సర్వసభ్య సమావేశము
ప్రేమ ఇక్కడ మాట్లాడబడింది
2023 అక్టోబరు సర్వసభ్య సమావేశము


ప్రేమ ఇక్కడ మాట్లాడబడింది

ఇక్కడ, మన హృదయాలలో, ఇళ్ళలో, మన సువార్త పిలుపులు, ప్రోత్సాహ కార్యక్రమాలు, పరిచర్య మరియు సేవలో మనం ఆయన ప్రేమను మాట్లాడడం మరియు వినడం నేర్చుకుందాం.

మన ప్రాథమిక పిల్లలు “ప్రేమ ఇక్కడ మాట్లాడబడింది”1 అని పాడతారు.

ఒకసారి నేను సహోదరి గాంగ్‌కు ఒక చిన్న లాకెట్ ఇచ్చాను. దాని మీద డాట్-డాట్, డాట్-డాట్, డాట్-డాట్-డాష్ అని నేను వ్రాసి ఉంచాను. మోర్స్ కోడ్ తెలిసిన వారు I, I, U అనే అక్షరాలను గుర్తిస్తారు. కానీ నేను రెండవ కోడ్‌ను కూడా చేర్చాను. మాండరిన్ చైనీస్ భాష‌లో, “ఐ” అంటే “లవ్” అని అర్థం. కాబట్టి, రెండుసార్లు డీకోడ్ చేసిన తర్వాత, ఆ సందేశం “ఐ లవ్ యు” అని వస్తుంది. ప్రియమైన సూసన్, “ఐ, లవ్ (爱), యు.”

మనం అనేక భాషల్లో ప్రేమను తెలుపుతాం. మానవ కుటుంబం 7,168 సజీవ భాషలు మాట్లాడుతుందని నాకు చెప్పబడింది.2 సంఘములో మనం అనేక మాండలికాలతో లిపి గల 575 ప్రధాన భాషలు మాట్లాడతాం. మనము కళ, సంగీతం, నృత్యం, తార్కిక చిహ్నాలు, అంతర్ మరియు అంతర్-వ్యక్తిగత వ్యక్తీకరణ ద్వారా ఉద్దేశం, పదరూపభేదం మరియు భావోద్వేగాలను కూడా తెలియజేస్తాము.3

ఈ రోజు మనం ప్రేమ గురించి సువార్త తెలిపే మూడు భాషల గురించి మాట్లాడుకుందాం: ఆప్యాయత మరియు గౌరవం యొక్క భాష, సేవ మరియు త్యాగం యొక్క భాష మరియు నిబంధనకు సంబంధించిన భాష.

మొదటిది, ఆప్యాయత మరియు గౌరవం యొక్క సువార్త భాష.

“మీ తల్లిదండ్రులు, కుటుంబాలు మిమ్మల్ని ప్రేమిస్తున్నారని మీకు ఎలా తెలుసు?” అని సహోదరి గాంగ్ ఆప్యాయతతో మరియు గౌరవంతో పిల్లలను, యువతను అడుగుతుంది.

గ్వాటెమాలాలో పిల్లలు ఇలా అంటారు, “మా కుటుంబాన్ని పోషించడానికి నా తల్లిదండ్రులు చాలా కష్టపడతారు.” ఉత్తర అమెరికాలో పిల్లలు ఇలా అంటారు, “నా తల్లిదండ్రులు కథలు చదివి, రాత్రిపూట నన్ను మంచం మీద పడుకోబెడతారు.” పరిశుద్ధ భూమిలో పిల్లలు ఇలా అంటారు, “నా తల్లిదండ్రులు నన్ను సురక్షితంగా ఉంచుతారు.” పశ్చిమాఫ్రికాలోని ఘనాలో పిల్లలు ఇలా అంటారు, “పిల్లలు మరియు యువత లక్ష్యాల విషయంలో నా తల్లిదండ్రులు నాకు సహాయం చేస్తారు.”

ఒక పాప ఇలా అంది, “రోజంతా పనిచేసి బాగా అలసిపోయినా, మా అమ్మ నాతో ఆడుకోవడానికి బయటికి వస్తుంది.” తన రోజువారీ త్యాగాల విషయం వినినప్పుడు ఆమె తల్లి ఏడ్చింది. ఒక యువతి ఇలా చెప్పింది, “నేను, మా అమ్మ కొన్నిసార్లు విభేదించుకున్నప్పటికీ, నేను మా అమ్మను నమ్ముతాను.” ఆమె తల్లి కూడా ఏడ్చింది.

కొన్నిసార్లు ఇక్కడ మాట్లాడబడిన ప్రేమ వినబడిందని మరియు ప్రశంసించబడిందని మనం తెలుసుకోవాలి.

ఆప్యాయత మరియు గౌరవంతో, మన సంస్కార సమావేశం మరియు ఇతర సమావేశాలు యేసు క్రీస్తుపై దృష్టి పెడతాయి. మనము యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం గురించి, ప్రత్యక్షంగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా మరియు నిజంగా భక్తిపూర్వకంగా మాట్లాడతాము. యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సంఘాన్ని ఆయన పేరు మీద యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము అని మనం పిలుస్తాము. మనం పరలోక తండ్రిని సంబోధించేటప్పుడు గౌరవప్రదమైన ప్రార్థన భాషను ఉపయోగిస్తాము మరియు మనం ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు హృదయపూర్వకంగా గౌరవిస్తాము. దేవాలయ నిబంధనలలో యేసు క్రీస్తు యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తించినప్పుడు, మనం తరచు “దేవాలయానికి వెళ్ళడం” గురించి తక్కువగా మరియు “ప్రభువు మందిరంలో యేసు క్రీస్తు వద్దకు రావడం” గురించి ఎక్కువగా చెప్తాము. “ప్రేమ ఇక్కడ మాట్లాడబడింది” అని ప్రతి నిబంధన మనకు తెలియజేస్తుంది.

సంఘ పదజాలానికి తరచుగా డీకోడింగ్ అవసరమని క్రొత్త సభ్యులు అంటారు. మనము “స్టేకు భవనం” అంటే ఒక మంచి గొడ్డు మాంసం విందు అని; “వార్డు భవనం” ఒక ఆసుపత్రిని సూచిస్తుందని; “ప్రారంభ క్రియలు” సంఘ పార్కింగ్ స్థలంలో తల, భుజాలు, మోకాలు మరియు కాలి వేళ్ళు అంటూ మనలను ఆహ్వానిస్తాయని భావించి నవ్వుతాము. కానీ, దయచేసి, మనం ప్రేమకు సంబంధించిన క్రొత్త భాషలను కలిసి నేర్చుకునేటప్పుడు మనం అర్థం చేసుకుందాం మరియు దయతో మెలుగుదాం. ఆమె స్కర్టు చాలా పొట్టిగా ఉన్నదని సంఘములో క్రొత్తగా పరివర్తన చెందిన వ్యక్తికి చెప్పబడింది. కోపం తెచ్చుకునే బదులు, ఆమె ఇలా సమాధానం చెప్పింది, “నా హృదయం మార్చబడింది; దయచేసి నా స్కర్టులు మారేవరకు ఓపిక పట్టండి.”4

మనం ఉపయోగించే పదాలు ఇతర క్రైస్తవులకు మరియు స్నేహితులకు మనల్ని మరింత దగ్గర చేస్తాయి లేదా దూరం చేస్తాయి. మనం ఈ పనులను స్వంతంగా చేస్తున్నామని ఇతరులు నమ్మేవిధంగా కొన్నిసార్లు మనము సువార్త పరిచర్య, దేవాలయ కార్యము, మానవతావాద మరియు సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడతాము. దేవుని కార్యము మరియు మహిమ, యేసు క్రీస్తు యొక్క మంచితనం, కనికరము, కృప మరియు ఆయన ప్రాయశ్చిత్త త్యాగం గురించి ఎల్లప్పుడూ హృదయపూర్వకంగా మరియు భక్తిపూర్వకంగా కృతజ్ఞతతో మనం మాట్లాడదాం.5

రెండవది, సేవ మరియు త్యాగం యొక్క సువార్త భాష.

విశ్రాంతిదినమును గౌరవించడానికి మరియు ఆనందించడానికి మనం ప్రతీవారం మళ్ళీ సంఘములో సమకూడినప్పుడు, మన సంఘ పిలుపులు, సహవాసం, సామాజికత మరియు సేవ ద్వారా యేసు క్రీస్తుకు మరియు ఒకరికొకరు మన సంస్కార నిబంధన నిబద్ధతను మనం వ్యక్తపరచగలము.

నేను స్థానిక సంఘ నాయకులను వారి సమస్య గురించి అడిగినప్పుడు, సహోదర సహోదరీలు ఇరువురూ, “మా సభ్యులలో కొందరు సంఘ పిలుపులను అంగీకరించడం లేదు” అని చెప్పారు. ప్రభువుకు మరియు ఆయన సంఘంలో ఒకరికొకరు సేవ చేయాలనే పిలుపులు కనికరం, సామర్థ్యం మరియు వినయాన్ని పెంపొందించే అవకాశాన్ని ఇస్తాయి. మనం ప్రత్యేకపరచబడినప్పుడు, మనం ఇతరులను మరియు మనల్ని ఉద్ధరించడానికి, బలోపేతం చేయడానికి ప్రభువు ప్రేరణను పొందగలము. అయితే, మన జీవితాల్లో మారుతున్న పరిస్థితులు మరియు కాలాలు సేవ చేయడానికి మన సామర్థ్యాన్ని ప్రభావితం చేయవచ్చు, కానీ ఆశాజనకంగా ఎప్పటికీ మన కోరికను కాదు. “నేను కలిగియున్న యెడల నేను ఇచ్చెదను”6 అని రాజైన బెంజమిన్‌తో పాటు మనం చెప్తాము మరియు మనం చేయగలిగినదంతా చేస్తాము.

స్టేకు మరియు వార్డు నాయకులారా, మన వంతు కృషి చేద్దాం. ప్రభువు యొక్క సంఘములో సేవ చేయడానికి మనం సహోదర సహోదరీలను పిలుస్తున్నప్పుడు (మరియు విడుదల చేస్తున్నప్పుడు), దయచేసి గౌరవంగా మరియు ప్రేరణతో చేద్దాం. ప్రతీఒక్కరూ అభినందించబడినట్లు మరియు వారు విజయవంతం కాగలరని భావించడానికి సహాయం చేయండి. దయచేసి సహోదరీలతో చర్చించండి మరియు వినండి. అధ్యక్షులు జె. రూబెన్ క్లార్క్ బోధించినట్లుగా, ప్రభువు యొక్క సంఘములో మనం పిలువబడిన స్థానంలో సేవ చేస్తాము, “ఎవరూ ఏ స్థానాన్ని కోరుకోరు లేదా తిరస్కరించరు” అని మనం గుర్తుంచుకుందాం.7

సహోదరి గాంగ్ మరియు నేను వివాహం చేసుకున్నప్పుడు, ఎల్డర్ డేవిడ్ బి. హెయిట్ ఇలా సలహా ఇచ్చారు: “ఎల్లప్పుడూ సంఘంలో పిలుపును కలిగియుండండి. ముఖ్యంగా జీవితంలో తీరిక లేకుండా ఉన్నప్పుడు, మీరు సేవ చేసే వారి పట్ల మరియు మీరు సేవ చేస్తున్నప్పుడు మీ పట్ల ప్రభువు ప్రేమను మీరు అనుభవించాలి” అని ఆయన చెప్పారు. ఆయన ఆత్మ మరియు మన నిబంధనల ద్వారా ఆయన సంఘంలో ప్రభువుకు సేవ చేయడానికి సంఘ నాయకులకు మనం అవునని సమాధానం ఇస్తున్నప్పుడు ప్రేమ ఇక్కడ, అక్కడ మరియు ప్రతిచోటా మాట్లాడబడుతుందని నేను వాగ్దానం చేస్తున్నాను.

ప్రభువు యొక్క పునఃస్థాపించబడిన సంఘము సీయోను సమాజానికి వర్థిల్లే స్థలము కాగలదు. మనం కలిసి ఆరాధించడం, సేవ చేయడం, ఆనందించడం మరియు ఆయన ప్రేమ గురించి నేర్చుకోవడం చేసినప్పుడు, మనం ఆయన సువార్తలో ఒకరిపై ఒకరం ఆధారపడతాము. మనము రాజకీయంగా లేదా సామాజిక సమస్యలపై విభేదించవచ్చు, కానీ వార్డు గాయకబృందంలో కలిసి పాడేటప్పుడు సామరస్యాన్ని కనుగొంటాము. మనము ఒకరి ఇళ్ళలో ఒకరం మరియు పరిసరాల్లో మనఃపూర్వకంగా క్రమం తప్పకుండా పరిచర్య చేస్తున్నప్పుడు బంధాలను పెంచుకుంటాము మరియు ఒంటరితనంపై పోరాడుతాము.

స్టేకు అధ్యక్షులతో సభ్యుల సందర్శనల సమయంలో, ప్రతీ సందర్భంలోనూ సభ్యుల పట్ల వారి ప్రగాఢ ప్రేమను నేను భావిస్తాను. మేము ఆయన స్టేకులో సభ్యుల ఇళ్ళకు వెళ్ళినప్పుడు ఒక స్టేకు అధ్యక్షుడు, మనం ఈతకొలను ఉన్న ఇంటిలో నివసిస్తున్నా లేదా మురికి నేల ఉన్న ఇంటిలో నివసించినా, సంఘ సేవ అనేది తరచుగా త్యాగం చేయడంతో కూడుకున్న ఒక విశేషాధికారమని పేర్కొన్నాడు. అయినప్పటికీ, మనం కలిసి సువార్తలో సేవ చేసినప్పుడు మరియు త్యాగం చేసినప్పుడు, మనం తక్కువ లోపాలను మరియు ఎక్కువ శాంతిని కనుగొంటామని అతను తెలివిగా గమనించాడు. మనం ఆయనను అనుమతించినప్పుడు, ఇక్కడ ఆయన ప్రేమను మాట్లాడడానికి యేసు క్రీస్తు మనకు సహాయం చేస్తారు.

ఈ వేసవిలో, మా కుటుంబం ఇంగ్లాండ్‌లోని లౌబరో మరియు ఆక్స్‌ఫర్డ్‌లో అద్భుతమైన సంఘ సభ్యులను, స్నేహితులను కలుసుకుంది. ఈ అర్థవంతమైన కూడికలు వార్డు సామాజిక మరియు సేవా కార్యకలాపాలు క్రొత్త మరియు శాశ్వతమైన సువార్త బంధాలను ఎలా నిర్మించగలవో నాకు గుర్తు చేసాయి. సంఘంలో చాలా చోట్ల, మరికొన్ని వార్డు కార్యకలాపాలు సువార్త ఉద్దేశ్యంతో ప్రణాళిక చేయబడి అమలు చేయబడితే, అవి మనల్ని మరింత గొప్పగా మరియు ఐక్యంగా కలిపి ముడివేయగలవని నేను కొంతకాలంగా భావించాను.

ఒక ప్రేరేపిత వార్డు కార్యకలాపాల నాయకుడు మరియు కమిటీ వ్యక్తులను మరియు పరిశుద్ధుల సమాజాన్ని అభివృద్ధిపరుస్తారు. చక్కగా ప్రణాళిక చేయబడిన వారి ప్రోత్సాహ కార్యక్రమాలు ప్రతీఒక్కరూ విలువైన వారిగా, చేర్చబడినట్లుగా మరియు అవసరమైన పాత్రను పోషించడానికి ఆహ్వానించబడినట్లుగా భావించడంలో సహాయపడతాయి. అటువంటి కార్యకలాపాలు వయస్సులు, నేపథ్యాలకు వంతెన వేస్తాయి, శాశ్వత జ్ఞాపకాలను సృష్టిస్తాయి మరియు తక్కువ ఖర్చుతో లేదా ఖర్చు లేకుండా నిర్వహించబడగలవు. ఆనందించే సువార్త కార్యకలాపాలు పొరుగువారిని మరియు స్నేహితులను కూడా ఆహ్వానిస్తాయి.

సామాజికత మరియు సేవ తరచుగా కలిసి ఉంటాయి. మీరు నిజంగా ఎవరి గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే, నిచ్చెనపై ప్రక్కప్రక్కనే నిలబడి అర్థవంతమైన సేవా ప్రాజెక్టులో కలిసి రంగులు వేయాలని వయోజనులకు తెలుసు.

చిత్రం
సేవా కార్యక్రమంలో పెయింటింగ్ చేస్తున్న వయో జనులు.

వాస్తవానికి, ఏ వ్యక్తి మరియు ఏ కుటుంబమూ పరిపూర్ణంగా ఉండవు. మన ప్రేమను చూపడానికి మనందరికీ సహాయం కావాలి. “పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును.”8 విశ్వాసం, సేవ మరియు త్యాగం మనపై తక్కువగా, రక్షకునిపై ఎక్కువగా దృష్టిపెట్టడానికి మనకు సహాయపడతాయి. ఆయనలో మన సేవ మరియు త్యాగం ఎంత ఎక్కువ దయతో, విశ్వాసంగా మరియు నిస్వార్థంగా ఉంటే, అంత ఎక్కువగా మన కొరకు యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త కనికరమును, కృపను మనం గ్రహించడం ప్రారంభించవచ్చు.

మరియు అది మనల్ని నిబంధనకు సంబంధించిన సువార్త భాషలోకి తీసుకువస్తుంది.

మనం స్వీయ-కేంద్రీకృత ప్రపంచంలో జీవిస్తున్నాము. అనేక సందర్భాలలో మనం మన స్వంత ఆసక్తులను ఎంచుకుంటాం. మన స్వప్రయోజనాలు మరియు వాటిని ఎలా కొనసాగించాలో మనకు బాగా తెలుసని మనం నమ్మినట్లు ఉంటుందది.

కానీ చివరికి అది నిజం కాదు. యేసు క్రీస్తు ఈ శక్తివంతమైన కాలాతీత సత్యాన్ని వ్యక్తీకరించారు:

“తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును.

“ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయోజనము?”9

యేసు క్రీస్తు మెరుగైన మార్గాన్ని అందిస్తున్నారు—దైవిక నిబంధనపై ఆధారపడిన సంబంధాలు మరణ బంధకాల కంటే బలమైనవి. దేవునితో మరియు ఒకరికొకరితో నిబంధన సంబంధాలు మనకు అత్యంత ప్రియమైన బంధాలను స్వస్థపరచగలవు, పవిత్రం చేయగలవు. నిజానికి, మనల్ని మనం ఎరిగియుండి ప్రేమించే దానికంటే ఎక్కువగా ఆయన మనల్ని ఎరిగియున్నారు మరియు ప్రేమిస్తారు. నిజం చెప్పాలంటే, మనమందరం నిబంధన చేసినప్పుడు, మనం ఉన్న దానికంటే మనం ఎక్కువ కాగలము. దేవుని శక్తి మరియు జ్ఞానం ఆయన సమయంలో మరియు మార్గంలో ప్రతీ మంచి బహుమానంతో మనల్ని దీవించగలవు.

ఉత్పాదక కృత్రిమ మేధస్సు (AI) భాషానువాదంలో గొప్ప పురోగతి సాధించింది. “ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము” అనే జాతీయాన్ని “వైన్ మంచిది, కానీ మాంసం చెడిపోయింది” అని కంప్యూటర్ అనువదించే రోజులు పోయాయి. ఆసక్తికరంగా, ఒక భాష యొక్క విస్తృతమైన ఉదాహరణలను పునరావృతం చేయడం కంప్యూటర్‌కు వ్యాకరణ నియమాలను బోధించడం కంటే కంప్యూటర్‌కు భాషను మరింత ప్రభావవంతంగా బోధిస్తుంది.

అదేవిధంగా, మన స్వంత ప్రత్యక్ష, పునరావృత అనుభవాలు ఆప్యాయత మరియు గౌరవం, సేవ మరియు త్యాగం, నిబంధనకు సంబంధించిన సువార్త భాషలను నేర్చుకోవడానికి మనకు ఉత్తమమైన ఆధ్యాత్మిక మార్గం కావచ్చు.

కాబట్టి, ప్రేమతో యేసు క్రీస్తు మీతో ఎక్కడ, ఎలా మాట్లాడతారు?

ఇక్కడ మాట్లాడబడిన ఆయన ప్రేమను మీరు ఎక్కడ, ఎలా వింటారు?

ఇక్కడ, మన హృదయాలలో, ఇళ్ళలో, మన సువార్త పిలుపులు, కార్యకలాపాలు, పరిచర్య మరియు సేవలో మనం ఆయన ప్రేమను మాట్లాడడం మరియు వినడం నేర్చుకుందాం.

మనం మరణించి, తిరిగి ఆయనను చేరుకోవడం దేవుని ప్రణాళికలో భాగము. మనం ప్రభువును కలిసినప్పుడు, “నా ప్రేమ ఇక్కడ మాట్లాడబడింది” అని ఉపదేశము మరియు వాగ్దాన పదాలతో ఆయన చెప్పినట్లు నేను ఊహించాను. యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో, ఆమేన్.