లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 128


128వ ప్రకరణము

1842, సెప్టెంబరు 6న నావూ, ఇల్లినాయ్‌లో మృతుల కొరకు బాప్తిస్మమును గూర్చి ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ నుండి యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘమునకు మరిన్ని నిర్దేశకములు కలిగియున్న పత్రిక.

1–5, మృతుల కొరకు ఇచ్చు బాప్తిస్మముల వాస్తవికతను ప్రాంతీయ ప్రధాన గ్రంథకర్తలు ధృవీకరించవలెను; 6–9, వారి గ్రంథములు చట్టపరమైనవి, భూలోకమందును, పరలోకమందును లిఖించబడును; 10–14, బాప్తిస్మపు తొట్టె సమాధికి సాదృశ్యము; 15–17, మృతుల కొరకు బాప్తిస్మమునకు సంబంధించిన అధికారమును ఏలీయా పునఃస్థాపించెను; 18–21, గడిచిన యుగముల తాళపుచెవులు, శక్తులు, అధికారములన్నియు పునఃస్థాపించబడినవి; 22–25, సజీవుల కొరకు, మృతుల కొరకు సంతోషకరమైన, మహిమకరమైన సువర్తమానములు ప్రకటించబడినవి.

1 వివిధ సమయాలలో నేను మీకు వ్రాయుచు, అనేక అంశములకు సంబంధించిన సమాచారమును ఇచ్చెదనని నా నివాస స్థలమును విడిచి వెళ్ళకముందు మునుపటి పత్రికలో నేను ప్రస్తావించిన విధముగా, నేనిప్పుడు మృతుల కొరకు బాప్తిస్మము అను అంశమును తిరిగి ప్రారంభించెదను, ఎందుకనగా నేను నా శత్రువులచేత తరుమబడుచున్నప్పటి నుండి ఆ అంశము నా మనస్సులో నిమగ్నమై, అది నా భావములను బలముగా ప్రభావితము చేసినట్లుగా కనబడుచున్నది.

2 ఒక గ్రంథకర్తను గూర్చి నేను మీకు కొన్ని మాటలను వ్రాసితిని. ఈ అంశమును గూర్చి కొన్ని అదనపు అభిప్రాయములను నేను కలిగియున్నాను, వాటిని ఇప్పుడు నేను ధృవీకరించెదను. అదేమనగా, ప్రత్యక్ష సాక్షిగా ఉండుటకు తన చెవులతో విని, ప్రభువు యెదుట ఒక సత్యమును గూర్చి లిఖించుటకు ఒక గ్రంథకర్త ఉండవలెనని నా గత పత్రికలో ప్రకటించబడెను కదా.

3 ఇప్పుడు, ఈ అంశమునకు సంబంధించి, అన్నివేళలా ఉండి, అన్ని వ్యవహారములు చూసుకొనుట ఒక గ్రంథకర్తకు చాలా కష్టము. ఈ కష్టమునుండి తప్పించుకొనుటకు, పట్టణము యొక్క ప్రతి వార్డులో ఒక గ్రంథకర్త నియమించబడవలెను, అతడు ఖచ్చితమైన నివేదికను రూపొందించుటకు సమర్థుడైయుండవలెను; కార్యకలాపాలన్నింటినీ అతడు విశిష్టముగా, స్పష్టముగా వ్రాసి, అతడు తన కంటితో చూచి, చెవులతో వినెనని అతని గ్రంథములో ధృవీకరించి, తేది, పేర్లు మొదలగు వాటిని, ఆ లావాదేవీలన్నింటి చరిత్రను తెలుపవలెను. అక్కడ ఎవరైనా హాజరైన యెడల, వారిలో ముగ్గురు వ్యక్తుల పేర్లు కూడా వ్రాయవలెను, వారు అడుగబడిన ఏ సమయమందైనా జరిగిన దానిని ధృవీకరించగలరు, ఆ విధముగా ఇద్దరు లేదా ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థాపించబడగలదు.

4 అప్పుడు, ఒక ప్రధాన గ్రంథకర్త ఉండవలెను, ధృవపత్రములపై వారి సంతకములు చేసి, వారు తయారుచేసిన గ్రంథములు సత్యమైనవని ధృవీకరించుచు అతనికి ఆ ఇతర గ్రంథములు అందజేయవలెను. తరువాత సంఘ ప్రధాన గ్రంథకర్త సంఘముచేత నియమించబడిన ఆ మనుష్యుల సహజ గుణమును గూర్చిఅతడు కలిగియున్న జ్ఞానమును బట్టి—ధృవపత్రములు, హాజరైన సాక్షులు, పై వాంగ్మూలము, వృత్తాంతములు సత్యమని తాను నమ్ముచున్నానని తన వాంగ్మూలముతో అతడు ఆ వృత్తాంతమును సంఘపు ప్రధాన గ్రంథములో లిఖించవచ్చును. సంఘపు ప్రధాన గ్రంథములో ఈవిధముగా చేసిన తరువాత, ఆ గ్రంథము అతి పరిశుద్ధమైనదై అతడు తన కన్నులతో చూచి, తన చెవులతో విని, దానిని సంఘపు ప్రధాన గ్రంథములో లిఖించిన విధముగానే ఆ విధిని నిర్ధారించవలెను.

5 ఈ విషయముల క్రమము చాలా ఖచ్చితముగా ఉన్నదని మీరు తలంచవచ్చును; కానీ సువార్తను తెలుసుకోకుండా చనిపోవు వారి రక్షణ కొరకు లోకము పునాది వేయబడక మునుపు ప్రభువు నియమించి, సిద్ధపరచిన ఈ విధిని, సిద్ధపాటుని అనుసరించుట ద్వారా ఇది కేవలము దేవుని చిత్తమును నెరవేర్చుటకేనని నేను చెప్పుచున్నాను.

6 అంతేకాక—మరణించినవారిలో లేనివారేమి, గొప్పవారేమి దేవుని యెదుట నిలిచియుండెను; గ్రంథములు విప్పబడెను; మరియొక గ్రంథము తెరువబడెను, అది జీవగ్రంథము; ఆ గ్రంథములలో లిఖించబడిన ప్రకారము వారి క్రియలను బట్టి మృతులు తీర్పుతీర్చబడుదురు—ప్రకటనకారుడైన యోహాను మృతులకు సంబంధించిన ఈ అంశమును గూర్చే ఆలోచించుచుండెనని ప్రకటనలు 20:12లో లిఖించబడినట్లు మీరు కనుగొనుటను స్మరణకు తెచ్చుకొనవలెనని నేను కోరుచున్నాను.

7 ఈ వాక్యములో గ్రంథములు విప్పబడెనని మీరు కనుగొందురు; మరియొక గ్రంథము విప్పబడెను, అది జీవగ్రంథము; కానీ గ్రంథములలో వ్రాయబడిన సంగతులను బట్టి మృతులు, వారి క్రియలను బట్టి తీర్పుతీర్చబడుదురు; కాబట్టి, పైనచెప్పబడిన గ్రంథములు వారి క్రియల వృత్తాంతమును కలిగియున్న గ్రంథములైయుండవలెను, అవి భూమిపైన వ్రాయబడిన గ్రంథములను గూర్చి తెలియజేయును. ఆ గ్రంథము అనగా జీవగ్రంథము పరలోకములో లిఖించబడిన వృత్తాంతము; నా ఇంటిని విడిచి వెళ్ళకమునుపు నేను మీకు వ్రాసిన పత్రికలో ఉన్న బయల్పాటులో మీకు ఆజ్ఞాపించబడిన సిద్ధాంతముతో ఖచ్చితముగా సమ్మతించు సూత్రమేమనగా—మీరు లిఖించినవన్నియు పరలోకములోను లిఖించబడును.

8 ఇప్పుడు, యేసు క్రీస్తు బయల్పాటు ప్రకారము ఈ విధికి యాజకత్వపు అధికారము మూలాధారమైయున్నది, దానిద్వారా భూలోకములో మీరు దేనిని బంధింతురో, అది పరలోకములోను బంధింపబడుటకును, భూలోకములో మీరు దేనిని విప్పుదురో పరలోకములోను అది విప్పబడుటకును అనుమతించబడెను. లేదా, మరియొక మాటలో, అనువాదమును మరియొక అర్థములో తీసుకొనిన యెడల, మీరు భూమిమీద దేనిని లిఖించెదరో అది పరలోకములోను లిఖించబడును, మీరు భూమిమీద దేనిని లిఖించరో, అది పరలోకములోను లిఖించబడదు; ఏలయనగా గ్రంథముల ఆధారముగా, మృతులు వారు చేసిన క్రియలను బట్టి తీర్పుతీర్చబడుదురు, లోకము పునాది వేయబడక మునుపు వారి రక్షణ కొరకు దేవుడు సిద్ధపరచిన విధిని బట్టి, వారి మృతులను గూర్చి వారు వ్రాసిన గ్రంథములను బట్టి వారు ఆ విధిని తమకుతాముగా, వ్యక్తిగతముగా పొందినా లేదా వారి ప్రతినిధుల మూలముగా పొందినా దానిని బట్టి తీర్పుతీర్చబడుదురు.

9 భూమిమీద లిఖించు లేదా బంధించు అధికారము పరలోకములోను బంధించును అనునది మనము చెప్పుకొను నిర్భయమైన సిద్ధాంతమని కొందరికి అనిపించవచ్చును. అయినప్పటికీ, లోకము యొక్క అన్ని యుగములలో, ప్రభువు ఏ మనుష్యునికైనను లేదా మనుష్య సమూహములకైనను వాస్తవముగా బయల్పాటు ద్వారా యాజకత్వపు యుగమును ఇచ్చిన ప్రతిసారి, ఈ అధికారము కూడా ఇవ్వబడెను. కాబట్టి, ప్రభువు నామములో అధికారముతో ఆ మనుష్యులు ఏది చేసినను, యథార్థముగా, విశ్వాసముగా చేసి, దానికి సరియైన, నమ్మకమైన వృత్తాంతమును లిఖించినప్పుడు, అది భూలోకములోను, పరలోకములోను ధర్మశాస్త్రమాయెను, ఘనుడైన యెహోవా శాసనములను బట్టి అది రద్దుచేయబడ లేకుండెను. ఇది విశ్వాసము గల మాట. దీనిని వినగల వారెవరు?

10 మరలా, ఉదాహరణకు మత్తయి 16:18, 19 పరిగణించుము: నేను నిశ్చయముగా చెప్పునదేమనగా, నీవు పేతురు అనబడుదువు, ఈ బండమీద నేను నా సంఘమును కట్టుదును; నరకపు ద్వారములు దాని యెదుట నిలువనేరవు. పరలోకరాజ్యపు తాళపుచెవులను నేను నీకిచ్చెదను; భూమిమీద మీరు దేనిని బంధింతురో, అది పరలోకములోను బంధింపబడును; భూమిమీద మీరు దేనిని విప్పుదురో అది పరలోకములోను విప్పబడును.

11 ఇప్పుడు ఈ విషయమంతటి యొక్క గొప్ప, ఉన్నతమైన మర్మము మన యెదుటనున్న అంశమంతటి యొక్క గొప్ప మేలు యాజకత్వపు అధికారమును పొందుటలో ఉన్నది. తాళపుచెవులు ఇవ్వబడిన వానికి మనుష్యకుమారుల రక్షణ కొరకు, మరణించిన వారికి, అదేవిధముగా సజీవులకు సంబంధించిన విషయముల జ్ఞానమును పొందుటకు ఎటువంటి కష్టము కలుగదు.

12 ఇందులో మహిమ, ఘనత, అమర్త్యత్వము, నిత్యజీవము కలదు—ఒక సూత్రము మరియొక దానితో సరిపడునట్లు నీటిమూలముగా బాప్తిస్మమిచ్చు విధి ప్రకారము మృతులకు గురుతుగా నీటిలో ముంచబడవలెను; నీటిలో ముంచబడి, నీటినుండి బయటకు వచ్చుట మృతుల పునరుత్థానమందు వారి సమాధులలో నుండి బయటకు వచ్చుటకు గురుతుగానున్నది; కాబట్టి, మృతులకు బాప్తిస్మమిచ్చు విధికి సంబంధము కలిగియుండుటకు మృతులకు సాదృశ్యముగా ఈ విధి ఇవ్వబడినది.

13 దాని తరువాత సమాధికి సాదృశ్యముగా బాప్తిస్మపు తొట్టి చేయబడి, మృతులైనవారి నుండి సజీవులను గుర్తించి, అన్ని సంగతులు వాటి పోలికలు కలిగియుండి, ఒకదానితో ఒకటి సరిపడునట్లు అది సజీవులు సమకూడు ప్రదేశము క్రింద ఉండవలెనని ఆజ్ఞ ఇవ్వబడెను—తద్వారా 1 కొరింథీయులు 15:46, 47, 48లో పౌలు ప్రకటించినట్లుగా, భూలోక సంబంధమైనది పరలోక సంబంధమైన దానితో సరిపడవలెను:

14 ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది; తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుష్యుడు భూసంబంధియై మంటినుండి పుట్టినవాడు; రెండవ మనుష్యుడు పరలోకమునుండి వచ్చినవాడు. మంటినుండి పుట్టిన వాడెట్టివాడో మంటినుండి పుట్టినవారును అట్టివారే; పరలోకసంబంధి యెట్టివాడో పరలోకసంబంధులును అట్టివారే. మీ మృతులకు సంబంధించిన గ్రంథములు యథార్థముగా చేయబడి ఉన్నవిధముగానే, పరలోకములో కూడా గ్రంథములు ఉన్నవి. కాబట్టి, ఇది ముద్రవేయు మరియు బంధించు అధికారము, వాక్యము యొక్క ఒక అర్థములో పరలోకరాజ్యపు తాళపుచెవులు జ్ఞానపు తాళపుచెవిని కలిగియున్నవి.

15 మరలా, నా ప్రియాతిప్రియమైన సహోదర, సహోదరీలారా, ఇవి మన రక్షణకు సంబంధించి మృతులు మరియు సజీవులకున్న సంబంధమును తెలుపు సూత్రములని, అవి తేలికగా తీసుకొనబడజాలవని మీకు నిశ్చయపరచనీయుడి. ఏలయనగా మన రక్షణ కొరకు వారి రక్షణ అవసరము మరియు ఆవశ్యకమైయున్నది, తండ్రులను గూర్చి పౌలు చెప్పెను—మనము లేకుండా వారు పరిపూర్ణులు కాలేరు—అలాగే మనము కూడా మన మృతులు పరిపూర్ణులు కాకుండా పరిపూర్ణులము కాలేము.

16 ఇప్పుడు, మృతుల పునరుత్థానమును గూర్చి, 1 కొరింథీయులు 15:29లో పౌలు అడిగిన మరియొక ప్రశ్నను మిమ్ములను అడుగుచున్నాను: మృతులేమాత్రము లేపబడని యెడల మృతుల కొరకై బాప్తిస్మము పొందువారేమి చేతురు? మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేల?

17 మరలా, ఈ ఉదాహరణకు సంబంధించి, యాజకత్వ పునఃస్థాపన పైన, నిత్య సువార్తకు సంబంధముగల అన్ని విషయములలోను అత్యంత మహిమకరమైన దానిని, ఒక ప్రత్యేకరీతిలో కడవరి దినములలో బయలుపరచబడవలసియున్న మహిమలపైన తన దృష్టిని నిలిపిన ప్రవక్తలలో ఒకరు చెప్పిన ఉదాహరణను నేను మీకిచ్చుచున్నాను; ఏలయనగా, మలాకీ చివరి అధ్యాయము 5, 6వ వచనములలో ఇలా చెప్పెను: యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును: నేను వచ్చి, దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును.

18 దీనికి స్పష్టమైన అనువాదమును నేను మీకు అందించవలెను, కానీ అది ఉన్నవిధముగా నా ఉద్దేశ్యమునకు సరిపడునట్లుగా చాలా స్పష్టముగా ఉన్నది. ఈ సందర్భములో, ఏదైన ఒక విషయములో తండ్రులు, పిల్లలకు మధ్య ఒక విధమైన లేదా మరియొక విధమైన సంబంధము లేనియెడల భూమి శపించబడునని తెలుసుకొనుట చాలును—ఆ అంశము ఏమైయున్నది? అది మృతుల కొరకు బాప్తిస్మము. వారు లేకుండా మనము పరిపూర్ణులము కాలేము; అలాగే మనము లేకుండా వారు పరిపూర్ణులు కాలేరు. సువార్తయందు మరణించిన వారు లేకుండా కూడా వారైనను, మనమైనను పరిపూర్ణులు కాలేము; ఏలయనగా కాలముల సంపూర్ణ యుగపు ప్రారంభమునకు ఇది ఆవశ్యకము, ఆ యుగము ఇప్పుడు ప్రారంభమగుటకు మొదలిడుచున్నది, తద్వారా మొత్తము అంతయు పరిపూర్ణముగా ఐక్యమై, యుగములు, తాళపుచెవులు, అధికారములు, మహిమలు జతచేయబడి, ఆదాము దినముల నుండి నేటివరకు బయలుపరచబడును. ఇదియేకాక, లోకము పునాది వేయబడినప్పటి నుండి ఎన్నడూ బయలుపరచబడక, జ్ఞానులు, వివేకులనుండి మరుగుపరచబడిన సంగతులు, కాలముల సంపూర్ణ యుగమునందు పిల్లలకు, పాలుత్రాగువారికి బయలుపరచబడును.

19 ఇప్పుడు, మనము పొందిన సువార్తలో మనము ఏమి విందుము? సంతోషకరమైన స్వరము! పరలోకమునుండి కరుణగల స్వరము; భూమినుండి సత్య స్వరము; మృతుల కొరకు సువర్తమానము; సజీవులు, మృతుల కొరకు సంతోషకరమైన స్వరము; మహా సంతోషకరమైన సువర్తమానము. సువర్తమానము ప్రచురించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతములమీద ఎంతో సుందరములైయున్నవి. కర్మెలు మంచుబిందువుల వలె, దేవుని గూర్చిన జ్ఞానము వారిపై కురియును!

20 మరలా, మనమేమి విందుము? కుమోరా నుండి సువర్తమానము! పరలోకపు దూత మొరోనై బయలుపరచబడవలసియున్న గ్రంథమును గూర్చి ప్రవక్తల నెరవేర్పును ప్రకటించుట. గ్రంథమును గూర్చి ముగ్గురు సాక్ష్యులు సాక్ష్యము చెప్పునని సెనెక కౌంటీ, ఫేయెట్ అరణ్యములో ప్రభువు స్వరము ప్రకటించుట! అపవాది వెలుగు దూతగా కనబడినప్పుడు సస్క్వెహెన్నా నది ఒడ్డున మిఖాయేలు స్వరము దానిని కనిపెట్టుట! పేతురు, యాకోబు, యోహానుల స్వరము సస్క్వెహెన్నా నది ఒడ్డున హార్మోని, సస్క్వెహెన్నా కౌంటీ, కొలిస్విల్, బ్రూమ్ కౌంటీ మధ్య విస్తరించియున్న అరణ్యములో పరలోకరాజ్యము యొక్క కాలముల సంపూర్ణ యుగపు తాళపుచెవులు కలిగియున్నామని ప్రకటించుట!

21 మరలా, ఫేయెట్, సెనెక కౌంటీలో వృద్ధుడైన తండ్రి విట్మర్ గదిలో వివిధ సమయాలలో వేర్వేరు స్థలములలో ఈ యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క ప్రయాణములు కష్టములన్నింటిలో దేవుని స్వరము! ప్రధాన దూతయైన మిఖాయేలు స్వరము; గబ్రియేలు, రాఫేలు, మిఖాయేలు లేదా ఆదాము నుండి నేటివరకు వేర్వేరు దూతలు, అందరు వారి యుగములు, వారి హక్కులు, వారి తాళపుచెవులు, వారి ఘనతలు, వారి ప్రభావము, మహిమ, వారి యాజకత్వపు అధికారములను గూర్చి ప్రకటించుట; ఒకదాని తరువాత మరియొకటి, ఆజ్ఞ తరువాత ఆజ్ఞ, ఇక్కడ కొంచెము, అక్కడ కొంచెము ఇచ్చుచు; మన నిరీక్షణను నిర్ధారించుటకు రాబోవు వాటిని పట్టుకొనియుండి మనకు ఆదరణను ఇచ్చుట.

22 సహోదరులారా, మనము ఒక గొప్ప కార్యములో ముందుకు సాగుటలేదా? వెనుకకు మరలక ముందుకు సాగుడి. సహోదరులారా ధైర్యము తెచ్చుకొనుడి; జయము పొందుటకు ముందుకు సాగుడి! మీ హృదయములు సంతోషించి, గొప్ప ఆనందమును పొందనీయుడి. భూమిని అకస్మాత్తుగా పాడనీయుడి. ఇమ్మానుయేలు రాజును నిత్యము కొనియాడు కీర్తనలతో మృతులను మాట్లాడనీయుడి, వారిని చెరసాలనుండి విమోచించుటకు మనకు సహాయపడుదానిని సృష్టికి ముందు ఆయన నియమించెను; ఏలయనగా చెరపట్టబడిన వారు విడిపింపబడుదురు.

23 పర్వతములు సంతోషధ్వని చేయనియ్యుడి, లోయలారా మీరు గట్టిగా అరువుడి; సముద్రములారా, ఆరిన నేలలారా మీ నిత్యరాజు చేసిన ఆశ్చర్యకార్యములను తెలుపుడి! నదులారా, వాగులారా, సేలయేరులారా, సంతోషముతో పారుడి. వృక్షములు, పొలములోనున్న చెట్లన్నియు ప్రభువును కొనియాడనియ్యుడి; బండలారా, సంతోషముతో కన్నీరుకార్చుడి! సూర్యుడు, చంద్రుడు, ఉదయ నక్షత్రములును కలిసి పాడుడి, దేవుని కుమారులందరు సంతోషధ్వని చేయనియ్యుడి! నిత్య సృష్టి ఆయన నామమును నిరంతరము ప్రకటించనియ్యుడి! నేను మరలా చెప్పునదేమనగా, అధికారములు, ప్రభుత్వములు, సింహాసనములు; మహిమ, రక్షణ, ఘనత, అమర్త్యత్వము, నిత్యజీవమును గూర్చి పరలోకమునుండి మన చెవులలో ప్రకటించు స్వరమును మనము వినుట ఎంత మహిమకరము!

24 ఇదిగో, ప్రభువు యొక్క ఆ మహాదినము సమీపములోనున్నది; ఆయన వచ్చుదినమును ఎవరు సహింపగలరు, ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్నివంటివాడు, చాకలివాని సబ్బువంటివాడు; వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును, మరియు లేవీయులు నీతిని అనుసరించి ప్రభువుకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములు నిర్మలము చేయురీతిని ఆయన వారిని నిర్మలము చేయును. కాబట్టి, ఒక సంఘముగా, జనులుగా, కడవరి దిన పరిశుద్ధులుగా మనము నీతిని అనుసరించి ప్రభువుకు ఒక అర్పణను అర్పించెదము; ఆయన పరిశుద్ధ దేవాలయ నిర్మాణము పూర్తయిన తరువాత, అందరికి అంగీకారమగు రీతిలోనుండి మన మృతుల వృత్తాంతములు కలిగియున్న ఒక గ్రంథమును దానిలో మనము ప్రవేశపెట్టుదుము.

25 సహోదరులారా, ఈ అంశముపై అనేక సంగతులు నేను చెప్పవలసియున్నది; కానీ ప్రస్తుతానికి ఇప్పుడు ముగించి, మరియొక సమయములో ఈ అంశమును గూర్చి కొనసాగించెదను. ఎప్పటికీ, నేను మీ దీన దాసుడను, మీ స్నేహితుడను,

జోసెఫ్ స్మిత్.