సర్వసభ్య సమావేశము
క్రీస్తు యొక్క సమాధానకరమైన శిష్యులైయుండుడి
2023 అక్టోబరు సర్వసభ్య సమావేశము


క్రీస్తు యొక్క సమాధానకరమైన శిష్యులైయుండుడి

“క్రీస్తు యొక్క సమాధానకరమైన అనుచరులు” ఈ జీవితంలో వ్యక్తిగత శాంతిని మరియు మహిమకరమైన పరలోక పునస్సమాగమము పొందుతారని నేను సాక్ష్యమిస్తున్నాను.

“క్రీస్తు యొక్క సమాధానకరమైన”1 శిష్యులు ప్రత్యేక సవాళ్ళను అనుభవిస్తున్న కాలంలో మనం జీవిస్తున్నాము. యేసు క్రీస్తునందు నమ్మకముంచి, వినయంగా ఆరాధించి, సాక్ష్యమిచ్చేవారు ఎల్లప్పుడూ కష్టాలు, బాధలు మరియు ప్రతికూలతలను అనుభవించారు.2 నేను, నా భార్య మేరీ అందుకు అతీతులమేమీ కాదు. గత కొన్ని సంవత్సరాలలో, మా సన్నిహిత పాఠశాల స్నేహితులు, మిషనరీ సహవాసులు, వారి విలువైన భార్యలలో కొందరు, మరియు మాజీ సహోద్యోగులలో అనేకమంది మరణించడాన్ని లేదా అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ చెప్పినట్లుగా, తెరకు అవతలి వైపుకు వెళ్ళిపోవడాన్ని మేము చూసాము. విశ్వాసంలో ఎదిగి, సువార్తను నమ్మి, తరువాత నిబంధన మార్గం నుండి తొలగిపోయిన కొందరిని మేము చూసాము.

దురదృష్టవశాత్తూ, విషాదకరమైన ఒక కారు ప్రమాదంలో మేము 23 ఏళ్ళ మనవడిని పోగొట్టుకున్నాము. కొంతమంది సన్నిహిత స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు సహోద్యోగులు కూడా ముఖ్యమైన ఆరోగ్య సవాళ్ళను ఎదుర్కొన్నారు.

కష్టాలు వచ్చినప్పుడల్లా మనము దుఃఖిస్తాము మరియు ఒకరి భారములు ఒకరు భరించడానికి ప్రయత్నిస్తాము.3 నెరవేరని పనులు, ఆలపించని గీతాల కొరకు మనం విలపిస్తాం.4 ఈ మర్త్య ప్రయాణంలో మంచి వారికి చెడు జరుగుతుంది. హవాయిలోని మౌయిలో, దక్షిణ చిలిలో మరియు కెనడాలో విధ్వంసకర మంటలు కొన్నిసార్లు మంచివాళ్ళు ఎదుర్కొనే భయంకరమైన సంఘటనలకు ఉదాహరణలు.

ఆత్మల యొక్క నిత్య స్వభావం గురించి అబ్రాహాముకు ప్రభువు బయల్పరిచారని మనం అమూల్యమైన ముత్యములో చదువుతాం. భూలోకమునకు ముందు మన జీవితము, పూర్వ నియామకము, సృష్టి, విమోచకుని ఎంపిక, నరుని రెండవ స్థితి అయిన ఈ మర్త్య జీవితము గురించి అబ్రాహాము నేర్చుకున్నాడు.5 విమోచకుడు ఇలా ప్రకటించారు:

“వీరందరు నివాసముండుటకు మనము ఒక భూలోకమును చేయుదుము;

“వారి దేవుడైన ప్రభువు వారికి ఆజ్ఞాపించిన సంగతులన్నిటిని వారు గైకొందురో లేదోనని మనము వారిని పరీక్షించెదము.”6

ఇప్పుడు మనమందరం దేవుని యొక్క గొప్ప రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క ప్రణాళికలో భాగంగా ఒక మహిమ రాజ్యం వైపు ముందుకు సాగే మన ప్రయాణం యొక్క రెండవ స్థితిలో ఉన్నాము. మనం కర్తృత్వం చేత దీవించబడ్డాము మరియు మర్త్యత్వపు శ్రమలకు లోబడియున్నాము. ఇది దేవుడిని కలుసుకోవడానికి సిద్ధపడేందుకు మనకివ్వబడిన సమయము.7 యేసు క్రీస్తు మరియు ప్రణాళికలో ఆయన పాత్ర గురించి తెలుసుకోవడానికి మనం దీవించబడ్డాము. పునఃస్థాపించబడిన ఆయన సంఘమైన యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క సభ్యులయ్యే విశేషాధికారమును మనం కలిగియున్నాము. క్రీస్తు యొక్క సమాధానకరమైన శిష్యులుగా, మనం ఆయన ఆజ్ఞలను బట్టి జీవించడానికి ప్రయత్నిస్తాము. ఆయన అనుచరులకు ఇది ఎన్నడూ సులువుగా లేదు. ఆయన మర్త్య నియమితకార్యాన్ని విశ్వాసంగా నెరవేర్చడం రక్షకునికి కూడా సులువుగా లేదు.

అనేకమంది “తినుము, త్రాగుము, సంతోషించుము, ఏలయనగా రేపు మనము చనిపోవుదుము” అనే విధానానికి లొంగిపోతారని లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి.8 ఇతర అవిశ్వాసులు సారూప్యత కలిగినవారి భయంకరమైన ఒంటరితనానికి తిరోగమిస్తారు, వారు “తదుపరి క్రొత్త విషయం”9 కోసం మరియు మనుషుల తత్వాల కోసం వాదిస్తారు.10 సత్యమును ఎక్కడ కనుగొనవలెనో వారికి తెలియదు.11

క్రీస్తు యొక్క సమాధానకరమైన శిష్యులు ఏ మార్గాన్ని అనుసరించరు. మనం నివసించే సమాజాలలో మనం ఉత్సాహంగల, కార్యనియుక్తులైన సభ్యులము. మనం ప్రేమిస్తాము, పంచుకుంటాము మరియు క్రీస్తు బోధనలను అనుసరించమని దేవుని పిల్లలందరిని ఆహ్వానిస్తాము.12 మన ప్రియ ప్రవక్తయైన అధ్యక్షులు నెల్సన్ గారి సలహాను మనం అనుసరిస్తాము: “ఇప్పుడు మరియు ఎల్లప్పుడు మనం సమాధానపరచువారి” పాత్రను ఎంచుకుంటాము.13 ఈ ప్రేరేపిత విధానము లేఖనములు మరియు ప్రవచనాత్మక నిర్దేశము రెండింటికి అనుగుణంగా ఉంటుంది.

1829లో, పునఃస్థాపించబడిన సంఘము ఇంకా ఏర్పాటు చేయబడలేదు లేదా మోర్మన్ గ్రంథము ప్రచురించబడలేదు. శ్రమిస్తున్న వ్యక్తుల చిన్న సమూహమొకటి దేవుని ఆత్మ చేత కదిలించబడి, ప్రవక్త జోసెఫ్ స్మిత్‌ను అనుసరించింది. కష్టకాలముల కొరకు ఉపదేశాన్ని ప్రభువు జోసెఫ్‌కు బయల్పరిచారు: “చిన్నమందా భయపడకుము; మంచిని చేయుము; భూమియు, నరకమును మీకు వ్యతిరేకముగా కలిసినను, మీరు నా బండమీద కట్టబడిన యెడల, అవి మిమ్ములను జయించలేవు.”14 ఆయన వారికి ఉపదేశము కూడా ఇచ్చారు:

“ప్రతి ఆలోచనలో నా వైపు చూడుడి; సందేహించవద్దు, భయపడవద్దు.

“… విశ్వాసముగా నుండుడి, నా ఆజ్ఞలను పాటించుడి, మీరు పరలోకరాజ్యమును స్వాస్థ్యముగా పొందెదరు.”15

స్పష్టముగా, మనం ప్రతికూలతలను ఎదుర్కొన్నప్పుడు మన పరలోక గమ్యము మారలేదు. “గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరవలెనని”16 హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో మనం ఉపదేశించబడ్డాము. యేసు క్రీస్తు “నిత్య రక్షణకు కారకుడు.”17

“నరుల సంతానముతో మీ సమాధానపు నడతను బట్టి … క్రీస్తు యొక్క సమాధానకరమైన శిష్యులను” మెచ్చుకుంటూ అతని కొడుకు మొరోనై చేత వ్యాఖ్యానించబడిన మోర్మన్ మాటలు నాకిష్టం.18

మన ప్రభువు మరియు రక్షకుడైన యేసు క్రీస్తుపై మన దృష్టిని కేంద్రీకరించినప్పుడు, సంఘమందు మనలో “క్రీస్తు యొక్క సమాధానకరమైన శిష్యులు” కావడానికి ప్రయత్నిస్తున్న వారి కోసం ఒక ప్రకాశవంతమైన దినము వేచియుంది. కష్టాలు మర్త్యత్వములో భాగము, అవి లోకమంతటా ప్రతీఒక్కరి జీవితంలో సంభవిస్తాయి. ఇందులో దేశాలు మరియు వ్యక్తుల మధ్య పెద్ద యుద్ధాలు ఉన్నాయి.

“ప్రత్యేకించి మంచివారికి చెడు జరగడానికి న్యాయవంతుడైన దేవుడు ఎందుకు అనుమతిస్తాడు?” మరియు “నీతిమంతులు, ప్రభువు సేవలో ఉన్నవారు అటువంటి విషాదాల నుండి ఎందుకు తప్పించుకోలేరు?” అని సంఘ నాయకులు తరచు అడుగబడతారు.

జవాబులన్నీ మనకు తెలియవు; అయినప్పటికీ, మనలో ప్రతీఒక్కరు వేచియున్న ప్రకాశవంతమైన భవిష్యత్తుపై విశ్వాసంతో, నమ్మకంతో కష్టాలను, శ్రమలను, ప్రతికూలతలను ఎదుర్కోవడానికి మనల్ని అనుమతించే ముఖ్యమైన సూత్రాలు మనకు తెలుసు. శ్రమల గుండా వెళ్ళడానికి సంబంధించి, ప్రవక్త జోసెఫ్ స్మిత్ లిబర్టీ చెరసాలలో బంధీగా ఉన్నప్పుడు ప్రభువు ఆయనతో చెప్పిన మాట కంటే మంచి ఉదాహరణ లేఖనాలలో లేదు.

ప్రభువు పాక్షికంగా ప్రకటించారు:

“నరకము నీ కొరకు నోటిని విశాలముగా తెరచినను, నా కుమారుడా, ఇవన్నియు నీకు అనుభవమునిచ్చుటకు నీ మేలుకొరకేనని తెలుసుకొనుము.

“మనుష్య కుమారుడు వీటన్నిటికంటె హీనమైన వాటిని అనుభవించెను. అతని కంటే నీవు గొప్పవాడివా?

“… మనుష్యుడు ఏమిచేయునో అని భయపడకుము, ఏలయనగా దేవుడు నిరంతరము నీకు తోడైయుండును.19

మనల్ని ఎరిగియుండి, వ్యక్తిగతంగా మనల్ని ప్రేమించి, మన బాధను పరిపూర్ణంగా అర్థం చేసుకునే పరలోక తండ్రిని మనం కలిగియున్నామనేది స్పష్టము. ఆయన కుమారుడైన యేసు క్రీస్తు మన రక్షకుడు మరియు విమోచకుడు.

నా సువార్తను ప్రకటించుడి యొక్క క్రొత్త రెండవ సంచిక యొక్క ప్రాముఖ్యతను అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మరియు అధ్యక్షులు ఎమ్. రస్సెల్ బాల్లర్డ్ ఇద్దరూ బలంగా నొక్కిచెప్పారు.20 వారి ఉత్సాహాన్ని నేను పంచుకుంటున్నాను. పవిత్ర లేఖనాన్ని విస్తరింపజేస్తూ, ఈ క్రొత్త సంచిక శక్తివంతంగా ఇలా ప్రకటిస్తుంది:

“ఆయన ప్రాయశ్చిత్త త్యాగములో, యేసు క్రీస్తు నా బాధలు, శ్రమలు మరియు బలహీనతలను తనపై తీసుకున్నారు. ఈ కారణంగా, ‘వారి యొక్క బలహీనతలను బట్టి తన జనులను ఎట్లు ఆదరించవలెనో శరీరమును బట్టి’ ఆయన ఎరుగును’ (ఆల్మా 7:12; 11వ వచనము కూడా చూడండి). ‘నా యొద్దకు రండి’ అని ఆయన ఆహ్వానిస్తారు మరియు మనం వచ్చినప్పుడు, ఆయన మనకు విశ్రాంతిని, నిరీక్షణను, బలాన్ని, దృక్పథాన్ని మరియు స్వస్థతను ఇస్తారు (మత్తయి 11:28; 29–30 వచనములు కూడా చూడండి).

“మనం యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తం మీద ఆధారపడినప్పుడు, మన కష్టాలు, అనారోగ్యాలు మరియు బాధలను భరించడంలో ఆయన మనకు సహాయపడగలరు. మనం ఆనందం, శాంతి మరియు ఓదార్పుతో నింపబడగలము. జీవితంలో అన్యాయమైనవిగా ఉన్నవన్నీ యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తం ద్వారా సరిచేయబడతాయి.”21

మనం ఆనందంగా క్రీస్తు యొక్క సమాధానకరమైన శిష్యులై యుండగలము.

ఆయన పిల్లల కొరకు మన తండ్రి యొక్క సంతోష ప్రణాళికలో పూర్వ మర్త్య మరియు మర్త్య జీవితం మాత్రమే కాకుండా నిత్యజీవము కొరకు సామర్థ్యము కూడా ఉంది, అది మనం కోల్పోయిన వారితో గొప్ప మరియు మహిమకరమైన పునస్సమాగమమును కలిపియుంది. అన్ని తప్పులు సరిదిద్దబడతాయి, మనము ఖచ్చితమైన స్పష్టత, దోషరహిత దృక్పథం మరియు అవగాహనతో చూస్తాము.

సంఘ నాయకులు ఈ దృక్పథాన్ని మూడు-ఘట్టాల నాటకం మధ్యలో ప్రవేశించిన వానితో పోల్చారు.22 తండ్రి యొక్క ప్రణాళిక గురించి తెలియనివారు మొదటి ఘట్టము (లేదా పూర్వ మర్త్య ఉనికి) లో జరిగిన దానిని మరియు అక్కడ ఏర్పాటు చేయబడిన ఉద్దేశ్యాలను అర్థం చేసుకోరు; లేదా తండ్రి ప్రణాళిక యొక్క మహిమకరమైన నెరవేర్పు అయిన మూడవ ఘట్టంలో వచ్చే స్పష్టతను, దృఢసంకల్పాన్ని అర్థం చేసుకోరు.

తమ తప్పు లేకపోయినా అననుకూలంగా కనిపించే వారు, ఆయన ప్రేమగల మరియు సమగ్రమైన ప్రణాళిక క్రింద అంతిమంగా ప్రభావితం కారనే దానిని అనేకమంది అభినందించరు.23

లేఖనాలు స్పష్టంగా ఉన్నాయి: నీతిమంతులు, రక్షకుడిని అనుసరించేవారు మరియు ఆయన ఆజ్ఞలను పాటించే క్రీస్తు యొక్క సమాధానకరమైన శిష్యులు దీవించబడతారు. జీవితంలో వారి పరిస్థితితో సంబంధం లేకుండా నీతిమంతులైన వారి కొరకు అతి ముఖ్యమైన లేఖనాలలో ఒకటి, తన జనులకు రాజైన బెంజమిన్ ప్రసంగంలో భాగమైయుంది. విశ్వాసంగా ఆయన ఆజ్ఞలను పాటించేవారు ఈ జీవితంలో అన్ని విషయాలలో దీవించబడతారని మరియు “పరలోకములోనికి చేర్చుకొనబడి దేవునితో ఎన్నడూ అంతముకాని సంతోషము యొక్క స్థితిలో నివసించెదరని”24 ఆయన వాగ్దానమిస్తున్నారు.

దాదాపుగా మనలో అందరం మన జీవితాల్లో భౌతిక మరియు ఆధ్యాత్మిక సవాళ్ళను అనుభవించామని, కొన్ని విధ్వంసకరమైనవని మనం గుర్తించాము. ప్రియమైన పరలోక తండ్రి, ఆయన కుమారుడు మరియు పునఃస్థాపించబడిన ఆయన సంఘానికి అధిపతి అయిన యేసు క్రీస్తు, ప్రమాదాల గురించి మనల్ని సిద్ధపరచడానికి, హెచ్చరించడానికి లేఖనాలను, ప్రవక్తలను అందించారు మరియు మనల్ని సిద్ధపరచి రక్షించడానికి నడిపింపునిస్తారు. కొన్ని నిర్దేశాలకు తక్షణ చర్య అవసరం, మరికొన్ని భవిష్యత్తులో అనేక సంవత్సరాల పాటు రక్షణను అందిస్తాయి. “ప్రవక్తల మాటలకు చెవియొగ్గమని”25 సిద్ధాంతము మరియు నిబంధనలు, 1వ ప్రకరణమునకు ప్రభువు యొక్క పీఠిక మనల్ని హెచ్చరిస్తుంది.

“రాబోవు దానిని గూర్చి సిద్ధపడుడి”26 అని కూడా 1వ ప్రకరణము మనల్ని హెచ్చరిస్తుంది. ప్రభువు తన ప్రజలకు వారు ఎదుర్కొనే సవాళ్లకు సిద్ధమయ్యే ఒక అవకాశాన్నిస్తారు.

1847, జనవరి 14న వింటర్ క్వార్టర్స్ వద్ద ప్రభువు అధ్యక్షులు బ్రిగమ్ యంగ్‌కు ఒక శక్తివంతమైన బయల్పాటునిచ్చారు.27 రాబోవు దానిని గూర్చి ప్రభువు జనులను సిద్ధపరుస్తున్నారు అనడానికి ఈ బయల్పాటు ఒక ఉత్తమ ఉదాహరణ. విశ్వాసులైన పరిశుద్ధులు సాల్ట్ లేక్ లోయ యొక్క పర్వత శ్రేణులలోకి వారి వలసను ప్రారంభించారు. వారు విజయవంతంగా నావూ దేవాలయాన్ని నిర్మించి, పవిత్రమైన రక్షణ విధులను పొందారు. వారు మిస్సోరి నుండి తరిమివేయబడ్డారు మరియు వారిని హింసించేవారు భయంకరమైన చలికాలంలో వారిని నావూ నుండి తరిమివేసారు. బ్రిగమ్‌కు వచ్చిన బయల్పాటు వలస కోసం ఎలా సిద్ధపడాలనే దానిపై ఆచరణాత్మక సలహానిచ్చింది. పరిశుద్ధుల ప్రధాన సమూహం వారి ప్రమాదకరమైన ప్రయాణంలో కొనసాగినప్పుడు, బీదవారు, విధవరాండ్రు, తండ్రిలేని వారు మరియు మోర్మన్ పటాలములో సేవ చేస్తున్న వారి కుటుంబాల గురించి శ్రద్ధ తీసుకోవడంపై ప్రభువు ప్రత్యేక దృష్టి పెట్టారు.

నీతిమంతులుగా జీవించడానికి ఇతర సలహాలను అందించడంతో పాటు, నేటికీ వర్తించే రెండు సూత్రాలను ప్రభువు నొక్కిచెప్పారు.

మొదటిది, “గానముతోను, సంగీతముతోను, నాట్యముతోను, కృతజ్ఞతాస్తుతులతోను ప్రభువును స్తుతించుము”28 అని ఆయన వారిని ప్రోత్సహించారు.

రెండవది, వారికి “దుఃఖము కలిగిన యెడల, నీ ఆత్మ ఆనందించునట్లు నీ దేవుడైన ప్రభువును వినయముతో ప్రార్థించుము”29 అని ప్రభువు ఉపదేశించారు.

ఈ రెండు హెచ్చరికలు మన కాలము కొరకు గొప్ప ఉపదేశాలు. స్తుతులు, సంగీతము మరియు కృతజ్ఞతలు నిండిన జీవితాలు ప్రత్యేకంగా దీవించబడ్డాయి. ఆనందంగా ఉండడం మరియు ప్రార్థన ద్వారా పరలోక సహాయంపై ఆధారపడడం అనేవి క్రీస్తు యొక్క సమాధానకరమైన శిష్యులుగా ఉండేందుకు ఒక శక్తివంతమైన విధానం. ధైర్యము తెచ్చుకోవడానికి ఎల్లప్పుడు ప్రయత్నించడం ఆత్మలో కృంగిపోకుండా ఉండేందుకు సహాయపడుతుంది.

గ్రాహకమైన కీర్తన యొక్క చివరి పంక్తి అందమైన పద్ధతిలో అంతిమ సమాధానాన్ని తెలియజేస్తుంది:“పరలోకము స్వస్థపరచలేని దుఃఖం భూమిపైన ఏదీ లేదు.”30

“క్రీస్తు యొక్క సమాధానకరమైన శిష్యులు” ఈ జీవితంలో వ్యక్తిగత శాంతిని, మహిమకరమైన పరలోక పునస్సమాగమమును కనుగొంటారని ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అపొస్తలునిగా నేను సాక్ష్యమిస్తున్నాను. రక్షకుని దైవత్వము మరియు ఆయన ప్రాయశ్చిత్తము యొక్క వాస్తవికతను గూర్చి స్థిరమైన నా సాక్ష్యాన్నిస్తున్నాను. ఆయన మన రక్షకుడు మరియు విమోచకుడైయున్నారు. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.