సర్వసభ్య సమావేశము
దేవుడు మిమ్ములను యెరిగియుండి, ప్రేమిస్తున్నారు
2023 అక్టోబరు సర్వసభ్య సమావేశము


దేవుడు మిమ్ములను యెరిగియుండి, ప్రేమిస్తున్నారు

దేవుని యొక్క సంతోష ప్రణాళిక అంతా మీ గురించే. మీరు పరలోక తండ్రి యొక్క ప్రియమైన బిడ్డ మరియు గొప్ప విలువ గలవారు.

ఆరేళ్ల క్రితం, మా కుటుంబం ఒక రాత్రివేళ ఆక్స్‌ఫర్డ్ నగరం వెలుపల ప్రయాణిస్తోంది. చిన్నపిల్లల విషయంలో తరచుగా జరిగే విధంగా మేము ఆగవలసి వచ్చింది, మేము అక్కడ వివిధరకాల దుకాణాలు మరియు రెస్టారెంట్‌లతో ఒక సేవా కేంద్రాన్ని కనుగొన్నాము. కొద్ది సమయంలో మేము కారు నుండి బయటకు వచ్చి, సేవలను సందర్శించి, తిరిగి వచ్చి మా ప్రయాణాన్ని కొనసాగించాము.

పదిహేను నిమిషాల తర్వాత, మా పెద్ద కొడుకు ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగాడు: “జాస్పర్ ఎక్కడ ఉన్నాడు?” జాస్పర్ కారు వెనుక తనంతట తానుగా కూర్చుంటాడు. అతను నిద్రలోకి జారుకున్నాడని లేదా దాక్కున్నాడని లేదా అల్లరిగా మాపై ఏదో ఒకటి చేస్తున్నాడని మేము ఊహించాము.

అతని సహోదరుడు కారు వెనుక భాగాన్ని మరింత నిశితంగా పరిశీలించగా, మా ఐదేళ్ల కొడుకు అక్కడ లేడని మేము కనుగొన్నాము. మా హృదయాలు భయంతో నిండిపోయాయి. మేము సేవా కేంద్రానికి తిరిగి వెళ్ళేటప్పుడు, జాస్పర్‌ను సురక్షితంగా ఉంచమని పరలోక తండ్రి‌ని వేడుకున్నాము. పోలీసులకు ఫోన్ చేసి పరిస్థితిని తెలియజేశాము.

40 నిమిషాల కంటే ఎక్కువ సమయం తర్వాత, మేము ఆత్రుతగా వచ్చినప్పుడు, కారు నిలిపే స్థలంలో రెండు పోలీసు వాహనాల లైట్లు మెరుస్తూ ఉండటం మాకు కనిపించింది. అందులో ఒకదానిలోపల జాస్పర్ బటన్లతో ఆడుకుంటూ ఉన్నాడు. అతనిని మళ్లీ కలిసినందుకు మేము పొందిన ఆనందాన్ని ఎప్పటికీ మర్చిపోలేను.

రక్షకుని యొక్క ఉపమాన బోధనలలో అనేకం పోగొట్టుకున్న వాటిని సమకూర్చడం, పునరుద్ధరించడం లేదా కనుగొనడానికి కృషి చేయడంపై దృష్టి పెడతాయి. వీటిలో తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణెం మరియు తప్పిపోయిన కొడుకు యొక్క ఉపమానాలు ఉన్నాయి.1

జాస్పర్‌తో జరిగిన ఈ సంఘటన సంవత్సరాలుగా నా మనస్సులో మెదులుతుండగా, దేవుని పిల్లల యొక్క దైవిక గుర్తింపు మరియు ప్రాముఖ్యత, యేసు క్రీస్తు యొక్క విమోచన శక్తి మరియు మిమ్మల్ని, నన్ను యెరిగిన పరలోక తండ్రి యొక్క పరిపూర్ణ ప్రేమపై నేను ప్రతిబింబించాను. ఈరోజు ఈ సత్యాలకు నేను సాక్ష్యమివ్వాలని ఆశిస్తున్నాను.

I. దేవుని యొక్క పిల్లలు

జీవితం సవాలుతో కూడుకున్నది. చాలామంది వ్యక్తులు ఒంటరిగా, ఏకాంతముగా లేదా అలసిపోయినట్లుగా భావిస్తారు. విషయాలు కష్టంగా ఉన్నప్పుడు, మనం తప్పిపోయినట్లుగా లేదా వెనుకబడిపోయినట్లుగా మనకు అనిపించవచ్చు. మనమందరము దేవుని పిల్లలమని మరియు ఆయన నిత్య కుటుంబం యొక్క సభ్యులమని తెలుసుకోవడం వల్ల చెందియున్నామనే భావన మరియు ఉద్దేశ్యము పునరుద్ధరింపబడుతుంది.2

అధ్యక్షుడు ఎమ్. రస్సెల్ బాల్లర్డ్ ఇలా పంచుకున్నారు: “మనమందరం ఇప్పుడు మరియు ఎప్పటికీ పంచుకునే ఒక ముఖ్యమైన గుర్తింపు ఉంది. … అంటే మీరు ఎల్లప్పుడూ దేవుని కుమారుడు లేదా కుమార్తెగా ఉన్నారు. … ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడం—నిజంగా అర్థం చేసుకోవడం మరియు దానిని హత్తుకోవడం అనేది జీవితాన్ని మార్చివేస్తుంది.”3

పరలోకంలో ఉన్న మీ తండ్రికి మీరు ఎంత ముఖ్యమనే దానిని తప్పుగా అర్థం చేసుకోకండి, విలువ తగ్గించుకోకండి. మీరు ప్రకృతి ద్వారా ప్రమాదవశాత్తు జరిగిన ఉత్పత్తి కాదు, ఒక విశ్వసంబంధిత అనాథ లేదా కాలక్రమేణా మారిన భౌతిక పదార్థం యొక్క ఫలితం కాదు. ఎక్కడ సృష్టి ఉంటుందో, అక్కడ ఒక సృష్టికర్త ఉంటారు.

మీ జీవితానికి అర్థం మరియు ఉద్దేశ్యం ఉంది. యేసు క్రీస్తు సువార్త యొక్క కొనసాగుతున్న పునఃస్థాపన మీ దైవిక గుర్తింపుకు సంబంధించిన వెలుగు మరియు అవగాహనను తెస్తుంది. మీరు పరలోక తండ్రి యొక్క ప్రియమైన బిడ్డ. ఆ ఉపమానాలు మరియు బోధనలన్నింటికీ మీరే అంశం. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు, మిమ్మల్ని స్వస్థపరచడానికి, రక్షించడానికి మరియు విమోచించడానికి ఆయన తన కుమారుడిని పంపారు.4

యేసు క్రీస్తు ప్రతీ వ్యక్తి యొక్క దైవిక స్వభావాన్ని మరియు నిత్య విలువను గుర్తిస్తారు.5 నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను మరియు నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను అనే రెండు గొప్ప ఆజ్ఞలు దేవుని ఆజ్ఞలన్నింటికీ ఎలా పునాదియో ఆయన వివరించారు.6 అవసరమైన వారిని ఆదుకోవడం మన దైవిక బాధ్యతలలో ఒకటి.7 అందుకే యేసు క్రీస్తు శిష్యులుగా మనం, “ఒకరి భారాలను మరొకరు మోస్తాము, దుఃఖించు వారితో దుఃఖిస్తాము, ఆదరణ యొక్క అవసరములో ఉన్నవారిని ఆదరిస్తాము.”8

మతం అనేది దేవునితో మన సంబంధం గురించినది మాత్రమే కాదు; అది ఒకరికొకరితో మన సంబంధం గురించినది కూడా. మతం అనే ఆంగ్ల పదం రెలిగేర్ అనే లాటిన్ పదం నుండి వచ్చిందని ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ వివరించారు, దాని అర్థం “ముడివేయడం” లేదా మరింత స్పష్టంగా, “మళ్ళీ ముడివేయడం.” కాబట్టి, “మనల్ని దేవునితో మరియు ఒకరికొకరితో బంధించే బంధమే నిజమైన మతం.”9

మనం ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తిస్తున్నాము అనేది నిజంగా ముఖ్యమైనది. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా బోధించారు, “రక్షకుని సందేశము స్పష్టమైనది: ఆయన నిజమైన శిష్యులు నిర్మించి, ఉద్ధరించి, ప్రోత్సహించి, ఒప్పించి, ప్రేరేపిస్తారు.”10 మన తోటి ప్రయాణికులు తప్పిపోయినట్లుగా, ఒంటరిగా, మరచిపోయినట్లుగా లేదా తీసివేయబడినట్లుగా భావించినప్పుడు ఇది మరింత ముఖ్యమైనది.

కష్టాల్లో ఉన్న వారిని వెతకడానికి మనం చాలా దూరం వెతకాల్సిన అవసరం లేదు. మన స్వంత కుటుంబం, సంఘం లేదా స్థానిక సమాజంలో ఎవరికైనా సహాయం చేయడం ద్వారా మనం ప్రారంభించవచ్చు. మనము తీవ్ర పేదరికంలో జీవిస్తున్న 700 మిలియన్లమంది ప్రజల బాధలను తొలగించడానికి ప్రయత్నించవచ్చు 11 లేదా హింస, సంఘర్షణ మరియు గుర్తింపు ఆధారిత హింస కారణంగా బలవంతంగా స్థానభ్రంశం చెందిన 100 మిలియన్లమంది ప్రజల బాధలను తొలగించడానికి కూడా ప్రయత్నించవచ్చు.12 ఆకలితో ఉన్నవారిని, అపరిచితులను, అనారోగ్యంతో ఉన్నవారిని, పేదలను, ఖైదులో ఉన్నవారిని మరియు అవసరంలో ఉన్నవారిని ఆదుకునేందుకు యేసు క్రీస్తు పరిపూర్ణమైన మాదిరి. ఆయన పనే మన పని.

“దేవుని వద్దకు మన ప్రయాణం తరచుగా కలిసి వెళ్ళడంతో కూడుకున్నది”13 అని ఎల్డర్ గెరిట్ డబ్ల్యు. గాంగ్ బోధించారు. అందుకని, మన వార్డులు దేవుని పిల్లలందరికీ ఆశ్రయం కావాలి. మనం నామమాత్రంగా సంఘానికి హాజరవుతున్నామా లేదా క్రీస్తును ఆరాధించడం, స్మరించుకోవడం మరియు ఒకరికొకరు పరిచర్య చేయడం అనే ఉద్దేశ్యంతో సంఘాలను చురుకుగా సృష్టిస్తున్నామా?14 తక్కువ తీర్పు తీర్చడం, ఎక్కువగా ప్రేమించడం, మన మాటలు మరియు చర్యల ద్వారా యేసు క్రీస్తు యొక్క స్వచ్ఛమైన ప్రేమను విస్తరింపజేయడం అనే అధ్యక్షులు నెల్సన్ యొక్క సలహాను మనం పాటించవచ్చు.15

II. యేసు క్రీస్తు యొక్క విమోచన శక్తి

యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం అనేది మన పరలోక తండ్రికి తన పిల్లల పట్ల ఉన్న ప్రేమ యొక్క అత్యున్నత వ్యక్తీకరణ.16 ప్రాయశ్చిత్తం అనే పదం విడిపోయిన లేదా వేరుబడ్డ వారిని “ఒక్కటిగా” చేయుటను వివరిస్తుంది.

పరలోక తండ్రి వద్దకు తిరిగి రావడానికి మార్గాన్ని మరియు ప్రయాణంలో ఉపశమనాన్ని రెండింటినీ అందించడం మన రక్షకుని యొక్క నియమితకార్యం. జీవితంలో ఎదురయ్యే సవాళ్లలో మనకు ఎలా మద్దతు ఇవ్వాలో రక్షకుడికి అనుభవపూర్వకంగా తెలుసు.17 తప్పు చేయవద్దు: క్రీస్తు మన రక్షకుడు మరియు మన ఆత్మలను స్వస్థపరిచేవాడు.

మనం విశ్వాసాన్ని కనబరుస్తున్నప్పుడు, కష్టాలను అధిగమించడానికి ఆయన మనకు సహాయం చేస్తారు. ఆయన తన ప్రేమపూర్వక మరియు దయగల ఆహ్వానాన్ని అందిస్తూనే ఉన్నారు:

“ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును.

“మీమీద నా కాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకొనుడి; … అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.”18

కాడి యొక్క రూపకం శక్తివంతమైనది. అధ్యక్షులు హావర్డ్ డబ్ల్యు. హంటర్ వివరించినట్లుగా: “కాడి అనేది [చేతిలో ఉన్న] పని యొక్క భారీ శ్రమను పంచుకుంటూ మరియు తగ్గిస్తూ, రెండవ జంతువు యొక్క ‘బలాన్ని’ అనుసంధానించడానికి మరియు ఒకే జంతువు యొక్క ప్రయత్నంతో జతచేయడానికి అనుమతించే పరికరం. ఒకరు మోయడానికి వీలులేని లేదా బహుశా అసాధ్యమైన భారాన్ని ఒక ఉమ్మడి కాడితో బంధించబడిన ఇద్దరు సమానంగా, సౌకర్యవంతంగా పంచుకోగలరు.”19

అధ్యక్షులు నెల్సన్ ఇలా బోధించారు: “మీరు క్రీస్తుతో మరియు ఆయన శక్తితో జతచేయబడటానికి ఆయన వద్దకు వచ్చారు, తద్వారా మీరు జీవిత భారాన్ని ఒంటరిగా లాగడం లేదు. మీరు లోక రక్షకుడు మరియు విమోచకునితో ముడిపడి ఉన్న జీవిత భారాన్ని లాగుతున్నారు.”20

రక్షకునితో మనల్ని మనం ఎలా జతచేసుకోవాలి లేదా బంధించుకోవాలి? ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ ఇలా వివరిస్తున్నారు:

“పవిత్ర నిబంధనలను చేయడం మరియు పాటించడం ప్రభువైన యేసు క్రీస్తుతో మనల్ని జతచేస్తుంది. సారాంశంలో, రక్షకుడు తనపై ఆధారపడాలని మరియు ఆయనతో కలిసి లాగాలని మనల్ని పిలుస్తున్నారు. …

“మనము ఒంటరిగా లేము మరియు ఎప్పుడూ ఒంటరిగా ఉండవలసిన అవసరం లేదు.”21

భారమైన, కోల్పోయిన, గందరగోళానికి గురైన ఎవరికైనా, మీరు దీన్ని ఒంటరిగా చేయవలసిన అవసరం లేదు.22 క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం మరియు ఆయన విధుల ద్వారా మీరు ఆయనతో జతపడవచ్చు లేదా బంధించబడి ఉండవచ్చు. మీరు ముందుకు సాగే ప్రయాణాన్ని ఎదుర్కోవడానికి కావలసిన బలాన్ని మరియు స్వస్థతను ఆయన ప్రేమగా అందజేస్తారు. మన తుఫానుల నుండి ఇప్పటికీ ఆయనే ఆశ్రయం.23

III. పరలోక తండ్రి యొక్క ప్రేమ

ఖచ్చితంగా, జాస్పర్ చమత్కారమైన, ఆప్యాయతగల, తెలివైన మరియు నియంత్రించలేని వ్యక్తి. అయితే ఈ కథలో అతను నావాడు అనేది కీలకమైనది. అతను నా కొడుకు మరియు అతనికి తెలిసిన దానికంటే ఎక్కువగా నేను అతన్ని ప్రేమిస్తున్నాను. ఒక అపరిపూర్ణుడైన, భూసంబంధమైన తండ్రి తన బిడ్డ గురించి ఈ విధంగా భావిస్తే, పరిపూర్ణమైన, మహిమాన్వితమైన, ప్రేమగల పరలోక తండ్రి మీ గురించి ఎలా భావిస్తున్నారో మీరు ఊహించగలరా?

యువతరానికి చెందిన నా ప్రియమైన స్నేహితులకు, (సుమారు 1997 మరియు 2012 మధ్య జన్మించిన మరియు 2012 తర్వాత జన్మించిన వారికి): విశ్వాసానికి క్రియ అవసరమని దయచేసి తెలుసుకోండి. 24 “చూస్తే మాత్రమే నమ్మే” కాలంలో మనం జీవిస్తున్నాము. విశ్వాసం సవాలుతో కూడుకున్నది మరియు ఎంపికలు అవసరం. కానీ ప్రార్థనలకు సమాధానం దొరకుతుంది.25 మరియు సమాధానాలను అనుభూతి చెందవచ్చు.26 జీవితంలో కొన్ని నిజమైన విషయాలు కనిపించవు; వాటిని అనుభూతి చెందుతాము, తెలుసుకోగలుగుతాము మరియు అనుభవించగలుగుతాము. అవి కూడా వాస్తవమే.

మీరు తెలుసుకోవాలని మరియు పరలోకంలో ఉన్న మీ తండ్రితో సంబంధాన్ని కలిగి ఉండాలని యేసు క్రీస్తు కోరుకుంటున్నారు.27 ఆయన ఇలా బోధించారు, “మీలో ఏ మనుష్యుడైనా ఒక కుమారుని కలిగియుండి, అతను బయట నిలబడి, తండ్రి, నేను లోపలికి వచ్చి నీతో కలిసి భోజనము చేయునట్లు నీ ఇంటిని తెరువుమని అడిగినప్పుడు, నా కుమారుడా, లోపలికి రా, ఎందుకంటే నాది నీది, నీది నాది అని చెప్పడా?”28 నిత్య తండ్రి అయిన దేవుని యొక్క మరింత వ్యక్తిగతమైన, ప్రేమగల ప్రతిరూపాన్ని మీరు ఊహించగలరా?

మీరు ఆయన బిడ్డ. మీరు కోల్పోయినట్లు భావిస్తే, మీకు ప్రశ్నలు ఉంటే లేదా జ్ఞానం లోపిస్తే, మీరు మీ పరిస్థితులతో పోరాడుతున్నట్లయితే లేదా ఆధ్యాత్మిక వైరుధ్యంతో పోరాడుతున్నట్లయితే, ఆయన వైపు తిరగండి. ఓదార్పు, ప్రేమ, సమాధానాలు మరియు దిశానిర్దేశం కోసం ఆయనను ప్రార్థించండి. ఏ అవసరం ఉన్నా మరియు మీరు ఎక్కడ ఉన్నా, మీ పరలోక తండ్రికి మీ హృదయాన్ని కుమ్మరించండి. మీలో కొందరు అధ్యక్షులు నెల్సన్ ఆహ్వానాన్ని అనుసరించి, “ఆయన నిజంగా ఉన్నారా, ఆయన మిమ్ములను యెరుగుదురా అని అడగాలనుకోవచ్చు. ఆయన మీ గురించి ఏ విధంగా భావిస్తున్నారో అడగాలనుకోవచ్చు. ఆ తర్వాత, వినవచ్చు.”29

ప్రియమైన సహోదర, సహోదరీలారా:

  • పరలోకంలో ఉన్న మీ తండ్రిని తెలుసుకోండి. ఆయన పరిపూర్ణుడు మరియు ప్రేమగలవాడు.

  • యేసు క్రీస్తు ఎవరో తెలుసుకోండి.30 ఆయన మన రక్షకుడు మరియు మన విమోచకుడైయున్నారు. మిమ్మల్ని మరియు మీరు ఇష్టపడే వారిని ఆయనతో బంధించండి.

  • మరియు మీరు ఎవరో తెలుసుకోండి. మీ నిజమైన దైవిక గుర్తింపును తెలుసుకోండి. దేవుని యొక్క సంతోష ప్రణాళిక అంతా మీ గురించే. మీరు పరలోక తండ్రి యొక్క ప్రియమైన బిడ్డ మరియు గొప్ప విలువ గలవారు. ఆయన మిమ్ములను యెరిగియుండి, ప్రేమిస్తున్నారు.

సాధారణమైనవి అయినప్పటికీ ఈ ప్రాథమిక సత్యాల గురించి యేసు క్రీస్తు నామములో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. లూకా 15:4-32 చూడండి.

  2. See Preach My Gospel: A Guide to Sharing the Gospel of Jesus Christ (2023), 1.

  3. ఎమ్. రస్సెల్ బాల్లర్డ్, “Children of Heavenly Father” (Brigham Young University devotional, Mar. 3, 2020), speeches.byu.edu.

  4. యోహాను 3:16; మోషైయ 15:1; 3 నీఫై 17:6–10 చూడండి.

  5. See Preach My Gospel, 3వ అధ్యాయం.

  6. మత్తయి 22:36–40 చూడండి.

  7. ప్రధాన చేతిపుస్తకం: యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘలో సేవ చేయుట, 1.2, సువార్త గ్రంథాలయం చూడండి.

  8. మోషైయ 18:8, 9.

  9. జెఫ్రీ ఆర్. హాలండ్, “Religion: Bound by Loving Ties” (Brigham Young University devotional, Aug. 16, 2016), speeches.byu.edu.

  10. రస్సెల్ ఎమ్. నెల్సన్, “సమాధానపరచువారు కావాలి,“ లియహోనా, మే 2023, 99.

  11. “The number of people in extreme poverty rose by 70 million to more than 700 million people” (“Poverty,” Nov. 30, 2022, World Bank, worldbank.org).

  12. “More than 100 million people are forcibly displaced” (“Refugee Data Finder,” May 23, 2022, United Nations High Commissioner for Refugees, unhcr.org).

  13. గెరిట్ డబ్ల్యు. గాంగ్‌, “సత్రములో స్థలములియహోనా మే 2021, 25.

  14. ప్రధాన చేతిపుస్తకం, 1.3.7, సువార్త గ్రంథాలయం చూడండి.

  15. రస్సెల్ ఎమ్. నెల్సన్, “సమాధానపరచువారు కావాలి,” 98-101 చూడండి.

  16. యోహాను 3:16 చూడండి.

  17. ఆల్మా 7:11-12; సిద్ధాంతము మరియు నిబంధనలు 122:8 చూడండి.

  18. మత్తయి 11:28–29.

  19. Howard W. Hunter, “Come unto Me,” Ensign, Nov. 1990, 18.

  20. The Mission and Ministry of the Savior: A Discussion with Elder Russell M. Nelson,” Ensign, June 2005, 18.

  21. డేవిడ్ ఎ. బెడ్నార్, “Bear Up Their Burdens with Ease,” లియహోనా, May 2014, 88.

  22. అధ్యక్షురాలు కెమిలి ఎన్. జాన్సన్ ఇలా అన్నారు: “సహోదర సహోదరీలారా, నేను ఒంటరిగా చేయలేను, చేయనవసరం లేదు మరియు నేను చేయను. దేవునితో నేను చేసిన నిబంధనల ద్వారా, నా రక్షకుడైన యేసు క్రీస్తుకు కట్టుబడి ఉండాలని ఎంచుకొని, ‘నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను’ [ఫిలిప్పీయులకు 4:13]” (“యేసు క్రీస్తే ఉపశమనం,” లియహోనా, మే 2023, 82).

  23. కీర్తనలు 62:6-8 చూడండి.

  24. యాకోబు 2:17 చూడండి.

  25. మత్తయి 7:7-8 యాకోబు 1:5 చూడండి.

  26. “ఆయనే [పరిశుద్ధాత్మ] ఆదరణకర్త (యోహాను 14:26). ప్రేమగల తల్లిదండ్రుల ఓదార్పు స్వరం ఏడుస్తున్న పిల్లవాడిని నిశ్శబ్దం చేయగలదు, ఆత్మ యొక్క గుసగుసలు మన భయాలను శాంతపరచగలవు, మన జీవితంలో వేధించే చింతలను అణచివేయగలవు మరియు మనం దుఃఖించినప్పుడు మనలను ఓదార్చగలవు. పరిశుద్ధాత్మ మనలను ‘నిరీక్షణతో మరియు పరిపూర్ణమైన ప్రేమతో’ నింపగలడు మరియు ‘రాజ్యం యొక్క శాంతియుతమైన విషయాలను [మనకు] బోధించగలడు’ (మొరోనై 8:26; సిద్ధాంతము మరియు నిబంధనలు 36:2). (Topics and Questions, “Holy Ghost,” Gospel Library).

    “ఆయన [పరిశుద్ధాత్మ] ‘తండ్రి మరియు కుమారుడిని గూర్చి సాక్ష్యమిచ్చును’ (2 నీఫై 31:18). పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము తండ్రియైన దేవుడు మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు గురించి ఖచ్చితమైన సాక్ష్యాన్ని పొందగలము.

    “పరిశుద్ధాత్మ సత్యము గురించి సాక్ష్యమిస్తాడు మరియు ఆయన శక్తి ద్వారా మనము ‘అన్ని సంగతుల యొక్క సత్యమును తెలుసుకొనగలము’” (మొరోనై 10:5) (“The Holy Ghost Testifies of Truth,” లియహోనా, Mar. 2010, 14, 15).

    “అయితే తండ్రి నుండి నేను మీ దగ్గరకు పంపబోయే ఆదరణకర్త, అంటే తండ్రి నుండి బయలుదేరే సత్యపు ఆత్మ కూడా వచ్చినప్పుడు, అతను నన్ను గురించి సాక్ష్యమిస్తాడు” (యోహాను 15:26).

  27. యోహాను 14:6-7; 17:3 చూడండి

  28. జోసెఫ్ స్మిత్ అనువాదము, మత్తయి 7:17 (బైబిలు అనుబంధములో).

  29. రస్సల్ ఎమ్. నెల్సన్, “రండి, నన్ను వెంబడించుడి,” లియహోనా, మే 2019, 90.

  30. మార్కు 8:27-29 చూడండి.