సర్వసభ్య సమావేశము
దేవుడు మరియు ఆయన కార్యము పట్ల విశ్వాసంగా ఉండుము
2022 అక్టోబరు సర్వసభ్య సమావేశము


దేవుడు మరియు ఆయన కార్యము పట్ల విశ్వాసంగా ఉండుము

మనమందరము యేసు క్రీస్తు గురించి మన స్వంత సాక్ష్యాన్ని వెదకాలి, మన ఉద్రేకాలకు కళ్ళెం వేయాలి, మన పాపాల కొరకు పశ్చాత్తాపపడాలి, దేవుడు మరియు ఆయన కార్యముపట్ల విశ్వాసంగా ఉండాలి.

గత అక్టోబరులో, అధ్యక్షులు ఎమ్. రస్సెల్ బాల్లర్డ్ మరియు ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్‌లతో పాటు యునైటెడ్ కింగ్‌డమ్‌ను సందర్శించడానికి నేను నియమించబడ్డాను, అక్కడ మేము ముగ్గురము యువ సువార్తికులుగా సేవ చేసాము. బోధించడం, సాక్ష్యమివ్వడం, అదేవిధంగా నా ముని ముత్తాత హీబర్ సి. కింబల్ మరియు ఆయన సహచరులు మొదటి సువార్తికులుగా ఉన్న బ్రిటీషు దీవులలో సంఘ చారిత్రక స్థలాలను దర్శించి, వాటి గురించి ఆలోచించే విశేషాధికారం మాకు దక్కింది.1

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఈ నియామకం గురించి మమ్మల్ని ఆటపట్టిస్తూ, ముగ్గురు అపొస్తలులను వారి యవ్వనంలో వారు సువార్తికులుగా పనిచేసిన ప్రాంతాన్ని సందర్శించడానికి నియమించడం అసాధారణమైనదని అన్నారు. అందరు వారు మొదట నియమించబడిన ప్రాంతాన్ని దర్శించే నియామకం పొందాలని కోరుకుంటారని ఆయన తెలియజేసారు. 60 ఏళ్ళ క్రితం అదే ప్రాంతంలో సేవ చేసిన మరో ముగ్గురు అపొస్తలులు ఉండియుంటే, వారు కూడా అటువంటి నియామకాన్నే పొందియుండేవారని ఆయన ముఖంపై పెద్ద చిరునవ్వుతో, పూర్వస్థితిని ఆయన క్లుప్తంగా వివరించారు.

చిత్రం
హీబర్ సి. కింబల్

ఆ నియామకం కొరకు సిద్ధపడుతున్నప్పుడు, తరువాత అపొస్తలత్వానికి పిలువబడిన అతని మనవడైన ఓర్సన్ ఎఫ్. విట్నీ చేత వ్రాయబడిన హీబర్ సి. కింబల్ యొక్క జీవితం నేను మళ్ళీ చదివాను. నేను దాదాపు ఏడు సంవత్సరాల వయస్సున్నప్పుడు, అమూల్యమైన మా అమ్మ ఈ పుస్తకాన్ని నాకిచ్చింది. 1947, జూలై 24న అధ్యక్షులు జార్జ్ ఆల్బర్ట్ స్మిత్ చేస్తున్న This Is the Place (ఇదే సరైన స్థలము) స్మారక చిహ్నం యొక్క ప్రతిష్ఠాపనకు హాజరయ్యేందుకు మేము సిద్ధపడుతున్నాము. 2 నా పూర్వీకుడైన హీబర్ సి. కింబల్ గురించి నేను ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఆమె కోరుకుంది.

మన కాలం కొరకు ప్రత్యేకత కలిగియుండి, అధ్యక్షులు కింబల్‌కు ఆపాదించబడిన ఒక గంభీరమైన ప్రకటనను ఈ పుస్తకం కలిగియుంది. వ్యాఖ్యానాన్ని పంచుకొనే ముందు, నేను కొంత నేపథ్యాన్ని అందిస్తాను.

ప్రవక్త జోసెఫ్ స్మిత్ లిబర్టీ చెరసాలలో నిర్బంధించబడియుండగా, భయంకరమైన ప్రతికూల పరిస్థితుల్లో మిస్సోరి నుండి పరిశుద్ధుల తరలింపును పర్యవేక్షించే బాధ్యతను అపొస్తలులైన బ్రిగమ్ యంగ్ మరియు హీబర్ సి. కింబల్ కలిగియున్నారు. గవర్నర్ లిల్బర్న్ డబ్ల్యు. బాగ్స్ చేత జారీచేయబడిన నిర్మూలన ఉత్తర్వు కారణంగా పెద్దయెత్తున తరలింపు అవసరమైంది.3

దాదాపు 30 ఏళ్ళ తర్వాత, అప్పటి ప్రథమ అధ్యక్షత్వములో ఉన్న హీబర్ సి. కింబల్, ఈ చరిత్రపై ప్రతిబింబిస్తూ ఒక క్రొత్త తరానికి ఇలా బోధించారు, “మీలో అనేకమంది మీరు తట్టుకోగలిగే కష్టాలు, శ్రమలు మరియు హింసనంతటిని కలిగియుండే సమయాన్ని, మీరు దేవుడు మరియు ఆయన కార్యము పట్ల విశ్వాసంగా ఉంటారని4 చూపడానికి అనేక అవకాశాలను చూస్తారని నేను మీకు చెప్తున్నాను.”

హీబర్ ఇలా కొనసాగించారు: “రాబోతున్న కష్టాలను ఎదుర్కోవడానికి, మీకై మీరు ఈ కార్యము యొక్క సత్యాన్ని గురించిన జ్ఞానము కలిగియుండడం మీకు అవసరమవుతుంది. కష్టాలు ఎంత సవాలు చేసేవిగా ఉంటాయంటే, ఈ వ్యక్తిగత జ్ఞానాన్ని లేదా సాక్ష్యాన్ని కలిగియుండని స్త్రీ పురుషులు విశ్వాసంతో నిలువలేరు. మీరు సాక్ష్యాన్ని పొందకపోతే, నీతిగా జీవించి, ప్రభువును ప్రార్థించి, సాక్ష్యాన్ని [పొందే] [వరకు] వాటిని మానకుండా ఉండండి. మీరు చేయకపోతే మీరు తట్టుకోలేరు. … ఇతరుల సాక్ష్యంపై ఆధారపడిన ఏ స్త్రీ లేదా పురుషుడు సహించలేని సమయం వస్తుంది. ప్రతీఒక్కరు తమ స్వంత సాక్ష్యం చేత నడిపించబడాలి. … మీరు దానిని కలిగియుండకపోతే మీరు యదార్థంగా నిలిచియుండలేరు; కాబట్టి యేసు గురించి సాక్ష్యాన్ని వెదకండి మరియు దానిని హత్తుకొనియుండండి, తద్వారా కష్టకాలం వచ్చినప్పుడు మీరు తొట్రిల్లకుండా, పడిపోకుండా ఉండవచ్చు.”5

మనలో ప్రతీఒక్కరికి దేవుని కార్యము6 మరియు యేసు క్రీస్తు యొక్క ముఖ్య పాత్ర గురించి వ్యక్తిగత సాక్ష్యము అవసరము. సిద్ధాంతము మరియు నిబంధనలు యొక్క 76వ ప్రకరణము మహిమ యొక్క మూడు దశల గురించి చెప్తుంది మరియు సిలెస్టియల్ మహిమను సూర్యునితో పోల్చుతుంది. తరువాత అది టెర్రెస్ట్రియల్ రాజ్యాన్ని చంద్రునితో పోల్చుతుంది.7

సూర్యునికి తన స్వంత వెలుగు ఉంది, కానీ చంద్రునిది ప్రతిబింబించే కాంతి లేదా “అరువు తెచ్చుకున్న కాంతి” అనేది ఆసక్తికరమైనది. టెర్రెస్ట్రియల్ రాజ్యం గురించి మాట్లాడుతూ, “యేసు సాక్ష్యమందు శూరులుగా ఉండనివారు వీరే” అని 79వ వచనం చెప్తుంది. ఇతరుల సాక్ష్యంపై ఆధారపడి మనం సిలెస్టియల్ రాజ్యాన్ని పొందలేము మరియు తండ్రియైన దేవునితో నివసించలేము; యేసు మరియు ఆయన సువార్త గురించి మన స్వంత సాక్ష్యం మనకు అవసరం.

అధర్మము ఎక్కువవుతున్న ప్రపంచంలో మనం నివసిస్తున్నాము8 మరియు మనుష్యుల ఆజ్ఞలను బట్టి వారు తమ హృదయాలను దేవుని నుండి త్రిప్పుకొనెదరు.9 దేవుని కార్యము మరియు యేసు క్రీస్తు గురించి సాక్ష్యమును వెదకడం గురించి హీబర్ సి. కింబల్ గారి ఆందోళనలకు లేఖనాలలో ఉన్న అత్యంత ప్రోత్సహించు మాదిరులలో ఒకటి, ఆల్మా యొక్క ముగ్గురు కుమారులు—హీలమన్, షిబ్లోన్ మరియు కొరియాంటన్‌లకు అతడు ఇచ్చిన ఉపదేశములో తెలియజేయబడింది.10 అతడి కుమారులలో ఇద్దరు దేవుడు మరియు ఆయన కార్యము పట్ల విశ్వాసంగా ఉన్నారు. కానీ ఒక కుమారుడు కొన్ని చెడ్డ నిర్ణయాలు తీసుకున్నాడు. నా దృష్టిలో ఆల్మా ఉపదేశము యొక్క గొప్ప ప్రాముఖ్యత ఏమనగా, ఒక తండ్రిగా అతడు తన స్వంత పిల్లల లాభం కొరకు దానిని ఇచ్చాడు.

హీబర్ సి. కింబల్ వలె ఆల్మా యొక్క మొదటి ఆందోళన ఏమిటంటే, ఆయన కుమారులలో ప్రతీఒక్కరు యేసు క్రీస్తు గురించి సాక్ష్యం కలిగియుండి, దేవుడు మరియు ఆయన కార్యము పట్ల విశ్వాసంగా ఉండాలి.

ఆల్మా తన కుమారుడైన హీలమన్‌కు ఇచ్చిన ఈ విశేషమైన బోధనలో, అతడు ఒక గంభీరమైన వాగ్దానమిచ్చాడు, “దేవునియందు తమ నమ్మికయుంచు వారెవరైనను, వారి శోధనలందు, కష్టములందు, శ్రమలందు సహాయము పొందుదురని, అంత్యదినమున లేపబడుదురని నేనెరుగుదును.”11

ఆల్మా పొందిన ప్రత్యక్షతలో తాను ఒక దేవదూతను చూసాడు, అది చాలా అరుదైనది. పరిశుద్ధాత్మ ప్రేరేపణలను అనుభవించడమనేది చాలా సాధారణమైన విషయం. ఈ ప్రేరేపణలు దేవదూత ప్రత్యక్షతలకు సమానంగా ముఖ్యమైనవి కాగలవు. అధ్యక్షులు జోసెఫ్ ఫీల్డింగ్ స్మిత్ ఇలా బోధించారు: “పరిశుద్ధాత్మ నుండి ఒక వ్యక్తికి వచ్చే ప్రేరేపణలు ఒక దర్శనం కంటే ఎంతో ముఖ్యమైనవి. పరిశుద్ధాత్మ ఒకరి ఆత్మతో సంభాషించినప్పుడు, ఆ ఆత్మపై పడే ముద్రను చెరపడం అత్యంత కష్టమైనది.”12

ఇది తన రెండవ కుమారుడైన షిబ్లోన్‌కు ఆల్మా ఇచ్చిన ఉపదేశానికి మనల్ని నడిపిస్తుంది. షిబ్లోన్ తన అన్న హీలమన్ వలె నీతిమంతుడు. నేను నొక్కిచెప్పాలనుకున్న ఉపదేశము ఆల్మా 38:12 లోనిది, అందులో కొంత ఇలా చదువబడుతుంది, “ప్రేమతో నింపబడునట్లు నీ కామోద్రేకములన్నిటికి కళ్ళెము వేయుము.”

కళ్ళెము అనేది ఒక ఆసక్తికరమైన పదము. మనం గుర్రపు స్వారీ చేసినప్పుడు, దానిని నడిపించడానికి మనం కళ్ళెము ఉపయోగిస్తాము. దానికి మంచి పర్యాయపదము, నిర్దేశించుట, నియంత్రించుట లేదా హద్దులో పెట్టుట కావచ్చు. మనం భౌతిక శరీరాలను కలిగియుంటామని తెలుసుకున్నప్పుడు మనం ఆనందించి జయధ్వనులు చేసామని పాత నిబంధన మనకు చెప్తుంది.13 శరీరము చెడ్డది కాదు—అది అందమైనది, ఆవశ్యకమైనది—కానీ కొన్ని ఉద్రేకాలను సరిగ్గా ఉపయోగించకపోయినా, తగిన విధంగా వాటికి కళ్ళెము వేయకపోయినా అవి మనల్ని దేవుడు మరియు ఆయన కార్యము నుండి వేరుచేయగలవు మరియు మన సాక్ష్యంపై ప్రతికూల ప్రభావం చూపగలవు.

ప్రత్యేకించి రెండు ఉద్రేకాల గురించి మాట్లాడుకుందాం—మొదటిది, కోపం మరియు రెండవది, వ్యామోహం.14 ఆసక్తికరమైనది ఏమిటంటే, రెండిటికి కళ్ళెము వేయకుండా లేదా వాటిని నియంత్రించకుండా ఉంటే, అవి గొప్ప వేదన కలిగించగలవు, ఆత్మ యొక్క ప్రభావాన్ని తగ్గించగలవు, దేవుడు మరియు ఆయన కార్యము నుండి మనల్ని వేరుచేయగలవు. ప్రత్యర్థి మన జీవితాలను హింస మరియు అనైతికత యొక్క చిత్రాలతో నింపే ప్రతీ అవకాశాన్ని తీసుకుంటాడు.

కొన్ని కుటుంబాలలో, కోపంతో ఉన్న భర్త లేదా భార్య భాగస్వామిని లేదా బిడ్డను కొట్టడం సర్వసాధారణం. జూలైలో, నేను లండన్‌లో United Kingdom All-Party Parliamentary Forum (యునైటెడ్ కింగ్‌డమ్ ఆల్-పార్టీ పార్లమెంటరీ ఫోరం) లో పాల్గొన్నాను.15 స్త్రీలు మరియు యువతకు వ్యతిరేకంగా జరుగుతున్న హింస ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన సమస్యగా ప్రధానంగా పేర్కొనబడింది. హింసకు అదనంగా, ఇతరులు మాటలతో దుర్భాషలాడుతున్నారు. “భాగస్వామిని లేదా పిల్లలను హింసించేవారు … ఒకరోజు దేవుని యెదుట జవాబుదారులుగా నిలబడాలి” అని కుటుంబంపై ప్రకటన మనకు చెప్తుంది.16

అధ్యక్షుడు నెల్సన్ నిన్న ఉదయం ఈ విషయాన్ని బలంగా నొక్కి చెప్పారు. 17 మీ తల్లిదండ్రులు మిమ్మల్ని హింసించారా లేదా అనే దానితో సంబంధం లేకుండా, మీరు మీ భాగస్వామిని లేదా పిల్లలను శారీరకంగా, మాటలతో లేదా మానసికంగా హింసించము అని దయచేసి మీ మనస్సులో తీర్మానించుకోండి.

సామాజిక సమస్యలకు సంబంధించి వాదన మరియు పదాలతో దుర్భాషలాడడం మన కాలంలో ఉన్న అత్యంత ముఖ్యమైన సవాళ్ళలో ఒకటి. అనేక సందర్భాలలో, తర్కము, చర్చ, నాగరికత స్థానంలో కోపం మరియు దుర్భాష భర్తీ చేయబడ్డాయి. క్రీస్తు వంటి సుగుణాలైన ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ మరియు దయను వెదకమని రక్షకుని యొక్క అనుభవయుక్త అపొస్తలుడైన పేతురు ఇచ్చిన ఉపదేశాన్ని అనేకమంది వదిలివేసారు.18 క్రీస్తు వంటి సుగుణమైన వినయాన్ని కూడా వారు వదిలివేసారు.

కోపాన్ని నియంత్రించుకోవడం మరియు ఇతర ఉద్రేకాలకు కళ్ళెం వేయడానికి అదనంగా, మన ఆలోచనలు, భాష మరియు చర్యలను నియంత్రించుకోవడం ద్వారా మనం స్వచ్ఛమైన నైతిక జీవితాలను గడపాలి. మనం అశ్లీలచిత్రాలను విసర్జించాలి, మన ఇళ్ళలోకి ప్రవహించే వాటి సముచితత్వాన్ని అంచనా వేయాలి మరియు అన్ని రకాల పాప ప్రవర్తనను మానివేయాలి.

ఇది ఆల్మా తన కుమారుడైన కొరియాంటన్‌కు ఇచ్చిన ఉపదేశాన్ని మనకు తెస్తుంది. తన అన్నలు హీలమన్ మరియు షిబ్లోన్ వలె కాకుండా, కొరియాంటన్ నైతిక అతిక్రమములో నిమగ్నమయ్యాడు.

కొరియాంటన్ దుర్నీతిలో నిమగ్నమయ్యాడు కాబట్టి, అతనికి పశ్చాత్తాపము గురించి బోధించడం ఆల్మాకు అవసరమైంది. పాపము యొక్క గంభీరతను, తర్వాత పశ్చాత్తాపపడడాన్ని ఆయన అతనికి బోధించవలసి వచ్చింది.19

కాబట్టి, కామోద్రేకములకు కళ్ళెం వేయమనేది ఆల్మా యొక్క నివారణ ఉపదేశము, కానీ అతిక్రమించినవారు పశ్చాత్తాపపడాలనేది అతని సలహా. ఏప్రిల్ 2019 సర్వసభ్య సమావేశములో అధ్యక్షులు నెల్సన్ పశ్చాత్తాపముపై సభ్యులకు గంభీరమైన ఉపదేశమిచ్చారు. అనుదిన పశ్చాత్తాపము మన జీవితాలకు సమగ్రమైనదని ఆయన స్పష్టం చేసారు. “పశ్చాత్తాపము అనేది ఒక సంఘటన కాదు; అది ఒక ప్రక్రియ. అది సంతోషానికి, మనశ్శాంతికి మూలము,” అని ఆయన బోధించారు. “నిర్మలత్వమునకు మార్గము అనుదిన పశ్చాత్తాపము మరియు నిర్మలత్వము శక్తిని ఇస్తుంది.”20 అధ్యక్షులు నెల్సన్ ఉపదేశమిచ్చినట్లు కొరియాంటన్ చేసియుంటే, అతడు అపవిత్రమైన ఆలోచనలను అలరించడం మొదలుపెట్టిన వెంటనే అతడు పశ్చాత్తాపపడేవాడు. అధిక అతిక్రమములు జరిగియుండేవి కావు.

తన కుమారులకు ఆల్మా ఇచ్చిన చివరి ఉపదేశము లేఖనములన్నిటిలో గల అతిముఖ్యమైన సిద్ధాంతాలలో ఒకటి. అది యేసు క్రీస్తు చేత చేయబడిన ప్రాయశ్చిత్తానికి సంబంధించినది.

క్రీస్తు పాపమును తీసివేస్తాడని ఆల్మా సాక్ష్యమిచ్చాడు.21 రక్షకుని ప్రాయశ్చిత్తము లేనట్లయితే, న్యాయము యొక్క నిత్య సూత్రానికి శిక్ష అవసరమవుతుంది.22 రక్షకుని ప్రాయశ్చిత్తము కారణంగా, కనికరము పశ్చాత్తాపపడిన వారి కొరకు ప్రబలము కాగలదు మరియు అది దేవుని సన్నిధికి తిరిగి వెళ్ళడానికి వారిని అనుమతించగలదు. ఈ అద్భుతమైన సిద్ధాంతాన్ని ధ్యానించడం మనకు మంచిది.

అతడు లేక ఆమె కేవలం తన మంచి కార్యాల మూలంగా ఏ ఒక్కరూ దేవుని వద్దకు తిరిగివెళ్ళలేరు; మనందరికి రక్షకుని త్యాగము యొక్క లాభం అవసరము. అందరు పాపము చేసియున్నారు, కేవలం యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా మాత్రమే మనం కనికరము పొందగలము మరియు దేవునితో కలిసి జీవించగలము.23

కొరియాంటన్ చేసినట్లుగా, పాపాలు చిన్నవా లేదా తీవ్రంగా ఉన్నాయా అనే దానితో సంబంధం లేకుండా, మనలో పశ్చాత్తాప ప్రక్రియ ద్వారా వెళ్ళేవారు లేదా వెళ్ళబోయే వారందరికీ అల్మా అద్భుతమైన సలహా ఇచ్చారు. 42వ అధ్యాయములో 29వ వచనము ఇలా చదువబడుతుంది, “ఇప్పుడు, నా కుమారుడా, ఈ సంగతులు ఇకపై నిన్ను కష్టపెట్టనియ్యకుమని, నీవు పశ్చాత్తాపపడునట్లు చేయు కష్టముతో నీ పాపములు మాత్రమే నిన్ను కష్టపెట్టనివ్వమని నేను కోరుచున్నాను.”

కొరియాంటన్ ఆల్మా యొక్క ఉపదేశాన్ని ఆలకించాడు మరియు ఇరువురు పశ్చాత్తాపపడ్డారు, గౌరవంగా సేవచేసారు. రక్షకుని ప్రాయశ్చిత్తము కారణంగా, స్వస్థత అందరికీ లభ్యమవుతుంది.

ఆల్మా కాలంలో, హీబర్ కాలంలో మరియు మన కాలంలో, నిశ్చయంగా మనమందరము యేసు క్రీస్తు గురించి మన స్వంత సాక్ష్యాన్ని వెదకాలి, మన కామోద్రేకాలకు కళ్ళెం వేయాలి, మన పాపాల కొరకు పశ్చాత్తాపపడాలి, యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా శాంతిని కనుగొనాలి, దేవుడు మరియు ఆయన కార్యముపట్ల విశ్వాసంగా ఉండాలి.

ఇటీవల ఒక ప్రసంగంలో మరియు మళ్ళీ ఈ ఉదయం అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ దానిని ఈవిధంగా చెప్పారు: “యేసు క్రీస్తు గురించి మీ సాక్ష్యానికి మీరు బాధ్యత వహించండి అని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. దానికోసం పని చేయండి. దాన్ని సొంతం చేసుకోండి. దానిపట్ల శ్రద్ధ వహించండి. అది వృద్ధిచెందేలా దానిని పోషించండి. అప్పుడు మీ జీవితంలో జరిగే అద్భుతాలను గమనించండి.”24

అధ్యక్షులు నెల్సన్ గారి నుండి ఇప్పుడు మనము వినబోతున్నందుకు నేను కృతజ్ఞుడిని. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మన కాలము కొరకు ప్రభువు యొక్క ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన ద్వారా మనము పొందే అద్భుతమైన ప్రేరేపణను, నడిపింపును నేను ప్రేమిస్తాను మరియు భద్రపరచుకుంటాను.

ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అపొస్తలునిగా, రక్షకుని దైవత్వము మరియు ఆయన ప్రాయశ్చిత్తము యొక్క వాస్తవికతను గూర్చి యేసు క్రీస్తు నామములో స్థిరమైన నా సాక్ష్యాన్నిస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. See Ronald K. Esplin, “A Great Work Done in That Land,” Ensign, July 1987, 20: “జూన్ 13న, ఎల్డర్ కింబల్, ఓర్సన్ హైడ్, జోసెఫ్ ఫీల్డింగ్ మరియు హీబెర్ స్నేహితుడు విల్లార్డ్ రిచర్డ్స్ కర్ట్‌లాండ్ నుండి ఇంగ్లాండ్‌కు బయలుదేరారు. న్యూయార్క్‌లో, జూన్ 22న, కెనడియన్లు ఐజాక్ రస్సెల్, జాన్ గుడ్సన్ మరియు జాన్ స్నైడర్ వారితో చేరారు. ఆ తర్వాత ఏడుగురు సువార్తికులు లివర్‌పూల్‌కి గ్యారిక్ ‌లో ప్రయాణాన్ని బుక్ చేసుకున్నారు” (See Heber C. Kimball papers, 1837–1866; Willard Richards journals and papers, 1821–1854, Church History Library, Salt Lake City.)

  2. యూటాలోని సాల్ట్ లేక్ సిటీకి తూర్పు వైపున, ఎమిగ్రేషన్ కాన్యన్ ముఖద్వారం వద్ద గల This Is the Place స్మారకచిహ్నము, 1847, జూలై 24న సాల్ట్ లేక్ లోయలోకి పరిశుద్ధుల రాక యొక్క 100వ వార్షికోత్సవాన్ని గుర్తుచేసుకుంటుంది. స్మారకచిహ్నంపై బ్రిగమ్ యంగ్, హీబర్ సి. కింబల్ మరియు విల్ఫర్డ్ వుడ్రఫ్ విగ్రహాలు ఉన్నాయి.

  3. 8,000 మరియు 10,000 మధ్య ఉన్న కడవరి దిన పరిశుద్ధులు 1839 ప్రారంభంలో విజిలెంట్స్ మరియు గుంపుల హింసాత్మక చర్యల నుండి తప్పించుకోవడానికి మిస్సోరి నుండి పారిపోయారు. బ్రిగమ్ యంగ్ మరియు హీబర్ సి. కింబల్ ఆధ్వర్యంలో, 200-మైళ్ళ (320-కి.మీ.) దూరాన వున్న ఇల్లినాయ్కు కఠినమైన శీతాకాలపు వలస కోసం సామాగ్రిని సేకరించడానికి, అవసరాలను అంచనా వేయడానికి మరియు మార్గాలను ఏర్పాటు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. క్విన్సీ పట్టణంలోని దయగల నివాసితులు, బాధపడుతున్న పరిశుద్ధులకు తాత్కాలిక ఆశ్రయం మరియు ఆహారం అందించారు. (See Saints: The Story of the Church of Jesus Christ in the Latter Days, vol. 1, The Standard of Truth, 1815–1846 (2018), 375–77; William G. Hartley, “The Saints’ Forced Exodus from Missouri,” in Richard Neitzel Holzapfel and Kent P. Jackson, eds., Joseph Smith: The Prophet and Seer (2010), 347–89.)

  4. In Orson F. Whitney, Life of Heber C. Kimball: An Apostle, the Father and Founder of the British Mission (1945), 449; emphasis added.

  5. Orson F. Whitney, Life of Heber C. Kimball, 450.

  6. మోషే 1:39 చూడండి; see also “The Work of Salvation and Exaltation,” section 1.2 in General Handbook: Serving in The Church of Jesus Christ of Latter-day Saints, ChurchofJesusChrist.org. మేము క్రీస్తు దగ్గరకు వచ్చి, యేసు క్రీస్తు సువార్తను జీవిస్తూ, అవసరమైన వారి పట్ల శ్రద్ధ వహిస్తూ, సువార్తను అందుకోమని అందర్నీ ఆహ్వానిస్తూ, కుటుంబాలను నిత్యత్వము కోసం ఏకం చేస్తూ దేవుని పనిలో సహాయం చేస్తాము. సిద్ధాంతము మరియు నిబంధనలు 110 కూడా చూడండి, ఇది రక్షణకు సంబంధించిన పని కోసం ఇవ్వబడిన తాళపుచెవులను నిర్దేశిస్తుంది.

  7. 1 కొరింథీయులకు 15:40–41 కూడా చూడండి.

  8. సిద్ధాంతము మరియు నిబంధనలు 45:27 చూడండి.

  9. సిద్ధాంతము మరియు నిబంధనలు 45:29 చూడండి.

  10. ఆల్మా, ప్రవక్త ఆల్మా కుమారుడు. అతను దేశానికి ప్రధాన న్యాయమూర్తి, ప్రధాన యాజకుడు మరియు ప్రవక్త. అతను యువకుడిగా అద్భుతమైన పరివర్తనను అనుభవించాడు.

  11. ఆల్మా 36:3.

  12. Joseph Fielding Smith, “The First Presidency and the Council of the Twelve,” Improvement Era, Nov. 1966, 979.

  13. యోబు 38:7 చూడండి.

  14. ఆల్మా 39:9 చూడండి. “నీ కన్నుల యొక్క [కామేచ్ఛల] వెనుక ఇక వెళ్ళరాదని,” కోరియాంటన్‌కు ఆల్మా సూచించాడు.

  15. All-Party Parliamentary Group, Parliamentary sessions, Tuesday, July 5, 2022, “Preventing Violence and Promoting Freedom of Belief.”

  16. కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన,” ChurchofJesusChrist.org; పాట్రిక్ కీరన్, “ఆయన తన రెక్కల యందు స్వస్థత కలిగి లేచును: మనము విజేతల కంటే ఎక్కువగా ఉండవచ్చు,” లియహోనా, మే 2022, 37–39 కూడా చూడండి.

  17. రస్సెల్ ఎమ్. నెల్సన్, “ఏది సత్యము?,” లియహోనా, నవ. 2022, 29 చూడండి.

  18. 2 పేతురు 1:5–10 చూడండి.

  19. ఆల్మా 39:9 చూడండి.

  20. రస్సెల్ ఎమ్. నెల్సన్, “మనము మంచిగా చేయగలము మరియు మంచిగా ఉండగలము,” లియహోనా, మే 2019, 67, 68.

  21. ఆల్మా 39:15 చూడండి.

  22. ఆల్మా 42:16 చూడండి.

  23. 2 నీఫై 25:23 చూడండి.

  24. Russell M. Nelson, Facebook, Aug. 1, 2022, facebook.com/russell.m.nelson; Twitter, Aug. 1, 2022, twitter.com/nelsonrussellm; Instagram, Aug. 1, 2022, instagram.com/russellmnelson; see also “Choices for Eternity” (worldwide devotional for young adults, May 15, 2022), broadcasts.ChurchofJesusChrist.org.