2010–2019
ఆత్మీయ నిధులు
2019 అక్టోబర్ సర్వసభ్య సమావేశము


ఆత్మీయ నిధులు

ప్రభువునందు మరియు ఆయన యాజకత్వ శక్తియందు విశ్వాసమును మీరు సాధన చేసినప్పుడు, ప్రభువు మీ కొరకు అందుబాటులో ఉంచిన ఈ ఆత్మీయ నిధిని చేరుకొను మీ సామర్థ్యము పెరుగుతుంది.

ఆ మనోహరమైన సంగీతము కొరకు మీకు ధన్యవాదాలు, మనమందరం నిలబడి మధ్యంతర కీర్తన, “ఓ దేవా, ఒక ప్రవక్త కొరకు మా కృతజ్ఞతలు,” పాడినప్పుడు నాకు రెండు ప్రబలమైన ఆలోచనలు కలిగాయి. ఒకటి ప్రవక్త జోసెఫ్ స్మిత్‌ను గూర్చి, ఈ యుగము యొక్క ప్రవక్త. గడిచే ప్రతీరోజు అతడి కొరకు నా ప్రేమ మరియు ప్రశంస ఎక్కువవుతుంది. నా భార్య, నా కుమార్తైలు, మనుమరాళ్లు, మరియు ముని-మనుమరాళ్ల వైపు నేను చూసినప్పుడు, రెండవ ఆలోచన కలిగింది. నా కుటుంబములో భాగముగా మీలో ప్రతీఒక్కరిని హక్కుగా పొందాలని నేను కోరుతున్నట్లు భావించాను.

అనేక నెలల క్రితం, దేవాలయ వరమిచ్చు కార్యక్రమము ముగింపుయందు, నేను నా భార్యతో ఇలా చెప్పాను, “దేవాలయములో వారికి సొంతమైన ఆత్మీయ నిధుల గురించి ఆ సహోదరీలు అర్థము చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను.” సహోదరిలారా, రెండు నెలల క్రితం వెండీ మరియు నేను హార్మొనీ, పెన్సిల్వేనియాను దర్శించిన దానితో కలిపి నేను తరచుగా మీ గురించి ఆలోచిస్తూ ఉంటాను.

చిత్రం
అహరోను యాజకత్వము యొక్క పునఃస్థాపన

అక్కడకు ఇది మా రెండవ పర్యటన. రెండు సార్లు కూడా ఆ పరిశుద్ధ స్థలములో మేము నడిచినప్పుడు మేము భావోద్రేకము చెందాము. ఈ హోర్మొనీకి దగ్గరలో బాప్తీస్మమిచ్చు యోహాను జోసెఫ్ స్మిత్‌కు ప్రత్యక్షమై అహరోను యాజకత్వమును పునఃస్థాపించెను.

చిత్రం
మెల్కీసెదకు యాజకత్వము యొక్క పునఃస్థాపన

ఇక్కడే అపొస్తలులైన పేతురు, యాకోబు, మరియు యోహానులు ప్రత్యక్షమై మెల్కీసెదెకు యాజకత్వమును పునఃస్థాపించెను.

ఈ హార్మొనీలోనే ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ మోర్మన్ గ్రంథమును అనువదించుచుండగా ఎమ్మా హేల్ స్మిత్ తన భర్తకు మొదటి లేఖకురాలిగా సహాయపడింది.

ఈ హార్మొనీలోనే ఎమ్మా గురించి ప్రభువు చిత్తాన్ని ప్రత్యక్షపరచుచు ఇవ్వబడిన బయల్పాటును కూడా జోసెఫ్ పొందెను. లేఖనములను వివరించాలని, సంఘమునకు ఉద్భోధించాలని, పరిశుద్ధాత్మను పొందాలని, మరియు తన సమయాన్ని “ఎక్కువ నేర్చుకోవటానికి” గడపాలని ప్రభువు ఎమ్మాకు సూచించెను. “ఈ లోకసంబంధమైన విషయములను ప్రక్కన పెట్టి, ఉత్తమమైన సంగతులను వెదకవలెనని” మరియు దేవునితో ఆమె నిబంధనలకు కట్టుబడి ఉండాలని కూడా ఎమ్మా ఉపదేశించబడింది. ప్రభువు తన సూచనను ఈ బలమైన మాటలతో ముగించెను: “అందరికి ఇది నా స్వరమైయున్నది.”1

ఈ ప్రాంతములో జరిగిన ప్రతీ విషయము మీ జీవితాలలో లోతైన అంతర్భావములను కలిగియున్నది ఎమ్మాకు ప్రభువు ఇచ్చిన ఉపదేశముతో పాటు, యాజకత్వము యొక్క పునఃస్థాపన మీలో ప్రతి ఒక్కరిని నడిపించి, దీవించగలదు. యాజకత్వము యొక్క పునఃస్థాపన ఏ పురుషునికైనా ఎంత సందర్భోచితమైనదో, ఒక స్త్రీగా మీకు కూడా అంతే సందర్భోచితమైనదని మీరు గ్రహించాలని నేను ఎంతగా ఆపేక్షిస్తున్నాను. మెల్కీసెదెకు యాజకత్వము పునఃస్థాపించబడెను గనుక, నిబంధన-గైకొను స్త్రీలు మరియు పురుషులు ఇరువురు “సంఘములో ఉన్న ఆత్మీయ దీవెనలన్నింటిని”2 అందుకోగలరని లేదా, ప్రభువు తన పిల్లల కొరకు కలిగియున్న ఆత్మీయ నిధులు పొందగలరని మనం చెప్పవచ్చును.

దేవునితో నిబంధనలు చేసి, ఆ నిబంధనలను గైకొను ప్రతీ స్త్రీ, ప్రతీ పురుషుడు మరియు యాజకత్వ విధులలో యోగ్యతతో పాల్గొనువారు దేవుని యొక్క శక్తిని ప్రత్యక్షముగా అందుకోగలరు. ప్రభువు మందిరములో వరమును పొందిన వారు వారి నిబంధన యొక్క సుగుణము వలన దేవుని యాజకత్వ శక్తి యొక్క వరమును మరియు ఆ శక్తిని ఏవిధంగా పొందాలో తెలుసుకొనే జ్ఞానము యొక్క వరమును పొందుతారు.

యాజకత్వమును కలిగియున్న పురుషుల వలె వారి యాజకత్వ నిబంధనలనుండి ప్రవహించు దేవుని శక్తితో వరమివ్వబడిన స్త్రీలకు కూడా ఆ దీవెనలు అందుబాటులో ఉంటాయి. ఆ సత్యము మీలో ప్రతీ ఒక్కరి హృదయాలలో వ్రాయబడాలని నేను ప్రార్థిస్తున్నాను ఎందుకంటే అది మీ జీవితాన్ని మార్చుతుందని నేను ప్రార్ధిస్తున్నాను. సహోదరిలారా, మీ కుటుంబానికి మరియు మీరు ప్రేమించే ఇతరులకు సహాయము చేయుటకు రక్షకుని శక్తిని ధారాళముగా అందుకొనే హక్కును మీరు కలిగియున్నారు.

ఇప్పుడు, “ఇది వినుటకు చాలా అద్భుతంగా ఉంది, కాని దీనిని నేను ఎలా చెయ్యగలను? అని మీలో మీరు అనుకోవచ్చు. నా జీవితంలో రక్షకుని శక్తిని నేనేవిధంగా అందుకోగలను?”

ఈ విధానమును మీరు ఏ చేతిపుస్తకములో వివరంగా కనుగొనలేరు. మీరు దేనిని తెలుసుకొని, దేనిని చేయాలని రక్షకుడు కోరుచున్నారో మీరు అర్థము చేసుకొనుటకు ప్రయత్నించినప్పుడు పరిశుద్ధాత్మ మీ వ్యక్తిగత శిక్షకునిగా ఉండును. ఈ విధానము త్వరితమైనది కాదు, సులభమైనది కాదు, కాని అది ఆత్మీయంగా ఉత్తేజాన్ని కలిగించేది. యాజకత్వ శక్తిని—దేవుని శక్తిని అర్థము చేసుకొనుటకు ఆత్మతో కలిసి పనిచేయడం కంటే ఎక్కువ ఉత్సాహాన్ని ఇచ్చేది ఇంకేమి ఉండగలదు?

మీ జీవితములో దేవుని యొక్క శక్తిని అందుకొనుటకు ప్రభువు ఎమ్మాకు మరియు మీలో ప్రతి ఒక్కరికి చేయమని చెప్పిన సంగతులే మీకు కూడా అవసరమవుతాయని నేను మీతో చెప్పగలను.

కాబట్టి, సిద్ధాంతము మరియు నిబంధనలు 25వ ప్రకరణమును ప్రార్థనాపూర్వకముగా అధ్యాయనం చేయమని, పరిశుద్ధాత్మ మీకు ఏమి బోధిస్తుందో కనుగొనమని నేను మిమ్ములను ఆహ్వానిస్తున్నాను. మీకు వరముగా ఇవ్వబడిన ఆ శక్తిని పొంది, అర్థము చేసుకొని, ఉపయోగించినప్పుడు, మీ వ్యక్తిగత ఆత్మీయ ప్రయత్నము మీకు సంతోషాన్ని కలిగిస్తుంది.

ఈ ప్రయత్నములో భాగంగా ఈ లోకసంబంధమైన అనేక సంగతులు మీరు ప్రక్కన పెట్టవలసిన అవసరం ఉంటుంది. కొన్నిసార్లు మనం ఈ లోకము దాని కలహమునుండి, విస్తృతమైన శోధనలు మరియు అసత్య సిద్ధాంతముల నుండి దూరంగా వెళ్ళుట గురించి దాదాపు చాలా తేలికగా మాట్లాడతాము. కాని నిజంగా అలా చేయటానికి మీ జీవితాన్ని ఖచ్ఛితత్వముతో మరియు క్రమముగా మీరు పరీక్షించుకొనుట అవసరము. ఆవిధంగా మీరు చేసినట్లైతే, ఏది మీకు ఇక ఎంతమాత్రము అవసరము లేదో, దేనికి మీ సమయము, బలముకు యోగ్యము కాదో దాని గురించి పరిశుద్ధాత్మ మిమ్మల్ని ప్రేరేపించును.

ఈ లోకసంబంధమైన అంతరాయముల నుండి మీ దృష్టిని మళ్లించినప్పుడు, ఇప్పుడు మీకు ముఖ్యమైనవిగా అనిపించే కొన్ని విషయాలు ప్రాధాన్యత పరంగా క్షీణిస్తాయి. అవి హానికరంగా కనిపించనప్పటికి, కొన్నిటిని చేయటానికి మీరు కాదని చెప్పాల్సినవసరమున్నది . ప్రభువుకు మీ జీవితాన్ని సమర్పించు ఈ జీవితకాల ప్రక్రియను మీరు ప్రారంభించి, కొనసాగించినప్పుడు, మీ దృష్టికోణములో, భావాలలో, ఆత్మీయ బలంలో మార్పులు మీకు ఆశ్చర్యము కలిగిస్తాయి!

ఇప్పుడు ఒక చిన్న హెచ్చరిక మాట. దేవుని యొక్క శక్తిని అడుగుటకు మీకున్న సామర్థ్యమును తక్కువ అంచనా వేసేవారు ఉండవచ్చు. మరికొందరు, మిమ్ములను మీరు అనుమానించి, ఒక నీతిగల స్త్రీగా మీకున్న అమోఘమైన ఆత్మీయ సామర్థ్యమును తగ్గించుకొనేలా చేయవచ్చు.

మరి నిశ్చయముగా, అపవాది మీరు బాప్తీస్మము వద్ద చేసిన నిబంధనను లేదా మీరు దేవాలయములో—ప్రభువు యొక్క మందిరములో పొందిన లేదా పొందబోవు జ్ఞానము మరియు శక్తి యొక్క గొప్ప వరమును అర్థము చేసుకొనకూడదని కోరుచున్నాడు. మరియు ప్రతిసారి దేవాలయములో మీరు యోగ్యముగా సేవచేసి, ఆరాధించినప్పుడు మీరు దేవుని శక్తిని ధరించి, ఆయన దూతలు “మీపైన అధికారము” కలిగియుండి అక్కడినుండి వెళ్తారని మీరు అర్థము చేసుకొనకూడదని సాతాను నిశ్చయముగా కోరుచున్నాడు.3

మీరు దీవించబడియున్న లేదా దీవించబడగల ఆత్మ వరాలను మీరు అర్థము చేసుకోకుండా ఉండుటకు సాతాను, అతని సైన్యము నిరంతరము మీకు ఆటంకాలను కలిగిస్తారు. దురదృష్టవశాత్తు, కొన్ని ఆటంకాలు ఇంకొక వ్యక్తి యొక్క దుష్‌ప్రవర్తన ఫలితంగా కావచ్చు. మీలో ఎవరైనా నెట్టివేయబడినట్లు భావించినా లేక ఒక యాజకత్వ నాయకుని చేత నమ్మబడకుండా లేదా ఒక భర్త, తండ్రి లేదా స్నేహితునిగా భ్రమపడిన వ్యక్తి చేత దూషించబడి లేక మోగించబడ్డారనే ఆలోచన నాకు దుఃఖాన్ని కలిగిస్తుంది. మీలో ఎవరైనా విస్మరించబడ్డారు, అగౌరవపరచబడ్డారు, లేదా తప్పుగా విమర్శించబడ్డారని భావిస్తే నేను చాలా తీవ్రమైన వేదనను అనుభవిస్తాను. దేవుని రాజ్యములో అటువంటి అపరాధములకు చోటు లేదు.

విరుద్ధముగా, వార్డు మరియు స్టేకు సలహాసభలలో స్త్రీల భాగస్వామ్యమును ఆతృతతో వెదకు యాజకత్వ నాయకుల గురించి నేను తెలుసుకొన్నప్పుడు అది నాకు అత్యుత్సాహమును కలిగిస్తుంది. ఎవరైతే తన అతి ముఖ్యమైన యాజకత్వ బాధ్యత తన భార్యను సంరక్షించడం అని రుజువుచేస్తారో ఆ ప్రతి ఒక్క భర్త వలన నేను ప్రేరేపించబడతాను.4 తన భార్య యొక్క బయల్పాటును పొందే సామర్థ్యమును లోతుగా గౌరవించి, వారి వివాహములో సమానమైన భాగస్వామిగా ఆమెకు విలువిచ్చు వ్యక్తిని నేను కొనియాడతాను.

నీతి కలిగి, సువార్త జ్ఞానమును వెదకి, వరమును పొందిన కడవరి-దిన పరిశుద్ధ స్త్రీ యొక్క ఘనత మరియు శక్తిని ఒక పురుషుడు అర్థము చేసుకున్నప్పుడు, ఆమె గదిలో ప్రవేశిస్తున్నప్పుడు, లేచి నిలబడాలని అతడు భావించడంలో ఆశ్చర్యమేమైనా ఉంటుందా?

కాలము ఆరంభము నుండి, స్త్రీలు విశిష్టమైన నీతి దిక్సూచి—అనగా మంచి చెడులను గుర్తించగలుగు సామర్థ్యముతో దీవించబడ్డారు. నిబంధనలు చేసి, పాటించువారిలో ఈ వరము హెచ్చించబడుతుంది. ఎవరైతే దేవుని ఆజ్ఞలను ఇష్టపూర్వముగా నిర్లక్ష్యము చేస్తారో వారిలో అది తగ్గిపోతుంది.

పురుషులు మంచి, చెడులను గుర్తించుటకు దేవుని యొక్క అర్హత నుండి వారిని ఏవిధంగాను నేను మినహాయించడం లేదని చెప్పుటకు నేను త్వరపడుచున్నాను. కాని నా ప్రియమైన సహోదరిలారా, మర్త్యత్వము యొక్క సమాజపు సంరక్షులుగా ఉండి, సత్యము నుండి అసత్యమును వివేచించు మీ సామర్థ్యము ఈ కడవరి దినాలలో చాలా కీలకమైనది. ఆవిధంగా చెయ్యమని ఇతరులకు బోధించుటకు మేము మీపైన ఆధారపడియున్నాము. దీని గురించి నన్ను చాలా స్పష్టంగా చెప్పనివ్వండి: ఈ లోకము దానియొక్క స్త్రీల నైతిక ధర్మమును కోల్పోయినట్లైతే, ఈ లోకము ఎప్పటికీ కోలుకోదు.

కడవరి-దిన పరిశుద్ధులమైన మనము ఈ లోకసంబంధులము కాదు; మనము ఇశ్రాయేలు నిబంధనకు చెందినవారము. ప్రభువు యొక్క రెండవ రాకడకు జనులను సిద్ధపరచుటకు మనము పిలవబడ్డాము.

స్త్రీలు మరియు యాజకత్వమునకు సంబంధించిన కొన్ని అదనపు అంశాలను గూర్చి నేను ఇప్పుడు వివరిస్తాను. యాజకత్వపు తాళపుచెవులు కలిగియున్న ఒకరు—అనగా మీ బిషప్పు లేదా స్టేకు అధ్యక్షులు—మొదలైన వారి దర్శకత్వములో ఒక పిలుపులో సేవ చేయుటకు మీరు ప్రత్యేకపరచబడినప్పుడు ఆ పిలుపులో పనిచేయుటకు మీకు యాజకత్వ అధికారము ఇవ్వబడింది.

అదేవిధంగా, పరిశుద్ధ దేవాలయములో మీరు హాజరైన ప్రతిసారి, యాజకత్వపు విధులు చేయుటకు, నిర్వహించుటకు మీకు అధికారము ఇవ్వబడును. మీ దేవాలయ వరము ఆవిధంగా చేయడానికి మిమ్మల్ని సిద్ధపరుస్తుంది.

మీరు వరమును పొందియుండి, యాజకత్వమును కలిగియున్న పురుషునితో మీకు వివాహము కానట్లైతే, మరియు ఎవరైనా “క్షమించండి, మీ ఇంటిలో యాజకత్వము లేదు,” అని మీతో చెప్పినట్లైతే, ఆ వ్యాఖ్యానము సరైనది కాదని దయచేసి గ్రహించాము. మీ గృహములో యాజకత్వము కలిగిన వారు లేకపోవచ్చును, కాని ఆయన దేవాలయములో దేవునితో మీరు పరిశుద్ధ నిబంధనలు పొందియున్నారు మరియు చేసారు. ఆ నిబంధనల నుండి మీపైన ఆయన యాజకత్వ శక్తి యొక్క వరము ప్రవహిస్తుంది. మరియు గుర్తుంచుకోండి, మీ భర్త చనిపోయినట్లైతే, మీ గృహములో మీరు అధ్యక్షత్వము వహిస్తారు.

నీతిగల, వరము పొందిన కడవరి-దిన పరిశుద్ధ స్త్రీగా, దేవుని నుండి శక్తి మరియు అధికారముతో మీరు మాట్లాడతారు, బోధిస్తారు. ప్రోత్సాహము ద్వారా లేదా సంభాషణ ద్వారా కాని, క్రీస్తు యొక్క సిద్ధాంతమును బోధించుటకు మీ స్వరము మాకు అవసరము. కుటుంబము, వార్డు, స్టేకు సలహాసభలలో మీ అభిప్రాయాలు మాకు అవసరము. మీ భాగస్వామ్యము ముఖ్యమైనది మరియు అది అలంకారప్రాయముగా ఎన్నడూ ఉండదు.

నా ప్రియమైన సహోదరిలారా, మీరు ఇతరులకు సేవ చేసినప్పుడు మీ శక్తి పెరుగుతుంది. మీ ప్రార్థనలు, ఉపవాసము, లేఖనములందు సమయము, దేవాలయములో, మరియు కుటుంబ చరిత్ర కార్యములో మీ సేవ మీకు పరలోకములను తెరచును.

యాజకత్వపు శక్తి గురించి మీరు కనుగొనగల సత్యములన్నింటిని ప్రార్థనాపూర్వకముగా అధ్యయనం చేయాలని నేను మిమ్మల్ని ప్రోత్సాహిస్తున్నాను. సిద్ధాంతము మరియు నిబంధనలు 84 మరియు 107 ప్రకరణలతో మీరు మొదలుపెట్టవచ్చును. ఈ ప్రకరణములు ఇతర వచనాలకు మిమ్ములను నడిపించవచ్చును. లేఖనాలు మరియు ఆధునిక ప్రవక్తలు, దీర్ఘదర్శులు, బయల్పాటుదారుల చేత బోధనలు ఈ సత్యములతో నిండియున్నవి. మీ అవగాహన పెరిగినప్పుడు, ప్రభువునందు మరియు ఆయన యాజకత్వ శక్తియందు విశ్వాసమును సాధన చేసినప్పుడు, ప్రభువు అందుబాటులో ఉంచిన ఈ ఆత్మీయ నిధిని చేరుకొను మీ సామర్థ్యము పెరుగుతుంది. ఆవిధంగా మీరు చేసినప్పుడు, ఐక్యమత్యముతో, ప్రభువు యొక్క దేవాలయములో బంధించబడి, మన పరలోక తండ్రి కొరకు మరియు యేసు క్రీస్తు కొరకు ప్రేమతో నిండియున్న నిత్య కుటుంబాలను సృష్టించుటకు ఉత్తమముగా సహాయపడుచున్నట్లు మీకైమీరు కనుగొంటారు.

ఒకరికొకరం పరిచర్య చేసుకొనుటకు, సువార్త చాటించుటకు, పరిశుద్ధులను పరిపూర్ణముగా చేయుటకు, మృతులను విమోచించుటకు చేయు మన ప్రయత్నాలన్నీ పరిశుద్ధ దేవాలయములో కలుస్తాయి. ఇప్పుడు మనం ప్రపంచమంతటా 166 దేవాలయాలను కలిగియున్నాము మరియు ఇంకా నిర్మించబడతాయి.

మీకు తెలిసినట్లుగా, ఈ సంవత్సరము ముగింపులో ప్రారంభమయ్యే ప్రాజెక్టులో సాల్ట్ లేక్ దేవాలయము, టెంపుల్ స్క్వేర్, దాని ప్రక్కన సంఘ కార్యాలయ భవంతి దగ్గర ఉన్న ప్లాజా నవీకరించబడతాయి. ఈ తరములో మనల్ని ప్రేరేపించినట్లే భావి తరాలను ప్రేరేపించుటకు, పరిశుద్ధ దేవాలయము పరిరక్షించబడాలి మరియు సిద్ధపరచబడాలి.

సంఘము అభివృద్ధి చెందినప్పుడు, దీవెనలన్నింటిలో కెల్లా గొప్ప దీవెనయైన నిత్య జీవమును ఎక్కువ కుటుంబాలు చేరుటకు మరిన్ని దేవాలయాలు నిర్మించబడతాయి.5 దేవాలయమును సంఘములో అత్యంత పరిశుద్ధమైన కట్టడముగా మనం భావిస్తాము. ఒక క్రొత్త దేవాలయము కట్టుటకు చేసిన ప్రణాళికలు ప్రకటించబడినప్పుడు, అది మన చరిత్రలో ఒక ముఖ్యమైన భాగమౌతుంది. నేటి రాత్రి ఇక్కడ మనం చర్చించినట్లుగా, దేవాలయ కార్యమునకు సహోదరిలైన మీరు చాలా ముఖ్యమైనవారు మరియు దేవాలయము అనేది మీ ఆత్మీయ నిధులలో మిక్కిలి ఉన్నతమైన వాటిని మీరు పొందే స్థలము.

ఎనిమిది క్రొత్త దేవాలయములను నిర్మించుటకు ప్రణాళికలను నేను ఇప్పుడు ప్రకటించినప్పుడు దయచేసి జాగ్రత్తగా, భక్తిగా వినండి. ప్రకటించబడిన ఒక స్థలము మీకు అర్ధవంతమైనది అయితే, మీరు మీ హృదయములో కృతజ్ఞతతో ప్రార్ధనాపూర్వకంగా మీ తలను మాత్రమే వంచమని నేను సూచిస్తున్నాను. క్రింది ప్రదేశాలలో దేవాలయములను నిర్మించుటకు ప్రణాళికలను ప్రకటించుటకు మేము సంతోషిస్తున్నాము: ఫ్రీటౌన్, సీయోర్రా లీయోని; ఓరేమ్, యూటా; పోర్ట్ మోర్స్‌బై, పాపౌ న్యూ గినియా; బెంటోన్‌విల్లి, ఆర్కన్‌సాస్; బాకోల్డ్, ఫిలిప్ఫైన్స్; మాక్లెన్, టెక్సాస్; కొబాన్, గౌటమాలా; మరియు టేలర్‌విల్లి, యూటా. ప్రియమైన సహోదరిలారా, మీకు ధన్యవాదాలు. ఈ ప్రణాళికలను మీరు అందుకొనుట మరియు మీ భక్తిగల స్పందనను మేము లోతుగా ప్రశంసిస్తున్నాము.

ఇప్పుడు, ముగింపులో, మీరు వరమివ్వబడిన యాజకత్వ శక్తిని అర్థము చేసుకొనులాగున, ప్రభువునందు మరియు ఆయన శక్తియందు మీ విశ్వాసాన్ని సాధన చేయుట ద్వారా ఆ శక్తిని హెచ్చించునట్లు మీ పైన ఒక దీవెన విడిచిపెట్టాలని కోరుచున్నాను.

ప్రియమైన సహోదరిలారా, మిక్కిలి గౌరవము, కృతజ్ఞతతో మీకొరకు నా ప్రేమను వ్యక్తపరుస్తున్నాను. దేవుడు జీవిస్తున్నాడని, నేను సవినయముగా ప్రకటిస్తున్నాను! యేసే క్రీస్తు. ఇది ఆయన సంఘము. ఆవిధంగా నేను యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.