సర్వసభ్య సమావేశము
ప్రతీరోజు మన జీవితాల్లో యేసు క్రీస్తు యొక్క శక్తి
2023 అక్టోబరు సర్వసభ్య సమావేశము


ప్రతీరోజు మన జీవితాల్లో యేసు క్రీస్తు యొక్క శక్తి

మన శక్తికి మూలం యేసు క్రీస్తునందు విశ్వాసం, అది మనం ఉద్దేశపూర్వకంగా ప్రతిరోజూ ఆయన వద్దకు రావడానికి ప్రయత్నించుట ద్వారా జరుగుతుంది.

ప్రియమైన సహోదరి, సహోదరిలారా,, ఇది యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము. ఆయన సంఘముగా చేరడం ఎంత గొప్ప సంతోషము. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ప్రభువు సంఘము యొక్క సరైన పేరును తరచుగా ఉపయోగించమని గుర్తు చేసినందుకు నేను కృతజ్ఞుడను, తద్వారా ఇది ఎవరి సంఘమో మరియు మనము ఎవరి బోధనలను అనుసరిస్తున్నామో గుర్తుంచుకుంటాము.

అధ్యక్షులు నెల్సన్ వ్యాఖ్యానించారు: “రాబోయే రోజుల్లో, లోకము ఎన్నడూ చూడని రక్షకుని శక్తి యొక్క గొప్ప ప్రత్యక్షతలను మనం చూస్తాము. … ఆయన విశ్వాసులకు లెక్కలేనన్ని విశేషావకాశాలను, దీవెనలను, అద్భుతాలను క్రుమ్మరిస్తారు.”1

నేను మరియు నా భార్య రెనీకి ఉన్న గొప్ప అధికారాలలో ఒకటి, మేము సేవ చేసే దగ్గర పరిశుద్ధులను కలవడం. మేము వారి కథలను వింటాము, వారి నష్టాలను చూస్తాము, వారి బాధలను పంచుకుంటాము, మరియు వారి విజయంతో మేము సంతోషిస్తాము. విశ్వాసులపై రక్షకుడు అనుగ్రహించిన అనేక దీవెనలను మరియు అద్భుతాలను మేము చూశాము. అసాధ్యమైన వాటిని, ఎదుర్కొన్న, ఆలోచించలేని కష్టాలను అనుభవించిన వ్యక్తులను మేము కలుసుకున్నాము.

చిత్రం
అధ్యక్షుడు జోస్ బటల్లా మరియు అతని భార్య, సహోదరి వలేరియా బటల్లా.
చిత్రం
ఫ్లావియా క్రుజాడో మరియు ఆమె తండ్రి.

బొలీవియాలో ప్రభువు కార్యములో ఉన్నప్పుడు భర్తను కోల్పోయిన ఒక వితంతువులో రక్షకుని శక్తి యొక్క ప్రత్యక్షతను మేము చూశాము.2 అదే ప్రత్యక్షతను, అర్జెంటీనాలో వేరెవరో తన సెల్‌ఫోన్‌ని దొంగిలించాలనే కారణంతో రైలు కింద పడిపోయి కాలు పోగొట్టుకున్న యువతిలో మనం చూశాము.3 మరియు ఊహించపజాలని ఆ క్రూరత్వ చర్య నుండి పరిస్థితులను మెరుగుపరచి తన కుమార్తెను బలోపేతం చేయాలనే ఆమె ఒంటరి తండ్రిలో కూడా చూశాము. 2022 క్రిస్మస్ కేవలం రెండు రోజుల ముందు చిలీలో అగ్నిప్రమాదాల సమయంలో తమ ఇళ్లను మరియు సమస్త ఆస్తిని కోల్పోయిన కుటుంబాలలో మనము దీనిని చూశాము.4 బాధాకరమైన విడాకుల తర్వాత బాధపడేవారిలో మరియు దుర్వినియోగానికి గురైన అమాయక బాధితులలో మనము దీనిని చూశాము.

చిత్రం
చిలీలో మంటలు.

కష్టమైన పరిస్థితులను అధిగమించే శక్తిని వారికి ఏది ఇస్తుంది? ప్రతిదీ కోల్పోయినట్లు అనిపించినప్పుడు కొనసాగడానికి అదనపు శక్తిని ఏది ఇస్తుంది?

ఆ శక్తికి మూలం యేసు క్రీస్తునందు విశ్వాసం అని నేను కనుగొన్నాను, అది మనం ప్రతిరోజూ ఉద్దేశపూర్వకంగా ఆయన వద్దకు రావడానికి ప్రయత్నించుట ద్వారా జరుగుతుంది.

ప్రవక్త జేకబ్ ఇలా బోధించాడు, “మరియు ఆయన స్వరమును ఆలకించిన యెడల, మనుష్యులందరినీ రక్షించునట్లు ఆయన లోకములోనికి వచ్చును; ఏలయనగా ఆయన మనుష్యులందరి యొక్క బాధలను, అనగా ఆదాము కుటుంబమునకు చెందిన పురుషులు, స్త్రీలు, పిల్లలు మరియు జీవించు ప్రతి ప్రాణి యొక్క బాధలను అనుభవించును.”5

కొన్నిసార్లు, యేసుక్రీస్తు నందు విశ్వాసం కలిగి ఉండడం అసాధ్యం, దాదాపుగా సాధించలేనిదని అనిపించవచ్చు. క్రీస్తు నొద్దకు రావడానికి మనకు అవసరమైన బలము, శక్తి మరియు పరిపూర్ణత లేవని, మరియు అన్నింటినీ చేసే శక్తిని మనం కనుగొనలేమని అనుకోవచ్చు. కానీ ఈ ప్రజలందరి నుండి నేను నేర్చుకున్నది ఏమిటంటే, యేసు క్రీస్తు నందు విశ్వాసం మనకు ప్రయాణాన్ని ప్రారంభించడానికి శక్తిని ఇస్తుంది. కొన్నిసార్లు మనం ఇలా అనుకోవచ్చు, “నేను యేసు దగ్గరకు రాకముందే నా జీవితాన్ని చక్కదిద్దుకోవాలి,” కానీ నిజమేమిటంటే, ఆయన ద్వారా మన జీవితాలను సరిచేసుకోవడానికి మనము యేసు నొద్దకు వస్తాము.

మనం పరిపూర్ణులం కాబట్టి యేసు నొద్దకు రాము. లోపభూయిష్టంగా ఉన్నందున మనం ఆయన వద్దకు వస్తాము మరియు ఆయనలో మనం “పరిపూర్ణులగుదురుము.”6

మనం ప్రతిరోజూ కొద్ది విశ్వాసమును అభ్యసించడాన్ని ఎలా ప్రారంభించాలి? ఇది నాకు ఉదయం ప్రారంభమవుతుంది: నేను మేల్కొన్నప్పుడు, నా ఫోన్‌ని చూసే బదులు, నేను ఒక ప్రార్థన చేస్తాను. ఒక సాధారణ ప్రార్థన. తరువాత నేను ఒక లేఖనము చదువుతాను. “ఎల్లప్పుడు ఆయనను జ్ఞాపకము చేసుకొనుటకు” సంస్కారములో నేను పాలుపంచుకున్నప్పుడు నేను చేసే నా వారపు నిబంధనతో ఇది నాకు సహాయపడుతుంది.7 నేను ప్రార్థన మరియు లేఖనముతో నా రోజును ప్రారంభించి, నేను నా ఫోన్‌ని చూసినప్పుడు “ఆయనను జ్ఞాపకము చేసుకోగలను.” నేను నా సమస్యలను మరియు వివాదాలను ఎదుర్కొన్నప్పుడు, “ఆయనను జ్ఞాపకము చేసుకోగలను” మరియు నేను యేసు వలె వాటిని ఎదుర్కోవటానికి ప్రయత్నిస్తాను.

నేను “ఆయనను జ్ఞాపకము చేసుకున్నప్పుడు,” నేను మారాలని, పశ్చాత్తాపపడాలని కోరుకుంటున్నాను. నా నిబంధనలను కొనసాగించడానికి శక్తి యొక్క మూలాన్ని నేను కనుగొన్నాను, మరియు నా జీవితంలో పరిశుద్ధాత్మ ప్రభావాన్ని నేను అనుభవిస్తున్నాను “మరియు ఆయన [నాకు] ఇచ్చిన ఆయన ఆజ్ఞలను పాటించుటకు నేను సమ్మతించుచున్నాను; [నేను] ఎల్లప్పుడు ఆయన ఆత్మను కలిగియుండెదను.”8 ఇది అంతము వరకు సహించటానికి నాకు సహాయపడుతుంది.9 లేదా కనీసం చివరి రోజు వరకు! మరియు ఆ రోజుల్లో నేను ఆయనను రోజంతా జ్ఞాపకముంచుకోలేకపోయాను, అయినప్పటికీ ఆయన ఉన్నారు, నన్ను ప్రేమిస్తున్నారు మరియు “సరే; నీవు రేపు మళ్లీ ప్రయత్నించవచ్చు” అని నాకు చెబుతున్నారు.

ఆయనను జ్ఞాపకముంచుకోవడంలో మనం అపరిపూర్ణులమైనప్పటికీ, మన ప్రేమగల పరలోక తండ్రి మనల్ని జ్ఞాపకముంచుకోవడంలో ఎన్నడూ విఫలం కారు.

మనం తరచుగా చేసే పొరపాట్లలో ఒకటి, నిబంధనలను లేదా దేవునికి మనం చేసే వాగ్దానాలను పాటించుట ఏదో ఒకవిధంగా మనం ఆయనతో చేసే లావాదేవీలని భావించడం: నేను విధేయుడనవుతాను, మరియు నాకు ఎప్పుడూ చెడు జరగకుండా ఆయన నన్ను రక్షిస్తాడు. నేను నా దశమభాగము చెల్లిస్తున్నాను, నేను ఎప్పటికీ నా ఉద్యోగాన్ని కోల్పోను లేదా అగ్ని నా ఇంటిని కాల్చదు. కానీ విషయాలు మనం అనుకున్నట్లు జరగనప్పుడు, “నేను నశించిపోవుచున్నాను; నీకు చింతలేదా?” అని ప్రభువుకు మొరపెట్టుకుంటాం.10

మన నిబంధనలు కేవలం లావాదేవీలు మాత్రమే కాదు; అవి పరివర్తనకు సంబంధించినవి.11 నా నిబంధనల ద్వారా నేను యేసు క్రీస్తు యొక్క బలపరిచే పరిశుద్ధ శక్తిని పొందుతాను, ఇది నేను కొత్త వ్యక్తిగా మారడానికి, క్షమించరానిదిగా అనిపించే వాటిని క్షమించడానికి, అసాధ్యమైన వాటిని అధిగమించడానికి అనుమతిస్తుంది. ఉద్దేశపూర్వకంగా యేసు క్రీస్తును ఎల్లప్పుడూ స్మరించుకోవడం శక్తివంతమైనది; “ఆయన [నాకు] ఇచ్చిన ఆజ్ఞలను పాటించడానికి.” అది నాకు అదనపు శక్తిని ఇస్తుంది.12 ఇది నాకు మంచిగా ఉండేందుకు, ఎటువంటి కారణం లేకుండా చిరునవ్వుతో ఉండటానికి, సమాధానపరచు వ్యక్తిగా ఉండటానికి,13 సంఘర్షణలను నివారించడానికి, నా జీవితంలో దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వటానికి సహాయపడుతుంది.14

మన బాధ లేదా మనం ప్రేమించే వారి బాధ మనం భరించలేనంతగా ఉన్నప్పుడు, యేసు క్రీస్తును స్మరించుకోవడం మరియు ఆయన దగ్గరకు రావడం భారాన్ని తేలిక చేస్తుంది, హృదయాన్ని మృదువుగా చేస్తుంది, మరియు బాధను తగ్గిస్తుంది. ఈ శక్తి ఒక తండ్రి తన సహజ సామర్థ్యానికి మించి తన కుమార్తెను ఆమె కాలు కోల్పోయిన శారీరక మరియు మానసిక వేదనను భరించేలా చేసింది.

చిత్రం
ఎల్డర్ యులిసెస్ సోవారెస్‌తో ఫ్లావియా క్రుజాడో.

ఎల్డర్ సోవారెస్ గత జూన్‌లో అర్జెంటీనాను సందర్శించి, ఫ్లావియాను ఆమె విషాదకరమైన ప్రమాదం గురించి అడిగినప్పుడు, ఆమె విశ్వాసంగా ఇలా సమాధానమిచ్చింది, “[ఇది జరిగినప్పుడు] నేను అలజడి, చేదు, కోపం మరియు ద్వేషాన్ని అనుభవించాను. ‘నాకే ఎందుకు?’ అని అడగడం కాదు, ‘దేని కోసం?’ అని అడగడం నాకు సహాయపడింది. … ఇది నన్ను ఇతరులకు మరియు ప్రభువుకు దగ్గర చేసిన విషయము. … ఆయన నుండి నన్ను నేను దూరం చేసుకునే బదులు, నేను ఆయనను అంటిపెట్టుకుని ఉండవలసి వచ్చింది.”15

అధ్యక్షులు నెల్సన్ ఇలా బోధించారు: “దేవునితో నిబంధనలను పాటించినందుకు బహుమతి పరలోక శక్తి—మన శ్రమలు, శోధనలు మరియు హృదయ వేదనలు ఎదిరించడానికి మనల్ని బలపరిచే శక్తి. … ఆ విధంగా, నిబంధనలను పాటించేవారు ఒక ప్రత్యేక విధమైన విశ్రాంతికి అర్హులు.”16 తన భర్తను కోల్పోయి రోజూ హృదయ వేదనలో బాధపడుతున్న ఆ వితంతువు కళ్లలో నేను చూసిన ప్రశాంతత, విశ్రాంతి ఇదే.

చిత్రం
గలిలయ సముద్రంలో తుఫాను.

కొత్త నిబంధన యేసు మరియు ఆయన శిష్యులు ఒక దోనెలో ఉన్న సమయం గురించి చెబుతుంది:

“అప్పుడు పెద్ద తుపాను రేగి ఆయన యున్న దోనెమీద అలలు కొట్టినందున దోనె నిండిపోయెను. …

ఆయన … తలగడమీద నిద్రించుచుండెను: మరియు వారాయనను లేపి–బోధకుడా, మేము నశించిపోవుచున్నాము; నీకు చింతలేదా? అని ఆయనతో అనిరి.

మరియు ఆయన లేచి గాలిని గద్దించి–నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పెను. …

అప్పుడాయన–మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మికలేక యున్నారా? అని వారితో చెప్పెను” 17

ఈ కథ గురించి నేను ఎప్పటినుండో ఆసక్తి కలిగియున్నాను. తుఫానును శాంతింపజేయడానికి వారు తమ విశ్వాసాన్ని ఉపయోగించాలని ప్రభువు ఆశించారా? గాలిని మందలించడానికా? ఆయన మనతో పాటు దోనెలో ఉన్నాడు కాబట్టి మనం నశించమని ఎరిగిన, యేసు క్రీస్తు నందు విశ్వాసం తుఫానును తట్టుకునే శాంతి యొక్క అనుభూతి.

చిలీలో అగ్ని ప్రమాదాల తర్వాత కుటుంబాలను సందర్శించినప్పుడు మేము చూసిన విశ్వాసం ఇదే. వారి ఇళ్ళు నేల మట్టము వరకు కాలిపోయాయి; వారు ప్రతిదీ కోల్పోయారు. అయినప్పటికీ మేము వారి ఇళ్ల ప్రాంతములో నడుస్తున్నప్పుడు మరియు వారు తమ అనుభవాల గురించి మాకు చెబుతుంటే, మేము పవిత్ర భూమిపై నిలబడియున్నట్లు భావించాము. ఒక సహోదరి నా భార్యతో ఇలా చెప్పింది, “పక్కన ఉన్న ఇళ్లు కాలిపోవడం చూసినప్పుడు, మా ఇల్లు కాలిపోబోతోందని, మేమూ సర్వం కోల్పోబోతున్నామని నాకు అనిపించింది. నిరాశకు బదులుగా, నేను వర్ణించలేని శాంతి యొక్క భావనను అనుభవించాను. ఏదో ఒకవిధంగా, ప్రతిదీ సరిగ్గా జరుగుతుందని నేను భావించాను.” దేవుణ్ణి విశ్వసించడం మరియు ఆయనతో మన నిబంధనలను నిలబెట్టుకోవడం మన బలహీనతకు శక్తిని మరియు మన దుఃఖానికి ఓదార్పునిస్తుంది.

వారి విశ్వాసం, బలం మరియు పట్టుదల యొక్క అనేక మాదిరుల కోసం రెనీ మరియు నేను ఈ అసాధారణ పరిశుద్ధులలో కొందరిని కలిసే అవకాశం లభించినందుకు నేను కృతజ్ఞుడను. వార్తా పత్రిక యొక్క మొదటి పేజీని ఎప్పటికీ చేరని లేదా ఎప్పుడూ వైరల్‌గా మారని హృదయ విదారక మరియు నిరాశ కథల కోసం. నష్టం లేదా బాధాకరమైన విడాకుల తర్వాత కార్చబడిన కన్నీళ్లు మరియు చేసిన ప్రార్థనలు గురించి తీయని చిత్రాల కోసం మరియు భయం, దుఃఖంతో ఎన్నడూ చేయబడని పోస్టులు, మరియు భరించగలిగే నొప్పి కోసం యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తం నందు విశ్వాసమునకు కృతజ్ఞతలు. ఈ వ్యక్తులు నా స్వంత విశ్వాసాన్ని బలపరచారు, అందుకు నేను ఎంతో కృతజ్ఞుడను.

ఇది యేసు క్రీస్తు యొక్క సంఘము అని నాకు తెలుసు. మనం ప్రతి రోజూ ఆయన వద్దకు వస్తే, ఆయన తన శక్తిని మనకు వరమిచ్చుటకు సిద్ధంగా ఉన్నాడని నాకు తెలుసు. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.