సర్వసభ్య సమావేశము
పేదలకు మరియు కష్టాల్లో ఉన్నవారికి సహాయపడుట
2022 అక్టోబరు సర్వసభ్య సమావేశము


పేదలకు మరియు కష్టాల్లో ఉన్నవారికి సహాయపడుట

యేసు క్రీస్తు యొక్క సంఘము అవసరతలో ఉన్నవారికి సేవ చేయడానికి నిబద్ధత కలిగియుంది మరియు ఆ ప్రయత్నంలో ఇతరులతో సహకరించడానికి కూడా నిబద్ధత కలిగియుంది.

సహోదర సహోదరీలారా, మన ప్రియమైన అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారు ఈ సభలో తరువాత ప్రసంగిస్తారు. నన్ను మొదట మాట్లాడమని ఆయన అడిగారు.

ఈరోజు నేను మాట్లాడే విషయము యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము మరియు దాని సభ్యులు పేదలకు, కష్టాల్లో ఉన్నవారికి సహాయపడడానికి ఏమి ఇస్తారు మరియు ఏమి చేస్తారనే దానికి సంబంధించినది. ఇతర మంచి వ్యక్తులు ఇచ్చే ఇలాంటి దానము గురించి కూడా నేను మాట్లాడతాను. అవసరతలో ఉన్నవారికి ఇచ్చుట అబ్రాహాము మతములన్నిటిలో, అదేవిధంగా ఇతరులలో ఉన్న సూత్రము.

కొన్ని నెలల క్రితం, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సభ్యులుగా ప్రపంచవ్యాప్తంగా మన మానవతావాద కార్యము యొక్క విస్తృతి గురించి మొదటిసారి నివేదించబడింది.1 ప్రపంచవ్యాప్తంగా 188 దేశాలలో అవసరతలో ఉన్నవారి కోసం మనం 2021లో చేసిన ఖర్చు $906 మిలియన్లు-దాదాపు ఒక బిలియన్ డాలర్లు. అదనంగా, మన సభ్యులు అదే కారణము కొరకు స్వచ్ఛందగా 60 మిలియన్ల గంటలు పని చేసారు.

ఆ గణాంకాలు, మనం ఇచ్చిన మరియు సహాయపడిన వాటి అసంపూర్ణమైన నివేదికలు. మన సభ్యులు వారు పిలువబడిన స్థానములలో ఒకరికి ఒకరు పరిచర్య చేసినప్పుడు మరియు సభ్యుని-నుండి-సభ్యునికి స్వచ్ఛందమైన సేవ చేసినప్పుడు వ్యక్తిగతంగా చేసే వ్యక్తిగత సేవలను వాటిలో చేర్చలేదు. మరియు మా 2021 నివేదికలో మన సంఘంతో అధికారికంగా సంబంధం లేని అసంఖ్యాక స్వచ్ఛంద సంస్థల ద్వారా మన సభ్యులు వ్యక్తిగతంగా ఏమి చేస్తున్నారో ప్రస్తావించలేదు. దీనితో నేను ప్రారంభిస్తాను.

1831లో, పునఃస్థాపించబడిన సంఘము ఏర్పాటు చేయబడిన రెండు సంవత్సరాలలోపు, దాని సభ్యులను మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన పిల్లలందరిని నడిపించడానికి ప్రభువు ఈ బయల్పాటును ఇచ్చారని నేను నమ్ముతున్నాను:

“ఏలయనగా, అన్ని విషయములలో నేను ఆజ్ఞాపించుట యుక్తము కాదు; అన్ని విషయములలో బలవంతము చేయబడువాడు సోమరియే గాని, వివేకము గల సేవకుడు కాడు. … 

“నేను నిశ్చయముగా చెప్పునదేమనగా, మనుష్యులు ఆతృతతో ఒక మంచి కార్యములో నిమగ్నమై, వారి ఇష్టపూర్వకముగా అనేక కార్యములు చేసి, అధికమైన నీతిని నెరవేర్చవలెను;

“వారిలో శక్తి ఉన్నది గనుక, వారు తమకుతామే ప్రతినిధులైయున్నారు. మనుష్యులు మంచి చేయునంత వరకు వారు తమ ప్రతిఫలమును కోల్పోరు.”2

38 సంవత్సరాలకు పైగా ఒక అపొస్తలునిగా మరియు 30 సంవత్సరాలకు పైగా వృత్తిపరమైన ఉద్యోగంలో, “మంచి కార్యము” మరియు “అధికమైన నీతిని నెరవేర్చుట”గా ఈ బయల్పాటులో వివరించినటువంటి సంస్థలు మరియు వ్యక్తుల యొక్క అనేక ఉదారమైన ప్రయత్నాలను నేను చూసాను. ప్రపంచవ్యాప్తంగా, మన స్వంత సరిహద్దులను దాటి మరియు మన సాధారణ జ్ఞానానికి మించి అటువంటి సేవలకు లెక్కలేనన్ని ఉదాహరణలు ఉన్నాయి దీనిని ధ్యానిస్తూ, నేను మోర్మన్ గ్రంథ ప్రవక్త, రాజైన బెంజమిన్ గురించి ఆలోచిస్తాను, అతడి ప్రసంగము ఈ నిత్య సత్యమును కలిగియున్నది: “మీ తోటి ప్రాణుల సేవలో మీరున్న యెడల, మీరు మీ దేవుని సేవలోనే ఉన్నారు.”3

మన పొరుగువారి సంక్షేమము మరియు మానవతా సేవలో అధికము యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము చేత మరియు దాని సభ్యులుగా మన చేత బోధించబడింది మరియు ఆచరించబడుతోంది. ఉదాహరణకు, మనము ప్రతీ నెల మొదటి వారము ఉపవాసముండి, కనీసం మనం భుజించని ఆహారానికి సమానమైన మొత్తాన్ని మన స్వంత సమూహాలలో అవసరతలో ఉన్న వారికి సహాయపడడానికి విరాళంగా ఇస్తాము. సంఘము ప్రపంచవ్యాప్తంగా మానవతావాదము మరియు ఇతర సేవల కొరకు అపారమైన సహాయాలను కూడా చేస్తుంది.

మన సంఘము ప్రత్యక్షంగా ఎంతో చేస్తున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా దేవుని పిల్లలకు అధిక మానవతా సేవ మన సంఘముతో అధికారిక సంబంధం లేని వ్యక్తులు మరియు సంస్థలచే నిర్వహించబడుతోంది. మన అపొస్తలులలో ఒకరు గమనించినట్లుగా: “దేవుడు తన గొప్ప అద్భుతమైన కార్యమును నెరవేర్చడానికి ఒకరి కంటె ఎక్కువమంది జనులను ఉపయోగిస్తున్నారు. … అది ఏ ఒక్కరికైనా చాలా విస్తారమైనది, చాలా కష్టమైనది.” 4 పునఃస్థాపించబడిన సంఘ సభ్యులుగా, మనము ఇతరుల సేవను ఎక్కువగా తెలుసుకొని, మెచ్చుకోవాలి.

యేసు క్రీస్తు యొక్క సంఘము అవసరతలో ఉన్నవారికి సేవ చేయడానికి నిబద్ధత కలిగియుంది మరియు ఆ ప్రయత్నంలో ఇతరులతో సహకరించడానికి కూడా నిబద్ధత కలిగియుంది. ఈమధ్య మనము ఐక్యరాజ్యసమతి ప్రపంచ ఆహార కార్యక్రమానికి పెద్ద బహుమానాన్ని ఇచ్చాము. అనేక దశాబ్దాలకు పైగా మన మానవతావాద పనిలో, రెండు సంస్థలు కీలక సహకారులుగా నిలిచాయి: డజన్ల కొద్దీ దేశాలలో రెడ్‌క్రాస్ మరియు రెడ్ క్రెసెంట్ ఏజెన్సీలతో ప్రాజెక్టులు ప్రకృతి వైపరీత్యాలు మరియు సంఘర్షణల సమయంలో దేవుని పిల్లలకు కీలకమైన ఉపశమనాన్ని అందించాయి. అదేవిధంగా, మనము కాథలిక్ ఉపశమన సేవల నుండి సుదీర్ఘమైన సహకారాన్ని కలిగియున్నాము. ఈ సంస్థలు ప్రపంచమంతటా ఉన్న జనులకు సహాయాన్ని అందించడం గురించి మనకు ఎక్కువగా బోధించాయి.

ముస్లిం ఎయిడ్, వాటర్ ఫర్ పీపుల్ మరియు ఇస్రాఎయిడ్ వంటి ఇతర సంస్థల నుండి కూడా మనము ఫలవంతమైన సహకారాన్ని కలిగియున్నాము. ప్రతీ మానవతావాద సంస్థ దాని స్వంత ప్రత్యేకతను కలిగియుండగా, మనము దేవుని పిల్లల మధ్య బాధను తగ్గించాలనే ఉమ్మడి లక్ష్యాన్ని కలిగియున్నాము. ఇదంతా ఆయన పిల్లల కొరకు దేవుని కార్యములో భాగము.

మన రక్షకుడైన యేసు క్రీస్తు, “ఈ లోకములోనికి వచ్చు ప్రతి మనుష్యుని వెలిగించు నిజమైన వెలుగు” అని ఆధునిక బయల్పాటు బోధిస్తున్నది.5 దీని ద్వారా, దేవుని పిల్లలందరూ తమ జ్ఞానము, సామర్థ్యము మేరకు ఆయనకు మరియు ఒకరికొకరు సేవ చేయడానికి జ్ఞానోదయాన్ని పొందారు.

“మంచిని చేయుటకు, దేవుడిని ప్రేమించుటకు మరియు ఆయనను సేవించుటకు ఆహ్వానించి, ఆకర్షించు ప్రతీ సంగతి దేవుని వలన ప్రేరేపించబడినది”6 అని మోర్మన్ గ్రంథము బోధిస్తుంది.

అది ఇలా కొనసాగుతుంది:

“ఏలయనగా, చెడు నుండి మంచిని ఎరుగునట్లు క్రీస్తు యొక్క ఆత్మ ప్రతి మనుష్యునికి ఇవ్వబడినది; అందువలన తీర్పు తీర్చు విధానమును నేను మీకు చూపెదను; ఏలయనగా మంచి చేయమని ఆహ్వానించుచూ, క్రీస్తునందు విశ్వసించమని ప్రోత్సహించు ప్రతి సంగతి క్రీస్తు యొక్క శక్తి మరియు బహుమానము ద్వారా పంపబడెను. …

“ఇప్పుడు నా సహోదరులారా, మీరు దేని ద్వారా తీర్పు తీర్చగలరో ఆ వెలుగును, అనగా క్రీస్తు యొక్క వెలుగును మీరు ఎరిగియున్నారు.” 7

ఆహారం, వైద్య సంరక్షణ, మరియు బోధన వంటి ముఖ్యమైన రంగాలలో దేవుని పిల్లలు మిగిలిన దేవుని పిల్లలకు సహాయం చేయడం గురించి ఇక్కడ కొన్ని మాదిరులు ఉన్నాయి:

పది సంవత్సరాల క్రితం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని సిక్కు భార్యాభర్తలైన కన్హదారీలు, ఆకలిగొన్న వారికి ఆహారం అందించడానికి వ్యక్తిగతంగా ఒక గొప్ప ప్రయత్నాన్ని ప్రారంభించారు. గురు నానక్ దర్బార్ సిక్కు దేవాలయం ద్వారా, వారు ప్రస్తుతం ప్రతీ వారాంతంలో 30,000కు పైగా శాకాహార భోజనాలను మతం లేదా జాతితో సంబంధం లేకుండా వారి ద్వారంలో ప్రవేశించే వారికి అందిస్తున్నారు. “అందరూ ఒకటేనని మేము నమ్ముతాం; మనము ఒకే దేవుని పిల్లలం మరియు ఇక్కడ మనము మానవాళికి సేవ చేయడానికి ఉన్నాము”8 అని డా. కన్హదారీ వివరిస్తారు.

అవసరమైన వారికి వైద్యం మరియు దంత సంరక్షణ అందించడం మరొక ఉదాహరణ. చికాగోలో, నేను సిరియన్-అమెరికన్ క్రిటికల్ కేర్ ఫిజీషియన్, డాక్టర్ జాహెర్ సహ్లౌల్‌ని కలిశాను. ఆయన మెడ్‌గ్లోబల్ వ్యవస్థాపకులలో ఒకరు, అది సిరియన్ యుద్ధం వంటి సంక్షోభాలలో ఇతరులకు సహాయం చేయడానికి వారి సమయం, నైపుణ్యాలు, జ్ఞానం మరియు నాయకత్వాన్ని స్వచ్ఛందంగా అందించడానికి వైద్య నిపుణులను ఏర్పాటు చేస్తుంది, అక్కడి పౌరులకు వైద్య సంరక్షణ అందించడంలో డా. సహ్లౌల్ తన ప్రాణాలను పణంగా పెట్టారు. మెడ్‌గ్లోబల్ మరియు (అనేకమంది కడవరి దిన పరిశుద్ధ నిపుణులతో కలిపి) అటువంటి సంస్థలు, ప్రపంచవ్యాప్తంగా పేదవారికి అవసరమైన ఉపశమనాన్ని కలిగించడానికి విశ్వాసులైన నిపుణులను దేవుడు ప్రేరేపిస్తున్నట్లుగా రుజువు చేస్తున్నాయి.9

నిస్వార్థపరులైన అనేకమంది దేవుని పిల్లలు ప్రపంచవ్యాప్తంగా బోధనా ప్రయత్నాలలో చేర్చబడ్డారు. మన మానవతావాద ప్రయత్నాల ద్వారా మనకు తెలిసిన ఒక మంచి ఉదాహరణ, మిస్టర్. గేబ్రియల్ అని పిలువబడే వ్యక్తి యొక్క క్రియాశీలత, అతను అనేక సందర్భాల్లో వివిధ సంఘర్షణల నుండి శరణార్థిగా ఉన్నాడు. తూర్పు ఆఫ్రికాలోని వందల వేలమంది శరణార్థ పిల్లలకు వారి ఆశలను సజీవంగా ఉంచుకోవడానికి మరియు వారి మనస్సులను చురుకుగా ఉంచుకోవడానికి సహాయం అవసరమని అతను ఇటీవల గమనించాడు. అతను శరణార్థుల జనాభాలోని ఇతర ఉపాధ్యాయులతో “చెట్టు పాఠశాలలు” అని పిలిచిన దానిని ఏర్పాటు చేశాడు, అక్కడ పిల్లలు చెట్టు నీడ క్రింద పాఠాల కోసం సమకూడతారు. ఇతరులు నిర్వహించడం లేదా నిర్దేశించడం కోసం అతను ఎదురుచూడలేదు, కానీ ఒత్తిడితో కూడిన సంవత్సరాల్లో నిరాశ్రయులైన వేలాదిమంది ప్రాథమిక పాఠశాల పిల్లలకు అభ్యాస అవకాశాలను అందించిన ప్రయత్నాలకు వ్యక్తిగతంగా నాయకత్వం వహించాడు.

అయితే, కొందరు వ్యక్తులు విరాళంగా ఇచ్చిన వనరులతో మంచి పనులు చేస్తున్నామని చెప్తారు, కానీ నిజంగా మంచిపనులు చేయడంలేదు. దేవుడు అనేక సంస్థలను మరియు వ్యక్తులను ఎంతో మేలు చేయడానికి ప్రేరేపిస్తారని ఈ మాదిరులు చూపిస్తున్నాయి. మనలో ఎక్కవమంది ఇతరులు చేసిన మంచిని గుర్తించాలని, అలా చేయడానికి మనకు సమయం మరియు మార్గాలు ఉన్నందున దానికి మద్దతు ఇవ్వాలని కూడా ఇది చూపిస్తుంది.

సంఘము సహకారమిచ్చే సేవకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి, మన సభ్యులు, ఇతర మంచి వ్యక్తులు మరియు సంస్థలు కూడా వ్యక్తిగతంగా సమయం మరియు డబ్బు విరాళాలతో సహాయపడుతున్నారు.

మతపరమైన స్వేచ్ఛతో నేను ప్రారంభిస్తాను. దానిని సమర్థించడంలో, మనము మన స్వంత ప్రయోజనాలకు మాత్రమే కాకుండా, ఇతర మతాల ప్రయోజనాలకు కూడా సహాయపడతాము. మన మొదటి అధ్యక్షుడు, జోసెఫ్ స్మిత్ బోధించినట్లుగా, “మన మనస్సాక్షి ప్రబోధించిన ప్రకారము అద్వితీయ దేవుని ఆరాధించు ఆధిక్యతను కలిగియున్నామని మేము చెప్పుచున్నాము మరియు మనుష్యులు అందరు ఈ ఆధిక్యతను కలిగియుండుటకు వారు ఎలా అయిననూ, ఎక్కడయినను, ఏవిధముగానయినను ఆరాధించుటను అనుమతిస్తాము.”10

పునఃస్థాపించబడిన సంఘము యొక్క మానవతావాద సహాయము మరియు మన సభ్యుల చేత స్వచ్ఛందంగా మద్దతివ్వబడే ఇతర సహాయము యొక్క మిగిలిన ఉదాహరణలు, మన ప్రసిద్ధ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మరియు ఇంతకుముందు అంతగా తెలియజేయబడలేదు కానీ ఇప్పుడు బహిర్గతం చేయబడినట్లు, సుడిగాలులు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల విధ్వంసాలతో, స్థానభ్రంశంతో బాధపడుతున్న వారి ఉపశమనం కోసం ఇచ్చే భారీ విరాళాలు.

మన సభ్యులు వారి స్వచ్ఛంద విరాళాలు మరియు ప్రయత్నాల ద్వారా సహకారమిచ్చే ఇతర దాతృత్వ కార్యకలాపాలు జాబితా చేయడానికి చాలా ఎక్కువగా ఉన్నాయి, కానీ ఈ కొన్నింటిని పేర్కొనడం వాటి వైవిధ్యాన్ని, ప్రాముఖ్యతను సూచిస్తుంది: జాత్యహంకారం మరియు ఇతర పక్షపాతాలను ఎదుర్కోవడం; వ్యాధులను ఎలా నివారించాలి మరియు నయం చేయాలి అనే దానిపై పరిశోధన; వికలాంగులకు సహాయం చేయడం; సంగీత సంస్థలకు మద్దతు ఇవ్వడం; అందరి కోసం నైతిక మరియు భౌతిక వాతావరణాన్ని మెరుగుపరచడం.

యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల యొక్క మానవతావాద ప్రయత్నాలన్నీ మోర్మన్ గ్రంథములో వివరించబడిన నీతిగల జనుల మాదిరిని అనుసరించడానికి కోరతాయి: “ఆ విధముగా తాము వర్థిల్లుచున్న స్థితిలో వారు దిగంబరముగానున్న వారిని, ఆకలిదప్పులతోనున్న వారిని, రోగులను లేదా పోషింపబడని వారిని వెళ్ళగొట్టలేదు, … వారు … వృద్ధులు యౌవనులు, దాసులు స్వతంత్రులు, పురుషులు స్త్రీలు అందరి యెడల సంఘము వెలుపలనేమి, సంఘమందేమి అవసరతలో నున్న వ్యక్తుల విషయములో పక్షపాతము లేకుండా ఉదారముగానుండిరి.”11

యేసు క్రీస్తు గురించి నేను సాక్ష్యమిస్తున్నాను, ఆయన వెలుగు మరియు ఆత్మ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదలకు మరియు కష్టాల్లో ఉన్నవారికి సహాయపడుటలో మనందరిని నడిపిస్తుంది. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.