సర్వసభ్య సమావేశము
శాశ్వతమైన శిష్యత్వము
2022 అక్టోబరు సర్వసభ్య సమావేశము


శాశ్వతమైన శిష్యత్వము

మన విశ్వాసాన్ని బ్రతికించి, బలపరచుకొనునట్లు పవిత్రమైన అలవాట్లను మరియు నీతివంతమైన దినచర్యలను మనము పెంపొందించినప్పుడు మనము ఆత్మీయ నమ్మకాన్ని మరియు శాంతిని కనుగొనగలము.

గత వేసవిలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2,00,000 మందికి పైగా మన యౌవనులు వందలాది వారాలపాటు జరిగిన యౌవనుల బలము కొరకు లేదా ఎఫ్‌ఎస్‌వై సమావేశాలలో ఒకదానిలో విశ్వాసాన్ని పెంచుకున్నారు. మహమ్మారి ఒంటరితనం నుండి బయటకు వస్తున్న అనేకమందికి దానికి హాజరవడం కూడా ప్రభువునందు విశ్వాసము చూపే చర్యగా ఉన్నది. పాల్గొనిన అనేకమంది యౌవనులు క్రమంగా వృద్ధిచెందుతున్న లోతైన పరివర్తనను అనుసరించినట్లు అనిపించింది. వారి వారము ముగింపులో, “ఎలా జరిగింది?” అని వారిని అడగడం నాకిష్టం.

కొన్నిసార్లు వారు ఇలా చెప్పారు: “సోమవారం నేను వచ్చి, దీనిని చేసేలా చేసింది కనుక, నేను మా అమ్మ మీద చిరాకుపడ్డాను. నాకు ఎవరూ తెలియదు. అది నాకోసమని నేను అనుకోవడం లేదు. నాకు స్నేహితులు ఎవరూ ఉండకపోవచ్చు. … కానీ ఇప్పుడు శుక్రవారము, నేను ఇంకా ఇక్కడ ఉండాలనుకుంటున్నాను. నా జీవితంలో నేను ఆత్మను అనుభూతి చెందాలని కోరుతున్నాను. నేను ఈవిధంగా జీవించాలని కోరుతున్నాను.”

వారి ఆత్మీయ అభివృద్ధికి మరియు లోతైన పరివర్తనకు తోడ్పడిన ఆత్మీయ వరములతో వారు దీవించబడినప్పుడు, వారిలో ప్రతీఒక్కరు స్పష్టమైన క్షణాలను మరియు ఆత్మీయ వరములు గురించి చెప్పడానికి వారి స్వంత కథలను కలిగియున్నారు. ఆయన సంరక్షణలో ఒక వారము గడపడంతో ఆయనను నమ్మడానికి ధైర్యమును కనుగొన్న ఈ యువ సమూహాల వ్యక్తిగత హృదయాల యొక్క నీతిగల కోరికలకు దేవుని ఆత్మ నిర్విరామంగా స్పందించడాన్ని నేను చూసినప్పుడు, ఎఫ్‌ఎస్‌వై సమావేశాలతో నిండిన ఈ వేసవి చేత నేను కూడా మార్చబడ్డాను.

సముద్రంలో మెరుస్తున్న ఉక్కు ఓడల వలె, మనం ఆత్మీయంగా హానికరమైన, నష్టపరిచే వాతావరణంలో జీవిస్తున్నాము, ఇక్కడ అత్యంత మెరుస్తున్న నమ్మకాలు మనస్ఫూర్తిగా నిర్వహించబడాలి లేదా అవి కత్తిరించబడతాయి, తరువాత బలహీనమవుతాయి, ఆపై బాగా దెబ్బతిని కూలిపోతాయి.

మన నమ్మకాల బలమును కాపాడుకోవడానికి మనము ఎలాంటి పనులు చేయగలము?

ఎఫ్‌ఎస్‌వై సమావేశాలు, శిబిరాలు, సంస్కార సమావేశాలు, మరియు సువార్త సేవలు, అభివృద్ధి యొక్క వంపులు మరియు ఆత్మీయ ఆవిష్కరణ ద్వారా మనల్ని సంబంధిత శాంతి స్థలములకు తీసుకొనివెళ్ళి, మన సాక్ష్యములను బలపరచగలవు. కానీ వెనక్కి జారిపోకుండా అక్కడే నిలిచియుండి, “క్రీస్తునందు నిలకడతో శ్రద్ధగా ముందుకు సాగడానికి” (2 నీఫై 31:20) మనము తప్పక చేయాల్సినదేమిటి? ముందుగా మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన, తరచుగా ప్రార్థించుట, లేఖనములందు పూర్తి ఆసక్తితో నిమగ్నమగుట మరియు నిజాయితీగా సేవ చేయుట వంటి పనులు చేయడాన్ని మనం కొనసాగించాలి.

మనలో కొందరికి, సంస్కార సమావేశానికి హాజరు కావడానికి కూడా ప్రభువుపై విశ్వాసమును సాధనం చేయడం అవసరము కావచ్చు. కానీ ఒక్కసారి మనము అక్కడికి వస్తే, ప్రభువు సంస్కారము యొక్క స్వస్థపరచు ప్రభావము, మనస్సునపట్టే సువార్త సూత్రములు మరియు సంఘ సమాజము యొక్క పోషణ మనల్ని ఆత్మీయంగా ప్రేరేపించి, బలపరచి ఇంటికి పంపుతాయి.

వ్యక్తిగతంగా కలిసి సమావేశమవడంలో శక్తి ఎక్కడనుండి వస్తుంది?

ఎఫ్‌ఎస్‌వై లో, మన యువతలో కొన్ని వందల వేలకంటే ఎక్కువమంది, ఆయన నామములో ఇద్దరు లేదా ముగ్గురు కూడుకొనే చోట (మత్తయి18:20 చూడండి) సమకూడడం అనే సాధారణ సూత్రమును ఉపయోగించుట ద్వారా, సువార్తను, లేఖనాలను చదివి అన్వయించడం, కలిసి పాడడం, కలిసి ప్రార్థించడం మరియు క్రీస్తునందు శాంతిని కనుగొనడం ద్వారా రక్షకుడిని సరిగ్గా తెలుసుకోగలిగారు. ఆత్మీయ మేల్కొలుపు కొరకు ఇది శక్తివంతమైన విధానము.

ప్రపంచమంతటా విస్తరించబడిన ఈ యువతీ యువకుల సమూహము అనేక రకాల అనియంత్రిత ప్రాపంచిక ప్రభావాలతో చుట్టుముట్టబడి ఉన్నప్పుడు కూడా ఇంకా “ప్రభువునందు నమ్మకముంచుట” (సామెతలు 3:5; 2022 యువత విషయము) అనగా అర్థమేమిటో తీర్మానించడానికి ఇప్పుడు ఇంటికి వెళ్ళారు. లేఖనాలు బాగా తెరువబడి, నిశ్శబ్దమైన ప్రదేశములో ధ్యానిస్తూ “ఆయనను వినుట” (జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:17) ఒక విషయము. కానీ ప్రాపంచిక అంతరాయములచేత చుట్టబడినప్పుడు మన శిష్యత్వమును రుజువు చేయడం మరొక విషయం, ఇక్కడ మనం స్వీయ అందోళన మరియు అస్పస్టమైన విశ్వాసము ద్వారా “ఆయనను వినడానికి” ప్రయాసపడాలి. తరువాత చెప్పబోయే దానిగురించి ఏ సందేహం ఉండరాదు: మన కాలంలోని ప్రపంచ నైతికత నిరంతరం మారుతూ ఉండగా, వారి సాక్ష్యాలలో స్థిరంగా నిలిచియుండడానికి వారు బలమైన తీర్మానము కలిగియున్నప్పుడు మన యువత చేత ప్రదర్శించబడిన నాయకత్వ లక్షణాలివి.

సంఘ ప్రోత్సాహ కార్యక్రమాలందు కల్పించబడిన ఉద్వేగాన్ని నిర్మించడానికి కుటుంబాలు ఇంటి వద్ద ఏమి చేయగలవు?

ఒకసారి నేను స్టేకు యువతుల అధ్యక్షురాలికి భర్తగా సేవ చేసాను. ఒక రాత్రి నా భార్య మరుసటి వారము జరుగబోయే యువతుల శిబిరానికి హాజరవడానికి తల్లిదండ్రులు మరియు వారి కుమార్తెల కోసం సంఘ భవనంలో సమావేశం నిర్వహిస్తుండగా, ప్రవేశ ద్వారం వద్ద నేను బిస్కెట్లు ఏర్పాటు చేసే పని చేస్తున్నాను. ఎక్కడ ఉండాలో మరియు ఏమి తీసుకురావాలో వివరించిన తరువాత, ఆమె ఇలా చెప్పింది, “ఇప్పుడు, మంగళవారం ఉదయం మీరు మీ ప్రియమైన అమ్మాయిలను బస్సు దగ్గర దింపినప్పుడు, వారిని గట్టిగా హత్తుకోండి. మరియు వారికి వీడ్కోలు చెప్పి ముద్దు పెట్టుకోండి---ఎందుకంటే వారు తిరిగి రావడంలేదు.”

ఎవరో గట్టిగా ఊపిరి పీల్చుకోవడం నేను విన్నాను, తరువాత అది నేనే అని గ్రహించాను. “తిరిగి రావడం లేదా?”

కానీ తరువాత ఆమె కొనసాగించింది: “మంగళవారం-ఉదయపు అమ్మాయిలను మీరు విడిచిపెట్టినప్పుడు, వారు పరధ్యానం కలిగించే స్వల్ప విషయాలను విడిచిపెట్టి, వారం రోజులు కలిసి నేర్చుకుంటారు, వృద్ధి చెందుతారు మరియు ప్రభువునందు నమ్మకముంచుతారు. మేము కలిసి ప్రార్థిస్తాము, పాడతాము మరియు వండుకుంటాము, కలిసి సేవ చేస్తాము, కలిసి సాక్ష్యాలను పంచుకుంటాము మరియు వారమంతా మేము ఆత్మతో అత్యధికంగా నింపబడేవరకు పరలోక తండ్రి యొక్క ఆత్మను అనుభవించడానికి అనుమతించే వాటిని చేస్తాము. శనివారము ఆ బస్సు దిగుతుండగా మీరు చూసే అమ్మాయిలు, మీరు మంగళవారం దింపిన అమ్మాయిల వలే ఉండరు. వారు నూతన సృష్ఠిలా ఉంటారు. శిబిరంలో వారు సాధించిన ఆధ్యాత్మికతను కొనసాగించడానికి మీరు సహాయపడినట్లయితే, వారు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు. మారడాన్ని, వృద్ధి చెందడాన్ని వారు కొనసాగిస్తారు. మరియు మీ కుటుంబము కూడా.”

ఆ శనివారము, ఆమె ఊహించినట్లుగానే జరిగింది. నేను గుడారాలను కారులో పెడుతుండగా, వారు ఇంటికి వెళ్ళకముందు అమ్మాయిలు సమావేశమైన చిన్న థియేటరులో నుండి నా భార్య స్వరమును నేను విన్నాను. “ఓహ్, ఇక్కడున్నారు మీరు. మీ కోసం మేము వారమంతా చూస్తున్నాము. మా శనివారపు అమ్మాయిలు,” అని ఆమె చెప్పడం నేను విన్నాను.

సీయోనులోని దృఢమైన యువత అద్భుతమైన సమయాలలో ప్రయాణిస్తున్నారు. ప్రవచించబడిన అంతరాయముతో కూడిన ఈ లోకములో భాగం కాకుండా, పరిశుద్ధత పట్ల పక్షపాతం కలిగిన లోకం లో ఆనందాన్ని కనుగొనడం వారి ప్రత్యేక బాధ్యత. దాదాపు వందల సంవత్సరాల క్రితం, “విశ్వమును మనం ఒక్కసారి ఓగ్రేస్ కోటలా భావించాలి, తుఫానుకు గురికావాలి, అయినప్పటికీ మనం సాయంత్రం తిరిగి రాగల మన స్వంత కుటీరంగా భావించాలి” (Orthodoxy [1909], 130) అని జి. కె. చెస్టర్‌టన్ చెప్పినప్పుడు, అతడు దాదాపుగా ఈ అన్వేషణ గృహ కేంద్రీకృతమైన మరియు సంఘ సహకారమివ్వబడిన విషయంగా ఉండుటను చూచినట్లుగా మాట్లాడాడు.

కృతజ్ఞతాపూర్వకంగా, వారు యుద్ధానికి ఒంటరిగా బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. వారు ఒకరి కోసం ఒకరున్నారు. మరియు మిమ్మల్ని కలిగియున్నారు. జీవిస్తున్న ప్రవక్తయైన అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్‌ను వారు అనుసరిస్తారు, ఆయన ఈ కాలములోని గొప్ప ప్రయత్నమైన ఇశ్రాయేలు సమకూర్పు గొప్పగా, గంభీరంగా ఉంటుందని ప్రకటించడంలో ఒక దీర్ఘదర్శిగా ఎరిగిన ఆశావాదంతో నడిపిస్తున్నారు (see “Hope of Israel” [worldwide youth devotional, June 3, 2018], HopeofIsrael.ChurchofJesusChrist.org).

ఈ వేసవిలో నేను, నా భార్య కల్లీన్ అనేక సంవత్సరాల క్రితం నేను ఒక క్రొత్త సువార్తకునిగా ఉన్న ఆమ్స్టర్డ్యామ్‌లో విమానాలు మారబోతున్నాము. నేను డచ్ నేర్చుకోవడానికి నెలల తరబడి ప్రయాసపడిన తరువాత, మా కెఎల్‌ఎమ్ విమానము దిగబోతుండగా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా కెప్టెన్ అసంబద్ధమైన ప్రకటన చేసాడు. ఒక్క క్షణం నిశ్శబ్దము తరువాత నా సహవాసి, “అది డచ్ అనుకుంటా,” అని గొణిగాడు. మేము పైకి చూసి, ఒకరి ఆలోచనలు ఒకరం చదివాము: నేర్చుకున్నదంతా పోయింది.

కానీ, అంతా పోలేదు. సువార్తికులుగా మేము అనుభవించిన అనేక అద్భుతాలకు వెళ్ళే మా దారిలో ఈ విమానాశ్రయం గుండా మేము నడిచి వెళ్తుండగా మేము రుజువు చేసిన విశ్వాసం గురించి నేను ఆశ్చర్యపోతున్నప్పుడు, ఇంటికి వెళ్ళే విమానము ఎక్కుతున్న సజీవమైన, శ్వాసించే సువార్తకుని ద్వారా నేను అకస్మాత్తుగా వర్తమానానికి తీసుకురాబడ్డాను. అతడు తననుతాను పరిచయం చేసుకొని, “అధ్యక్షులు లండ్, నేను ఇప్పుడు ఏమి చేయాలి?” అని అడిగాడు. బలంగా నిలిచియుండడానికి నేను ఏమి చేయాలి?

ఎఫ్‌ఎస్‌వై సమావేశాలు, యువత శిబిరాలు మరియు దేవాలయ ప్రయాణాలను విడిచి వెళ్ళినప్పుడు మరియు వారు పరలోకపు శక్తులను అనుభవించిన ఏ సమయంలోనైనా మన యువత మదిలో ఉన్న ప్రశ్న ఇదే: “దేవుడిని ప్రేమించడం శాశ్వతమైన శిష్యత్వంగా ఎలా మారగలదు?”

తన సువార్తసేవ యొక్క చివరి గడియలలో సేవ చేస్తున్న స్పష్టమైన దృష్టిగల ఈ సువార్తకుని కొరకు నేను అధికమైన ప్రేమను అనుభూతి చెందాను మరియు ఆ క్షణములో ఆత్మ యొక్క క్షణిక నిశ్చలతలో, “ఆయన నామాన్ని వహించడానికి నువ్వు బ్యాడ్జి ధరించనవసరం లేదు” అని చెప్పినప్పుడు నా స్వరము అస్పష్టమవడాన్ని నేను విన్నాను.

అతడి భుజాలపై నా చేతులుంచి ఇలా చెప్పాలనుకున్నాను, “నువ్వు చెయ్యాల్సింది ఇది. నువ్వు ఇంటికి వెళ్ళు మరియు ఇలాగే ఉండు. నీ ముఖంలో నీ మంచితనం కనిపిస్తోంది. నీ సువార్తసేవ క్రమశిక్షణ మరియు త్యాగాలు నిన్ను దేవుని యొక్క అద్భుతమైన కుమారునిగా చేసాయి. ఇక్కడ నీ కొరకు శక్తివంతంగా పని చేసిన దానిని ఇంటి వద్ద చేయడం కొనసాగించు. ప్రార్థించడాన్ని, ఎవరికి ప్రార్థించాలి అనేదానిని మరియు ప్రార్థన యొక్క భాషను నువ్వు నేర్చుకున్నావు. నువ్వు ఆయన వాక్యాలను అధ్యయనం చేసావు మరియు ఆయన వలె కావడానికి ప్రయత్నించడం ద్వారా రక్షకుడిని ప్రేమించడం నేర్చుకున్నావు. ఆయన తన తండ్రిని ప్రేమించినట్లుగా నువ్వు పరలోక తండ్రిని ప్రేమించావు, ఆయన ఇతరులకు సేవ చేసినట్లుగా నువ్వు ఇతరులకు సేవ చేసావు, ఆయన జీవించినట్లుగా నువ్వు ఆజ్ఞలను జీవించావు—మరియు నువ్వు చేయనప్పుడు, నువ్వు పశ్చాత్తాపపడ్డావు. నీ శిష్యత్వము కేవలం టీ-షర్టుపై నినాదము కాదు—అది ఇతరుల కొరకు ఉద్దేశ్యపూర్వకంగా జీవించిన నీ జీవితములో భాగమైంది. కనుక నువ్వు ఇంటికి వెళ్ళి, దానిని చేయి. అలాగే ఉండు. ఈ ఆత్మీయ ఉద్వేగాన్ని నీ జీవితాంతం తీసుకొని వెళ్ళు.”

ప్రభువైన యేసు క్రీస్తు మరియు ఆయన నిబంధన బాటయందు నమ్మకముంచడం ద్వారా, నిరంతరం మన విశ్వాసాన్ని బ్రతికించి, బలపరచుకొనునట్లు పవిత్రమైన అలవాట్లను మరియు నీతివంతమైన దినచర్యలను మనము పెంపొందించినప్పుడు మనము ఆత్మీయ నమ్మకాన్ని మరియు శాంతిని కనుగొనగలమని నాకు తెలుసు. మనలో ప్రతీఒక్కరం ఏది జరిగినా లక్ష్యపెట్టకుండా, మన సాక్ష్యాలను బలపరిచే వాటికి ఎప్పటికీ దగ్గరగా వెళ్ళెదముగాక. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.