సర్వసభ్య సమావేశము
సిలెస్టియల్‌గా ఆలోచించండి!
2023 అక్టోబరు సర్వసభ్య సమావేశము


సిలెస్టియల్‌గా ఆలోచించండి!

మీ ఎంపికలు మూడు విషయాలను నిర్ణయిస్తాయి: నిత్యత్వమంతటిలో మీరు ఎక్కడ జీవిస్తారు, మీరు ఎటువంటి శరీరంతో పునరుత్థానం చెందుతారు మరియు మీరు శాశ్వతంగా ఎవరితో జీవిస్తారు.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈరోజు మీతో మాట్లాడుతున్నందుకు నేను చాలా కృతజ్ఞుడను. నా వయస్సులో, ప్రతీ క్రొత్తదినము అద్భుతమైన, అలాగే సవాళ్ళతో కూడిన ఆశ్చర్యాలను తెస్తుంది. మూడు వారాల క్రితం, నా వీపు కండరాలకు గాయమైంది. కాబట్టి, 100కు పైగా సర్వసభ్య సమావేశాలలో నేను నిలబడి ప్రసంగించినప్పటికీ, ఈరోజు కూర్చొని మాట్లాడాలని అనుకున్నాను. ఆత్మ ఈరోజు నా సందేశాన్ని మీ హృదయాలలోకి తీసుకెళ్ళాలని నేను ప్రార్థిస్తున్నాను.

ఇటీవల నేను 99వ పుట్టినరోజు జరుపుకున్నాను, అలా నా 100వ సంవత్సరం జీవితాన్ని ప్రారంభించాను. నేను చాలాకాలం జీవించడానికి గల రహస్యమేమిటని తరచు నన్ను అడుగుతారు. “సుమారు ఒక శతాబ్దకాలపు జీవితంలో నేను ఏమి నేర్చుకున్నాను?” అనేది సరైన ప్రశ్న అవుతుంది.

ఆ ప్రశ్నకు పూర్తిగా జవాబివ్వడానికి నేడు సమయం నన్ను అనుమతించదు, కానీ నేను నేర్చుకున్న అత్యంత కీలకమైన పాఠాలలో ఒకదానిని పంచుకుంటాను.

మనకోసం పరలోక తండ్రి ప్రణాళిక అద్భుతమైనదని, ఈ జీవితంలో మనం చేసేది నిజంగా ముఖ్యమైనదని మరియు మన తండ్రి యొక్క ప్రణాళికను సాధ్యం చేసేది రక్షకుని ప్రాయశ్చిత్తమేనని నేను నేర్చుకున్నాను.1

ఇటీవల తగిలిన గాయం చేత తీవ్రమైన నొప్పితో నేను పోరాడుతున్నప్పుడు, యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తము యొక్క అగోచరమైన బహుమానం కొరకు నేను మరింత ఎక్కువ ప్రశంసను అనుభవించాను. దాని గురించి ఆలోచించండి! రక్షకుడు “ప్రతి విధమైన బాధలు, శ్రమలు మరియు శోధనలు”2 అనుభవించారు, తద్వారా అవసరమైన సమయాల్లో ఆయన మనల్ని ఓదార్చగలరు, స్వస్థపరచగలరు, కాపాడగలరు.3 యేసు క్రీస్తు గెత్సేమనెలో మరియు కల్వరి పైన తన అనుభవాన్ని ఇలా వివరించారు: “ఆ శ్రమ అందరికంటే గొప్పవాడను అనగా దేవుడనైన నన్ను బాధ వలన వణకి, ప్రతి స్వేద రంధ్రము నుండి రక్తము కారునట్లు చేసెను.”4 నా గాయం మళ్ళీ మళ్ళీ నేను “ఇశ్రాయేలు పరిశుద్ధుని గొప్పతనము”5 పై ప్రతిబింబించేలా చేసింది. నేను స్వస్థపడుతున్న సమయంలో, ప్రభువు తన దైవిక శక్తిని శాంతియుతమైన, స్పష్టమైన మార్గాల్లో ప్రత్యక్షపరిచారు.

యేసు క్రీస్తు యొక్క అనంతమైన ప్రాయశ్చిత్తము మూలంగా మన పరలోక తండ్రి ప్రణాళిక ఒక పరిపూర్ణమైన ప్రణాళిక! దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళికను అర్థం చేసుకోవడం జీవితం నుండి రహస్యాన్ని మరియు మన భవిష్యత్తు నుండి అనిశ్చితిని తొలగిస్తుంది. ఇది మనలో ప్రతి ఒక్కరూ భూమిపై ఎలా జీవించాలో మరియు మనం శాశ్వతంగా ఎక్కడ జీవిస్తామో ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. “తినుము, త్రాగుము, సంతోషించుము, ఏలయనగా రేపు మనము చనిపోవుదుము; మరియు మనము క్షేమముగా ఉందుము”6 అనే నిరాధారమైన భావన విశ్వంలోని అత్యంత అనుచితమైన అబద్ధాలలో ఒకటి.

దేవుని ప్రణాళిక యొక్క గొప్ప వార్త ఇక్కడ ఉంది: మీ మర్త్య జీవితాన్ని ఉత్తమంగా మార్చే విషయాలు, ఖచ్చితంగా అవే విషయాలు నిత్యత్వము అంతటా మీ జీవితాన్ని ఉత్తమంగా మార్చగలవు! ఈ రోజు, పరలోక తండ్రి మీ కోసం కలిగియున్న గొప్ప దీవెనలకు అర్హత సాధించడంలో మీకు సహాయం చేయడానికి, “సిలెస్టియల్‌గా ఆలోచించడం!” అనే అభ్యాసాన్ని అవలంబించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.7 సిలెస్టియల్‌గా ఆలోచించడం అంటే ఆధ్యాత్మికంగా ఆలోచించడం. “ఆత్మానుసారమైన మనస్సు నిత్యజీవమైయున్నదని”8 మోర్మన్ గ్రంథ ప్రవక్తయైన జేకబ్ నుండి మనం నేర్చుకుంటాము.

మర్త్యత్వము అనేది గొప్ప నిత్య ప్రాముఖ్యతగల విషయాలను ఎంచుకోవడాన్ని నేర్చుకునే ఒక ప్రత్యేక తరగతి. చాలామంది ఈ జీవితాన్ని ఉన్నదున్నట్లుగా జీవిస్తున్నారు. అయితే, నేటి మీ ఎంపికలు మూడు విషయాలను నిర్ణయిస్తాయి: నిత్యత్వమంతటిలో మీరు ఎక్కడ జీవిస్తారు, మీరు ఎటువంటి శరీరంతో పునరుత్థానం చెందుతారు మరియు మీరు శాశ్వతంగా ఎవరితో జీవిస్తారు. కాబట్టి సిలెస్టియల్‌గా ఆలోచించండి.

సంఘము యొక్క అధ్యక్షునిగా నా మొదటి సందేశములో నేను, అంతమును మనస్సులో ఉంచుకొని ప్రారంభించాలని మిమ్మల్ని ప్రోత్సహించాను. దానర్థం సిలెస్టియల్ రాజ్యాన్ని మీ నిత్య లక్ష్యంగా చేసుకుని, ఇక్కడ భూమిపై ఉన్నప్పుడు మీరు చేసే ప్రతి నిర్ణయం మిమ్మల్ని తదుపరి లోకంలో ఎక్కడ ఉంచుతుందో జాగ్రత్తగా పరిశీలించడం.9

దేవాలయంలో భార్యాభర్తలుగా ముద్రింపబడి, తమ నిబంధనలను పాటించే స్త్రీ పురుషులు మాత్రమే నిత్యత్వమంతటా కలిసి ఉంటారని ప్రభువు స్పష్టంగా బోధించారు. ఆయన ఇలా చెప్పారు, “పరిశుద్ధాత్మ వాగ్దానము వలన చేయబడని, ప్రవేశింపని మరియు ముద్రింపబడని అన్ని నిబంధనలు, ఒప్పందములు, ఒడంబడికలు, బాధ్యతలు, వాగ్దానములు, ప్రమాణములు, ఆచరణలు, సంబంధములు, సాంగత్యములు లేదా నిరీక్షణలు … మనుష్యులు మరణించిన తరువాత అంతమగును.”10

ఆవిధంగా, మనం అవివేకంతో ఇప్పుడు టిలెస్టియల్ చట్టాలను జీవించాలని ఎంచుకుంటే, మనం టిలెస్టియల్ శరీరంతో పునరుత్థానం చెందాలని ఎంచుకుంటున్నాము. మన కుటుంబాలతో శాశ్వతంగా జీవించకూడదని మనం ఎంచుకుంటున్నాము.

కాబట్టి, నా ప్రియమైన సహోదర సహోదరీలారా, ఎలా, ఎక్కడ మరియు ఎవరితో మీరు శాశ్వతంగా ఉండాలని కోరుతున్నారు? మీరు ఎంచుకోవచ్చు.11

మీరు ఎంపికలు చేసినప్పుడు, సుదీర్ఘ దృష్టితో—నిత్య దృష్టితో చూడమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. యేసు క్రీస్తుకు ప్రాధాన్యమివ్వండి, ఎందుకంటే మీ నిత్యజీవము ఆయన యందు మరియు ఆయన ప్రాయశ్చిత్తమందు మీ విశ్వాసంపై ఆధారపడియుంది.12 అది ఆయన చట్టాలకు మీ విధేయతపై కూడా ఆధారపడియుంది. విధేయత ఈ రోజు మీకు సంతోషకరమైన జీవితానికి మరియు రేపు గొప్ప, నిత్య బహుమానానికి మార్గం సుగమం చేస్తుంది.

మీరు గందరగోళాన్ని ఎదుర్కొన్నప్పుడు, సిలెస్టియల్‌గా ఆలోచించండి! శోధన చేత పరీక్షించబడినప్పుడు, సిలెస్టియల్‌గా ఆలోచించండి! జీవితం లేదా ప్రియమైన వారు మిమ్మల్ని నిరాశపరిచినప్పుడు, సిలెస్టియల్‌గా ఆలోచించండి! ఎవరైనా అకాలంగా మరణించినప్పుడు, సిలెస్టియల్‌గా ఆలోచించండి. ఎవరైనా వినాశకరమైన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, సిలెస్టియల్‌గా ఆలోచించండి. జీవితం యొక్క ఒత్తిళ్ళు మీపైకి వచ్చినప్పుడు, సిలెస్టియల్‌గా ఆలోచించండి! మీరు ఒక ప్రమాదం లేదా గాయం నుండి కోలుకుంటున్నప్పుడు, నేను ఇప్పుడు చేస్తున్నట్లుగా, సిలెస్టియల్‌గా ఆలోచించండి!

సిలెస్టియల్‌గా ఆలోచించడంపై మీరు దృష్టిపెట్టినప్పుడు, వ్యతిరేకతను ఎదుర్కోవడాన్ని ఆశించండి.13 దశాబ్దాల క్రితం, ఒక వృత్తిసంబంధ సహోద్యోగి నాలో “చాలా ఎక్కువ పరిశుద్ధత” ఉందని నన్ను విమర్శించాడు మరియు నా విశ్వాసం కారణంగా ఒకరి కంటే ఎక్కువమంది అధికారులు నన్ను శిక్షించారు. అయితే, సిలెస్టియల్‌గా ఆలోచించడం నా వృత్తి జీవితాన్ని మెరుగుపరచిందని నేను నమ్ముతున్నాను.

మీరు సిలెస్టియల్‌గా ఆలోచించినప్పుడు, మీ హృదయం క్రమంగా మారుతుంది. మరింత తరచుగా, మరింత మనఃపూర్వకంగా ప్రార్థించాలని మీరు కోరుకుంటారు. దయచేసి మీ ప్రార్థనలు కొనుగోలు జాబితాలాగా ఉండనివ్వకండి. ప్రభువు దృక్పథం మీ మర్త్య జ్ఞానానికి మించినది. మీ ప్రార్థనలకు ఆయనిచ్చే జవాబు మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు మరియు సిలెస్టియల్‌గా ఆలోచించడానికి మీకు సహాయపడవచ్చు.

లిబర్టీ చెరసాలలో ఉపశమనం కోసం ప్రార్థించినప్పుడు జోసెఫ్ స్మిత్‌కు ప్రభువు ఇచ్చిన జవాబును పరిగణించండి. అతనిపట్ల అమానుషంగా వ్యవహరించడం అతనికి అనుభవమునిస్తుందని, అతని మేలుకొరకేనని ప్రభువు ప్రవక్తకు బోధించారు.14 “దానిని నీవు సహించిన యెడల, దేవుడు నిన్ను ఉన్నతమునకు హెచ్చించును” 15 అని ప్రభువు వాగ్దానమిచ్చారు. ప్రభువు జోసెఫ్‌కు సిలెస్టియల్‌గా ఆలోచించమని మరియు రోజూ పడే బాధాకరమైన ఇబ్బందులపై దృష్టి పెట్టడానికి బదులు నిత్య బహుమానాన్ని ఊహించమని బోధిస్తున్నారు. మన ప్రార్థనలు మన పరలోక తండ్రితో సజీవ చర్చలు కాగలవు—మరియు కావాలి.

మీరు సిలెస్టియల్‌గా ఆలోచించినప్పుడు, మీ కర్తృత్వాన్ని దోచుకునే దేనినైనా మీరు తప్పించుకుంటారు. ఏదైనా వ్యసనం—అది ఆట, జూదం, అప్పులు, మాదకద్రవ్యాలు, మద్యం, కోపం, అశ్లీలత, లైంగిక సంబంధం లేదా ఆహారం ఏదైనా కావచ్చు—అది దేవుడిని కించపరుస్తుంది. ఎందుకు? ఎందుకంటే మీ వ్యామోహం మీ దేవుడిగా మారుతుంది. మీరు ఓదార్పు కోసం ఆయన వైపు కాకుండా దాని వైపు చూస్తారు. మీరు వ్యసనంతో పోరాడుతున్నట్లయితే, మీకు అవసరమైన ఆధ్యాత్మిక సహాయాన్ని, నిపుణుల సహాయాన్ని కోరండి. దయచేసి దేవుని అద్భుతమైన ప్రణాళికను అనుసరించే మీ స్వేచ్ఛను ఒక వ్యామోహం దోచుకోనివ్వకండి.

సిలెస్టియల్‌గా ఆలోచించడం పవిత్రత యొక్క చట్టానికి లోబడేందుకు కూడా మీకు సహాయపడుతుంది. ఈ దైవిక చట్టాన్ని ఉల్లంఘించడం కంటే మీ జీవితాన్ని త్వరగా క్లిష్టతరం చేసే విషయాలు చాలా తక్కువగా ఉంటాయి. దేవునితో నిబంధనలు చేసుకున్న మీరు, మీ సాక్ష్యాన్ని కోల్పోవడానికి గల త్వరిత మార్గాలలో ఒకటి అనైతికత.

విరోధి యొక్క అతిక్రూరమైన శోధనలలో ఎక్కువమట్టుకు నైతిక స్వచ్ఛత ఉల్లంఘనలు ఉంటాయి. జీవితాన్ని సృష్టించే శక్తి అనేది దైవత్వం యొక్క ఒక ప్రత్యేక హక్కు, ఆయన మర్త్య సంతానం దానిని సాధన చేయడానికి పరలోక తండ్రి అనుమతిస్తారు. అందువలన, సజీవమైన ఈ దైవిక శక్తిని ఉపయోగించడం కోసం దేవుడు స్పష్టమైన మార్గదర్శకాలను ఏర్పాటు చేసారు. శారీరక సాన్నిహిత్యం అనేది కేవలం ఒకరినొకరు వివాహం చేసుకున్న స్త్రీ పురుషుల కొరకైనది.

ప్రపంచంలో అధికశాతం దీనిని విశ్వసించరు, అయితే ప్రజాభిప్రాయం సత్యానికి మధ్యవర్తి కాదు. అపవిత్రులెవరూ సిలెస్టియల్ రాజ్యాన్ని పొందలేరని ప్రభువు ప్రకటించారు. కాబట్టి నైతికత గురించి మీరు నిర్ణయాలు చేసేటప్పుడు, దయచేసి సిలెస్టియల్‌గా ఆలోచించండి. ఒకవేళ మీరు అపవిత్రులుగా ఉన్నట్లయితే, పశ్చాత్తాపపడమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. క్రీస్తు యొద్దకు రండి మరియు మీ పాపాల కొరకు మీరు పూర్తిగా పశ్చాత్తాపపడినప్పుడు, ఆయన వాగ్దానమిచ్చిన సంపూర్ణ క్షమాపణను పొందండి.16

మీరు సిలెస్టియల్‌గా ఆలోచించినప్పుడు, శ్రమలు మరియు వ్యతిరేకతలను మీరు క్రొత్త కోణంలో చూస్తారు. మీరు ప్రేమించే వారెవరైనా సత్యంపై దాడి చేసినప్పుడు, సిలెస్టియల్‌గా ఆలోచించండి మరియు మీ సాక్ష్యాన్ని ప్రశ్నించకండి. “కడవరి దినములలో కొందరు మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని”17 అపొస్తలుడైన పౌలు ప్రవచించాడు.

విరోధి మోసాలకు అంతం లేదు. దయచేసి సిద్ధంగా ఉండండి. అవిశ్వాసుల నుండి ఎన్నడూ సలహా తీసుకోవద్దు. మీరు నమ్మే స్వరాల నుండి—ప్రవక్తలు, దీర్ఘదర్శులు, బయల్పాటుదారుల నుండి మరియు పరిశుద్ధాత్మ యొక్క గుసగుసల నుండి నడిపింపు కోరండి, వారు “మీరు చేయవలసిన కార్యములు అన్నిటినీ మీకు చూపుతారు.”18 వ్యక్తిగత బయల్పాటు పొందడానికి మీ సామర్థ్యమును పెంచుకోవడానికి దయచేసి ఆధ్యాత్మిక పని చేయండి.19

మీరు సిలెస్టియల్‌గా ఆలోచించినప్పుడు, మీ విశ్వాసం పెరుగుతుంది. నేను యువ వైద్యవిద్యార్థి‌గా ఉన్నప్పుడు, నా ఆదాయం నెలకు $15. ఒక రాత్రి, నా భార్య డాంట్జెల్ నేను ఆ కొద్దిపాటి జీతం‌లో దశమభాగం చెల్లిస్తున్నానా అని అడిగింది. నేను చెల్లించడం లేదు. నేను త్వరగా పశ్చాత్తాపపడ్డాను మరియు నెలవారీ దశమభాగంలో అదనంగా $1.50 చెల్లించడం ప్రారంభించాను.

మేము మా దశమభాగాన్ని పెంచినందువల్ల సంఘము ఏమైనా భిన్నంగా ఉందా? అస్సలు కాదు. అయితే, పూర్తి దశమభాగాన్ని చెల్లించువానిగా కావడం నన్ను మార్చివేసింది. దశమభాగం చెల్లించడమనేది డబ్బుకు కాదు, విశ్వాసానికి మాత్రమే సంబంధించినదని అప్పుడు నేను తెలుసుకున్నాను. నేను పూర్తి దశమభాగాన్ని చెల్లించువానిగా మారడంతో, నా కోసం ఆకాశపు వాకిండ్లు తెరుచుకోవడం మొదలైంది. అనేక తదుపరి వృత్తిపరమైన అవకాశాలను మా నమ్మకమైన దశమభాగాల చెల్లింపుకు నేను ఆపాదిస్తాను.20

దశమభాగాన్ని చెల్లించడానికి విశ్వాసం కావాలి, అది దేవునిలో మరియు ఆయన ప్రియ కుమారునిలో కూడా విశ్వాసాన్ని పెంపొందిస్తుంది.

లైంగికపరమైన, రాజకీయపరమైన ప్రపంచంలో ధర్మబద్ధమైన జీవితాన్ని జీవించడానికి ఎంచుకోవడం విశ్వాసాన్ని పెంపొందిస్తుంది.

దేవాలయములో ఎక్కువ సమయాన్ని గడపడం విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. దేవాలయంలో మీ సేవ మరియు ఆరాధన మీరు సిలెస్టియల్‌గా ఆలోచించడానికి సహాయపడుతుంది. దేవాలయము అనేది బయల్పాటు యొక్క స్థలము. అక్కడ సిలెస్టియల్ జీవితం వైపు ఎలా పురోగమించాలో మీకు చూపబడుతుంది. అక్కడ మీరు రక్షకునికి దగ్గరవుతారు మరియు ఆయన శక్తికి ఎక్కువ అవకాశమివ్వబడతారు. అక్కడ మీరు మీ జీవితంలోని సమస్యలను, మీ అత్యంత జటిలమైన సమస్యలను కూడా పరిష్కరించడంలో మార్గనిర్దేశం పొందుతారు.

దేవాలయం యొక్క విధులు మరియు నిబంధనలు నిత్య ప్రాముఖ్యత గలవి. ఈ పవిత్రమైన అవకాశాలను మీలో ప్రతీఒక్కరి జీవితంలో నిజం చేయడానికి మేము మరిన్ని దేవాలయాలను నిర్మించడం కొనసాగిస్తున్నాము. క్రింది 20 ప్రదేశాలలో ప్రతీదానిలో ఒక దేవాలయం నిర్మించడానికి మా ప్రణాళికలు ప్రకటించడానికి మేము కృతజ్ఞత కలిగియున్నాము:

  • సవాయి, సమోవా

  • కంకున్, మెక్సికో

  • పియురా, పెరూ

  • హుయాన్కాయో, పెరూ

  • విన్యా డెల్ మార్, చిలీ

  • గోయానియా, బ్రెజిల్

  • జోయాయో పెస్సోవా, బ్రెజిల్

  • కలబార్, నైజీరియా

  • కేప్ కోస్ట్, ఘనా

  • లువాండా, అంగోలా

  • ఎంబుజీ-మయి, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో

  • లావోగ్, ఫిలిప్పీన్స్

  • ఒసాకా, జపాన్

  • కహులుయి, మావుయి, హవాయి

  • ఫెయిర్‌బ్యాంక్స్, అలాస్కా

  • వాంకోవర్, వాషింగ్టన్

  • కొలరాడో స్ప్రింగ్స్, కొలరాడో

  • తుల్సా, ఓక్లహోమా

  • రోవనోకే, వర్జీనియా

  • ఉలాన్‌బాతర్, మంగోలియా

సిలెస్టియల్‌గా ఆలోచించడానికి మనకు సహాయపడేందుకు ఈ దేవాలయాలను నిర్మించమని ప్రభువు మనల్ని నిర్దేశిస్తున్నారు. దేవుడు జీవిస్తున్నాడు. యేసే క్రీస్తు. దేవుని పిల్లలందరిని దీవించడానికి ఆయన సంఘము పునఃస్థాపించబడింది. ఈవిధంగా యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. యోహాను 6:38 చూడండి.

  2. ఆల్మా 7:11.

  3. ఆల్మా 7:12 చూడండి.

  4. సిద్ధాంతము మరియు నిబంధనలు 19:18.

  5. 2 నీఫై 9:40.

  6. 2 నీఫై 28:7.

  7. మనం చనిపోవడానికి మరియు పునరుత్థానం చెందడానికి మధ్య గల సమయంలో తరువాతి లోకంలో కంటే, మన ఆత్మ మన శరీరంతో ఏకమై ఉన్నప్పుడు, ఇక్కడ పశ్చాత్తాపం చెందడం మరియు ఆధ్యాత్మికంగా పురోగమించడం సులభం అని ఇది నిరూపించవచ్చు. విశ్వాసభ్రష్టులైన జోరమీయులకు అమ్యులెక్ బోధించినట్లుగా, “ఈ జీవితము దేవుడిని కలుసుకొనుటకు … సిద్ధపడు సమయమైయున్నది” (ఆల్మా 34:32–35 చూడండి).

  8. 2 నీఫై 9:39.

  9. మోషైయ 4:30 చూడండి, అందులో రాజైన బెంజమిన్ తన జనులను ఇలా హెచ్చరించాడు: “మీరు మిమ్ములను, మీ తలంపులను, మీ మాటలను, మీ క్రియలను కనిపెట్టుకొనియుండి, దేవుని ఆజ్ఞలను పాటించి … విశ్వాసమందు మీ జీవితాంతము కొనసాగని యెడల మీరు నశించెదరు.”

  10. సిద్ధాంతము మరియు నిబంధనలు 132:7 ; వివరణ చేర్చబడింది.

  11. వాస్తవానికి, మీ కర్తృత్వము మరొకరి కర్తృత్వమును మరియు వెంటవచ్చు పరిణామాలను భర్తీ చేయలేదు. నేను నా తల్లిదండ్రులతో ముద్రింపబడతాననే ఆశ లేకుండా ఉన్నాను. ఏమైనప్పటికీ, వారు 80 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సులో ఉన్నప్పుడు వారు వరము పొందడానికి ఎంపిక చేసుకునే వరకు నేను వేచి ఉండాల్సి వచ్చింది. అప్పుడు వారు భార్యాభర్తలుగా ముద్రింపబడ్డారు మరియు పిల్లలమైన మేము వారితో ముద్రింపబడ్డాము.

  12. రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క మంచితనము, కనికరము మరియు కృప ద్వారా మాత్రమే నిత్యజీవము యొక్క బహుమానము సాధ్యమవుతుందని లేఖనాలు పదేపదే సాక్ష్యమిస్తున్నాయి (ఉదాహరణకు, మొరోనై 7:41 చూడండి; 2 నీఫై 2:6–8, 27 కూడా చూడండి).

  13. 2 నీఫై 2:11 చూడండి.

  14. సిద్ధాంతము మరియు నిబంధనలు 122:7 చూడండి.

  15. సిద్ధాంతము మరియు నిబంధనలు 121:8.

  16. యెషయా 1:16-18 చూడండి; సిద్ధాంతము మరియు నిబంధనలు 58:42-43.

  17. 1 తిమోతి 4:1. ఆ అబద్ధికులు వేషధారులు, వాత వేయబడిన మనస్సాక్షిగలవారు” (2వ వచనము) అని తరువాతి వచనము కొనసాగుతుంది. “క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రదుకనుద్దేశించు వారందరు హింస పొందుదురు” (2 తిమోతి 3:12) అని కూడా పౌలు ప్రకటించాడు.

  18. 2 నీఫై 32:5; వివరణ చేర్చబడింది. మనము అడిగినయెడల, “బయల్పాటు వెంబడి బయల్పాటును, జ్ఞానము వెంబడి జ్ఞానమును” మనము పొందవచ్చు (సిద్ధాంతము మరియు నిబంధనలు 42:61).

  19. రస్సెల్ ఎమ్. నెల్సన్, “సంఘము కొరకు బయల్పాటు, మన జీవితాల కొరకు బయల్పాటు,” లియహోనా, మే 2018, 96 చూడండి.

  20. ఇది కారణ పరిణామాల సంబంధాన్ని సూచించడం కాదు. ఎన్నడూ దశమభాగం చెల్లించని కొందరు వృత్తిపరమైన అవకాశాలను పొందుతారు, అయితే దశమభాగం చెల్లించే కొందరు పొందలేరు. దశమభాగం చెల్లించేవారికి ఆకాశపు వాకిండ్లు తెరువబడతాయన్నది వాగ్దానం. దీవెనల స్వభావం మారుతూ ఉంటుంది.