సర్వసభ్య సమావేశము
వారు మిమ్మల్ని ఎరుగునట్లు
2022 అక్టోబరు సర్వసభ్య సమావేశము


వారు మిమ్మల్ని ఎరుగునట్లు

(యోహాను 17:3)

ఆయనకున్న అనేక పేర్ల చేత యేసును మీరు తెలుసుకోవాలని మరియు మీ జీవితంలో మీరు ఆయన వలే మారాలనేది నా మనఃపూర్వకమైన కోరిక.

కొన్ని సంవత్సరాల క్రితం, ఆరిజోనాలో మా స్వంత వార్డులో ఒక సంస్కార సమావేశమందు జీవితాన్ని మార్చివేసే అనుభవం నాకు కలిగింది. “[యేసు క్రీస్తు] యొక్క నామమును [మనపై] తీసుకొనుటకు”1 మన సమ్మతిని సంస్కార ప్రార్థన సూచించినట్లుగా, యేసు అనేక పేర్లను కలిగియున్నారని పరిశుద్ధాత్మ నాకు గుర్తు చేసింది. అప్పుడు ఈ ప్రశ్న నా హృదయంలోనికి వచ్చింది: “ఈ వారము నేను యేసు యొక్క పేర్లలో దేనిని నాపై తీసుకోవాలి?”

మూడు పేర్లు నా మనస్సులోనికి వచ్చాయి మరియు నేను వాటిని వ్రాసియుంచాను. ఆ మూడు పేర్లలలో ప్రతీఒక్కటి నేను మరింత సంపూర్ణంగా వృద్ధి చేయాలని కోరిన క్రీస్తు వంటి లక్షణాలను కలిగియుంది. తరువాతి వారములో, నేను ఆ మూడు పేర్లపై దృష్టిసారించాను మరియు సంబంధిత లక్షణాలను, స్వభావాలను హత్తుకోవడానికి ప్రయత్నించాను. ఆ సమయం నుండి, నా వ్యక్తిగత ఆరాధనలో భాగంగా ఆ ప్రశ్నను అడగడం నేను కొనసాగించాను: “ఈ వారము నేను యేసు యొక్క పేర్లలో దేనిని నాపై తీసుకోవాలి?” ఆ ప్రశ్నకు జవాబివ్వడం మరియు క్రీస్తు వంటి సంబంధిత లక్షణాలను వృద్ధి చేయడానికి ప్రయాసపడడం నా జీవితాన్ని దీవించింది.

ఆయన గొప్ప మధ్యవర్తిత్వ ప్రార్థనలో, యేసు ఈ ముఖ్యమైన సత్యమును వ్యక్తపరిచారు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.”2 ఆయనకున్న అనేక పేర్ల ద్వారా యేసు క్రీస్తును ఎరుగుట నుండి వచ్చే దీవెనలను మరియు శక్తిని ఈరోజు మీతో పంచుకోవాలని నేను కోరుతున్నాను.

ఒకరి గురించి తెలుసుకోవడానికి గల సరళమైన విధానము వారి పేరు తెలుసుకోవడం. “ఒక వ్యక్తి యొక్క పేరు ఆ వ్యక్తికి ఏ భాషలోనైనా అత్యంత మధురమైన మరియు అత్యంత ముఖ్యమైన ధ్వని” అని చెప్పబడింది.3 ఎవరినైనా తప్పు పేరుతో పిలవడం లేదా వారి పేరును మరచిపోయిన అనుభవం మీకు ఎప్పుడైనా కలిగిందా? నేను, నా భార్య అలెక్సిస్ ఒక సందర్భంలో మా పిల్లలలో ఒకరిని “లోలా” అని పిలిచాము. దురదృష్టవశాత్తూ, మీరు ఊహించినట్లుగా, లోలా మా కుక్కు పేరు. ఫలితం మంచిదా చెడ్డదా అనేదానితో సంబంధం లేకుండా, ఒకరి పేరును మరచిపోవడం అనేది ఆ వ్యక్తి గురించి మీకు బాగా తెలియదని తెలియజేస్తుంది.

యేసు జనులను యెరిగి, వారి పేరుతో పిలిచారు. ప్రాచీన ఇశ్రాయేలుకు ప్రభువు ఇలా చెప్పారు, “భయపడవద్దు: నేను నిన్ను విమోచించియున్నాను, పేరు పెట్టి నేను నిన్ను పిలిచియున్నాను; నీవు నా సొత్తు.”4 ఈస్టరు ఉదయమున, పునరుత్థానము చెందిన క్రీస్తును గూర్చి మరియ యొక్క సాక్ష్యము యేసు ఆమెను పేరు పెట్టి పిలిచినప్పుడు ధృవీకరించబడింది.5 అదేవిధంగా, దేవుడు అతడి విశ్వాసపు ప్రార్థనకు జవాబుగా జోసెఫ్ స్మిత్‌ను పేరు పెట్టి పిలిచాడు.6

కొన్ని సందర్భాలలో, యేసు తన శిష్యులకు వారి స్వభావం, సామర్థ్యం, మరియు సాధ్యతను సూచించే క్రొత్త పేర్లను ఇచ్చారు. యెహోవా యాకోబుకు ఇశ్రాయేలను క్రొత్త పేరు ఇచ్చాడు, దాని అర్థం “దేవునితో విజయం సాధించేవాడు” లేదా “దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనిచ్చేవాడు.”7 యేసు యాకోబు మరియు యోహానులకు బోయనేర్గెసు అని పేరు పెట్టాడు, దాని అర్థము “ఉరిమెడు వారు.”8 అతడి భవిష్యత్ నాయకత్వమును చూచి, యేసు సీమోనుకు కైఫా లేదా పేతురు అనే పేరును ఇచ్చాడు, దాని అర్థము ఒక బండరాయి.9

యేసు పేరు పేరున మనలో ప్రతీఒక్కరిని ఎరిగినట్లుగా, మనము ఆయనకున్న అనేక పేర్లను నేర్చుకోవడం యేసును బాగా తెలుసుకొనుటకు ఒక విధానము. ఇశ్రాయేలు మరియు పేతురు యొక్క పేర్ల వలె, యేసు యొక్క పేర్లలో అనేకము బిరుదులైయున్నాయి, అవి ఆయన నియమిత కార్యము, ఉద్దేశ్యము, స్వభావము మరియు లక్షణాలను గ్రహించడానికి మనకు సహాయపడతాయి. యేసు యొక్క అనేక పేర్లను మనము తెలుసుకొన్నప్పుడు, ఆయన దైవిక నియమిత కార్యమును మరియు ఆయన నిస్వార్థమైన స్వభావాన్ని మనము బాగా గ్రహించగలుగుతాము. ఆయనకున్న అనేక పేర్లను తెలుసుకోవడం ఆయన వలె ఎక్కువగా మారడానికి—మన జీవితాలకు సంతోషాన్ని, ఉద్దేశాన్ని తెచ్చే క్రీస్తు వంటి లక్షణాలను వృద్ధి చేయడానికి కూడా మనల్ని ప్రేరేపిస్తుంది.

కొన్ని సంవత్సరాల క్రితం, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ విషయ దీపికలో యేసు క్రీస్తు గురించి ఉన్న లేఖనాలన్నింటిని అధ్యయనం చేసారు.10 తరువాత అవే లేఖనాలను అధ్యయనం చేయమని యువజనులను ఆయన ఆహ్వానించారు. యేసు యొక్క అనేక పేర్ల గురించి అధ్యక్షులు నెల్సన్ ఇలా చెప్పారు, “ఆయనకున్న వివిధ బిరుదులు మరియు పేర్లలో ప్రతీఒక్కటి మీకు వ్యక్తిగతంగా ఏ అర్థాన్ని కలిగియున్నదో గ్రహించడానికి ప్రార్థనా పూర్వకంగా మరియు తీవ్రంగా వెదకుతూ యేసు క్రీస్తు గురించి సమస్తము అధ్యయనం చేయండి.”11

అధ్యక్షులు నెల్సన్ యొక్క ఆహ్వానాన్ని అనుసరిస్తూ, నేను యేసు క్రీస్తు యొక్క అనేక పేర్ల స్వంత జాబితాను వృద్ధి చేయడం ప్రారంభించాను. నా వ్యక్తిగత జాబితా ఇప్పుడు 300 పేర్లను కలిగియున్నది మరియు ఖచ్చితంగా నేను ఇంకా కనుగొనని పేర్లు అనేకము ఉండవచ్చని నేను అనుకుంటున్నాను.

యేసు పేర్లలో కొన్ని ఆయన కోసం మాత్రమే కేటాయించబడియుండగా, 12 మనలో ప్రతీఒక్కరికి అన్వయించగల ఐదు పేర్లు మరియు బిరుదులను పంచుకోవాలని నేను కోరుతున్నాను. ఆయనకున్న అనేక పేర్ల ద్వారా యేసును మీరు తెలుసుకొన్నప్పుడు, మీ స్వంత జాబితాను తయారు చేయమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఆవిధంగా చేయడంలో, క్రీస్తు వంటి లక్షణాలతో పాటు—యేసు యొక్క నిబంధన శిష్యునిగా మీపై ధరించాలని మీరు కోరుకునే—ఇతర పేర్లున్నాయని మీరు కనుగొంటారు.13

మొదటిది, యేసు మంచి గొఱ్ఱెలకాపరి.14 అందుకని, యేసు తన గొఱ్ఱెలను ఎరుగును,15 “ఆయన తన సొంత గొఱ్ఱెలను పేరు పెట్టి పిలుచును”16 మరియు దేవుని యొక్క గొఱ్ఱెపిల్లగా, ఆయన తన గొఱ్ఱెల కొరకు ప్రాణము పెట్టెను.17 అదేవిధంగా, ప్రత్యేకించి మన కుటుంబాలందు మరియు పరిచర్య చేయు సహోదరులు, సహోదరీలుగా మంచి కాపరులుగా ఉండమని యేసు మనల్ని కోరుతున్నారు. ఆయన గొఱ్ఱెలను మేపుట ద్వారా ఒక విధంగా యేసు కొరకు మన ప్రేమను మనం రుజువు చేస్తాము.18 సంచరించే గొఱ్ఱెల విషయంలో, మంచి కాపరులు తప్పిపోయిన గొఱ్ఱెలను కనుగొనడానికి అడవిలోనికి వెళతారు మరియు తరువాత అవి భద్రంగా తిరిగి వెళ్ళేవరకు వాటితో నిలిచియుంటారు.19 మంచి కాపరులుగా మరియు స్థానిక పరిస్థితులు అనుమతించినట్లుగా, మనము జనులకు వారి గృహాలలో పరిచర్య చేయడానికి ఎక్కువ సమయాన్ని గడపాలి. మన పరిచర్యలో, సందేశం పంపడం మరియు సాంకేతికత వ్యక్తిగత పరిచయాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించబడాలి, కానీ భర్తీ చేయడానికి కాదు.20

రెండవది, యేసు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడు.21 తన సిలువ శ్రమ కేవలము కొన్ని గడియలలో ఉందని ఎరిగి, యేసు ఇలా చెప్పారు: “నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును: అయినను ధైర్యము తెచ్చుకొనుడి; నేను లోకమును జయించియున్నాను.”22 నేడు మన లోకము తరచుగా వ్యతిరేక భావాలతో నిండి, విభజించబడియుండగా, సానుకూలత, ఆశావాదం మరియు నిరీక్షణను బోధించాల్సిన గొప్ప అవసరత మనకున్నది. గతములో మన సవాళ్ళు ఏవైనప్పటికీ, ధైర్యము కలిగియుండుడి24 అనే యేసు యొక్క ఆహ్వానాన్ని నెరవేర్చడానికి మనల్ని అనుమతిస్తూ, నిరీక్షణతో నింపబడి, విశ్వాసము ఎల్లప్పుడూ భవిష్యత్తు వైపు సూచిస్తుంది.23 ఆనందంగా సువార్తను జీవించడం రాబోవుచున్న మేలుల విషయమై శిష్యులుగా మారడానికి మనకు సహాయపడుతుంది.

యేసు యొక్క బిరుదులలో మరొకటి ఆయన “నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును.25 స్థిరత్వము క్రీస్తు వంటి లక్షణము. యేసు ఎల్లప్పుడూ తన తండ్రి యొక్క చిత్తమును చేసాడు26 మరియు ఆయన హస్తము ఎల్లప్పుడూ మనల్ని రక్షించడానికి, సహాయపడడానికి, స్వస్థపరచడానికి చాపబడింది.27 సువార్తను జీవించుటలో మనము ఎక్కువ స్థిరంగా ఉన్నప్పుడు, మనము యేసు వలే ఎక్కువగా మారతాము.28 గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతీ ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు, అలలచేత ఎగురగొట్టబడినప్పుడు,29 ప్రపంచము జనాదరణ పొందిన వాటిలో గణనీయమైన మార్పులను అనుభవిస్తున్నప్పటికీ, సువార్తను స్థిరంగా జీవించుట జీవితపు సవాళ్ళు, కష్ట సమయాలందు మనము నిలకడగాను, స్థిరముగాను ఉండడానికి మనకు సహాయపడుతుంది.30 “ప్రభువు కొరకు సమయాన్ని కేటాయించండి”31 అనే అధ్యక్షులు నెల్సన్ గారి ఆహ్వానాన్ని అంగీకరించడం ద్వారా మనము కూడా నిలకడను ప్రదర్శించగలము. అనుదిన ప్రార్థన, పశ్చాత్తాపము, లేఖన అధ్యయనము మరియు ఇతరులకు సేవ వంటి “పరిశుద్ధ అలవాట్లు మరియు నీతిగల నిత్యకృత్యాలను”33 అభివృద్ధి చేయడం వంటి చిన్న మరియు సాధారణమైన వాటి నుండి గొప్ప ఆత్మీయ బలము వస్తుంది.32

నాల్గవది, యేసు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధుడు.34 యేసు యొక్క జీవితం పరిశుద్ధతకు మాదిరిగా ఉన్నది. మనము యేసును అనుసరించినప్పుడు, మనము ఇశ్రాయేలులో ఒక పరిశుద్ధునిగా మారగలము.35 మనము దేవాలయమును క్రమంగా దర్శించినప్పుడు మనం పరిశుద్ధతయందు వృద్ధి చెందుతాము, అక్కడ “ప్రభువుకు పరిశుద్ధత” అని ప్రతీ ప్రవేశ ద్వారంపైన చెక్కబడింది. దేవాలయంలో మనము ఆరాధించిన ప్రతీసారి, మన గృహాలను పరిశుద్ధమైన స్థలములుగా చేయడానికి మనకు గొప్ప శక్తి ప్రసాదించబడుతుంది.36 పరిశుద్ధ దేవాలయములో ప్రవేశించడానికి ప్రస్తుతం ఒక సిఫారసు కలిగియుండని వారు, మీ బిషప్పును కలుసుకొని ఆ పరిశుద్ధ ప్రదేశంలో ప్రవేశించడానికి లేదా అక్కడికి తిరిగి వెళ్ళడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవాలయములో సమయం మన జీవితాలలో పరిశుద్ధతను పెంచుతుంది.

చివరిగా, యేసు యొక్క మరొక పేరు ఆయన నమ్మకమైనవాడు మరియు సత్యవంతుడు.37 యేసు ఎప్పుడూ నమ్మకంగా, ఎల్లప్పుడూ సత్యవంతుడిగా ఉన్నట్లుగా, మన జీవితాలలో ఈ లక్షణాలను మనం ప్రదర్శించాలని ఆయన మనఃపూర్వకంగా కోరుతున్నాడు. మన విశ్వాసము తొట్రిల్లినప్పుడు, గలిలయ యొక్క తుఫాను నిండిన సముద్రములో పేతురు మునిగిపోవడం ప్రారంభించినప్పుడు, అతని వలే “ప్రభువా నన్ను రక్షించుము” 38 అని యేసుకు మనము మొరపెట్టగలము. ఆ రోజు, యేసు మునిగిపోతున్న శిష్యుని కాపాడడానికి చేరుకున్నారు. ఆయన నాకోసం అదే పని చేసారు మరియు ఆయన మీకోసం అలాగే చేస్తారు. యేసును ఎప్పటికీ వదులుకోవద్దు—ఆయన మిమ్మల్ని ఎన్నడూ వదులుకోరు!

మనము విశ్వాసపాత్రులుగా, సత్యవంతులముగా ఉన్నప్పుడు, “నాయందు నిలిచియుండుడి,” అన్న యేసు పిలుపును మనము అనుసరిస్తాము, దాని అర్థము “నాతో ఉండండి.”39 మనము ప్రశ్నలను ఎదుర్కొన్నప్పుడు, మన విశ్వాసమును బట్టి మనం ఎగతాళి చేయబడినప్పుడు, లోకము యొక్క గొప్ప మరియు విశాలమైన భవనములలో ఉన్న వారు మన వైపు తమ వేళ్ళను చూపుచూ ఎగతాళి చేయుచున్నప్పుడు, మనము నమ్మకముగా నిలిచియుంటాము మరియు మనం సత్యవంతులుగా జీవిస్తాము. ఆ క్షణములందు, మనము యేసు యొక్క మనవిని గుర్తుంచుకుంటాము: “ప్రతి ఆలోచనలో నా వైపు చూడుడి; సందేహించవద్దు, భయపడవద్దు.”40 మనము ఆవిధంగా చేసినప్పుడు, ఆయన మనకు అవసరమైన విశ్వాసమును, నిరీక్షణను మరియు ఆయనతో నిలిచియుండడానికి బలమును ఇస్తారు.41

ప్రియమైన సహోదర సహోదరీలారా, మనము రక్షించబడుటకు పరలోకము క్రింద ఇయ్యబడిన ఏ ఇతర మార్గముగాని నామముగానీ లేదు కనుక మనము ఆయనను తెలుసుకోవాలని యేసు మనల్ని కోరుతున్నారు.42 ఆయనే మార్గమును, సత్యమును మరియు జీవమును—ఆయన ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు.43 కేవలము యేసే మార్గము! ఆ కారణము వలన, యేసు “నా యొద్దకు రండి,”44 “నన్ను అనుసరించుడి”45 “నాతో కూడ సంచరించుడి,” 46 మరియు “నా యొద్ద నేర్చుకొనుడి”47 అని సైగచేసి పిలుస్తున్నాడు.

ఆయన జీవిస్తున్నారని, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారని మరియు మీ పేరు చొప్పున ఆయన మిమ్మల్ని ఎరిగియున్నారని—నా పూర్ణ హృదయముతో నేను యేసు క్రీస్తును గూర్చి సాక్ష్యమిస్తున్నాను. ఆయన దేవుని యొక్క కుమారుడు,48 తండ్రి యొక్క అద్వితీయ కుమారుడు.49 ఆయన మన శైలము, మన కోట, మన కవచము, మన ఆశ్రయము మరియు మన విమోచకుడు.50 ఆయన అంధకారములో ప్రకాశించు వెలుగు.51 ఆయన మన రక్షకుడు52 మరియు మన విమోచకుడు.53 ఆయనే పునరుత్థానము మరియు జీవము.54 ఆయనకున్న అనేక పేర్ల చేత యేసును మీరు తెలుసుకుంటారని మరియు మీ జీవితంలో ఆయన దైవిక లక్షణాలకు మీరు ఉదాహరణగా ఉన్నప్పుడు మీరు ఆయన వలే మారతారనేది నా మనఃపూర్వకమైన కోరిక. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.