సర్వసభ్య సమావేశము
విశ్వాసపు అడుగులతో యేసు క్రీస్తును అనుసరించండి
2022 అక్టోబరు సర్వసభ్య సమావేశము


విశ్వాసపు అడుగులతో యేసు క్రీస్తును అనుసరించండి

నేడు కష్ట సమయాల గుండా క్రీస్తు మనల్ని మోసుకెళ్ళగలరు. ఆయన పూర్వ అగ్రగాముల కొరకు దానిని చేసారు మరియు ఇప్పుడు మనలో ప్రతీఒక్కరి కొరకు చేస్తారు.

“ప్రతీ అడుగులో విశ్వాసము,” అనే పాట పాడినందుకు గాయకబృందానికి ధన్యవాదాలు. పూర్వ అగ్రగాములు 1847 లో సాల్ట్‌ లేక్ లోయకు చేరుకున్న 150వ వార్షికోత్సవ వేడుక కొరకు సిద్ధపాటుగా సహోదరుడు న్యూవెల్ డేలి1 చేత 1996 లో ఆ పాట యొక్క సంగీతము మరియు మాటలు వ్రాయబడ్డాయి.

ఆ వేడుక కొరకు సిద్ధపాటుగా ఈ పాట వ్రాయబడినప్పటికీ, దాని సందేశము సమస్త లోకమునకు అన్వయిస్తుంది.

పల్లవిని నేను ఎల్లప్పుడు ఇష్టపడ్డాను:

ప్రతీ అడుగులో విశ్వాసముతో, మనము ప్రభువైన క్రీస్తును అనుసరిస్తాము;

ఆయన శుద్ధమైన ప్రేమ ద్వారా నిరీక్షణతో నింపబడి, ఒక ఒప్పందంతో మనము పాడతాము.2

సహోదర సహోదరీలారా, విశ్వాసపు అడుగులతో యేసు క్రీస్తును మనము అనుసరించినప్పుడు, నిరీక్షణ ఉంటుందని నేను సాక్ష్యమిస్తున్నాను. ప్రభువైన యేసు క్రీస్తునందు నిరీక్షణ ఉంది. ఈ జీవితంలో ప్రతీఒక్కరికి నిరీక్షణ ఉంది. మన తప్పిదాలను, మన విచారాలను, ప్రయాసలను, శ్రమలను మరియు ఇబ్బందులను జయించడానికి నిరీక్షణ ఉన్నది. పశ్చాత్తాపమందు, క్షమించబడుటయందు మరియు ఇతరులను క్షమించుట యందు నిరీక్షణ ఉన్నది. క్రీస్తునందు నిరీక్షణ మరియు శాంతి ఉందని నేను సాక్ష్యమిస్తున్నాను. నేడు కష్ట సమయాల గుండా ఆయన మనల్ని మోసుకెళ్ళగలరు. ఆయన పూర్వ అగ్రగాముల కొరకు దానిని చేసారు మరియు ఇప్పుడు మనలో ప్రతీఒక్కరి కొరకు చేస్తారు.

సాల్ట్‌ లేక్ లోయకు పూర్వ అగ్రగాములు వచ్చిన 175వ వార్షికోత్సవాన్ని ఈ సంవత్సరం సూచిస్తుంది, ఇది నా పూర్వీకులపై నేను ప్రతిబింబించేలా చేసింది, వారిలో కొందరు నావూ నుండి సాల్ట్‌ లేక్ లోయకు నడిచారు. వారి యౌవనంలో మైదానాలను నడిచిన ముత్తాత, మామ్మలను నేను కలిగియున్నాను. హెన్రీ బాల్లర్డ్ 20 సంవత్సరాల వాడు;3 మార్గరెట్ మెక్‌నీల్‌కు 13;4 మరియు తరువాత సంఘము యొక్క ఆరవ అధ్యక్షులైన జోసెఫ్ ఎఫ్. స్మిత్, సాల్ట్‌ లేక్ లోయకు చేరుకున్నప్పుడు కేవలం 9 సంవత్సరాల వాడు. 5

మార్గము వెంబడి చల్లని శీతాకాలాలు, అనారోగ్యం, తగినన్ని దుస్తులు మరియు ఆహారం లేకపోవడం వంటి అన్ని రకాల నష్టాలను వారు ఎదుర్కొన్నారు. ఉదాహరణకు, హెన్రీ బాల్లర్డ్ సాల్ట్ ‌లేక్ లోయలో ప్రవేశించినప్పుడు అతడు “వాగ్దాన దేశమును” చూడడంలో ఆనందించాడు, కానీ తన శరీరాన్ని కప్పలేని పూర్తిగా చిరిగిపోయిన దుస్తులను ధరించినందున, అతడిని ఎవరైనా చూస్తారేమోనని భయంతో జీవించాడు. అతడు చీకటి పడే వరకు రోజంతా చెట్లపొదల వెనుక దాక్కొన్నాడు. తరువాత అతడు ఒక ఇంటికి వెళ్ళి దుస్తుల కోసం అడిగాడు, తద్వారా అతడు తన ప్రయాణాన్ని కొనసాగించి, తన తల్లిదండ్రులను కనుగొనగలడు. అతడు తన భవిష్యత్ గృహాన్ని భద్రంగా చేరుకున్నందుకు దేవునిపట్ల కృతజ్ఞత కలిగియున్నాడు.6

మా ముత్తాత, మామ్మలు వారి ప్రతీ శ్రమయంతటా విశ్వాసపు అడుగులతో యేసు క్రీస్తును అనుసరించారు. వారు ఎన్నడూ ఆశ కోల్పోనందుకు నేను కృతజ్ఞత కలిగియున్నాను. మీ విశ్వాసపు అడుగులు ఈరోజు మీ సంతానమును దీవించినట్లే, వారి విశ్వాసపు అడుగులు నన్ను, నా తరువాతి తరాలను దీవించాయి.

అగ్రగామి అనే మాట నామవాచకము మరియు క్రియ. నామవాచకంగా దాని అర్థము, క్రొత్త ప్రాంతమును కనుగొన్న లేదా అక్కడ స్థిరపడిన వారిలో మొదటి వ్యక్తి అయ్యుండవచ్చు. క్రియగా దాని అర్థము, ఇతరులు అనుసరించడానికి మార్గమును తెరచుట లేదా సిద్ధపరచుట కావచ్చు.7

ఇతరులకు మార్గమును సిద్ధపరచిన అగ్రగాముల గురించి నేను ఆలోచించినప్పుడు, నేను మొదట ప్రవక్త జోసెఫ్ స్మిత్ గురించి ఆలోచిస్తాను. జోసెఫ్ ఒక అగ్రగామి, ఎందుకనగా అతని విశ్వాసపు అడుగులు అతడిని చెట్ల పొదల వద్దకు నడిపించాయి, అక్కడ అతడు మోకరించి ప్రార్థన చేసాడు మరియు యేసు క్రీస్తు యొక్క సంపూర్ణ సువార్తను కలిగియుండడానికి మన కొరకు మార్గమును సిద్ధపరిచాడు. 1820లో వసంతకాల ఉదయాన “దేవుడిని అడుగుటకు”8 జోసెఫ్ యొక్క విశ్వాసము, యేసు క్రీస్తు యొక్క సంపూర్ణ సువార్త పునఃస్థాపన కొరకు మార్గమును తెరిచింది, అది మరొకసారి భూమిమీద సేవ చేయడానికి పిలువబడిన ప్రవక్తలను, అపొస్తలులను కలిగియున్నది.9 జోసెఫ్ స్మిత్ దేవుని యొక్క ప్రవక్త అని నాకు తెలుసు. తండ్రియైన దేవుడు, ఆయన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సన్నిధిలో మోకరించడానికి అతడి విశ్వాసపు అడుగులు అతడిని నడిపించాయని నాకు తెలుసు.

ప్రవక్త జోసెఫ్ యొక్క విశ్వాసపు అడుగులు, యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్త కృప యొక్క మరొక నిబంధనయైన మోర్మన్ గ్రంథమును వెలుగులోనికి తేవడానికి ప్రభువు యొక్క సాధనముగా ఉండడాన్ని అతడికి సాధ్యం చేసాయి.

అనివార్యమైన కష్టము మరియు వ్యతిరేకతను ఎదుర్కోవడంలో ప్రవక్త జోసెఫ్ స్మిత్ యొక్క విశ్వాసము మరియు పట్టుదల ద్వారా, అతడు భూమిపై మరలా యేసు క్రీస్తు యొక్క సంఘమును స్థాపించుటలో ప్రభువు యొక్క హస్తములలో ఒక సాధనముగా ఉండగలిగాడు.

గత సర్వసభ్య సమావేశములో, నేను పూర్తి-కాల సువార్త సేవ నన్ను దీవించిన విధానము గురించి మాట్లాడాను. మన పరలోక తండ్రి యొక్క మహిమకరమైన రక్షణ ప్రణాళిక, జోసెఫ్ స్మిత్ యొక్క మొదటి దర్శనము మరియు మోర్మన్ గ్రంథమును అతడు అనువదించుట గురించి నేను బోధించబడినప్పుడు నేను దీవించబడ్డాను. పునఃస్థాపించబడిన సువార్త యొక్క సందేశాన్ని వినడానికి సమ్మతించే వారికి బోధించడంలో పునఃస్ఠాపించబడిన ఈ బోధనలు మరియు సిద్ధాంతము నా విశ్వాసపు అడుగులను నడిపించాయి.

నేటి మన సువార్తికులు ఆధునిక అగ్రగాములు, ఎందుకనగా వారు ప్రపంచమంతటా జనులతో ఈ మహిమకరమైన సందేశాన్ని పంచుకుంటారు, ఆవిధంగా ఆయనను, ఆయన కుమారుడైన యేసు క్రీస్తును తెలుసుకోవడానికి మన పరలోక తండ్రి పిల్లల కొరకు మార్గమును తెరుస్తున్నారు. యేసు క్రీస్తు యొక్క సువార్తను అంగీకరించుట, సంఘము మరియు దేవాలయము యొక్క విధులు, దీవెనలను పొందడానికి, వాటి కొరకు సిద్ధపడడానికి ప్రతీఒక్కరి కోసం మార్గమును తెరుస్తుంది.

“యోగ్యుడైన, సమర్థుడైన ప్రతీ యువకుడు సువార్తసేవ కోసం సిద్ధపడి, సేవ చేయాలని ప్రభువు కోరారు” మరియు “యౌవనులైన, సమర్థులైన సహోదరీల” కొరకు “సువార్తసేవ అనేది శక్తివంతమైనదే, కానీ ఐచ్ఛికమైన అవకాశం”10 అని గత సర్వసభ్య సమావేశంలో అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మరలా ధృవీకరించారు.

ప్రియమైన యువతీ యువకులారా, మీ విశ్వాసపు అడుగులు సువార్తసేవ చేయడానికి—ఆయన మహిమకరమైన సన్నిధికి తిరిగి వెళ్ళడానికి నడిపించే నిబంధన బాటను కనుగొని, దానిపై నిలిచియుండడానికి దేవుని పిల్లల కొరకు మార్గమును తెరచుట ద్వారా—ఆధునిక దిన అగ్రగాములుగా ఉండడానికి ప్రభువు యొక్క ఆహ్వానమును అనుసరించేందుకు మీకు సహాయపడతాయి.

అధ్యక్షులు నెల్సన్ సంఘములో ఒక అగ్రగామిగా ఉన్నారు. ఆయన ఒక అపొస్తలునిగా ప్రయాణించి, సువార్తను ప్రకటించడానికి అనేక దేశాలలో మార్గాన్ని సిద్ధపరిచారు. సంఘము యొక్క అధ్యక్షునిగా మరియు ప్రవక్తగా అయిన వెంటనే, బయల్పాటును పొందడానికి “[మన] ఆత్మీయ సామర్థ్యమును వృద్ధి చేయమని ఆయన మనకు మనవి చేసారు.”11 మన సాక్ష్యములను బలపరచడానికి ఆయన మనకు బోధించడాన్ని కొనసాగించారు. యువజనుల భక్తి సమావేశంలో, ఆయన ఇలా చెప్పారు:

మీ సాక్ష్యానికి బాధ్యత వహించమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. సాక్ష్యము పొందడానికి అవసరమైన దానిని చేయండి. దాని సంపాదించి, కాపాడండి. దానిని బలపరచడానికి అవసరమైన విషయాలను చేయండి. అది ఎదుగునట్లు దానిని పోషించండి. …

“[తరువాత] మీ జీవితంలో జరుగుతున్న అద్బుతాలను గమనించండి.”12

ఆత్మీయంగా మరింత స్వయంసమృద్ధిగా ఎలా ఉండాలో ఆయన మనకు బోధిస్తున్నారు. “రాబోయే దినములలో, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, మార్గనిర్దేశము, ఆదరణ మరియు నిరంతర ప్రభావము లేకుండా ఆత్మీయ మనుగడ సాధ్యంకాదు”13 అని ఆయన అన్నారు.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ నేడు భూమిపైనున్న దేవుని ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను.

మన రక్షకుడైన యేసు క్రీస్తు, మార్గమును సిద్ధపరచుటలో అంతిమ అగ్రగామి. వాస్తవానికి, రక్షణ ప్రణాళిక నెరవేర్చబడడానికి ఆయనే “మార్గము,” 14 తద్వారా మనము పశ్చాత్తాపపడి, ఆయన యందు విశ్వాసము ద్వారా మన పరలోక తండ్రి వద్దకు తిరిగి వెళ్ళగలము.

“నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడని”15 యేసు అన్నారు. ఆయన మనల్ని అనాథలుగా విడువరు; ఆయన మన శ్రమలందు మన వద్దకు వస్తానని వాగ్దానమిచ్చారు.16 ఆయన మనల్ని “హృదయము యొక్క పూర్ణ ఉద్దేశముతో [ఆయన] యొద్దకు రమ్మని ఆహ్వానించారు మరియు [ఆయన] [మనల్ని] స్వస్థపరుస్తారు.”17

యేసు క్రీస్తు మన రక్షకుడని, విమోచకుడని, తండ్రితో మన న్యాయవాది అని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తును ప్రతీ అడుగులో విశ్వాసంతో అనుసరించుట ద్వారా ఆయన వద్దకు తిరిగి రావడానికి మన పరలోక తండ్రి మన కొరకు మార్గమును తెరిచారు.

మా ముత్తాత-మామ్మలు మరియు మిగిలిన పూర్వ అగ్రగాములు బండ్లు, తోపుడుబండ్ల ద్వారా మరియు నడుచుకుంటూ సాల్ట్‌ లేక్ లోయకు వస్తున్నప్పుడు అనేక ఆటంకాలు ఎదుర్కొన్నారు. మనము కూడా మన జీవితములంతటా మన వ్యక్తిగత ప్రయాణములో సవాళ్ళు ఎదుర్కొంటాము. మనము తోపుడుబండ్లను తోయడంలేదు లేదా నిటారుగా ఉన్న పర్వతాలపై మరియు తీవ్రమైన మంచు తుఫానుల ద్వారా కప్పబడిన బండ్లను మనము నడపడంలేదు; మన కాలంలోని శోధనలు మరియు సవాళ్ళను ఆత్మీయంగా జయించడానికి వారు చేసినట్లుగా చేయడానికి మనము ప్రయత్నిస్తున్నాము. మనము నేరవేర్చాలని దేవుడు కోరిన వాటిని మనం కలిగియున్నాము; కొన్నిసార్లు కష్టమైన వాటిని నెరవేర్చాలని ఆయన కోరుతున్నారు. ఈనాటి శ్రమలు పూర్వ అగ్రగాముల శ్రమలకంటే భిన్నంగా ఉన్నప్పటికీ, అవి మనకు తక్కువ సవాళ్ళతో కూడినవి కావు.

ప్రవక్తను అనుసరించుట మరియు పూర్వ అగ్రగాములకు ఉన్నట్లుగా, విశ్వాసము యొక్క నిబంధన బాటపై మన పాదమును స్థిరముగా నిలుపుకొనుట ముఖ్యమైనది.

ప్రతీ అడుగులో విశ్వాసముతో యేసు క్రీస్తును మనము అనుసరిద్దాము. మనము ప్రభువుకు సేవ చేసి, ఒకరికొకరు సేవ చేసుకోవాల్సిన అవసరమున్నది. మన నిబంధనలను పాటించి, గౌరవించడం ద్వారా ఆత్మీయంగా మనల్ని మనం బలపరచుకోవాల్సిన అవసరమున్నది. ఆజ్ఞలను పాటించాలనే ఆతృతగల భావనను మనం కోల్పోరాదు. దేవుని కొరకు, ప్రభువైన యేసు క్రీస్తు కొరకు మన ప్రేమను మరియు మన ఒడంబడికను బలహీనపరచడానికి సాతాను ప్రయత్నిస్తాడు. ఎవరైనా వారి మార్గమును కోల్పోయిన యెడల, మన రక్షకుని చేతిలో మనం ఎప్పటికీ కోల్పోలేదని దయచేసి జ్ఞాపకముంచుకోండి. పశ్చాత్తాపము యొక్క దీవెనతో, మనము ఆయన వద్దకు తిరిగి వెళ్ళగలము. నిబంధన బాటపై నిలిచియుండడానికి మనము ప్రయాసపడినప్పుడు నేర్చుకోవడానికి, ఎదగడానికి మరియు మారడానికి ఆయన మనకు సహాయపడతారు.

మన ప్రతీ అడుగులో విశ్వాసముతో, ఆయనపై దృష్టిసారించి, నిబంధన బాటపై మన పాదమును స్థిరముగా నిలుపుకొని, మనము ఎప్పటికీ యేసు క్రీస్తు యొక్క అడుగుజాడలను అనుసరించెదము గాకయని యేసు క్రీస్తు నామములో నేను వినయముగా ప్రార్థిస్తున్నాను, ఆమేన్.