సర్వసభ్య సమావేశము
దేవునితో నిబంధనలు మనల్ని బలపరచి, రక్షించి, నిత్య మహిమ కొరకు సిద్ధపరుస్తాయి
2022 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


దేవునితో నిబంధనలు మనల్ని బలపరచి, రక్షించి, నిత్య మహిమ కొరకు సిద్ధపరుస్తాయి

మనం నిబంధనలు చేసి, వాటిని పాటించడానికి ఎంచుకున్నప్పుడు, మనం ఈ జీవితంలో మరియు రాబోయే మహిమకరమైన నిత్య జీవితంలో అధిక సంతోషంతో దీవించబడతాము.

సహోదరీలారా, ప్రపంచవ్యాప్త సహోదరీత్వములో సమకూడడం ఎంతో ఆనందకరము! దేవునితో నిబంధనలు చేసి, పాటించే స్త్రీలుగా మనం మన కాలపు సవాళ్ళను ఎదుర్కోవడానికి మనకు సహాయం చేసే మరియు యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడకు మనల్ని సిద్ధపరిచే ఆత్మీయ బంధాలను పంచుకుంటాము. ఆ నిబంధనలను పాటించడమనేది ఇతరులను రక్షకుని వద్దకు తీసుకురావడానికి ప్రభావం చూపే స్త్రీలుగా ఉండేందుకు మనల్ని అనుమతిస్తుంది.

బాప్తిస్మము పొందిన వారు, యేసు క్రీస్తు నామమును తమపై తీసుకుంటామని, ఆయనను ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకుంటామని, ఆయన ఆజ్ఞలను పాటిస్తామని మరియు అంతం వరకు ఆయనను సేవిస్తామని ఆ మరపురాని రోజు నిబంధన చేసారు. మనం వీటిని చేసినప్పుడు, మన పాపాలను క్షమిస్తానని, పరిశుద్ధాత్మ యొక్క సహవాసాన్ని మనకిస్తానని పరలోక తండ్రి వాగ్దానం చేస్తారు. మనం ముందుకుసాగి, అంతం వరకు సహించినట్లయితే, ఈ దీవెనలు సిలెస్టియల్ రాజ్యములో ఆయనతో మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో జీవించడానికి మనల్ని అనుమతించే బాటపై మనల్ని నడిపిస్తాయి. బాప్తిస్మం పొందిన ప్రతీ వ్యక్తికి, ఆమె లేదా అతడు ఆ ప్రత్యేక దినమున వారు చేసిన నిబంధనను పాటించినట్లయితే ఈ దీవెనలు మరియు విశేషాధికారాలు వాగ్దానం చేయబడ్డాయి.

దేవాలయంలో మరికొన్ని నిబంధనలు చేసేవారు వ్యక్తిగత విశ్వసనీయత యొక్క షరతులపై శక్తివంతమైన వాగ్దానాలను పొందుతారు. దేవుని ఆజ్ఞలకు లోబడతామని, యేసు క్రీస్తు సువార్తను జీవిస్తామని, నైతికంగా స్వచ్ఛంగా ఉంటామని మరియు మన సమయాన్ని, తలాంతులను ప్రభువు సేవకై సమర్పిస్తామని మనం గంభీరంగా వాగ్దానం చేస్తాము. బదులుగా, దేవుడు ఈ జీవితంలో దీవెనలను మరియు ఆయన వద్దకు తిరిగివెళ్ళే అవకాశాన్ని వాగ్దానం చేస్తారు.1 ఆ ప్రక్రియలో, అన్నివైపుల నుండి మనల్ని ముట్టడించే గందరగోళమైన, ప్రతికూల స్వరాల సమక్షంలో సత్యాసత్యాల మధ్య, తప్పు ఒప్పుల మధ్య తేడా తెలుసుకొనే శక్తి మనకు పైనుండి ఇవ్వబడుతుంది. ఎంత శక్తివంతమైన బహుమానము!

మొదటిసారి నా దేవాలయ ప్రయాణానికి సిద్ధపడుతున్నప్పుడు, అందమైన వేడుక దుస్తులతో కలిపి నాకు అవసరమైన వస్తువులు ఎంచుకోవడంలో మా అమ్మ మరియు అనుభవం గల ఉపశమన సమాజ సహోదరీలు నాకు సహాయపడ్డారు. కానీ, ఏమి ధరించాలో తెలుసుకోవడానికి ముందే అత్యంత ముఖ్యమైన సిద్ధపాటు వచ్చింది. నేను యోగ్యురాలినని నిర్ధారించడానికి నన్ను మౌఖికపరీక్ష చేసిన తర్వాత, నేను చేయబోయే నిబంధనల గురించి మా బిషప్పు వివరించారు. ఆయన శ్రద్ధగా ఇచ్చిన వివరణ ఆ నిబంధనలు చేయడం గురించి ఆలోచించడానికి మరియు సిద్ధపడడానికి నాకు అవకాశమిచ్చింది.

ఆరోజు వచ్చినప్పుడు, కృతజ్ఞత మరియు శాంతి భావాలతో నేను పాల్గొన్నాను. నేను చేసిన నిబంధనల యొక్క ప్రాముఖ్యతను నేను పూర్తిగా గ్రహించలేకపోయినప్పటికీ, ఆ నిబంధనల ద్వారా నేను దేవునికి కట్టుబడి ఉన్నానని మరియు నేను వాటిని పాటించినట్లయితే, నేను అరుదుగా గ్రహించగల దీవెనలు నాకు వాగ్దానం చేయబడ్డాయని తెలిసింది. ఆ మొదటి అనుభవమైనప్పటి నుండి, మనం దేవునితో చేసిన నిబంధనలను పాటించడం రక్షకుని శక్తిని పొందడానికి మనల్ని అనుమతిస్తుందని నిరంతరం నాకు అభయమివ్వబడింది, అది మనల్ని అనివార్యమైన మన శ్రమలలో బలపరుస్తుంది, అపవాది ప్రభావం నుండి మనకు రక్షణను అందిస్తుంది మరియు నిత్య మహిమ కొరకు మనల్ని సిద్ధపరుస్తుంది.

హాస్యాస్పదమైన వాటినుండి హృదయాన్ని మెలిపెట్టే వాటివరకు, భయంకరమైన వాటినుండి మహిమకరమైన వాటివరకు జీవితానుభవాలు ఉండవచ్చు. ప్రతీ అనుభవం మన తండ్రి యొక్క చుట్టుముట్టే ప్రేమ గురించి మరియు రక్షకుని యొక్క మహిమావరం ద్వారా మార్పుచెందడానికి గల మన సామర్థ్యం గురించి మరింతగా గ్రహించడానికి మనకు సహాయపడుతుంది. అది చిన్న తప్పుడు తీర్పు లేదా పెద్ద వైఫల్యం ఏదైనప్పటికీ—అనుభవం ద్వారా మనం నేర్చుకున్నప్పుడు, మన నిబంధనలను పాటించడమనేది మనల్ని శుద్ధిచేయడానికి రక్షకుని శక్తిని అనుమతిస్తుంది. మనం పడిపోయినప్పుడు, మనం ఆయన వైపు తిరిగిన యెడల మన విమోచకుడు మనల్ని పట్టుకోవడానికి అక్కడుంటారు.

చిత్రం
కొండ అంచు నుండి క్రిందికి రాపెల్లింగ్ చేయుట

మీ కాలివ్రేళ్ళను దాని అంచున ఆనించి, మీ వీపును క్రిందనున్న లోయ వైపు ఉంచి, మీరెప్పుడైనా ఒక ఎత్తైన కొండ మీద నిలబడ్డారా? రాపెల్లింగ్‌లో, మిమ్మల్ని సురక్షితంగా చేర్చేలా మీరు బలమైన త్రాళ్ళు మరియు సాధనాలతో భద్రంగా బంధించబడి ఉన్నప్పటికీ, ఎత్తైన కొండ పైన నిలబడడం అనేది ఇంకా గుండె వేగాన్ని పెంచే అనుభవమే. ఎత్తైన కొండ పైనుండి వెనక్కి జరిగి సన్నని గాలిలో ఊగిసలాడాలంటే, ఒక స్థిరమైన వస్తువుకు దృఢంగా బంధించబడిన లంగరుపై నమ్మకం అవసరము. మీరు క్రిందికి దిగుతున్నప్పుడు త్రాడును పట్టుకొనే వ్యక్తి పైన నమ్మకాన్ని అది కోరుతుంది. మీరు క్రిందికి దిగడంపై నియంత్రణకు ఆ సాధనం మీకు కొంత అవకాశమిచ్చినప్పటికీ, మీ భాగస్వామి మిమ్మల్ని పడనివ్వరనే నమ్మకాన్ని మీరు తప్పక కలిగియుండాలి.

చిత్రం
రాపెల్లింగ్ లంగరులు
చిత్రం
కొండ అంచు నుండి క్రిందికి రాపెల్లింగ్ చేస్తున్న యువతులు

ఒక యువతుల సమూహంతో రాపెల్లింగ్ చేయడం నాకు స్పష్టంగా గుర్తుంది. ఆ సమూహంలో నేను మొదట వెళ్ళవలసి వచ్చింది. ఎత్తైన కొండ పైనుండి వెనక్కి అడుగు వేసినప్పుడు, నేను నియంత్రణ లేకుండా పడిపోవడం మొదలైంది. అదృష్టవశాత్తు త్రాడు లాగబడి, నేను వేగంగా క్రిందికి వెళ్ళడం ఆగింది. గరుకుగానున్న ఎత్తైన కొండ పైనుండి క్రిందికి వచ్చే దారి మధ్యలో నేను వ్రేలాడుతున్నప్పుడు, రాళ్ళపై పడకుండా నన్ను ఆపుతున్న దాని కొరకు లేదా వారి కొరకు నేను మనస్ఫూర్తిగా ప్రార్థించాను.

లంగరు బోల్టు సరిగ్గా కట్టబడలేదని, నేను అంచు నుండి వెనక్కి వెళ్ళిన వెంటనే త్రాడు పట్టుకున్న వ్యక్తి వెనక్కి పడి, ఎత్తైన కొండ అంచు వైపు వేగంగా లాగబడ్డాడని తర్వాత నేను తెలుసుకున్నాను. వెంటనే ఎలాగోలా అతడు కొన్ని రాళ్ళ మధ్య తన పాదాలను దూర్చాడు. ఆ స్థితిలో స్థిరంగా ఉండి, అతడు చాలా కష్టపడి నెమ్మదిగా త్రాడుతో నన్ను క్రిందికి దించాడు. నేను అతడ్ని చూడలేకపోయినప్పటికీ, నన్ను కాపాడడానికి తన బలమంతటితో అతడు పనిచేస్తున్నాడని నాకు అర్థమైంది. ఒకవేళ త్రాడు తెగిపోతే నన్ను పట్టుకోవడానికి సిద్ధంగా కొండ అడుగుభాగంలో మరొక స్నేహితుడున్నాడు. నేను అందేటంత దూరంలో ఉన్నప్పుడు, అతడు నా జీను పట్టుకొని నన్ను నేలపై దించాడు.

యేసు క్రీస్తును మన లంగరుగా, పరిపూర్ణ భాగస్వామిగా కలిగియుండి, కష్టకాలాల్లో ప్రియమైన ఆయన బలం మరియు చివరకు ఆయన ద్వారా విడుదల గురించి మనం అభయమివ్వబడ్డాము. అధ్యక్షులు ఎమ్. రస్సెల్ బాల్లర్డ్ బోధించినట్లుగా, “దేవుని యందు మరియు ఆయన కుమారుడు, ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసమనేది … సామాజిక కల్లోలము మరియు దుష్టత్వము గల సమయాల్లో మనల్ని గట్టిగా పట్టుకోవడానికి మన జీవితాల్లో మనం తప్పక కలిగియుండవలసిన లంగరు. … మన విశ్వాసము …యేసు క్రీస్తు నందు, ఆయన జీవితము, ఆయన ప్రాయశ్చిత్తము మరియు ఆయన సువార్త యొక్క పునఃస్థాపనపై తప్పక కేంద్రీకరించబడాలి.”2

అపవాది మూలంగా ఆత్మీయంగా బలహీనమవడం నుండి మనల్ని కాపాడే ఆత్మీయ సాధనం యేసు క్రీస్తు గురించిన మన సాక్ష్యం మరియు మనం చేసే నిబంధనలు. మనల్ని భద్రతవైపు నడిపించడానికి మరియు తీసుకువెళ్ళడానికి ఈ ఆధారాలపై మనం ఆధారపడగలము. సమ్మతిగల మన భాగస్వామిగా, రక్షకుడు తాను చేరుకోలేనంతగా మనం పడిపోవడానికి అనుమతించరు. శ్రమలు మరియు బాధలు గల సమయాల్లో కూడా, మనల్ని పైకెత్తడానికి మరియు ప్రోత్సహించడానికి ఆయన ఉంటారు. తరచూ ఇతరుల ఎంపికల వలన కలిగే వినాశకర ప్రభావం నుండి కూడా మనల్ని కాపాడేందుకు ఆయన శక్తి సహాయపడుతుంది. ఏమైనప్పటికీ, రక్షకుని నుండి సహాయం పొందడానికి యోగ్యులుగా, సమర్థులుగా మనల్ని మనం చేసుకోవడానికి మనం చేయగలిగినదంతా చేయాలి. రక్షకునికి లంగరు వేయబడేందుకు, మన నిబంధనల ద్వారా ఆయనకు కట్టుబడి ఉండేందుకు మనం తప్పక ఎంచుకోవాలి.3

రక్షకునితో ఆ సంబంధాన్ని మనమెలా బలపరచాలి? అణకువ గల హృదయంతో మనం ప్రార్థిస్తాము, లేఖనాలను చదివి, ధ్యానిస్తాము, పశ్చాత్తాపము మరియు భక్తిగల ఆత్మతో సంస్కారము తీసుకుంటాము, ఆజ్ఞలు పాటించడానికి ప్రయత్నిస్తాము మరియు ప్రవక్త యొక్క సలహాను అనుసరిస్తాము. “ఉన్నతమైన మరియు పరిశుద్ధమైన”4 విధానాల్లో మన అనుదిన పనులను మనం నెరవేర్చినప్పుడు, ఇంకా ఎక్కువగా మనం రక్షకునితో జతచేయబడతాము మరియు అదే సమయంలో, ఇతరులు ఆయన వద్దకు రావడానికి సహాయపడతాము.

ఆ “ఉన్నతమైన మరియు పరిశుద్ధమైన విధానము” ఎలా ఉంటుంది? ఇతరులతో మనం జరిపే పరస్పర చర్యలన్నిటిలో మనం సువార్తను జీవించడానికి ప్రయత్నిస్తాము. నిజంగా పరిచర్య చేస్తూ, సాధారణ సేవ ద్వారా ప్రేమను వ్యక్తం చేస్తూ మనం అవసరంలో ఉన్నవారి పట్ల శ్రద్ధ చూపుతాము. తమ జీవితాల్లో శాంతిని, బలాన్ని కోరుకునే వారితో మరియు “వాటిని ఎక్కడ కనుగొనాలో తెలియని”5 వారితో సువార్త యొక్క మంచి సమాచారాన్ని మనం పంచుకుంటాము. తెరకు ఇరువైపులా నిత్యత్వము కొరకు కుటుంబాలను ఐక్యం చేయడానికి మనం పనిచేస్తాము. ప్రభువు యొక్క మందిరంలో నిబంధనలు చేసిన వారి కొరకు అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ వివరించినట్లుగా, “ప్రతీ వయోజన దేవాలయ ఉపకారి యాజకత్వము యొక్క పరిశుద్ధ వస్త్రాన్ని ధరిస్తాడు … ఉన్నతమైన మరియు పరిశుద్ధమైన విధాములో ప్రతీరోజు నిబంధన బాటపై నడవాలని … [అది] మనకు గుర్తుచేస్తుంది.”6 ఈ చర్యలు అప్పుడప్పుడు కేవలం ఆర్భాటానికి చేసేవి కాదు, కానీ అవి మన అనుదిన సంతోషానికి—మన నిత్య ఆనందానికి ఆవశ్యకమైనవి.

మన నిత్య పురోభివృద్ధికి దేవునితో మన నిబంధనలను పాటించడం కంటే ఎక్కువ ముఖ్యమైనదేదీ లేదు. మన దేవాలయ నిబంధనలు అమలులో ఉన్నప్పుడు, తెరకు అవతలివైపునున్న మన ప్రియమైన వారితో ఆనందకరమైన పునఃకలయికలో మనం నమ్మకముంచగలము. మర్త్యత్వాన్ని విడిచిన ఆ బిడ్డ లేదా తల్లిదండ్రులు లేదా భార్య లేదా భర్త శాశ్వతంగా మిమ్మల్ని కలిపి బంధించే నిబంధనలకు మీరు యధార్థంగా ఉంటారని తన పూర్ణ హృదయంతో ఆశిస్తున్నారు. దేవునితో మన నిబంధనలను మనం నిర్లక్ష్యం చేసినా లేదా తేలికగా తీసుకున్నా, ఆ నిత్య బంధాలను మనం ప్రమాదంలో పెట్టినట్లే. పశ్చాత్తాపపడడానికి, బాగుచేసుకోవడానికి, మరలా ప్రయత్నించడానికి సమయం ఇదే.

క్షణికానందం కోసం నిత్యానందం యొక్క దీవెనలను మనం మార్పిడి చేసినట్లయితే, సంతోషమనేది బూటకమవుతుంది. మన వయస్సు ఏదైనప్పటికీ, అదే ఖచ్చితమైన సత్యము: యేసు క్రీస్తు యొక్క సువార్తను జీవించడం మరియు మన నిబంధనలను పాటించడం శాశ్వతమైన సంతోషానికి కీలకమైనది. “మన అంతిమ భద్రత మరియు మన శాశ్వత సంతోషం అనేది యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త అనే ఇనుపదండాన్ని దాని నిబంధనలు మరియు విధులతో పూర్తిగా గట్టిగా పట్టుకోవడంలోనే ఉంటుందని మన ప్రవక్తయైన అధ్యక్షులు నెల్సన్ దృఢంగా చెప్పారు. ఆవిధంగా మనం చేసినప్పుడు, ఎన్ని కష్టాలు ఎదురైనా ఆత్మీయంగా మనం బలంగా నిలిచియుండగలము, ఎందుకంటే దేవుని శక్తి మనకు అందుబాటులో ఉన్నది.”7

మనలో చాలామంది కష్టాలను అనుభవిస్తున్నారు. అపవాది యొక్క అలల చేత మనం కొట్టుకొనిపోబడినప్పుడు మరియు కొన్నిసార్లు ఆ కష్టాలలో వచ్చే కన్నీళ్ళ ప్రవాహంచేత అంధులుగా చేయబడినప్పుడు, మన జీవితనావను ఏ దిశలో నడిపించాలో మనకు తెలియకపోవచ్చు. ఒడ్డుకు చేరుకొనే బలం ఉందని కూడా మనకు అనిపించకపోవచ్చు. మీరు ఎవరు—దేవుని యొక్క ప్రియమైన బిడ్డయని—మీరు ఎందుకు భూమిపై ఉన్నారు అనేదానిని మరియు దేవునితో, మీ ప్రియమైన వారితో జీవించాలనే మీ లక్ష్యాన్ని గుర్తుపెట్టుకోవడం మీ దృష్టిని స్పష్టం చేయగలదు మరియు మిమ్మల్ని సరైన దిశలో నడిపించగలదు. తుఫాను మధ్యలో కూడా మనకు మార్గం చూపడానికి ప్రకాశవంతమైన వెలుగు ఉంది. “చీకటియందు ప్రకాశించు వెలుగును నేనే,”8 అని యేసు ప్రకటించారు. మనం ఆయన వెలుగు వైపు చూసి, మన నిబంధనల పట్ల నిజాయితీగా ఉన్నప్పుడు, మనకు రక్షణ అభయమివ్వబడింది.

పలురకాల పరిస్థితులలో జీవిస్తూ, తమ నిబంధనలను పాటిస్తున్న అన్ని వయస్సుల స్త్రీలను కలుసుకోవడాన్ని విశేషావకాశంగా నేను భావిస్తున్నాను. ప్రతీరోజు, వారు నడిపింపు కొరకు జనాదరణ పొందిన మీడియా వైపు చూడడానికి బదులుగా ప్రభువు వైపు, ఆయన ప్రవక్త వైపు చూస్తారు. వారి వ్యక్తిగత సవాళ్ళు మరియు వారి నిబంధనలను పాటించకుండా అడ్డుపడేందుకు ప్రయత్నించే లోకపు హానికరమైన తత్వాలు ఉన్నప్పటికీ, వారు నిబంధన బాటపై ఉండాలని నిశ్చయించుకున్నారు. “తండ్రి కలిగినదంతయు”9 అనే వాగ్దానంపై వారు ఆధారపడతారు. మీ వయస్సు ఏదైనప్పటికీ, దేవునితో నిబంధనలు చేసిన స్త్రీలైన మీలో ప్రతీఒక్కరు ప్రభువు యొక్క దీపమును పైకెత్తడానికి మరియు ఇతరులను ఆయన వద్దకు నడిపించడానికి సామర్థ్యాన్ని కలిగియున్నారు.10 మీ నిబంధనలను పాటించడం ద్వారా, ఆయన మిమ్మల్ని తన యాజకత్వ శక్తితో దీవిస్తారు మరియు మీరు కలుసుకొనే వారందరి పైన మీరు లోతైన ప్రభావాన్ని కలిగియుండేలా చేస్తారు. అధ్యక్షులు నెల్సన్ ప్రకటించినట్లుగా, ముందుగా చెప్పబడిన ప్రవచనాలను నెరవేర్చే యువతులు మీరే!11

ప్రియమైన సహోదరీలారా, అన్నిటిని మించి, యేసు క్రీస్తు వైపు వెళ్ళే నిబంధన బాటపై నిలవండి! ప్రపంచమంతటా అనేక దేవాలయాలున్న ఈ సమయంలో భూమిపైకి రావడానికి మనం దీవించబడ్డాము. దేవాలయ నిబంధనలను చేసి, పాటించడమనేది యోగ్యుడైన ప్రతీ సంఘ సభ్యునికి లభ్యమవుతుంది. యుక్తవయస్కులారా, ఆ పవిత్ర నిబంధనలను చేయడానికి పెళ్ళి లేదా సువార్తసేవ చేసే వరకు మీరు ఆగనవసరం లేదు. మీరు సిద్ధంగా ఉండి, ఆ దేవాలయ నిబంధనలను గౌరవించాలనే కోరకను భావించినప్పుడు, 18 ఏళ్ళ వయస్సుకు వచ్చిన తర్వాత వెంటనే దేవాలయ నిబంధనలు ఇచ్చే రక్షణను, బలాన్ని పొందడానికి యువతిగా మీరు సిద్ధపడగలరు.12 ఇదివరకే దేవాలయ దీవెనలు పొందిన మీరు, విరోధులు లేదా పరధ్యానాలు ఈ నిత్య సత్యాల నుండి మిమ్మల్ని దూరం చేయనివ్వకండి. మీరు చేసిన నిబంధనల యొక్క పవిత్రమైన ప్రాముఖ్యతను బాగా అర్థం చేసుకోవడానికి నమ్మకమైన మూలాధారాలను అడగండి మరియు అధ్యయనం చేయండి. వీలైనంత తరచుగా దేవాలయానికి వెళ్ళండి మరియు ఆత్మను వినండి. మీరు ప్రభువు మార్గములో ఉన్నారనే మధురమైన అభయాన్ని మీరు భావిస్తారు. కొనసాగడానికి, అలాగే మీతోపాటు ఇతరులను తీసుకురావడానికి మీరు ధైర్యాన్ని కనుగొంటారు.

పరలోక తండ్రితో నిబంధనలు చేయడానికి మనం ఎంచుకున్నప్పుడు మరియు వాటిని పాటించడానికి రక్షకుని శక్తిని పొందినప్పుడు, మనం ఈ జీవితంలో ఇప్పుడు ఊహించగల దానికంటే ఎక్కువగా మరియు రాబోయే మహిమకరమైన నిత్య జీవితంలో సంతోషంతో దీవించబడతామని నేను సాక్ష్యమిస్తున్నాను.13 యేసు క్రీస్తు నామములో, ఆమేన్.