సర్వసభ్య సమావేశము
లోకాన్ని స్వస్థపరచుట
2022 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


లోకాన్ని స్వస్థపరచుట

మనం దేవుడిని, మనందరి తండ్రిని మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తును గౌరవించినప్పుడు, గాయాలు, విభేదాలు పరిష్కరించబడగలవు మరియు స్వస్థపరచబడగలవు.

సహోదర సహోదరీలారా, ఈ మహిమకరమైన ఈస్టరు సమయంలో కలుసుకోవడానికి మరియు దేవుని సేవకుల నుండి సలహాను, మార్గనిర్దేశాన్ని పొందడానికి మనమెంతో దీవించబడ్డాము.

మన పరలోక తండ్రి నుండి పవిత్రమైన నడిపింపు మరియు బోధనలు ఈ అపాయకరమైన కాలాల్లో ఎంపికలు చేయడానికి మనకు సహాయపడతాయి. ప్రవచించబడినట్లుగా, “మంటలు, తుఫానులు,” “వివిధ స్థలములలో యుద్ధములు, యుద్ధములను గూర్చిన వదంతులు మరియు భూకంపములు,” “అన్ని రకములైన హేయకార్యములు,”1 “మహమ్మారి,”2 “కరువులు మరియు తెగుళ్ళు”3 కుటుంబాలను, సమాజాలను మరియు దేశాలను కూడా నాశనం చేస్తున్నాయి.

మరొక ఆపద ప్రపంచాన్ని తుడిచిపెడుతోంది: అదే మీ మరియు నా మత స్వేచ్ఛపై జరిగే దాడులు. పెరుగుతున్న ఈ మానసిక భావన ప్రజలు, పాఠశాలలు, సామాజిక ప్రమాణాలు మరియు పౌర ఉపన్యాసాల నుండి మతాన్ని మరియు దేవునిలో విశ్వాసాన్ని తొలగించడానికి చూస్తోంది. మత స్వేచ్ఛను వ్యతిరేకించే వారు హృదయపూర్వక నమ్మకాలను వ్యక్తపరచడంపై ఆంక్షలు విధించాలని చూస్తున్నారు. వారు విశ్వాస సంప్రదాయాలను విమర్శిస్తున్నారు మరియు అపహాస్యం చేస్తున్నారు కూడా.

అటువంటి వైఖరి వ్యక్తిగత నియమాలు, న్యాయము, మర్యాద, ఆధ్యాత్మికత మరియు మనశ్శాంతి యొక్క విలువ తగ్గించి, జనులను చిన్నచూపు చూస్తుంది.

మత స్వేచ్ఛ అంటే ఏమిటి?

అది దాని ఆకృతులన్నిటిలో ఆరాధించే స్వాతంత్ర్యము: సమావేశ స్వాతంత్ర్యము, వాక్ స్వాతంత్ర్యము, వ్యక్తిగత నమ్మకాలపై పనిచేసే స్వాతంత్ర్యము మరియు అదే విధంగా చేయడానికి ఇతరులకివ్వబడే స్వాతంత్ర్యము. మనం ఏమి నమ్ముతాము, మన విశ్వాసం ప్రకారం ఎలా జీవిస్తాము మరియు పని చేస్తాము, దేవుడు మన నుండి ఏమి ఆశిస్తున్నాడు అనేవాటిని మనకై మనం నిర్ణయించుకొనేందుకు మత స్వేచ్ఛ మనలో ప్రతీఒక్కరిని అనుమతిస్తుంది.

అటువంటి మత స్వేచ్ఛను తగ్గించే ప్రయత్నాలు క్రొత్తవేమీ కాదు. చరిత్ర అంతటా, విశ్వాసులు ఇతరుల చేతుల్లో చాలా బాధపడ్డారు. యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క సభ్యులు దానికి అతీతులు కారు.

ఆరంభం నుండి, యేసు క్రీస్తు యందు విశ్వాసం, ఆయన ప్రాయశ్చిత్తము, పశ్చాత్తాపము, సంతోష ప్రణాళిక, మన ప్రభువు యొక్క రెండవ రాకడతో కలిపి దైవిక సిద్ధాంతం గురించి దాని బోధనల మూలంగా దేవుడిని వెదికిన అనేకమంది ఈ సంఘానికి ఆకర్షింపబడ్డారు.

వ్యతిరేకత, హింస మరియు దౌర్జన్యం మన మొదటి కడవరి దిన ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్‌ను, అతని అనుచరులను పీడించాయి.

1842లో అలజడుల మధ్య దీనితో కలిపి, ఎదుగుతున్న సంఘం యొక్క 13 ప్రాథమిక సిద్ధాంతాలను జోసెఫ్ ప్రచురించాడు: “మా మనస్సాక్షి నిర్దేశించిన ప్రకారం సర్వశక్తిమంతుడైన దేవుడిని ఆరాధించు విశేషాధికారమును కలిగియుండుటను మేము హక్కుగా కోరుచున్నాము, మరియు సమస్త మానవులకు ఏవిధంగానైనా, ఎక్కడనైనా, దేనినైనా ఆరాధించే అట్టి విశేషాధికారాన్ని కలిగియుండే అవకాశమివ్వబడాలని కోరుచున్నాము.”4

ఆయన వ్యాఖ్యానము కలుపుకొనేది, విముక్తి కల్పించేది మరియు మర్యాదపూర్వకమైనది. అదే మత స్వేచ్ఛ యొక్క సారాంశము.

ప్రవక్త జోసెఫ్ స్మిత్ కూడా ఇలా వ్యాఖ్యానించారు:

“ప్రిస్బిటేరియన్, బాప్టిస్టు లేదా మరేయితర మతశాఖకు చెందిన మనిషి హక్కులను కాపాడడానికైనా మరణించడానికి నేను సిద్ధంగా ఉన్నానని పరలోకము యెదుట ధైర్యంగా నేను ప్రకటిస్తున్నాను; పరిశుద్ధుల హక్కులను కాలరాసే అదే నియమము … రోమన్ కాథలిక్కుల హక్కులను లేదా ప్రజాదరణ లేని మరియు తమనుతాము కాపాడుకోలేని మరేయితర మతశాఖ హక్కులనైనా కాలరాస్తుంది.

“నా ఆత్మను ప్రేరేపించేది స్వేచ్ఛ మీద, అనగా సమస్త మానవజాతి కొరకు పౌర మరియు మతపరమైన స్వేచ్ఛ మీద ఉన్న ప్రేమయే.”5

ఇంకను, తొలి సంఘ సభ్యులు దాడిచేయబడి, న్యూయార్కు నుండి ఒహైయోకు, అక్కడినుండి మిస్సోరికి వేల మైళ్ళు తరిమివేయబడ్డారు, అక్కడి గవర్నరు సంఘ సభ్యులను “శత్రువులుగా యెంచాలని, రాష్ట్రం నుండి తప్పక నిర్మూలించాలని లేదా తరిమివేయాలని” ఉత్తర్వు జారీచేసాడు.6 వారు ఇల్లినాయ్‌కు పారిపోయారు, కానీ హింస కొనసాగింది. ఒక అల్లరిమూక ప్రవక్త జోసెఫ్‌ను చంపారు, ఆయన మరణం సంఘాన్ని నాశనం చేస్తుందని మరియు విశ్వాసులను చెదరగొడుతుందని భావించారు. కానీ విశ్వాసులు స్థిరంగా నిలిచారు. జోసెఫ్ తరువాత వచ్చిన బ్రిగమ్ యంగ్, వేలమందిని ఇప్పుడు యూటా రాష్ట్రంగా పిలువబడుతున్న పశ్చిమానికి 1300ల మైళ్ళ (2,100 కి.మీ.) బలవంతపు ప్రయాణం చేయించారు.7 ఆ తొలి మార్గదర్శక స్థిరనివాసులలో నా స్వంత పూర్వీకులు ఉన్నారు.

తీవ్రమైన హింస గల ఆ రోజుల నుండి ప్రభువు యొక్క సంఘము సుమారు 17 మిలియన్ల మంది సభ్యులదాకా క్రమంగా ఎదిగింది, అందులో సగానికి పైగా అమెరికా వెలుపల నివసిస్తున్నారు.8

2020 ఏప్రిల్‌లో, మన ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహము చేత ప్రపంచం కొరకు సిద్ధపరచబడిన ఒక ప్రకటనతో పునఃస్థాపించబడిన సువార్త యొక్క 200వ వార్షికోత్సవాన్ని మన సంఘము జరుపుకుంది. “దేవుడు ప్రపంచంలోని ప్రతి దేశంలో ఉన్న తన పిల్లలను ప్రేమిస్తున్నారని మేము గంభీరంగా ప్రకటిస్తున్నాము,”9 అని అది మొదలవుతుంది.

మన ప్రియమైన ప్రవక్త రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇంకా ఇలా వ్యక్తం చేసారు:

“స్వాతంత్ర్యము, దయ మరియు దేవుని పిల్లలందరి కొరకు న్యాయములో మేము నమ్ముతున్నాము.

“మనమందరం సహోదర సహోదరీలము, ప్రతీఒక్కరం మన ప్రియమైన పరలోక తండ్రి బిడ్డలం. ఆయన కుమారుడు, ప్రభువైన యేసు క్రీస్తు ‘నల్లవాడిని తెల్లవాడిని, దాసుని స్వతంత్రుని, పురుషుని స్త్రీని’ (2 నీఫై 26:33) అందరినీ తన వద్దకు రమ్మని ఆహ్వానిస్తారు.”10

మత స్వేచ్ఛ నుండి సమాజం మరియు వ్యక్తులు లాభం పొందే నాలుగు మార్గాలను నాతోపాటు పరిగణించండి.

మొదటిది. మత స్వాతంత్ర్యము మన జీవితాల్లో దేవుడిని కేంద్రంగా చేసి, మొదటి మరియు రెండవ గొప్ప ఆజ్ఞలను గౌరవిస్తుంది. మత్తయిలో మనమిలా చదువుతాము:

“నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను.”11

“నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే.”12

సంఘ భవనం, సమాజ మందిరము, మసీదు లేదా తరగపు పైకప్పు గల గుడిసె, ఎందులోనైనా క్రీస్తు శిష్యులు మరియు ఒకే రకమైన విశ్వాసులందరు ఆయనను ఆరాధించడం మరియు ఆయన పిల్లలకు సేవ చేయడానికి సమ్మతించడం ద్వారా దేవుని పట్ల భక్తిని వ్యక్తం చేయగలరు.

అటువంటి ప్రేమ మరియు సేవకు యేసు క్రీస్తు పరిపూర్ణమైన మాదిరి. ఆయన పరిచర్యలో, ఆయన పేదవారి పట్ల శ్రద్ధ చూపారు,13 రోగులను14 మరియు గ్రుడ్డివారిని స్వస్థపరిచారు.15 ఆయన ఆకలితోనున్న వారికి ఆహారమిచ్చారు,16 చిన్నపిల్లల కొరకు తన బాహువులు తెరిచారు17 మరియు ఆయనకు అన్యాయం చేసిన వారిని, ఆయనను శిలువ వేసిన వారిని కూడా క్షమించారు.18

యేసు “మేలు చేయుచు సంచరించుచుండెను,” అని లేఖనాలు వివరిస్తాయి.19 మనము అలాగే చేయాలి.

రెండవది. మత స్వాతంత్ర్యం అనేది విశ్వాసం, నిరీక్షణ మరియు శాంతి యొక్క వ్యక్తీకరణలను పెంపొందిస్తుంది.

అన్ని విశ్వాసాల, మతాల జనులను మరియు వారి నమ్మకాల గురించి మాట్లాడే హక్కును కాపాడడంలో ఒక సంఘముగా మనము ఇతర మతాలతో చేరుతాము. దీని అర్థము మనం వారి నమ్మకాలను లేదా వారు మన వాటిని అంగీకరిస్తామని కాదు, కానీ మనల్ని అణచాలని కోరుకునే వారితో కంటే ఎక్కువగా మనం ఉమ్మడి విషయాలను కలిగియున్నాము.

ఇటీవల నేను ఇటలీలో వార్షిక జి20 ఇంటర్‌ఫెయిత్ ఫోరమ్‌లో సంఘానికి ప్రాతినిధ్యం వహించాను. ప్రభుత్వాన్ని మరియు ప్రపంచమంతటి నుండి మత నాయకులను కలుసుకున్నప్పుడు, నేను ప్రోత్సహించబడ్డాను, పైకెత్తబడ్డాను కూడా. మనం దేవుడిని, మనందరి తండ్రిని మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తును గౌరవించినప్పుడు, గాయాలు, విభేదాలు పరిష్కరించబడగలవని మరియు స్వస్థపరచబడగలవని కూడా నేను గ్రహించాను. అందరి కంటే గొప్ప వైద్యుడు మన ప్రభువు, రక్షకుడైన యేసు క్రీస్తు.

నా ప్రసంగాన్ని ముగించినప్పుడు, ఒక ఆసక్తికరమైన క్షణాన్ని నేను కలిగియున్నాను. ముందు మాట్లాడిన ఏడుగురు వక్తలు ఏ రకమైన విశ్వాసపు సంప్రదాయంలో లేదా దేవుని నామములో ముగించలేదు. నేను మాట్లాడినప్పుడు, “కృతజ్ఞతలు అని మాత్రమే చెప్పి కూర్చోవాలా లేదా ‘యేసు క్రీస్తు నామములో’ అని ముగించాలా?” అని నేను ఆలోచించాను. నేనెవరినో గుర్తు చేసుకున్నాను మరియు నా సందేశాన్ని ముగించినప్పుడు ఆయన నామాన్ని చెప్పాలని ప్రభువు నన్ను కోరతారని నాకు తెలుసు. కాబట్టి నేను చెప్పాను. వెనుదిరిగి చూసినట్లయితే, అది నా విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి నాకు వచ్చిన అవకాశము; మరియు ఆయన పరిశుద్ధ నామములో నా సాక్ష్యాన్ని చెప్పడానికి నేను మత స్వేచ్ఛను కలిగియున్నాను.

మూడవది. ఇతరులకు సహాయపడమని మతం జనులను ప్రేరేపిస్తుంది.

వృద్ధిచెందడానికి తగిన అవకాశం మరియు స్వాతంత్ర్యము మతానికి ఇవ్వబడినప్పుడు, విశ్వాసులు కొన్నిసార్లు సాధారణమైనవి, మరికొన్నిసార్లు వీరోచిత సేవా చర్యలు చేస్తారు. ప్రాచీన యూదుల వాక్యభాగం “టిక్కున్ ఓలమ్” అనగా అర్థము, “లోకాన్ని బాగుచేయడం లేదా స్వస్థపరచడం” అనేది నేడు అనేకమంది ప్రయత్నాల్లో ప్రతిబింబిస్తుంది. మేము కారిటాస్ ఇంటర్నేషనల్ అనబడే కాథలిక్ ఛారిటిస్‌తో, ఇస్లామిక్ రిలీఫ్‌తో మరియు అనేకమంది యూదులు, హిందువులు, బౌద్ధులు, సిక్కులతో మరియు సాల్వేషన్ ఆర్మీ, ద నేషనల్ క్రిస్టియన్ ఫౌండేషన్ వంటి క్రైస్తవ సంస్థలతో భాగస్వామ్యంలో చేరాము. కలిసి మేము అవసరంలో ఉన్న లక్షల మందికి సేవ చేస్తాము, ఇటీవల యుద్ధము యొక్క శరణార్థులకు గుడారాలు, నిద్ర సంచులు, ఆహార సామాగ్రి అందించాము,20 పోలియో21 మరియు కొవిడ్22ల కొరకు కూడా టీకాలను అందించడానికి సహాయం చేసాము. ఏమి చేసామనే దాని జాబితా చాలా పెద్దది, కానీ అవసరాలు కూడా అంతే ఉన్నాయి.

సందేహం లేదు, విశ్వాసులు కలిసి పనిచేసి, ముఖ్యమైన మధ్యవర్తిత్వాలు చేయగలరు. అదే సమయంలో, ఒకరికి ఒకరు చేసే సేవ తరచూ చెప్పబడలేదు, కానీ నిశ్శబ్దంగా జీవితాలను మారుస్తుంది.

యేసు క్రీస్తు నయీనులో విధవరాలిని సమీపించినప్పుడు, లూకాలో ఉన్న మాదిరి గురించి నేను ఆలోచిస్తున్నాను. అనుచరుల సమూహంతో వెంబడింపబడి, యేసు విధవరాలి ఏకైక కుమారుని అంత్యక్రియల వద్దకు వచ్చారు. అతడు లేకుండా ఆమె మానసిక, ఆత్మీయ మరియు ఆర్థిక వినాశనాన్ని కూడా ఎదుర్కొంటోంది. కన్నీటి మరకలున్న ఆమె ముఖాన్ని చూసి, యేసు, “ఏడువవద్దని”23 చెప్పెను. తర్వాత దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి.

ఆయన “చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా,

“ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను; [యేసు] అతనిని అతని తల్లికి అప్పగించెను.”24

చనిపోయిన వానిని లేపుట ఒక అద్భుతము, కానీ దయతో కూడిన ప్రతీ చర్య మరియు శ్రమపడుతున్న వారిపట్ల చింత అనేది నిబంధన మార్గము, మనలో ప్రతీఒక్కరం “దేవుడు [మన]కు [తోడైయున్నాడని]” తెలుసుకొని, మేలు చేయుచు [వెళ్ళ]గలము.”25

నాల్గవది. మత స్వేచ్ఛ అనేది విలువలను మరియు నైతికతను రూపొందించడానికి ఏకంచేసే మరియు సమీకరించే శక్తిగా పనిచేస్తుంది.

క్రొత్త నిబంధనలో, అనేకమంది యేసు క్రీస్తు నుండి తొలగిపోయారని, “ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు?”26 అంటూ ఆయన సిద్ధాంతం గురించి సణిగారని మనం చదువుతాము.

ఉపన్యాసం మరియు ప్రభావం నుండి మతాన్ని బహిష్కరించాలని కోరుకునే వారి నుండి నేటికీ ఆ రోదన వినిపిస్తూ ఉంటుంది. కానీ, స్వభావాన్ని రూపొందించడంలో మరియు కష్ట సమయాల్లో మధ్యవర్తిత్వం వహించడంలో సహాయపడేందుకు మతం లేకపోతే, ఎవరుంటారు? నిజాయితీ, కృతజ్ఞత, క్షమాపణ మరియు సహనాన్ని ఎవరు నేర్పిస్తారు? మరచిపోబడిన మరియు అణచివేయబడిన వారిపట్ల దాతృత్వము, కనికరము మరియు దయను ఎవరు చూపుతారు? భిన్నంగా ఉన్నప్పటికీ, దేవుని పిల్లలందరితో పాటు అర్హులైన వారిని ఎవరు హత్తుకుంటారు? అవసరంలో నున్న వారికి తమ బాహువులను తెరచి, ప్రతిఫలం ఆశించని వారెవరు? శాంతిని గౌరవించి, ఆనాటి పోకడల కంటే ఎక్కువగా చట్టాలకు లోబడే వారెవరు? “నీవును వెళ్ళి ఆలాగు చేయుమని” రక్షకుడు చెప్పిన దానికి ఎవరు స్పందిస్తారు?27

మనం చేస్తాము! అవును, సహోదర సహోదరీలారా, మనం చేస్తాము.

మత స్వేచ్ఛ యొక్క హేతువును సమర్థించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇది దేవుడిచ్చిన స్వతంత్రత నియమము యొక్క వ్యక్తీకరణ.

మత స్వేచ్ఛ పోటీపడుతున్న తత్వాలను సమన్వయం చేస్తుంది. ముఖ్య విశ్వాసాలను వ్యక్తం చేయడానికి మరియు వాటిపై పనిచేయడానికి కావలసిన స్వాతంత్ర్యాన్ని మనం కాపాడినప్పుడు మాత్రమే మతం యొక్క మంచితనము, దాని చేరువ, మతం ప్రేరేపించే రోజువారీ ప్రేమ చర్యలు వృద్ధిచెందుతాయి.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ దేవుని యొక్క సజీవ ప్రవక్తయని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు ఈ సంఘాన్ని నడిపించి, మార్గనిర్దేశం చేస్తారని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన మన పాపాల కోసం ప్రాయశ్చిత్తం చేసారు, శిలువపై మరణించారు మరియు మూడవ రోజు పునరుత్థానం చెందారు.28 ఆయన మూలంగా మనం నిత్యత్వమంతటి కొరకు మరలా జీవించగలము; మరియు ఆ విధంగా చేయాలనుకొనే వారు మన పరలోక తండ్రితో ఉండగలరు. ఈ సత్యాన్ని నేను లోకమంతటికీ ప్రకటిస్తున్నాను. ఆ విధంగా చేయడానికి గల స్వేచ్ఛ కొరకు నేను కృతజ్ఞుడిని. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.