సర్వసభ్య సమావేశము
యువతరములోని నిబంధన జనుల స్వరాన్ని సంరక్షించుట
2023 అక్టోబరు సర్వసభ్య సమావేశము


యువతరములోని నిబంధన జనుల స్వరాన్ని సంరక్షించుట

యేసే క్రీస్తని లోతుగా మరియు ప్రత్యేకంగా తెలుసుకోవడంలో మన పిల్లలకు సహాయపడటం మన అత్యంత పవిత్రమైన బాధ్యతలలో ఒకటి.

మోర్మన్ గ్రంథములోని అత్యంత హత్తుకునే క్షణాలలో ఒకటి, పునరుత్థానుడైన రక్షకుడు సమృద్ధి దేశమందున్న దేవాలయంలో ప్రజలను సందర్శించడం. బోధించడం, స్వస్థపరచడం మరియు విశ్వాసాన్ని పెంపొందించిన ఒక రోజు తర్వాత, యేసు ప్రజల దృష్టిని యువతరము వైపు మళ్లించారు: “అప్పుడు వారి చిన్నపిల్లలను తీసుకురమ్మని ఆయన ఆజ్ఞాపించెను.”1 ఆయన వారి కొరకు ప్రార్థించి ఒక్కొక్కరిని ఆశీర్వదించారు. ఆ అనుభవం ఎంతగా కదిలించిందంటే రక్షకుడు తనకుతానే అనేకసార్లు కన్నీళ్లు విడిచెను.

అప్పుడు, యేసు సమూహముతో మాట్లాడుతూ, వారితో అన్నారు:

“మీ చిన్నవారిని చూడుడి.

“మరియు వారు కనుగొనుటకు చూడగా … పరలోకములు తెరువబడుటను చూచిరి, మరియు పరలోకము నుండి దూతలు దిగివచ్చి, వారి పిల్లలకు పరిచర్య చేయుట చూచిరి.”2

ఈ అనుభవం గురించి నేను తరచుగా ఆలోచించాను. ఇది ప్రతి వ్యక్తి హృదయాన్ని కరిగించియుంటుంది! వారు రక్షకుడిని చూశారు. వారు ఆయనను భావించారు. వారు ఆయనను ఎరుగుదురు. ఆయన వారికి బోధించారు. ఆయన వారిని ఆశీర్వాదించారు. మరియు ఆయన వారిని ప్రేమించారు. ఈ పవిత్రమైన సంఘటన తర్వాత, ఈ పిల్లలు పెరుగుతూ శాంతి, శ్రేయస్సు మరియు తరతరాలుగా కొనసాగిన క్రీస్తువంటి ప్రేమతో కూడిన సమాజాన్ని స్థాపించడానికి సహాయపడటంలో ఆశ్చర్యం లేదు.3

మన పిల్లలు యేసు క్రీస్తుతో అలాంటి అనుభవాలను పొందగలిగితే—వారి హృదయాలను ఆయనతో ఏదైనా బంధించగలిగితే అది అద్భుతమైనది కాదా! మోర్మన్ గ్రంథంలో ఆ తల్లిదండ్రులను ఆహ్వానించినట్లుగా, మన పిల్లలను తన వద్దకు తీసుకొనిరావాలని ఆయన మనలను ఆహ్వానిస్తున్నారు. ఈ పిల్లలు చేసిన విధంగానే వారి రక్షకుని మరియు విమోచకుని తెలుసుకోవడంలో మనము వారికి సహాయపడగలము. లేఖనములలో రక్షకుని ఎలా కనుగొనాలో మరియు ఆయనపై వారి పునాదులు ఎలా నిర్మించాకోవాలో మనం వారికి చూపించవచ్చు.4

ఇటీవల, ఒక మంచి స్నేహితుడు ఒక బండ మీద తన ఇంటిని నిర్మించిన తెలివైన వ్యక్తి యొక్క ఉపమానం గురించి నేను ఇంతకు ముందు గమనించని విషయం నాకు నేర్పించాడు. లూకాలోని వృత్తాంతం ప్రకారం, తెలివైన వ్యక్తి తన ఇంటికి పునాది వేసినప్పుడు, అతను “లోతుగా తవ్వాడు.”5 ఇది సాధారణమైనది లేదా సామాన్యమైన ప్రయత్నము కాదు—దీనికి కృషి అవసరం!

మన విమోచకుడైన యేసు క్రీస్తు అనే బండ మీద మన జీవితాలను నిర్మించుకోవడానికి, మనం లోతుగా త్రవ్వాలి మన జీవితాలలో ఉన్న అస్థిరమైన లేదా అనవసరమైన దేనినైనా తొలగిస్తాము. ఆయనను కనుగొనేంత వరకు తవ్వుతూనే ఉంటాము. మరియు మనము మన పిల్లలకు పవిత్రమైన విధులు మరియు నిబంధనలతో కట్టుబడి ఉండమని బోధిస్తాము, తద్వారా వ్యతిరేక తుఫానులు మరియు వరదలు వచ్చినప్పుడు, “[వారు] కట్టబడిన ఆ పునాది కారణంగా” అవి ఖచ్చితంగా వారిపై తక్కువ ప్రభావం చూపుతాయి.6

ఈ రకమైన బలం వెంటనే రాదు. ఇది ఆత్మీయ వారసత్వం వలె తరువాతి తరానికి అందించబడదు. ప్రతి వ్యక్తి ఆ బండను కనుగొనడానికి లోతుగా త్రవ్వాలి.

మోర్మన్ గ్రంథంలోని మరొక వృత్తాంతం నుండి ఈ పాఠాన్ని మనం నేర్చుకుంటాము. రాజైన బెంజమిన్ తన ప్రజలకు తన చివరి ప్రసంగం చేస్తున్నప్పుడు, వారు అతని మాటలు వినడానికి కుటుంబాలుగా గుమిగూడారు.7 రాజైన బెంజమిన్ యేసు క్రీస్తు గురించి శక్తివంతమైన సాక్ష్యమిచ్చాడు, మరియు అతని సాక్ష్యము వలన ప్రజలు లోతుగా కదిలించబడ్డారు. వారు ఇలా ప్రకటించారు:

“ఆత్మ … మాయందు లేక మా హృదయములందు గొప్ప మార్పును కలుగజేసెను. …

“మరియు మా శేష దినములన్నియు … మేము ఆయన చిత్తమును చేయుటకు మా దేవుని యొక్క నిబంధనలతోనికి ప్రవేశించుటకు మేము ఆశించుచున్నాము.”8

అలా లోతుగా పరివర్తన చెందిన తల్లిదండ్రులతో ఉన్న చిన్న పిల్లలు చివరికి పరివర్తన చెంది, వారికై వారు నిబంధనలు చేసుకుంటారని ఒకరు ఆశించవచ్చు. అయినప్పటికీ, కొన్ని కారణాల వల్ల వృతాంతములో పేర్కొనబడలేదు కాని, తల్లిదండ్రులు చేసిన నిబంధన వారి పిల్లలలో కొంతమందితో నిర్వహణ పొందలేదు. అనేక సంవత్సరాల తర్వాత, “రాజైన బెంజమిన్ తన ప్రజలతో మాట్లాడే సమయంలో చిన్నపిల్లలైయుండి అతని మాటలను గ్రహించలేకపోయిన అనేకమంది యువతరం ఉన్నారు; మరియు వారు తమ తండ్రుల సంప్రదాయాన్ని విశ్వసించలేదు.”

“వారు మృతుల పునరుత్థానమును గూర్చి లేదా క్రీస్తు యొక్క రాకడను గూర్చి చెప్పబడిన దానిని విశ్వసించలేదు. …”

“వారు బాప్తిస్మము పొందకుండ ఉండిరి లేదా సంఘమును వారు చేరలేదు. వారి అవిశ్వాసమును బట్టి వారు వేరైన జనులుగా ఉండిరి.”9

ఎంత గంభీరమైన ఆలోచన! యువతరానికి, యేసు క్రీస్తునందు విశ్వాసం “తమ పితరుల సంప్రదాయంగా” ఉంటే సరిపోదు. వారు క్రీస్తుపై విశ్వాసాన్ని స్వంతం చేసుకోవాలి. దేవుని నిబంధన ప్రజలుగా, మన పిల్లల హృదయాలలో ఆయనతో నిబంధనలను చేయడానికి మరియు పాటించాలనే కోరికను క్రమంగా బోధించి బలమైన ప్రభావం కలిగియుండునట్లు ఎలా చేయగలం?

నీఫై ఉదాహరణను అనుసరించడం ద్వారా మనం ప్రారంభించవచ్చు: ”మేము క్రీస్తు గురించి మాట్లాడుచున్నాము, క్రీస్తు నందు ఆనందించుచున్నాము, క్రీస్తు గురించి బోధించుచున్నాము, క్రీస్తును గూర్చి ప్రవచించుచున్నాము, మరియు మా ప్రవచనములను బట్టి మా పిల్లలు వారి యొక్క పాపముల యొక్క నివృత్తి కొరకు వారు ఏ మూలాధారమును చూడవలెనో మా సంతానము తెలుసుకొనునట్లు వ్రాయుచున్నాము.”10 నీఫై మాటలు మన పిల్లలకు క్రీస్తు గురించి బోధించడానికి స్థిరమైన, నిరంతర ప్రయత్నాన్ని సూచిస్తున్నాయి. నిబంధన జనుల యొక్క స్వరం యువతరం చెవులలో నిశ్శబ్దంగా లేదని మరియు యేసు ఆదివారానికి మాత్రమే సంబంధించిన అంశం కాదని మనము నిశ్చయపరచగలము.11

నిబంధన జనుల స్వరం మన స్వంత సాక్ష్యపు మాటలలో కనిపిస్తుంది. ఇది జీవము గల ప్రవక్తల మాటలలో కనిపిస్తుంది. మరియు అది లేఖనములలో శక్తివంతంగా భద్రపరచబడింది. అక్కడ మన పిల్లలు యేసును తెలుసుకుంటారు మరియు వారి ప్రశ్నలకు సమాధానాలు కనుగొంటారు. అక్కడ వారంతట వారు క్రీస్తు యొక్క సిద్ధాంతాన్ని నేర్చుకుంటారు. అక్కడే వారు నిరీక్షణ కనుగొంటారు. ఇది జీవితాంతం సత్యాన్ని వెదకడానికి మరియు నిబంధన మార్గంలో జీవించడానికి వారిని సిద్ధం చేస్తుంది.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇచ్చిన ఈ సలహా నాకు చాలా ఇష్టమైనది:

“ఆయనను వినడానికి మనము ఎక్కడికి వెళ్ళగలము?

“మనం లేఖనాలకు వెళ్ళవచ్చు. అవి యేసు క్రీస్తు గురించి మరియు ఆయన సువార్త, ఆయన ప్రాయశ్చిత్తం యొక్క పరిమాణం, మరియు మన తండ్రి యొక్క గొప్ప సంతోషం మరియు విమోచన ప్రణాళిక గురించి బోధిస్తాయి. ప్రత్యేకించి కల్లోలం పెరుగుతున్న ఈ రోజుల్లో, ఆత్మీయ మనుగడకు దేవుని వాక్యంలో రోజువారీ నిమగ్నత చాలా ముఖ్యమైనది. మనం రోజూ క్రీస్తు మాటలను విందారగిస్తున్నప్పుడు, మనం ఎదుర్కోవలసి వస్తుందని మనం ఎప్పుడూ అనుకోని ఇబ్బందులకు ఎలా స్పందించాలో క్రీస్తు మాటలు మనకు చెబుతాయి.”12

కాబట్టి క్రీస్తు మాటలను విందారగించడం మరియు ఆయనను వినడం ఎలా అనిపిస్తుంది? సరే, మీకు ఏది ఉత్తమంగా అనిపిస్తోందో అది పని చేస్తుంది! అది రండి, నన్ను అనుసరించండి ఉపయోగించి మీ లేఖనాల అధ్యయనంలో పరిశుద్ధాత్మ మీకు బోధించిన విషయాల గురించి మాట్లాడటానికి మీ కుటుంబంతో సమావేశమై ఉండవచ్చు. ఇది ప్రతిరోజూ మీ పిల్లలతో కలిసి లేఖనాల నుండి కొన్ని వచనాలను చదవడం మరియు మీరు కలిసి సమయాన్ని వెచ్చిస్తున్నప్పుడు మీరు నేర్చుకున్న వాటిని చర్చించడానికి అవకాశాల కోసం వెతుకుతుండవచ్చు. మీకు మరియు మీ కుటుంబానికి ఏది పని చేస్తుందో కనుగొని, ప్రతిరోజూ కొంచెం మెరుగ్గా చేయడానికి ప్రయత్నించండి.

రక్షకుని విధానములో బోధించుట నుండి ఈ అంతర్దృష్టిని పరిగణించండి: “ఒక్కొక్కటిగా పరిగణిస్తే, ఒక గృహ సాయంకాలం, లేఖన అధ్యయన సమయం లేదా సువార్త సంభాషణ ఎక్కువ సాధించినట్లు అనిపించకపోవచ్చు. కానీ కాలక్రమేణా స్థిరంగా పునరావృతమయ్యే చిన్న, సాధారణ ప్రయత్నాల సమీకరణ అప్పుడప్పుడు సంభవించే స్మరణీయ క్షణం లేదా అద్భుతమైన పాఠము కంటే మరింత శక్తివంతమైనది మరియు బలపరిచేది కాగలదు. … కాబట్టి మానవద్దు, మరియు ప్రతీసారి ఏదైనా గొప్పగా సాధించడం గురించి చింతించకండి. కేవలం మీ ప్రయత్నాలలో స్థిరంగా ఉండండి.”13

యేసే క్రీస్తని, సజీవుడగు దేవుని కుమారుడు, వారి వ్యక్తిగత రక్షకుడు మరియు విమోచకుడు, ఆయన సంఘముకి అధిపతిగా ఉన్నాడని, మన పిల్లలకు లోతుగా మరియు ప్రత్యేకంగా తెలుసుకోవడంలో సహాయపడటం మన అత్యంత పవిత్రమైన బాధ్యతలలో ఒకటి! ఆయన విషయానికి వచ్చినప్పుడు మన నిబంధన స్వరం మాట్లాడకుండా వుండడానికి లేదా మౌనంగా ఉండటానికి మనం అనుమతించరాదు.

మీరు ఈ పాత్రలో కొంచెం సరిపోరని భావించవచ్చు, కానీ మీరు ఎప్పుడూ ఒంటరిగా భావించకూడదు. ఉదాహరణకు, తల్లిదండ్రుల కోసం బోధకుని సలహా సమావేశాలను నిర్వహించడానికి వార్డు సభలకు అధికారం ఇవ్వబడింది. ఈ త్రైమాసిక సమావేశాలలో, తల్లిదండ్రులు ఒకరి అనుభవాల నుండి మరొకరు నేర్చుకోగలరు, వారు తమ కుటుంబాలను ఎలా బలపరుచుకుంటున్నారో చర్చించగలరు మరియు క్రీస్తువంటి బోధనలోని ముఖ్య సూత్రాలను నేర్చుకోవచ్చు. ఈ సమావేశం సంఘము యొక్క రెండవ గడియలో జరగాలి.14 దీనికి బిషప్పు ఎంపిక చేసిన వార్డు సభ్యుడు నాయకత్వం వహిస్తాడు మరియు రక్షకుని విధానములో బోధించుటను ప్రాథమిక వనరుగా ఉపయోగించి సాధారణ బోధన సభ సమావేశాల ఆకృతిని అనుసరిస్తుంది.15 బిషప్పులారా, ప్రస్తుతం మీ వార్డులో తల్లిదండ్రుల కోసం బోధకుని సలహా సమావేశాలు జరగకపోతే, మిమ్మల్ని మీరు నిర్వహించుకోవడానికి మీ ఆదివారపు బడి అధ్యక్షుడు మరియు వార్డు సభతో కలిసి పని చేయండి.16

క్రీస్తులో నా ప్రియమైన మిత్రులారా, మీరు అనుకున్నదానికంటే చాలా బాగా చేస్తున్నారు. అలాగే పని చేస్తూ ఉండండి. మీ పిల్లలు చూస్తున్నారు, వింటున్నారు, మరియు నేర్చుకుంటున్నారు. మీరు వారికి బోధించేటప్పుడు, దేవుని ప్రియమైన కుమారులు మరియు కుమార్తెలుగా వారి నిజమైన స్వభావాన్ని మీరు తెలుసుకుంటారు వారు రక్షకుని కొంత కాలం పాటు మరచిపోవచ్చు, కానీ , ఆయన వారిని ఎప్పటికీ మరచిపోడని నేను మీకు వాగ్దానం చేస్తున్నాను! పరిశుద్ధాత్మ వారితో మాట్లాడే ఆ క్షణాలు వారి హృదయాలలో మరియు మనస్సులలో స్థిరంగా ఉంటాయి. మరియు ఒక రోజు మీ పిల్లలు ఈనస్ యొక్క సాక్ష్యాన్ని ప్రతిధ్వనిస్తారు: “నా తల్లిదండ్రులు నీతిమంతులని ఎరిగియుంటినిఏలయనగా [వారు] నాకు తన భాషలో, ప్రభువు యొక్క శిక్షణలో మరియు ఉపదేశములో బోధించెను—దాని నిమిత్తము నా దేవుని నామము స్తుతించబడును గాక.”17

రక్షకుని ఆహ్వానాన్ని అంగీకరించి మన పిల్లలను ఆయన వద్దకు తీసుకురండి. మనం ఆ విధంగా చేసినట్లైతే, వారు ఆయనను చూస్తారు. వారు ఆయనను అనుభూతి చెందుతారు. వారు ఆయనను యెరుగుదురు. ఆయన వారికి బోధిస్తారు. ఆయన వారిని ఆశీర్వాదిస్తారు. మరియు ఆయన వారిని చాలా ఎక్కువ ప్రేమించారు. ఓహ్, నేను ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నాను. యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో, ఆమేన్.

వివరణలు

  1. 3 నీఫై 17:11.

  2. 3 నీఫై 27:23–24; 3 నీఫై 17:11–22 కూడా చూడండి.

  3. 4 నీఫై 1:1–22 చూడండి.

  4. లూకా 6:47–49; హీలమన్ 5:12 చూడండి.

  5. లూకా 6:48.

  6. హీలమన్ 5:12.

  7. మోషైయ 2:5 చూడండి.

  8. మోషైయ 5:2, 5. గమనించండి “చిన్నపిల్లలు తప్ప నిబంధనలోనికి ప్రవేశించక, తమపై క్రీస్తు నామమును ధరించకయున్న ఒక్క ఆత్మ కూడా అక్కడ లేకుండెను” (మోషైయ 6:2).

  9. మోషైయ 26:1--2, 4.

  10. 2 నీఫై 25:26.

  11. “యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్తలో బోధించుటకు చాలా విషయాలు ఉన్నాయి—సూత్రాలు, ఆజ్ఞలు, ప్రవచనాలు, మరియు లేఖన కథలు. కానీ ఇవన్నీ ఒకే చెట్టు కొమ్మలు, ఎందుకంటే వీటన్నింటికీ ఒకే ఉద్దేశ్యము కలదు: జనులందరూ క్రీస్తు యొద్దకు వచ్చి, ఆయనలో పరిపూర్ణులగుటకు సహాయము చేయుట (జేరమ్ 1:11; మొరోనై 10:32 చూడండి). కాబట్టి మీరు ఏమి బోధిస్తున్నప్పటికీ, మీరు నిజంగా యేసు క్రీస్తు గురించి మరియు ఆయన వలె మారడం గురించి బోధిస్తున్నారని గుర్తుంచుకోండి” (రక్షకుని విధానములో బోధించుట: For All Who Teach in the Home and in the Church [2022], 6).

  12. రస్సెల్ ఎమ్. నెల్సన్, “ఆయనను వినుము,” లియహోనా, 2020 మే, 89.

  13. (రక్షకుని విధానములో బోధించుట31 చూడండి.)

  14. ప్రాథమికలో బోధించే తల్లిదండ్రుల కోసం 20 నిమిషాల ప్రాథమిక పాటల సమయంలో సమావేశం లేదా మరొక సమయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడం వంటి ప్రత్యేక వసతి కల్పించవచ్చు. (ప్రధాన చేతి పుస్తకం: యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘలో సేవ చేయుట, 17.4, గ్రంధాలయము చూడండి).

  15. సభ్యులు మరియు నాయకులు పంపిణీ సేవల ద్వారా రక్షకుని విధానములో బోధించుట ఆర్డరు చేయవచ్చు. ఇది సువార్త గ్రంధాలయంలో డిజిటల్‌గా కూడా అందుబాటులో ఉంది.

  16. ప్రధాన చేతి పుస్తకం13.5 చూడండి.

  17. ఈనస్ 1:1 మోర్మన్ గ్రంథంలోని అవిశ్వాసుల యువతరంలో చిన్నవాడగు ఆల్మా మరియు మోషైయ యొక్క కుమారులు ఉన్నారని గుర్తుంచుకోండి. చిన్నవాడగు ఆల్మా చివరకు తన జీవితాన్ని మార్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తించినప్పుడు, అతను తన తండ్రి యేసు క్రీస్తు గురించి ప్రవచించిన వాటిని గుర్తుచేసుకున్నాడు—అవి అల్మా గతంలో స్పష్టంగా విస్మరించిన బోధనలు. కానీ దాని జ్ఞాపకం అలాగే ఉండిపోయింది మరియు ఆ జ్ఞాపకం ఆల్మాను ఆధ్యాత్మికంగా రక్షించింది (ఆల్మా 36:17–20 చూడండి).