సర్వసభ్య సమావేశము
లోకమును జయించి, విశ్రాంతి కనుగొనుడి
2022 అక్టోబరు సర్వసభ్య సమావేశము


లోకమును జయించి, విశ్రాంతి కనుగొనుడి

దేవునితో మీ నిబంధనల ద్వారా లోకమును జయించుట చేత, ఈ ప్రపంచం యొక్క తీవ్రత, అనిశ్చితి మరియు వేదన నుండి విశ్రాంతిని కనుగొనండి.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ మహిమకరమైన సబ్బాతు ఉదయం మిమ్మల్ని పలకరించడానికి నేను కృతజ్ఞుడను. మీరు నిరంతరం నా మనస్సులో ఉన్నారు. అవసరంలో ఉన్నవారిని మీరు చూసినప్పుడు, వెంటనే కార్యరూపం దాల్చే మీ విధానానికి నేను ఆశ్చర్యపోతున్నాను. మళ్ళీ మళ్ళీ మీరు ప్రదర్శించే విశ్వాసానికి, సాక్ష్యానికి నేను ఆశ్చర్యపోతున్నాను. మీ బాధలు, నిరాశలు మరియు చింతలను బట్టి నేను దుఃఖిస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మన పరలోక తండ్రి, ఆయన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తున్నారని నేను అభయమిస్తున్నాను. వారికి మీ పరిస్థితులు, మీ మంచితనము, మీ అవసరాలు మరియు సహాయం కోసం మీ ప్రార్థనలు బాగా తెలుసు. మీ కోసం వారి ప్రేమను మీరు అనుభవించాలని మళ్ళీ మళ్ళీ నేను ప్రార్థిస్తున్నాను.

వారి ప్రేమను అనుభవించడం ముఖ్యము, ఎందుకంటే ప్రతిరోజూ మనం విచారించదగిన వార్తలకు స్పందించవలసి వస్తున్నట్లు అనిపిస్తోంది. మీ పైజామా ధరించి, కాళ్ళు ముడుచుకొని పడుకుంటూ, ఈ సంక్షోభం మొత్తం పూర్తయిన తర్వాత నన్ను నిద్రలేపండి అని ఎవరినైనా అడగాలని మీరు కోరుకున్న రోజులను మీరు కలిగియుండవచ్చు.

కానీ, నా ప్రియమైన సహోదర సహోదరీలారా, ముందుముందు ఎన్నో అద్భుతమైన విషయాలు జరుగుతాయి. రాబోయే రోజుల్లో, లోకము ఎన్నడూ చూడని రక్షకుని శక్తి యొక్క గొప్ప ప్రత్యక్షతలను మనం చూస్తాము. ఇప్పుడు మరియు “ప్రభావముతోను మహామహిమతోను”1 ఆయన తిరిగివచ్చే సమయానికి మధ్య, విశ్వాసులపై ఆయన లెక్కలేనన్ని విశేషావకాశాలను, దీవెనలను, అద్భుతాలను క్రుమ్మరిస్తారు.

అయినప్పటికీ, ప్రస్తుతం మనం ప్రపంచ చరిత్రలోనే నిశ్చయంగా అత్యంత క్లిష్టమైన సమయంలో జీవిస్తున్నాము. సంక్లిష్టతలు మరియు సవాళ్ళు అనేకమందికి నిష్పలమైన, తీవ్రంగా అలసిపోయిన అనుభూతి కలిగిస్తున్నాయి. ఏమైనప్పటికీ, మీరు మరియు నేను విశ్రాంతిని ఎలా కనుగొనాలనే దానిని సులువుగా అర్థం చేసుకోవడానికి ఇటీవలి అనుభవాన్ని ఒకదానిని పరిగణించండి.

ఇటీవల జరిగిన వాషింగ్టన్ డి.సి. దేవాలయ బహిరంగ సందర్శనలో, బహిరంగ సందర్శన కమిటీ సభ్యుడొకరు దేవాలయం గుండా అనేకమంది ప్రముఖ పాత్రికేయులను తీసుకువెళ్తుండగా, అతడు ఒక తెలివైన పరస్పర మార్పిడిని చూసాడు. చిన్నపిల్లలు గల కుటుంబమొకటి అనుకోకుండా ఈ దేవాలయంలో పర్యటిస్తున్న మీడియా సమూహంలో కలిసిపోయింది. వారు దేవాలయంలో ఒక గది నుండి మరొకదానికి వెళ్తున్నప్పుడు, దేవాలయ సంరక్షకుని “ప్రయాణం” గురించి ఒక పాత్రికేయుడు అడగసాగాడు. దేవాలయ ప్రయాణం ఒక వ్యక్తి యొక్క జీవన ప్రయాణంలోని సవాళ్ళకు చిహ్నంగా ఉన్నదేమో తెలుసుకోవాలని అతడు కోరుకున్నాడు.

కుటుంబంలోని ఒక చిన్న బాలుడు ఆ సంభాషణను శ్రద్ధగా విన్నాడు. పర్యాటక సమూహము వరమునిచ్చే గదిలో ప్రవేశించినప్పుడు, జనులు దేవునితో నిబంధనలు చేయడానికి మోకరించే బలిపీఠం వైపు చూపిస్తూ, ఆ బాలుడు ఇలా అన్నాడు, “ఓహ్, అది బాగుంది. జనులు తమ దేవాలయ ప్రయాణంలో విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడొక స్థలముంది.”

అతడు గమనించినది ఎంత లోతైన విషయమో ఆ బాలుడికి తెలుసా అనేది నా సందేహం. దేవాలయంలో దేవునితో నిబంధన చేయడానికి మరియు రక్షకుని అద్భుతమైన వాగ్దానానికి మధ్య గల ప్రత్యక్ష సంబంధం గురించి బహుశా అతనికి తెలియదు:

“ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును.

“మీమీద నా కాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకొనుడి; … అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.

“ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.”2

ప్రియమైన సహోదర సహోదరీలారా, సభ్యత్వానికి వారి నుండి చాలా ఎక్కువ అవసరమని వారు భావించడం మూలంగా సంఘమును విడిచివెళ్ళే వారి కోసం నేను దుఃఖిస్తున్నాను. నిజానికి నిబంధనలను చేయడం మరియు పాటించడం జీవితాన్ని సులభతరం చేస్తుందని వారింకా కనుగొనలేదు. బాప్తిస్మపు తొట్టెలలో, దేవాలయాలలో నిబంధనలు చేసే—మరియు వాటిని పాటించే—ప్రతీవ్యక్తి యేసు క్రీస్తు యొక్క శక్తిని అధికంగా పొందుతారు. ఆ అద్భుతమైన సత్యాన్ని దయచేసి ధ్యానించండి.

దేవునితో నిబంధనలను పాటించినందుకు బహుమతి పరలోక శక్తి—మన శ్రమలు, శోధనలు మరియు బాధలను ఎదిరించడానికి మనల్ని బలపరిచే శక్తి. ఈ శక్తి మన మార్గాన్ని సులువుగా చేస్తుంది. యేసు క్రీస్తు యొక్క ఉన్నత చట్టాలను జీవించేవారు ఆయన ఉన్నత శక్తిని పొందుతారు. ఆ విధంగా, నిబంధనలను పాటించేవారు ఒక ప్రత్యేక రకమైన విశ్రాంతికి అర్హులు, అది దేవునితో వారి నిబంధన సంబంధం ద్వారా వారికి వస్తుంది.

రక్షకుడు తననుతాను గెత్సేమనే మరియు కల్వరి యొక్క వేదనకు అప్పగించుకోవడానికి ముందు, ఆయన తన అపొస్తలులకు ఇలా ప్రకటించారు, ”లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాను.”3 తదనంతరం, “మీరు లోకమును జయించవలెనని నేను కోరుతున్నాను” అని ఆయన చెప్పినప్పుడు, మనలో ప్రతీఒక్కరిని అలాగే చేయమని యేసు వేడుకున్నారు.4

ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈరోజు నేను మీకిచ్చే సందేశమేమిటంటే, యేసు క్రీస్తు ఈ పతనమైన లోకాన్ని జయించినందున, మరియు మనలో ప్రతీఒక్కరి కోసం ఆయన ప్రాయశ్చిత్తం చేసినందు వలన, మీరు కూడా పాపంతో నిండిన, స్వార్థంతో నిండిన మరియు తరచు తీవ్రమైన అలసట కలిగించే ఈ లోకాన్ని జయించగలరు.

రక్షకుడు తన అనంతమైన ప్రాయశ్చిత్తము ద్వారా, మనలో ప్రతీఒక్కరిని బలహీనత, పొరపాటులు, పాపము నుండి విమోచించినందు వలన, మరియు మీరు ఎప్పుడైనా కలిగియుండగల ప్రతీ బాధను, విచారాన్ని, భారాన్ని ఆయన అనుభవించినందు వలన,5 మీరు నిజంగా పశ్చాత్తాపపడి, ఆయన సహాయం కోరినప్పుడు, మీరు నేటి అనిశ్చితమైన ప్రపంచపు సవాళ్ళను జయించగలరు.

అహంకారం, గర్వం, కోపం, అనైతికత, ద్వేషం, దురాశ, అసూయ మరియు భయంతో సహా ఆత్మీయంగా, మానసికంగా తీవ్రమైన అలసట కలిగించే లోకపు తెగుళ్ళను మీరు జయించగలరు. పరధ్యానాలు మరియు వక్రీకరణలు మన చుట్టూ తిరుగుతున్నప్పటికీ, అత్యంత వేధించే మీ సమస్యల మధ్య కూడా మీరు నిజమైన విశ్రాంతి—అనగా ఉపశమనాన్ని, శాంతిని కనుగొనగలరు.

ఈ ముఖ్యమైన సత్యము మూడు ప్రధానమైన ప్రశ్నలను ప్రేరేపిస్తుంది:

మొదటిది, లోకాన్ని జయించడం అనగా అర్థమేమిటి?

రెండవది, దీనిని మనం ఎలా చేస్తాము?

మూడవది, లోకాన్ని జయించడం మన జీవితాలను ఎలా దీవిస్తుంది?

లోకాన్ని జయించడం అనగా అర్థమేమిటి? దానర్థం, దేవుని యొక్క విషయాలకుపైగా లోకము యొక్క విషయాలకు విలువ ఇచ్చే శోధనను జయించడం. దానర్థం, మనుష్యుల తత్వాల కంటే ఎక్కువగా క్రీస్తు యొక్క సిద్ధాంతాన్ని నమ్మడం. దానర్థం, సత్యములో ఆనందించడం, మోసాన్ని ఖండించడం మరియు “క్రీస్తు యొక్క వినయముగల అనుచరులుగా” మారడం.6 దానర్థం, ఆత్మను దూరంగా తరిమివేసే దేనినైనా మానుకోవడానికి ఎంపిక చేయడం. దానర్థం, మనకు ఇష్టమైన పాపాలను కూడా “వదిలివేయడానికి” సమ్మతించడం.7

లోకాన్ని జయించడమంటే అర్థము, ఈ జీవితంలో పరిపూర్ణులుగా మారడమని కాదు, లేదా మీ సమస్యలు అద్భుతంగా మాయమైపోతాయని కాదు—ఎందుకంటే అవి తీరిపోవు. మరియు దాని అర్థము, మీరు ఇకపై తప్పులు చేయరని కాదు. కానీ లోకాన్ని జయించడమంటే, పాపాన్ని ప్రతిఘటించే మీ శక్తి పెరుగుతుందని అర్థము. యేసు క్రీస్తు యందు మీ విశ్వాసము పెరిగినప్పుడు, మీ హృదయము మృదువుగా అవుతుంది.8 లోకాన్ని జయించడమంటే, మీరు ఎవరినైనా, దేనినైనా ప్రేమించిన దానికంటే ఎక్కువగా దేవుడిని, ఆయన ప్రియ కుమారుడిని ప్రేమించడమని అర్థము.

అప్పుడు, మనం లోకాన్ని ఎలా జయిస్తాము? ఎలాగో రాజైన బెంజమిన్ మనకు బోధించాడు. “పరిశుద్ధాత్మ ప్రేరేపణలకు లోబడి ప్రకృతి సంబంధియైన మనుష్యుని విసర్జించి, ప్రభువైన క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా పరిశుద్ధుడైతే తప్ప, “ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవునికి శత్రువైయున్నాడు” మరియు నిరంతరముండును” అని ఆయన చెప్పారు.9 మీరు ఆత్మ యొక్క ప్రేరేపణలను వెదకి, అనుసరించిన ప్రతీసారి, మీరు ఏదైనా మంచిని—“ప్రకృతి సంబంధియైన మనుష్యుడు” చేయని విషయాలను చేసిన ప్రతీసారి, మీరు లోకాన్ని జయిస్తున్నారు.

లోకాన్ని జయించడమనేది ఒకటి, రెండు రోజుల్లో జరిగే సంఘటన కాదు. మనం క్రీస్తు యొక్క సిద్ధాంతాన్ని పదేపదే హత్తుకున్నప్పుడు జీవితకాలంలో అది జరుగుతుంది. అనుదినము పశ్చాత్తాపపడడం మరియు మనకు శక్తిని ప్రసాదించే నిబంధనలను పాటించడం ద్వారా మనం యేసు క్రీస్తునందు విశ్వాసాన్ని వృద్ధిచేస్తాము. మనం నిబంధన బాటపై నిలుస్తాము మరియు ఆత్మీయ బలము, వ్యక్తిగత బయల్పాటు, హెచ్చైన విశ్వాసము మరియు దేవదూతల పరిచర్యతో దీవించబడతాము. క్రీస్తు యొక్క సిద్ధాంతాన్ని జీవించడమనేది మన జీవితాల్లో ఆత్మీయ వేగాన్ని సృష్టిస్తూ, అత్యంత శక్తివంతమైన, సద్గుణవంతమైన మాదిరిని పుట్టించగలదు.10

యేసు క్రీస్తు యొక్క ఉన్నత చట్టాలను జీవించడానికి మనం ప్రయత్నించినప్పుడు, మన హృదయాలు మరియు మన స్వభావాలు కూడా మార్పుచెందడం ప్రారంభమవుతుంది. గొప్ప దాతృత్వము, వినయము, ఔదార్యము, దయ, స్వీయ క్రమశిక్షణ, శాంతి మరియు విశ్రాంతితో మనల్ని దీవించడం ద్వారా రక్షకుడు పతనమైన ఈ లోకం యొక్క శోధనలను జయించడానికి మనకు సహాయపడతారు.

ఇప్పుడు, ఇది విశ్రాంతికి బదులు ఎక్కువగా కష్టమైన ఆత్మీయ కార్యముగా అనిపిస్తుందని మీరనుకోవచ్చు. కానీ అత్యున్నతమైన సత్యము ఇక్కడుంది: అధికారము, ఆస్తులు, పేరు ప్రఖ్యాతులు, శారీరక ఆనందాలు సంతోషాన్నిస్తాయని ప్రపంచం నొక్కి చెప్పినప్పటికీ, అవి ఇవ్వవు! అవి ఇవ్వలేవు! “దేవుని ఆజ్ఞలను పాటించే [వారి] ఆశీర్వాదకరమైన మరియు సంతోషకరమైన స్థితికి” ఖాళీ ప్రత్యామ్నాయం తప్ప అవి ఇచ్చేది ఏమీ లేదు.11

సత్యమేమిటంటే, మీరు ఎన్నడూ కనుగొనలేని చోట సంతోషాన్ని వెదకడమనేది చాలా ఎక్కువ ప్రయాసతో కూడినది. ఏమైనప్పటికీ, మీకైమీరు యేసు క్రీస్తు యొక్క కాడి యెత్తుకొని, లోకాన్ని జయించడానికి అవసరమైన ఆత్మీయ కార్యమును చేసినప్పుడు, ఆయన మరియు ఆయన మాత్రమే ఈ లోకపు శోధనలను జయించడానికి మీకు సహాయపడగల శక్తిని కలిగియున్నారు.

ఇప్పుడు, లోకాన్ని జయించడం మన జీవితాలను ఎలా దీవిస్తుంది? జవాబు స్పష్టమైనది: దేవునితో నిబంధన సంబంధంలోనికి ప్రవేశించడం మనల్ని ఆయనతో ఒక విధంగా బంధిస్తుంది, అది జీవితానికి సంబంధించిన ప్రతిదానిని సులభతరం చేస్తుంది. దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి: నిబంధనలను చేయడం జీవితాన్ని సులభతరం చేస్తుందని నేను చెప్పలేదు. వాస్తవానికి, వ్యతిరేకతను ఆశించండి, ఎందుకంటే మీరు యేసు క్రీస్తు యొక్క శక్తిని కనుగొనాలని అపవాది కోరుకోడు. కానీ, మీరు రక్షకుని యొక్క కాడిని యెత్తుకోవడమంటే అర్థము, ఆయన బలానికి, విమోచనా శక్తికి మీరు ప్రవేశం కలిగియుండడం.

చిత్రం
అధ్యక్షులు ఎజ్రా టాఫ్ట్ బెన్సన్

అధ్యక్షులు ఎజ్రా టాప్ట్ బెన్సన్ యొక్క గంభీరమైన బోధనను నేను పునరుద్ఘాటిస్తున్నాను: “దేవునికి తమ జీవితాలను అప్పగించిన స్త్రీ పురుషులు వారి జీవితాలలో వారు చేయగల దానికంటె ఎక్కువగా ఆయన చేయగలరని కనుగొంటారు. ఆయన వారి ఆనందాలను అధికం చేస్తారు, వారి దృష్టిని విస్తరిస్తారు, వారి మనస్సులను వేగవంతం చేస్తారు, … వారి ఆత్మలను ఉద్ధరిస్తారు, వారి దీవెనలను అధికం చేస్తారు, వారి అవకాశాలను పెంచుతారు, వారి ఆత్మలను ఓదారుస్తారు, స్నేహితులను పుట్టిస్తారు మరియు శాంతిని క్రుమ్మరిస్తారు.”12

ఈ లోకాన్ని జయించడంలో వారికి సహాయపడేందుకు పరలోక సహకారాన్ని కోరేవారిని ఈ సాటిలేని విశేషావకాశాలు అనుసరిస్తాయి. ఈ మేరకు, గత మే లో నేను మన యువజనులకు ఇచ్చిన అదే బాధ్యతను సంఘము యొక్క సభ్యులందరికి ఇస్తున్నాను. అప్పుడు నేను వారిని కోరాను—మరియు ఇప్పుడు నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను—యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త గురించి మీ స్వంత సాక్ష్యానికి బాధ్యత వహించండి. దానికోసం పని చేయండి. అది వృద్ధిచెందేలా దానిని పోషించండి. దానికి సత్యమును ఆహారంగా ఇవ్వండి. అపనమ్మకస్తులైన పురుషులు, స్త్రీల యొక్క అబద్ధపు తత్వములతో దానిని కలుషితం చేయకండి. యేసు క్రీస్తు గురించి మీ సాక్ష్యమును నిరంతరం బలపరచడాన్ని మీ అత్యున్నత ప్రాధాన్యతగా మీరు చేసినప్పుడు, మీ జీవితంలో జరిగే అద్భుతాల కొరకు గమనించండి.13

దేవునితో మీ నిబంధనల ద్వారా లోకమును జయించుట చేత ఈ లోకపు తీవ్రత, అనిశ్చితి మరియు వేదన నుండి విశ్రాంతిని కనుగొనాలని ఈ ఉదయం నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు లోకాన్ని జయించడం గురించి గంభీరంగా ఉన్నారని మీ ప్రార్థనలు మరియు మీ చర్యల ద్వారా ఆయనకు తెలియజేయండి. మీ మనస్సును వెలుగుతో నింపమని, మీకు అవసరమైన సహాయాన్ని పంపమని ఆయనను అడగండి. ప్రతిరోజూ మీరు ప్రార్థించినప్పుడు, మీకు వచ్చే ఆలోచనలను నమోదు చేయండి; తరువాత వాటిని శ్రద్ధగా అనుసరించండి. దేవాలయంలో అధిక సమయం గడపండి మరియు పతనమైన ఈ లోకపు శోధనలను ఎలా జయించాలని దేవాలయం మీకు బోధిస్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.14

నేను ఇంతకుముందు చెప్పినట్లు, ఇశ్రాయేలీయులను సమకూర్చుటయే భూమిపై నేడు జరుగుతున్న అతి ప్రాముఖ్యమైన కార్యం. ఈ సమకూర్పులో ఒక కీలకమైన అంశం ఏమిటంటే, ప్రభువు మళ్ళీ వచ్చినప్పుడు, ఆయనను స్వీకరించడానికి సమర్థులుగా, సిద్ధంగా ఉండి మరియు అర్హులైన ప్రజలను, ఈ పడిపోయిన ప్రపంచానికి పైగా ఇప్పటికే యేసు క్రీస్తును ఎన్నుకున్న ప్రజలను, యేసు క్రీస్తు యొక్క ఉన్నతమైన, పవిత్రమైన చట్టాలను జీవించడానికి వారి కర్తృత్వము బట్టి సంతోషించే ప్రజలను సిద్ధం చేయడం.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, అటువంటి నీతిమంతులైన జనులుగా మారమని నేను మీకు పిలుపునిస్తున్నాను. అన్ని ఇతర నిబద్ధతలకు పైగా మీ నిబంధనలను ఆదరించండి మరియు గౌరవించండి. మీ జీవితంలో దేవునికి మీరు ప్రాధాన్యతనిచ్చినప్పుడు, నేను మీకు అధిక శాంతిని, నమ్మకాన్ని, ఆనందాన్ని, ముఖ్యంగా విశ్రాంతిని వాగ్దానం చేస్తున్నాను.

నాలో ఉన్న పరిశుద్ధ అపొస్తలత్వము యొక్క శక్తితో, ఈ లోకాన్ని జయించాలనే మీ అన్వేషణలో నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. యేసు క్రీస్తునందు మీ విశ్వాసాన్ని పెంచుకోమని మరియు ఆయన శక్తిపై ఎలా ఆధారపడాలో బాగా నేర్చుకోమని నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. ఏది సత్యము, ఏది అసత్యమో గుర్తించునట్లు నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. ఈ లోక విషయాల కంటే దేవుని విషయాలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వాలని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. మీ చుట్టూ ఉన్నవారి అవసరాలను గుర్తించమని, మీరు ప్రేమించే వారిని బలపరచమని నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. యేసు క్రీస్తు ఈ లోకమును జయించినందు వలన, మీరు కూడా జయించగలరు. ఈవిధంగా యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. జోసెఫ్ స్మిత్—మత్తయి 1:36: “అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును, భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు; అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుటను వారు చూచెదరు.”

  2. మత్తయి 11:28-30; వివరణ చేర్చబడింది.

  3. యోహాను 16:33; వివరణ చేర్చబడింది.

  4. సిద్ధాంతము మరియు నిబంధనలు 64:2 ; వివరణ చేర్చబడింది.

  5. ఆల్మా 7:11–13 చూడండి.

  6. 2 నీఫై 28:14.

  7. ఆల్మా 22లో, ముఖ్యంగాఆల్మా 22:18లో రాజైన లమోనై తండ్రి యొక్క వృత్తాంతమును చూడండి.

  8. మోషైయ 5:7 చూడండి.

  9. మోషైయ 3:19; వివరణ చేర్చబడింది.

  10. 2 నీఫై 31; 3 నీఫై 27:16-20 చూడండి.

  11. మోషైయ 2:41.

  12. Teachings of Presidents of the Church: Ezra Taft Benson (2014), 42–43.

  13. See Russell M. Nelson, “Choices for Eternity” (worldwide devotional for young adults, May 15, 2022), broadcasts.ChurchofJesusChrist.org.

  14. అధ్యక్షులు డేవిడ్ ఓ. మెఖే మాట్లాడుతూ, దేవాలయంలో మనం “నిత్య ఉనికిలోకి దశలవారీగా అధిరోహణ” చేస్తామని చెప్పారు (in Truman G. Madsen, The Temple: Where Heaven Meets Earth [2008], 11).