సర్వసభ్య సమావేశము
ప్రభువుతో భాగస్వామ్యంలో
2022 అక్టోబరు సర్వసభ్య సమావేశము


ప్రభువుతో భాగస్వామ్యంలో

యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త మర్త్య జీవితంలో మరియు నిత్యత్వములో రెండిటిలో, స్త్రీ, పురుషుల మధ్య పూర్తి భాగస్వామ్యము యొక్క సూత్రమును ప్రకటిస్తుంది.

మా వివాహము జరిగిన కొన్ని నెలలలోపే, నా ప్రియమైన భార్య సంగీతాన్ని అధ్యయనం చేయాలనే తన కోరికను తెలియజేసింది. ఆమెను సంతోషపెట్టాలనే ఉద్దేశ్యముతో, నా ప్రియురాలి కోసం పెద్ద, హృదయపూర్వక ఆశ్చర్యాన్ని బహుమానంగా ఇవ్వాలని నిర్ణయించాను. నేను సంగీత సాధనాల షాపుకు వెళ్ళి, ఆమెకు బహుమానమివ్వడానికి ఒక పియానోను కొన్నాను. నేను ఉత్సాహంగా అందంగా అలంకరించిన పెట్టెలో కొన్న రసీదును పెట్టి, తన అతి ప్రేమ, ఆసక్తిని చూపించే భర్త కోసం కృతజ్ఞతగల ఉప్పొంగిన స్పందనను ఆశిస్తూ, దానిని ఆమెకు ఇచ్చాను.

ఆమె ఆ చిన్న పెట్టెను తెరచి, దానిలో ఉన్న వాటిని చూసింది, ఆమె ప్రేమగా నావైపు చూసి ఇలా అన్నది, “ఓహ్, నా ప్రియా, నీవు అద్భుతమైనవాడవు! కానీ నిన్ను ఒక ప్రశ్న అడగనివ్వు: ఇది ఒక బహుమానమా లేక రుణమా?” ఆ బహుమానం గురించి కలిసి సంప్రదించిన తరువాత, కొన్నదానిని రద్దు చేయాలని మేము నిర్ణయించాము. మేము చాలామంది యువ నూతన వధూవరుల మాదిరిగానే విద్యార్థుల బడ్జెట్‌తో జీవిస్తున్నాము. వివాహ అనుబంధములో సంపూర్ణ భాగస్వామ్యము యొక్క ప్రాముఖ్యతను మరియు దాని అన్వయము నా భార్య, నేను ఏక హృదయము, ఏక మనస్సు కలిగియుండటానికి ఎలా సహాయపడగలదని గుర్తించడానికి ఈ అనుభవము నాకు సహాయపడింది1

యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త మర్త్య జీవితంలో మరియు నిత్యత్వములో రెండిటిలో, స్త్రీ, పురుషుల మధ్య పూర్తి భాగస్వామ్యము యొక్క సూత్రమును ప్రకటిస్తుంది. ప్రతీఒక్కరు ప్రత్యేక లక్షణాలు మరియు దైవికంగా నియమించబడిన బాధ్యతలను కలిగియున్నప్పటికీ, స్త్రీ మరియు పురుషుడు ఆయన బిడ్డల కొరకైన దేవుని సంతోష ప్రణాళికలో సమానంగా సంబంధిత మరియు ముఖ్యమైన పాత్రలను పూరిస్తారు.2 “నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, కాబట్టి (అతడు) తన కొరకు సాటియైన సహాయాన్ని చేస్తాడు”3 అని ప్రభువు ప్రకటించినప్పుడు ప్రారంభము నుండి అది స్పష్టముగా ఉన్నది.

ప్రభువు యొక్క ప్రణాళికలో ఒక “సాటియైన సహాయము” పూర్తి భాగస్వామ్యములో ఆదాముతో సమానంగా పని చేయడం, కానీ ఒకరికొకరు లొంగి ఉండడం కాదు.4 వాస్తవానికి, హవ్వ ఆదాము జీవితంలో పరలోకపు ఆశీర్వాదము. ఆమె దైవిక స్వభావము, ఆత్మీయ లక్షణాల ద్వారా, ఆమె సమస్త మానవాళి కొరకు దేవుని యొక్క సంతోష ప్రణాళికను సాధించడానికి ఆమెతో భాగస్వామ్యములో పనిచేయడానికి ఆమె ఆదామును ప్రేరేపించింది.5

పురుషుడు, స్త్రీ మధ్య భాగస్వామ్యమును బలపరచునట్లు రెండు ప్రధానమైన సూత్రములను మనము పరిగణిద్దాము. మొదటి సూత్రము ఏమిటంటే మనమందరం దేవునికి ఒకే రీతిగా ఉన్నాము.6 సువార్త సిద్ధాంతము ప్రకారము, పురుషుడు, స్త్రీ మధ్య భిన్నత్వము దేవుడు తన కుమారులు మరియు కుమార్తెల కొరకు కలిగియున్న నిత్య వాగ్దానాలను అధిగమించదు. నిత్యత్వములందు సిలెస్టియల్ మహిమ కొరకు ఒకరికంటె మరొకరు గొప్ప సాధ్యతలను కలిగియుండరు.7 దేవుని పిల్లలమైన మనందరిని “ఆయన వద్దకు రమ్మని, తన మంచితనము నుండి పాలుపొందమని రక్షకుడు స్వయంగా మనందరిని ఆహ్వానిస్తున్నాడు మరియు ఆయన యొద్దకు వచ్చు వారిని ఆయన కాదనడు.”8 కాబట్టి, ఈ భావనలో, మనమందరం దేవుని యెదుట సమానంగా ఉన్నాము.

భాగస్వామ్యములు ఈ సూత్రమును గ్రహించి పొందుపరచినప్పుడు, వారు తమ కుటుంబము యొక్క అధ్యక్షులు లేదా ఉపాధ్యాక్షుని స్థానంలో తమనుతాము ఉంచుకోరు. వివాహ అనుబంధములో ఆధిక్యత లేదా న్యూనత లేదు మరియు భార్యాభర్తలు ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ కాదు. వారు సమానులుగా, ప్రక్క ప్రక్కన నడుస్తారు, వారు దేవుని యొక్క దైవిక సంతానము. కుటుంబ విభాగాన్ని నడిపించి, దారి చూపుతూ, వారు మన పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుతో9 ఆలోచన, కోరిక మరియు ఉద్దేశ్యములో ఒకటవుతారు.

సమాన భాగస్వామ్యంలో, “ప్రేమ స్వాధీనత కాదు, కానీ భాగస్వామ్యము, … మన మానవ పిలుపైన ఆ సహ-సృష్టిలో భాగము.”10 “నిజమైన భాగస్వామ్యంతో, భార్యాభర్తలు ‘నిర్బంధమైన మార్గాలు లేకుండా’ వారికి మరియు వారి సంతానం ‘ఎప్పటికీ, శాశ్వతంగా’ ఆత్మీయ జీవితంతో ప్రవహించే ‘శాశ్వతమైన ఆధిపత్యం’ యొక్క సమన్వయ ఏకత్వంలో కలిసిపోతారు.” 11

రెండవ సంబంధిత సూత్రము ఉత్తమమైన నియమం, కొండమీది ప్రసంగంలో రక్షకుని చేత బోధించబడింది, “మనుష్యులు మీకేలాగు చేయవలెనని మీకు కోరుదురో ఆలాగు మీరును వారికి చేయుడి.”12 ఈ సూత్రము పరస్పరము, అన్యోన్య భావన, ఐకమత్యము మరియు పరస్పరం ఆధారితం యొక్క లక్షణము మరియు “నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను”13 అనే రెండవ గొప్ప ఆజ్ఞపై ఆధారపడియున్నది. అది మిగిలిన క్రైస్తవ లక్షణాలైన దీర్ఘ శాంతము, మృదుత్వము, సాత్వీకము మరియు దయ వంటి వాటితో కలుస్తుంది.

ఈ సూత్రము యొక్క అన్వయాన్ని బాగా గ్రహించడానికి, మన మొదటి తల్లిదండ్రులైన ఆదాము, హవ్వల మధ్య దేవుని చేత స్థాపించబడిన పరిశుద్ధమైన, నిత్యమైన బంధమువైపు మనము చూడగలము. తమనుతాము మరచిపోయి, నిత్యత్వమునకు వారి ప్రయాణములో ఒకరి శ్రేయస్సును ఒకరు వెదుకుతూ గౌరవము, కృతజ్ఞత మరియు ప్రేమతో కలిసి నడవడానికి వారిని అనుమతించే ఐక్యతగల ఆరోగ్యకరమైన సంబంధాన్ని సృష్టించడం ద్వారా వారు ఏక శరీరులవుతారు.14

ఈరోజు ఐక్యతగల వివాహములో అదే లక్షణాల కోసం మనము ప్రయాసపడాలి. దేవాలయ ముద్రణ ద్వారా ఒక స్త్రీ మరియు పురుషుడు నూతన మరియు శాశ్వతమైన నిబంధనలోని పరిశుద్ధ వివాహ క్రమంలో ప్రవేశిస్తారు. ఈ యాజకత్వపు విధానము ద్వారా, వారు తాము చేసిన నిబంధనల ప్రకారం జీవించినప్పుడు వారి కుటుంబ వ్యవహారాలను నడిపించడానికి వారికి నిత్య దీవెనలు మరియు దైవిక శక్తి ఇవ్వబడుతుంది. అప్పటి నుండి, ప్రత్యేకించి వారి కుటుంబాన్ని పోషించడం మరియు అధ్యక్షత్వము వహించడం వంటి దైవికంగా నియమించబడిన ప్రతీ బాధ్యతకు సంబంధించి వారు దేవునితో పరస్పర ఆధారితంగా మరియు పూర్తి భాగస్వామ్యంతో ముందుకు సాగుతారు.15 కుటుంబ పోషణ మరియు అధ్యక్షత్వము వహింటడం అనేవి పరస్పర ఆధారితము మరియు ఒకదానితో ఒకటి సంబంధం గల బాధ్యతలు, దాని అర్థము తల్లులు, తండ్రులు “సమ భాగస్వాములుగా ఒకరికొకరు సహాయపడుటకు బద్ధులైయున్నారు”16 మరియు వారి ఇంటిలో సమతుల్యమైన నాయకత్వమును పంచుకుంటారు.

“కుటుంబ పోషణ అనగా, కుటుంబ సభ్యులను పోషించుట, బోధించుట, మరియు సహకరించుట,” అది వారు “సువార్త సత్యములు నేర్చుకోవడానికి, పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తునందు విశ్వాసమును వృద్ధి చేయడానికి” సహాయపడుట ద్వారా చేయబడుతుంది. అధ్యక్షత్వము వహించుట అనగా, “కుటుంబ సభ్యులు దేవుని సన్నిధిలో నివసించడానికి తిరిగి వెళ్ళుటకు నడిపించుట అని అర్థము. ఇది మంచితనము, సాత్వీకము మరియు శుద్ధమైన ప్రేమతో సేవ చేయుట ద్వారా, బోధించుట ద్వారా చేయబడుతుంది. అది “కుటుంబ సభ్యులను క్రమమైన ప్రార్థన, సువార్త అధ్యయనము మరియు ఇతర ఆరాధనా దశలందు నడిపించుటను కలిపియున్నది.” “ఈ (రెండు గొప్ప) బాధ్యతలను నెరవేర్చడానికి” యేసు క్రీస్తు యొక్క మాదిరిని అనుసరిస్తూ, తల్లిదండ్రులు ఐకమత్యముగా పని చేస్తారు.17

సంఘములోని యాజకత్వ నాయకత్వము నుండి కొన్ని అంశాలలో భిన్నంగా ఉండి, కుటుంబములోని ప్రభుత్వము గోత్రజనకుని మాదిరిని అనుసరిస్తుందని గమనించుట ముఖ్యమైనది.18 గోత్రజనకుని పద్ధతిలో భార్యలు మరియు భర్తలు కుటుంబంలో తమ పరిశుద్ధమైన బాధ్యతల నెరవేర్పు కోసం నేరుగా దేవునికి జవాబుదారులుగా ఉంటారు. దీనికి పూర్తి భాగస్వామ్యం—నీతి మరియు జవాబుదారీతనం యొక్క ప్రతి సూత్రాన్ని సుముఖంగా పాటించడం— అవసరం, అది ప్రేమ మరియు పరస్పర సహాయ వాతావరణంలో అభివృద్ధికి అవకాశాలను అందిస్తుంది.19 ఈ ప్రత్యేక బాధ్యతలు ఒకరు మరొకరిని పాలించడాన్ని సూచించవు మరియు ఏ విధమైన దుర్భాషనైనా, అధికార దుర్వినియోగాన్నైనా పూర్తిగా బహిష్కరిస్తాయి.

ఏదేను వనము విడిచి వెళ్ళిన తరువాత, ఆదాము హవ్వల అనుభవము వారి కుటుంబ పోషణ మరియు అధ్యక్షత్వము వహించుటలో తల్లి, తండ్రి మధ్య పరస్పరం ఆధారపడే భావనను అందంగా వివరిస్తుంది. మోషే గ్రంథములో బోధించబడినట్లుగా, వారి కుటుంబము యొక్క భౌతిక శ్రేయస్సు కొరకు వారి నుదుటి చెమటోడ్చి భూమిని దున్నడానికి వారు కలిసి పనిచేసారు;20వారు పిల్లలను లోకములోనికి తెచ్చారు;21 వారు కలిసి ప్రభువు నామములో ప్రార్థించారు మరియు “ఏదేను వనము వైపు నుండి” ఆయన స్వరమును విన్నారు;22 వారికి ప్రభువు ఇచ్చిన ఆజ్ఞలను అంగీకరించారు మరియు వాటికి విధేయులు కావడానికి కలిసి ప్రయత్నించారు.23 తరువాత వారు “(ఈ) విషయాలను వారి కుమారులు మరియు కుమార్తెలకు తెలియజేసారు”24 మరియు వారి అవసరాలను బట్టి “దేవునికి ప్రార్థించడం మానలేదు.”25

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, పోషించుట మరియు అధ్యక్షత్వము వహించుట అనేవి అవకాశాలే కానీ, ప్రత్యేకమైన పరిమితులు కాదు. ఒక వ్యక్తి దేనికైనా బాధ్యత కలిగియుండవచ్చు, కానీ దానిని చేసేది ఆ ఒక్క వ్యక్తి మాత్రమే కాదు. ప్రేమగల తల్లిదండ్రులు ఈ రెండు పెద్ద బాధ్యతలను గ్రహించినప్పుడు, వారు కలిసి తమ పిల్లల యొక్క శారీరక, మానసిక శ్రేయస్సును కాపాడి, శ్రద్ధ తీసుకోవడానికి ప్రయాసపడతారు. ఆయన ప్రవక్తలకు బయల్పరచబడినట్లుగా ప్రభువు యొక్క మంచి వాక్యముతో వారిని పోషించుట ద్వారా మన కాలములోని ఆత్మీయ అపాయములను ఎదుర్కోవడానికి కూడా వారు సహాయపడతారు.

భర్త, భార్య వారికి దైవికంగా నియమించబడిన బాధ్యతలందు ఒకరినొకరు బలపరచుకొన్నప్పటికీ, “అంగవైకల్యము, మరణము లేదా ఇతర పరిస్థితులు వ్యక్తిగత అనుసరణను ఆవశ్యపరచవచ్చు.”26 కొన్నిసార్లు ఒక భర్త లేదా భార్య తాత్కలికంగా లేదా శాశ్వతంగా, ఒకేసారి రెండు పాత్రలందు పని చేసే బాధ్యతను కలిగియుంటారు.

ఈ పరిస్థితిలో జీవిస్తున్న ఒక సహోదరి మరియు సహోదరుడిని నేను ఈ మధ్య కలిసాను. ఒంటరి తల్లిదండ్రులుగా, వారు తమ కుటుంబ పరిధిలో మరియు ప్రభువుతో భాగస్వామ్యంలో, తమ పిల్లల ఆత్మీయ, భౌతిక సంరక్షణ కోసం వారి జీవితాలను సమర్పించడానికి నిర్ణయించారు. వారి విడాకులు కష్టమైనవి అయినప్పటికీ, ప్రభువుతో చేసిన వారి దేవాలయ నిబంధనలు మరియు ఆయన నిత్య వాగ్దానముల దృష్టిని వారు కోల్పోలేదు. వారిరువురు తమ సవాళ్ళను సహించడానికి మరియు నిబంధన బాటపై నడవడానికి నిరంతరము ప్రయాసపడినప్పుడు అన్ని విషయాలందు ప్రభువు యొక్క సహాయమును వెదికారు. ఈ జీవితంలోనే కాదు, కానీ నిత్యత్వమంతటా ప్రభువు వారి అవసరతలను తీరుస్తారని వారు నమ్మారు. జీవితంలో కష్టమైన పరిస్థితులను అనుభవిస్తున్నప్పుడు కూడా ఇరువురు మంచితనము, సాత్వీకము మరియు శుద్ధమైన ప్రేమతో బోధించడం ద్వారా తమ పిల్లలను పోషించారు. నాకు తెలిసిన దానిని నుండి, ఈ ఇద్దరు తల్లిదండ్రులు తమ దురదృష్టానికి దేవుడిని నిందించలేదు. బదులుగా, వారు పరిపూర్ణమైన ప్రకాశవంతమైన నిరీక్షణతో మరియు వారి కోసం ప్రభువు దాచిన దీవెనల కొరకు విశ్వాసముతో ఎదురుచూసారు.27

సహోదర సహోదరీలారా, రక్షకుడు మన పరలోక తండ్రితో ఐక్యతకు, ఉద్దేశ్యము మరియు సిద్ధాంతము యొక్క సామరస్యానికి పరిపూర్ణమైన మాదిరిగా నిలిచాడు. ఆయన తన శిష్యుల తరఫున ప్రార్థిస్తూ ఇలా అడిగాడు, “వారందరు ఏకమైయుండవలెను; తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, వారును మనయందు ఏకమైయుండవలెను: … మనము ఏకమై యున్నలాగున వారును ఏకమై యుండవలెను.”28

సహోదర సహోదరీలారా, స్త్రీలు మరియు పురుషులమైన—మనము నిజమైన, సమాన భాగస్వామ్యములో కలిసి పనిచేసినప్పుడు, మన వివాహ సంబంధాలలో దైవిక బాధ్యతలను మనము నెరవేర్చినప్పుడు రక్షకుని చేత బోధించబడిన ఐక్యతను మనము ఆనందిస్తామని నేను మీకు సాక్ష్యమిస్తున్నాను. “ఒకరి యెడల ఒకరు ఐక్యతయందు మరియు ప్రేమ యందు వారి హృదయములు కలిసి మెలసి”29 ఉంటాయని, నిత్య జీవమునకు మన ప్రయాణములో ఎక్కువ సంతోషాన్ని మనము కనుగొంటామని, ఒకరికొకరు మరియు ఒకరితో ఒకరు కలిసి సేవ చేసుకొనే మన సామర్థ్యము గణనీయంగా పెరుగుతుందని క్రీస్తు నామములో నేను మీకు వాగ్దానము చేస్తున్నాను.30 ఈ సత్యముల గురించి యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో నా సాక్ష్యమును ఇస్తున్నాను, ఆమేన్.