సర్వసభ్య సమావేశము
కానీ మేము వారిని లక్ష్యపెట్టలేదు
2022 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


కానీ మేము వారిని లక్ష్యపెట్టలేదు

(1 నీఫై 8:33)

మనం నిబంధన మార్గంలో అభివృద్ధి చెందుతున్నప్పుడు నిబంధనలు మరియు విధులు మనల్ని ప్రభువైన యేసు క్రీస్తు వైపుకు సూచిస్తాయి మరియు ఆయనతో మనకున్న సంబంధాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడానికి సహాయపడతాయి.

నా భార్యయైన సూజన్, మా ముగ్గురు కుమారులు మరియు వారి భార్యలు, మా మనుమలు అందరూ, మరియు దాదాపు 15 సంవత్సరాలుగా పన్నెండుమందిలో ఒకరై, ఎప్పుడూ నా ప్రక్కన కూర్చునే ఎల్డర్ క్వింటిన్ ఎల్. కుక్, అందరూ నేను పాటలు బాగా పాడను అని తక్షణమే ధృవీకరిస్తారు. కానీ స్వర ప్రతిభ లేకపోయినా, పునఃస్థాపన కీర్తనలు పాడడం నాకు చాలా ఇష్టం. ప్రేరేపిత సాహిత్యం మరియు గంభీరమైన శ్రావ్యతల కలయిక నాకు అవసరమైన సువార్త సూత్రాలను నేర్చుకోవడంలో సహాయపడుతుంది మరియు నా ఆత్మను కదిలిస్తుంది.

నా జీవితాన్ని గమనార్హమైన మార్గాలలో దీవించిన ఒక కీర్తన, “Let Us All Press On (మనమంతా ముందుకు సాగెదము).” ఈమధ్య ఆ కీర్తనలోని పల్లవిలో ఒక నిర్దిష్టమైన పదబంధం గురించి నేను ఆలోచించి, నేర్చుకుంటున్నాను. “దుష్టులు చెప్పేది మేము లక్ష్యపెట్టము, కానీ మేము ప్రభువుకు మాత్రమే కట్టుబడి ఉంటాము.”1

మేము లక్ష్యపెట్టము.

“మనమంతా ముందుకు సాగెదము” అని నేను పాడుతున్నప్పుడు, లీహై దర్శనములో జీవవృక్షానికి నడిపించే మార్గంలో ముందుకు సాగుతున్న వ్యక్తుల గురించి నేను తరచూ ఆలోచిస్తాను, వారు కేవలం “అంటిపెట్టుకొనుట”2 మాత్రమే కాకుండా “ఇనుప దండము చివరను పట్టుకొని, ముందుకు వచ్చి మోకరించి, ఆ వృక్ష ఫలమును తినువరకు కూడా నిరంతరము ఇనుప దండమును గట్టిగా పట్టుకొని తమ దారిలో ముందుకు సాగిపోవుచుండిరి.”3 ఆ గొప్ప, విశాలమైన భవనంలోని జనసమూహాలు “[అతని] వైపు, ఆ ఫలమును తినుచున్న వారి వైపు … ఎగతాళిగా వ్రేలు చూపించిరి”4 అని లీహై వివరించాడు. ఎగతాళి మరియు అవమానాలకు అతని ప్రతిస్పందన అద్భుతమైనది మరియు చిరస్మరణీయమైనది: “కానీ, మేము వారిని లక్ష్యపెట్టలేదు.”5

మనం జీవిస్తున్న సమకాలీన ప్రపంచంలోని దుష్ట ప్రభావాలను మరియు అపహాస్యం చేసే స్వరాలను “లక్ష్యపెట్టకుండా” మనం ఎలా బలపడగలమోనని మనం కలిసి పరిశీలించినప్పుడు పరిశుద్ధాత్మ మనలో ప్రతీఒక్కరినీ ఆశీర్వదించి, జ్ఞానోదయం కలుగజేయాలని నేను ప్రార్థిస్తున్నాను.

లక్ష్యపెట్టవద్దు

లక్ష్యపెట్టుట అనే పదం ఎవరినైనా లేదా దేనినైనా గమనించాలని లేదా శ్రద్ధ వహించాలని సూచిస్తుంది. కాబట్టి, “దుష్టులు ఏమి చెప్పవచ్చు” అనే దానిపై శ్రద్ధ చూపకుండా నిశ్చయాత్మకమైన నిర్ణయం తీసుకోవాలని “మనమంతా ముందుకు సాగుదాం” అనే కీర్తన యొక్క సాహిత్యం మనకు ఉపదేశిస్తుంది. లీహై మరియు అతనితో పాటు ఆ వృక్ష ఫలములో పాలుపంచుకున్న వ్యక్తులు గొప్ప మరియు విశాలమైన భవనం నుండి తరచుగా వచ్చే అపహాస్యం మరియు హేళన పట్ల శ్రద్ధ చూపకపోవడానికి బలమైన ఉదాహరణను మనకు అందిస్తారు.

“మెత్తని [మన హృదయములు] అను పలకలమీద జీవముగల దేవుని ఆత్మతో”6 వ్రాయబడిన క్రీస్తు సిద్ధాంతం పతనమైన మన ప్రపంచంలోని అనేక పరధ్యానాలు, అవహేళనలు మరియు మళ్ళింపులను “లక్ష్యపెట్టకుండా” మన సామర్థ్యాన్ని పెంచుతుంది. ఉదాహరణకు, ప్రభువైన యేసు క్రీస్తునందు మరియు ఆయనపై దృష్టి కేంద్రీకరించిన విశ్వాసం మనల్ని ఆధ్యాత్మిక బలంతో బలపరుస్తుంది. విమోచకునిపై విశ్వాసం అనేది చర్య మరియు శక్తి యొక్క సూత్రం. ఆయన సువార్త సత్యాలకు అనుగుణంగా మనం ప్రవర్తించినప్పుడు, రక్షకుడు మనకు అందించే ఆనందాలపై దృష్టి కేంద్రీకరిస్తూనే, మర్త్యత్వము యొక్క సవాళ్ళ ద్వారా ముందుకు సాగే ఆధ్యాత్మిక సామర్థ్యంతో మనం ఆశీర్వదించబడ్డాము. నిజంగా, “మనం సరైనది చేస్తే మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు సహాయకుడైన ప్రభువు ఎప్పుడూ సమీపంలోనే ఉంటారు.”7

నిబంధనల ద్వారా వ్యక్తిగత సంబంధం

పవిత్రమైన నిబంధనలలోనికి ప్రవేశించడం మరియు యాజకత్వ విధులను స్వీకరించడం మనలను ప్రభువైన యేసు క్రీస్తు మరియు పరలోకపు తండ్రితో కలుపుతుంది మరియు బంధిస్తుంది.8 దీని అర్థం మనం రక్షకుడిని మన న్యాయవాదిగా9 మరియు మధ్యవర్తిగా10 విశ్వసిస్తున్నాము మరియు జీవిత ప్రయాణంలో ఆయన యోగ్యతలు, దయ మరియు కృపపై11 ఆధారపడతాము. మనం క్రీస్తు వద్దకు రావడంలో స్థిరంగా ఉన్నందున మరియు ఆయనతో జతచేయబడినందున, ఆయన అనంతమైన మరియు శాశ్వతమైన ప్రాయశ్చిత్తం యొక్క ప్రక్షాళనచేసే, స్వస్థపరిచే మరియు బలపరిచే దీవెనలను మనం పొందుతాము.12

నిబంధన కట్టుబాట్లను జీవించడం మరియు ప్రేమించడం అనేది ప్రభువుతో లోతైన వ్యక్తిగతమైన మరియు ఆధ్యాత్మికంగా శక్తివంతమైన సంబంధాన్ని సృష్టిస్తుంది. పవిత్రమైన నిబంధనలు మరియు విధుల యొక్క షరతులను మనం గౌరవిస్తున్నప్పుడు, మనం క్రమంగా మరియు అంచెలంచెలుగా ఆయనకు దగ్గరవుతాము13 మరియు మన జీవితాల్లో ఆయన దైవత్వం మరియు సజీవ వాస్తవికత యొక్క ప్రభావాన్ని అనుభవిస్తాము. యేసు అప్పుడు లేఖనాల కథలలో ప్రధాన పాత్ర కంటే చాలా ఎక్కువ అవుతారు; ఆయన మాదిరి మరియు బోధనలు మన ప్రతీ కోరిక, ఆలోచన మరియు చర్యను ప్రభావితం చేస్తాయి.

పునరుత్థానం చెందిన మరియు సజీవంగా ఉన్న దేవుని కుమారునితో మన నిబంధన సంబంధం యొక్క ఖచ్చితమైన స్వభావం మరియు శక్తిని తగినంతగా వివరించే సామర్థ్యం నాకు స్పష్టంగా లేదు. కానీ ఆయనతో మరియు పరలోక తండ్రితో ఉన్న సంబంధాలు నిజమైనవని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు అవి “శత్రువులు ఎగతాళి చేసినా భయపడకుడి”14 అనే భరోసా, శాంతి, ఆనందం మరియు ఆధ్యాత్మిక బలం యొక్క అంతిమ వనరులు. యేసు క్రీస్తు యొక్క నిబంధన చేసి మరియు నిబంధన పాటించే శిష్యులుగా, మనం “ధైర్యాన్ని పొందగలము, ఎందుకంటే ప్రభువు మన పక్షాన ఉన్నారు” 15 మరియు చెడు ప్రభావాలు, లౌకిక అపహాస్యం పట్ల శ్రద్ధ వహించకుండా ఉండగలము.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘ సభ్యులను నేను సందర్శిస్తున్నప్పుడు, నేను తరచూ వారిని ఈ ప్రశ్న అడుగుతుంటాను: ప్రాపంచిక ప్రభావాలను, అపహాస్యం మరియు అవహేళనను “లక్ష్యపెట్టకుండా ఉండడానికి” మీకు ఏది సహాయపడుతుంది? వారి సమాధానాలు అత్యంత జ్ఞానబోధకమైనవి.

ధైర్యవంతులైన సభ్యులు అర్థవంతమైన లేఖన అధ్యయనం, మనఃపూర్వకమైన ప్రార్థన మరియు సంస్కార విధిలో పాల్గొనడానికి సరైన సిద్ధపాటు ద్వారా తమ జీవితాలలోకి పరిశుద్ధాత్మ శక్తిని ఆహ్వానించడం యొక్క ప్రాముఖ్యతను తరచుగా నొక్కిచెప్తారు. నమ్మకమైన కుటుంబ సభ్యులు మరియు విశ్వసనీయ స్నేహితుల ఆధ్యాత్మిక మద్దతు, ప్రభువు యొక్క పునఃస్థాపించబడిన సంఘములో పరిచర్య చేయడం, సేవ చేయడం ద్వారా నేర్చుకున్న ముఖ్యమైన పాఠాలు, గొప్ప మరియు విశాలమైన భవనంలోని లేదా దాని నుండి వచ్చే ఏదైనా సంపూర్ణ శూన్యతను గుర్తించే సామర్థ్యం కూడా తరచుగా ప్రస్తావించబడతాయి.

నేను ఈ సభ్యుల ప్రతిస్పందనలలో ఒక నిర్దిష్టమైన విధానాన్ని గుర్తించాను, అది ప్రత్యేకంగా ముఖ్యమైనది. మొట్టమొదటగా, ఈ శిష్యులు పరలోక తండ్రి యొక్క సంతోష ప్రణాళిక మరియు మన విమోచకునిగా, రక్షకునిగా యేసు క్రీస్తు పాత్ర గురించి దృఢమైన సాక్ష్యాలను కలిగి ఉన్నారు. రెండవది, వారి ఆధ్యాత్మిక జ్ఞానం మరియు నమ్మకం వ్యక్తిగతమైనవి, స్వకీయమైనవి మరియు నిర్దిష్టమైనవి; అవి సాధారణమైనవో, సంక్షేపమైనవో కావు. వ్యతిరేకతను అధిగమించడానికి బలాన్ని అందించే నిబంధనల గురించి, మంచి మరియు చెడు సమయాలలో వారికి మద్దతునిచ్చే సజీవ ప్రభువుతో వారి సంబంధం గురించి ఈ అంకితమైన ఆత్మలు మాట్లాడడం నేను వింటాను. ఈ వ్యక్తులకు యేసు క్రీస్తు నిజంగా వ్యక్తిగత రక్షకుడు.

చిత్రం
ఒక దిక్సూచి

సువార్త నిబంధనలు మరియు విధులు మన జీవితాలలో ఒక దిక్సూచి వలె పనిచేస్తాయి. దిక్సూచి అనేది నౌకాయానం మరియు భౌగోళిక ధోరణి యొక్క ప్రయోజనాల కోసం ఉత్తరం, దక్షిణం, తూర్పు మరియు పడమర యొక్క ప్రాథమిక దిశలను సూచించడానికి ఉపయోగించే పరికరం. అదే విధంగా, మనం నిబంధన మార్గంలో అభివృద్ధి చెందుతున్నప్పుడు మన నిబంధనలు మరియు విధులు మనల్ని ప్రభువైన యేసు క్రీస్తు వైపుకు సూచిస్తాయి మరియు ఆయనతో మనకున్న సంబంధాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడానికి సహాయపడతాయి.

చిత్రం
ది క్రిస్టస్

మర్త్యత్వంలో మనందరికీ ప్రధానమైన దిశ ఏమిటంటే, క్రీస్తు యొద్దకు వచ్చి, ఆయనలో పరిపూర్ణం కావడం.16 పరిశుద్ధ నిబంధనలు మరియు విధులు రక్షకునిపై మన దృష్టిని ఉంచడానికి మరియు ఆయన కృపతో17 ఆయనలా మరింతగా మారడానికి కృషి చేయడానికి మనకు సహాయపడతాయి. చాలా నిశ్చయంగా, “ఒక అదృశ్య [శక్తి] సత్యం యొక్క అద్భుతమైన హేతువులో నాకు మరియు మీకు సహాయం చేస్తుంది.”18

ఇనుప దండాన్ని గట్టిగా పట్టుకోవడం

దేవుడు మరియు యేసు క్రీస్తుతో మనకున్న నిబంధన సంబంధమే మనం “లక్ష్యపెట్టకుండా” చేయగల సామర్థ్యాన్ని మరియు శక్తిని పొందగల మార్గం. మనం నిరంతరం ఇనుప దండాన్ని గట్టిగా పట్టుకోవడం వలన ఈ బంధం బలపడుతుంది. కానీ నీఫై యొక్క సహోదరులు అడిగినట్లుగా, “మన తండ్రి చూచిన ఇనుప దండము యొక్క భావమేమి … ?

“అది దేవుని వాక్యమని [నీఫై] వారితో చెప్పెను; దేవుని వాక్యమును ఆలకించి, దానిని గట్టిగా పట్టుకొనియుండు వారెన్నడూ నశించరు; అంతేకాక శోధనలు మరియు నాశనమునకు నడిపించునట్లు అపవాది యొక్క అగ్ని బాణములు వారిని అంధులుగా చేయలేవు.”19

శోధనలను తట్టుకొని, అపవాది యొక్క అగ్ని బాణాలను ఎదిరించే సామర్థ్యం కేవలం దేవుని వాక్యాన్ని “అంటిపెట్టుకొనియున్న వారికి” కాకుండా “గట్టిగా పట్టుకొనియుండు” వారికి మాత్రమే వాగ్దానం చేయబడిందని దయచేసి గమనించండి.

ఆసక్తికరంగా, అపొస్తలుడైన యోహాను యేసు క్రీస్తును వాక్యమని వర్ణించాడు.20

ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. …

“సమస్తమును ఆయన మూలముగా కలిగెను; కలిగియున్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. …

ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, (మరియు తండ్రి యొక్క అద్వితీయ కుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి) .”21

కాబట్టి, యేసు క్రీస్తు పేర్లలో ఒకటి “వాక్యము.”22

దానికి అదనముగా, ఎనిమిదవ విశ్వాస ప్రమాణము ఇలా ప్రకటిస్తుంది, “తప్పులులేకుండా అనువదించబడినంత వరకు బైబిలు దేవుని వాక్యమని మేము నమ్ముచున్నాము; మోర్మన్ గ్రంథము కూడా దేవుని వాక్యమని మేము నమ్ముచున్నాము.”23

ఆవిధంగా, పరిశుద్ధ లేఖనాలలో నమోదు చేయబడిన రక్షకుని బోధనలు కూడా “వాక్యమే”.

దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవడమంటే (1)పునఃస్థాపించబడిన సువార్త యొక్క నిబంధనలు మరియు విధుల ద్వారా రక్షకునితో మరియు ఆయన తండ్రితో మనకున్న వ్యక్తిగత సంబంధాన్ని గుర్తుంచుకోవడం, గౌరవించడం మరియు బలోపేతం చేయడం, (2) ప్రార్థనాపూర్వకంగా, శ్రద్ధగా మరియు స్థిరముగా పవిత్ర లేఖనాలను, సజీవ ప్రవక్తలు మరియు అపొస్తలుల బోధనలను బయల్పరచబడిన సత్యానికి ఖచ్చితమైన మూలాధారాలుగా ఉపయోగించడమని నేను సలహా ఇస్తున్నాను. మనము ప్రభువుకు కట్టుబడి మరియు “బలముగా పట్టుకొనియుండి,” ఆయన సిద్ధాంతాన్ని జీవించడం ద్వారా రూపాంతరం చెందినప్పుడు24, వ్యక్తిగతంగా మరియు సమిష్టిగా మనం “పరిశుద్ధ స్థలములలో కదలక నిలిచియుండుటకు”25 ఆశీర్వదించబడతామని నేను వాగ్దానం చేస్తున్నాను. మనము క్రీస్తునందు నిలిచియున్నట్లయితే, ఆయన మనతో నిలిచియుంటారు మరియు నడుస్తారు.26 నిశ్చయంగా, “శోధన దినాలలో ఆయన తన పరిశుద్ధులను సంతోషపరుస్తారు మరియు సత్య మార్గాన్ని వృద్ధి చేస్తారు.”27

సాక్ష్యము

ముందుకు సాగండి. గట్టిగా పట్టుకొనియుండండి. లక్ష్యపెట్టవద్దు.

రక్షకుని యొక్క పునఃస్థాపించబడిన సువార్త యొక్క నిబంధనలు మరియు విధుల పట్ల విశ్వసనీయత మనం ప్రభువు కార్యములో ముందుకు సాగుటకు, దేవుని వాక్యంగా ఆయనను గట్టిగా పట్టుకొనియుండుటకు మరియు అపవాది యొక్క ఆకర్షణలను లక్ష్యపెట్టకుండా ఉండేందుకు వీలు కల్పిస్తుందని నేను సాక్ష్యమిస్తున్నాను. హక్కు కోసం జరిగే పోరాటంలో, మనలో ప్రతీఒక్కరం ఖడ్గాన్ని, “సత్యం అనే బలమైన ఖడ్గాన్ని” కూడా ప్రయోగిద్దాం,28 ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో, ఆమేన్.