సర్వసభ్య సమావేశము
యేసు క్రీస్తే యౌవనుల బలము
2022 అక్టోబరు సర్వసభ్య సమావేశము


యేసు క్రీస్తే యౌవనుల బలము

మీరు మీ నమ్మకాన్ని యేసు క్రీస్తు నందు నిలపాలి. ఆయన మిమ్మల్ని సరియైన దారిలో నడిపిస్తారు. ఆయనే మీ బలము.

నేటి సందేశం గురించి సిద్ధపడుతున్నప్పుడు, యువతీ యువకులను ఉద్దేశించి మాట్లాడాలనే బలమైన ప్రేరేపణ నాకు కలిగింది.

ఒకప్పుడు యౌవనులైన వారు, అది జ్ఞాపకం లేనివారితో కూడా నేను మాట్లాడుతున్నాను.

అలాగే మన యువతను ప్రేమించి, జీవితంలో వారు విజయవంతం కావాలని కోరుకునే వారందరితో నేను మాట్లాడుతున్నాను.

ఎదుగుతున్న తరానికి, మన రక్షకుడైన యేసు క్రీస్తు నుండి ప్రత్యేకంగా మీ కోసం ఒక సందేశం నా దగ్గరుంది.

మీ కోసం రక్షకుని సందేశం

నా ప్రియమైన స్నేహితులారా, ఇప్పుడు ఇక్కడ రక్షకుడు ఉన్నట్లయితే, ఆయన మీతో ఏమి చెప్తారు?

మీ కోసం ఆయన గాఢమైన ప్రేమను వ్యక్తపరచడం ద్వారా ఆయన మొదలుపెడతారని నేను నమ్ముతున్నాను. ఆయన మాటలతో చెప్పవచ్చు, కానీ ఆయన సన్నిధి నుండి అది ఎంతో బలంగా ప్రవహిస్తుంది—అది స్పష్టంగా ఉంటుంది, మీ హృదయపు లోతుల్లోనికి చేరుకుంటుంది, మీ పూర్ణాత్మను నింపుతుంది!

అయినప్పటికీ, మనమందరం బలహీనులము, అపరిపూర్ణులము కాబట్టి, కొన్ని ఆందోళనలు మీ మనస్సులోకి రావచ్చు. మీరు చేసిన తప్పులు, మీరు శోధనకు లొంగిన సమయాలు, మీరు చేయకూడదని కోరుకున్న విషయాలు లేదా ఇంకా బాగా చేయాలనుకున్నవి మీకు గుర్తు రావచ్చు.

రక్షకుడు వాటిని గ్రహిస్తారు, మరియు లేఖనాలలో ఆయన చెప్పిన మాటలతో ఆయన మీకు అభయమిస్తారని నేను నమ్ముతున్నాను:

“భయపడకుడి.”1

“సందేహించకుడి.”2

“ధైర్యము తెచ్చుకొనుడి.”3

“మీ హృదయమును కలవరపడనియ్యకుడి.”4

ఆయన మీ తప్పులకు సాకులు వెదకుతారని నేను అనుకోను. ఆయన వాటిని అప్రధానమైనవిగా చేయరు. పశ్చాత్తాపపడమని—ఆయన మిమ్మల్ని క్షమించగలుగునట్లు మీ పాపాలను వదిలివేయమని, మారమని ఆయన అడుగుతారు. మీరు పశ్చాత్తాపపడగలుగునట్లు, 2000 సంవత్సరాల క్రితం ఆ పాపాలను ఆయన తన మీద తీసుకున్నారని ఆయన మీకు గుర్తుచేస్తారు. మన ప్రియమైన పరలోక తండ్రి నుండి మనకు బహుమానమివ్వబడిన సంతోష ప్రణాళికలో భాగమది.

ఆయనతో మీరు చేసిన నిబంధనలు—మీరు బాప్తిస్మము తీసుకున్నప్పుడు చేసినవి మరియు మీరు సంస్కారములో పాలుపొందిన ప్రతీసారి క్రొత్తవిగా చేసేవి—ఆయనతో మీకు ప్రత్యేక సంబంధాన్ని ఏర్పరుస్తాయని యేసు సూచించవచ్చు. ఆయన సహాయంతో మీరు ఎటువంటి భారాన్నైనా మోయగలుగునట్లు జోడుగా ఉండడం గురించి లేఖనాలు వివరిస్తున్న సంబంధమది.5

రక్షకుడైన యేసుక్రీస్తు మీరు చూడాలని, అనుభూతి చెందాలని మరియు ఆయనే మీ బలమని తెలుసుకోవాలని కోరుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. ఆయన సహాయంతో, మీరు సాధించగలిగే వాటికి హద్దులు లేవు. మీ సామర్థ్యము అపరిమితమైనది. ఆయన మిమ్మల్ని చూసే విధంగా మిమ్మల్ని మీరు చూడాలని ఆయన కోరతారు. అది ప్రపంచం మిమ్మల్ని చూసే విధానం నుండి చాలా భిన్నమైనది.

మీరు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు లేదా కుమార్తెయని నిశ్చయంగా రక్షకుడు ప్రకటిస్తారు. మీ పరలోక తండ్రి విశ్వంలోనే అత్యంత మహిమకరమైన వ్యక్తి, ప్రేమ, ఆనందం, స్వచ్ఛత, పరిశుద్ధత, వెలుగు, మహిమ మరియు సత్యముతో నిండిన వ్యక్తి. ఏదో ఒకరోజు ఆయన కలిగియున్నదంతా మీరు వారసత్వంగా పొందాలని ఆయన కోరుతున్నారు.6

ఈ కారణం చేతనే మీరు భూమిపై ఉన్నారు—నేర్చుకోవడానికి, ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి మరియు మీ పరలోకపు తండ్రి కోరిన వ్యక్తిగా మార్పుచెందడానికి.

దీనిని సాధ్యం చేయడానికి, ఆయన యేసు క్రీస్తును మీ రక్షకునిగా ఉండేందుకు పంపారు. ఆయన సంతోషము యొక్క గొప్ప ప్రణాళిక, ఆయన సంఘము, ఆయన యాజకత్వము, లేఖనాలు—అన్నింటి వెనుక ఉన్న ఉద్దేశ్యమిదే.

అది మీ గమ్యము. అది మీ భవిష్యత్తు. అది మీ ఎంపిక!

సత్యము మరియు ఎంపికలు

మీ సంతోషం కోసం దేవుని ప్రణాళికలో ముఖ్యభాగం ఎంపికచేసే మీ శక్తి.7 అవును, మీరు ఆయనతో నిత్య ఆనందాన్ని ఎంచుకోవాలని మీ పరలోక తండ్రి కోరుతున్నారు మరియు దానిని సాధించడానికి ఆయన మీకు సహాయం చేస్తారు, కానీ ఆయన మిమ్మల్ని ఎన్నడూ బలవంతపెట్టరు.

కాబట్టి ఎంపిక చేయడానికి ఆయన మిమ్మల్ని అనుమతిస్తారు: వెలుగు లేదా చీకటి? మంచి లేదా చెడు? ఆనందం లేదా దుఃఖం? నిత్య జీవితం లేదా ఆత్మీయ మరణం?8

అది చాలా తేలికైన ఎంపికగా అనిపిస్తోంది, కదా? కానీ, ఇక్కడ భూమి మీద అది ఉండవలసిన దానికంటే ఎక్కువ క్లిష్టంగా అనిపిస్తోంది.

సమస్య ఏమిటంటే, మనం ఎల్లప్పుడూ విషయాలను మనం చూడాలనుకున్నంత స్పష్టంగా చూడము. అపొస్తలుడైన పౌలు దానిని “అద్దములో చూచినట్టు సూచనగా” చూడడంతో పోల్చాడు.9 ఏది సరియైనదో, ఏది కాదో అనేదాని గురించి లోకంలో చాలా గందరగోళం ఉంది. చెడును మంచిగా, మంచిని చెడుగా అనిపించేలా చేయడానికి సత్యము మెలిపెట్టబడుతుంది.10

కానీ మీరు సత్యాన్ని—నిత్యమైన, మార్పుచెందని సత్యాన్ని—నిజాయితీగా వెదకినప్పుడు, మీ ఎంపికలు మరింత స్పష్టంగా మారతాయి. అవును, ఇంకా మీకు శోధన మరియు శ్రమలు ఉంటాయి. ఇంకా చెడు జరుగుతుంది. అనుకోని సంఘటనలు జరుగుతాయి. దుఃఖకరమైన విషయాలు జరుగుతాయి. కానీ, మీరు ఎవరు, ఇక్కడ ఎందుకున్నారు అని మీరు తెలుసుకున్నప్పుడు మరియు దేవుడిని మీరు నమ్మినప్పుడు, మీరు సంభాళించుకోగలరు.

అయితే, సత్యాన్ని మీరు ఎక్కడ కనుగొంటారు?

అది యేసు క్రీస్తు యొక్క సువార్తలో ఉంది. ఆ సువార్త యొక్క సంపూర్ణత్వము యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘములో బోధించబడుతుంది.

“నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు” అని యేసు క్రీస్తు చెప్పారు.11

మీరు ముఖ్యమైన ఎంపికలు చేయవలసి వచ్చినప్పుడు, యేసు క్రీస్తు మరియు పునఃస్థాపించబడిన ఆయన సువార్త మంచి ఎంపికలు. మీకు ప్రశ్నలున్నప్పుడు, యేసు క్రీస్తు మరియు పునఃస్థాపించబడిన ఆయన సువార్త మంచి సమాధానము. మీరు బలహీనంగా భావించినప్పుడు, యేసు క్రీస్తు మీ బలము.

సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే; శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే.

యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు.12

యౌవనుల బలము కొరకు

మార్గం కనుగొనడంలో మీకు సహాయపడేందుకు మరియు క్రీస్తు యొక్క సిద్ధాంతాన్ని మీ జీవితానికి దారిచూపే ప్రభావంగా చేసుకోవడంలో మీకు సహాయపడేందుకు, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము ఒక క్రొత్త వనరును,యౌవనుల బలము కొరకు యొక్క సవరించిన పాఠాంతరాన్ని సిద్ధం చేసింది.

చిత్రం
యౌవనుల బలము కొరకు, 2011 అనువాదం

యౌవనుల బలము కొరకు 50 ఏళ్ళకు పైగా తరతరాలుగా కడవరి దిన పరిశుద్ధ యువత కొరకు మార్గదర్శిగా ఉంది. నేను ఎల్లప్పుడూ ఒక ప్రతిని నా జేబులో పెట్టుకుంటాను మరియు మన ప్రమాణాల గురించి ఆసక్తిగా ఉన్నవారితో దానిని పంచుకుంటాను. మన కాలపు సవాళ్ళు మరియు శోధనలను బాగా ఎదుర్కోవడానికి అది సవరించబడింది, క్రొత్తగా చేయబడింది. క్రొత్త అనువాదమైన యౌవనుల బలము కొరకు, 50 విభిన్న భాషల్లో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది, మరియు ముద్రణ‌లో కూడా అందుబాటులో ఉంటుంది. మీ జీవితంలో ఎంపికలు చేసుకోవడానికి, ఇది ఒక ముఖ్యమైన సహాయం అవుతుంది. దయచేసి దీన్ని మీ స్వంతంగా స్వీకరించండి మరియు మీ స్నేహితులకు పంచండి.

చిత్రం
యౌవనుల బలము కొరకు, 2022 అనువాదం.

యౌవనుల బలము కొరకు యొక్క ఈ క్రొత్త పాఠాంతరానికి ఎంపికలు చేయడానికి మార్గదర్శి అని ఉపశీర్షిక పెట్టబడింది.

స్పష్టంగా చెప్పాలంటే, ఎంపికలు చేయడానికి మీరు కలిగియుండగల ఉత్తమమైన మార్గదర్శి యేసు క్రీస్తు. యేసు క్రీస్తే యౌవనుల బలము.

కాబట్టి, ఆయన వద్దకు తిరిగివెళ్ళడానికి మీరు చేయవలసిన దానిని మీరు అర్థం చేసుకొనేలా సహాయపడడమే యౌవనుల బలము కొరకు యొక్క ఉద్దేశ్యము. అది పునఃస్థాపించబడిన ఆయన సువార్త యొక్క నిత్య సత్యాలను—మీరు ఎవరు, ఆయన ఎవరు, ఆయన బలముతో మీరు ఏమి సాధించగలరు అనే సత్యాలను మీకు బోధిస్తుంది. ఆ నిత్య సత్యాలపై ఆధారపడి సరియైన ఎంపికలను ఎలా చేయాలో అది మీకు బోధిస్తుంది.13

యౌవనుల బలము కొరకు అనేది ఏమి చేయదో తెలుసుకోవడం కూడా మీకు ముఖ్యమైనది. అది మీ కోసం నిర్ణయాలు చేయదు. మీరు ఎదుర్కొనే ప్రతీ ఎంపికను చేయాలా, వద్దా అని అది చెప్పదు. యౌవనుల బలము కొరకు అనేది మీ ఎంపికల కొరకు గల పునాదిపై కేంద్రీకరిస్తుంది. ప్రతీ ప్రత్యేక ప్రవర్తనకు బదులుగా అది విలువలు, సూత్రాలు మరియు సిద్ధాంతంపై కేంద్రీకరిస్తుంది.

ప్రభువు ఆయన ప్రవక్తల ద్వారా ఎల్లప్పుడూ మనల్ని ఆ దిశగా నడిపిస్తున్నారు. “బయల్పాటును పొందడానికి [మన] ఆత్మీయ సామర్థ్యాన్ని హెచ్చించమని” ఆయన మనల్ని వేడుకుంటున్నారు.14 “ఆయనను వినుము” అని ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నారు. 15 ఉన్నతమైన మరియు పరిశుద్ధమైన విధానాల్లో ఆయనను అనుసరించమని ఆయన మనల్ని పిలుస్తున్నారు.16 ప్రతీవారం రండి, నన్ను అనుసరించండిలో అదేవిధంగా మనం నేర్చుకుంటున్నాము.

మీరు ధరించకూడని వస్త్రాలు, అనకూడని మాటలు, చూడకూడని సినిమాల సుదీర్ఘ జాబితాను ఈ మార్గదర్శి మీకు ఇవ్వగలదని నేననుకుంటున్నాను. కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘములో అది నిజంగా సహాయకరంగా ఉంటుందా? ఆవిధంగా సమీపించడం జీవితకాలము క్రీస్తువంటి జీవనానికి నిజంగా మిమ్మల్ని సిద్ధపరుస్తుందా?

“నేను వారికి సరైన సూత్రాలను నేర్పుతాను, వారు తమనుతాము పరిపాలించుకుంటారు”17 అని జోసెఫ్ స్మిత్ చెప్పారు.

మోర్మన్ గ్రంథములో రాజైన బెంజమిన్ తన జనులకు ఇలా చెప్పారు, “మీరు పాపము చేయగల విషయములన్నిటిని నేను మీకు చెప్పలేను; ఏలయనగా, నేను లెక్కించలేనన్ని మార్గములు మరియు విధానములు కలవు.”18

“కానీ ఇంతమట్టుకు నేను మీతో చెప్పగలను, మీరు మిమ్ములను, మీ తలంపులను, మీ మాటలను, మీ క్రియలను కనిపెట్టుకొనియుండి, దేవుని ఆజ్ఞలను పాటించి, ప్రభువు యొక్క విశ్వాసమందు మీ జీవితాంతము కొనసాగండి” అని రాజైన బెంజమిన్ కొనసాగించాడు.19

చిత్రం
రక్షకుడైన యేసు క్రీస్తు

నియమాలు కలిగియుండడం తప్పా? అస్సలు కాదు. మనందరికీ ప్రతీరోజు అవి అవసరం. కానీ, రక్షకునిపై కేంద్రీకరించడానికి బదులుగా కేవలం నియమాలపై కేంద్రీకరించడం తప్పు. ఎందుకు, ఎలా అనేదానిని మీరు తెలుసుకోవాలి, ఆ తర్వాత మీ ఎంపికల పర్యవసానాలను పరిగణించాలి. మీరు మీ నమ్మకాన్ని యేసు క్రీస్తు నందు నిలపాలి. ఆయన మిమ్మల్ని సరియైన దారిలో నడిపిస్తారు. ఆయనే మీ బలము.20

నిజమైన సిద్ధాంతం యొక్క శక్తి

యౌవనుల బలము కొరకు యేసు క్రీస్తు యొక్క సిద్ధాంతాన్ని ధైర్యంగా ప్రకటిస్తుంది. క్రీస్తు యొక్క సిద్ధాంతంపై ఆధారపడి ఎంపికలు చేయమని అది మిమ్మల్ని ధైర్యంగా ఆహ్వానిస్తుంది. మరియు ఆయన మార్గాన్ని అనుసరించే వారికి యేసు క్రీస్తు వాగ్దానం చేసిన దీవెనలను అది ధైర్యంగా వివరిస్తుంది.21

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా బోధించారు: “[మీ జీవితంలో] దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వడమే మీ ముఖ్యమైన కోరికైనప్పుడు, … అనేక నిర్ణయాలు సులువవుతాయి. అనేక సంగతులు అప్రాధాన్యమవుతాయి! మిమ్మల్ని మీరు మంచిగా ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలుస్తుంది. ఏది చూడాలో, ఏది చదవాలో, ఎక్కడ మీ సమయాన్ని గడపాలో, ఎవరితో సహవాసం చేయాలో మీకు తెలుస్తుంది. మీరు ఏం సాధించాలని కోరుకుంటున్నారో మీకు తెలుస్తుంది. నిజంగా మీరు ఎలాంటి వ్యక్తిగా అవ్వాలనుకుంటున్నారో మీకు తెలుస్తుంది.”22

ఉన్నతమైన ప్రమాణం

ఆయన అనుచరుల కొరకు యేసు క్రీస్తు చాలా ఉన్నతమైన ప్రమాణాలను కలిగియున్నారు. ఆయన చిత్తాన్ని నిజాయితీగా వెదకి, ఆయన సత్యాల ప్రకారం జీవించమనే ఆహ్వానం సంభవనీయమైన అత్యున్నత ప్రమాణం!

ముఖ్యమైన భౌతిక మరియు ఆత్మీయ ఎంపికలు వ్యక్తిగత ప్రాధాన్యతపై లేదా అనుకూలమైన లేదా ఖ్యాతిపొందిన వాటిపై మాత్రమే ఆధారపడి ఉండకూడదు.23 “మీరు కోరుకున్నది చేయండి” అని ప్రభువు చెప్పడం లేదు.

“దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనిమ్ము” అని ఆయన చెప్తున్నారు.

“రండి, నన్ను వెంబడించండి” అని ఆయన చెప్తున్నారు.24

“పరిశుద్ధమైన, ఉన్నతమైన, మరింత పరిపక్వమైన విధానంలో జీవించండి” అని ఆయన చెప్తున్నారు.

“నా ఆజ్ఞలు పాటించండి” అని ఆయన చెప్తున్నారు.

యేసు క్రీస్తు మన పరిపూర్ణమైన మాదిరి మరియు ఆయనను అనుసరించడానికి మన ఆత్మ యొక్క శక్తియంతటితో మనం ప్రయత్నిస్తాము.

నా ప్రియమైన స్నేహితులారా, నన్ను మరలా చెప్పనివ్వండి, ఈరోజు ఇక్కడ రక్షకుడు నిలబడినట్లయితే, మీ కోసం ఆయన అనంతమైన ప్రేమను, మీపై ఆయన పూర్తి నమ్మకాన్ని ఆయన వ్యక్తపరుస్తారు. మీరు దీనిని చేయగలరని ఆయన మీకు చెప్తారు. మీరు ఆనందకరమైన, సంతోషకరమైన జీవితాన్ని నిర్మించగలరు, ఎందుకంటే యేసు క్రీస్తే మీ బలము. మీరు నమ్మకాన్ని, సమాధానాన్ని, భద్రతను, సంతోషాన్ని, ఇప్పుడు మరియు నిత్యము చెందియుండడాన్ని కనుగొనగలరు, ఎందుకంటే మీరు వాటన్నిటిని యేసు క్రీస్తు నందు, ఆయన సువార్తలో మరియు ఆయన సంఘములో కనుగొంటారు.

దీని గురించి ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అపొస్తలునిగా నేను నా గంభీరమైన సాక్ష్యమిస్తున్నాను మరియు లోతైన కృతజ్ఞతతో, మీ కొరకు ప్రేమతో నా హృదయపూర్వక దీవెననిస్తున్నాను, యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. లూకా 5:10; 8:50; 12:7; సిద్ధాంతము మరియు నిబంధనలు 38:15; 50:41; 98:1.

  2. సిద్ధాంతము మరియు నిబంధనలు 6:36.

  3. మత్తయి 14:27; యోహాను 16:33; సిద్ధాంతము మరియు నిబంధనలు 61:36; 68:6; 78:18.

  4. యోహాను 14:1, 27.

  5. మత్తయి 11:28–30 చూడండి.

  6. సిద్ధాంతము మరియు నిబంధనలు 84:38 చూడండి.

  7. మీ ఎంపికల ద్వారా మీ కోరికలను వ్యక్తీకరించడానికి మిమ్మల్ని అనుమతించడానికి తండ్రి యొక్క ప్రణాళిక రూపొందించబడిందని మీరు చెప్పవచ్చు, తద్వారా మీరు కోరుకున్న దాని పూర్తి ఫలితాలను పొందవచ్చు. ఎల్డర్ డేల్ జి. రెన్‌లండ్ బోధించినట్లుగా, “సంతాన సాఫల్య విషయములో, మన పరలోకపు తండ్రి యొక్క లక్ష్యం, తన పిల్లలు సరైనది చేయడం మాత్రమే కాదు; అది ఆయన పిల్లలు సరైనది చేయడానికి ఎన్నుకోవడం మరియు చివరికి ఆయనలా మార్పు చెందటం. (“నేడు మీరు కోరుకొనుడి,” లియాహోనా, నవ. 2018, 104).

  8. 2 నీఫై 2:26–27 చూడండి.

  9. 1 కొరింథీయులకు 13:12.

  10. యెషయా 5:20 చూడండి.

  11. యోహాను 14:6.

  12. యెషయా 40:29–31 చూడండి.

  13. కడవరి దిన పరిశుద్ధులుగా, మన ప్రవర్తనల విషయములో మనం చేసే వాటికి మరియు చేయని వాటికి తరచుగా మనం ప్రసిద్ధి చెందాము. ఇది మంచిది కావచ్చు, కానీ మనకు తెలిసిన దాని గురించి (మన ప్రవర్తనలను నడిపించే సత్యాలు) మరియు మనకు తెలిసిన వారి గురించి (రక్షకుడు—మరియు ఆయన పట్ల మనకున్న ప్రేమ మన ప్రవర్తనలను ఎలా ప్రేరేపిస్తుంది) ప్రసిద్ధి చెందడం ఇంకా మంచిది.

  14. రస్సెల్ ఎమ్. నెల్సన్, “సంఘము కొరకు బయల్పాటు, మన జీవితాల కొరకు బయల్పాటు,” లియహోనా, మే 2018, 96.

  15. రస్సెల్ ఎన్. నెల్సన్, “ఆయనను వినుము,” లియహోనా, మే 2020, 88-92 చూడండి.

  16. కొత్త యౌవనుల బలము కొరకు మార్గదర్శి యొక్క నియమ-ఆధారిత ప్రవేశం ఇటీవల రక్షకుని సంఘము ద్వారా పరిచయం చేయబడిన ఇతర కార్యక్రమాలకు అనుగుణంగా ఉంటుంది, వీటిలో Preach My Gospel, ministering, the home-centered Come, Follow Me curriculum, the Children and Youth program, Teaching in the Savior’s Way, and the new General Handbook ఉన్నాయి. స్పష్టంగా, ప్రభువు మన ఆధ్యాత్మిక సామర్థ్యాన్ని పెంచుతున్నారు. కడవరి దినాల్లో, ఆయన తన నిబంధన జనులపై పెరిగిన నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నారు.

  17. Teachings of Presidents of the Church: Joseph Smith (2007), 284.

  18. మోషైయ 4:29. ఒక విధంగా చెప్పాలంటే, యేసు కాలంలోని పరిసయ్యులు దీన్ని చేయడానికి ప్రయత్నించారు. ధర్మ శాస్త్రాన్ని ఉల్లంఘించకుండా ప్రజలను ఆపాలనే పట్టుదలతో, వారి పవిత్ర రచనలపై వారి అవగాహన ఆధారంగా వందలాది నియమాలను వారు సంకలనం చేశారు. తమ నియమాలు తమను రక్షించగలవని భావించడమే పరిసయ్యులు చేసిన తప్పు. తరువాత, రక్షకుడు కనిపించినప్పుడు, వారు ఆయనను గుర్తించలేదు.

  19. మోషైయ 4:30; వివరణ చేర్చబడినది.

  20. మరొక కారణం, ప్రభువు సంఘము యొక్క పెరుగుతున్న సాంస్కృతిక వైవిధ్యంలో నియమ-ఆధారిత విధానం అవసరం. నియమాలు శాశ్వతమైనవి మరియు సార్వత్రికమైనవి. నిర్దిష్ట సూత్రాలు లేదా ఆ నియమాల అన్వయం కొన్ని చోట్ల బాగా పనిచేస్తుంది, కానీ అన్ని చోట్ల కాదు. నిర్దిష్టమైన అన్వయాలు కాలానుగుణంగా మరియు సంస్కృతులలో మారినప్పటికీ. మనల్ని ఏకం చేసేది యేసుక్రీస్తు, మరియు ఆయన బోధించిన నిత్య సత్యాలు. సాధ్యమయ్యే ప్రతి ఒక్కటి చేయండి మరియు చేయవద్దు అనే జాబితా ప్రతిదాన్ని చేయడంలో అసాధ్యమైనది మరియు నిలకడలేనిది మాత్రమే కాదు. సమస్య ఏమిటంటే, అది మన బలానికి మూలమైన మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి మన దృష్టిని మళ్ళిస్తుంది.

  21. చాలా సంవత్సరాల క్రితం, అధ్యక్షులు బాయిడ్ కె. పాకర్ ఈ శక్తివంతమైన మాటలు మాట్లాడారు: “నిజమైన సిద్ధాంతంపై అవగాహన, వైఖరిని మరియు ప్రవర్తనను మారుస్తుంది. ప్రవర్తన యొక్క అధ్యయనం మన ప్రవర్తనను మెరుగు పరిచే దాని కంటే, సువార్త యొక్క సిద్ధాంతాల అధ్యయనం మన ప్రవర్తనను త్వరగా మెరుగుపరుస్తుంది” (“Do Not Fear,” Liahona, May 2004, 79).

    అధ్యక్షులు ఎజ్రా టాఫ్ట్ బెన్సన్ కూడా ఇదే సత్యాన్ని బోధించారు: “ప్రభువు లోపల నుండి పనిచేస్తారు. ప్రపంచము బయటి నుండి పనిచేస్తుంది. … సమాజం మానవ ప్రవర్తనను రూపొందిస్తుంది, కానీ క్రీస్తు మానవ స్వభావాన్ని మార్చగలరు” (“Born of God,” Ensign, Nov. 1985, 6).

    మోర్మన్‌ గ్రంథ ప్రవక్త అల్మా, తన చుట్టూ ఉన్న ప్రపంచంలో చెడును చూసినప్పుడు అతను దేవుని వాక్యం వైపు మొగ్గు చూపాడు, ఎందుకంటే “ఇప్పుడు వాక్యము యొక్క బోధన, న్యాయమైన దానిని చేయుటకు జనులను నడిపించుటలో అత్యంత ప్రభావవంతమైనందున—ఖడ్గము లేదా వారికి సంభవించిన ఇతర వాటన్నిటి కంటే జనుల మనస్సులపై అధిక శక్తివంతమైన ప్రభావము కలిగియున్నందున—దేవుని వాక్యము యొక్క ప్రభావమును వారు ప్రయత్నించుట ప్రయోజనకరమని ఆల్మా తలంచెను.” (ఆల్మా 31:5).

  22. రస్సెల్ ఎమ్. నెల్సన్, “దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనిమ్ము,” లియాహోనా, .నవ. 2020, 94. అధ్యక్షులు నెల్సన్, సబ్బాతు దినమును గౌరవించడం గురించి మాకు బోధించినప్పుడు ఈ విధానాన్ని ఉదహరించారు: “నా చిన్న వయస్సులో, సబ్బాతు దినమున చేయవలసిన మరియు చేయకూడని పనుల జాబితాలను సంకలనం చేసిన ఇతరుల పనిని నేను అధ్యయనం చేసాను. చాలాకాలం తర్వాత, నా ప్రవర్తన మరియు సబ్బాతు దినమును గూర్చి నా వైఖరి నాకు మరియు నా పరలోక తండ్రికి మధ్య ఒక సంకేతమును కలిగియుందని నేను లేఖనముల నుండి తెలుసుకున్నాను. ఆ అవగాహనతో, నాకు ఇకపై చేయవలసిన మరియు చేయకూడని పనుల జాబితాలు అవసరం లేదు. ఒక కార్యక్రమం సబ్బాతు దినమునకు తగినదా కాదా అనే నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడు, ‘నేను దేవునికి ఏ సంకేతం ఇవ్వాలనుకుంటున్నాను’ అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఆ ప్రశ్న సబ్బాతు దినము గురించి నా ఎంపికలను స్పష్టం చేసింది” (“The Sabbath Is a Delight,” Liahona, May 2015, 130).

  23. “వేర్వేరు పరిస్థితులు, సవాళ్ళు, నిర్ణయాలు మరియు మర్త్య అనుభవాలను మనం అనుభవిస్తున్నప్పుడు నిత్య సత్యం యొక్క విలువైన దృక్పథాన్ని అందించడం ద్వారా మన వ్యక్తిగత ప్రాధాన్యతలను మరియు స్వీయ-కేంద్రీకృత కోరికలను మించి చూడడానికి కూడా నీతి సూత్రాలు మనకు సహాయపడతాయని ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ బోధించారు” (“నా సువార్త సూత్రములు,” లియహోనా, మే 2021, 123–24).

  24. లూకా 18:22.