సర్వసభ్య సమావేశము
సిలువపైన ఎత్తబడి
2022 అక్టోబరు సర్వసభ్య సమావేశము


సిలువపైన ఎత్తబడి

యేసు క్రీస్తు యొక్క అనుచరుడు కావాలంటే, ఒకరు తప్పకుండా కొన్నిసార్లు భారం మోయాలి మరియు త్యాగం అవసరమైన, బాధ అనివార్యమైన చోటుకు వెళ్ళాలి.

చాలా సంవత్సరాల క్రితం, అమెరికా మత చరిత్రపై పట్టభద్ర కళాశాల చర్చ తర్వాత, నా తోటి విద్యార్థి నన్ను అడిగాడు, “ఇతర క్రైస్తవులు వారి విశ్వాసానికి చిహ్నంగా సిలువను ఉపయోగించినట్లు కడవరి దిన పరిశుద్ధులు ఎందుకు ఉపయోగించరు?”

సిలువ గురించి అటువంటి ప్రశ్నలు తరచు క్రీస్తు పట్ల మన నిబద్ధత గురించిన ప్రశ్న అయినందున, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త త్యాగాన్ని ప్రధాన సత్యంగా, కీలకమైన పునాదిగా, ముఖ్యమైన సిద్ధాంతంగా మరియు ఆయన పిల్లల రక్షణ కొరకు దేవుని ఘనమైన ప్రణాళికలో దైవిక ప్రేమ యొక్క అంతిమ వ్యక్తీకరణగా పరిగణిస్తుందని నేను వెంటనే అతనికి చెప్పాను.1 ఆ త్యాగములో భాగంగా ఉన్న రక్షించే కృప ఆదాము హవ్వల నుండి లోకాంతము వరకు సమస్త మానవాళికి ఆవశ్యకమైనది మరియు విశ్వవ్యాప్తంగా బహుమానమివ్వబడింది.2 నేను ప్రవక్త జోసెఫ్ స్మిత్‌ను వ్యాఖ్యానించాను, ఆయన ఇలా అన్నారు, “మన మతానికి సంబంధించిన అన్ని విషయాలు … యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తానికి అనుబంధాలు మాత్రమే”.3

తర్వాత, యేసు పుట్టడానికి 600 సంవత్సరాలకు ముందు నీఫై వ్రాసిన దానిని నేనతనికి చదివి వినిపించాను: “ఆ దేవదూత తిరిగి నాతో … చూడుము! అనెను. నేను చూచి, దేవుని గొఱ్ఱెపిల్లను వీక్షించితిని, …[ఆయన] సిలువపైన ఎత్తబడి లోకపాపముల నిమిత్తము వధింపబడెను.”4

నా “ప్రేమించు, పంచు మరియు ఆహ్వానించుటకు” అధిక ఉత్సాహంతో ఉన్న నేను చదువుతూనే ఉన్నాను! క్రొత్త లోకములోని నీఫైయులతో పునరుత్థానుడైన క్రీస్తు ఇలా చెప్పారు, “నేను సిలువపైన పైకెత్తబడునట్లు నా తండ్రి నన్ను పంపియున్నాడు; … మనుష్యులందరినీ నా వైపు ఆకర్షించుకొనునట్లు, … మరియు ఈ హేతువు నిమిత్తము నేను పైకెత్తబడితిని.”5

అపొస్తలుడైన పౌలు వ్యాఖ్యానం గురించి నేను చెప్పబోయినప్పుడు, నా స్నేహితుడికి ఆసక్తి లేకపోవడాన్ని నేను గమనించాను. వెంటనే చేతి గడియారాన్ని చూడడం, అతడు మరెక్కడో ఉండాలని స్పష్టంగా అతనికి గుర్తుచేసింది, ఎక్కడో—ఏదో పని ఉందని చెప్పి, అతడు వెళ్ళిపోయాడు. ఆవిధంగా మా సంభాషణ ముగిసింది.

50 ఏళ్ళ తర్వాత, ఈ ఉదయం, ఆ వివరణను పూర్తిచేయాలని నేను నిశ్చయించుకున్నాను—మీలో ప్రతీఒక్కరు మీ చేతి గడియారాల వైపు చూసుకోవడం ప్రారంభించినా సరే. సాధారణంగా మనం సిలువను మత విశ్వాసపు సంకేతంగా ఎందుకు ఉపయోగించమో వివరించడానికి నేను ప్రయత్నిస్తున్నప్పుడు, ఆవిధంగా ఉపయోగించే వారి విశ్వాసము నిండిన ప్రేరణలు మరియు అంకితమైన జీవితాల కొరకు మన లోతైన గౌరవం మరియు ప్రగాఢమైన అభిమానాన్ని సమృద్ధిగా స్పష్టం చేయాలని నేను కోరుకుంటున్నాను.

దానికి ఒక కారణం, మనం సిలువను బైబిలు గురించి మన నమ్మకాలకు చిహ్నంగా నొక్కి చెప్పము. ఎందుకంటే సిలువ వేయడం అనేది శిక్షను అమలుపరచడంలో రోమా సామ్రాజ్యపు అత్యంత వేదనాభరితమైన విధానాల్లో ఒకటి, యేసు యొక్క తొలి అనుచరులలో అనేకమంది బాధను వర్తింపజేసే క్రూరమైన ఆ విధానాన్ని ప్రముఖంగా పేర్కొనదలచుకోలేదు. క్రీస్తు మరణం యొక్క అర్థము ఖచ్ఛితంగా వారి విశ్వాసానికి ముఖ్యమైనది, కానీ 300 సంవత్సరాల వరకు వారు తమ సువార్త గుర్తింపును సాధారణంగా ఇతర విధాలుగా తెలియజేయడానికి ప్రయత్నించారు.6

నాల్గవ మరియు ఐదవ శతాబ్దాలకల్లా, సిలువ సాధారణ క్రైస్తవ మతానికి చిహ్నంగా పరిచయం చేయబడింది, కానీ మనది “సాధారణ క్రైస్తవ మతం” కాదు. కేథలిక్కులం కాదు, ప్రొటెస్టంట్లము కాదు, బదులుగా మనం ఒక పునఃస్థాపించబడిన సంఘము, పునఃస్థాపించబడిన క్రొత్త నిబంధన సంఘము. ఆవిధంగా, మన మూలాలు మరియు మన అధికారం వెనక్కి అనగా, సంఘాలు, మతాలు మరియు మతవిశ్వాస సంకేతం గల ముందు సమయానికి వెళ్తాయి.7 ఈ భావనలో, ఆలస్యంగా సాధారణ వినియోగంలోకి వచ్చిన చిహ్నం లేకపోవడం అనేది యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము నిజమైన క్రైస్తవ ఆరంభాల యొక్క పునఃస్థాపన అనడానికి మరొక సాక్ష్యము.

సిలువల ప్రతిరూపాలను ఉపయోగించకపోవడానికి మరొక కారణం, క్రీస్తు యొక్క నియమితకార్యం—మహిమకరమైన ఆయన పునరుత్థానం, ఆయన త్యాగపూరిత బాధ మరియు మరణం యొక్క పూర్తి అద్భుతానికి మనం ఇచ్చే ప్రాధాన్యత. ఆ సంబంధాన్ని నొక్కిచెప్పడానికి, సాల్ట్ లేక్ సిటీలో ప్రతీ గురువారం జరిగే పవిత్రమైన దేవాలయ సమావేశంలో ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహము కొరకు నేపథ్యంగా పనిచేసే రెండు కళాఖండాలను8 నేను గమనించాను. మనం ఎవరి సేవకులమో ఆయన చేత చెల్లించబడిన వెల మరియు గెలవబడిన గెలుపు గురించి ఈ వర్ణచిత్రాలు నిరంతరం మనకు గుర్తుచేస్తాయి.

చిత్రం
The Crucifixion (సిలువ శ్రమ), హ్యారీ ఆండర్సన్ చేత
చిత్రం
The Resurrection (పునరుత్థాఃనము), హ్యారీ ఆండర్‌సన్ చేత

ఆయన సిలువ గాయాలు ఇంకా స్పష్టంగా ఉండి, సమాధి నుండి మహిమలో ఉద్భవిస్తున్న పునరుత్థానుడైన క్రీస్తు యొక్క ఈ చిన్న ప్రతిమను థార్వాల్డ్సెన్ రూపొందించాడు, దానిని మనం వినియోగించడం క్రీస్తు యొక్క రెండు-భాగాల విజయం యొక్క మరింత బహిరంగ నిరూపణ.9

చిత్రం
సంఘ చిహ్నము

చివరగా, అధ్యక్షులు గార్డన్ బి. హింక్లి ఒకసారి చెప్పిన దానిని మనం గుర్తుచేసుకుందాం, “మన జనుల జీవితాలు తప్పకుండా … మన [విశ్వాసానికి] చిహ్నంగా ఉండాలి.”10 ఈ పరిగణనలు—ముఖ్యంగా రెండోది—నాకు సిలువకు సంబంధించిన అన్ని లేఖనాల సూచనలలో అత్యంత ముఖ్యమైనది కావచ్చు. దీనికి లాకెట్టులు లేదా నగలు, గోపురాలు లేదా సూచికలతో సంబంధం లేదు. బదులుగా, ఆయన శిష్యులలో ప్రతీఒక్కరికి యేసు ఇచ్చిన పిలుపుకు క్రైస్తవులు తీసుకురావలసిన బలమైన నీతి మరియు నమ్మిన దానికోసం నిలబడే తత్వంతో సంబంధం ఉంది. ప్రతీ దేశములో మరియు యుగములో, ఆయన మనందరికి ఇలా చెప్పారు, “ఏ పురుషుడు [లేదా స్త్రీ] అయినను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను.”11

ఇది మనం ధరించే సిలువలకు బదులుగా మనం భరించే సిలువల గురించి మాట్లాడుతుంది. యేసు క్రీస్తు యొక్క అనుచరుడు కావాలంటే, ఒకరు తప్పకుండా కొన్నిసార్లు—తమ స్వంతది లేదా వేరొకరిది—భారం మోయాలి మరియు త్యాగం అవసరమైన, బాధ అనివార్యమైన చోటుకు వెళ్ళాలి. నిజమైన క్రైస్తవులు అతడు లేదా ఆమె సమ్మతించిన విషయాలలో మాత్రమే యజమానిని అనుసరించలేరు. లేదు. మనం ప్రతీచోట ఆయనను అనుసరిస్తాము, అవసరమైతే కష్టాలు, కన్నీళ్ళు ఉన్నచోట కూడా, కొన్నిసార్లు అక్కడ మనం చాలా ఒంటరిగా ఉండవలసిరావచ్చు.

సంఘము లోపల మరియు బయట అంత విశ్వాసంతో క్రీస్తును అనుసరిస్తున్న వారు నాకు తెలుసు. తీవ్రమైన శారీరక వైకల్యాలు గల పిల్లలు నాకు తెలుసు మరియు వారి పట్ల శ్రద్ధచూపే తల్లిదండ్రులు నాకు తెలుసు. అందరు బలాన్ని, రక్షణను, మరేవిధంగా రాని ఆనందకరమైన క్షణాలను వెదుకుతూ, కొన్నిసార్లు పూర్తిగా అలసిపోయే వరకు పనిచేయడాన్ని నేను చూస్తున్నాను. ఒక ప్రియమైన భాగస్వామిని, ఒక అద్భుతమైన వివాహాన్ని, తమ స్వంత పిల్లలతో నిండిన ఇంటిని పొందే అర్హత గలవారు, వాటి కోసం ఆరాటపడే ఒంటరి యువజనులు అనేకమంది నాకు తెలుసు. దానిని మించిన నీతిగల కోరిక ఏదీ లేదు, కానీ సంవత్సరాలు గడుస్తున్నా అటువంటి అదృష్టం ఇంకా రాలేదు. అనేక రకాల మానసిక వ్యాధులతో పోరాడుతున్న వారు, భావోద్వేగ స్థిరత్వం యొక్క వాగ్దాన భూమి కోసం ప్రార్థిస్తూ సహాయం కోసం వేడుకునే వారు నాకు తెలుసు. బలహీనపరిచే పేదరికంతో బ్రతుకుతున్నా నిరాశను ధిక్కరిస్తూ, తమ ప్రియమైన వారికోసం మరియు తమ చుట్టూ అవసరంలో ఉన్న ఇతరుల కోసం మెరుగైన జీవితాలు నిర్మించే అవకాశం కొరకు మాత్రమే అడిగేవారు నాకు తెలుసు. గుర్తింపు, లింగము, మరియు లైంగికత గురించి మెలిపెట్టే విషయాలతో యుద్ధం చేస్తున్న వారనేకులు నాకు తెలుసు. వారి ఎంపికల యొక్క పర్యవసానాలు ఎంత ముఖ్యమైనవో తెలిసి, నేను వారి కోసం దుఖిఃస్తాను మరియు నేను వారితోపాటు దుఃఖిస్తాను.

జీవితంలో మనం ఎదుర్కొనే అనేక కఠినమైన పరిస్థితులలో ఇవి కొన్ని మాత్రమే, ఇవి శిష్యత్వానికి వెల ఉందని చెప్పే గంభీరమైన జ్ఞాపికలు. దహనబలి అర్పణ కొరకు ఎడ్లను, కట్టెలను రాజుకు ఉచితంగా ఇవ్వజూచిన అరౌనాతో దావీదు రాజు చెప్పాడు, “నేను ఆలాగు తీసికొనను, వెలయిచ్చి నీయొద్ద కొందును, వెల యియ్యక నేను తీసికొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహనబలిగా అర్పించను.”12 మనమందరము అలాగే చెప్పాలి.

మనం మన సిలువలు పైకెత్తుకొని ఆయనను వెంబడించినప్పుడు, మన సవాళ్ళ యొక్క భారము మనల్ని మరింత సానుభూతి గలవారిగా మరియు ఇతరులు మోస్తున్న భారాల పట్ల శ్రద్ధగల వారిగా చేయకపోతే నిజంగా అది విషాదకరము. ఇది సిలువ వేయడం యొక్క అత్యంత శక్తివంతమైన వైరుధ్యాలలో ఒకటి, రక్షకుని చేతులు వెడల్పుగా చాపబడి, మేకులు కొట్టబడి, సమస్త మానవ కుటుంబంలోని ప్రతీ పురుషుడు, స్త్రీ మరియు బిడ్డ స్వాగతించబడడం మాత్రమే కాకుండా, విమోచించు, మహోన్నతమైన ఆయన ఆలింగనంలోకి ఆహ్వానించబడ్డారని అనాలోచితంగా కానీ ఖచ్చితంగా చిత్రీకరించడం.13

వేదనాభరితమైన సిలువ తర్వాత మహిమకరమైన పునరుత్థానము వచ్చినట్లుగా, మోర్మన్ గ్రంథ ప్రవక్త జేకబ్ చెప్పినట్లు, “క్రీస్తు నందు విశ్వసించి, ఆయన మరణమును యోచించి, ఆయన సిలువను భరించుటకు” సమ్మతించిన వారిపై ప్రతివిధమైన దీవెనలు క్రుమ్మరించబడతాయి. కొన్నిసార్లు ఆ దీవెనలు త్వరగా వస్తాయి, మరికొన్నిసార్లు అవి ఆలస్యంగా వస్తాయి, కానీ మన వ్యక్తిగత వియా డోలొరోసా (అత్యంత కష్టమైన అనుభవాలకు)14 అద్భుతమైన ముగింపు ఆ దీవెనలు వస్తాయని యజమాని తనకుతానే చేసిన వాగ్దానం. అటువంటి దీవెనలు పొందడానికి, మనం—తప్పకుండా, ఎన్నడూ తడబడకుండా లేదా పారిపోకుండా, మన సిలువలు భారమైనప్పుడు మరియు కొంతకాలానికి ఆశ కోల్పోయినప్పుడు కూడా మనం చేయాలని యెరిగిన దానిని చేయడానికి ఎన్నడూ వెనుకాడకుండా ఆయనను అనుసరిద్దాం. మీ బలం, మీ విధేయత, మరియు మీ ప్రేమ కోసం, నేను లోతైన వ్యక్తిగత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నేను, “ఎత్త బడిన” 15 ఆయన మరియు , ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు “ఎత్త బడిన” వారికి ఆయన అనుగ్రహించే శాశ్వతమైన ఆశీర్వాదాల గురించి అపొస్తలత్వ సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. See Jeffrey R. Holland, Encyclopedia of Mormonism (1992), “Atonement of Jesus Christ,” 1:83.

  2. అమ్యులెక్ క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం గురించి మాట్లాడినట్లుగా అది “గొప్పదైన చివరి బలి” దాని పరిధిలో అది “ఒక అనంతమైన, నిత్యమైన బలియై” యున్నది (ఆల్మా 34:10). “అందరు పతనమైయున్నారు మరియు తప్పిపోయియున్నారు, ఆవశ్యకమైన ఆ ప్రాయశ్చిత్తము చేయబడని యెడల అందరు నశించవలసియున్నది.” (ఆల్మా 34:9; 8–12 వచనములు). కూడా చూడండి. అధ్యక్షులు జాన్ టేలర్ ఇలా జతచేస్తున్నారు: “మనకు అర్థంకాని మరియు వివరించలేని విధంగా, [యేసు] ఆదాము మాత్రమే కాదు, అతని సంతానం; మరియు మొత్తం ప్రపంచ పాప భారమును భరించాడు; అలా చేయడం ద్వారా, పరలోక రాజ్య ద్వారాన్ని తెరిచాడు, విశ్వాసులందరికీ మరియు దేవుని ధర్మ శాస్త్రాన్ని పాటించే వారందరికీ మాత్రమే కాకుండా, పరిపక్వతకు రాకముందే చనిపోయిన మానవ కుటుంబంలో సగానికి పైగా, అలాగే [వారు] ధర్మ శాస్త్రము లేకుండా మరణించిన తరువాత, అతని మధ్యవర్తిత్వం ద్వారా, ధర్మ శాస్త్రము లేకుండా పునరుత్థానం చేయబడతారు మరియు ధర్మ శాస్త్రము లేకుండా తీర్పు పొందుతారు మరియు తద్వారా అతని ప్రాయశ్చిత్తం యొక్క ఆశీర్వాదాలలో పాల్గొంటారు.(An Examination into and an Elucidation of the Great Principle of the Mediation and Atonement of Our Lord and Savior Jesus Christ [1892], 148–49; Teachings of Presidents of the Church: John Taylor [2001], 52–53).

  3. Teachings of Presidents of the Church: Joseph Smith (2007), 49.

  4. 1 నీఫై 11:32-33.

  5. 3 నీఫై 27:14-15.

  6. పౌలు యొక్క బోధనలలో సిలువకు సంబంధించిన సూచనలు ఉన్నాయి (ఉదాహరణకు, 1 కొరింథీయులకు1:17–18; గలతీయులకు 6:14; ఫిలిప్పీయులకు 3:18 చూడండి), కానీ ఇవి ఒకదానికొకటి మేకులు కొట్టి వ్రేలాడదీయబడిన రెండు చెక్క దూలముల కంటే, చాలా గొప్ప వాటి గురించి మాట్లాడతాయి లేదా అలాంటి వాటికి సంబంధించిన ఏదైనా చిన్న చిహ్నాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి, పౌలు సిలువ గురించి మాట్లాడుతున్నప్పుడు, అతను ప్రాయశ్చిత్తం యొక్క మహిమ గురించి మాట్లాడడానికి సిద్ధాంతపరమైన సంక్షిప్త లిపిని ఉపయోగిస్తున్నాడు, అలాగునే, ఈ వేదికలో కడవరి దిన పరిశుద్ధులు వెంటనే అతనితో చేరి, అతనిని ఉదహరిస్తారు.

  7. ప్రారంభ మరియు సాంప్రదాయ క్రైస్తవ వ్యక్తులు, మార్టిన్ లూథర్ యొక్క సహచరుడు ఆండ్రియాస్ కార్ల్‌స్టాడ్ట్ (1486-1541), “సిలువ [స్వంతంగా] క్రీస్తు యొక్క మానవ బాధలను మాత్రమే చిత్రీకరిస్తుంది, అతని పునరుత్థానం మరియు విమోచన [శక్తులను] ప్రదర్శించడాన్ని విస్మరించింది” అని చివరి మధ్య యుగాలలో వాదించారు. (in John Hilton III, Considering the Cross: How Calvary Connects Us with Christ [2021], 17).

  8. హ్యారీ ఆండర్సన్, The Crucifixion; హ్యారీ ఆండర్సన్, Mary and the Resurrected Lord.

  9. రస్సెల్ ఎమ్. నెల్సన్, “సహాయము కొరకు పరలోకములను తెరచుట,” లియహోనా, మే 2020, 72–74.

  10. Gordon B. Hinckley, “The Symbol of Christ,” Ensign, May 1975, 92.

  11. మత్తయి 16:24.

  12. 2 సమూయేలు 24:24.

  13. “ఆయన నామమందు విశ్వాసించు జనులందరికీ ఆయన బాహువు చాపబడియున్నది” (ఆల్మా 19:36; 2 నీఫై 26:33; ఆల్మా 5:33 కూడా చూడండి).

  14. Via dolorosa ఒక లాటిన్ పదబందం, దాని అర్థం “బాధాకరమైన కష్టమైన దారి, మార్గం లేదా అనుభవాల శ్రేణి” (Merriam-Webster.com Dictionary, “via dolorosa”). ఇది చాలా తరచుగా, పిలాతు చేతిలో ఆయన ఖండించడం నుండి కల్వరిపై శిలువ వేయడం వరకు యేసు యొక్క కదలికతో ముడిపడి ఉంటుంది.

  15. 3 నీఫై 27:14-15 చూడండి.