సర్వసభ్య సమావేశము
తప్పిపోయినవాడు మరియు ఇంటికి నడిపించే మార్గము
2023 అక్టోబరు సర్వసభ్య సమావేశము


తప్పిపోయినవాడు మరియు ఇంటికి నడిపించే మార్గము

ఎంపికలు మిమ్మల్ని రక్షకుని నుండి, ఆయన సంఘము నుండి దూరంగా నడిపించివేసినప్పటికీ, స్వస్థపరచు ప్రభువు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఇంటికి నడిపించే దారిలో నిలబడతారు.

ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి.

కొందరి చేత ఇది ఎవ్వరూ చెప్పని గొప్ప చిట్టి కథగా పిలువబడింది.1 ఇది ప్రపంచవ్యాప్తంగా వేలాది భాషల్లోకి అనువదించబడినందున, గత రెండు సహస్రాబ్దాలలో, ప్రపంచంలో ఎక్కడా కథను ప్రస్తావించకుండా సూర్యుడు అస్తమించలేదు.

“నశించినదానిని వెదకి రక్షించుటకు”2 భూమిపైకి వచ్చిన మన రక్షకుడు మరియు విమోచకుడైన యేసు క్రీస్తు చేత ఇది చెప్పబడింది. ఆయన ఈ సరళమైన పదాలతో ప్రారంభిస్తారు: “ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి.”3

వెంటనే మనం హృదయవిదారకమైన సంఘర్షణ గురించి తెలుసుకుంటాం. ఒక కుమారుడు4 ఇంటి దగ్గర జీవితంతో విసుగుచెందానని తన తండ్రికి చెప్తాడు. అతని స్వేచ్ఛ అతనికి కావాలి. అతను తన తల్లిదండ్రుల సంప్రదాయాన్ని, బోధనలను వదిలి వెళ్ళాలనుకున్నాడు. ఇప్పుడు—అతను ఆస్తిలో తన వాటా కోసం అడుగుతాడు.5

ఇది వినినప్పుడు ఆ తండ్రి ఎలా భావించియుంటాడో మీరు ఊహించగలరా? అన్నిటిని మించి కుటుంబాన్ని వదిలి, ఇక ఎప్పటికీ తిరిగి రాకూడదని అతని కుమారుడు కోరుకుంటున్నాడని అతను ఎప్పుడు తెలుసుకున్నాడు?

గొప్ప సాహసం

కుమారుడు సాహసం మరియు ఉత్సాహం యొక్క ఉద్వేగాన్ని అనుభవించియుండవచ్చు. చివరకు, అతను స్వతంత్రుడయ్యాడు. అతని యవ్వనపు సంప్రదాయాల సూత్రాలు, నియమాల నుండి విముక్తి పొందాడు, అతని తల్లిదండ్రుల ప్రభావం లేకుండా అతను చివరకు తన స్వంత ఎంపికలు చేయగలడు. అతను ఇకపై తప్పు చేసినట్లు భావించడు. అతనిలా ప్రవర్తించే వారితో ఉండడాన్ని అతడు ఆనందించగలడు మరియు తనకు నచ్చినట్లు జీవించగలడు.

దూర దేశానికి చేరుకొని అతడు త్వరగా క్రొత్త స్నేహితులను చేసుకొని, తాను ఎల్లప్పుడు కలలుగన్న జీవితాన్ని జీవించడం ప్రారంభించాడు. చాలామందికి అతను తప్పక నచ్చియుండవచ్చు, ఎందుకంటే ఏ అడ్డు అదుపు లేకుండా అతను డబ్బు ఖర్చుపెట్టాడు. అతని క్రొత్త స్నేహితులు—అతని దుబారా ఖర్చు నుండి లాభం పొందినవారు—అతన్ని తీర్పుతీర్చలేదు. వారు వేడుక చేసుకున్నారు, అభినందించారు మరియు అతని ఎంపికలకు బలంగా మద్దతిచ్చారు.6

ఆ సమయంలో సోషల్ మీడియా ఉన్నట్లయితే, తప్పకుండా అతను నవ్వుతున్న స్నేహితుల సజీవ చిత్రాలతో పేజీలన్నీ నింపేవాడు: #మంచి జీవితాన్ని జీవిస్తున్నాను! #ఎప్పుడూ ఇంత సంతోషంగా లేను! #ఇది ఎప్పుడో చేసియుండాల్సింది!

కరువు

కానీ సంబరాలు ఎంతోకాలం నిలవలేదు—అవి నిలిచియుండవు కూడా. రెండు విషయాలు జరిగాయి: ఒకటి, అతని దగ్గర డబ్బులు అయిపోయాయి మరియు రెండు, దేశమంతటా కరువు వ్యాపించింది.7

సమస్యలు తీవ్రమైనప్పుడు, అతను భయపడ్డాడు. ఒకప్పుడు అదుపు లేకుండా, ఆనందంతో నిర్లక్ష్యంగా ఖర్చుపెట్టిన అతని దగ్గర ఇప్పుడు ఒక్క పూట భోజనానికి డబ్బు లేదు, ఉండడానికి చోటు లేదు. అతను ఎలా బ్రతుకుతాడు?

తన స్నేహితుల పట్ల అతను ఉదారంగా ఉన్నాడు—వాళ్ళు అతనికిప్పుడు సహాయం చేస్తారా? కొంతకాలానికి—మళ్ళీ అతను నిలదొక్కుకునేవరకు—కొద్దిగా సహకరించమని అతను అడగడాన్ని నేను చూడగలను.

“యెవడును వాని కేమియు ఇయ్యలేదు”8 అని లేఖనాలు మనకు చెప్తున్నాయి.

బ్రతికియుండాలనే తపనతో, అతను స్థానిక రైతు దగ్గర పందులను మేపే పనిలో చేరాడు.9

పరిస్థితులు ఇంత దారుణంగా ఎలా మారాయా అని ఇప్పుడు విపరీతమైన ఆకలితో, వదిలివేయబడిన, ఒంటరిగా ఉన్న ఆ యువకుడు ఆశ్చర్యపడియుండవచ్చు.

అతను ఆకలిగా ఉన్నందుకు మాత్రమే బాధపడలేదు. ఆత్మ యొక్క నడిపింపు లేనందుకు బాధపడ్డాడు. ఆధ్యాత్మికేతర మార్గంలో జీవించాలనే తన కోరికలకు లొంగిపోవడం తనను సంతోషపెడుతుందని, నైతిక చట్టాలు సంతోషానికి అడ్డుగోడలని అతను చాలా నిశ్చయంగా ఉన్నాడు. ఇప్పుడు అతనికి బాగా అర్థమయింది. అయ్యో, ఆ జ్ఞానం కోసం అతను ఎంత వెల చెల్లించాల్సి వచ్చింది!10

భౌతిక మరియు ఆధ్యాత్మిక ఆకలి పెరిగినప్పుడు, అతని ఆలోచనలు అతని తండ్రివైపు తిరిగాయి. ఇంత జరిగిన తర్వాత ఆయన అతనికి సహాయం చేస్తాడా? తన తండ్రి సేవకులలో అత్యంత అల్పస్థితిలోనున్నవారు కూడా తినడానికి ఆహారాన్ని, తుఫానుల నుండి ఆశ్రయాన్ని కలిగియున్నాడు.

కానీ తండ్రి దగ్గరికి వెళ్ళాలా?

ఎప్పటికీ వెళ్ళలేడు.

తండ్రి ఇచ్చిన ఆస్తినంతా వృధాచేసాడని ఊరి వాళ్ళ ముందు ఒప్పుకోగలడా?

అతని వల్ల కాదు.

అతను తన కుటుంబాన్ని అవమానపరుస్తున్నాడని, అతని తల్లిదండ్రులను బాధపెడుతున్నాడని అతన్ని హెచ్చరించిన ఊరిజనులను ఎదుర్కోగలడా? తన స్వేచ్ఛ గురించి గొప్పగా చెప్పుకున్న తర్వాత అతని పాత స్నేహితుల దగ్గరికి తిరిగి వెళ్ళగలడా?

అతను భరించలేడు.

కానీ, “అతనికి బుద్ధి వచ్చేవరకు”11—ఆకలి, ఒంటరితనం మరియు పశ్చాత్తాపం సులువుగా పోవు.

అతను ఏమి చేయాలో అతనికి తెలుసు.

తిరిగి వెళ్ళడం

ఇప్పుడు మనం మనస్సు గాయపడిన ఇంటి యజమాని అయిన తండ్రి గురించి చెప్పుకుందాం. ఎన్ని వందల గంటలు, బహుశా వేల గంటలు అతను తన కుమారుడి గురించి చింతిస్తూ గడిపియుండవచ్చు?

ఎన్నిసార్లు అతను తన కుమారుడు వెళ్ళిన దారివైపు చూసియుండవచ్చు మరియు అతని కుమారుడు వెళ్ళిపోవడంతో అతను అనుభవించిన తీవ్ర నష్టాన్ని తిరిగి పొందియుండవచ్చు? తన కుమారుడు సురక్షితంగా ఉండాలని, సత్యాన్ని కనుగొనాలని, తిరిగి రావాలని దేవుడిని వేడుకుంటూ, నిశిరాత్రిలో అతను ఎన్నిసార్లు ప్రార్థించియుండవచ్చు?

అప్పుడు ఒకరోజు, తండ్రి ఆ ఒంటరి రహదారిని—ఇంటికి నడిపించే దారిని చూస్తున్నప్పుడు—దూరంగా ఒక ఆకారం అతని వైపు నడవడాన్ని చూస్తాడు.

అంత దూరం నుండి చూడడం సాధ్యమేనా?

ఆ వ్యక్తి చాలా దూరంలో ఉన్నప్పటికీ, అది తన కుమారుడేనని తక్షణమే తండ్రికి తెలిసింది.

తండ్రి వానిని చూచి కనికరపడి, పరుగెత్తి వాని మెడమీదపడి ముద్దుపెట్టుకుంటాడు.12

కుమారుడు “తండ్రీ” అంటూ భావోద్వేగంతో గట్టిగా పిలిచి, వెయ్యిసార్లు సాధన చేసిన మాటలలో ఇలా అంటాడు, “నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని. ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని మాత్రమే నేను అడుగుతున్నాను.”13

కానీ తండ్రి అతని మాట పూర్తికానివ్వడు. కళ్ళలో నీళ్ళతో అతను తన దాసులను ఇలా ఆజ్ఞాపిస్తాడు: “ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టండి. వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించండి. వేడుక చేయడానికి విందు ఏర్పాటు చేయండి. నా కుమారుడు తిరిగివచ్చాడు!”14

వేడుక

నా కార్యాలయంలో జర్మన్ కళాకారుడైన రిఛర్డ్ బర్డె వేసిన వర్ణచిత్రం ఉంది. హ్యారియెట్ మరియు నేను ఈ చిత్రలేఖనాన్ని ఇష్టపడుతున్నాము. రక్షకుని ఉపమానం నుండి ఒక సున్నితమైన దృశ్యాన్ని మరింత అర్థవంతమైన విధానంలో అది వర్ణిస్తుంది.

చిత్రం
ది రిటర్న్ ఆఫ్ ది ప్రొడిగల్ సన్, రిచర్డ్ బర్డే చేత

కుమారుడు తిరిగి వచ్చినందుకు ప్రతీఒక్కరు చాలా సంతోషంగా ఉన్నప్పటికీ, ఒక్కరు మాత్రం సంతోషంగా లేరు—అతని అన్న.15

అతను ఇంకా కోపంగా ఉన్నాడు.

అతని తమ్ముడు ఆస్తిలో తన వాటా అడిగినప్పుడు అతను అక్కడే ఉన్నాడు. అతని తండ్రి అనుభవించిన తీవ్రమైన దుఃఖాన్ని అతను ప్రత్యక్షంగా చూసాడు.

అతని తమ్ముడు వెళ్ళిపోయినప్పటి నుండి, తన తండ్రి బాధపడకుండా ఉండేలా చూడడానికి అతను ప్రయత్నించాడు. ప్రతీరోజు, తన తండ్రి యొక్క తీవ్రమైన దుఃఖాన్ని తగ్గించడానికి అతను ప్రయత్నించాడు.

లక్ష్యం లేని పిల్లవాడు ఇప్పుడు తిరిగివచ్చాడు మరియు తిరుగుబాటుదారుడైన అతని తమ్ముడి మీద జనులు శ్రద్ధ చూపడం ఆపలేకపోయారు.

అతను తన తండ్రితో ఇలా అంటాడు–“ఇదిగో యిన్నియేండ్లనుండి నువ్వు అడిగిన దానిని చేయడానికి నేనెన్నడు నిరాకరించలేదు. అయినప్పటికీ, నువ్వు ఎప్పుడూ నాకోసం వేడుక చేయలేదు.”16

అందుకు ప్రేమగల తండ్రి ఇలా చెప్తాడు–“కుమారుడా, నావన్నియు నీవి! ఇది బహుమానాలు లేదా వేడుకలను పోల్చడం గురించినది కాదు. ఇది స్వస్థత గురించినది. ఇన్నేళ్ళుగా మనం ఎదురుచూస్తున్న తరుణం ఇది. నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు! తప్పిపోయి దొరికాడు!”17

మన కాలానికి అన్వయించబడే ఉపమానము

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, స్నేహితులారా, రక్షకుని ఉపమానాలన్నిటిలా ఇది చాలాకాలం క్రితం జీవించిన జనుల గురించి మాత్రమే కాదు. ఇది నేడు మీకు మరియు నాకు సంబంధించినది.

మన జీవితంలో స్వార్థపూరిత ఎంపికలను చేయడం వలన అధిక సంతోషాన్ని పొందగలమని మూర్ఖంగా ఆలోచిస్తూ, పరిశుద్ధ మార్గం నుండి మనలో ఎవరు తప్పిపోలేదు?

మనలో ఎవరు వినయపూర్వకంగా, విరిగిన హృదయంతో, క్షమాపణ మరియు దయ కోసం నిరాశగా భావించలేదు?

బహుశా మనమిలా ఆశ్చర్యపడియుండవచ్చు, “తిరిగివెళ్ళడం సాధ్యమేనా? నేను ఎప్పటికీ ముద్రవేయబడతానా, తిరస్కరించబడతానా మరియు నా మాజీ స్నేహితులచేత వేరుచేయబడతానా? దూరంగా ఉండడమే మంచిదా? నేను తిరిగివెళ్తే దేవుడు ఎలా స్పందిస్తాడు?”

ఈ ఉపమానం మనకు జవాబునిస్తుంది.

ప్రేమ మరియు కనికరంతో పొంగిపొర్లుతున్న హృదయంతో మన పరలోక తండ్రి మన దగ్గరకు పరుగెత్తుకు వస్తారు. ఆయన మనల్ని హత్తుకుంటారు; ప్రశస్త వస్త్రమును తెచ్చి మనకు కట్టి,మన చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగిస్తారు; మరియు ఇలా ప్రకటిస్తారు, “ఈరోజు మనం వేడుక చేసుకుందాం! నా కుమారుడు చనిపోయి మరల బ్రతికాడు!”

మనం తిరిగివెళ్ళినప్పుడు పరలోకం ఆనందిస్తుంది.

చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము

నేనిప్పుడు ఒక్క క్షణం మీతో వ్యక్తిగతంగా మాట్లాడవచ్చా?

మీ జీవితంలో ఏం జరిగినప్పటికీ, నా ప్రియ మిత్రుడు మరియు సహ అపొస్తలుడైన ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ మాటలను నేను మళ్ళీ చెప్తాను మరియు ప్రకటిస్తాను: “క్రీస్తు [ప్రాయశ్చిత్త త్యాగం] యొక్క అనంతమైన కాంతి ప్రకాశించే దానికంటే దిగువకు మునిగిపోవడం మీకు సాధ్యం కాదు.”18

ఎంపికలు మిమ్మల్ని రక్షకుని నుండి, ఆయన సంఘము నుండి దూరంగా నడిపించివేసినప్పటికీ, స్వస్థపరచు ప్రభువు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఇంటికి నడిపించే దారిలో నిలబడతారు. యేసు క్రీస్తు యొక్క సంఘ సభ్యులుగా మేము ఆయన మాదిరిని అనుసరించాలని కోరతాము మరియు మిమ్మల్ని మా సహోదర సహోదరీలుగా, మా స్నేహితులుగా హత్తుకుంటాము. మేము మీతో కలిసి ఆనందిస్తాము, వేడుక చేసుకుంటాము.

మీ పునరాగమనం ఇతరుల దీవెనలను తగ్గించదు. ఎందుకంటే తండ్రి అనుగ్రహం అనంతమైనది మరియు ఒకరికి ఇవ్వబడినది ఇతరుల జన్మహక్కును ఏ మాత్రం తగ్గించదు.19

తిరిగి రావడం సులువైనదని నేను చెప్పడం లేదు. నేను దాని గురించి సాక్ష్యమివ్వగలను. వాస్తవానికి, అది మీరు ఎన్నడూ చేయని అతి కష్టమైన ఎంపిక కావచ్చు.

కానీ, మీరు తిరిగి రావాలని మరియు మన రక్షకుడు, విమోచకుని మార్గంలో నడవాలని నిర్ణయించుకున్న క్షణం ఆయన శక్తి మీ జీవితంలో ప్రవేశిస్తుందని, మీ జీవితాన్ని మార్చివేస్తుందని నేను సాక్ష్యమిస్తున్నాను.20

పరలోకంలోని దూతలు ఆనందిస్తారు.

క్రీస్తు యందు మీ కుటుంబమైన మేము కూడా ఆనందిస్తాము. ఎంతైనా, తప్పిపోయిన వ్యక్తిగా ఉండడం ఎలా ఉంటుందో మాకు తెలుసు. మనమందరం ప్రతీరోజు క్రీస్తు యొక్క అదే ప్రాయశ్చిత్త శక్తిపై ఆధారపడతాము. ఈ మార్గం మాకు తెలుసు మరియు మీతో పాటు మేము నడుస్తాము.

మన మార్గం బాధ, దుఃఖము లేదా విచారం నుండి విముక్తి పొందదు. కానీ, “రక్షించుటకు శక్తిమంతుడైన వాని మంచితనముపై పూర్తిగా ఆధారపడుచూ, ఆయన యందు స్థిరమైన విశ్వాసముతో, క్రీస్తు వాక్యము వలన” మనం ఇంత దూరము వచ్చాము. కలిసి మనం “క్రీస్తు నందు నిలకడతో పరిపూర్ణమైన ప్రకాశవంతమైన నిరీక్షణ కలిగియుండి, దేవుని యొక్కయు [మనుష్యులు] అందరి యొక్కయు ప్రేమను కలిగియుండి” ముందుకు సాగుదాం.21 కలిసి మనం “చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషముగలవారై ఆనందిద్దాం,”22 ఎందుకంటే యేసు క్రీస్తే మన బలము!23

ఈ గంభీరమైన ఉపమానంలో, ఇంటికి నడిపించే దారిలో ప్రవేశించమని మనల్ని పిలుస్తున్న తండ్రి స్వరాన్ని మనలో ప్రతీఒక్కరు వినాలని—పశ్చాత్తాపపడడానికి, క్షమాపణను పొందడానికి, దయ మరియు కనికరంగల మన దేవుని వైపుకు తిరిగి వెళ్ళే మార్గాన్ని అనుసరించడానికి మనకు ధైర్యం ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. దీనిని గూర్చి నేను యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను మరియు మీకు నా దీవెననిస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. లూకా 15లో కనుగొనబడు మూడు ఉపమానాలలో ఒకటైన ఇది (తప్పిపోయిన గొర్రె, పోగొట్టుకొనబడిన నాణెము మరియు తప్పిపోయిన కుమారుడు) కోల్పోబడిన వస్తువుల విలువను మరియు అవి దొరికినప్పుడు జరిగే సంబరాలను వివరిస్తుంది.

  2. లూకా 19:10.

  3. లూకా 15:11.

  4. ఈ కుమారుడు బహుశా యౌవనుడైయుంటాడు. అతను అవివాహితుడు, అతను యౌవనుడు అనడానికి అది సూచన కావచ్చు, కానీ అతని వారసత్వాన్ని గట్టిగా అడగలేనంత మరియు దానిని పొందినప్పుడు ఇల్లు వదిలి వెళ్ళలేనంత చిన్నవాడు కాదు.

  5. యూదుల చట్టము మరియు ఆచారము ప్రకారము, ఇద్దరు కొడుకులలో పెద్దవాడు తండ్రి ఆస్తిలో మూడింట రెండు వంతుల భాగానికి హక్కుదారుడు. కాబట్టి, చిన్న కొడుకు మూడింట ఒక వంతు భాగానికి హక్కుదారుడు. (ద్వితీయోపదేశకాండము 21:17 చూడండి.).

  6. లూకా 15:13 చూడండి.

  7. లూకా 15:14 చూడండి.

  8. లూకా 15:16.

  9. యూదులు పందులను “హేయము”గా (ద్వితీయోపదేశకాండము 14:8 చూడండి) మరియు అసహ్యకరమైనవిగా పరిగణిస్తారు. నిజమైన యూదులు పందులను పెంచరు, కాబట్టి పర్యవేక్షకుడు అన్యుడని తెలుస్తోంది. చిన్న కొడుకు యూదుల నుండి ఎంత దూరం ప్రయాణించాడో కూడా ఇది సూచిస్తున్నది.

  10. ఎల్డర్ నీల్ ఎ. మాక్స్‌వెల్ ఇలా బోధించారు: “అవును, పరిస్థితుల మూలంగా [తగ్గించబడడం] కంటే ‘వాక్యమును బట్టి’ మనల్ని మనము తగ్గించుకొనుట మంచిది, అయినా కష్టమైన పరిస్థితులు మనల్ని తగ్గిస్తాయి! (ఆల్మా 32:13–14 చూడండి). కరువు ఆధ్యాత్మిక ఆకలిని ప్రేరేపిస్తుంది” (“The Tugs and Pulls of the World,” లియహోనా, Jan. 2001, 45).

  11. లూకా 15:17.

  12. లూకా 15:20 చూడండి.

  13. లూకా 15:18–19, 21 చూడండి.

  14. లూకా 15:22-24 చూడండి.

  15. చిన్న కొడుకు ఇదివరకే తన ఆస్తిని పొందాడని గుర్తుంచుకోండి. పెద్దవాని అభిప్రాయంలో దానర్థం, మిగిలినదంతా అతనికే చెందుతుంది. చిన్న కొడుక్కి ఏదైనా ఇవ్వడమంటే అర్థం ఇంటివద్ద ఉన్న కొడుకు నుండి దానిని తీసుకోవడమే.

  16. లూకా 15:29 చూడండి.

  17. లూకా 15:31–32 చూడండి.

  18. జెఫ్రీ ఆర్. హాలండ్, “The Laborers in the Vineyard,” లియహోనా, 2012 మే, 33.

  19. ఒకరికి ఇవ్వబడినది ఇతరుల జన్మహక్కును ఏమాత్రం తగ్గించదు. మత్తయి 20:1–16లో పనివారి ఉపమానాన్ని చెప్పినప్పుడు, రక్షకుడు ఈ సిద్ధాంతాన్ని బోధించారు.

  20. ఆల్మా 34:31 చూడండి.

  21. 2 నీఫై 31:19–20.

  22. 1 పేతురు 1:8.

  23. కీర్తనలు 28:7 చూడండి.