లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 98


98వ ప్రకరణము

1833, ఆగష్టు 6న కర్ట్‌లాండ్, ఒహైయోలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. మిస్సోరిలోనున్న పరిశుద్ధుల మీదకు వచ్చిన హింసకు పర్యవసానముగా ఈ బయల్పాటు వచ్చెను. మిస్సోరిలో సంఘ సభ్యులు స్థిరపడుట ఎక్కువైనప్పుడు అక్కడ స్థిరపడిన ఇతరులకు ఇబ్బంది కలిగించెను, వారు పరిశుద్ధుల సంఖ్య, ఆర్థిక, రాజకీయ ప్రభావము మరియు సాంస్కృతిక, మతపరమైన విభేధాల వలన బెదిరిపోయారు. 1833 జూలైలో, ఒక అల్లరిమూక సంఘము యొక్క ఆస్థిని నాశనము చేసారు, ఇద్దరు సంఘ సభ్యులకు తారు పూసి, ఈకలను అంటించి, వారు జాక్సన్ కౌంటీని విడిచి వెళ్లాలని గట్టిగా అడిగారు. మిస్సోరిలోనున్న కొన్ని సమస్యలు సందేహము లేకుండా కర్ట్లాండ్‌లో(తొమ్మిది వందల మైళ్ల దూరములో) నున్న ప్రవక్తకు చేరినప్పటికి, ఈ తేదిన ఆ పరిస్థితి యొక్క తీవ్రత కేవలము బయల్పాటు వలనే ఆయనకు తెలియజేయబడియుండవచ్చు.

1–3, పరిశుద్ధుల శ్రమలు వారి మేలుకొరకే; 4–8, పరిశుద్ధులు రాజ్యాంగ భూచట్టమునకు సహకరించవలెను; 9–10, లౌకిక ప్రభుత్వము కొరకు నిజాయితీ, తెలివి, మంచితనము గల మనుష్యులకు మద్దతు ఇవ్వవలెను; 11–15, ప్రభువు కార్యము కొరకు తమ ప్రాణములు అర్పించువారు నిత్యజీవమును పొందెదరు; 16–18, యుద్ధమును తిరస్కరించుడి, శాంతిని ప్రకటించుడి; 19–22, కర్ట్లాండ్‌లోనున్న పరిశుద్ధులు మందలింపబడి, పశ్చాత్తాపపడవలెనని ఆజ్ఞాపించబడిరి; 23–32, తన జనులపై బలవంతముగా చేయబడిన హింసలు, శ్రమలను నియంత్రించు తన చట్టములను ప్రభువు బయలుపరచును; 33–38, ప్రభువు ఆజ్ఞాపించినప్పుడు మాత్రమే యుద్ధము సరియైనదిగా ఎంచబడును; 39–48, పరిశుద్ధులు తమ శత్రువులను క్షమించవలెను, వారు కూడా పశ్చాత్తాపపడిన యెడల, ప్రభువు ప్రతీకారమునుండి తప్పించుకొందురు.

1 నా స్నేహితులైన మీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నాను, భయపడకుడి, మీ హృదయములు ఆదరణ పొందనీయుడి; ఇంకా ఎక్కువగా సంతోషపడుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి;

2 ప్రభువు కొరకు కనిపెట్టుకొనియుండుడి, ఏలయనగా మీ ప్రార్థనలు సైన్యములకధిపతియగు ప్రభువు చెవులలో ప్రవేశించి, ఈ ముద్రతో, నిబంధనతో లిఖించబడినవి—అవి ఇవ్వబడునని ప్రభువు ప్రమాణము చేసి, శాసనము వ్రాసెను.

3 కాబట్టి, అవి నెరవేరునని మార్చజాలని నిబంధనతో ఆయన ఈ వాగ్దానమును మీకు ఇచ్చుచున్నాడు; వేటితో మీరు శ్రమలను అనుభవించిరో, అవన్నియు మీ మేలుకొరకు, నా నామమునకు మహిమకలుగుటకు పనిచేయునని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

4 భూచట్టములను గూర్చి నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, వారికి నేనాజ్ఞాపించిన వాటన్నిటిని నా జనులు చేయుట నా చిత్తమైయున్నది.

5 హక్కులు, విశేషాధికారములను కాపాడుటలో ఆ స్వాతంత్ర్య నియమమును బలపరచు రాజ్యాంగబద్ధమైన భూచట్టము సమస్త మనుష్యజాతికి సంబంధించినది మరియు నా యెదుట న్యాయమైనదిగా యెంచబడును.

6 కాబట్టి, ప్రభువైన నేను మిమ్ములను, మీ సహోదరులను ఆ చట్టమునకు—రాజ్యాంగబద్ధమైన భూచట్టమునకు సహకరించుట వలన నీతిమంతులుగా యెంచెదను;

7 మనుష్య చట్టమునకు సంబంధించి, దీనికంటె ఎక్కువ లేదా తక్కువదేదైనను అది దుష్టుని నుండి వచ్చును.

8 దేవుడును ప్రభువునైన నేను మిమ్ములను స్వతంత్రులుగా చేయుచున్నాను, కాబట్టి మీరు నిజముగా స్వతంత్రులే; ధర్మశాస్త్రము కూడా మిమ్ములను స్వతంత్రులుగా చేయుచున్నది.

9 అయినప్పటికీ, దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు దుఃఖించెదరు.

10 కాబట్టి, నీతిమంతులైన మనుష్యులను, తెలివితేటలు గల మనుష్యులను శ్రద్ధతో వెదకవలెను, మంచితనము గల మనుష్యులను, తెలివితేటలు గల మనుష్యులను మీరు తప్పక బలపరచవలెను; లేని యెడల దీనికంటే తక్కువైనదేదైనను దుష్టుని నుండి వచ్చును.

11 నేను మీకొక ఆజ్ఞనిచ్చుచున్నాను, అదేమనగా మీరు చెడునంతటిని విడిచిపెట్టి, మంచినంతటిని హత్తుకొనియుండవలెను, తద్వారా మీరు దేవుని నోటినుండి వచ్చు ప్రతి మాటవలన జీవించెదరు.

12 ఏలయనగా ఆయన విశ్వాసులకు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము ఇచ్చును; మరియు దీనివలన నేను మిమ్ములను పరిశీలించి, పరీక్షించెదను.

13 నా కార్యము కొరకు, నా నామము నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు, మరలా దానిని, నిత్యజీవమును దక్కించుకొనును.

14 కాబట్టి మీ శత్రువులను గూర్చి భయపడకుడి, ఏలయనగా మీరు యోగ్యులుగా కనుగొనబడునట్లు, మరణమును లెక్కచేయక నా నిబంధనలో మీరు నిలుతురో లేదోనని అన్ని విషయములలో మిమ్ములను పరీక్షించెదనని నేను నా హృదయములో శాసనమును వ్రాసియున్నానని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

15 మీరు నా నిబంధనలో నిలువనియెడల మీరు నాకు యోగ్యులు కారు.

16 కాబట్టి యుద్ధమును తిరస్కరించి, శాంతిని ప్రకటించుడి, పిల్లల హృదయాలను తండ్రుల తట్టును, తండ్రుల హృదయాలను పిల్లల తట్టును త్రిప్పుటకు శ్రద్ధతో వెదకుడి;

17 మరలా యూదుల హృదయాలను ప్రవక్తల తట్టును, ప్రవక్తల హృదయాలను యూదుల తట్టును త్రిప్పుడి; లేనియెడల నేను వచ్చి భూమియంతటిని శపించెదను, మరియు సర్వశరీరులు నా యెదుట అగ్నితో కాల్చబడుదురు.

18 మీ హృదయములను కలవరపడనియ్యకుడి; నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, మీ కొరకు నేను ఒక స్థలమును సిద్ధపరచియున్నాను; ఎక్కడ నా తండ్రియు, నేనును ఉన్నామో, మీరును అక్కడ ఉందురు.

19 ఇదిగో, కర్ట్లాండ్‌లోనున్న సంఘమునందు గల అనేకుల యెడల ప్రభువైన నేను సంతోషించుటలేదు.

20 ఏలయనగా వారు తమ పాపములను, దుష్ట మార్గములను, తమ హృదయ గర్వమును, దురాశలను, హేయమైన క్రియలన్నిటిని విడిచిపెట్టలేదు మరియు వారికి ఇచ్చియున్న జ్ఞానము మరియు నిత్యజీవము యొక్క మాటలను ఆలకించలేదు.

21 వారు పశ్చాత్తాపపడి, నేను వారికి చెప్పిన వాటన్నిటిని పాటించని యెడల ప్రభువైన నేను వారిని గద్దించి, నేను చెప్పిన వాటన్నిటిని చేసెదనని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

22 మరలా నేను చెప్పునదేమనగా, నేను మీకాజ్ఞాపించిన వాటన్నిటిని చేసిన యెడల, ప్రభువైన నేను కోపమును, ఉగ్రతనంతటిని మీ నుండి త్రిప్పివేయుదును, నరకపు ద్వారములు మీయెదుట నిలువనేరవు.

23 ఇప్పుడు, మీ కుటుంబములను గూర్చి నేను మాట్లాడుదును—మనుష్యులు మిమ్ములను, మీ కుటుంబములను ఒకమారు కొట్టినప్పుడు మీరు దానిని సహనముతో ఓర్చుకుని, వారి మీద తిరగబడక, పగతీర్చుకొనుటకు చూడకుండిన యెడల, మీకు బహుమానము ఇవ్వబడును;

24 కానీ దానిని మీరు సహనముతో ఓర్చుకొనని యెడల, అది మీకు న్యాయమైన కొలతతో కొలవబడినదిగా యెంచబడును.

25 మరలా మీ శత్రువు రెండవమారు కొట్టిన యెడల, మీరు మీ శత్రువు మీద తిరగబడక, దానిని ఓర్పుతో సహించిన యెడల, మీ బహుమానము నూరంతలగును.

26 మరలా అతడు మిమ్ములను మూడవమారు కొట్టిన యెడల, మీరు దానిని ఓర్పుతో సహించిన యెడల, మీ బహుమానము నాలుగింతలు రెట్టింపగును;

27 అతడు పశ్చాత్తాపపడని యెడల ఈ మూడు సాక్ష్యములు మీ శత్రువునకు విరోధముగా నిలబడును, అవి చెరుపబడవు.

28 ఆ శత్రువు నా యెదుట తీర్పునకు రాకుండా నా ప్రతీకారమును తప్పించుకొనగోరిన యెడల, అతడు ఇకమీదట మీమీదకు, మీ కుటుంబము మీదకు, మూడవ నాలుగవ తరము వరకు మీ పిల్లల పిల్లల మీదకు రాకూడదని అతడిని మీరు నా నామములో హెచ్చరించవలెనని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

29 తరువాత అతడు మీమీదకు, మీ పిల్లల మీదకు లేదా మూడవ, నాలుగవ తరముల వరకు మీ పిల్లల పిల్లల మీదకు వచ్చిన యెడల, నేను మీ శత్రువును మీ చేతులకు అప్పగించియున్నాను;

30 అప్పటికీ అతనికి మీరు హానిచేయని యెడల, మీ నీతిని బట్టి మీరు, మూడవ, నాలుగవ తరము వరకు మీ పిల్లల పిల్లలు బహుమానము పొందెదరు;

31 అయినప్పటికీ, మీ శత్రువు మీ చేతులలోనున్నాడు; వాని క్రియలని బట్టి మీరతనికి ప్రతిఫలమిచ్చిన యెడల మీరు నీతిమంతులుగా యెంచబడుదురు; అతడు మీ ప్రాణము తీయజూచిన యెడల, అతని వలన మీ ప్రాణము సంకటములోనున్న యెడల, మీ శత్రువు మీ చేతులలోనున్నాడు, మీరు నీతిమంతులుగా యెంచబడుదురు.

32 ఇదిగో, ఈ ధర్మశాస్త్రమునే నా సేవకుడైన నీఫై, మీ పితరులైన యోసేపు, యాకోబు, ఇస్సాకు, అబ్రాహాము, నా ప్రాచీన ప్రవక్తలు, అపొస్తలులందరికి నేను ఇచ్చియున్నాను.

33 మరలా, ప్రభువైన నేను ఆజ్ఞాపించితే తప్ప వారు ఏ జనము, వంశము, భాష లేదా ప్రజలకు విరోధముగా యుద్ధమునకు వెళ్ళకూడదని ఈ ధర్మశాస్త్రమునే నేను నా ప్రాచీనులకు ఇచ్చియున్నాను.

34 ఏ జనము, భాష లేదా ప్రజలైనను వారికి విరోధముగా యుద్ధమును ప్రకటించిన యెడల, ఆ ప్రజలు, జనములు లేదా భాషల వారికి మొదట వారు శాంతియుత ప్రమాణమును పైకెత్తవలెను;

35 ఆ జనులు శాంతి ఒప్పందమును రెండవ మారు, మూడవ మారు అంగీకరించని యెడల, ఈ సాక్ష్యములను వారు ప్రభువు యొద్దకు తేవలెను;

36 అప్పుడు, ప్రభువైన నేను వారికి ఒక ఆజ్ఞనిచ్చెదను మరియు వారు ఆ జనము, భాష లేదా ప్రజల మీదకు యుద్ధమునకు వెళ్ళుటను న్యాయమైనదిగా ఎంచెదను.

37 వారు తమ శత్రువులపై మూడవ, నాలుగవ తరము వరకు ప్రతీకారము తీర్చుకొనువరకు ప్రభువైన నేను వారి యుద్ధములను, వారి పిల్లల యుద్ధములను మరియు వారి పిల్లల పిల్లల యుద్ధములను పోరాడెదను.

38 ఇదిగో, నా యెదుట న్యాయమైనదిగా ఉండుటకు ఇది సమస్త జనులకు మాదిరిగా ఉండునని దేవుడైన మీ ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

39 మరలా నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీ శత్రువు మొదటిసారి మీ మీదకు వచ్చిన తరువాత, అతడు పశ్చాత్తాపపడి, మీ క్షమాపణ కోరు నిమిత్తము మీ యొద్దకు వచ్చిన యెడల, వానిని మీరు క్షమించవలెను మరియు దానిని మీరు మీ శత్రువుకు విరోధముగా ఒక సాక్ష్యముగా ఉంచకూడదు—

40 ఆ విధముగా రెండవ మారు, మూడవ మారు చేయవలెను; మీకు విరోధముగా మీ శత్రవు అపరాధము చేసి, ఆ అపరాధమునకు పశ్చాత్తాపపడిన యెడల, డెబ్బది ఏడుల మార్లుమట్టుకు అతడిని మీరు క్షమించవలెను.

41 అతడు మీకు విరోధముగా అపరాధము చేసి, మొదటిసారి పశ్చాత్తాపపడనప్పటికీ అతడిని మీరు క్షమించవలెను.

42 మీకు విరోధముగా రెండవ మారు అతడు అపరాధము చేసి, పశ్చాత్తాపపడనప్పటికీ అతడిని మీరు క్షమించవలెను.

43 అతడు మీకు విరోధముగా మూడవమారు పాపము చేసి, పశ్చాత్తాపపడని యెడల, అప్పుడు కూడా అతడిని మీరు క్షమించవలెను.

44 కానీ అతడు నాలుగవ మారు మీకు విరోధముగా అపరాధము చేసిన యెడల, అతడిని మీరు క్షమించకూడదు, కానీ ఈ సాక్ష్యములను ప్రభువు యెదుటకు తేవలెను; అతడు పశ్చాత్తాపపడి, మీకు విరోధముగా అతడు చేసిన అపరాధమునకు ప్రతిఫలముగా నాలుగింతలు మీకు ఇచ్చువరకు అవి తుడిచివేయబడవు.

45 అతడు దీనిని చేసిన యెడల మీ పూర్ణహృదయముతో మీరు అతడిని క్షమించవలెను; అతడు దీనిని చేయని యెడల, ప్రభువైన నేను మీకు మారుగా మీ శత్రువు యెడల నూరంతలు ప్రతీకారము తీర్చుకొందును;

46 అతని పిల్లలు మరియు అతని పిల్లల పిల్లలలో నన్ను ద్వేషించు వారందరి యెడల మూడు, నాలుగు తరముల వరకు తీర్చుకొందును.

47 కానీ ఆ పిల్లలు లేదా పిల్లల పిల్లలు పశ్చాత్తాపపడి, వారి పూర్ణ హృదయాలతో, పూర్ణ శక్తి, మనస్సు మరియు బలముతో వారి దేవుడైన ప్రభువు తట్టు తిరిగి, వారు చేసిన అపరాధములకు లేదా వారి తండ్రులు చేసిన లేదా వారి తండ్రుల తండ్రులు చేసిన అపరాధములకు నాలుగింతలు తిరిగి ఇచ్చిన యెడల, అప్పుడు మీ కోపము తీసివేయబడును;

48 ప్రతీకారము ఇక ఎంతమాత్రము వారిమీదకు రాకుండునని, వారికి విరోధముగా ప్రభువు యెదుట ఒక సాక్ష్యముగా వారి అపరాధములు ఎన్నటికీ తేబడవని మీ దేవుడైన ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆమేన్.