సర్వసభ్య సమావేశము
బావి వద్ద పాఠాలు
2022 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


బావి వద్ద పాఠాలు

ఏమి చేయాలని మనము ఇక్కడకు పంపబడ్డామో అవన్నీ చేయగలిగే శక్తి మరియు స్వస్థత కొరకు మనము రక్షకుడిని ఆశ్రయించవచ్చు.

సర్వసభ్య సమావేశము యొక్క ఈ స్త్రీల సభలో మీలో ప్రతీఒక్కరితో సమకూడడం ఎంతో ఆనందంగా ఉంది!

నేను పశ్చిమ న్యూయార్క్‌లో పెరిగాను మరియు మా ఇంటికి 20 మైళ్ళ (32 కి.మీ) దూరంలో ఉన్న సంఘము యొక్క చిన్న శాఖకు హాజరయ్యాను. నేను నా ఏకైక స్నేహితుడు పట్టి జోతో కలిసి మా పాత, అద్దె ప్రార్థనా మందిరం యొక్క నేలమాళిగలో ఆదివారపు బడి తరగతిలో కూర్చున్నప్పుడు, లక్షలమంది మహిళలతో కూడిన ప్రపంచ సహోదరిత్వంలో భాగమవుతానని నేను ఎప్పుడూ ఊహించలేదు.

ఐదేళ్ళ క్రితం, మేము ఐరోపా తూర్పు ప్రాంతంలో సమర్పించబడిన పరిశుద్ధులతో కలిసి సేవ చేస్తున్నప్పుడు నా భర్త బ్రూస్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మేము ఇంటికి తిరిగి వచ్చాము మరియు ఆయన కొన్ని వారాల తర్వాత మరణించారు. రాత్రికి రాత్రే నా జీవితం మారిపోయింది. నేను దుఃఖిస్తూ, బలహీనంగా మరియు దుర్బలంగా భావించాను. నా మార్గాన్ని నిర్దేశించమని నేను ప్రభువును వేడుకున్నాను: “నేను ఏమి చేయాలని నీవు కోరుచున్నావు?”

కొన్ని వారాల తర్వాత, నేను నా ఈ-మెయిల్‌ను చూస్తున్నప్పుడు, వివరాల పట్టికలోని చిన్న చిత్రం నా దృష్టిని ఆకర్షించింది. నేను దగ్గరగా చూసినప్పుడు, అది బావి వద్ద యేసుతో ఉన్న సమరయ స్త్రీని ఒక కళాకారుడు చిత్రించినట్లుగా నేను గ్రహించాను. ఆ సమయంలో, ఆత్మ నాతో స్పష్టంగా ఇలా మాట్లాడింది: “అదే నీవు చేయవలసింది.” రక్షకుని యొద్దకు వచ్చి, నేర్చుకోమని ప్రేమగల పరలోక తండ్రి నన్ను ఆహ్వానిస్తున్నారు.

నేను ఆయన “జీవ జలపు”1 బావి నుండి త్రాగడం కొనసాగిస్తున్నప్పుడు నేను నేర్చుకుంటున్న మూడు పాఠాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

మొదటిది: మన గత మరియు ప్రస్తుత పరిస్థితులు మన భవిష్యత్తును నిర్ణయించవు

సహోదరీలారా, మీరు ఆశించిన, ప్రార్థించిన మరియు ప్రణాళిక చేసిన విధంగా మీ జీవితం సాగడం లేదు కాబట్టి కష్టమైన సవాళ్ళను మరియు నష్టాన్ని ఎలా ఎదుర్కోవాలనే అనిశ్చితితో మీలో చాలామంది నేను భావించినట్లుగా భావిస్తున్నారని నాకు తెలుసు.

మన పరిస్థితులు ఎలా ఉన్నా, మన జీవితాలు పవిత్రమైనవి మరియు అర్థాన్ని, ఉద్దేశ్యాన్ని కలిగియున్నాయి. మనలో ప్రతీఒక్కరూ దేవుని యొక్క ప్రియమైన కుమార్తె, మన ఆత్మలలో దైవత్వంతో జన్మించాము.

మన రక్షకుడైన యేసు క్రీస్తు, తన ప్రాయశ్చిత్త త్యాగం ద్వారా మనం శుద్ధి చేయబడడాన్ని మరియు స్వస్థత పొందడాన్ని సాధ్యం చేసి, కుటుంబ సభ్యుల నిర్ణయాలు, మన వైవాహిక స్థితి, శారీరక లేదా మానసిక ఆరోగ్యం లేదా మరే ఇతర పరిస్థితులతో సంబంధం లేకుండా భూమిపై మన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మనకు వీలు కల్పించారు.

బావి వద్ద స్త్రీని పరిగణించండి. ఆమె జీవితం ఎలా ఉండేది? ఆమెకు ఐదుగురు భర్తలు ఉన్నారని మరియు ప్రస్తుతం ఆమెతో నివసిస్తున్న వ్యక్తిని వివాహం చేసుకోలేదని యేసు గ్రహించారు. మరియు ఇంకా, ఆమెకు జీవిత కష్టాలు ఉన్నప్పటికీ, ఆయన ఆమెకు మెస్సీయ అని రక్షకుడు ఆమెకు బహిరంగ ప్రకటన చేసారు. “నీతో మాటలాడుచున్ననేనే ఆయన”2 అని ఆయన చెప్పారు.

ఆమె తన పట్టణంలోని వారికి యేసే క్రీస్తు అని ప్రకటిస్తూ శక్తివంతమైన సాక్షి అయింది. “స్త్రీ యొక్క మాటనుబట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి.”3

ఆమె గత మరియు ప్రస్తుత పరిస్థితులు ఆమె భవిష్యత్తును నిర్ణయించలేదు. ఆమె వలె, ఏమి చేయడానికి మనం ఇక్కడకు పంపబడ్డామో అవన్నీ నెరవేర్చడానికి వీలు కల్పించే బలం మరియు స్వస్థత కోసం ఈరోజు రక్షకుని వైపు తిరగడాన్ని మనం ఎంచుకోవచ్చు.

రెండవది: శక్తి మనలోనే ఉన్నది

సిద్ధాంతము మరియు నిబంధనలలోని సుపరిచితమైన వచనములో, ప్రభువు స్త్రీలను మరియు పురుషులను “ఆతృతతో ఒక మంచి కార్యములో నిమగ్నమై, వారి ఇష్టపూర్వకముగా అనేక కార్యములు చేసి, అధికమైన నీతిని నెరవేర్చవలెను; వారిలో శక్తి ఉన్నది.”4 అని ప్రోత్సహిస్తున్నారు.

సహోదరీలారా, అధికమైన నీతిని నెరవేర్చగల శక్తి మనలోనే ఉంది!

“దేవునితో నిబంధనలు చేసి, ఆ నిబంధనలను గైకొను ప్రతీ స్త్రీ, ప్రతీ పురుషుడు మరియు యాజకత్వ విధులలో యోగ్యతతో పాల్గొనువారు, దేవుని యొక్క శక్తిని ప్రత్యక్షముగా అందుకోగలరు,”5 అని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ సాక్ష్యమిచ్చారు.

బాప్తిస్మము తీసుకొనే సమయంలో మరియు పవిత్ర దేవాలయాలలో చేసిన పవిత్ర నిబంధనలను గౌరవించడానికి మనం కృషి చేస్తున్నప్పుడు, ప్రభువు మనలను “తన స్వస్థత, బలపరిచే శక్తి” మరియు “[మనము] మునుపెన్నడూ యెరుగని ఆధ్యాత్మిక అంతర్దృష్టులు మరియు మేల్కొలుపులతో” అనుగ్రహిస్తారని నేను తెలుసుకున్నాను.”6

మూడవది: “చిన్నవిషయముల నుండి గొప్ప సంగతులు సంభవించును”7

కొండమీది ప్రసంగంలో, యేసు తన శిష్యులకు ఇలా బోధించారు, “మీరు లోకమునకు ఉప్పయి యున్నారు”8 మరియు “మీరు లోకమునకు వెలుగైయున్నారు.” 9 తరువాత ఆయన పరలోక రాజ్య వృద్ధిని పులిసిన పిండితో పోల్చారు, అది “ఒక స్త్రీ తీసికొని పిండి అంతయు పులిసి పొంగువరకు మూడు కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నది.”10

  • ఉప్పు

  • పులిసిన పిండి

  • వెలుగు

చాలా చిన్న మొత్తాలలో కూడా, ప్రతీఒక్కటి వాటి చుట్టూ ఉన్న ప్రతీదానిని ప్రభావితం చేస్తుంది. రక్షకుడు తన శక్తిని ఉప్పుగా, పులిసిన పిండిగా మరియు వెలుగుగా ఉపయోగించమని మనలను ఆహ్వానిస్తున్నారు.

ఉప్పు

ఉప్పు చిలకరించడం వల్ల మనం తినేదాని రుచిలో ఎంత తేడా వస్తుందో ఆలోచిస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అయినప్పటికీ, ఉప్పు తక్కువ ఖరీదైన మరియు సరళమైన పదార్థాలలో ఒకటి.

రాజులు రెండవ గ్రంథములో, సిరియనుల చేత బంధించబడి, సిరియనుల సైన్యానికి సారథి అయిన నయమాను భార్యకు సేవకురాలిగా మారిన “ఒక చిన్నదాని”11 గురించి మనం చదువుతాము. ఆమె ఉప్పు వంటిది; ఆమె యవ్వనంలో ఉంది, ప్రాపంచిక ప్రాముఖ్యత లేనిది మరియు ఒక విదేశంలో బానిసగా ఆమె జీవితం స్పష్టంగా ఆమె ఆశించినది కాదు.

అయినప్పటికీ, ఆమె నయమాను భార్యకు సాక్ష్యమిస్తూ దేవుని శక్తితో రెండు వాక్యాలు మాట్లాడింది: “షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా యేలినవాడుండవలెనని నేనెంతో కోరుచున్నాను! అతడు నా యేలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగుచేయును.”12

విశ్వాసంతో కూడిన ఆమె మాటలు నయమానుకు ప్రసారం చేయబడ్డాయి. అతడు ఆమె మాటలను అనుసరించి, శారీరకంగా మరియు ఆధ్యాత్మికంగా స్వస్థత పొందేలా చేసాయి.

ప్రవక్త అయిన ఎలీషా నిర్దేశించినట్లుగా, నయమానును యొర్దాను నదిలో స్నానం చేయమని ఒప్పించిన సేవకులపై మనం తరచుగా దృష్టి సారిస్తాము, అయితే “ఆ చిన్నది” లేకుండా నయమాను కనీసం ఎలీషా యొక్క ద్వారము వద్ద కూడా ఉండేవాడు కాదు.

మీరు యౌవనులైయుండవచ్చు లేదా ప్రాముఖ్యత లేనివారిగా భావించవచ్చు, కానీ మీరు మీ కుటుంబంలో, పాఠశాలలో మరియు మీ సంఘంలో ఉప్పు వలె ఉండవచ్చు.

పులిసిన పిండి

మీరు ఎప్పుడైనా పులియని రొట్టెలు తిన్నారా? మీరు దానిని ఎలా వర్ణిస్తారు? మందమైనదా? బరువైనదా? గట్టిదా? కొద్ది మొత్తం పులిసిన పిండితోనే రొట్టె పెద్దదవుతుంది, తేలికగా మరియు మృదువుగా మారుతుంది.

మనం దేవుని శక్తిని మన జీవితాల్లోకి ఆహ్వానించినప్పుడు, మనం “భారభరితమైన ఆత్మను”13 ఇతరులను ఉద్ధరించే ప్రేరేపిత దృక్కోణాలతో భర్తీ చేయవచ్చు మరియు హృదయాలు స్వస్థపరచబడడానికి అవకాశం కల్పించవచ్చు.

ఇటీవల నా స్నేహితురాలు క్రిస్మస్ ఉదయమున దుఃఖంతో మంచం మీద పడుకుంది. ఆమె పిల్లలు ఆమెను లేవమని వేడుకున్నారు; అయినప్పటికీ, ఆమె విచారణలో ఉన్న తన విడాకుల బాధతో నిండిపోయింది. మంచంపై ఏడుస్తూ, ఆమె తన పరలోక తండ్రికి ప్రార్థనలో తన ఆత్మను క్రుమ్మరించింది, తన నిరాశను ఆయనకు చెప్పింది.

ఆమె తన ప్రార్థనను ముగించినప్పుడు, దేవునికి ఆమె బాధ తెలుసునని ఆత్మ తనతో గుసగుసలాడింది. ఆమె పట్ల ఆయనకున్న కరుణతో ఆమె నింపబడింది. ఈ పవిత్రమైన అనుభవం ఆమె భావోద్వేగాలను ధృవీకరించింది మరియు ఆమె ఒంటరిగా దుఃఖించడం లేదని ఆమెకు నిరీక్షణను ఇచ్చింది. ఆమె లేచి బయటికి వెళ్ళి, తన పిల్లలతో ఒక మంచుమనిషిని నిర్మించింది, ఉదయం యొక్క భారాన్ని నవ్వు మరియు ఆనందంతో భర్తీ చేసింది.

వెలుగు

గదిలోని చీకటిని ఛేదించడానికి ఎంత కాంతి అవసరమవుతుంది? ఒక చిన్న కిరణం. మరియు చీకటి ప్రదేశంలో ఆ కాంతి కిరణం మీలోనున్న దేవుని శక్తి నుండి వెలువడగలదు.

జీవితపు తుఫానులు విజృంభిస్తున్నప్పుడు మీరు ఒంటరిగా ఉన్నట్లు అనిపించినప్పటికీ, అపార్థం, గందరగోళం మరియు అవిశ్వాసం యొక్క చీకటిలో మీరు కాంతిని ప్రకాశింపజేయగలరు. క్రీస్తుయందు మీ విశ్వాసం యొక్క వెలుగు మీ చుట్టూ ఉన్నవారిని భద్రతకు మరియు శాంతికి నడిపిస్తూ స్థిరంగా మరియు ఖచ్చితంగా ఉండగలదు.

సహోదరీలారా, మనం చిటికెడు ఉప్పు, ఒక చెంచా పులిసిన పిండి మరియు ఒక కాంతి కిరణాన్ని అందించడం ద్వారా హృదయాలు మార్చబడగలవు మరియు జీవితాలు దీవించబడగలవు.

రక్షకుడు మన జీవితాలలో ఉప్పు అని, ఆయన ఆనందాన్ని మరియు ప్రేమను రుచి చూసేందుకు మనల్ని ఆహ్వానిస్తున్నారని నేను సాక్ష్యమిస్తున్నాను.14 మన జీవితాలు కష్టతరమైనప్పుడు పులిసిన పిండి ఆయనే, మనకు నిరీక్షణను15 కలుగజేసి, తన సాటిలేని శక్తి మరియు విమోచన ప్రేమ17 ద్వారా మన భారాలను తేలికచేస్తారు.16 ఆయన మన వెలుగు18, ఇంటికి తిరిగి వెళ్ళే మన మార్గాన్ని ప్రకాశవంతం చేస్తారు.

బావి వద్ద ఉన్న స్త్రీ వలె మనము రక్షకుని యొద్దకు వచ్చి, ఆయన జీవజలమును త్రాగగలమని నేను ప్రార్థిస్తున్నాను. సమరయులతో కలిసి అప్పుడు మనము ఇలా ప్రకటించగలము, “మామట్టుకు మేము విని, యీయన నిజముగా లోకరక్షకుడని తెలిసికొని నమ్ముచున్నాము.”19 యేసు క్రీస్తు నామములో, ఆమేన్.