సర్వసభ్య సమావేశము
మనుష్యునికి స్తుతి
2023 అక్టోబరు సర్వసభ్య సమావేశము


మనుష్యునికి స్తుతి

ఈ కడవరి యుగపు ప్రవక్త అయిన జోసెఫ్ స్మిత్ మనకు ఉన్నందున, మనకు తెలిసినవన్నీ తెలుసుకోవడంలో ఎంత సమృద్ధిగా మనము ఆశీర్వదించబడ్డాము.

నా ప్రియమైన సహోదరి మరియు సహోదరులారా, ఈ ఉదయం మీతో ఉన్నందుకు నేను గౌరవంగా భావిస్తున్నాను. ప్రభువు నన్ను ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను.

నా కళ్ళు మునుపటిలా లేవు. నేను వెళ్లి కంటి వైద్యుడిని కలిశాను, మరియు, “నేను టెలిప్రాంప్టర్‌ను చూడలేకపోతున్నాను” అని చెప్పాను.

మరియు ఆమె ఇలా అన్నారు, “సరే, మీ కళ్ళు వృద్ధాప్యంలో ఉన్నాయి. అవి మెరుగుపడవు.”

కాబట్టి నేను సాధ్యమైనంత చేస్తాను.

నేను, నా మనసులో ఉన్న కొన్ని విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. గత కొన్ని నెలలుగా ప్రవక్త జోసెఫ్ నా మనస్సులో ఉన్నట్లు అనిపిస్తూవుంది. నేను కూర్చొని, కాలముల సంపూర్ణ యుగపు ప్రవక్తగా మారడంలో అతని మహిమకరమైన బాధ్యత గురించి ఆలోచించాను.

జోసెఫ్ స్మిత్ అనే ఒక బాలుడు తన పాపాలు క్షమించబడాలంటే ఏమి చేయాలో తెలుసుకోవాలని, న్యూయార్క్‌లోని పామైరాలోనున్న తన ఇంటికి సమీపంలోని చెట్ల పొదలలోకి వెళ్లి, అక్కడ మోకరిల్లి మొదటిసారి బిగ్గరగా ప్రార్థించడానికి ధైర్యం చేయడం వలన యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సభ్యులుగా మనం ఎంతో కృతజ్ఞత కలిగియున్నామని నేను భావిస్తున్నాను (జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:14 చూడండి).

ఆ సందర్భంలో, మనం పరిశుద్ధ వనము అని పిలిచే ఆ పొదలలో జోసెఫ్ మోకరించినప్పుడు, ఆకాశం తెరుచుకుంది. మధ్యాహ్నకాల సూర్యుని కంటే ప్రకాశవంతంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు అతని ముందు ప్రత్యక్షమయ్యారు. ఒకరు అతనితో మాట్లాడి ఇలా అన్నారు, “[జోసెఫ్,] ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనను ఆలకించుము!” (జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:17). ఆ విధంగా యేసు క్రీస్తు యొక్క నిత్య సువార్త సంపూర్ణత యొక్క పునఃస్థాపన ప్రారంభమైంది.

మన రక్షకుడు మరియు విమోచకుడైన యేసు, బాలుడైన జోసెఫ్‌తో మాట్లాడి, మనం ఇప్పుడు జీవిస్తున్న ఈ చివరి కాలముల యుగమును తెరిచాడు కాబట్టి, “Praise to the man who communed with Jehovah!” అని పాడతాము. (“Praise to the Man,” Hymns, no. 27). జోసెఫ్ స్మిత్ కొరకు మరియు 1820లో న్యూయార్క్‌లోని పామైరాలోనున్న తన ఇంటి సమీపంలోని చెట్ల పొదలలోకి వెళ్ళడానికి ఆయన ధైర్యం చేసినందుకు, మేము ప్రభువుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

నేను మనకు తెలిసిన అన్ని అద్భుతమైన విషయాల గురించి మరియు మనకున్న అన్ని విషయాల గురించి ఆలోచిస్తున్నాను. నా ప్రియమైన సహోదరి మరియు సహోదరులారా, ఈ రోజు ఉదయం మీకు నా సాక్ష్యం ఏమిటంటే, ఈ కడవరి యుగపు ప్రవక్త అయిన జోసెఫ్ స్మిత్ మనకు ఉన్నందున, మనకు తెలిసినవన్నీ తెలుసుకోవడంలో ఎంతో సమృద్ధిగా మనము ఆశీర్వదించబడ్డాము.

మనం ఎవరో మరియు మన జీవితపు ఉద్దేశ్యం యొక్క జ్ఞానమును మనం కలిగియున్నాము.

దేవుడు ఎవరో మనకు తెలుసు; రక్షకుడెవరో మనకు తెలుసు, ఎందుకంటే తన పాప క్షమాపణ కోరుతూ బాలుడిగా చెట్ల పొదలలోకి వెళ్ళిన జోసెఫ్ మనతో ఉన్నాడు.

మన పరలోక తండ్రి మరియు ప్రభువైన యేసు క్రీస్తు ఈ కడవరి దినాలలో తమను తాము బయలుపరచుకోవడం, మరియు యేసు క్రీస్తు యొక్క నిత్య సువార్త సంపూర్ణతను పునఃస్థాపించడానికి జోసెఫ్ లేపబడటం, ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన అత్యంత మహిమాన్వితమైన మరియు అద్భుతమైన విషయాలలో ఒకటిగా నేను భావిస్తున్నాను.

మన వద్ద మోర్మన్ గ్రంథము ఉంది. సంఘ సభ్యత్వానికి మోర్మన్ గ్రంథము ఎంత అద్భుతమైన మరియు ఆశ్చర్యకరమైన బహుమతి. ఈ గ్రంథము, యేసే క్రీస్తు అని చెప్పడానికి మరొక సాక్షి, మరొక నిబంధన. మనము వీటిని కలిగి ఉన్నాము ఎందుకంటే జోసెఫ్ వెళ్ళి పలకలను పొందడానికి అర్హత కలిగియున్నాడు, దేవుని బహుమతి మరియు శక్తి ద్వారా వాటిని అనువదించడానికి మరియు ప్రపంచానికి గ్రంథాన్ని అందించడానికి పరలోకము నుండి ప్రేరణ పొందాడు.

ఈ ఉదయం నా సందేశం చాలా సరళమైనది అయినప్పటికీ, అది లోతైనది, మరియు అది ప్రవక్త జోసెఫ్ స్మిత్ మరియు అతనిని ఆదరించిన మరియు అతని యవ్వనంలో అతనిని నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్న నా సోదరులు మరియు సోదరీమణులందరి పట్ల ప్రేమతో నిండి ఉంది.

ఈ ఉదయం నేను అతని తల్లికి నివాళులు అర్పించాలనుకుంటున్నాను. పరిశుద్ధ వనములో జోసెఫ్ ఆ అనుభవం నుండి గృహానికి వచ్చి తన తల్లికి ఏమి జరిగిందో చెప్పినప్పుడు, లూసీ మాక్ స్మిత్ అతనిని నమ్మడం ఎంత అద్భుతంగా ఉందోనని నేను ఎప్పుడూ ఆలోచిస్తాను.

యేసు క్రీస్తు యొక్క నిత్య సువార్త యొక్క సంపూర్ణతను మరోసారి భూమిపై పునఃస్థాపించడానికి ప్రవక్తగా మారడానికి ప్రభువు అతనిపై ఉంచిన ఈ మహత్తరమైన బాధ్యతలో అతనిని ఆమెదించిన అతని తండ్రి మరియు అతని సోదరులు మరియు అతని సోదరీమణులు మరియు అతని కుటుంబానికి నేను కృతజ్ఞుడను.

కాబట్టి ఈ ఉదయం నా సాక్ష్యం ఏమిటంటే, యేసు క్రీస్తు లోక రక్షకుడని మరియు విమోచకుడని నాకు తెలుసు. మన పరలోక తండ్రి మరియు ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షమై, జోసెఫ్తో మాట్లాడి, ప్రవక్తగా మారడానికి అతడిని సిద్ధం చేశారని నాకు తెలుసు.

జీవితంలో మన ఉద్దేశ్యం గురించి మనకు ఏమి తెలుసు, మనం ఎందుకు ఇక్కడ ఉన్నాము, మన దైనందిన జీవితంలో మనం ఏమి చేయడానికి ప్రయత్నించాలి మరియు ఏమి సాధించాలి అనే దాని గురించి మనం తెలుసుకోవడం ఎంత ఆశీర్వాదకరమోనని నేను ఆశ్చర్యపోతున్నాను, మరియు మీలో చాలా మంది కూడా ఖచ్చితంగా చేస్తారని నేను అనుకుంటున్నాను. మనల్ని మనం సిద్ధం చేసుకునే ప్రక్రియలో మనము ఉన్నాము, ఒక రోజులో, కొంచెం మెరుగ్గా ఉండటానికి, కొంచెం దయగా ఉండటానికి, మన పరలోక తండ్రి మరియు ప్రభువైన యేసు క్రీస్తు ఉనికికి తిరిగి ప్రవేశించే ఆ రోజు కోసం మరికొంత సిద్ధంగా ఉండటానికి మనం ప్రయత్నిద్దాం, ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది.

అది నాకు ఇంకా కొంచెం దగ్గరవుతోంది. నాకు త్వరలో 95 ఏళ్లు వస్తాయి. నా పిల్లలుకొన్నిరోజులు కంటే నేను ఇంకా చాలా పెద్దవాడిని అని అనుకుంటున్నట్లు నాకు చెప్పారు, కానీ ఫరవాలేదు లే. నేను చేయగలిగినంత చేస్తాను.

కానీ దాదాపు 50 సంవత్సరాలుగా, సహోదరి సహోదరులారా, నేను సంఘము యొక్క ప్రధాన అధికారిగా నా నియామకంలో ప్రపంచాన్ని చుట్టే విశేషాధికారాన్ని పొందాను. ఇది ఒక అద్భుతమైన దీవెన. నేను ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు చాలా దగ్గరగా చేరానని అనుకుంటున్నాను. నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘ సభ్యులను కలిశాను.

ఓహ్, నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. మీ ముఖాల్లోకి చూడటం, మీ సమక్షంలో ఉండటం, మరియు ప్రభువు పట్ల మరియు యేసు క్రీస్తు సువార్త పునఃస్థాపన పట్ల మీకున్న ప్రేమను అనుభవించడం ఎంత అద్భుతమైన అనుభవం.

మన పరలోక తండ్రి ఇప్పుడు మనలను గమనించి, సమావేశము యొక్క అన్ని కార్యక్రమాలను ఆశీర్వదించును గాక. మరియు ఈ సర్వసభ్య సమావేశమునకు హాజరగుట ద్వారా మన హృదయాలలో ప్రభువు ఆత్మను కలిగియుండవచ్చు—మన ప్రియ రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తును సేవించుటకు మరియు ఆయన ఆజ్ఞలను పాటించుటకు మరియు మరింతగా అయనలా మారటానికి మనము కృషి చేస్తున్నప్పుడు ఆయన సువార్త పట్ల మనకున్న ప్రేమను పెంపొందించుదాము. మీరు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రభువు ఆత్మ మనతో ఉండును గాక. ఈ సమావేశము‌లో మనం కలిసి ఆరాధిస్తున్నప్పుడు మనం పరలోకము యొక్క శక్తిని అనుభూతి చెందుతాము.

యేసే క్రీస్తని నాకు తెలుసునని నా సాక్ష్యాన్ని మీకు ఇస్తున్నాను. ఆయన మన రక్షకుడు, మన విమోచకుడైయున్నారు. ఆయన మన మంచి స్నేహితుడు. యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో, ఆమేన్.