సర్వసభ్య సమావేశము
మేలు చేయడం మన అలవాటుగా ఉండనివ్వండి
2022 అక్టోబరు సర్వసభ్య సమావేశము


మేలు చేయడం మన అలవాటుగా ఉండనివ్వండి

మనము సత్‌క్రియలందు స్థిరముగా కదలకయున్న యెడల, మన ఆచారాలు నిబంధన బాటపై నిలిచియుండడానికి మనకు సహాయపడతాయి.

వివిధ దేశాలలో నివసించడానికి నన్ను తీసుకెళ్ళిన సంఘ నియామకాలకు నేను ఎల్లప్పుడు కృతజ్ఞత కలిగియుంటాను. ఈ దేశాలలో ప్రతీఒక్క దానిలో గొప్ప వైవిధ్యాన్ని మరియు విభిన్న ఆచారాలు, సంప్రదాయాలు కలిగిన అసాధారణమైన వ్యక్తులను మేము కనుగొన్నాము.

మనమందరం మన కుటుంబము నుండి లేదా మనము నివసించే సమాజము నుండి వచ్చే వ్యక్తిగతమైన ఆచారాలు, సంప్రదాయాలను కలిగియున్నాము మరియు మనము సువార్త సూత్రాలకు అనుగుణంగా ఉన్నవాటన్నిటిని నిలుపుకోవాలని ఆశిస్తున్నాము. నిబంధన మార్గంలో నిలిచియుండడానికి మన ప్రయత్నాలకు జ్ఞానవృద్ధి కలుగజేసే ఆచారాలు, సంప్రదాయాలు ప్రధానమైనవి మరియు అడ్డుగా ఉన్న వాటిని మనం తిరస్కరించాలి.

ఆచారం అనేది అభ్యాసం లేదా ఒక వ్యక్తి, సంస్కృతి లేదా సంప్రదాయం తరచుగా మరియు అలవాటుగా ఆలోచించే పద్ధతి. తరచుగా, అలవాటైన విధానములో మనము ఆలోచించి, చేసే విషయాలను సాధారణమైనవిగా మనము గుర్తిస్తాము.

దీనిని నేను వివరిస్తాను: నా ప్రియమైన భార్య పాట్రీషియా, కొబ్బరి నీళ్ళు తాగిన తరువాత కొబ్బరి తినడాన్ని ఇష్టపడుతుంది. మొదటిసారి మేము మెక్సికోలోని ప్యుబ్లాను సందర్శించినప్పుడు, ఒక చోటుకు వెళ్ళి మేము ఒక కొబ్బరిబొండాన్ని కొన్నాము. నీళ్ళు తాగిన తరువాత, నా భార్య కొబ్బరిబొండాన్ని కొట్టి, తినడానికి కొబ్బరి తెచ్చి ఇమ్మని వారిని అడిగింది. అది వచ్చినప్పుడు, ఎర్రగా ఉంది. వారు దానిపై కారం చల్లారు! కారంతో తియ్యని కొబ్బరి! అది మాకు చాలా వింతగా అనిపించింది. కానీ తరువాత వింతైనది కారంతో కొబ్బరి తినని నేను, నా భార్య అని మేము తెలుసుకున్నాము. ఏమైనప్పటికీ, మెక్సికోలో అది అరుదైనది కాదు; అది సర్వసాధారణమైనది.

మరొక సందర్భములో, మేము కొందరు స్నేహితులతో బ్రెజిల్‌లో ఆహారం తింటున్నాము మరియు వారు మాకు అవకాడో ఇచ్చారు. మేము దానిపై ఉప్పు చల్లబోతుండగా, మా స్నేహితులు మమ్మల్ని అడిగారు, “మీరేమి చేస్తున్నారు? మేము ఇంతకుముందే అవకాడోపై పంచదార చల్లాము!” పంచదారతో అవకాడో! అది మాకు చాలా వింతగా అనిపించింది. కానీ తరువాత వింతైనది పంచదారతో అవకాడో తినని నేను, నా భార్య అని మేము తెలుసుకున్నాము. బ్రెజిల్‌లో, అవకాడోపై పంచదార చల్లడం సర్వసాధారణం.

వారి ఆచారాలు, సంప్రదాయాలపై ఆధారపడి కొందరికి సర్వసాధారణమైనది ఇతరులకు వింతైనది కావచ్చు.

మన జీవితాలలో సర్వసాధారణమైన ఆచారాలు, సంప్రదాయాలేవి?

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా చెప్పారు: “నేడు మనం ‘క్రొత్త సాధారణత’ గురించి తరచుగా వింటుంటాము. మీరు నిజంగా క్రొత్త సాధారణతను స్వీకరించాలని కోరితే, మీ హృదయాన్ని, మనస్సును మరియు ఆత్మను మన పరలోక తండ్రి మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వైపు ఎక్కువగా త్రిప్పమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అది మీ క్రొత్త సాధారణత” గా ఉండనివ్వండి (“ఒక క్రొత్త సాధారణత,” లియహోనా, నవ. 2020, 118).

ఈ ఆహ్వానము అందరి కొరకైనది. మనము పేదవారమా ధనికులమా, విద్యావంతులమా విద్య లేనివారమా, ముసలివారమా యౌవనులమా, రోగులమా ఆరోగ్యవంతులమా అనేది ముఖ్యం కాదు. మన జీవితాలలోని సాధారణమైన విషయాలను నిబంధన బాటపై మనం నిలిచియుండడానికి సహాయపడే విషయాలుగా ఉండనిమ్మని ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నారు.

ఏ దేశమైనా పూర్తిగా మంచిదానిని లేదా మెచ్చుకోదగిన దానిని కలిగియుండదు. కాబట్టి, పౌలు మరియు ప్రవక్త జోసెఫ్ స్మిత్ బోధించినట్లుగా:

“పవిత్రమైనది, రమ్యమైనది, ఖ్యాతిగలది లేదా పొగడదగినది ఏదైనా ఉన్నయెడల, వాటిని కూడా మేము వెదికెదము” (విశ్వాసప్రమాణములు 1:13).

“యే మెప్పైనను ఉండిన యెడల, దానిమీద ధ్యానముంచుకొనుడి” (ఫిలిప్పియులకు 4:8).

ఇది కేవలం వ్యాఖ్యానం కాదని, ఒక ఉద్బోధ అని గమనించండి.

మన ఆచారములను, అవి మన కుటుంబాలను ప్రభావితం చేసే విధానమును ధ్యానించడానికి మనందరము ఒక క్షణము తీసుకోవాలని నేను కోరుతున్నాను.

సంఘ సభ్యులకు సర్వసాధారణంగా ఉండవలసినవి అద్భుతమైన ఈ నాలుగు అలవాట్లు:

  1. వ్యక్తిగత మరియు కుటుంబ లేఖన అధ్యయనము. ప్రభువైన యేసు క్రీస్తుకు మార్పు చెందడానికి, సువార్తను నేర్చుకోవడానికి ప్రతీవ్యక్తి బాధ్యుడు. తమ పిల్లలకు సువార్తను బోధించడం తల్లిదండ్రుల బాధ్యత (సిద్ధాంతము మరియు నిబంధనలు 68:25; 93:40 చూడండి).

  2. వ్యక్తిగత మరియు కుటుంబ ప్రార్థన. ఎల్లప్పుడు ప్రార్థించమని రక్షకుడు మనకు ఆజ్ఞాపించారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 19:38 చూడండి). ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నామములో మన పరలోక తండ్రితో వ్యక్తిగతంగా మాట్లాడడాన్ని ప్రార్థన మనకు సాధ్యపరుస్తుంది.

  3. ప్రతీవారము సంస్కార సమావేశానికి హాజరవ్వడం (3 నీఫై 18:1–12; మొరోనై 6:5–6 చూడండి). మనము సంస్కారము తీసుకొన్నప్పుడు యేసు క్రీస్తును జ్ఞాపకముంచుకోవడానికి దానిని మనము చేస్తాము. ఈ విధిలో, సంఘ సభ్యులు రక్షకుని నామమును తమపై తీసుకోవడానికి, ఆయనను ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకోవడానికి మరియు ఆయన ఆజ్ఞలను పాటించడానికి వారి నిబంధనను క్రొత్తదిగా చేస్తారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:77, 79 చూడండి).

  4. దేవాలయము మరియు కుటుంబ చరిత్ర కార్యములో తరచుగా పాల్గొనడం. ఈ కార్యము కుటుంబాలను నిత్యత్వము కొరకు ఏకము చేసి, బంధించడానికి సాధనము (సిద్ధాంతము మరియు నిబంధనలు 128:15 చూడండి).

ఈ నాలుగు విషయాలను వినినప్పుడు మనమెలా భావిస్తాము? అవి మన సాధారణమైన జీవితాలలో భాగముగా ఉన్నాయా?

ఆవిధంగా మన జీవితాలలో దేవుడిని ప్రబలనిస్తూ, మనము పొందుపరచుకున్న సాధారణతలో అనేక ఇతర సంప్రదాయలు భాగం కాగలవు.

మన జీవితం మరియు మన కుటుంబంలో ఏవి సాధారణమైన విషయాలని మనము ఎలా తీర్మానించగలము? లేఖనాలలో మనము ఒక గొప్ప మాదిరిని కనుగొంటాము; మోషైయ 5:15 ఇలా చెప్తుంది: “మీరు ఎల్లప్పుడు సత్‌క్రియలందు విస్తరించుచూ స్థిరముగా కదలకయుండవలెను.”

ఈ మాటలను నేను ప్రేమిస్తున్నాను, ఎందుకనగా మన జీవితాలలో సర్వసాధారణమైన విషయాలనే మనము మరలా మరలా పునరావృతం చేస్తాము. మనం సత్‌క్రియలందు స్థిరముగా కదలక ఉన్న యెడల, మన ఆచారాలు సువార్త సూత్రములకు అనుగుణంగా ఉంటాయి మరియు అవి నిబంధన బాటపై నిలిచియుండడానికి మనకు సహాయపడతాయి.

అధ్యక్షులు నెల్సన్ కూడా ఇలా సలహా ఇచ్చారు: “ప్రతిరోజూ పశ్చాత్తాపపడడం ద్వారా మీ క్రొత్త సాధారణతను హత్తుకోండి. ఆలోచనలో, మాటలో మరియు క్రియలో స్వచ్ఛంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇతరులకు పరిచర్య చేయండి. నిత్య దృష్టికోణాన్ని అలవరచుకోండి. మీ పిలుపులను ఘనపరచండి. మరియు మీ సవాళ్ళు ఏమైనప్పటికీ, నా ప్రియమైన సహోదర సహోదరీలారా, మీరు మీ సృష్టికర్తను కలుసుకొనుటకు మరింత సిద్ధంగా ఉండునట్లు ప్రతిరోజూ జీవించండి” (“ఒక క్రొత్త సాధారణత,” 118).

ఇప్పుడు కొబ్బరిని కారముతో తినడం మరియు అవకాడోపై పంచదార చల్లి తినడం నాకు, నా భార్యకు వింతైనది కాదు—వాస్తవానికి మేము దానిని ఇష్టపడతాము. ఏమైనప్పటికీ, మహోన్నతస్థితి అనేది రుచి యొక్క భావానికి చాలా అతీతమైనది; అది నిత్యత్వమునకు సంబంధించిన అంశము.

మన సాధారణత దేవుని ఆజ్ఞలను పాటించే వారికి వాగ్దానము చేయబడిన “ఎన్నడూ అంతముకాని సంతోషము” (మోషైయ 2:41) యొక్క స్థితిని అనుభవించడానికి మనల్ని అనుమతించాలని నేను ప్రార్థిస్తున్నాను మరియు ఆవిధంగా చేసినప్పుడు, “మేము ఆనందముగా జీవించితిమి” (2 నీఫై 5:27) అని మనం చెప్పగలము.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, మన ప్రియమైన ప్రవక్త, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్‌తో సహా మనము ఆమోదించిన 15 మంది పురుషులు ప్రవక్తలు, దీర్ఘదర్శులు మరియు బయల్పాటుదారులని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము నిజమైనదని నేను సాక్ష్యమిస్తున్నాను. ప్రత్యేకించి మన రక్షకుడు మరియు విమోచకుడైన యేసు క్రీస్తు గురించి నేను సాక్ష్యమిస్తున్నాను, యేసు క్రీస్తు నామములో ఆమేన్.