సర్వసభ్య సమావేశము
నీ పొరుగువానిని ప్రేమింపవలెను
2023 అక్టోబరు సర్వసభ్య సమావేశము


నీ పొరుగువానిని ప్రేమింపవలెను

కరుణ క్రీస్తు యొక్క లక్షణం. ఇది ఇతరులపై ప్రేమతో పుట్టింది మరియు దీనికి సరిహద్దులు తెలియవు.

ఈ ఉదయం, ఒక ఆఫ్రికన్ ప్రయాణాన్ని దృశ్యీకరించుకొని నాతో చేరాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరు సింహాలను, జీబ్రాలను లేదా ఏనుగులను ఏమీ చూడరు, కానీ బహుశా, ప్రయాణం ముగిసే సమయానికి, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క వేలాది మంది సభ్యులు “నీ పొరుగువానిని ప్రేమింపవలెను” అనే క్రీస్తు యొక్క రెండవ గొప్ప ఆజ్ఞకు ఏ రీతిలో ఎలా స్పందిస్తున్నారో మీరు చూడవచ్చు (మార్కు 12:31).

ఆఫ్రికాలోని గ్రామీణ ప్రాంతమందున్న ఎర్ర మట్టిని ఒక్క క్షణం ఊహించుకోండి. ఎండిపోయిన బంజరు భూమిని చూస్తే చాలా సంవత్సరాలుగా లెక్కించదగిన పరిమాణంలో వర్షం పడలేదని మీరు గమనిస్తారు. మీ మార్గాన్ని దాటే కొన్ని పశువులు మాంసంతోగాక ఎక్కువ ఎముకలతో నిండియుండి మరియు దుప్పటి కప్పుకున్న కరమజోంగ్ పశువుల కాపరి చేత నడపబడుతున్నాయి, అతను చెప్పులేసుకున్న పాదాలతో, వృక్షసంపద మరియు నీటిని కనుగొనాలనే ఆశతో కష్టముతో సాగిపోవుచున్నాడు.

మీరు కఠినమైన ఈ రాతి రహదారిలో సాగిపోవుచున్నప్పుడు, మీరు అనేక అందమైన పిల్లల సమూహాలను చూస్తారు మరియు వారు పాఠశాలలో ఎందుకు లేరని ఆశ్చర్యపోతారు. పిల్లలు చిరునవ్వుతో చేతులు ఊపుతారు, మీరు కన్నీళ్లు మరియు చిరునవ్వుతో తిరిగి చేతులు ఊపుతారు. ఈ ప్రయాణంలో మీరు చూసే చిన్న పిల్లలలో తొంభై రెండు శాతం మంది ఆహారలేమితో జీవిస్తున్నారు మరియు మీ హృదయం వేదనతో విలపిస్తుంది.

ముందు, ఒక తల్లి తన తలపై ఐదు గ్యాలన్ల (19 L) నీటి పాత్రను, తన చేతిలో మరొకటి మోయడాన్ని మీరు చూస్తారు. ఆమె ఈ ప్రాంతంలోని ప్రతి రెండు గృహాలలో ఒకదానికి ప్రాతినిధ్యం వహిస్తుంది, ఇక్కడ మహిళలు, యువకులు మరియు వృద్ధులు, ప్రతి రోజు, వారి కుటుంబం కోసం నీటి వనరు వద్దకు ప్రతి మార్గంలో 30 నిమిషాల కంటే ఎక్కువ నడుస్తారు. హఠాత్తైన, తీవ్రమైన విచారాన్ని మీరు అనుభవిస్తారు.

చిత్రం
నీటిని మోస్తున్న ఆఫ్రికన్ మహిళ .

రెండు గంటలు గడిచాయి మరియు మీరు ఏకాంతంగా, నీడ ఉన్న నిర్మలమైన ప్రదేశాని‌కి చేరుకుంటారు. సమావేశ స్థలం ఒక హాలు లేదా గుడారం కాదు, మండుతున్న ఎండ నుండి ఆశ్రయం పొందటాని‌కి కొన్ని పెద్ద చెట్ల క్రిందనున్న ప్రదేశం. ఈ స్థలంలో, పారే నీళ్ళు, కరెంటు, ఫ్లష్ టాయిలెట్లు లేవని మీరు గమనించవచ్చు. మీరు చుట్టూ చూస్తారు మరియు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులలో మీరు ఉన్నారని తెలుసుకుంటారు మరియు మీరు వారి పట్ల దేవుని ప్రేమను తక్షణమే అనుభూతి చెందుతారు. వారు సహాయం మరియు నిరీక్షణ పొందేందుకు గుమిగూడారు, మరియు మీరు దానిని పంచుకోవడానికి వచ్చారు.

మా ప్రధాన ఉపశమన సమాజ అధ్యక్షురాలు సహోదరి కెమిల్ జాన్సన్ మరియు ఆమె భర్త డగ్, సంఘము యొక్క మానవతా సేవల డైరెక్టర్ సహోదరి షారన్ యూబ్యాంక్‌లతో కలిసి సహోదరి ఆర్డెర్న్ మరియు నేను, సంఘము యొక్క మధ్య ఆఫ్రికా ప్రాంతంలోని 47 మిలియన్ల జనాభా ఉన్న ఉగాండాలో చేసిన ప్రయాణం అలాంటిదే. ఆ రోజు, చెట్ల నీడ కింద, మేము సంఘము యొక్క మానవతా సేవలు, UNICEF మరియు ఉగాండా ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిధులు సమకూర్చే కమ్యూనిటీ హెల్త్ ప్రాజెక్ట్‌ను సందర్శించాము. ఇవి విశ్వసనీయ సంస్థలు, సంఘ సభ్యుల విరాళాల మానవతా నిధులు వివేకంతో ఉపయోగించబడుతున్నాయని నిర్ధారించడానికి జాగ్రత్తగా ఎంపిక చేయబడ్డాయి.

చిత్రం
ఆఫ్రికన్ పిల్లవాడు సంరక్షణ పొందుతున్నాడు.

పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలను, క్షయ, మలేరియా మరియు ఎడతెగని విరేచనాల ప్రభావాలను చూడటం ఎంత హృదయవిదారకమైనదో , మేము కలిసిన వారి మంచి భవిష్యత్తు కోసం మాలో ప్రతి ఒక్కరిలో నిరీక్షణ పెరిగింది.

చిత్రం
తల్లి తన బిడ్డకు ఆహారం తినిపిస్తోంది.

సంఘ మానవతా ప్రయత్నానికి, సమయం మరియు ధనమును విరాళంగా అందించే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘ సభ్యుల దయ ద్వారా, కొంతవరకు, ఆ నిరీక్షణ వచ్చింది. జబ్బుపడినవారు మరియు బాధలో ఉన్నవారు ఆదుకోబడటం చూసి, నేను కృతజ్ఞతతో తల వంచుకున్నాను. ఆ సమయంలో, రాజుల రాజు ఇలా చెప్పిన దాని అర్థమేమిటో నేను బాగా గ్రహించాను:

“నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి … :

నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని, నన్ను చేర్చుకొంటిరి” (మత్తయి 25:34–35).

“మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి” అని మన రక్షకుడు మనల్ని వేడుకున్నారు (మత్తయి 5:16 14–15 వచనాలను కూడా చూడండి). భూమి యొక్క ఆ సుదూర మూలలో, మీ మంచి పనులు జీవితాలను ప్రకాశవంతం చేశాయి మరియు తీరని కష్టాల్లో ఉన్న ప్రజల భారాన్ని తగ్గించాయి, మరియు దేవుడు మహిమపరచబడ్డాడు.

ఆ వేడి మరియు ధూళితోనున్న రోజున, దేవునికి హృదయపూర్వక ప్రశంసలు మరియు కృతజ్ఞతతో చేసిన వారి ప్రార్థనలను మీరు వినాలని నేను కోరుకుంటున్నాను. వారు తమ మాతృభాష అయిన కరమజోంగ్‌లో “అలకారా” అని నేను మీకు చెప్పవలసిందిగా కోరుకుంటున్నారు. మీకు ధన్యవాదాలు!

మా ప్రయాణం మంచి సమరయుని యొక్క ఉపమానాన్ని నాకు గుర్తు చేసింది, నేను వివరించిన విధంగా, యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళే దారిలా కాకుండా, అతని ప్రయాణం మురికి రహదారిపై అతన్ని తీసుకువెళ్లింది. ఈ పరిచర్య సమరయుడు “నీ పొరుగువారిని ప్రేమించడం” అంటే ఏమిటో మనకు బోధిస్తాడు.

అతను చూసాడు “ఒక మనుష్యుడు … దొంగల చేతిలో చిక్కెను; వారు [అతని] బట్టలు దోచుకొని, అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి” (లూకా 10:30). ఆ సమరయుడు “అతనిమీద జాలిపడెను” (లూకా 10:33).

కరుణ క్రీస్తు యొక్క లక్షణం. ఇది ఇతరులపై ప్రేమతో పుట్టింది మరియు దీనికి సరిహద్దులు తెలియవు. లోక రక్షకుడైన యేసు, కరుణకు ప్రతిరూపం. “యేసు కన్నీళ్లు విడిచెను” (యోహాను 11:35) అని చదివినప్పుడు, మరియ మరియు మార్తలాగా మనం కూడా ఆయన కరుణకు సాక్షులం, అది ఆయనను మొదట ఆత్మలో మూలుగుచూ మరియు కలత చెందేలా చేసింది (యోహాను 11:33 చూడండి). క్రీస్తు యొక్క కనికరానికి ఉదాహరణగా ఉన్న మోర్మన్ గ్రంథములో, యేసు అనేకమందికి కనిపించి ఇలా అన్నారు:

“కుంటివారు, గ్రుడ్డివారు, … చెవిటి వారు లేదా ఏ విధముగానైనా బాధింపబడిన వారు మీలోనున్నారా? వారిని ఇక్కడకు తీసుకురండి, నేను వారిని స్వస్థపరిచెదను, ఏలయనగా నేను మీ యెడల కనికరము కలిగియున్నాను. …

… మరియు ఆయన వారిలో ప్రతివానిని స్వస్థపరిచెను” (3 నీఫై 17:7, 9).

ప్రతి విషయములో మన ప్రయత్నం ఉన్నప్పటికీ, మీరు మరియు నేను ప్రతి ఒక్కరినీ స్వస్థపరిచాము, కానీ మనలో ప్రతి ఒక్కరూ ఒకరి జీవితంలో మంచి కోసం ఒక మార్పును చేయగలరు. ఐదు వేలమందికి ఆహారం ఇచ్చే ఐదు రొట్టెలు, మరియు రెండు చేపలను అందించినది కేవలం ఒక బాలుడు, కేవలం ఒక బాలుడు మాత్రమే. “ఇంత మందికి ఇవి ఏమాత్రము?” అని రొట్టెలు మరియు చేపల గురించి శిష్యుడు అంద్రెయ అడిగినట్లుగా మనం మన అర్పణ గురించి అడగవచ్చు. (యోహాను 6:9). నేను మీకు భరోసా ఇస్తున్నాను: మీరు చేయగలిగినది ఇవ్వడం లేదా చేయడం సరిపోతుంది మరియు మీ ప్రయత్నాన్ని గొప్పగా చేయడానికి క్రీస్తును అనుమతించండి.

ఈ విషయంపై, ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ మనల్ని ఇలా ఆహ్వానించారు, “ధనికులమైనా లేదా పేదవారమైనా, ఇతరులు అవసరతలో ఉన్నప్పుడు ‘మనకు సాధ్యమైనది చేయాలి.’” అప్పుడు ఆయన నాలాగే సాక్ష్యమిచ్చాడు, “దేవుడు మీకు సహాయం చేస్తాడు మరియు [మీ] దయగల శిష్యత్వ చర్యలలో మీకు మార్గనిర్దేశం చేస్తాడు” (“Are We Not All Beggars?,” లియహోనా, నవం. 2014, 41).

ఆ సుదూర దేశంలో, ఆ మరచిపోలేని రోజున, ధనిక మరియు పేద సంఘ సభ్యుల ఆత్మను కదిలించే మరియు జీవితాన్ని మార్చే కరుణకు సాక్షిగా అప్పుడు మరియు ఇప్పుడు నేను నిలబడి ఉన్నాను.

మంచి సమరయుని యొక్క ఉపమానంలో అతడు “[మనిషి] గాయములను కట్టివేసాడు … మరియు అతనిని జాగ్రత్తగా పరామర్శించెను” (లూకా 10:34). మన సంఘ మానవతా ప్రయత్నాలు మనం ప్రకృతి వైపరీత్యాలకు త్వరగా ప్రతిస్పందించడం మరియు ప్రపంచంలోని విస్తృతమైన వ్యాధులు, ఆకలి, శిశు మరణాలు, పోషకాహార లోపం, స్థానభ్రంశం మరియు తరచుగా కనిపించని నిరుత్సాహం, నిరాశ మరియు నిస్పృహ వంటి గాయాలను కడుతున్నాయి.

అప్పుడు సమరయుడు “రెండు దేనారములు తీసి ఆ పూట కూళ్లవానికిచ్చి–ఇతని పరామర్శించుము” అని చెప్పాడు (లూకా 10:35). ఒక సంఘముగా, మన మానవతా ప్రయత్నాలలో సహాయం చేయడానికి ఇతర “అతిధేయులు” లేదా కాథలిక్ ఉపశమన సేవలు, UNICEF మరియు రెడ్‌ క్రాస్/రెడ్ క్రెసెంట్ వంటి సంస్థలతో సహకరించినందుకు మేము కృతజ్ఞులము. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది భరించాల్సిన భారాన్ని తగ్గించే మీ “రెండు దేనారములు” లేదా రెండు యూరోలు, రెండు పెసోలు లేదా రెండు షిల్లింగ్‌లకు మేము సమానంగా కృతజ్ఞులము. మీ సమయం, డాలర్లు మరియు రూపాయల గ్రహీతలను మీరు తెలుసుకోవడం అసంభవం, కానీ కరుణకు వారిని తెలుసుకోవలసిన అవసరం మాకు లేదు, వారిని ప్రేమించడం మాత్రమే దానికి అవసరం.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్, “మన పూర్ణ హృదయాలతో మనం దేవుని ప్రేమించినప్పుడు, ఆయన మన హృదయాలను ఇతరుల శ్రేయస్సు కొరకు త్రిప్పుతారు” అని మాకు గుర్తు చేసినందుకు మీకు ధన్యవాదాలు. (“రెండవ గొప్ప ఆజ్ఞ,” లియహోనా, 2019 నవం.). అధ్యక్షులు నెల్సన్ పిలుపు “ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వండి, దిగంబరులకు బట్టలు వేయండి, వితంతువులకు సహాయం అందించండి, అనాథల కన్నీటిని తుడిచివేయండి, [మరియు] ఈ సంఘములోనైనా, లేదా మరేదైనా, లేదా ఏ సంఘములోనైనా, వారిని ఎక్కడ [మనం కనుగొన్నా] బాధించిన వారిని ఓదార్చండి” అనే జోసెఫ్ స్మిత్ పిలుపుకు ప్రతిస్పందించడం ద్వారా మనలో ప్రతి ఒక్కరికి ఆనందం, శాంతి, వినయం మరియు ప్రేమ పెరుగుతాయని నేను సాక్ష్యమిస్తున్నాను,”(జోసెఫ్ స్మిత్, Times and Seasons, 1842 మార్చి, 15).

చిత్రం
ఆఫ్రికన్ పిల్లలతో ఎల్డర్ ఆడర్న్ మరియు అధ్యక్షురాలు కెమిల్ ఎన్. జాన్సన్

అన్ని నెలల క్రితం, మేము పొడి మరియు మురికి మైదానంలో ఆకలితో మరియు బాధలో ఉన్నవారిని కనుగొన్నాము మరియు సహాయం కోసం వేడుకుంటున్న వారి కళ్ళకు సాక్షులం. మా స్వంత విధానంలో, మేము ఆత్మలో మూలిగాము మరియు కలత చెందాము (యోహాను 11:33 చూడండి), మరియు ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడం, వితంతువులకు సహాయం అందించడం వంటి పనిలో సంఘ సభ్యుల కరుణను చూసినప్పుడు ఆ భావాలు చల్లబడినవి, బాధితులు ఓదార్చబడ్డారు మరియు వారి కన్నీళ్లు ఆరిపోయాయి.

మనం ఎప్పటికీ ఇతరుల శ్రేయస్సు కోసం చూస్తూ ఉండి మరియు “ఒకరి భారములు ఒకరు భరించుటకు ” (మోషైయ 18:8), అని మాటలో క్రియలో చూపుటకు “విరిగిన హృదయము గలవారిని దృఢపరచుటకు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 138:42), మరియు “నీ పొరుగువారిని ప్రేమించు” అనే క్రీస్తు యొక్క రెండవ గొప్ప ఆజ్ఞను పాటించడానికి ఇష్టపడుచున్నాము.(మార్కు 12:31). యేసు క్రీస్తు నామములో, ఆమేన్.