సర్వసభ్య సమావేశము
ఆత్మ యొక్క ప్రేరేపణలు
2023 అక్టోబరు సర్వసభ్య సమావేశము


ఆత్మ యొక్క ప్రేరేపణలు

పరిశుద్ధాత్మ యొక్క స్థిరమైన సహవాసము కడవరి-దిన పరిశుద్ధులు ఆనందించగల అత్యంత గొప్ప ఆత్మీయ బహుమానాలలో ఒకటి.

పరిచయము

ఈమధ్య, ప్రపంచవ్యాప్తంగా క్రీడలను చూడటం ఆనందించే జనులు తమ దృష్టిని ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్‌లు నిర్వహించిన మహిళల ప్రపంచ కప్పుపై కేంద్రీకరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200 కంటే ఎక్కువ జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రపంచ స్థాయి అథ్లెట్లు సాకర్ ప్రపంచంలోని అత్యున్నత గౌరవం కోసం పోటీ పడుతున్నప్పుడు వారి కష్టమైన పరిస్థితుల గుండా తీర్మానము, అంకితభావం, ప్రతిభ మరియు క్రీడా నైపుణ్యం ప్రదర్శించారు.

వారి కళ యొక్క అత్యున్నత స్థాయిని సాధించిన అనేక క్రీడలు మరియు ఇతర విభాగాలలో ప్రదర్శనకారులను బట్టి మనము ఆశ్చర్యపడుతున్నాము. మనము, వారికి దేవుడు సహజముగా ఇచ్చిన ప్రతిభలు లేదా బహుమతుల గురించి మాట్లాడతాము. ఇందులో నృత్యము, జిమ్నాస్టిక్స్, సంగీతము, కళ, డ్రామా, గణితం, విజ్ఞానశాస్త్రము, మరియు మరిన్నింటిలో ప్రతిభావంతులైన వారు ఉంటారు. అత్యున్నత స్థాయిని సాధించిన ప్రతి వ్యక్తి దేవుడు ఇచ్చిన బహుమతులను ప్రదర్శిస్తాడు, అవి జీవితకాల కృషి, అధ్యయనం మరియు అభ్యాసం ద్వారా మెరుగుపరచబడతాయి మరియు అభ్యసించబడతాయి. దేవుడు ఇచ్చిన బహుమతులు లేదా ప్రతిభలు నిర్దిష్ట రంగంలో రాణిస్తున్న వ్యక్తులకు కారణమవుతాయి.

ఆత్మీయ బహుమానాలను పెంపొందించడం

సువార్త చేత సూచించబడిన దృష్టికోణముతో లోకమును గ్రహించి, గమనిస్తే, దేవుడు తన పిల్లలను ప్రతిభావంతులైన వ్యక్తులుగా చేస్తూ అనేక ఆత్మీయ బహుమతులను ప్రసాదిస్తాడు. సంఘము యొక్క నిబంధన పాటించే సభ్యులు ఆత్మ యొక్క బహుమానాలతో అనుగ్రహించబడతారు, అది మన రక్షకునిగా యేసు క్రీస్తును గూర్చి సాక్ష్యము, పరిశుద్ధాత్మ వరము, స్వస్థపరచుటకు, స్వస్థపడుటకు విశ్వాసము యొక్క బహుమానము, వివేచన, అద్భుతాలను పొందే బహుమానము, తెలివి, జ్ఞానము యొక్క బహుమానాలను కలిపియున్నది.1 శ్రేష్టమైన బహుమానాలు, ఆత్మీయ బహుమానాలను కూడ ఆసక్తితో వెదకమని ప్రభువు మనల్ని ఆహ్వానిస్తున్నారు. మనల్ని దీవించడానికి మరియు ఇతరులను దీవించడంలో ఉపయోగించడానికి ఆయన మనకు ఆత్మీయ వరములు ఇచ్చారు.2

ప్రతిభావంతులైన ప్రదర్శనకారుల యొక్క సారూప్యతకు మనం తిరిగి వస్తే, కేవలం సహజమైన ప్రతిభను కలిగి ఉండటం అంటే ఆ ప్రతిభను తప్పనిసరిగా నేర్చుకోమని కాదని గుర్తుంచుకోవడం ముఖ్యమైనది. అసాధారణమైన సహజమైన ప్రతిభ ఉన్నప్పటికీ, ఇది కష్టమైన మరియు శ్రమతో కూడిన అభ్యాసం, కృషి ద్వారా ప్రదర్శకులు వారి కళాత్మకత యొక్క అత్యున్నత స్థాయికి చేరుకోవడానికి వారి నైపుణ్యాన్ని శుద్ధి చేస్తారు మరియు మెరుగుపరుస్తారు. పొందిన మరియు విప్పబడిన భౌతిక బహుమతులు కూడ తరచుగా భయంకరమైన భాషతో కూడి ఉంటాయి, “కొనుగోలుదారు ప్రోడక్టును ఉపయోగించే ముందు దాని చివరి ఆకృతిని సమీకరించాలి.”

అదేవిధంగా, ఆత్మీయ బహుమానాలకు సంబంధించి, కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడంలో కష్టతరమైన భాగాలు తరచుగా ప్రక్రియ ప్రారంభంలో జరుగుతాయని నేను గమనించాను. ఆత్మీయ బహుమానాలు అభ్యాసన చేయడానికి ఆత్మీయ అభ్యాసము అవసరము. “మీ జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును కలిగియుండుటకు ఆత్మీయమైన కార్యము అవసరమవుతుంది. ఈ కార్యము గంభీరమైన ప్రార్థన మరియు నిరంతరం లేఖన అధ్యయనాన్ని కలిగియున్నది. అది మీ నిబంధనలు మరియు దేవుని ఆజ్ఞలను పాటించుటను కూడ కలిగియున్నది. … అది ప్రతివారము యోగ్యతగా సంస్కారములో పాలుపంచుకొనుటను కలిగియున్నది.”3

ఆత్మీయ బహుమానాలు అభ్యాసం చేయడం వలన కలిగే ఫలితాలేవి? అవి మన దైనందిన అవసరాలను ఎదుర్కోవడంలో మనకు సహాయపడునట్లు ఆత్మ నుండి వచ్చే ప్రేరేపణలను కలిగి ఉంటాయి, ఏమి చేయాలో, చెప్పాలో మనకు చూపుతాయి మరియు శాంతి, ఆదరణ యొక్క దీవెనలు. మనం ఆత్మీయ ప్రేరేపణలను విని, వాటి ప్రకారం చేసినప్పుడు, పరిశుద్ధాత్మ మన సామర్ధ్యాలను మరియు సమర్ధతలను మనం స్వంతంగా చేయగలిగిన దానికంటే చాలా ఎక్కువ గొప్పగా చేస్తుంది. ఈ ప్రశస్తమైన ఆత్మీయ బహుమానాలు మన జీవితాలలో ప్రతి దశలో మనకు సహాయపడతాయి.4

పరిశుద్ధాత్మ యొక్క స్థిరమైన సహవాసము కడవరి-దిన పరిశుద్ధులు ఆనందించగల అత్యంత గొప్ప ఆత్మీయ బహుమానాలలో ఒకటి.

ఈ బహుమానము ఎంత ముఖ్యమైనది? ఆయన ఇలా వ్యాఖ్యానించినప్పుడు అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఈ ప్రశ్నకు స్పష్టంగా జవాబిచ్చారు, “రాబోయే దినములలో, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, మార్గనిర్దేశము, ఆదరణ మరియు నిరంతర ప్రభావము లేకుండా ఆత్మీయ మనుగడ అసాధ్యము.”5

ఆత్మ యొక్క ప్రేరేపణలను ఎలా ఆహ్వానించాలి మరియు గుర్తించాలి.

నా పరిచర్య గమనములో, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణలను ఎలా ఆహ్వానించాలి మరియు గుర్తించాలో తెలుసుకోవాలనే విశ్వవ్యాప్తమైన కోరికను నేను కనుగొన్నాను. ఆత్మ యొక్క ప్రేరేపణలు చాలా వ్యక్తిగతమైనవి మరియు భిన్న విధాలుగా వస్తాయి. అయినప్పటికినీ, మనము ఆత్మ నుండి ఎలా నడిపింపు పొందాలో విలువైన అంతర్‌జ్ఞానాలు మనకివ్వడానికి, ప్రాచీన మరియు ఆధునిక ప్రవక్తల మాటలను కలిగియుండటానికి దీవించబడ్డాము.

ఆత్మ యొక్క ప్రేరేపణలను ఆహ్వానించి, గుర్తించడానికి మీకు సహాయపడగల నాలుగు మార్గదర్శిక సూత్రాలను నేను ఇస్తాను.

పరిశుద్ధ స్థలములలో నిలిచియుండుడి

మొదటిది పరిశుద్ధ స్థలములలో నిలిచియుండుట.6 ఈమధ్య టోక్యో జపాన్ దేవాలయ ప్రారంభ సందర్శనలో నేను పాల్గొన్నాను. మీడియా మరియు ముఖ్యమైన అతిథులకు పంపిన అధికారిక ఆహ్వానాలకు ప్రతిస్పందన అంచనాలను మించిపోయింది. ఈ నడిపించబడిన దేవాలయ ప్రయాణాలకు వందలమంది చేరారు. జపనీయ సంస్కృతితో లోతైన సంబంధాలతో కూడిన నమూనాలు మరియు మూలాంశాలతో సహా దేవాలయం యొక్క అందం చేత అతిథులు గాఢంగా ముద్రవేయబడ్డారు. పూర్వీకుల విధులు సంభవించే గదులలో వివరించబడినప్పుడు అతిథుల నుండి భక్తిగల గౌరవం మరియు గౌరవప్రదమైన ప్రతిస్పందన మరింత ఉద్వేగభరితంగా ఉన్నది. కానీ చాలా మానసికంగా శక్తివంతమైనది ఆత్మ యొక్క ప్రేరేపణలు.

ఒక ప్రముఖ ప్రభుత్వ అధికారితో అలాంటి ఒక క్షణం నా మనసులో నిలిచిపోయింది. సిలెస్టియల్ గదిలో ఒక క్షణం మౌన ధ్యానం తరువాత, భావోద్వేగంతో మరియు లోతుగా తాకబడి, అతను నా చెవిలో గుసగుసలాడాడు, “ఈ గదిలో నేను పీల్చే గాలి కూడా భిన్నంగా అనిపిస్తుంది.” వాస్తవానికి, పరిశుద్ధ ప్రదేశాలలో నివసించే పరిశుద్ధాత్మ యొక్క సమక్షమును వర్ణించడానికి అతడు ప్రయత్నిస్తున్నాడని నేను గుర్తించాను. మీరు ఆత్మను అనుభవించాలని కోరిన యెడల, ఆత్మ సులువుగా నివసించే స్థలములో ఉండండి.

మన దేవాలయాలు మరియు గృహాలు ఈ సమర్పించబడిన స్థలాలలో అత్యంత పరిశుద్ధమైనవి. వాటిలో మనము ఆత్మను సులభంగా ఆహ్వానించి గుర్తించగలము. మిగిలిన పరిశుద్ధ స్థలాలు సమావేశ గృహాలు, సెమినరీ భవనాలు, ఇనిస్టిట్యూట్‌లు, మరియు సంఘ చరిత్ర ప్రాంతాలు, సందర్శక కేంద్రాలను కలిపియున్నవి. పరిశుద్ధ స్థలములలో నిలిచియుండుడి.

పరిశుద్ధులైన జనులతో నిలిచియుండుడి

రెండవది, పరిశుద్ధులైన జనులతో నిలిచియుండుడి. మరొక జ్ఞాపకముతో రెండవ మార్గదర్శక సూత్రమును నేను వర్ణిస్తాను.

జనాదరణ పొందిన క్రీడారంగంలో జరిగిన భక్తిసమావేశంలో పాల్గొనడం ఎప్పటికీ మర్చిపోలేను. సాధారణంగా, ఈ మైదానం తమ సొంత జట్టును ఉత్సాహపరిచే మరియు బహుశా వారి ప్రత్యర్థిని ఎగతాళి చేసే క్రూరమైన అభిమానులతో నిండి ఉంటుంది. ఆ రాత్రి, వాతావరణము చాలా భిన్నంగా ఉన్నది. ప్రవక్త జోసెఫ్ స్మిత్ జీవితాన్ని గౌరవించి మరియు స్మరించడం కోసం వేలాది మంది యువజనులతో మైదానం నిండిపోయింది. వారి గౌరవప్రదమైన, నిశ్శబ్ద స్వరం, కృతజ్ఞత, మరియు ప్రార్థనాపూర్వకమైన హృదయాలు పరిశుద్ధాత్మ సన్నిధితో మైదానాన్ని నింపాయి. నేను ఖచ్చితంగా వారి ముఖాలలో పరిశుద్ధాత్మను చూడగలను. అది జోసెఫ్ స్మిత్ మరియు సువార్త యొక్క పునఃస్థాపన గురించి సాక్ష్యాలను ధృవీకరిస్తూ, క్రియలో ఉన్న పరిశుద్ధాత్మ యొక్క బహుమానము.

పరిశుద్ధ జనుల యొక్క గుంపుకు హాజరు కాకుండా ఆత్మ నిరోధించబడదు. మీరు ఆత్మను అనుభవించాలని ఆశించిన యెడల, ఆత్మ సులువుగా నివసించగల జనులతో ఉండండి. దానిని రక్షకుడు ఇలా బోధించారు: “ఎక్కడ నా నామమున ఇద్దరు లేక ముగ్గురు కూడుకుంటారో, ఇదిగో, అక్కడ నేను వారి మధ్య ఉన్నాను.”7 యౌవన జనులకు, మీ పవిత్ర జనుల సమావేశాలను పరిగణించండి: కోరములు మరియు తరగతులు, ఎఫ్‌ఎస్‌వై, సెమినరీ, వార్డు, స్టేకు ప్రోత్సాహకార్యక్రమాలు—వార్డు గాయకబృందాలు కూడ. నీతి కనగొనబడే చోట, స్థలాలకు వెళ్ళి, జనులతో ఉండటానికి ఎంపిక చేయండి. జనుల గుంపు నుండి మానసిక బలాన్ని పొందవచ్చు. మంచి స్నేహితులను కనుగొనండి. మంచి స్నేహితులుగా ఉండండి. మీరు ఎక్కడ ఉన్నప్పటికిని ఒకరినొకరికి సహాయపడండి. పరిశుద్ధులైన జనులతో నిలిచియుండుడి.

పరిశుద్ధ సత్యములు గురించి సాక్ష్యమివ్వండి.

మూడవది, మీకు సాధ్యమైనంత తరచుగా పరిశుద్ధ సత్యములు గురించి సాక్ష్యమివ్వండి. మన స్వరముతో మనము సాక్ష్యమిచ్చినప్పుడు ఆదరణకర్త తన స్వరమును తరచుగా పంచుకుంటారు. ప్రసంగీకునికి మరియు వినే వారికి ఒకేవిధంగా ఆత్మ సాక్ష్యము వహిస్తుంది.

ఒకసారి న్యూయార్క్ పట్టణంలో 45-నిముషాల కారు ప్రయాణం చేయడం నాకు గుర్తున్నది. నేను విమానాశ్రయానికి వెళ్లేంత వరకు డ్రైవరుతో స్నేహపూర్వకమైన సువార్త సంభాషణను కలిగి ఉన్నందున, నేను ఆమెకు డబ్బు చెల్లించి టాక్సీ నుండి దిగడానికి సిద్ధమయ్యాను. అప్పుడు నేను పంచుకున్న దాని గురించి సాక్ష్యం ఇవ్వలేదని గ్రహించాను. నిదానిస్తూ, నేను ఆత్మను ఆహ్వానిస్తూ, మా ఇరువురు కళ్లకు కన్నీళ్లను తెస్తూ, సరళమైన క్లుప్తమైన సాక్ష్యాన్ని పంచుకున్నాను

ఇతరులతో మీ సాక్ష్యమును పంచుకోవడానికి మీరు అవకాశాలను వెదకి తీసుకొన్నప్పుడు, మీ కోసం మీరు ఆత్మను గుర్తించడానికి క్షణాలను సృష్టిస్తారు.

పరిశుద్ధాత్మను ఆలకించండి.

చివరి సూత్రము పరిశుద్ధాత్మను ఆలకించుట. ఆయన మన స్థిరమైన సహవాసిగా ఉండగలడు, అయితే ఆయన నిగూఢమైన, నిశ్శబ్దమైన స్వరాలతో మాట్లాడగలరు. ఆ భూకంపమైన తరువాత గాలిలో, లేదా అగ్నిలో ప్రభువు స్వరము లేదు--కానీ అది ఒక “మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము,”8 అని ప్రవక్త ఏలీయా కనుగొన్నాడు. అది “ఉరుము యొక్క స్వరము కాదు,” కానీ బదులుగా “ఒక గుసగుస వంటి పరిపూర్ణ మృదుత్వము యొక్క ఒక నిర్మలమైన స్వరము,” మరియు అయినప్పటికినీ అది “సూటిగా ఆత్మకు కూడ గ్రుచ్చుకొనెను.”9

అధ్యక్షులు బాయిడ్ కే. ప్యాకర్: “కేకలు వేయుట లేదా బరువైన చేతితో మనల్ని కదిలించుట ద్వారా ఆత్మ మన ఆసక్తిని పొందదు. బదులుగా అది గుసగుసలాడును. మనం నిమగ్నమై ఉంటే, అది మనకు అస్సలు అనిపించకపోవచ్చు కాబట్టి అది చాలా సున్నితంగా లాలిస్తుంది.”10. కొన్నిసార్లు ఆ స్వరం చాలా సూక్ష్మంగా ఉంటుందని నేను గమనించాను, లేదా నేను చాలా నిమగ్నమై వున్నపుడు, ప్రియమైన వ్యక్తి దానిని నా కోసం స్వాధీనం చేసుకుంటాడు. అనేకసార్లు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణలు నా భార్య లీసా ద్వారా నాకు కలిగాయి. నీతిగల తల్లిదండ్రులు లేదా నాయకులు మీకోసం ప్రేరేపించబడిన నడిపింపును పొందవచ్చు.

ప్రపంచంలో ప్రబలంగా ఉన్న శబ్దం, కోలాహలం, మరియు వివాదాలు ఇప్పటికీ పరిశుద్ధాత్మ యొక్క నిశ్శబ్ద ముద్రలను అధిగమించవచ్చు ఆత్మ నుండి మీరు నడిపింపును పొందడానికి నిశ్శబ్దమైన స్థలము, పరిశుద్ధ స్థలమును కనుగొనండి.

కొన్ని హెచ్చరిక మాటలు

ఆత్మను ఆహ్వానించడానికి, గుర్తించడానికి ఈ సూత్రాలను మీరు పరిగణించినప్పుడు, ఈ క్రింది హెచ్చరిక మార్గదర్శక పదాలను పరిగణించండి.11

ఆత్మీయ మనోభావాలను నిర్ధారించండి. ఉదాహరణకు, ఆత్మ నుండి భావనలు లేఖనాలు మరియు జీవిస్తున్న ప్రవక్తల బోధనలతో ఏకీభవిస్తాయి.

మీరు పొందే భావనలు మీ నియామకంతో ఏకరీతిగా ఉన్నాయని నిర్ధారించుకోండి. మీరు సరైన అధికారముతో పిలవబడితే తప్ప ఆత్మ నుండి ప్రేరేపణలు ఇతరులకు సలహా ఇవ్వడానికి లేదా సరిదిద్దడానికి మీకివ్వబడవు.

ఆత్మీయమైన విషయాలు బలవంతం చేయబడరాదు. మీరు ఆత్మను ఆహ్వానించే స్వభావాన్ని, వాతావరణాన్ని పోషించవచ్చు, మరియు మీకై మీరు సిద్ధపడగలరు, కానీ ఎలా లేదా ఎప్పుడు ప్రేరేపణ వస్తుందో మీరు నిర్దేశించలేరు. సరైన సమయం వచ్చినప్పుడు మీకు అవసరమైన దానిని పొందుతారని నమ్మండి మరియు ఓపిక కలిగియుండండి.

మీ సొంత అత్యుత్తమ తీర్పును ఉపయోగించండి. కొన్నసార్లు అన్ని విషయాలందు ఆత్మచేత నడిపించబడాలని మనము కోరతాము. అయినప్పటికీ, దేవుడు మనకు ఇచ్చిన తెలివితేటలను ఉపయోగించాలని మరియు మన ఉత్తమ అవగాహనకు అనుగుణమైన విధానాలలో వ్యవహరించాలని ప్రభువు తరచుగా కోరుకుంటాడు అధ్యక్షులు డాల్లిన్ హెచ్. ఓక్స్ బోధించారు:

“ప్రభువు చేత నడిపించబడాలనే కోరిక ఒక బలం, కానీ మన పరలోక తండ్రి మన వ్యక్తిగత ఎంపికల కొరకు చాలా నిర్ణయాలను వదిలి వేస్తాడని అర్ధం చేసుకోవడం దానికి అవసరం. … అన్ని నిర్ణయాలు చేయడాన్ని ప్రభువు వైపుకు మార్చడానికి ప్రయత్నించి మరియు ప్రతి ఎంపికలో బయల్పాటు కోసం వేడుకునే వ్యక్తులు, మార్గదర్శకత్వం కోసం వారు ప్రార్థించి మరియు దానిని స్వీకరించని పరిస్థితులను త్వరలో కనుగొంటారు. …

“మనం మనసులో విషయాలను అధ్యయనం చేయాలి. … అప్పుడు మనం నడిపింపు కోసం ప్రార్థించాలి మరియు దాని ప్రకారం నడుచుకోవాలి. … మనము నడిపింపును పొందకపోతే, మనము మన ఉత్తమమైన తీర్పును అమలు చేయాలి.” 12

ఒక ఆహ్వానముతో ముగింపు.

ముగింపులో, కడవరి-దిన పరిశుద్ధులు ప్రతిభావంతులైన నిబంధన పాటించే జనులుగా ఉండాలి. అయినప్పటికినీ, మన ఆత్మీయ బహుమానాలను అభ్యసించడానికి, ఆహ్వానించడానికి మరియు ఆత్మ యొక్క ప్రేరేపణలను గుర్తించి నడవడానికి వెదకుట మనలో ప్రతిఒక్కరికి మిగిలియున్నది. ఈ ముఖ్యమైన ఆత్మీయ ప్రయత్నంలో మనకు సహాయపడటానికి నాలుగు మార్గదర్శక సూత్రాలు:

  1. పరిశుద్ధ స్థలములలో నిలిచియుండుడి.

  2. పరిశుద్ధులైన జనులతో నిలిచియుండుడి.

  3. పరిశుద్ధ సత్యములు గురించి సాక్ష్యమివ్వండి.

  4. పరిశుద్ధాత్మను ఆలకించండి.

ఆత్మ యొక్క ప్రేరేపణలను ఆహ్వానించి మరియు గుర్తించడానికి మీ సామర్ద్యము ఒక్కొక్కసారి ఒక్కొక్క మెట్టుతో అభివృద్ధి చెందుతుంది. “ఆత్మ యొక్క భాషతో మరింత అనుగుణంగా మారుట మరొక భాషను నేర్చుకోవడం వలె ఉన్నది. అది శ్రద్ధ, ఓపికగల ప్రయత్నము అవసరమయ్యే క్రమమైన ప్రక్రియ.”13

మనం ప్రారంభించిన చోటకు తిరిగి వెళ్తూ, కడవరి దిన పరిశుద్ధులుగా మీరు ప్రతిభలు ఇవ్వబడ్డారని దయచేసి గుర్తుంచుకోండి. నాకు ఇటీవల వివరించబడిన ఈ పరిచయమైన ఉపవాస ఆదివారపు దృశ్యమును చిత్రీకరించండి. ఒక చిన్నబిడ్డ, స్టూల్ మీద నిలబడి, స్టేజిపై సరిగా కనిపించటంలేదు. ఆమె తండ్రి ఆమె పక్కన నిలబడి ప్రోత్సాహాన్ని అందిస్తూ, ఆమె చెవిలో మృదువుగా గుసగుసలాడుతూ సహాయం చేయగా, ఆమె గర్వంగా పంచుకున్నది, “నేను దేవుని యొక్క బిడ్డను.”

తరువాత సాక్ష్యం ఒక యౌవనుని నుండి వచ్చింది, అతడు భయపడుతూ పరిహాసంగా అన్నాడు: “నా చెవిలో ఎవరైనా అలా గుసగుసలాడుతుంటే బాగుండేదని నేను కోరుకుంటున్నాను.” అప్పుడు ఆమెకు వెంటనే ప్రేరేపణ కలిగింది మరియు “నా చెవిలో ఆవిధంగా గుసగుసలాడే ఒకరున్నారు, అది పరిశుద్ధాత్మ!” అని సాక్ష్యమిచ్చింది.

నేను ప్రత్యేకంగా యువత అందరికి ఒక ఆహ్వానముతో ముగిస్తాను! మీలో అనేకమంది అద్దము ముందు నిలబడుట ద్వారా మీ దినాన్ని ప్రారంభిస్తారు!. రేపు, ఈ వారము, ఈ సంవత్సరం, ఎల్లప్పుడు, అద్దములో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు నిదానించండి. మీకై మీరు ఆలోచించండి, లేదా ఇలా బిగ్గరగా చెప్పండి: “వావ్, నావైపు చూడండి! నేను అద్భుతముగా ఉన్నాను! నేను దేవుని యొక్క బిడ్డను! ఆయనకు నేను తెలుసు! ఆయన నన్ను ప్రేమిస్తున్నారు! నేను బహుమానము ఇవ్వబడ్డాను---నా స్థిరమైన సహవాసిగా పరిశుద్ధాత్మను బహుమానమివ్వబడ్డాను!”

తండ్రియైన దేవుడు, యేసు క్రీస్తు మరియు వారి గురించి సాక్ష్యమిచ్చే పరిశుద్ధాత్మను గూర్చి బహుమానమివ్వబడిన కడవరి దిన పరిశుద్ధులారా మీకు నా సాక్ష్యమును చేర్చుతున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.