సర్వసభ్య సమావేశము
మీరు సంతోషంగా ఉండాలని కోరుతున్నారా?
2023 అక్టోబరు సర్వసభ్య సమావేశము


మీరు సంతోషంగా ఉండాలని కోరుతున్నారా?

నిబంధన మార్గంపై నిలిచియుండుము. మీ జీవితం సులువైనదిగా, సంతోషమైనదిగా ఉంటుంది, మరియు సంతోషంతో నింపబడింది.

మీరు సంతోషంగా ఉండాలని కోరుతున్నారా? ఏది మిమ్మల్ని విచారంగా చేస్తుంది? అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ చెప్పారు: “మీరు దుఃఖపూరితంగా ఉండాలని కోరిన యెడల, ఆజ్ఞలను ఉల్లంఘించండి—మరియు ఎన్నడూ పశ్చాత్తాపం చెందవద్దు. మీరు సంతోషంగా ఉండాలంటే, నిబంధన మార్గంలో ఉండండి.”1 సంతోషంగా ఉండడం సులభమైనది కాదా? కేవలం నిబంధనలను చేసి మీ జీవితాలలో వాటిని పాటించండి. నిబంధన మార్గంలో నిలిచియుండటానికి మరియు మనల్ని సంతోషంగా చేయడానికి సహాయపడగల కొన్ని విషయాలను మనం సమీక్షిద్దాం.

1. నిబంధన మార్గం అంటే ఏమిటి?

ఎల్డర్ డేల్ జి. రెన్‌లండ్ ప్రకారం: “నిబంధన బాట అనే పదము నిబంధనల వరుసను సూచిస్తుంది, తద్వారా మనం క్రీస్తు నొద్దకు వస్తాము మరియు ఆయనతో మన బంధాన్ని బలపరచుకుంటాము. ఈ నిబంధన బంధము ద్వారా, మనం ఆయన నిత్య శక్తిని పొందుతాము. ఆ బాట యేసు క్రీస్తునందు విశ్వాసము మరియు పశ్చాత్తాపముతో ప్రారంభమవుతుంది, తర్వాత బాప్తిస్మము మరియు పరిశుద్ధాత్మను పొందడం ఉంటాయి.”2 మనము సంస్కారములో పాలుపొందిన ప్రతిసారీ మనము ఆ నిబంధనను తిరిగి క్రొత్తగా చేస్తాము.

బాప్తీస్మపు నిబంధనతో ప్రారంభించి, మన జీవితములంతటా మనము ఎక్కువ నిబంధనలు చేస్తాము. మరలా, ఎల్డర్ రెన్‌లండ్ చెప్పారు: “నిబంధన బాట దేవాలయ వరము వంటి దేవాలయ విధులకు దారితీస్తుంది. వరము అనేది పరిశుద్ధ నిబంధనలకు దేవుని యొక్క బహుమానము, అది మనల్ని మరింత సంపూర్ణంగా ఆయనతో జతచేస్తుంది.”3

2. మీరు నిబంధన మార్గముపై ఉన్నారా?

కొన్నిసార్లు మనము నిబంధనలు చేసినప్పుడు, వాటిని పాటించడానికి మనం విఫలమవుతాము. ఇది జరిగినప్పుడు, మీరు నిబంధన మార్గానికి తిరిగి ఎలా వస్తారు? నిబంధన మార్గానికి తిరిగి రావడానికి కొన్ని ఉదాహరణలను పంచుకుంటాను

ఒక నెల రోజుల క్రితం, మాతోపాటు సేవ చేసి తిరిగి వచ్చిన మిషనరీ నుండి ఒక సందేశము నాకు వచ్చింది. అతడు చెప్పాడు, “ఈమధ్య కాలము కష్టమైనదిగా ఉన్నది. ప్రతిరోజు ఆందోళన మరియు నిరాశను జయించడానికి ప్రయాసపడుట, చాలా కష్టమైన శ్రమగా కనబడుతున్నది మరియు ఇది చాలా కష్టమైనది. నేను ఒంటరిగా భావిస్తున్నాను మరియు దుఃఖపూరితంగా ఉన్నాను. కష్టాలతో పోరాడటానికి నేనేమి చేయగలను అనే దానిలో శాంతి మరియు ఓదార్పు కోసం మన పరలోక తండ్రి యొక్క నడిపింపు కొరకు నేను ప్రార్థిస్తున్నాను. నేను ప్రార్థిస్తుండగా, దశమభాగమును పూర్తిగా చెల్లించాల్సిన అవసరమున్నదని నాతో చెప్పుతున్న ఆత్మ యొక్క ప్రేరేపణను నేను అనుభవించాను. … నేను ఆత్మను చాలా బలంగా అనుభూతి చెందాను, మరియు నాకు వెంటనే ఆవిధంగా చేయాలనే కోరిక కలిగింది. ఆవిధంగా చేయాలనే కోరికతో నేను ఇలా ప్రేరేపించబడినట్లు భావించాను, ‘మీ దశమభాగమును మీరు చెల్లించిన యెడల అంతా సజావుగా జరుగుతుంది.‘ నేను ఇంకా శాంతిని కనుగొనడానికి ప్రయాసపడుతున్నాను, కానీ మన రక్షకునియందు నేను సాక్ష్యమును కలిగియున్నాను, మరియు నా విధేయత ద్వారా నా హృదయములో, మనస్సులో నేను వెదకుచున్న శాంతిని నేను భావించగలను మరియు కనుగొనగలను. ఈమధ్య నేను సంఘానికి తిరిగి రావాలని, నేను చేసే వాటన్నిటిలో ఆత్మను వెదకాలని నిర్ణయించుకున్నాను.”

ఇప్పుడు అతడు చాలా బావున్నాడు. మీరు కూడ శాంతి కోసం పరలోక తండ్రిని అడగవచ్చు, కానీ మీరు ఆశించిన దానికంటే జవాబు భిన్నంగా ఉండవచ్చు. మీరు రక్షకుని తెలుసుకోవాలని కోరుతూ, పరలోక తండ్రిని ప్రార్థించినంత కాలము ఆయన మీకు అనుకూలమైన జవాబును ఇస్తారు.

అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ ఇలా బోధించారు:

“మర్త్యత్వములో మనము నేర్చుకోగల గొప్ప పాఠములేవనగా దేవుడు మాట్లాడినప్పుడు, మనము విధేయులమైనప్పుడు, మనము ఎల్లప్పుడు సరైనది చేస్తాము.”4

“మనము ఆజ్ఞలను పాటించినప్పుడు, మన జీవితాలు సంతోషకరంగా ఉంటాయి, ఎక్కువ నెరవేర్చేవిగా, తక్కువ సంక్లిష్టంగా ఉంటాయి. మన సవాళ్ళు మరియు సమస్యలు భరించడానికి సులువైనవిగా ఉంటాయి, మరియు [దేవుని యొక్క] వాగ్దానము చేయబడిన దీవెనలను పొందుతాము.”5

నేను ఒక బిషప్పుగా ఉండటానికి పిలవబడినప్పుడు, అది నా జీవితంలో చాలా కష్టమైన సమయము. నా 30 ఏండ్ల ప్రారంభంలో నేను యౌవన తండ్రిగా ఉన్నాను, కానీ కుటుంబ సవాళ్ళ వలన నేను ఆర్ధికంగా ఇబ్బందిలో ఉన్నాను. నేను ఏ పరిష్కరాన్ని కనుగొనలేకపోయాను, మరియు కష్టాలు ఎప్పటికి ముగిసిపోవని నేను అనుకున్నాను. నేను ఆర్ధికంగా, మానసికంగా అలసిపోయాను. నేను నా ఆత్మీయ బలాన్ని కూడా అనుమానించడం ప్రారంభించాను. ఆ కష్టమైన సమయమందు నా స్టేకు అధ్యక్షుడు నాకు పిలుపును ఇచ్చారు. ఏమైతే, అది కష్టమైనప్పటికినీ నేను పిలుపును అంగీకరించాను.

నా భార్యకు కూడ స్టేకు అధ్యక్షునితో మౌఖిక సంభాషణ జరిగింది, కానీ నా పిలుపుకు ఆమె సహాయపడుతుందా అని ఆయన ఆమెను అడిగినప్పుడు ఆమె అవునని చెప్పలేకపోయింది, మరియు కాదని చెప్పలేదు కానీ కన్నీళ్లు కార్చసాగింది. “ఇప్పుడు ఎందుకు?” “మీరు ప్రతి వ్యక్తిని నిజంగా ఎరుగుదురా?” అని పరలోక తండ్రిని అడుగుతూ, ఆమె వారమంతా ఏడ్చింది. ఆమెకు జవాబు రాలేదు, కానీ తరువాత ఆదివారము నేను బిషప్పుగా ఆమోదించబడ్డాను. ఆమె ఇక పరలోక తండ్రిని ఆ ప్రశ్నలు అడగలేదు, కానీ ఆరు సంవత్సరాలు నా పిలుపులో నాకు సహాయపడింది.

నేను విడుదల చేయబడిన ఆదివారము, నా భార్య సంస్కారము తీసుకుంటున్నప్పుడు ఆమె ఒక స్వరము విన్నది. ఆ స్వరము ఆమెతో గుసగుసలాడింది, “నీవు నడవడం నీకు చాలా కష్టమైనది కనుక, నీ శ్రమలతో సహాయపడటానికి, బలపరచడానికి బదులుగా నేను అతడిని బిషప్పుగా పిలిచాను.” గడిచిన ఆరు సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసినప్పుడు, అంతములేనివిగా కనబడిన అనేక సవాళ్ళు అన్నీ ఇప్పుడు మార్గము వెంబడి పరిష్కరించబడ్డాయని ఆమె గ్రహించింది.

ఒక పిలుపు పొందడానికి మనకు మంచి సమయం కాదని మనము అనుకున్నప్పుడు, అది మనకు ఆ పిలుపు ఎక్కువగా అవసరమైన సమయము కావచ్చని నేను నేర్చుకున్నాను. ఏ పిలుపులో నైనా సేవ చేయమని ప్రభువు మనల్ని అడిగినప్పుడల్లా, అది తేలికైనది లేదా భారమైన పిలుపు అయిప్పటికినీ, ఆయన మన అవసరతలను చూస్తారు. ఆయన మనకు అవసరమైన బలమును అందిస్తారు మరియు మనము విశ్వాసముగా సేవ చేసినప్పుడు మనపై దీవెనలను కుమ్మరించడానికి సిద్ధంగా ఉంచుతారు.

నిబంధన మార్గంలో నిలిచియుండుట నుండి మనల్ని అంతరాయపరచే అనేక ఇతర విషయాలున్నాయి. అవి ఏమైనప్పటికినీ, సహాయము కొరకు పరలోక తండ్రి వైపు మన హృదయాలను మరలించుట ఎప్పుడూ ఆలస్యము కాదు. ఎల్డర్ పౌల్ వి. జాన్సన్ మనకు బోధించారు: “మనము సాతానును అనుసరించినప్పుడు, మనము అతడికి శక్తిని ఇస్తున్నాము. మనము దేవుడిని అనుసరించినప్పుడు, ఆయన మనకు శక్తిని ఇస్తారు.”6

మోర్మన్ గ్రంథములో రాజైన బెంజమిన్ ఇలా సాక్ష్యమిచ్చాడు: “ఇంకను, దేవుని ఆజ్ఞలను గైకొను వారి ఆశీర్వాదకరమైన, సంతోషమైన స్థితిని మీరు తలంచవలెనని నేను కోరుచున్నాను. ఏలయనగా ఇదిగో, వారు ఐహికమైన, ఆత్మసంబంధమైన రెండిటియందు అన్ని వస్తువులతో ఆశీర్వదింపబడియున్నారు; వారు అంతము వరకు విశ్వాసముతో స్థిరముగా ఉండిన యెడల వారు పరలోకములోనికి చేర్చుకొనబడుదురు, దానిని బట్టి వారు దేవునితో ఎన్నడూ అంతముకాని సంతోషములో నివసించెదరు.”7

3. దేవునితో మీ నిబంధనలు పాటించడం మిమ్మల్ని ఎలా సంతోషపరుస్తుంది?

మా వివాహము మమ్మల్ని కలిపిందని, దాని వలన ఆమె ముందు చేయలేని విషయాలను చేయగలదని నా భార్య చెప్తుంది. ఉదాహరణకు, ఆమె చిన్నదానిగా ఉన్నప్పటి నుండి, ఆమెకు చీకటిలో బయటకు వెళ్ళాలంటే కష్టమైనది, కానీ నేను ఆమెతో వెళతాను కనుక ఇకముందు అది కష్టమైనది కాదు. ఆమె కురచగా ఉంటుంది, ఆమె ఒక కుర్చీ లేదా నిచ్చెన ఉపయోగిస్తే తప్ప పెద్ద షెల్పులను సమీపించలేదు, కానీ నేను ఆమె కంటే పొడుగ్గా ఉంటాను కనుక ఆమె కోసం నేను పెద్ద షెల్పులనుండి వస్తువులను తీయగలను. మన రక్షకుని కాడి మనపై తీసుకొనుట ఆవిధంగా ఉన్నది. ఆయనతో మన కాడిని తీసుకొన్నప్పుడు, మన స్వంతంగా మనం చేయలేని విషయాలను చేయగలము ఎందుకనగా మనకై మనం చేయలేని వాటిని ఆయన చేయగలరు.

ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ ఇలా చెప్పారు: “పవిత్ర నిబంధనలను చేయడం మరియు పాటించడం ప్రభువైన యేసు క్రీస్తుతో మనల్ని జతచేస్తుంది మరియు ఏకం చేస్తుంది. సారాంశములో, మన ఉత్తమ ప్రయత్నాలు ఆయనతో సమానం కానప్పటికీ మరియు ఆయనతో పోల్చలేనప్పటికీ, ఆయనపై ఆధారపడాలని మరియు ఆయనతో కలిసి ఉండమని రక్షకుడు మనలను పిలుస్తున్నారు. మర్త్య ప్రయాణంలో మనం విశ్వసించి, మన భారాన్ని ఆయనతో లాగుతున్నప్పుడు, నిజంగా ఆయన కాడి తేలికైనది, మరియు ఆయన భారం తేలికైనది.”8

అధ్యక్షులు నెల్సన్ ఇలా బోధించారు:

“మీరు రక్షకుని యొక్క కాడిని యెత్తుకోవడమంటే అర్థము, ఆయన బలానికి, విమోచనా శక్తికి మీరు ప్రవేశం కలిగియుండడం.”9

“దేవునితో నిబంధనలను పాటించినందుకు బహుమతి పరలోక శక్తి—మన శ్రమలు, శోధనలు మరియు బాధలను సరిగా ఎదిరించడానికి మనల్ని బలపరిచే శక్తి. ఈ శక్తి మన మార్గాన్ని సులువుగా చేస్తుంది. యేసు క్రీస్తు యొక్క ఉన్నత చట్టాలను జీవించేవారు ఆయన ఉన్నత శక్తిని పొందుతారు.”10

“నిబంధనలు పాటించుట వాస్తవానికి జీవితాన్ని సులువుగా చేస్తుంది! బాప్తిస్మపు తొట్టెలలో, దేవాలయాలలో నిబంధనలు చేసి—మరియు వాటిని పాటించే—ప్రతీవ్యక్తి యేసు క్రీస్తు యొక్క శక్తిని అధికంగా పొందుతారు.”11

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, మీరు సంతోషంగా ఉండాలని కోరుతున్నారా? నిబంధన మార్గంపై నిలిచియుండుము. మీ జీవితం సులువైనదిగా, సంతోషమైనదిగా ఉంటుంది, మరియు సంతోషంతో నింపబడింది. “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును,” అని మన రక్షకుడు మనల్ని ఆహ్వానిస్తున్నారు.”12 ఆయన సజీవుడైన క్రీస్తు. ఆయన మన భారములను మోస్తారు మరియు మన జీవితాన్ని సులువుగా చేస్తారు. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.