సర్వసభ్య సమావేశము
ముద్రవేయు శక్తి
2023 అక్టోబరు సర్వసభ్య సమావేశము


ముద్రవేయు శక్తి

ముద్రవేయు శక్తి దేవుని పిల్లలకు వ్యక్తిగత రక్షణను, కుటుంబ ఉన్నతస్థితిని విశ్వవ్యాప్తంగా అందుబాటులో ఉంచుతుంది.

కడవరి దినములలో, ఇశ్రాయేలు సంతతివారైన ప్రభువు యొక్క ప్రాచీన నిబంధన జనులు “తమ దీర్ఘ విభజన నుండి, సముద్ర ద్వీపముల నుండి మరియు భూమి యొక్క నాలుగు చెరగుల నుండి సమకూర్చబడుదురు”2 మరియు “భూమిపైన వారి స్వాస్థ్యమైన దేశములకు పునఃస్థాపించబడుదురు”3 అని యెషయా కాలం నుండి ప్రవచించబడింది.1 “ఇది ఈ రోజు భూమిపై జరుగుతున్న అత్యంత ముఖ్యమైన విషయం” అని పేర్కొంటూ అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఈ సమకూర్పు గురించి తరచుగా మరియు శక్తివంతంగా మాట్లాడారు.4

ఈ సమకూర్పు యొక్క ఉద్దేశ్యం ఏమిటి?

ప్రవక్త జోసెఫ్ స్మిత్‌కు బయల్పాటు ద్వారా, నిబంధన జనుల రక్షణగా ప్రభువు ఒక ఉద్దేశ్యాన్ని గుర్తించారు. ఆయన ఇలా చెప్పారు, “సీయోను ప్రదేశములో, ఆమె స్టేకులలో సమకూడుట రక్షణ కొరకు, తుఫాను నుండి ఆశ్రయం కొరకు, ఏమియు కలపబడకుండా భూమియంతటిపై క్రుమ్మరించబడబోవు దేవుని ఉగ్రతనుండి తప్పించుకొనుట కొరకు జరుగును.”5. ఈ సందర్భంలో “ఉగ్రత” అనేదానిని దేవుని చట్టాలు మరియు ఆజ్ఞలకు విస్తృతమైన అవిధేయత యొక్క సహజ పరిణామంగా అర్థం చేసుకోవచ్చు.

మరీ ముఖ్యంగా, వాటిని పొందే వారందరికీ రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క దీవెనలను తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఈ సమకూర్పు జరుగుతున్నది. అబ్రాహాముకు ఇచ్చిన నిబంధన వాగ్దానాలు ఈ విధంగా నెరవేరినవి. ప్రభువు అబ్రాహాముతో అతని సంతానం మరియు యాజకత్వం ద్వారా “భూమి యొక్క సమస్త వంశములు, సువార్త యొక్క దీవెనలు, అనగా రక్షణ యొక్కయు, నిత్య జీవము యొక్కయు దీవెనలతో దీవించబడతాయి”6 అని చెప్పారు. అధ్యక్షులు నెల్సన్ దానిని ఈ విధంగా వ్యక్తపరిచారు: “మనం సువార్తను స్వీకరించి, బాప్తిస్మము తీసుకున్నప్పుడు, మనం యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామాన్ని మనపై తీసుకుంటాము. బాప్తిస్మము అనేది అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు మరియు వారి సంతానం కోసం పూర్వకాలము నుండి పురాతనంగా ప్రభువు ఇచ్చిన వాగ్దానాలన్నింటికీ ఉమ్మడి వారసులు కావడానికి దారితీసే మార్గము.”7

1836 లో, కర్ట్‌లాండ్ దేవాలయములో ప్రవక్త జోసెఫ్ స్మిత్‌కు మోషే ప్రత్యక్షమై “భూమి యొక్క నలుమూలల నుండి ఇశ్రాయేలీయులను పోగుచేయుటకు … సమకూర్చే తాళపుచెవులను ఇచ్చాడు.” 8 అదే సందర్భంలో, ఇది జరిగిన తరువాత, ఏలీయా ప్రత్యక్షమై “అబ్రాహాము సువార్త యొక్క యుగమును ఇచ్చి, మాయందు మా సంతానమునందు మా తరువాతి సమస్త తరములు దీవించబడునని చెప్పాడు.”9 ఈ అధికారంతో, మనం ఇప్పుడు యేసు క్రీస్తు సువార్తను—ఆయన ద్వారా విమోచన శుభవార్తను—భూమి పైనున్న అన్ని ప్రాంతాలకు మరియు ప్రజలకు తీసుకువెళుతున్నాము మరియు సువార్త నిబంధనను కోరుకునే వారందరినీ సమకూరుస్తాము. వారు “అబ్రహాము యొక్క సంతానముగా, సంఘము మరియు దేవుని రాజ్యముగా, దేవునిచేత ఎన్నుకోబడిన వారిగా” అవుతారు.10

అదే సందర్భంలో కర్ట్‌లాండ్ దేవాలయములో జోసెఫ్ స్మిత్ మరియు ఆలీవర్ కౌడరీలకు మూడవ పరలోక దూత కనిపించాడు. నేను ప్రవక్త ఏలీయా గురించి మాట్లాడుతున్నాను, అతను పునరుద్ధరించిన అధికారం మరియు తాళపుచెవుల గురించి నేను ఈ రోజు మాట్లాడాలనుకుంటున్నాను.11 అన్ని యాజకత్వ విధులను ధృవీకరించి, వాటిని భూమిపై మరియు పరలోకంలో బంధించేలా చేసే శక్తి—ముద్రవేయు శక్తి—తెరకు ఇరువైపులా నిబంధన జనులను సమకూర్చటానికి మరియు సిద్ధం చేయడానికి కీలకమైనది.

సంవత్సరాల క్రితం, ఏలీయా అవసరమైన యాజకత్వ అధికారాన్ని తీసుకువస్తారని మొరోనై జోసెఫ్ స్మిత్‌కు స్పష్టం చేశాడు: “ప్రవక్తయైన ఏలీయా ద్వారా యాజకత్వమును నేను మీకు బహిర్గతము చేయుదును.”12 జోసెఫ్ స్మిత్ తర్వాత ఇలా వివరించాడు: “ఏలీయాను ఎందుకు పంపించారు? అతను యాజకత్వం యొక్క అన్ని విధులలో నిర్వహించే అధికారం యొక్క తాళపుచెవులను కలిగి ఉన్నాడు కాబట్టి; మరియు అధికారం ఇవ్వబడకపోతే, విధులు ధర్మబద్ధంగా నిర్వహించబడలేవు”13—అంటే, విధులు కాలము మరియు నిత్యత్వము రెండింటిలో చెల్లుబాటు కావు.14

సిద్ధాంతము మరియు నిబంధనలలో ఇప్పుడు పవిత్రపరచి లేఖనములలో చేర్చబడిన ఒక బోధనలో, ప్రవక్త ఇలా పేర్కొన్నారు: “భూమిమీద లిఖించు లేదా బంధించు అధికారము పరలోకములోను బంధించును అనునది మనము చెప్పుకొను నిర్భయమైన సిద్ధాంతమని కొందరికి అనిపించవచ్చు. అయినప్పటికీ, లోకము యొక్క అన్ని యుగములలో, ప్రభువు ఏ మనుష్యునికైనను లేదా మనుష్య సమూహములకైనను వాస్తవముగా బయల్పాటు ద్వారా యాజకత్వపు యుగమును ఇచ్చిన ప్రతీసారి, ఈ అధికారము కూడా ఇవ్వబడెను. కాబట్టి, ప్రభువు నామములో అధికారముతో ఆ మనుష్యులు ఏది చేసినను, యథార్థముగా, విశ్వాసముగా చేసి, దానికి సరియైన, నమ్మకమైన వృత్తాంతమును లిఖించినప్పుడు, అది భూలోకములోను, పరలోకములోను ధర్మశాస్త్రమాయెను, ఘనుడైన యెహోవా శాసనములను బట్టి అది రద్దుచేయబడ లేకుండెను.”15

ముద్రవేయు అధికారము అనేది కొన్ని దేవాలయ విధులకు మాత్రమే వర్తిస్తుందని మనము భావిస్తాము, అయితే మరణం దాటి ఏవైనా విధులు చెల్లుబాటు అయ్యేలా చేయడానికి మరియు కట్టుబడి ఉండటానికి ఆ అధికారం అవసరం.16 ముద్రవేయు శక్తి మీ బాప్తిస్మంపై చట్టబద్ధత యొక్క ముద్రను అనుగ్రహిస్తుంది, ఉదాహరణకు, ఇది ఇక్కడ మరియు పరలోకములో గుర్తించబడుతుంది. అంతిమంగా, అన్ని యాజకత్వ విధులు సంఘ అధ్యక్షుడి తాళపుచెవుల క్రింద నిర్వహించబడతాయి మరియు అధ్యక్షులు జోసెఫ్ ఫీల్డింగ్ స్మిత్ వివరించినట్లుగా, “ఆయన [సంఘ అధ్యక్షుడు] మాకు అధికారం ఇచ్చారు, ఆయన మన యాజకత్వంలో ముద్రవేయు శక్తిని ఉంచారు, ఎందుకంటే ఆయన ఆ తాళపుచెవులను కలిగియున్నారు.”17

ఇశ్రాయేలును సమకూర్చటకు మరో ముఖ్యమైన ఉద్దేశ్యం ఉంది, మనం భూమిపై మరియు పరలోకంలో ముద్రవేయుట గురించి మాట్లాడేటప్పుడు, అంటే దేవాలయాల నిర్మాణం మరియు నిర్వహణ గురించి మాట్లాడేటప్పుడు దానికి ప్రత్యేక అర్థం ఉంది. ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ వివరించిన విధంగా: “ప్రపంచంలోని ఏ యుగంలోనైనా… దేవుని ప్రజలను సమకూర్చడానికి గల ఉద్దేశము ఏమిటి? … ప్రధాన లక్ష్యం ఏమిటంటే, యెహోవాకు తన మందిరపు విధులను మరియు ఆయన రాజ్య మహిమలను తన ప్రజలకు బయలుపరచగల ఒక ఆలయాన్ని నిర్మించడం మరియు జనులకు రక్షణ మార్గాన్ని బోధించడం; ఎందుకనగా కొన్ని నిర్దిష్టమైన విధులు మరియు సూత్రాలు కలవు, అవి బోధించబడి, ఆచరించబడినప్పుడు, వాటి ఉద్దేశము కొరకు నిర్మించిన ప్రదేశంలో లేదా గృహములో వాటిని చేయాలి.”18

యాజకత్వ విధులకు ముద్రవేయు అధికారం ఇచ్చే చెల్లుబాటులో, ప్రభువు చేత—ఆయన దేవాలయంలో నియమించబడిన స్థలంలో నిర్వహించబడే వివిధ విధి విధానాలు ఉన్నాయి. ఇక్కడ మనం ముద్రవేయు అధికారం యొక్క ఘనత మరియు పవిత్రతను చూస్తాము—ఇది దేవుని పిల్లలు భూమిపై ఎక్కడ మరియు ఎప్పుడు నివసించినా వారికి వ్యక్తిగత రక్షణను, కుటుంబ ఉన్నతస్థితిని విశ్వవ్యాప్తంగా అందుబాటులో ఉంచుతుంది. మరే ఇతర వేదాంతశాస్త్రం లేదా తత్వశాస్త్రం లేదా అధికారం సర్వముతో కూడిన అటువంటి అవకాశాన్ని సరిపోల్చలేదు. ఈ ముద్రవేయు అధికారం దేవుని న్యాయం, కనికరం మరియు ప్రేమ యొక్క పరిపూర్ణ ప్రత్యక్షత.

ముద్రవేయు అధికారం సౌలభ్యంతో, మన హృదయాలు సహజంగా ముందు వెళ్ళిన వారి వైపు మళ్ళుతాయి. కడవరి దిన సమకూర్పు తెరను దాటుకొని నిబంధనలోనికి వెళుతుంది. దేవుని పరిపూర్ణ క్రమంలో, మన పూర్వీకులైన “తండ్రులతో” శాశ్వతమైన సంబంధా‌లను ఏర్పరచుకోకుండా సజీవులు దాని సంపూర్ణతతో నిత్యజీవాన్ని అనుభవించలేరు. అదేవిధంగా, ఇప్పటికే అవతలి వైపు ఉన్నవారు లేదా ముద్రల ప్రయోజనం లేకుండా మరణపు తెరను దాటబోయే వారి పురోగతి, ప్రాతినిధ్య విధులు వారిని వారి వారసులతో మరియు మనతో దైవిక క్రమములో బంధించే వరకు అసంపూర్ణంగా ఉంది.19 తెరకు ఇరువైపులా ఒకరికొకరు సహాయం చేసుకునే నిబద్ధతను నిబంధన వాగ్దానంగా వర్గీకరించవచ్చు, ఇది క్రొత్త మరియు శాశ్వతమైన నిబంధనలో భాగం. జోసెఫ్ స్మిత్ మాటల్లో చెప్పాలంటే, “చనిపోయిన మన వాళ్ళు మొదటి పునరుత్థానంలో [మనతో పాటు] బయటకు వచ్చేలా ముద్ర వేయాలనుకుంటున్నాము.”20

ముద్రవేయు శక్తి యొక్క అత్యున్నతమైన మరియు పవిత్రమైన ప్రత్యక్షత వివాహంలో ఒక పురుషుడు మరియు స్త్రీ యొక్క నిత్యత్వ కలయికలో మరియు వారి తరాలన్నిటి ద్వారా మానవజాతి యొక్క అనుసంధానంలో ఉంది. ఈ విధులను నిర్వహించే అధికారం చాలా పవిత్రమైనది కాబట్టి, సంఘ అధ్యక్షుడు దానిని ఇతరులకు అప్పగించే బాధ్యతను స్వయంగా పర్యవేక్షిస్తారు. అధ్యక్షులు గార్డన్ బి. హింక్లి ఒక సందర్భంలో ఇలా అన్నారు, “పునఃస్థాపన యొక్క దుఃఖం, వేదన మరియు బాధల నుండి కుటుంబాలను శాశ్వతంగా బంధించే పవిత్ర యాజకత్వం యొక్క ముద్రించు శక్తి కంటే మరేమీ బయటకు రాకపోతే, దానికి చెల్లించిన వెల వాటన్నింటికీ తగినదని నేను చాలాసార్లు చెప్పాను.”21

శాశ్వతమైన కుటుంబాలను సృష్టించే మరియు తరాలను ఇక్కడ మరియు ఆ తర్వాత కలిపే ముద్రలు లేకుండా, మనం మూలాలు లేదా శాఖలు లేకుండా నిత్యత్వంలో మిగిలిపోతాము—అంటే పూర్వీకులుగా లేదా వారి సంతానముగా వుండము. స్వేచ్ఛగా తిరుగుతున్న సంబంధాలులేని వ్యక్తుల యొక్క ఈ స్థితి ఒకవైపు లేదా దేవుడు నియమించిన వివాహం మరియు కుటుంబ బంధాలను ధిక్కరించే సంబంధాలు మరోవైపు, భూమి యొక్క సృష్టి యొక్క ఉద్దేశ్యాన్ని నిరాశపరుస్తాయి.22 అది ప్రమాణంగా మారితే, భూమి శాపంతో కొట్టబడినట్లే లేదా ప్రభువు రాకడలో “పూర్తిగా వృధా” అయినట్లే అవుతుంది.23

“స్త్రీ పురుషుల మధ్య వివాహం దేవునిచేత ఎందుకు నిర్ణయించబడిందో మరియు ఆయన పిల్లల నిత్య గమ్యం కోసం సృష్టికర్త యొక్క ప్రణాళికలో కుటుంబం ఎందుకు ప్రధానమైనదో” మనం చూడవచ్చు.24 అదే సమయంలో, ఈ అసంపూర్ణ వర్తమానంలో, కొంతమంది దృష్టికి ఇది వాస్తవం కాదు లేదా వాస్తవిక అవకాశం కూడా కాదని మనము గుర్తించాము. అయితే మనకు క్రీస్తునందు నిరీక్షణ ఉంది. మనం ప్రభువు కోసం ఎదురుచూస్తున్నప్పుడు, అధ్యక్షులు ఎమ్. రస్సెల్ బాల్లర్డ్ మనకు ఇలా గుర్తు చేశారు, “సువార్త నిబంధనలను పాటించడంలో విశ్వాసపాత్రులైన ప్రతీ ఒక్కరికి ఉన్నతస్థితి పొందే అవకాశం ఉందని లేఖనాలు మరియు కడవరి దిన ప్రవక్తలు ధృవీకరిస్తున్నారు.”25

కొందరు సంతోషం లేని, అనారోగ్యకరమైన కుటుంబ పరిస్థితులను అనుభవించారు మరియు నిత్య కుటుంబ సహవాసం కోసం తక్కువ కోరికను కలిగి ఉన్నారు. ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ ఈ పరిశీలన చేసారు: “మీ కుటుంబంలో విడాకుల వలన హృదయ వేదనను అనుభవించిన మీరు లేదా నమ్మకాన్ని ఉల్లంఘించిన వేదనను అనుభవించిన మీరు దయచేసి గుర్తుంచుకోండి, [కుటుంబాల కోసం దేవుని నమూనా] మీతో మళ్లీ ప్రారంభమవుతుంది! మీ తరాల గొలుసులోని ఒక కొక్కెం తెగిపోయి ఉండవచ్చు, కానీ ఇతర ధర్మబద్ధమైన కొక్కెములు మరియు గొలుసులో మిగిలి ఉన్నవి శాశ్వతంగా ముఖ్యమైనవి. మీరు మీ గొలుసుకు బలాన్ని జోడించవచ్చు మరియు విరిగిన కొక్కెములను పునరుద్ధరించడంలో కూడా సహాయపడవచ్చు. ఆ పని ఒక్కొక్కటిగా నెరవేరుతుంది.”26

గత జూలైలో ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ గారి భార్యయైన సోదరి పాట్ హాలండ్ అంత్యక్రియల సేవల్లో, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా బోధించారు: “కాలక్రమేణా, పాట్రీసియా మరియు జెఫ్రీ మళ్లీ కలుస్తారు. దేవుడు విశ్వాసులైన తన పిల్లల కోసం ఉంచిన ఆనందపు సంపూర్ణతను అనుభవించడానికి వారి పిల్లలు మరియు తమ నిబంధనను కొనసాగించే వారి సంతానం తరువాత చేరతారు. దీనిని బట్టి, పాట్రీసియా జీవితంలో అత్యంత ముఖ్యమైన తేదీ ఆమె పుట్టిన తేదీ లేదా ఆమె మరణించిన తేదీ కాదని మనం తెలుసుకున్నాము. 1963, జూన్ 7న ఆమె మరియు జెఫ్ సెయింట్ జార్జ్ దేవాలయంలో ముద్రవేయుబడిన తేదీ ఆమెకు అత్యంత ముఖ్యమైన రోజు. … ఇది ఎందుకు చాలా ముఖ్యమైనది? ఎందుకంటే భూమి సృష్టించబడటానికి ముఖ్య కారణం, కుటుంబాలు ఏర్పరచబడి, ఒకరికొకరు ముద్రవేయబడడం. రక్షణ వ్యక్తిగత విషయమైతే, ఉన్నతస్థితి కుటుంబ విషయమైయున్నది. ఒంటరిగా ఎవరూ ఉన్నతస్థితికి వెళ్ళలేరు.”

కొంతకాలం క్రితం, నేను మరియు నా భార్య బౌంటిఫుల్ యూటా దేవాలయము యొక్క ముద్రవేయు గదిలో ఒక ప్రియమైన స్నేహితురాలిని కలిసాము. నేను మొదటిసారిగా ఈ స్నేహితురాలిని ఆమె చిన్నతనంలోనే అర్జెంటీనాలోని కార్డోబాలో కలిశాను. నేను మరియు నా సువార్త సహచరుడు మిషను కార్యాలయానికి కొద్ది దూరంలో ఉన్న వ్యక్తులను సంప్రదిస్తూ ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు, ఆమె తలుపు తీసింది. ఆమె, ఆమె తల్లి మరియు ఆమె తోబుట్టువులు తగిన సమయంలో సంఘములో చేరారు మరియు వారు విశ్వాసం గల సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు ఆమె ఒక గొప్ప స్త్రీ మరియు మరణించిన ఆమె తల్లిదండ్రులను ఒకరితో ఒకరిని ఈరోజు ముద్రవేయడానికి మరియు తరువాత ఆమెతో ముద్ర వేయడానికి మేము దేవాలయంలో ఉన్నాము.

చాలాకాలంగా స్నేహితులుగా మారిన ఒక జంట బలిపీఠం వద్ద ఆమె తల్లిదండ్రులకు ప్రాతినిధ్యం వహించారు. అది ఒక భావోద్వేగమైన క్షణం, మా అర్జెంటీనా స్నేహితురాలు ఆమె తల్లిదండ్రులతో ముద్ర వేయబడినప్పుడు అది మరింత మధురంగా మారింది. ప్రపంచానికి దూరంగా ప్రశాంతమైన మధ్యాహ్నం మేము కేవలం ఆరుగురం మాత్రమే ఉన్నాము, అయినప్పటికీ భూమిపై ఎప్పుడూ జరిగే ముఖ్యమైన విషయాలలో ఒకటి జరుగుతోంది. ఒక యువ సువార్తికునిగా ఆమె తలుపు తట్టడం నుండి ఇప్పటి వరకు, చాలా సంవత్సరాల తరువాత, ఆమె తల్లిదండ్రులతో మరియు గత తరాలతో ఆమెను అనుసంధానించే ముద్రవేయు విధులను అమలు చేయడం ద్వారా నా పాత్ర మరియు అనుబంధం పూర్తి స్థాయికి చేరుకున్నందుకు నేను సంతోషించాను.

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో నిత్యం జరుగుతున్న దృశ్యం ఇది. నిబంధన జనులను సమకూర్చడంలో ఇది అంతిమ దశ. ఇది యేసు క్రీస్తు యొక్క సంఘములో మీ సభ్యత్వం యొక్క అత్యున్నతమైన విశేషాధికారం. మీరు ఆ విశేషాధికారాన్ని విశ్వసనీయంగా వెతుకుతున్నప్పుడు, కాలక్రమంలో లేదా నిత్యత్వంలో అది ఖచ్చితంగా మీకు చెందుతుందని నేను వాగ్దానం చేస్తున్నాను.

జోసెఫ్ స్మిత్ ద్వారా భూమిపై పునరుద్ధరించబడిన ముద్రవేయు శక్తి మరియు అధికారం నిజమైనవని నేను సాక్ష్యమిస్తున్నాను, తద్వారా భూమిపై బంధించబడినది నిజంగా పరలోకమునందు బంధించబడుతుంది. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ సంఘ అధ్యక్షులని, ఈ రోజు భూమిపై తన తాళపుచెవుల ద్వారా ఈ అతీంద్రియ శక్తి వినియోగాన్ని నిర్దేశిస్తున్న ఏకైక వ్యక్తియని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము అమర్త్యత్వాన్ని ఒక వాస్తవికతగా మరియు కుటుంబ సంబంధాల ఉన్నతస్థితి సాధ్యతను నిజమైనదిగా చేసిందని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.