సర్వసభ్య సమావేశము
ఓ సీయోనూ, నీ బలము ధరించుకొనుము
2022 అక్టోబరు సర్వసభ్య సమావేశము


ఓ సీయోనూ, నీ బలము ధరించుకొనుము

మనలో ప్రతీఒక్కరు మన భౌతిక మరియు ఆత్మీయ ప్రాధాన్యతలను మనఃపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా విశ్లేషించుకోవాలి.

ఉపమానాలు--బోధించడానికి ప్రభువైన యేసు క్రీస్తు యొక్క శక్తివంతమైన, నైపుణ్యమైన విధానం యొక్క ముఖ్యభాగము. సాధారణంగా నిర్వచించబడిన రక్షకుని యొక్క ఉపమానాలు ఐహిక వస్తువులు మరియు మర్త్య అనుభవాలతో ఆత్మీయ సత్యములను పోల్చడానికి ఉపయోగించబడిన కథలు. ఉదాహరణకు, క్రొత్త నిబంధన సువార్తలు పరలోక రాజ్యమును ఆవగింజతో,1 అమూల్యమైన ముత్యముతో,2 ఆయన ద్రాక్షతోటలో యజమాని మరియు పనివారితో,3 పదిమంది కన్యకలతో,4 మరియు మిగిలిన అనేక విషయాలతో పోల్చబడిన వాటితో నిండియున్నాయి. ప్రభువు యొక్క గలిలయ పరిచర్యలో భాగముగా, “ఆయన ఉపమానము లేక వారికేమియు బోధింపలేదు”5 అని లేఖనాలు సూచిస్తున్నాయి.

ఉద్దేశించబడిన అర్థము లేదా ఉపమానము యొక్క సందేశము సాధారణంగా స్పష్టంగా వ్యక్తీకరించబడలేదు. బదులుగా, కథ దేవునియందు వారి విశ్వాసానికి, వ్యక్తిగత ఆత్మీయ సిద్ధపాటుకు మరియు నేర్చుకోవాలనే సంసిద్ధతకు తగిన నిష్పత్తిలో మాత్రమే దైవిక సత్యాన్ని గ్రహీతలకు తెలియజేస్తుంది. కాబట్టి, ఒక వ్యక్తి నైతిక కర్తృత్వమును సాధన చేసి, ఉపమానములో పొందుపరచబడిన సత్యములను కనుగొనడానికి, చురుకుగా “అడగాలి, వెదకాలి మరియు తట్టాలి.”6

రాజు వివాహ విందు ఉపమానము యొక్క ప్రాముఖ్యతను ఇప్పుడు మనము పరిగణించినప్పుడు, పరిశుద్ధాత్మ మనలో ప్రతీఒక్కరికి జ్ఞానోదయాన్ని కలుగజేయాలని నేను ప్రార్థిస్తున్నాను.

రాజు వివాహ విందు

“యేసు … వారికుత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను,

“పరలోక రాజ్యము, తన కుమారునికి పెండ్లి విందు చేసిన యొక రాజును పోలియున్నది,

“ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి.

“కాగా అతడు--ఇదిగో నా విందు సిద్ధపరచియున్నాను, ఎద్దులును క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది. పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను.

“వారు లక్ష్యము చేయక, ఒకడు తన పొలమునకు మరియొకడు తన వర్తకమునకును వెళ్ళిరి.”7

ప్రాచీనకాలములో, యూదా జీవితంలో అత్యంత సంతోషకరమైన సందర్భాలలో ఒకటి వివాహ వేడుక—ఆ వేడుక ఒక వారము లేదా రెండు వారాలు కూడా ఉంటుంది. అటువంటి కార్యక్రమానికి విస్తృతమైన ప్రణాళిక అవసరం మరియు అతిథులకు చాలా ముందుగా తెలియజేయబడడమే కాకుండా, ఉత్సవాలు ప్రారంభమయ్యే రోజున జ్ఞాపకం చేయబడుతుంది. ఒక రాజు నుండి అతని పౌరులకు అటువంటి వివాహానికి ఆహ్వానం తప్పనిసరిగా ఒక ఆజ్ఞగా పరిగణించబడుతుంది. అయినప్పటికీ, ఈ ఉపమానములో పిలువబడిన అతిథులలో అనేకమంది రాలేదు. 8

“రాజు విందుకి హాజరు కావడానికి నిరాకరించడం అనేది రాజు అధికారానికి వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకమైన తిరుగుబాటు [చర్య] మరియు పాలిస్తున్న సార్వభౌమాధికారి, అతని కొడుకు ఇద్దరికి వ్యక్తిగత అవమానము. … ఒక వ్యక్తి తన పొలానికి, మరొక వ్యక్తి తన [వ్యాపార ప్రయోజనాలకు]”9 తిరిగి వెళ్ళుట దారితప్పిన వారి ప్రాధాన్యతలను మరియు రాజు చిత్తాన్ని పూర్తిగా విస్మరించడాన్ని సూచిస్తుంది.10

ఉపమానము ఇలా కొనసాగుతుంది:

“అప్పుడతడు--పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది, గాని పిలువబడిన వారు పాత్రులు కారు.

“గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరిని పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను.

“ఆ దాసులు రాజ మార్గములకు పోయి చెడ్డ వారినేమి మంచివారినేమి తమకు కనబడినవారినందరిని పోగుచేసిరి గనుక విందుకు వచ్చినవారితో ఆ పెండ్లి శాల నిండెను.”11

ఆ రోజుల్లో వివాహ విందు ఇచ్చే అతిథేయుడు— ఈ ఉపమానంలో రాజు— యొక్క ఆచారము, వివాహానికి వచ్చిన అతిథులకు దుస్తులు ఏర్పాటు చేయడం. అటువంటి వివాహ దుస్తులు సాధారణమైనవి, హాజరైన వారందరూ ధరించే మామూలు అంగీలు. ఈవిధంగా, స్థాయి మరియు అంతస్థు రూపుమాపబడి, విందులో ఉన్న ప్రతీఒక్కరు సమానంగా కలిసిపోవచ్చు.12

వివాహానికి హాజరు కావడానికి రాజ మార్గముల నుండి ఆహ్వానించబడిన జనులు కార్యక్రమము కొరకు తగిన దుస్తులను కొనుగోలు చేయడానికి సమయాన్ని లేదా మార్గాలను కలిగియుండేవారు కాదు. ఫలితంగా, బహుశా రాజు తన స్వంత దుస్తుల అలమార నుండి అతిథులకు దుస్తులు ఇచ్చియుండవచ్చు. ప్రతీఒక్కరికి రాచరికపు దుస్తులను ధరించే అవకాశము ఇవ్వబడింది.13

రాజు పెళ్ళి మంటపంలో ప్రవేశించినప్పుడు, అతడు అతిథులను చూసాడు మరియు ఒక ప్రస్ఫుటమైన అతిథి వివాహ దుస్తులను ధరించకపోవడాన్ని వెంటనే గమనించాడు. ఆ వ్యక్తి ముందుకు తేబడగా రాజు, “స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడి కేలాగు వచ్చితివి? అని అడుగగా, వాడు మౌనియైయుండెను.”14 సారాంశంలో, రాజు అడిగాడు, “నీ కోసం వివాహ వస్త్రము సిద్ధపరచబడియున్నప్పటికీ, నీవు ఎందుకు ధరించలేదు”?15

ఆ వ్యక్తి స్పష్టంగా ఈ ప్రత్యేక సందర్భము కోసం సరిగ్గా ధరించలేదు, మరియు “వాడు మౌనియైయుండెను,”16 అను వాక్యభాగము ఈ వ్యక్తికి ఎటువంటి కారణము లేదని సూచిస్తున్నది.

ఆ మనిషి చర్యల యొక్క ప్రాముఖ్యత గురించి ఎల్డర్ జేమ్స్ ఈ. థాల్మేజ్ ఈ బోధనాత్మక వ్యాఖ్యానాన్ని అందించారు: “వస్త్రం ధరించని అతిథి నిర్లక్ష్యం, ఉద్దేశపూర్వక అగౌరవం లేదా మరికొంత ఘోరమైన నేరానికి పాల్పడినట్లు ఈ సందర్భం నుండి స్పష్టంగా ఉంది.” ఆ రాజు మొదట దయతో ఆలోచించాడు, వివాహ వస్త్రం లేకుండా ఆ వ్యక్తి ఎలా ప్రవేశించాడని మాత్రమే విచారించాడు. ఆ మనిషి తన అసాధారణ రూపాన్ని వివరించగలిగితే లేదా అతనికి ఏదైనా సహేతుకమైన కారణం ఉండియుంటే, అతను ఖచ్చితంగా మాట్లాడి ఉండేవాడు; కానీ అతను మాట్లాడకుండా ఉండిపోయాడని మనకు చెప్పబడింది. రాజు యొక్క ఆహ్వానం అతని సేవకులు కనుగొన్న వారందరికీ ఉచితంగా అందించబడింది; కానీ ప్రతీఒక్కరూ రాజ భవనంలోకి తలుపు గుండా ప్రవేశించవలసి వచ్చింది; మరియు రాజు వ్యక్తిగతంగా కనిపించే విందు గదికి చేరుకునే ముందు, ప్రతీఒక్కరూ సరిగ్గా దుస్తులు ధరించియుండాలి; కానీ ఇవ్వబడిన దుస్తులు ధరించని వ్యక్తి, మరోవిధంగా వేరే మార్గం గుండా లోనికి ప్రవేశించాడు; మరియు సింహద్వారము వద్ద నిలబడిన కావలివారిని దాటనందున, అతడు చొరబాటుదారుడు.”17

వివాహ వస్త్రాన్ని ధరించడానికి ఆ వ్యక్తి నిరాకరించడం “రాజు మరియు అతని కొడుకు పట్ల స్పష్టమైన అగౌరవాన్ని” రుజువు చేసినట్లుగా జాన్ ఓ. రీడ్ అనే ఒక క్రైస్తవ రచయిత పేర్కొన్నాడు. అతడు వివాహ వస్త్రములు లేకుండా ఉండలేదు, కానీ అతడు వాటిని ధరించకుండా ఉండడానికి ఎంపిక చేసాడు. అతడు సందర్భము కొరకు తగిన దుస్తులు ధరించడానికి తిరుగుబాటుతో నిరాకరించాడు. రాజు యొక్క స్పందన వేగంగా మరియు నిర్ణయాత్మకంగా ఉంది: “వీని కాళ్లు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును.”18

వ్యక్తిపై రాజు యొక్క తీర్పు ప్రధానంగా వివాహ వస్త్రం లేకపోవడాన్ని బట్టిలేదు—కానీ వాస్తవానికి, “అతడు దానిని ధరించకూడదని నిర్ణయించుకున్న దానిపై ఆధారపడింది. ఆ వ్యక్తి … వివాహ విందుకు హాజరయ్యే గౌరవాన్ని కోరుకున్నాడు, కానీ … రాజు ఆచారాన్ని అనుసరించడానికి ఇష్టపడలేదు. అతడు తన స్వంత విధానంలో పని చేయాలనుకున్నాడు. అతడు సరైన వస్త్రమును ధరించకపోవడం రాజు మరియు అతడి సూచనలపై అతడి అంతర్గత తిరుగుబాటును బహిర్గతం చేసింది.”19

కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే

తరువాత లోతుగా ఆలోచింపజేసే లేఖనంతో ఉపమానము ముగించబడింది: “కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే.”20

ఆసక్తికరంగా, జోసెఫ్ స్మిత్ తాను ప్రేరేపించబడి అనువదించిన బైబిలులో మత్తయి నుండి ఈ వచనమునకు క్రింది సవరణ చేసాడు: “కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే; కాబట్టి అందరూ వివాహ వస్త్రమును కలిగిలేరు.”21

వివాహ విందుకు ఆహ్వానము మరియు పాల్గొనడానికి ఎంపిక సంబంధితమైనవే, కానీ భిన్నమైనవి. ఆహ్వానము స్త్రీ పురుషులు అందరి కొరకైనది. ఒక వ్యక్తి ఆహ్వానాన్ని అంగీకరించి, విందులో కూర్చోవచ్చు—అయినప్పటికీ పాల్గొనడానికి ఎంపిక చేయకుండా ఉండవచ్చు, ఎందుకంటే అతడు లేదా ఆమె ప్రభువైన యేసు యందు, ఆయన దైవిక కృపయందు విశ్వాసాన్ని మార్చే సరైన వివాహ వస్త్రాన్ని కలిగి లేరు. కాబట్టి, మనము దేవుని యొక్క పిలుపును, ఆ పిలుపుకు మన వ్యక్తిగత స్పందనను రెండిటిని కలిగియున్నాము మరియు అనేకులు పిలువబడవచ్చు కానీ ఏర్పరచబడిన వారు కొందరే.22

ఏర్పరచబడుట లేదా ఏర్పరచబడేలా అగుట అనేది మనకివ్వబడిన ప్రత్యేక హోదా కాదు. బదులుగా, మీరు, నేను మన నైతిక కర్తృత్వమును నీతిగా సాధన చేయడం ద్వారా చివరకు ఏర్పరచబడుటకు ఎంపిక చేయగలము.

ఏర్పరచబడిన అనే మాట సిద్ధాంతము మరియు నిబంధనల నుండి క్రింద పరిచయమైన వచనాలలో ఉపయోగించబడుటను దయచేసి గమనించండి:

“ఇదిగో, పిలువబడిన వారు అనేకులు, కానీ ఎన్నుకోబడిన వారు కొందరే. వారెందుకు ఎన్నుకోబడలేదు?

“ఎందుకనగా వారి హృదయాలు లోక విషయములపైన ఎంతగానో ఉంచబడి, మనుష్యుల సన్మానములను వారు కోరెదరు.”23

ఈ వచనాల యొక్క అంతరార్థం చాలా సూటిగా ఉందని నేను నమ్ముతున్నాను. ఆ జాబితాలో మన పేర్లు ఏదో ఒక రోజు చేర్చబడతాయని మనం ఆశించడానికి దేవునికి ప్రియమైన జనుల జాబితా లేదు. “ఏర్పరచబడుటను” ఆయన కొందరికే పరిమితం చేయడు. బదులుగా, మన హృదయాలు, మన కోరికలు, పవిత్రమైన సువార్త నిబంధనలు మరియు విధులపట్ల మన గౌరవం, ఆజ్ఞలకు మన విధేయత మరియు అన్నిటికన్నా ముఖ్యంగా, రక్షకుని యొక్క విమోచన కృప మరియు కరుణ, మనము దేవుని చేత ఏర్పరచబడిన వారిగా లెక్కించబడతామో లేదో తీర్మానిస్తుంది.24

“క్రీస్తు నందు విశ్వాసముంచమనియు దేవునితో సమాధానపడుడనియు మా సంతానమును మా సహోదరులను కూడా ఒప్పించునట్లు మేము వ్రాయుటకు శ్రద్ధగా కృషి చేయుచున్నాము; ఏలయనగా మనము సమస్తము చేసిన తర్వాత కూడా మనము కృప చేతనే రక్షింపబడియున్నామని మేము ఎరుగుదుము.”25

మన తీరికలేని అనుదిన జీవితాలలో మరియు మనం జీవిస్తున్న సమకాలీన ప్రపంచం యొక్క గందరగోళంలో, ఆనందం, శ్రేయస్సు, ప్రజాదరణ మరియు ప్రాముఖ్యతను మన ప్రాథమిక ప్రాధాన్యతలుగా చేసుకోవడం ద్వారా అత్యంత ముఖ్యమైన నిత్య విషయాల నుండి మన దృష్టి మరల్చబడవచ్చు. “ఈ లోక విషయములు” మరియు “మనుష్యుల సన్మానముల” పట్ల మనకున్న స్వల్పకాలిక శ్రద్ధ మన ఆత్మీయ జన్మహక్కును చిక్కుడు కాయల వంటకము కంటే చాలా తక్కువ ధరకు కోల్పోయేలా చేస్తుంది.26

వాగ్దానము మరియు సాక్ష్యము

పాత నిబంధన ప్రవక్తయైన హగ్గయి ద్వారా ఆయన జనులకు ప్రభువు యొక్క బోధనను నేను పునరావృతం చేస్తాను: “కాబట్టి సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా--మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి.”27

పరలోక తండ్రి మరియు రక్షకుడు మనపై అనుగ్రహించడానికి సమ్మతించిన సమృద్ధియైన దీవెనలను మన జీవితాలలో ఆటంకపరచే విషయాలను గుర్తించడానికి, మనలో ప్రతీఒక్కరు మన భౌతిక మరియు ఆత్మీయ ప్రాధాన్యతలను మనఃపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా విశ్లేషించుకోవాలి. మనం నిజంగా ఉన్నట్లుగా మనల్ని మనం చూడడానికి పరిశుద్ధాత్మ మనకు సహాయపడతాడు.28

చూచే కన్నులు మరియు వినే చెవుల యొక్క ఆత్మీయ వరము కొరకు మనము సరిగ్గా వెదికినప్పుడు,29 జీవముగల ప్రభువుతో మన నిబంధన సంబంధాన్ని బలపరచుకోవడానికి సమర్థతతో మరియు వివేకముతో మనము దీవించబడతామని నేను వాగ్దానము చేస్తున్నాను. మనము మన జీవితాలలో దైవత్యము యొక్క శక్తిని కూడా పొందుతాము26—మరియు చివరకు ప్రభువు యొక్క విందుకు పిలువబడతాము మరియు ఏర్పరచబడతాము.

“సీయోనూ, లెమ్ము, లెమ్ము, నీ బలము ధరించుకొనుము.”31

“ఏలయనగా సౌందర్యమందును, పరిశుద్ధతయందును సీయోను వర్థిల్లవలెను; ఆమె గుడారపు స్థలములు విశాలపరచబడవలెను; ఆమె స్టేకులు బలపరచబడవలెను; సీయోను లేచి, తన సుందర వస్త్రములను ధరించుకొనవలెనని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.”32

దేవుని యొక్క దైవత్వము మరియు జీవిస్తున్న వాస్తవము గురించి, మన నిత్య తండ్రి మరియు ఆయన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు గురించి నేను సంతోషంగా సాక్ష్యమును ప్రకటిస్తున్నాను. యేసు క్రీస్తు మన రక్షకుడని, మన విమోచకుడని, ఆయన జీవిస్తున్నాడని నేను సాక్ష్యమిస్తున్నాను. తండ్రి మరియు కుమారుడు బాలుడైన జోసెఫ్ స్మిత్‌కు ప్రత్యక్షమయ్యారని, ఆవిధంగా కడవరి దినములలో రక్షకుని యొక్క సువార్త పునఃస్థాపన ప్రారంభించబడిందని కూడా నేను సాక్ష్యమిస్తున్నాను. మనలో ప్రతీఒక్కరు చూచే కన్నులను మరియు వినగల చెవులను వెదికి, దీవించబడాలని యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో నేను ప్రార్థిస్తున్నాను, ఆమేన్.