఇచ్చిన ఆహ్వానం యొక్క శక్తి గురించి మీ మనస్సులలో మీరు తెలుసుకొని, మీ హృదయాలలో భావించెదరు గాక. ఆయన ఇలా అన్నారు, “వెళ్ళి నా వాక్యమును స్థాపించుడి; అయినను నా యందు మంచి మాదిరిని వారికి చూపునట్లు మీరు దీర్ఘశాంతమందు, శ్రమల యందు సహనము కలిగియుండవలెను మరియు నేను అనేక ఆత్మల యొక్క రక్షణ కొరకు మిమ్ములను నా చేతులలో ఒక సాధనముగా చేయుదును.”5

సిద్ధపడి, ఆయనకు సేవ చేయాలనే కోరికను కలిగియుండేలా దేవుడు సంఘ యువతను దీవించాలనేది నా వినయపూర్వక ప్రార్థన, దీనిని నేను ఈ ఉదయం ప్రభువైన యేసు క్రీస్తు నామములో చేస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. M. Russell Ballard, “Prepare to Serve,” Ensign, May 1985, 41.

  2. See Spencer W. Kimball, “When the World Will Be Converted,” Ensign, Oct. 1974, 2–14. ఈ ప్రసంగం 1974, ఏప్రిల్ 4న ఒక ప్రాంతీయ ప్రతినిధుల సమావేశంలో ఇవ్వబడింది.

  3. సిద్ధాంతము మరియు నిబంధనలు 63:37.

  4. See Thomas S. Monson, “Welcome to Conference,” Liahona, Nov. 2012, 4–5.

  5. ఆల్మా 17:11.