సర్వసభ్య సమావేశము
సంతోషము యొక్క ప్రమాణ చిహ్నాలు
2023 అక్టోబరు సర్వసభ్య సమావేశము


సంతోషము యొక్క ప్రమాణ చిహ్నాలు

యేసు క్రీస్తు యొక్క పునాదిమీద కట్టబడియుండుట మన సంతోషానికి చాలా అవసరం.

చాలా సంవత్సరాల క్రితం వ్యాపారంపై విమానంలో ఉన్నప్పుడు, నెదర్లాండ్స్‌కి చెందిన ఒక వ్యక్తి పక్కన నేను కూర్చున్నట్లు గుర్తించాను. నేను యువ మిషనరీగా బెల్జియం మరియు నెదర్లాండ్స్‌లో సేవ చేసినందున నేను అతనిని సందర్శించడానికి ఆతృతగా ఉన్నాను.

మేము పరిచయం అయినప్పుడు, అతను “సంతోషము యొక్క ఉపాధ్యాయుడు” అనే ప్రత్యేకమైన ఉద్యోగ శీర్షికతో తన వ్యాపార కార్డును నాకు ఇచ్చాడు.  నేను అతని అద్భుతమైన వృత్తి గురించి వ్యాఖ్యానించాను మరియు సంతోషము యొక్క ఉపాధ్యాయుడు ఏమి చేస్తాడని అడిగాను. అర్థవంతమైన సంబంధాలు, లక్ష్యాలను ఏర్పరచుకోవడం ద్వారా సంతోషకరమైన జీవితాన్ని ఎలా గడపాలో ప్రజలకు బోధిస్తానని అతడు అన్నాడు. “అది అద్భుతంగా ఉంది, కానీ ఆ సంబంధాలు మరణించిన తర్వాత ఎలా కొనసాగవచ్చో కూడా మీరు బోధిస్తే ఎలా ఉంటుంది మరియు జీవితం యొక్క ఉద్దేశ్యం ఏమిటి, మన బలహీనతలను మనం ఎలా అధిగమించగలం మరియు మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము వంటి ఆత్మ యొక్క ఇతర ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి?” అని బదులిచ్చాను. ఆ ప్రశ్నలకు మన దగ్గర సమాధానాలు ఉంటే అది అద్భుతంగా ఉంటుందని అతను ఒప్పుకున్నాడు, మరియు మన దగ్గర జవాబులు ఉన్నాయని అతనితో పంచుకోవడానికి నేను సంతోషించాను.

ఈ రోజు, నేను ఈ గందరగోళ ప్రపంచంలో చాలా వరకు దొరకని నిజమైన సంతోషం కోసం కొన్ని ముఖ్యమైన సూత్రాలను సమీక్షించాలనుకుంటున్నాను, ఇక్కడ చాలా విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి కానీ కొన్ని నిజంగా ముఖ్యమైనవి.

అల్మా తన కాలపు ప్రజలకు ఇలా బోధించాడు, “ఏలయనగా, ఇదిగో నేను మీతో చెప్పుచున్నాను; అనేక పరిణామములు రావచ్చును మరియు వాటన్నిటి కంటే అధిక ప్రాముఖ్యత కలిగిన సంగతి ఒకటున్నది ఏలయనగా,—ఇదిగో, విమోచకుడు జీవించి మరియు తన జనుల మధ్యకు వచ్చి జీవించు సమయము ఎంతో దూరములో లేదని నేను మీతో చెప్పుచున్నాను.”1

క్రీస్తు యొక్క రెండవ రాకడ కోసం మనం ఎదురుచూస్తూ మరియు సిద్ధమవుతున్నప్పుడు ఈ ప్రకటన ఈ రోజు కూడా మనకు అంతే ముఖ్యమైనది!

కాబట్టి, నా మొదటి పరిశీలన ఏమిటంటే, యేసు క్రీస్తు యొక్క పునాదిమీద కట్టబడియుండుట మన సంతోషానికి చాలా అవసరం. ఆ పునాది ఒక నిశ్చయమైన పునాది, “మనుష్యులు ఆ పునాదిపై కట్టబడిన యెడల ఎన్నటికీ పడిపోరు.”2 అలా చేయడం వల్ల జీవితపు సవాళ్లకు మనల్ని సిద్ధం చేస్తుంది.

చాలా సంవత్సరాల క్రితం, నేను మా అబ్బాయి జస్టిన్‌తో కలిసి వేసవి స్కౌట్ విడిదికి వెళ్లాను. కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు, అతను మరియు అతని స్నేహితులు విలువిద్య మెరిట్ బ్యాడ్జ్‌ని సంపాదించాలనుకుంటున్నట్లు అతను ఉత్సాహంగా ప్రకటించాడు. అలాచేయడానికి అబ్బాయిలు చిన్న రాత పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి మరియు వారి బాణాలతో లక్ష్యాన్ని చేధించాలి.

నేను విచారించాను, ఆందోళన చెందాను. ఆ సమయంలో, జస్టిన్ సిస్టిక్ ఫైబ్రోసిస్ కారణంగా చాలా బలహీనంగా ఉన్నాడు, ఆది అతను పుట్టినప్పటి నుండి పోరాడుతున్న ఒక వ్యాధి. అతను బాణాన్ని లక్ష్యానికి పంపేంత దూరం విల్లును వెనక్కి లాగగలడా అని నేను ఆశ్చర్యపోయాను.

అతను మరియు అతని స్నేహితులు విలువిద్య తరగతికి వెళ్ళినప్పుడు, అతను అనుభవం చేత అవమానం చెందకూడదని నేను మౌనంగా ప్రార్థించాను. రెండు గంటల ఆత్రుత తర్వాత, అతను పెద్ద చిరునవ్వుతో నా వైపు రావడం నేను చూశాను. “నాన్న!” అని ఆశ్చర్యముతో కేకవేశాడు. “నాకు మెరిట్ బ్యాడ్జ్ వచ్చింది! నాకు బుల్స్-ఐ వచ్చింది; అది నా ప్రక్కన ఉన్న లక్ష్యంలో ఉంది, నేను ఒక బుల్స్-ఐని కొట్టాను!” అతను తన శక్తితో విల్లును వెనక్కి లాగి, బాణాన్ని ఎగరడానికి అనుమతించాడు, దాని గతి మార్గమును నియంత్రించలేకపోయాడు. “క్షమించండి, లక్ష్యం తప్పు!” అని ఎప్పుడూ చెప్పని, అర్థం చేసుకునే విలువిద్య శిక్షకుడికి నేను ఎంత కృతజ్ఞుడను. బదులుగా, జస్టిన్ యొక్క స్పష్టమైన పరిమితులను మరియు శ్రద్ధగల కృషిని చూసిన తర్వాత, అతను దయతో, “మంచి పని!” అని స్పందించాడు.

మన పరిమితులు ఉన్నప్పటికీ క్రీస్తును మరియు ఆయన ప్రవక్తలను అనుసరించడానికి మన వంతు కృషి చేస్తే అది మనకు ఈ విధముగా ఉంటుంది. మన నిబంధనలను పాటించుట ద్వారా మరియు మన పాపాలకు పశ్చాత్తాపం చెందడం ద్వారా మనం ఆయన దగ్గరకు వస్తే, “భళా, నమ్మకమైన మంచి దాసుడా,” అని మన రక్షకుడు మెచ్చుకోవడాన్ని మనం సంతోషముగా వింటాము.3

లోక రక్షకుని యొక్క దైవత్వం గురించి మరియు ఆయన వద్దకు రావడానికి మనం తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పుడు మనల్ని స్వస్థపరచడానికి, బలపరచడానికి మరియు పైకి ఎత్తడానికి ఆయన ప్రేమ మరియు శక్తి గురించి నేను మీకు సాక్ష్యమిస్తున్నాను. దీనికి విరుద్ధంగా, మనం గుంపుతోపాటు మరియు యేసు వైపు కూడ వెళ్లడానికి వేరే మార్గం లేదు. రక్షకుడు మరణాన్ని, వ్యాధిని మరియు పాపాన్ని జయించాడు, మరియు మనం మన పూర్ణ హృదయాలతో ఆయనను అనుసరిస్తే మన అంతిమ పరిపూర్ణతకు మార్గాన్ని అందిస్తాడు.4

నా రెండవ పరిశీలన ఏమిటంటే, మనం ప్రేమగల పరలోక తండ్రికి కుమారులు మరియు కుమార్తెలమని గుర్తుంచుకోవడం మన సంతోషానికి కీలకమైనది. ఈ వాస్తవాన్ని తెలుసుకోవడం మరియు విశ్వసించడం అన్నింటినీ మారుస్తుంది.

చాలా సంవత్సరాల క్రితం, సంఘ నియామకం నుండి ఇంటికి వెళ్లే విమానంలో, సహోదరి సెబిన్ మరియు నేను చాలా పెద్ద వ్యక్తి వెనుక కూర్చున్నాము, అతనిది బట్టతల వెనుక 439 నంబర్‌తో పాటు పెద్ద కోపంతో ఉన్న ముఖాన్ని పచ్చబొట్టుగా వేయించుకున్నాడు.

మేము ఆగగానే, నేను, “క్షమించండి సార్. మీ తల వెనుక వేయించుకున్న పచ్చబొట్టు సంఖ్య యొక్క ప్రాముఖ్యతను నేను అడిగితే మీకేమైనా అభ్యంతరమా?” అన్నాను. కోపంతో ఉన్న ముఖం గురించి అడిగే ధైర్యం నేను చేయలేదు.

అతను అన్నాడు, “అది నేనే. అదే నేను. నేను ఆ 219 భూభాగాపు ముఠాకు చెందియున్నాను!”

నాలుగు వందల ముప్పై తొమ్మిది అతని తలపై ఉన్న అసలు సంఖ్య, ఇది అతనికి చాలా ముఖ్యమైనది కాబట్టి అతను తప్పు చేసాడు అని గమనించి నేను ఆశ్చర్యపోయాను.

ఈ వ్యక్తి యొక్క గుర్తింపు మరియు ఆత్మగౌరవం ముఠా ప్రాంతంతో అనుబంధించబడిన సంఖ్యపై ఆధారపడి ఉండటం ఎంత విచారకరమో అని నేను ఆలోచించాను. నేను నాలో అనుకున్నాను, ఈ కఠినంగా కనిపించే వ్యక్తి ఒకప్పుడు ఒకరి చిన్న పిల్లవాడు, అతను నిజంగా ఎవరో మరియు ఎవరికి చెందినవాడో అతనికి తెలిస్తే అతను ఇంకా విలువైనవానిగా మరియు చెందినవానిగా భావించాలి. ఏలయనగా మనమందరం “విలువపెట్టి కొనబడినవారము”5

The Prince of Egypt [ది ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్] చిత్రంలోని ఒక పాటలో, “స్వర్గం యొక్క కళ్ల ద్వారా నీ జీవితాన్ని చూడు,” అనే ఒక వివేకవంతమైన వచనము ఉంది. 6 మన దైవిక వంశం మరియు శాశ్వతమైన సంభావ్యత గురించిన జ్ఞానం మన ఆత్మలలో లోతుగా చొచ్చుకొనిపోయినందున, మనం జీవితాన్ని ఒక ఉద్దేశ్యపూర్వకంగా, నేర్చుకోనడానికి మరియు ఎదగడానికి ఒక సాహసకృత్యంగా చూడగలుగుతాము, స్వల్ప కాలము పాటు “మనము ఒక అద్దము ద్వారా కూడా చూస్తాము”7

ఒక ఆత్మ యొక్క విలువను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడం సంతోషము యొక్క మూడవ ప్రమాణ చిహ్నం. రక్షకుని ఉపదేశాన్ని అనుసరించడం ద్వారా “నేను మిమ్మును ప్రేమించినట్టే; మీరును ఒకరినొకరు ప్రేమింపవలెనను” అనే ఆజ్ఞను మనము ఉత్తమంగా అనుసరిస్తాము8

“నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని.” కూడా ఆయన బోధించారు9

సామెతల గ్రంథము జ్ఞానయుక్తంగా ఇలా సలహా ఇస్తుంది, “మేలుచేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండ వెనుకతియ్యకుము.”10

చాలా దయతో ఉన్నందుకు మనము ఎప్పటికీ చింతించము. దేవుని దృష్టిలో, దయ అనేది గొప్పతనానికి పర్యాయపదం. క్షమించడం మరియు తీర్పుతీర్చని వారిగా ఉండటం దయలో భాగం.

చాలా సంవత్సరాల క్రితం, మా యువ కుటుంబం గృహ సాయంకాలం కోసం సినిమా చూడటానికి వెళ్ళబోవుచున్నాము. మా కుమారులలో ఒకడు మరియు నా భార్య వాలెరీ తప్ప మేమంతా వ్యాన్‌లో ఉన్నాము బయట చీకటిగా ఉంది, మా అబ్బాయి తలుపు తెరిచి కారు వైపు పరుగెత్తుతుండగా, వరండాలో మా పిల్లి అని అనుకోకుండా తన్నాడు. కానీ అది మా పిల్లి కాదు, సంతోషంగా లేని వుడుము అని దాని నోటి నుండి వెదజల్లుట ద్వారా అది మా కుమారునికి మరియు అతని వెనుక ఉన్న నా భార్యకి తెలియజేసింది! మేము అందరం ఇంటికి తిరిగి వచ్చాము, అక్కడ వారిద్దరూ వుడుము వాసనను తొలగించడానికి ఉద్దేశించబడిన ఖచ్చితంగా ఉపయోగపడే టొమాటో జ్యూస్‌తో తలస్నానం చేసి జుట్టును కడుక్కున్నారు. వాళ్ళు శుభ్రం చేసి బట్టలు మార్చుకునే సమయానికి, మా కుటుంబం దగ్గర ఆ భయంకరమైన వాసన రావడం లేదు కాబట్టి మేము సినిమాకి వెళ్ళడం సరైనదని నిర్ణయించుకున్నాము. 

మేము థియేటర్లో వెనుక కూర్చున్న తర్వాత, మా చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు అకస్మాత్తుగా ఒకరి తర్వాత ఒకరు పాప్‌కార్న్ కోసం బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే, వారు తిరిగి వచ్చినప్పుడు, ఎవరూ తమ అసలు సీటులోకి రాలేదు.

మేము ఆ అనుభవాన్ని గుర్తు చేసుకున్నప్పుడు నవ్వుకున్నాము, కానీ మన పాపాలన్నీ వాసన కలిగి ఉంటే? మనం మోసము, కామం, అసూయ లేదా అహంకారముల వాసన చూడగలిగితే? మన స్వంత బలహీనతలను బహిర్గతం చేయడంలో, మనం ఇతరుల పట్ల మరికొంత శ్రద్ధగా మరియు జాగ్రత్తగా ఉంటాము మరియు అలాగే, మన జీవితాలలో అవసరమైన మార్పులు చేసినప్పుడు వారు మనతో ఉంటారని ఆశిస్తాము. నేను సంఘములో పొగాకు వాసనను ప్రేమిస్తాను, ఎందుకంటే ఎవరైనా మార్పుకోసం ప్రయత్నిస్తున్నారని ఇది సూచిస్తుంది. వారి చుట్టూ మన స్వాగతించే చేతులు వారికి అవసరం.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ వివేకంగా అన్నారు, “ఒక వ్యక్తి ఇతరులను ఎంత ప్రేమగా ఆదరిస్తాడనే దానిని బట్టి, ఆ వ్యక్తి యేసు క్రీస్తు యొక్క నిజమైన అనుచరుడు అవునో కాదో సులువుగా గుర్తించవచ్చు.”11

పౌలు ఎఫెసీయులకు ఇలా వ్రాశారు, “ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.”12

యేసు క్రీస్తు శిష్యులుగా, పరలోక తండ్రిని మరియు మన రక్షకుని విశ్వసించాలని మరియు వారిని ఎవరితో కూడా భర్తీ చేయడానికి ప్రయత్నించవద్దని మనము కోరబడ్డాము. యేసు క్రీస్తుకు ప్రతి ఒక్కరి లోపాలు సంపూర్ణంగా తెలుసు మరియు వారిని ఖచ్చితంగా తీర్పుతీరుస్తారు.

నా నాల్గవ సంతోష ప్రమాణ చిహ్నం నిత్యమైన దృక్పథాన్ని కొనసాగించడం. మన తండ్రి ప్రణాళిక నిత్యత్వంలో విస్తరించి ఉంది; ఇక్కడ మరియు ఇప్పుడు దృష్టి కేంద్రీకరించడం సులభం మరియు ఇకమీదట మరచిపోవచ్చు.

నేను ఈ పాఠాన్ని చాలా సంవత్సరాల క్రితం అప్పటికి మా 16 ఏళ్ల కుమార్తె జెన్నిఫర్ ద్వారా శక్తివంతంగా నేర్చుకున్నాను. ఆమెకు రెండు ఊపిరితిత్తుల మార్పిడి జరగబోతోంది, అక్కడ ఆమె ఊపిరితిత్తులలోని ఐదు వ్యాధిగ్రస్తులైన లోబ్‌లు పూర్తిగా తీసివేయబడతాయి మరియు క్రీస్తువంటి ఇద్దరు అద్భుతమైన స్నేహితులు విరాళంగా ఇచ్చిన ఆరోగ్యకరమైన రెండు చిన్న లోబ్‌లతో భర్తీ చేయబడతాయి. ఇది చాలా ప్రమాదకర ప్రక్రియ, అయినప్పటికీ తన శస్త్రచికిత్సకు ముందు రోజు రాత్రి, జెన్నిఫర్ తక్కువ బరువు, 90 పౌండ్లు (41 కేజీలు) వున్నప్పటికి గొప్ప విశ్వాసంతో నాకు ఇలా బోధించింది, “చింతించకండి, నాన్న! రేపు నేను కొత్త ఊపిరితిత్తులతో మేల్కొంటాను, లేదా నేను మంచి ప్రదేశంలో మేల్కొంటాను. ఎలాగైనా గొప్పగా ఉంటుంది.” అది విశ్వాసం; అది నిత్యమైన దృక్పథం! జీవితాన్ని శాశ్వతమైన కోణం నుండి చూడటం స్పష్టత, ఓదార్పు, ధైర్యం మరియు నిరీక్షణ అందిస్తుంది.

శస్త్రచికిత్స తర్వాత, బ్రీతింగ్ ట్యూబ్‌ని తీసివేసి, జెన్నిఫర్‌కి ఊపిరి పీల్చుకోవడానికి సహాయం చేస్తున్న వెంటిలేటర్‌ను ఆఫ్ చేయడానికి చాలా కాలంగా ఎదురుచూస్తున్న రోజు వచ్చినప్పుడు, ఆమె రెండు చిన్న లోబ్‌లు పనిచేస్తాయా అని మేము ఆత్రుతగా ఎదురుచూశాము. ఆమె మొదటి శ్వాస తీసుకున్నప్పుడు, వెంటనే ఏడుపు ప్రారంభించింది. మా ఆందోళనను చూసి, “ఊపిరి పీల్చుకోవడం చాలా బాగుంది” అని ఆమె వెంటనే అరిచింది. 

ఆ రోజు నుండి, నేను ఊపిరిపీల్చుకొనేసామర్థ్యం కోసం ఉదయం మరియు రాత్రి పరలోక తండ్రికి ధన్యవాదాలు చెబుతాను. మనము అసంఖ్యాకమైన దీవెనల చేత చుట్టబడి ఉన్నాము, మనం బుద్ధిపూర్వకంగా లేకుంటే మనం తేలికగా తీసుకోవచ్చు. దీనికి విరుద్ధంగా, ఏమీ ఆశించబడనప్పుడు మరియు ప్రతిదీ ప్రశంసించబడినప్పుడు, జీవితం అద్భుతంగా మారుతుంది.

అధ్యక్షులు నెల్సన్ ఇలా అన్నారు: “ప్రతి కొత్త ఉదయం దేవుడు ఇచ్చిన బహుమతి. మనం పీల్చే గాలి కూడా ఆయన నుండి ఒక ప్రేమపూర్వక రుణం. ఆయన ప్రతి దినము మనలను కాపాడతారు మరియు ప్రతి క్షణం మనకు మద్దతు ఇస్తారు. కాబట్టి, మన ఉదయపు మొదటి గొప్ప కార్యం వినయపూర్వకమైన కృతజ్ఞతా ప్రార్థనగా ఉండాలి.”13

అది నా ఐదవ మరియు చివరి పరిశీలనకు నన్ను తీసుకువచ్చింది, ఏమిటంటే మీకు ఉన్నదాని పట్ల కృతజ్ఞతలేకుంటే మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండరు.

ప్రభువు ఇలా ప్రకటించారు, “అన్ని విషయములను కృతజ్ఞతాభావముతో స్వీకరించువాడు మహిమకరముగా చేయబడును.”14 బహుశా కృతజ్ఞత తరువాత అనేక ఇతర సద్గుణములు కలుగవచ్చు.

ముందు రాత్రి మనం కృతజ్ఞతతో ఉండి, ప్రతి ఉదయం మనం దీవెనలతో మేల్కొంటే, మన అవగాహన ఎలా మారుతుంది. మన దీవెనలను ప్రశంసించడంలో విఫలమైతే, కృతజ్ఞతా భావాన్ని కలిగించే సంతోషాన్ని, ఆనందాన్ని దోచుకునే అసంతృప్తి భావనను కలిగిస్తుంది. గొప్ప మరియు విశాలమైన భవనంలో ఉన్నవారు గుర్తుకు మించి చూసేందుకు మనల్ని ప్రలోభపెడతారు, తద్వారా గుర్తును పూర్తిగా కోల్పోతాము.

వాస్తవానికి, మనం ఆయనతో పవిత్రమైన నిబంధనలను చేసి పాటించినప్పుడు దేవుని కృప ద్వారా మారిన మనలో మర్త్యత్వము యొక్క గొప్ప ఆనందం మరియు దీవెన కనుగొనబడతాయి. మన రక్షకుడు తన ప్రాయశ్చిత్త త్యాగం యొక్క యోగ్యత ద్వారా మనలను మెరుగుపరుస్తారు మరియు శుద్ధి చేస్తారు మరియు తనను ఇష్టపూర్వకంగా అనుసరించే వారి గురించి ఇలా చెప్పారు, “నా ఆభరణములను చేయుటకు నేను వచ్చు దినమున వారు నా వారగుదురు.”15

నేను మీకు వాగ్దానం చేస్తున్నాను యేసు క్రీస్తు పునాదిపై మన జీవితాలను నిర్మించుకుంటే; దేవుని కుమారులు మరియు కుమార్తెలుగా మన నిజమైన గుర్తింపుకు విలువనివ్వండి; ఆత్మ విలువను గుర్తుంచుకోండి; శాశ్వతమైన దృక్పథాన్ని కొనసాగించండి; మరియు మన అనేక ఆశీర్వాదాలను ముఖ్యంగా క్రీస్తు తన వద్దకు రావాలని ఇచ్చిన ఆహ్వానాన్ని కృతజ్ఞతతో అభినందిస్తే, ఈ మర్త్య సాహస సమయంలో మనం కోరుకునే నిజమైన సంతోషమును పొందవచ్చు. జీవితంలో ఇంకా సవాళ్లు ఉంటాయి, కానీ మనం అర్థం చేసుకున్న మరియు జీవించే శాశ్వతమైన సత్యాల కారణంగా మనం ప్రతి ఒకదానిని ఉద్దేశ్యంతో మరియు శాంతితో ఎదుర్కోగలుగుతాము.

దేవుడు మన ప్రేమగల తండ్రి, మరియు ఆయన ప్రియమైన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క వాస్తవికతను గూర్చి నా సాక్ష్యమును నేను మీకు తెలియజేస్తున్నాను. నేను జీవించియున్న ప్రవక్తలు, దీర్ఘదర్శులు మరియు బయల్పాటుదారుల గురించి కూడా సాక్ష్యమిస్తున్నాను. వారి ద్వారా పరలోక సలహాను పొందడం ఎంతటి దీవెన. రక్షకుడు స్పష్టంగా చెప్పినట్లుగా, “నా నోటి మాట ద్వారా గాని లేదా నా సేవకుల నోటి మాట ద్వారా గాని చెప్పునది ఒక్కటే.” 16 యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో, ఆమేన్.