సర్వసభ్య సమావేశము
ప్రోత్సహించే వారసత్వము
2022 అక్టోబరు సర్వసభ్య సమావేశము


ప్రోత్సహించే వారసత్వము

పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు వద్దకు తిరిగి వెళ్ళేందుకు అర్హత పొందడానికి ప్రయాసపడడం కొనసాగించాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క ఈ సర్వసభ్య సమావేశములో మీతో సమకూడినందుకు నేను కృతజ్ఞత కలిగియున్నాను. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ మీ విశ్వాసమును, మీ ప్రేమను మేము అనుభూతిచెందాము. ప్రేరేపించబడిన బోధన, శక్తివంతమైన సాక్ష్యములు మరియు అద్భుతమైన సంగీతం చేత మనము జ్ఞానవృద్ధి పొందాము.

పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు వద్దకు తిరిగి వెళ్ళేందుకు అర్హత పొందడానికి ప్రయాసపడడం కొనసాగించాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మీరు నిబంధన బాటపై ఎక్కడ ఉన్నప్పటికీ, మర్త్యత్వము యొక్క శారీరక శ్రమలకు వ్యతిరేకంగా ప్రయాసపడుటను మరియు సాతాను యొక్క వ్యతిరేకతను మీరు కనుగొంటారు.

ఏదైనా పని చాలా కష్టమని నేను ఫిర్యాదు చేసినప్పుడు మా అమ్మ నాతో చెప్పినట్లుగా, “ఓహ్, హాల్, అవును, అది కష్టమైనది. అది ఆవిధంగానే ఉండాలి. జీవితము ఒక పరీక్ష.”

ఆమెకు రెండు విషయాలు తెలుసు కనుక ఆమె దానిని నెమ్మదిగా, నవ్వుతూ చెప్పగలదు. ప్రయాసను లక్ష్యపెట్టకుండా, ఆమె పరలోక తండ్రితో ఉండడానికి ఇంటికి వెళ్ళడం అత్యంత ముఖ్యమైన విషయము. ఆమె తన రక్షకునియందు విశ్వాసము ద్వారా దానిని చేయగలదని ఆమెకు తెలుసు.

ఆయన తనకు దగ్గరగా ఉన్నట్లు ఆమె భావించింది. తాను చనిపోబోతుందని ఎరిగిన రోజులలో ఆమె తన పడక గదిలో పడుకొని రక్షకుని గురించి నాతో మాట్లాడింది. ఆమె మంచానికి దగ్గర్లోనే మరొక గదికి తలుపు ఉంది. తాను త్వరలో ఆయనను చూడబోతున్నానని ఆమె ప్రశాంతంగా మాట్లాడినప్పుడు, ఆమె నవ్వుతూ తలుపువైపు చూసింది. తలుపు వైపు చూడడం మరియు ఆయన సన్నిధికి వెళ్ళడాన్ని ఊహించడం నాకింకా గుర్తుంది.

ఆమె ఇప్పుడు ఈ భూమి మీద లేదు. సంవత్సరాలుగా పడిన శారీరక మరియు వ్యక్తిగత శ్రమను లక్ష్యపెట్టకుండా, ఆమె పరలోక తండ్రితో జీవించడానికి తిరిగి వెళ్ళాలనే తన లక్ష్యముపై దృష్టిసారించగలిగింది.

ఆమె మాకోసం విడిచిపెట్టిన ప్రోత్సహించే వారసత్వము మొరోనై 7 లో శ్రేష్ఠంగా వివరించబడింది, అందులో మోర్మన్ తన కుమారుడు మొరోనైను, అతని జనులను ప్రోత్సహిస్తాడు. మా అమ్మ తన కుటుంబానికి వదిలిన ప్రోత్సహించే వారసత్వము వలే, అది భవిష్యత్తు తరానికి ప్రోత్సహించే వారసత్వము. నిత్యజీవము కొరకు వారి మర్త్య పరీక్షలన్నిటిలో అర్హత పొందాలని తీర్మానించే వారందరికి మోర్మన్ ప్రోత్సహించే వారసత్వమును అందించాడు.

మొరోనై 7 యొక్క మొదటి వచనాలను మోర్మన్ యేసు క్రీస్తు గురించి, దేవదూతలు గురించి మరియు క్రీస్తు యొక్క ఆత్మ గురించిన సాక్ష్యముతో ప్రారంభించాడు, అది చెడు నుండి మంచిని తెలుసుకోవడానికి మనల్ని అనుమతిస్తుంది, ఆవిధంగా సరైన దానిని ఎంపిక చేయగలుగుతాము.

వారి పరలోక గృహానికి తిరిగి వెళ్ళడానికి నీతిగా జీవించుటలో కష్టాలను అనుభవిస్తున్న వారికి ప్రోత్సాహామివ్వడంలో విజయం పొందిన వారందరు చేసినట్లుగా అతడు యేసు క్రీస్తుకు ప్రాధాన్యతనిస్తాడు:

“ఏలయనగా క్రీస్తు యొక్క మాటల ప్రకారము, ఆయన నామమందు విశ్వాసము కలిగియుండని యెడల ఏ మనుష్యుడు రక్షింపబడలేడు; అందువలన ఈ సంగతులు ఆగిపోయిన యెడల, అప్పుడు విశ్వాసము కూడా ఆగిపోవును; మరియు మనుష్యుని యొక్క స్థితి భయంకరమగును, ఏలయనగా వారు ఎట్టి విమోచన చేయబడనట్లు ఉందురు.

“కానీ నా ప్రియమైన సహోదరులారా, నేను మిమ్ములను గూర్చి శ్రేష్ఠమైన సంగతులను తీర్పు తీర్చెదను, ఏలయనగా మీ సాత్వీకమును బట్టి, మీరు క్రీస్తునందు విశ్వాసము కలిగియున్నారని నేను తీర్పుతీర్చుచున్నాను; మీరు ఆయనయందు విశ్వాసము కలిగియుండని యెడల, మీరు ఆయన సంఘ జనుల మధ్య లెక్కింపబడుటకు యోగ్యులు కారు.”1

మోర్మన్ సాత్వీకమును వారి విశ్వాసము యొక్క బలానికి సాక్ష్యముగా చూసాడు. వారు రక్షకునిపై ఆధారపడినట్లు భావించడం అతడు చూసాడు. విశ్వాసమును గమనించుట ద్వారా అతడు వారిని ప్రోత్సహించాడు. వారి విశ్వాసము మరియు సాత్వీకము దేవుని వద్దకు తిరిగి వెళ్ళడానికి వారి భరోసాను బలపరచి, వారి విశ్వాసమును పెంపొందిస్తుందని వారు గ్రహించడానికి సహాయపడుట ద్వారా ప్రోత్సహించుటను మోర్మన్ కొనసాగించాడు.

“మరలా నా ప్రియమైన సహోదరులారా, నేను మీతో నిరీక్షణను గూర్చి మాట్లాడుదును. మీరు నిరీక్షణ కలిగియుండని యెడల, మీరు విశ్వాసమును ఎట్లు పొందగలరు?

“మీ నిరీక్షణ దేని కొరకైయున్నది? ఇదిగో నేను మీతో చెప్పునదేమనగా—క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము, ఆయన పునరుత్థాన శక్తి ద్వారా నిత్యజీవమునకు లేపబడుటకు మీరు నిరీక్షణ కలిగియుండవలెను; మరియు ఇది వాగ్దానము ప్రకారము ఆయనయందు మీ విశ్వాసమును బట్టియైయున్నది.

“అందువలన, ఒక మనుష్యుడు విశ్వాసము కలిగియున్న యెడల, అతడు తప్పక నిరీక్షణ కలిగియుండవలెను; ఏలయనగా విశ్వాసము లేకుండా నిరీక్షణ ఉండజాలదు.

“మరలా నేను మీతో చెప్పునదేమనగా—అతడు సాత్వీకుడైయుండి దీనమనస్సు కలిగియుండని యెడల అతడు విశ్వాసమును, నిరీక్షణను కలిగియుండలేడు.”2

క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమతో వారి హృదయాలు నింపబడే వరమును పొందే మార్గములో వారున్నారని సాక్ష్యమిచ్చుట ద్వారా మోర్మన్ వారిని ప్రోత్సహిస్తున్నాడు. సువార్త మూలకాలైన యేసు క్రీస్తునందు విశ్వాసము, సాత్వీకము, వినయము, పరిశుద్ధాత్మ మరియు నిత్యజీవమును పొందడానికి స్థిరమైన నిరీక్షణ ఎలా కలిసి పనిచేస్తాయో అతడు వివరించాడు. అతడు వారిని ఈ విధంగా ప్రోత్సహించాడు:

“ఏలయనగా సాత్వీకులు మరియు దీనమనస్సు గలవారు తప్ప, ఎవరూ దేవుని యెదుట అంగీకరించబడరు; మరియు ఒక మనుష్యుడు సాత్వీకుడైయుండి దీనమనస్సు కలిగియుండి, యేసే క్రీస్తని పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా ఒప్పుకొనిన యెడల, అతడు తప్పక దాతృత్వము కలిగియుండవలెను; ఏలయనగా అతడు దాతృత్వము కలిగియుండని యెడల, అతడు ఏమియు కాడు; అందువలన, అతడు తప్పక దాతృత్వము కలిగియుండవలెను.”3

గతం గురించి ఆలోచిస్తూ, నేను ఆ దాతృత్వపు వరము—క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమ—పరలోకానికి వెళ్ళాలనే తన ప్రయాసలో మా అమ్మను ఎలా బలపరచింది, నడిపించింది, ఆమోదించింది మరియు మార్చిందో ఇప్పుడు గ్రహించగలిగాను.

“దాతృత్వము దీర్ఘకాలము సహించును, దయ చూపించును, మత్సరపడదు, ఉప్పొంగదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును.

“అందువలన నా ప్రియమైన సహోదరులారా, మీరు దాతృత్వము కలిగియుండని యెడల, మీరు ఏమియు కారు, ఏలయనగా దాతృత్వము ఎన్నడూ విఫలము కాదు. కావున, అన్నిటిలో గొప్పదైన దాతృత్వమును హత్తుకొనియుండుడి, ఏలయనగా అన్నియు విఫలమగును--

“కానీ, దాతృత్వము క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమయైయున్నది, అది నిత్యము నిలుచును; మరియు అంత్య దినమున దానిని కలిగియుండువానికి మేలు కలుగును.

“అందువలన నా ప్రియమైన సహోదరులారా, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులందరికి ఆయన అనుగ్రహించిన ఈ ప్రేమతో మీరు నింపబడవలెనని, మీరు దేవుని కుమారులు కావలెనని, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక మనము ఆయనను పోలియుండవలెనని, మనము ఈ నిరీక్షణను కలిగియుండవలెనని, ఆయన శుద్ధముగా ఉన్నట్లే మనము శుద్ధము చేయబడవలెనని హృదయము యొక్క పూర్ణ శక్తితో తండ్రికి ప్రార్థన చేయుడి.”4

మోర్మన్ యొక్క మాదిరి మరియు బోధనా ప్రోత్సాహము కొరకు నేను కృతజ్ఞుడిని. అదేవిధంగా మా అమ్మ యొక్క వారసత్వము చేత నేను దీవించబడ్డాను. ఆదాము నుండి ప్రస్తుత కాలము వరకు, ప్రవక్తలు బోధన మరియు మాదిరి ద్వారా నన్ను బలపరిచారు.

నాకు వ్యక్తిగతంగా తెలిసిన వారిపట్ల మరియు వారి కుటుంబాలపట్ల గౌరవం కారణంగా, వారి కష్టాల వివరాలను ధృవీకరించకూడదని లేదా వారి గొప్ప వరముల గురించి బహిరంగంగా మాట్లాడకూడదని నేను ఎంచుకున్నాను. అయినప్పటికీ నేను చూసినవి నన్ను ప్రోత్సహించాయి మరియు నన్ను మంచిగా మార్చాయి.

ఆమె గోప్యతకు భంగం కలిగించే ప్రమాదం ఉన్నందున, నేను నా భార్య మాదిరి ద్వారా పొందిన ప్రోత్సాహము గురించి క్లుప్తమైన నివేదికను చేరుస్తాను. నేను చాలా జాగ్రత్తగా దానిని చేస్తాను. ఆమె గోప్యత గలది, ఎన్నడూ పొగడ్తను కోరుకోదు, ఇష్టపడదు.

మాకు వివాహమై 60 సంవత్సరాలు అయ్యింది. ఆ అనుభవము వలన నేను ఈ లేఖన మాటలకు అర్థాన్ని ఇప్పుడు గ్రహించగలిగాను: విశ్వాసము, నిరీక్షణ, సాత్వీకము, సహించుట, మన స్వార్థాన్ని చూచుకొనకుండుట, సత్యమునందు ఆనందించుట, చెడును ఆలోచించకుండుట మరియు అన్నిటినీ మించి, దాతృత్వము.5 ఆ అనుభవమును ఆధారముగా చేసుకొని, సామాన్య మానవులు జీవితంలో కష్టాలను అనుభవిస్తూ ఆత్మీయంగా ఎదిగినప్పుడు వారి దైనందిన జీవితంలోకి ఆ అద్భుతమైన ఆదర్శాలన్నింటినీ తీసుకోగలరని నేను సాక్ష్యమివ్వగలను.

నా మాట వింటున్న లక్షలాది మందికి అలాంటి వ్యక్తులు తెలుసు. మీలో అనేకులు అటువంటి జనులు. మనందరికి అలాంటి ప్రోత్సహించే మాదిరులు మరియు ప్రేమగల స్నేహితులు అవసరము.

మీరు ఎవరితోనైనా, వారికి పరిచర్య చేసే సోదరి లేదా సోదరునిగా కూర్చున్నప్పుడు, మీరు ప్రభువుకు ప్రతినిధిగా ఉన్నారు. ఆయన ఏమి చేస్తారో లేదా చెప్తారో ఆలోచించండి. ఆయన యొద్దకు రమ్మని ఆయన వారిని ఆహ్వానిస్తారు. ఆయన వారిని ప్రోత్సహిస్తారు. వారు చేయాల్సిన మార్పుల ప్రారంభాన్ని గమనించి ఆయన మెచ్చుకుంటారు. వారు అనుకరించడానికి పరిపూర్ణమైన మాదిరిగా ఆయన ఉంటారు.

ఇంకా ఎవరూ పూర్తిగా ఆయనలా చేయలేరు, కానీ ఈ సమావేశాన్ని వినడం ద్వారా, మీరు ఆ మార్గములో ఉన్నారని మీరు తెలుసుకోగలరు. రక్షకుడు మీ కష్టాలను సవివరంగా ఎరిగియున్నాడు. విశ్వాసము, నిరీక్షణ మరియు దాతృత్వమందు ఎదగడానికి మీ గొప్ప సాధ్యతను ఆయన ఎరుగును.

ఆయన ఇచ్చే ఆజ్ఞలు మరియు నిబంధనలు మిమ్మల్ని నియంత్రించడానికి పరీక్షలు కాదు. అవి దేవుని యొక్క వరములన్నిటిని పొందడానికి మరియు మిమ్మల్ని ప్రేమించే మీ పరలోక తండ్రి వద్దకు, ప్రభువు వద్దకు తిరిగి వెళ్ళడానికి సహాయపడే బహుమానము.

యేసు క్రీస్తు మన పాపములకు వెల చెల్లించాడు. మనము పశ్చాత్తాపపడడానికి తగినంత విశ్వాసము కలిగియుండి, ఒక బిడ్డవలె మారి, దేవుని వరములన్నిటిలో గొప్పదానిని పొందడానికి సిద్ధపడి, శుద్ధిగా ఉన్న యెడల నిత్యజీవము యొక్క దీవెనను హక్కుగా పొందవచ్చు.

మీరు ఆయన ఆహ్వానాన్ని అంగీకరిస్తారని మరియు మన పరలోక తండ్రి యొక్క మిగిలిన పిల్లలకు దానిని అందిస్తారని నేను ప్రార్థిస్తున్నాను.

ప్రపంచమంతటా ఉన్న మన సువార్తికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఆ ఆహ్వానము ఆయన నామమును వారిపై తీసుకున్న సేవకుల ద్వారా యేసు క్రీస్తు నుండి వచ్చినదని నమ్మడానికి మరియు దానిని కోరుకోవడానికి ప్రతీవ్యక్తిని ప్రోత్సహించాలని వారు ప్రేరేపించబడుదురు గాక.

ఆయన జీవిస్తున్నారని, తన సంఘమును నడిపిస్తున్నారని నేను సాక్ష్యమిస్తున్నాను. నేను ఆయన సాక్షిని. సమస్త భూమి కొరకు అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ దేవుని యొక్క సజీవ ప్రవక్త. అది సత్యమని నాకు తెలుసు. యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో, ఆమేన్.