లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 107


107వ ప్రకరణము

సుమారు 1835 ఏప్రిల్‌లో కర్ట్‌లాండ్, ఒహైయోలో యాజకత్వమును గూర్చి ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. ఈ ప్రకరణము 1835లో నమోదు చేయబడినప్పటికీ, జోసెఫ్ స్మిత్ ద్వారా 1831, నవంబరు 11న ఇవ్వబడిన బయల్పాటును 60 నుండి 100వ వచనాలలో చాలావరకు వాటిలో మిళితము చేసెనని చారిత్రాత్మక గ్రంథాలు ధృఢపరచుచున్నవి. ఈ ప్రకరణము 1835 ఫిబ్రవరి మరియు మార్చిలో పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క ఏర్పాటుతో సహసంబంధమును కలిగియున్నది. 1835, మే 3న తమ సమూహ సువార్త పరిచర్యకు బయలుదేరుటకు సిద్ధపడుచున్నవారి సమక్షంలో ప్రవక్త దీనిని ఇచ్చియుండవచ్చును.

1–6, రెండు యాజకత్వములు కలవు: మెల్కీసెదెకు మరియు అహరోను; 7–12, మెల్కీసెదెకు యాజకత్వము కలిగియున్నవారు సంఘములోనున్న అన్ని స్థానములలో బాధ్యతలు నిర్వహించుటకు అధికారము కలిగియున్నారు; 13–17, బిషప్రిక్కు, అహరోను యాజకత్వముపైన అధ్యక్షత్వము వహించును, అది బాహ్య విధులను నిర్వహించును; 18–20, మెల్కీసెదెకు అధికారము సమస్త ఆత్మీయ దీవెనల తాళపుచెవులను కలిగియున్నది; అహరోను యాజకత్వము దేవదూతల పరిచర్య యొక్క తాళపుచెవులను కలిగియున్నది; 21–38, ప్రథమ అధ్యక్షత్వము, పన్నెండుమంది, డెబ్బదులు కలిసి అధ్యక్షత్వము వహించు సమూహములుగా ఏర్పడెదరు, వారి నిర్ణయాలు ఐక్యతతో నీతియందు చేయబడవలెను; 39–52, ఆదాము నుండి నోవహు వరకు గోత్రజనక క్రమము ఏర్పరచబడినది; 53–57, ప్రాచీన పరిశుద్ధులు ఆడమ్-ఓన్డై-అహ్‌మన్‌లో కూడుకొనిరి, ప్రభువు వారికి కనిపించెను; 58–67, సంఘ అధికారులను పన్నెండుమంది క్రమపరచవలసియున్నది; 68–76, బిషప్పులు ఇశ్రాయేలీయుల సాధారణ న్యాయాధిపతులుగానుందురు; 77–84, ప్రథమ అధ్యక్షత్వము పన్నెండుమంది కలిసి సంఘములో సర్వోన్నత న్యాయస్థానముగా ఏర్పడెదరు; 85–100, యాజకత్వ అధ్యక్షులు తమతమ సమూహములను నిర్వహించెదరు.

1 లేవీయుల యాజకత్వముతో కలిపి సంఘములో మెల్కీసెదెకు, అహరోను అను రెండు యాజకత్వములు కలవు.

2 మొదటిది మెల్కీసెదెకు యాజకత్వముగా ఎందుకు పిలువబడుననగా మెల్కీసెదెకు ఎంతో గొప్ప ప్రధాన యాజకుడు.

3 ఆయన దినములకు ముందు ఇది దేవుని కుమారుని క్రమముననుసరించిన పరిశుద్ధ యాజకత్వము అని పిలువబడెను.

4 మహోన్నతుని నామముపట్ల గౌరవము లేదా భక్తివలన, ఆయన నామము చాలా తరచుగా ఉచ్చరించబడకుండా ఉండుటకు, ప్రాచీన దినములలో ఆ సంఘము వారు ఆ యాజకత్వమును మెల్కీసెదెకు పేరిట లేదా మెల్కీసెదెకు యాజకత్వముగా పిలిచిరి.

5 సంఘములోని ఇతర అధికారులు లేదా స్థానములన్నియు ఈ యాజకత్వమునకు అనుబంధములు.

6 కానీ రెండు విభాగములు లేదా ప్రధాన భాగములు కలవు—ఒకటి మెల్కీసెదెకు యాజకత్వము, మరియొకటి అహరోను లేదా లేవీయుల యాజకత్వము.

7 పెద్దల స్థానము మెల్కీసెదెకు యాజకత్వము క్రిందకు వచ్చును.

8 మెల్కీసెదెకు యాజకత్వము అధ్యక్షత్వపు హక్కును కలిగియున్నది, ఆత్మీయ విషయములను నిర్వహించుటకు సంఘములో అన్ని స్థానములపైన, లోకము యొక్క అన్ని కాలములలోను అధికారమును, నిర్వహణను కలిగియున్నది.

9 మెల్కీసెదెకు క్రమమును బట్టి ప్రధాన యాజకత్వపు అధ్యక్షత్వమునకు సంఘములో అన్ని స్థానములందు విధులను నిర్వర్తించుటకు హక్కు కలదు.

10 మెల్కీసెదెకు యాజకత్వపు క్రమమును బట్టి ప్రధాన యాజకులకు వారున్న స్థానములో అధ్యక్షత్వపు నడిపింపులో ఆత్మీయ విషయములను నిర్వహించుటలో పెద్ద, యాజకుడు (లేవీయుల క్రమము యొక్క), బోధకుడు, పరిచారకుడు, సభ్యుని స్థానములో కూడా విధులను నిర్వర్తించుటకు హక్కు కలదు.

11 ప్రధాన యాజకుడు లేనప్పుడు అతనికి బదులు విధులను నిర్వర్తించే హక్కు పెద్దకు కలదు.

12 ప్రధాన యాజకుడు మరియు పెద్ద సంఘ నిబంధనలు, ఆజ్ఞలకు అంగీకారమగు ఆత్మీయ సంగతులను నిర్వహించవలెను; ఉన్నత అధికారులు లేనప్పుడు సంఘము యొక్క ఈ స్థానములన్నిటిలో విధులను నిర్వర్తించుటకు వారికి హక్కు కలదు.

13 రెండవ యాజకత్వము అహరోను యొక్క యాజకత్వము అని పిలువబడును, ఎందుకనగా అది అహరోను, అతని సంతానముపైన వారి తరములన్నిటిలో అనుగ్రహింపబడెను.

14 ఇది లఘు యాజకత్వముగా ఎందుకు పిలువబడెననగా ఇది ఎక్కువ లేదా మెల్కీసెదెకు యాజకత్వమునకు అనుబంధమైనది, బాహ్యవిధులను నిర్వహించుటకు అధికారము కలిగియున్నది.

15 బిషప్రిక్కు ఈ యాజకత్వము యొక్క అధ్యక్షత్వమైయుండి దాని తాళపుచెవులను లేదా అధికారమును కలిగియున్నారు.

16 అతడు అహరోను యొక్క నిజమైన వారసుడైతే తప్ప, ఈ యాజకత్వపు తాళపుచెవులను కలిగియుండుటకు ఈ స్థానమునకు ఏ మనుష్యునికి న్యాయపరమైన హక్కు లేదు.

17 కానీ మెల్కీసెదెకు యాజకత్వపు ప్రధాన యాజకునిగా తక్కువ స్థానములలో విధులు నిర్వర్తించుటకు అధికారము కలదు, అహరోను వారసులు లేనప్పుడు బిషప్పు యొక్క స్థానములో అతడు విధులు నిర్వర్తించవచ్చును, అందుకు అతడు పిలువబడి, ప్రత్యేకపరచబడి, మెల్కీసెదెకు యాజకత్వపు అధ్యక్షత్వము యొక్క హస్తనిక్షేపణము ద్వారా ఈ అధికారమునకు నియమించబడవలెను.

18 సంఘము యొక్క ఆత్మీయ దీవెనలన్నింటి యొక్క తాళపుచెవులను కలిగియుండుటయే ఉన్నత యాజకత్వము లేదా మెల్కీసెదెకు యాజకత్వము యొక్క అధికారము మరియు శక్తియైయుండి—

19 పరలోకరాజ్య మర్మములను పొందు విశేషాధికారమును కలిగియుండుటకు, వారికి పరలోకములు తెరువబడి, ప్రధాన కూడిక మరియు జ్యేష్ఠుల సంఘముతో సంభాషించుటకు, తండ్రియైన దేవుడు, నూతన నిబంధనకు మధ్యవర్తియైన యేసు క్రీస్తు సహవాసమును, సన్నిధిని ఆనందించుట కొరకైయున్నది.

20 లఘు లేదా అహరోను యాజకత్వము యొక్క అధికారము మరియు శక్తి ఏమనగా నిబంధనలకు, ఆజ్ఞలకు అంగీకారమగు దేవదూతల పరిచర్య యొక్క తాళపుచెవులను కలిగియుండుట, బాహ్యవిధులను, సువార్తాక్షరమును, పాప క్షమాపణ నిమిత్తము పశ్చాత్తాపమునకై బాప్తిస్మమును నిర్వహించుట అయ్యున్నది.

21 ఈ రెండు యాజకత్వములలో వేర్వేరు స్థానములకు నియమించబడిన వారు లేదా ఏర్పాటు చేయబడిన వారు లేదా వాటినుండి ఉద్భవించినవారు అధ్యక్షులుగా లేదా అధ్యక్షత్వము వహించు అధికారులుగా ఉండుట అవసరము.

22 మెల్కీసెదెకు యాజకత్వము నుండి పన్నెండుమంది అపొస్తలుల సమూహముచేత ఎన్నుకోబడి, సంఘము యొక్క నమ్మకము, విశ్వాసము, ప్రార్థనలచేత బలపరచబడి, ఆ స్థానమునకు నియమించబడి, ఏర్పాటు చేయబడిన ముగ్గురు అధ్యక్షత్వము వహించు ప్రధాన యాజకులు సంఘ అధ్యక్షత్వ సమూహముగా ఏర్పడెదరు.

23 పర్యటించు పన్నెండుమంది సలహాదారులు పన్నెండుమంది అపొస్తలులుగా లేదా సర్వలోకమునందు క్రీస్తు నామమునకు ప్రత్యేక సాక్షులుగా ఉండుటకు పిలువబడిరి—అందువలన వారి పిలుపు యొక్క బాధ్యతలలో సంఘములోని ఇతర అధికారుల కంటే భిన్నముగా ఉందురు.

24 ఇంతకుముందు చెప్పబడిన ముగ్గురు అధ్యక్షులు అధికారము మరియు శక్తి నందు సమానముగానుండు ఒక సమూహమును ఏర్పరచుదురు.

25 డెబ్బదిమంది కూడా సువార్తను ప్రకటించుటకు, అన్యజనులకు సర్వలోకములో ప్రత్యేక సాక్షులుగానుండుటకు పిలువబడిరి—అందువలన వారి పిలుపు యొక్క బాధ్యతలలో సంఘములోని ఇతర అధికారుల కంటే భిన్నముగా ఉందురు.

26 పన్నెండుమంది ప్రత్యేక సాక్షులు లేదా ఇప్పుడే చెప్పబడిన అపొస్తలుల అధికారముతో సమానముగానుండు ఒక సమూహమును వారు ఏర్పరచుదురు.

27 ఈ రెండు సమూహములలో ఏదైనా ఒకటి తీసుకొనే ప్రతి నిర్ణయము వాటి చేత ఏకగ్రీవముగా తీసుకోబడవలెను; అదేమనగా, అవి ఒకదానితోనొకటి తమ నిర్ణయములను అధికారికముగా లేదా క్రమబద్ధముగా చేయుటకు ప్రతి సమూహములోని ప్రతి సభ్యుడు దాని నిర్ణయమునకు సమ్మతించవలెను—

28 మరేవిధముగా ఏర్పాటు చేయుటకు పరిస్థితులు అనుకూలించనప్పుడు అధికభాగము ఒక సమూహమును ఏర్పాటు చేయవచ్చును—

29 ఇటువంటి సందర్భము కానీయెడల, వారి నిర్ణయములు పూర్వము మెల్కీసెదెకు క్రమముననుసరించి నియమించబడి నీతిగల పరిశుద్ధలైన ముగ్గురు అధ్యక్షుల సమూహము యొక్క నిర్ణయముల వలన కలుగునటువంటి దీవెనలకు అర్హమైనవికావు.

30 ఈ సమూహములు, లేదా వాటిలో ఏదో ఒకదాని యొక్క నిర్ణయములు, సమస్త నీతియందు, పరిశుద్ధతయందు, దీనమనస్సు, సాత్వికము, దీర్ఘశాంతము, విశ్వాసము, సుగుణము, తెలివి, ఆత్మనిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర దయ, దాతృత్వమునందు చేయబడవలెను;

31 ఎందుకనగా వాగ్దానము ఇదే—వారిలో ఇవి సమృద్ధిగా ఉన్నయెడల, ప్రభువు జ్ఞానములో వారు అవిశ్వాసులుగా ఉండరు.

32 ఏ సందర్భములోనైనా ఈ సమూహముల యొక్క ఏ నిర్ణయమైనా అవినీతియందు తీసుకోబడిన యెడల, అది సంఘ ఆత్మీయ అధికారులను ఏర్పరచు వేర్వేరు సమూహముల ప్రధాన కూడిక యెదుటకు తేబడును; ఈ సందర్భములో తప్ప, వారి నిర్ణయముపై ఎటువంటి ఆరోపణ ఉండకూడదు.

33 ఆ పన్నెండుమందే పర్యటించు అధ్యక్షత్వము వహించు ఉన్నత సలహామండలి—వారు సంఘ అధ్యక్షత్వము యొక్క దర్శకత్వములో పరలోక సంస్థాపనకు అంగీకారమగురీతిలో ప్రభువు నామములో విధులు నిర్వర్తించవలెను; సంఘమును నిర్మించి మొదట అన్యజనులకు, తరువాత యూదులకు అన్ని జనములలో దాని వ్యవహారములను నియంత్రించవలెను.

34 సంఘమును నిర్మించుటలో, సమస్త జనములలో మొదట అన్యజనులకు తరువాత యూదులకు దాని వ్యవహారములను నియంత్రించుటలో, పన్నెండుమంది లేదా పర్యటించు ఉన్నత సలహామండలి దర్శకత్వములో డెబ్బదిమంది ప్రభువు నామములో పనిచేయవలెను—

35 లోకములోనికి పంపబడినవారై ఆ పన్నెండుమంది, మొదట అన్యజనులకు, తరువాత యూదులకు యేసు క్రీస్తు సువార్తను ప్రకటించుట ద్వారా ద్వారములను తెరచుటకు తాళపుచెవులను కలిగియున్నారు.

36 సీయోను స్టేకులలో స్థానిక ఉన్నత సలహామండళ్ళు సంఘ వ్యవహారములలో, వారి నిర్ణయములన్నిటిలో అధ్యక్షత్వము యొక్క సమూహమునకు లేదా పర్యటించు ఉన్నత సలహామండలికి అధికారములో సమానముగానుండు ఒక సమూహమును ఏర్పరచును.

37 సీయోనులోనున్న ఉన్నత సలహామండలి సంఘ వ్యవహారములలో వారి నిర్ణయములన్నిటిలో సీయోను స్టేకులలోనున్న పన్నెండుమంది సలహామండలులకు అధికారములో సమానముగానుండు ఒక సమూహమును ఏర్పరచును.

38 సువార్తను ప్రకటించుటకు, నిర్వహించుటకు వేర్వేరు పిలుపులను భర్తీచేయుటకు వారికి సహాయము అవసరమైనప్పుడు ఇతరులకు బదులు డెబ్బదిని అడుగుట పర్యటించు ఉన్నత సలహామండలి బాధ్యతయైయున్నది.

39 సంఘము యొక్క పెద్ద శాఖలలో సువార్త పరిచర్య చేయువారిని నియమించుట పన్నెండుమంది బాధ్యతయైయున్నది, అది వారికి బయల్పాటు ద్వారా తెలుపబడును—

40 ఈ యాజకత్వక్రమము తండ్రి నుండి కుమారునికి ఇచ్చుటకు నిర్ధారింపబడినది మరియు దీవెనలు వాగ్దానం చేయబడినటువంటి ఎన్నుకోబడిన సంతానము యొక్క నిజమైన వారసులకు న్యాయముగా చెందుతుంది.

41 ఈ క్రమము ఆదాము దినములలో స్థాపించబడి, వంశక్రమము వలన ఈ విధముగా వచ్చెను:

42 ఆదాము నుండి సేతునకు—అరవై తొమ్మిదేండ్ల వయస్సులో అతడు ఆదాముచేత నియమించబడెను, అతని (ఆదాము) మరణమునకు మూడేండ్ల ముందు అతనిచేత దీవించబడెను, అతని సంతానము ప్రభువు వలన ఎన్నుకోబడిన వారిగానుండునని మరియు భూమి అంతమగు వరకు వారు సంరక్షించబడవలెనని అతని తండ్రిద్వారా దేవుని నుండి వాగ్దానమును పొందెను;

43 అతడు (సేతు) పరిపూర్ణుడు గనుక, అతని స్వరూపము పూర్తిగా అతని తండ్రి స్వరూపమువలేనుండెను, అతడు అన్ని విషయములలో అతని తండ్రివలే కనిపించెను కేవలము వయస్సును బట్టి మాత్రమే అతడు వేరుగా గుర్తింపబడెను.

44 ఎనోషు నూట ముప్పది నాలుగేండ్ల నాలుగు నెలల వయసులో ఆదాము చేతిద్వారా నియమించబడెను.

45 అతని నలుబదియవ ఏట కేయినానును అరణ్యములో దేవుడు పిలిచెను; అతడు షెడోలామాకుకు ప్రయాణించుచున్నప్పుడు ఆదామును కలిసెను. అతని నియామకమును పొందినప్పుడు అతడు ఎనుబది ఏడేండ్ల వయస్సు కలవాడు.

46 అతడు ఆదాము చేత నియమింపబడినప్పుడు మహలలీలు నాలుగు వందల తొంబది ఆరేండ్ల ఏడు దినముల వయస్సు కలవాడు, అతడు కూడా వానిని దీవించెను.

47 ఆదాము చేత అతడు నియమించబడినప్పుడు యెరెదు రెండు వందల ఏండ్ల వయస్సు కలవాడు, అతడు కూడా వానిని దీవించెను.

48 ఆదాము చేత అతడు నియమింపబడినప్పుడు, హనోకు ఇరువది ఐదేండ్ల వయస్సు కలవాడు; వానికి అరువది ఐదేండ్లు, ఆదాము అతడిని దీవించెను.

49 అతడు ప్రభువును చూచెను, ఆయనతో నడిచెను, ఆయన సముఖమున నిరంతరము ఉండెను; అతడు దేవునితో మూడు వందల అరువది ఐదేండ్లు నడిచెను, అతడు రూపాంతరము చెందినప్పుడు నాలుగు వందల ముప్పది ఏండ్ల వయస్సు గలవాడు.

50 ఆదాము చేత అతడు నియమించబడినప్పుడు మెతూషెల వందేళ్ళ వయస్సు కలవాడు.

51 సేతు చేత అతడు నియమించబడినప్పుడు లెమెకు ముప్పది రెండేళ్ళ వయస్సు కలవాడు.

52 మెతూషెల చేత అతడు నియమించబడినప్పుడు నోవహు పదేళ్ళ వయస్సు కలవాడు.

53 ఆదాము మరణమునకు మూడేండ్ల ముందు, నీతిమంతులైన అతని మిగిలిన సంతానముతోపాటు ప్రధాన యాజకులైన సేతు, ఎనోషు, కెయినాను, మహలలీలు, యెరెదు, హనోకు, మెతూషెలను ఆడమ్-ఓన్డై-అహ్‌మన్‌ లోయలోనికి అతడు పిలిచెను, అక్కడ అతని చివరి దీవెనను వారిపై ప్రోక్షించెను.

54 మరియు ప్రభువు వారికి ప్రత్యక్షమయ్యెను, వారు లేచి ఆదామును దీవించి, అతడిని రాకుమారుడు, ప్రధాన దూతయైన మిఖాయేలు అని పిలిచిరి.

55 ప్రభువు ఆదామునకు ఆదరణను అనుగ్రహించి అతనితో ఇలా చెప్పెను: నేను నిన్ను మొదటివానిగా ఉంచితిని; అనేక జనములు నీ నుండి వచ్చును, వారిపైన నీవు రాకుమారునిగా నిరంతరము ఉండెదవు.

56 జనసమూహము మధ్యన ఆదాము నిలబడెను; అతడు వయసుమీరిన వాడైనప్పటికి, పరిశుద్ధాత్మతో నిండినవాడై, ఆఖరి తరము వరకు తన సంతానమునకు జరుగవలసిన దానిని ముందుగా చెప్పెను.

57 ఈ సంగతులన్నియు హనోకు గ్రంథమందు వ్రాయబడియున్నవి, తగిన సమయములో వాటిని గూర్చి సాక్ష్యము చెప్పబడును.

58 బయల్పాటునకు అంగీకారమగు రీతిలో సంఘము యొక్క ఇతర స్థానములన్నిటిని నియమించి, సరైన రీతిలో ఉంచుట పన్నెండుమంది బాధ్యతయైయున్నది, అది ఇలా చెప్పుచున్నది:

59 సంఘ వ్యవహారమునకు సంబంధించిన సంఘ చట్టములకు అదనముగా సీయోను ప్రదేశములో క్రీస్తు సంఘమునకు—

60 నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, పెద్ద యొక్క స్థానమునకు చెందియున్న వారిపై అధ్యక్షత్వము వహించుటకు అధ్యక్షత్వము వహించు పెద్దలు ఉండవలసిన అవసరమున్నదని సైన్యములకధిపతియైన ప్రభువు సెలవిచ్చుచున్నాడు;

61 అంతేకాక యాజక స్థానమునకు చెందిన వారిపై అధ్యక్షత్వము వహించుటకు యాజకులు;

62 అంతేకాక బోధక స్థానమునకు చెందిన వారిపై అధ్యక్షత్వము వహించుటకు బోధకులు, ఈవిధముగా పరిచారకులు కూడా ఉండవలెను—

63 కాబట్టి సంఘ నిబంధనలు, ఆజ్ఞలను బట్టి పరిచారకుని నుండి బోధకుడు, బోధకుని నుండి యాజకుడు, యాజకుని నుండి పెద్ద వరకు వారు విడివిడిగా నియమించబడిరి.

64 తరువాత వచ్చునది అన్నిటికంటే గొప్పదైన ప్రధాన యాజకత్వము.

65 కాబట్టి, యాజకత్వమునకు అధ్యక్షత్వము వహించుటకు ప్రధాన యాజకత్వము నుండి ఒకరిని నియమించవలసిన అవసరమున్నది, అతడు సంఘము యొక్క ప్రధాన యాజకత్వమునకు అధ్యక్షునిగా;

66 లేక మరియొక మాటలో, సంఘము యొక్క ప్రధాన యాజకత్వముపైన అధ్యక్షత్వము వహించు ప్రధాన యాజకునిగా పిలువబడెను.

67 దానినుండే హస్తనిక్షేపణము ద్వారా సంఘముపైన విధులు, దీవెనలు నిర్వహించుట జరుగును.

68 కాబట్టి, బిషప్పు స్థానము దానికి సమానము కాదు; ఏలయనగా బిషప్పు స్థానము లౌకికమైన వాటన్నిటిని నిర్వహించుటయందు కలదు.

69 అయినప్పటికీ అతడు నిజముగా అహరోను వంశస్థుడు కాకపోతే, బిషప్పు ప్రధాన యాజకత్వము నుండి ఎన్నుకోబడవలెను;

70 ఏలయనగా అతడు నిజముగా అహరోను వంశస్థుడు కాకపోతే, ఆ యాజకత్వము యొక్క తాళపుచెవులను అతడు కలిగియుండలేడు.

71 అయినప్పటికీ, మెల్కీసెదెకు క్రమముననుసరించి ఒక ప్రధాన యాజకుడు, వాటి జ్ఞానమును సత్యాత్మ ద్వారా కలిగియుండి, లౌకికమైన వాటికి పరిచర్య చేయుటకు;

72 అంతేకాక ఇశ్రాయేలునందు ఒక న్యాయాధిపతిగా ఉండుటకు, సంఘ వ్యవహారమును నడిపించుటకు, సంఘ పెద్దల మధ్యనుండి అతడు ఎన్నుకొనిన లేదా ఎన్నుకొను తన సలహాదారుల సహాయముతో చట్టములను బట్టి అతని యెదుట సాక్ష్యము ఉంచబడినప్పడు, దాని ఆధారముగా అపరాధుల యెడల తీర్పునకు కూర్చొనుటకు ప్రత్యేకపరచబడవచ్చును.

73 ఇది నిజముగా అహరోను వంశస్థుడు కాకుండా, మెల్కీసెదెకు క్రమముననుసరించి ప్రధాన యాజకత్వమునకు నియమించబడిన బిషప్పు బాధ్యతయైయున్నది.

74 కాబట్టి సీయోను సరిహద్దులు విశాలపరచబడి, సీయోనులో లేదా మరెక్కడైనా ఇతర బిషప్పులు లేదా న్యాయాధిపతులను కలిగియుండుట ఆవశ్యకమైనంత వరకు అతడు న్యాయాధిపతిగా ఉండును, అనగా సీయోను నివాసుల మధ్య లేదా సీయోను స్టేకునందు లేదా అతడు ఈ పరిచర్యకు ప్రత్యేకించబడు సంఘము యొక్క ఏ శాఖలోనైనా సాధారణ న్యాయాధిపతిగా ఉండును.

75 ఇతర బిషప్పులు నియమించబడినప్పుడు, వారు అదే స్థానములో పనిచేయవలెను.

76 కానీ మెల్కీసెదెకు క్రమముననుసరించి ప్రధాన యాజకత్వము యొక్క అధ్యక్షుడు ఇశ్రాయేలునందు న్యాయాధిపతిగా కూర్చొనుటకు న్యాయస్థానమునకు తేబడిన సందర్భములో తప్ప, నిజముగా అహరోను వారసునికి ఈ యాజకత్వము అధ్యక్షత్వమునకు, ఈ పరిచర్య తాళపుచెవులకు, సలహాదారులు లేకుండా స్వతంత్రముగా బిషప్పు స్థానములో పనిచేయుటకు చట్టపరమైన హక్కు కలదు.

77 ఈ రెండు సలహామండళ్ళలో ఏదో ఒకదాని నిర్ణయము ఆజ్ఞకు అంగీకారము కావలెను, అది ఇలా సెలవిచ్చును:

78 మరలా, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, అతి ముఖ్యమైన సంఘ వ్యవహారము, అతి కష్టమైన సంఘ వ్యాజ్యముల పట్ల బిషప్పు లేదా న్యాయాధిపతుల నిర్ణయము సంతృప్తికరముగా లేనప్పుడు, అది ప్రధాన యాజకత్వము యొక్క అధ్యక్షత్వము యెదుట సంఘ సలహామండలికి తీసుకొనిపోబడి, అప్పగించబడవలెను.

79 ప్రధాన యాజకత్వపు సలహామండలి యొక్క అధ్యక్షత్వము సలహాదారులుగా సహాయపడుటకు ఇతర ప్రధాన యాజకులను, పన్నెండుమందిని కూడా పిలుచుటకు అధికారమును కలిగియుండును; అందువలన ప్రధాన యాజకత్వము యొక్క అధ్యక్షత్వము, దాని సలహాదారులు సంఘ చట్టములను బట్టి సాక్ష్యముపైన నిర్ణయము తీసుకొనుటకు అధికారము కలిగియుందురు.

80 ఈ నిర్ణయము తరువాత ప్రభువు సముఖమందు ఇక ఎన్నడు అది జ్ఞాపకముంచుకోబడదు; ఏలయనగా ఇది దేవుని సంఘము యొక్క అత్యున్నత సలహామండలి, ఆత్మీయ విషయాలలోనున్న వివాదములపైన దానిదే ఆఖరి నిర్ణయమైయున్నది.

81 సంఘమునకు చెందిన ఏ వ్యక్తి సంఘము యొక్క ఈ సలహామండలి నుండి మినహాయింపు కాదు.

82 ప్రధాన యాజకత్వపు అధ్యక్షుడు అపరాధము చేసిన యెడల, అతడు తీర్పుతీర్చబడుటకు సంఘ ఉమ్మడి సలహామండలి యెదుటకు తేబడును, అది ప్రధాన యాజకత్వము యొక్క పన్నెండుమంది సలహాదారులచేత సహకరింపబడవలెను;

83 అతని పట్ల వారి నిర్ణయము అతనికి సంబంధించిన వివాదమునకు ముగింపుగా ఉండును.

84 అందువలన సత్యము, నీతిననుసరించి ఆయన యెదుట అన్ని విషయములు క్రమములో, సాత్వీకమందు జరుగునట్లు దేవుని చట్టములు, న్యాయముల నుండి ఎవరును మినహాయింపబడరు.

85 మరలా నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, పరిచారకుని స్థానముపైన అధ్యక్షుని బాధ్యతయేమనగా, నిబంధనల ప్రకారము ఇవ్వబడినట్లుగా పన్నెండుమంది పరిచారకులపైన అధ్యక్షత్వము వహించుట, వారితో సలహామండలిలో కూర్చొని, వారి బాధ్యతను వారికి బోధించుట, ఒకరికొకరు ఆత్మీయాభివృద్ధిని కలిగించుట.

86 బోధకుల స్థానముపైన అధ్యక్షుని బాధ్యతయేమనగా, నిబంధనలలో ఇవ్వబడినట్లుగా ఇరువది నాలుగు మంది బోధకులపైన అధ్యక్షత్వము వహించుట, వారితో సలహామండలిలో కూర్చొని, వారి స్థానము యొక్క బాధ్యతలను వారికి బోధించుట.

87 అహరోను యాజకత్వముపైన అధ్యక్షుని బాధ్యతయేమనగా, నిబంధనలలో ఇవ్వబడినట్లుగా నలుబది ఎనిమిదిమంది యాజకులపైన అధ్యక్షత్వము వహించుట, వారితో సలహామండలిలో కూర్చొని, వారి స్థానము యొక్క బాధ్యతలను వారికి బోధించుట—

88 ఈ అధ్యక్షుడు బిషప్పైయుండవలెను; ఏలయనగా ఈ యాజకత్వపు బాధ్యతలలో ఇది ఒకటి.

89 మరలా, పెద్దల స్థానముపైన అధ్యక్షుని బాధ్యతయేమనగా, తొంబది ఆరుమంది పెద్దలపైన అధ్యక్షత్వము వహించుట, వారితో సలహామండలో కూర్చొని నిబంధల ప్రకారము వారికి బోధించుట.

90 ఈ అధ్యక్షత్వము డెబ్బది కంటె వేరుగానున్నది, ఇది లోకమంతా పర్యటించని వారికొరకు ఏర్పాటు చేయబడినది.

91 మరలా, ప్రధాన యాజకత్వ స్థానము యొక్క అధ్యక్షుని బాధ్యతయేమనగా, సంఘమంతటిపైన అధ్యక్షత్వము వహించి, మోషేను పోలి ఉండుట—

92 సంఘము యొక్క అధ్యక్షునిపైన దేవుడు ప్రోక్షించు ఆయన బహుమానములన్నిటిని కలిగియుండి దీర్ఘదర్శిగా, బయల్పాటుదారునిగా, అనువాదకునిగా, ప్రవక్తగా నుండుట; ఇందులో జ్ఞానము కలదు.

93 డెబ్బదిమంది నుండి ఎన్నుకోబడి, వారిపై అధ్యక్షత్వము వహించుటకు ఏడుగురు అధ్యక్షులను వారు కలిగియుండవలెనని డెబ్బది క్రమమును గూర్చి చూపించు దర్శనమునకు అనుగుణముగా ఇది ఉన్నది.

94 ఈ అధ్యక్షులలో ఏడవ అధ్యక్షుడు ఆరుగురిపైన అధ్యక్షత్వము వహించవలెను;

95 ఈ ఏడుగురు అధ్యక్షులు వారు చెందియున్న మొదటి డెబ్బదికి అదనముగా మరో డెబ్బదిని ఎన్నుకొని, వారిపైన అధ్యక్షత్వము వహించవలెను.

96 ద్రాక్షతోటలోని పని కొరకు అవసరమైన యెడల మరియొక డెబ్బదిని, ఆవిధముగా ఏడు మారులు డెబ్బదిని ఎన్నుకోవలెను.

97 ఈ డెబ్బదిమంది, మొదట అన్యజనుల వద్దకు మరియు యూదుల వద్దకు కూడా పర్యటించి పరిచర్య చేయువారిగా ఉండవలెను.

98 పన్నెండుమందికైనను, డెబ్బదికైనను చెందని సంఘ ఇతర అధికారులు, అన్ని జనముల మధ్య పర్యటించు బాధ్యతను కలిగియుండరు, కానీ వారు సంఘములో ఉన్నతమైన, బాధ్యతగల స్థానములను కలిగియున్నప్పటికీ వారి పరిస్థితులు అనుమతించినప్పుడు పర్యటించవలెను.

99 కాబట్టి, ఇప్పుడు ప్రతి మనుష్యుడు తన బాధ్యతను నేర్చుకొని అతడు నియమించబడిన స్థానములో పూర్తి శ్రద్ధతో పనిచేయవలెను.

100 సోమరియైనవాడు ప్రభువుచే యోగ్యునిగా లెక్కింపబడడు, తన బాధ్యతను నేర్చుకొనక, తననుతాను అంగీకరింపబడినవానిగా చూపనివాడు యోగ్యునిగా లెక్కింపబడడు. అలాగే జరుగును గాక. ఆమేన్.