సర్వసభ్య సమావేశము
దశమభాగము: పరలోకపు వాకిండ్లను తెరుచుట
2023 అక్టోబరు సర్వసభ్య సమావేశము


దశమభాగము: పరలోకపు వాకిండ్లను తెరుచుట

అనేక విధాలుగా ఆకాశపువాకిండ్లు విప్పబడతాయి. ప్రభువు యొక్క సమయంలో నమ్మకముంచండి; దీవెనలు ఎల్లప్పుడూ వస్తాయి.

ఇటీవల నేను దక్షిణ అమెరికాలో ఉన్నప్పుడు, వెనిజువేలా నుండి సహోదరుడు రోజర్ పర్రా క్రింది అనుభవాన్ని నాతో పంచుకున్నారు:

“2019లో వెనిజువేలా సమస్యల్లో చిక్కుకుంది, దాని మూలంగా ఐదు రోజులపాటు అక్కడ కరెంటు లేకుండా పోయింది.

“వీధుల్లో గందరగోళం మరియు అరాచకం రాజ్యమేలింది, చాలామంది నిరాశకు గురైన ప్రజలకు తగినంత ఆహారం లేదు.

“కొందరు ఆహార వ్యాపారాలను దోచుకోవడం ప్రారంభించారు, వారి మార్గంలో ప్రతిదానిని నాశనం చేయసాగారు.

“ఒక చిన్న బేకరీ యజమానిగా, మా వ్యాపారం గురించి నేను చాలా చింతించాను. అవసరంలో ఉన్నవారికి మా బేకరీలో ఉన్న ఆహారమంతా ఇచ్చివేయాలని కుటుంబంగా మేము నిర్ణయించుకున్నాము.

“ఒక చీకటి రాత్రి ప్రతిచోటా అల్లర్లు జరుగుతున్నాయి. నా ఆలోచన కేవలం ప్రియమైన నా భార్యా పిల్లల భద్రత గురించే.

“తెల్లవారుజామున నేను మా బేకరీకి వెళ్ళాను. దురదృష్టవశాత్తూ, సమీపంలోని ప్రతి ఆహార వ్యాపారం దోపిడీదారులచే నాశనం చేయబడింది, కానీ నాకు చాలా ఆశ్చర్యం కలిగించే విధంగా, మా బేకరీ చెక్కుచెదరకుండా ఉంది. ఏదీ నాశనం చేయబడలేదు. నా పరలోక తండ్రికి నేను వినయంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాను.

“ఇంటికి వచ్చి, దేవుని దీవెన మరియు రక్షణ గురించి నేను నా కుటుంబానికి చెప్పాను.

“వారందరూ చాలా కృతజ్ఞతతో ఉన్నారు.

“12 ఏళ్ల నా పెద్ద కొడుకు రోహెలియో ఇలా అన్నాడు, ‘నాన్నా! మన దుకాణం ఎందుకు రక్షించబడిందో నాకు తెలుసు. నువ్వు, అమ్మ ఎప్పుడూ మీ దశమభాగాన్ని చెల్లించారు.’”

సహోదరుడు పర్రా ఇలా ముగించారు: “మలాకీలోని మాటలు నాకు గుర్తుకొచ్చాయి. ‘మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమిపంటను నాశనముచేయవు.’ [మలాకీ 3:11]. మేము మోకరించి, ఆయన చేసిన అద్భుతానికి మన పరలోక తండ్రికి కృతజ్ఞతలు చెప్పుకున్నాము.”1

చిత్రం
పర్రా కుటుంబం.

ఇప్పుడు దీనితో నాకు నిరూపించండి

మనకు ఉన్నదంతా మరియు మనం ఉన్నదంతా దేవుని నుండి వచ్చింది. యేసు క్రీస్తు శిష్యులుగా, మన చుట్టూ ఉన్నవారితో మనం ఇష్టపూర్వకంగా పంచుకుంటాం.

ఇవన్నీ మనకిచ్చిన ప్రభువు ఆయనకు, భూమిపై ఆయన రాజ్యానికి మన ఆదాయంలో 10 శాతాన్ని తిరిగి ఇవ్వమని మనల్ని అడిగారు. మన దశమభాగంలో మనం నిజాయితీగా ఉన్నప్పుడు, ఆయన “ఆకాశపువాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని” మనకు వాగ్దానం చేసారు.2 కీడు నుండి మనల్ని కాపాడతానని ఆయన మనకు వాగ్దానం చేసారు.3 ఈ వాగ్దానాలు ఎంత నిశ్చయమైనవంటే, 4 “దీని చేసి నన్ను శోధించండి”5 అని ప్రభువు ప్రకటించారు, ఇటువంటి వాక్యము మలాకీలో పేర్కొనక మునుపు లేఖనాలలో మరెక్కడా లేదు.

అనేక విధాలుగా ఆకాశపువాకిండ్లు విప్పబడతాయి. కొన్ని తాత్కాలికమైనవి, కానీ అనేకం ఆధ్యాత్మికమైనవి. కొన్ని సూక్ష్మంగా ఉంటాయి మరియు తేలికగా విస్మరించబడతాయి. ప్రభువు యొక్క సమయంలో నమ్మకముంచండి; దీవెనలు ఎల్లప్పుడూ వస్తాయి.

జీవిత అవసరాల కోసం పోరాడుతున్న వారితో మేము బాధపడతాము. ఇటీవల సంఘము ప్రపంచవ్యాప్తంగా బలహీనమైన పిల్లలు మరియు తల్లులకు ఉపశమనం అందించడానికి 54 మిలియన్ల అమెరికన్ డాలర్లు విరాళమిచ్చింది.6 మీ నెలవారీ ఉపవాస అర్పణలతో మన మంచి బిషప్పులు తాత్కాలికంగా ఆహారం, ధరించడానికి దుస్తులు, ఆశ్రయం అవసరమైన వేలమందికి ప్రతీవారం సహాయం చేస్తారు. యేసు క్రీస్తు యొక్క సువార్తయే ఈ ప్రపంచంలోని పేదరికానికి గల ఏకైక శాశ్వత పరిష్కారం.7

విశ్వాసానికి సంబంధించిన విషయం

మనుష్యుని జ్ఞానమునకు మనుష్యుని సంగతులు తెలియును, కానీ దేవుని సంగతులు గ్రహించుట కష్టమని అపొస్తలుడైన పౌలు హెచ్చరించాడు.8 దశమభాగము గురించి లోకము మన డబ్బు రూపంలో మాట్లాడుతుంది, కానీ పవిత్రమైన దశమభాగ చట్టము ప్రధానంగా మన విశ్వాసానికి సంబంధించినది. మన దశమభాగాలలో నిజాయితీగా ఉండడమనేది మన స్వంత శ్రద్ధాసక్తులను మించి మన జీవితాల్లో ప్రభువును ముందుంచడానికి మన సమ్మతిని చూపేందుకు ఒక మార్గము. మనము ప్రభువును విశ్వసిస్తే, పరలోకం యొక్క దీవెనలు అనుసరిస్తాయని నేను మీకు వాగ్దానం చేస్తున్నాను.

“ఆలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడని” యేసు చెప్పారు.9 పునరుత్థానుడైన రక్షకుడు మలాకీలో కనుగొనబడు ఆయన వాగ్దానాలను వారి గ్రంథములో వ్రాయమని నీఫైయులను అడిగారు.10 మన కాలంలో, ఈ విధంగా ప్రకటిస్తూ దశమభాగము యొక్క దైవిక చట్టాన్ని ప్రభువు మళ్ళీ ధృవీకరించారు: “నా జనుల దశమభాగమునకు ఇది ఆరంభముగా ఉండును. [వారు] తమ వార్షిక అభివృద్ధిలో పదియవ వంతును చెల్లించవలెను; మరియు వారికి ఎప్పటికీ ఇది శాశ్వత ధర్మశాస్త్రముగా ఉండును.”11

“పదియవభాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి”12 అని చెప్తూ దశమభాగము ఎలా పంపిణీ చేయబడాలో ప్రభువు స్పష్టంగా నిర్దేశించారు, అనగా పునఃస్థాపించబడిన ఆయన రాజ్యమైన యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘములోనికి దశమభాగములు తీసుకొనిరండి అని దానర్థము.13 ఈ పవిత్రమైన దశమభాగాల ఉపయోగము ప్రథమ అధ్యక్షత్వము, పన్నెండుమంది అపొస్తలుల సమూహము, అధ్యక్షత్వము వహించు బిషప్రిక్కుతో ఏర్పరచబడిన ఒక సలహామండలి చేత ప్రార్థనాపూర్వకంగా పరిగణించబడుతుందని ఆయన నిర్దేశించారు “మరియు వారితో నేను పలికిన మాటల వలన అది జరుగవలెనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.”14

ప్రభువు యొక్క పవిత్ర నిధులు

ఈ పవిత్రమైన నిధులు సంఘ నాయకులకు చెందినవి కాదు. అవి ప్రభువుకు చెందినవి. ఆయన సేవకులు వారి గృహనిర్వాహకత్వము యొక్క పవిత్ర స్వభావము గురించి చాలా కష్టపడి తెలుసుకుంటారు.

అధ్యక్షులు గార్డన్ బి. హింక్లి ఈ చిన్ననాటి అనుభవాన్ని వివరించారు: “నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు … సంఘ నిధుల ఖర్చు గురించి మా నాన్నను ఒక ప్రశ్న అడిగాను. నా దశమభాగాలు మరియు అర్పణలు చెల్లించడం దేవుడు నాకిచ్చిన బాధ్యత అని ఆయన నాకు గుర్తుచేసారు. నేనలా చేసినప్పుడు, నేను ఇచ్చేది ఇకపై నాది కాదు అని [మా నాన్న చెప్పారు]. నేను ఎవరికి సమర్పిస్తానో ఆ ప్రభువుకే అది చెందుతుంది.” ఆయన తండ్రి ఇలా అన్నారు: “సంఘ అధికారులు దానితో ఏమి చేస్తారనే దాని గురించి [గార్డన్, నువ్వు] చింతించనక్కరలేదు. వాళ్ళు ప్రభువుకు జవాబుదారులై ఉన్నారు, ఆయన వాళ్ళను లెక్క అడుగుతారు.”15

“ప్రభువుకు జవాబుదారులై” యుండడం యొక్క భారాన్ని మేము లోతుగా అనుభవిస్తాము.

మీ ఉదార దశమభాగాలు మరియు అర్పణలు

మీరు ప్రభువుకు సమర్పించిన ఉదారమైన దశమభాగాలు మరియు అర్పణల నుండి గత సంవత్సరం అవసరంలో ఉన్న వారిని దీవించడానికి ఒక బిలియను కంటే ఎక్కువ అమెరికన్ డాలర్లు ఉపయోగించబడ్డాయి.16

పునఃస్థాపించబడిన సువార్తను ప్రపంచమంతా తీసుకువెళ్ళే మా ముఖ్యమైన బాధ్యతలో మేము 414 మిషనులలో సేవ చేస్తున్న 71,000 మందికి పైగా సువార్తికులను కలిగియున్నాము.17 మీ దశమభాగాలు మరియు అర్పణల మూలంగా, వారి కుటుంబపు ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా సువార్తికులు సేవ చేయగలుగుతున్నారు.

ముందెన్నడూ లేనంత సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా దేవాలయాలు నిర్మించబడుతున్నాయి. ప్రస్తుతం 177 దేవాలయాలు పనిచేస్తున్నాయి, 59 నిర్మాణంలో లేదా పునర్నిర్మాణంలో ఉన్నాయి, మరో 79 ప్రణాళిక మరియు రూపకల్పనలో ఉన్నాయి.18 ప్రభువు మాత్రమే ఊహించగలిగే ప్రదేశాలలో దేవాలయ దీవెనలు ఉండేలా మీ దశమభాగాలు అనుమతిస్తాయి.

30,000లకు మించిన సమూహాలు 195 దేశాలు మరియు భూభాగాలలో వేలాది ప్రార్థనామందిరాలు మరియు ఇతర సదుపాయాల్లో ఉంచబడ్డాయి.19 మీ నమ్మకమైన దశమభాగాల మూలంగా, మీరు ఎప్పటికీ సందర్శించని సుదూర ప్రాంతాలలో మీకు ఎప్పటికీ తెలియని నీతిమంతుల మధ్య సంఘము స్థాపించబడింది.

సంఘము ప్రస్తుతం ఐదు ఉన్నత విద్యా సంస్థలను స్పాన్సర్ చేస్తుంది.20 ఇవి 1,45,000ల కంటే ఎక్కువమంది విద్యార్థులకు సేవలందిస్తాయి. మన సెమినరీలు మరియు ఇన్స్టిట్యూట్‌లలో ప్రతీవారం లక్షా పదివేల తరగతులు బోధించబడతాయి.21

నిజాయితీగా దశమభాగం చెల్లించే ప్రతి ఆర్థిక పరిస్థితిలోని యువకులు మరియు పెద్దల నుండి ఇవి మరియు మరెన్నో దీవెనలు పెద్ద మొత్తంలో వస్తాయి.

దశమభాగం యొక్క దైవిక చట్టపు ఆధ్యాత్మిక శక్తి విరాళమివ్వబడిన డబ్బుతో కొలవబడదు, ఎందుకంటే భాగ్యవంతులు, పేదలు ఇరువురు తమ ఆదాయంలో నుండి 10 శాతాన్ని విరాళమివ్వాలని ప్రభువు చేత ఆజ్ఞాపించబడ్డారు.22 మన నమ్మకాన్ని ప్రభువుపై ఉంచడం నుండి శక్తి వస్తుంది.23

మీ ఉదార దశమభాగాల ద్వారా తెలియజేయబడిన ప్రభువు యొక్క అదనపు సమృద్ధి సంఘ నిల్వలను బలోపేతం చేసింది, మనం అనుభవించిన దానికి మించి ప్రభువు పనిని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలను అందిస్తోంది. ప్రభువుకు అన్నీ తెలుసు మరియు సరైన సమయంలో, ఆయన పవిత్ర ఉద్దేశాలన్నీ నెరవేరడాన్ని మనం చూస్తాము.24

దీవెనలు అనేక విధాలుగా వస్తాయి

దశమభాగ దీవెనలు అనేక విధాలుగా వస్తాయి. 1998లో యూటా ప్రాంతంలో ఒక పెద్ద సంఘ సమావేశానికి ఎల్డర్ హెన్రీ బి. ఐరింగ్‌తో పాటు నేను వెళ్ళాను, ఆ ప్రాంతం ఇప్పుడు సిలికాన్ స్లోప్స్ అని పిలువబడుతోంది, సాంకేతికతలో గొప్ప ఆవిష్కరణల సమాజమది. అది అభివృద్ధి చెందుతున్న సమయం, వారికి ఉన్నదానిని ఇతరులతో పోల్చుకోవడం మరియు అధికంగా కోరుకోవడం గురించి ఎల్డర్ ఐరింగ్ పరిశుద్ధులను హెచ్చరించారు. వారు నిజాయితీగా తమ దశమభాగాన్ని చెల్లించినప్పుడు, అధిక భౌతిక ఆస్తుల కొరకు వారి కోరిక తగ్గిపోతుందని ఆయన చేసిన వాగ్దానం నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. రెండేళ్ళ లోపు సాంకేతికత విలువ గణనీయంగా తగ్గిపోయింది. అనేకమంది ఉద్యోగాలు కోల్పోయారు మరియు ఈ ఆర్థిక సర్దుబాటు సమయంలో వ్యాపారసంస్థలు కష్టపడ్డాయి. ఎల్డర్ ఐరింగ్ సలహాను అనుసరించిన వారు దీవించబడ్డారు.

ఆయన వాగ్దానం నాకు మరొక అనుభవాన్ని గుర్తుచేసింది. 1990లో మిషను అధ్యక్షునిగా సేవ చేస్తున్నప్పుడు, నేను ఫ్రాన్స్‌లోని కార్కాస్సోన్ వద్ద 12 ఏళ్ళ షార్లెట్ హాలిమిని కలిసాను. హాలిమిలు ఎనిమిదిమంది పిల్లలతో ఒక ఇంటిలో నివసిస్తున్న విశ్వాసముగల కుటుంబము. వారి గోడమీద రక్షకుని ఫోటో మరియు ప్రవక్త ఫోటో ఉన్నాయి. ఆమె నిజాయితీగా దశమభాగం చెల్లించిందా అని ఆమె గోత్రజనకుని దీవెన కోసం ఇంటర్వూలో నేను షార్లెట్‌ను అడిగాను. “చెల్లించాను, అధ్యక్షులు ఆండర్సెన్. మన దశమభాగం చెల్లించడం వలన తాత్కాలిక మరియు ఆధ్యాత్మిక దీవెనలు వస్తాయని మా అమ్మ నాకు నేర్పించింది. మనం ఎల్లప్పుడూ దశమభాగాన్ని చెల్లిస్తే, మనకు ఏ లోటు ఉండదని మా అమ్మ నాకు నేర్పించింది. అధ్యక్షులు ఆండర్సెన్, మాకు ఏ లోటు లేదు,” అని ఆమె చెప్పింది.

చిత్రం
హ్లిమి కుటుంబం.

ఆమె కథను పంచుకోవడానికి నాకు అనుమతినిచ్చిన 45 ఏళ్ళ ఛార్లెట్ దేవాలయంలో ముద్రింపబడి, ఇలా వ్యాఖ్యానించింది: “దశమభాగం గురించి ఆనాడు నా సాక్ష్యము నిజమైనది మరియు ఇప్పుడు మరింత బలమైనది. ఈ ఆజ్ఞ కొరకు నేను లోతైన కృతజ్ఞత కలిగియున్నాను. నేను దానిని జీవించినప్పుడు, నేను సమృద్ధిగా దీవించబడుతూనే ఉంటాను.”25

ఏదో ఒకరోజు, మనలో ప్రతీఒక్కరు ఈ భూలోక ప్రయాణాన్ని ముగిస్తారు. పాతికేళ్ళ క్రితం, మా అత్తగారు మార్తా విలియమ్స్ క్యాన్సర్‌తో చనిపోవడానికి కొద్దిరోజుల ముందు తపాలా ద్వారా ఆమె ఒక చిన్న చెక్కును అందుకుంది. ఆమె వెంటనే తన దశమభాగము చెల్లించడానికి తన చెక్కు పుస్తకం తెమ్మని నా భార్య కేథీని అడిగింది. తన తల్లి వ్రాయడానికి శక్తి లేనంత బలహీనంగా ఉండడంతో, ఆమె కోసం చెక్కు వ్రాయనా అని కేథీ అడిగింది. “వద్దు కేథీ. నేనే దానిని వ్రాయాలనుకుంటున్నాను,” అని వాళ్ళ అమ్మ చెప్పింది. ఇంకా ఆమె నెమ్మదిగా ఇలా అంది, “ప్రభువు ముందు నేను న్యాయంగా ఉండాలనుకుంటున్నాను.” వాళ్ళ అమ్మ కోసం కేథీ చేసిన చివరి పనులలో ఒకటి, ఆమె దశమభాగ కవరును ఆమె బిషప్పుకు అందజేయడం.

దేవుని ముఖ్యమైన కార్యము

నా సహోదర సహోదరీలారా, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము భూమి అంతటా విశేషమైన దీవెనలు తెస్తూ, “అంధకారము నుండి బయటకు వచ్చింది.”26 మనల్ని ప్రోత్సహించేవారు ఉంటారు మరియు నిరుత్సాహపరిచే వారు ఉంటారు. తెలివైన గమలీయేలు మాటల గురించి నేను ఆలోచించాను, అతను అపొస్తలులైన పేతురు మరియు యోహానుల అద్భుతాలు చూసి యెరూషలేములోని మహాసభను ఇలా హెచ్చరించాడు:

“[ఈ మనుష్యుల] జోలికి పోక వారిని విడిచిపెట్టుడి: … ఈ కార్యమైనను మనుష్యులవలన కలిగినదాయెనా అది వ్యర్థమగును.

“దేవునివలన కలిగినదాయెనా మీరు వారిని వ్యర్థపరచలేరు; మీరొకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమీ.”27

మీరు, నేను భూమిపై దేవుని యొక్క ముఖ్యమైన కార్యములో భాగము. అది వ్యర్థము కాదు, కానీ రక్షకుని రాకడ కోసం మార్గాన్ని సిద్ధం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా అది నిరంతరం కొనసాగుతుంది అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మాటలకు నేను సాక్ష్యమిస్తున్నాను: “రాబోయే రోజుల్లో, లోకము ఎన్నడూ చూడని రక్షకుని శక్తి యొక్క గొప్ప ప్రత్యక్షతలను మనం చూస్తాము. ఇప్పుడు మరియు ఆయన తిరిగివచ్చే సమయానికి మధ్య … , విశ్వాసులపై ఆయన లెక్కలేనన్ని విశేషావకాశాలను, దీవెనలను, అద్భుతాలను క్రుమ్మరిస్తారు.”28

ఇది నా సాక్ష్యము. యేసే క్రీస్తు. ఇది ఆయన పరిశుద్ధ కార్యము. ఆయన మళ్ళీ వస్తారు. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. రోజర్ పర్రా నుండి వ్యక్తిగత ఉత్తరప్రత్యుత్తరాలు, ఆగష్టు 4, 2023.

  2. మలాకీ 3:10.

  3. మలాకీ 3:11 చూడండి. ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ ఇలా చెప్పారు: “ఉదాహరణకు, ఆయన ‘[నా] పంటను తినివేయు పురుగులను గద్దిస్తారు’ [మలాకీ 3:11] అనే దేవుని వాగ్దానం నెరవేరడాన్ని నా జీవితంలో నేను చూసాను. చెడుకు వ్యతిరేకంగా రక్షణ యొక్క ఆ దీవెన నేను గుర్తించగలిగిన సామర్థ్యానికి మించి నాపైన మరియు నా ప్రియమైన వారిపైన క్రుమ్మరించబడింది. కానీ వ్యక్తిగతంగా మరియు కుటుంబంగా దశమభాగము చెల్లించాలనే మా నిశ్చయము మూలంగా కొంతవరకు ఆ దైవిక భద్రత వచ్చిందని నేను నమ్ముతున్నాను” (“Like a Watered Garden,” లియహోనా, 2002 జనవరి, 38).

  4. మన అవసరాలను బట్టి ప్రభువు ఆకాశపువాకిండ్లను విప్పుతారు, కానీ మన దురాశను బట్టి కాదు. ధనవంతులవడానికి మనం దశమభాగం చెల్లిస్తున్నట్లయితే, మనం దానిని తప్పు కారణం కొరకు చేస్తున్నాము. … ఇచ్చేవాడికి దీవెన … ఎల్లప్పుడూ ఆర్థిక లేదా వస్తు లాభం రూపేణా ఉండదు” (Teachings of Gordon B. Hinckley [1997], 657).

  5. మలాకీ 3:10; 3 నీఫై 24:10.

  6. See “The Church of Jesus Christ Is Helping Alleviate Global Malnutrition,” 2023 ఆగస్టు 11, newsroom.ChurchofJesusChrist.org; see also “How the Church of Jesus Christ and UNICEF Are Keeping Mothers and Children Healthy and Safe,”2023 ఆగస్టు. 17, newsroom.ChurchofJesusChrist.org.

  7. “ప్రభువు తన జనులను సీయోను అని పిలిచెను, ఎందుకనగా వారు ఏక హృదయమును, ఏక మనస్సును కలిగియుండి, నీతియందు జీవించిరి; వారి మధ్య బీదవారెవరును లేరు” (మోషే 7:18).

  8. 1 కొరింథీయులకు 2:14 చూడండి. మనిషి యొక్క తర్కం ఎల్లప్పుడూ దేవుని జ్ఞానముతో సరితూగదు. మలాకీ కాలంలో, అనేకమంది ప్రభువు నుండి దూరమయ్యారు. “మీరు నాతట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదును,” అని ప్రభువు తన నిబంధన జనులను వేడుకున్నారు. ఈ సున్నితమైన ఆహ్వానం వెనుక మనలో ప్రతీఒక్కరి కోసం అతిముఖ్యమైన ప్రశ్న ఉంది: “మేము దేనివిషయములో తిరుగుదుమని మీరందురు?” (మలాకీ 3:7). లేదా మరొక మాటలో, “నేను ఎందులో మారాలి? నేను మీకెలా దగ్గరవ్వాలి?” ఒక ఆర్థిక చట్టముగా మాత్రమే కాకుండా, మన హృదయాల కోరికలను ఆయన వైపు తిప్పడానికి ఒక ప్రత్యక్ష మార్గంగా దశమభాగము యొక్క ప్రాముఖ్యతను బోధిస్తూ ప్రభువు జవాబిస్తారు.

    దీనిని మా కుటుంబంలో మేము గమనించాము. కేథీ వాళ్ళ అమ్మ 22 ఏళ్ళ వయస్సులో సంఘములో చేరింది. మార్తా మరియు బర్నార్డ్ విలియమ్స్ కొంతకాలం సంఘానికి హాజరయ్యారు, కానీ మరో రాష్ట్రానికి వెళ్ళిన తర్వాత వారు క్రియాశీలంగా లేరు. బెర్నార్డ్ విదేశాలలో సైనిక విస్తరణను పొందాడు మరియు మార్త తన ఇంటిని టాంపా, ఫ్లోరిడాకు మార్చింది, అక్కడ ఆమె సంఘాన్ని వ్యతిరేకించే తన ఆంటీ మరియు అంకుల్‌తో పాటు నివసించడానికి వారి ఆహ్వానాన్ని ఒప్పుకుంది. చాలా నిరాడంబరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నప్పుడు, తన మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తూ, సంఘానికి హాజరు కాకుండా ఉన్న మార్తా విలియమ్స్ తన దశమభాగ చెక్కును బిషప్పుకు పంపడం మొదలుపెట్టాలని నిర్ణయించుకుంది. ఎందుకు అని తరువాత ఆమె జీవితంలో అడుగబడినప్పుడు, దశమభాగము మరియు దేవుని దీవెనల గురించి సువార్తికులు ఆమెకు బోధించిన దానిని ఆమె గుర్తుచేసుకుందని ఆమె చెప్పింది: “మా జీవితాల్లో దేవుని దీవెనలు మాకు చాలా అవసరం, అందుకే నేను మా దశమభాగ చెక్కును బిషప్పుకు పంపడం మొదలుపెట్టాను.” మార్తా మరియు బర్నార్డ్ విలియమ్స్ సంఘానికి తిరిగి వచ్చారు. వారి అతిగొప్ప దీవెన—దేవుని యందు విశ్వాసం మరియు ఆయన వాగ్దానాలలో నిరీక్షణ తప్ప ఆమె వద్ద ఇంకేమీ లేనప్పుడు తన దశమభాగాన్ని చెల్లించడానికి ఆమె తీసుకున్న నిర్ణయం కారణంగా ఆరు తరాలు దీవించబడ్డాయి.

  9. మత్తయి 22:21.

  10. 3 నీఫై 24 చూడండి.

  11. సిద్ధాంతము మరియు నిబంధనలు 119:3-4. “దశమభాగమనేది ఒకరి ఆదాయం నుండి దేవుని సంఘానికి ఇచ్చే పదియవ వంతు (సిద్ధాంతము మరియు నిబంధనలు 119:3–4 చూడండి; వడ్డీ అంటే ఆదాయం అని అర్థం చేసుకోవాలి). ఆదాయం ఉన్న సభ్యులందరు దశమభాగం చెల్లించాలి” (General Handbook: Serving in The Church of Jesus Christ of Latter-day Saints, 34.3.1, Gospel Library).

  12. మలాకీ 3:10.

  13. “రక్షకుడు బోధించినట్లుగా, దశమభాగాలను ‘మందిరపు నిధిలోనికి’ (మలాకీ 3:10; 3 నీఫై 24:10) తెచ్చుట ద్వారా మనం దశమభాగాన్ని చెల్లిస్తాము. మన దశమభాగాన్ని మన బిషప్పు లేదా శాఖాధ్యక్షునికి చెల్లించడం ద్వారా మనం దీనిని చేస్తాము. మనకిష్టమైన స్వచ్ఛంద సంస్థలకు విరాళమివ్వడం ద్వారా మనం దశమభాగాన్ని చెల్లించము. స్వచ్ఛంద సంస్థలకు మనమిచ్చే విరాళం మన స్వంత నిధుల నుండి వస్తుంది, కానీ ప్రభువు యొక్క మందిరపు నిధికి చెల్లించమని మనం ఆజ్ఞాపించబడిన దశమభాగాల నుండి కాదు” (డాలిన్ హెచ్. ఓక్స్, “Tithing,” Ensign, 1994 మే, 35).

  14. సిద్ధాంతము మరియు నిబంధనలు 120:1.

  15. గార్డన్ బి. హింక్లి, “Rise to a Larger Vision of the Work,” Ensign, 1990 మే, 96.

  16. See “The 2022 Report on How the Church of Jesus Christ Cared for Those in Need,” Mar. 22, 2023, newsroom.ChurchofJesusChrist.org.

  17. సువార్తికుల విభాగం నుండి ఈ-మెయిల్ ద్వారా పొందబడింది, సెప్టె. 14, 2023.

  18. See “Temple List,” ChurchofJesusChrist.org/temples/list.

  19. సభ్యులు మరియు గణాంక రికార్డుల నుండి ఈ-మెయిల్ ద్వారా పొందబడింది, జూలై 28, 2023.

  20. ఇందులో బ్రిగమ్ యంగ్ విశ్వవిద్యాలయము, బ్రిగమ్ యంగ్ విశ్వవిద్యాలయము-ఐడహో, బ్రిగమ్ యంగ్ విశ్వవిద్యాలయము-హవాయి, ఎన్‌సైన్ కళాశాల మరియు ప్రపంచవ్యాప్త బివైయు పాత్‌వే ఉన్నాయి.

  21. సెమినరీలు మరియు ఇన్స్టిట్యూట్‌ల నుండి ఈ-మెయిల్ ద్వారా 2023, జూలై 28న పొందబడింది.

  22. See ప్రధాన చేతి పుస్తకం, 34.3.1.

  23. ప్రభువు యందు నమ్మకముంచడం గురించి అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ ఈ కథను పంచుకున్నారు: “విధవరాలైన నా తల్లి [తక్కువ] జీతంతో తన ముగ్గురు చిన్నపిల్లలను చూసుకుంది. … ఆమె జీతంలో అంత ఎక్కువ మొత్తాన్ని దశమభాగంగా ఎందుకు చెల్లిస్తున్నదని నేను మా అమ్మను అడిగాను. ఆమె వివరించిన దానిని నేనెప్పుడూ మరచిపోలేదు: ‘డాలిన్, కొంతమంది దశమభాగము చెల్లించకుండా ఉండగలరు, కానీ మనం ఉండలేము. మీ నాన్నను తీసుకుపోయి, మిమ్మల్ని పెంచడానికి నన్ను వదిలివేయాలని ప్రభువు ఎంచుకున్నారు. ప్రభువు యొక్క దీవెనలు లేకుండా నేను దానిని చేయలేను మరియు నిజాయితీగా దశమభాగాన్ని చెల్లించడం ద్వారా నేను ఆ దీవెనలను పొందుతాను’” (“దశమభాగము,” 33).

  24. “నా ముందు చూపు వలన, మీపైకి రాబోవు శ్రమ ఉన్నప్పటికిని, సిలెస్టియల్ లోకము క్రిందనున్న ఇతర జీవులన్నింటికి పైగా సంఘము స్వతంత్రముగా నిలుచును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 78:14).

  25. ఛార్లెట్ మార్టిన్ వ్రాసిన వ్యక్తిగత ఉత్తరప్రత్యుత్తరాల నుండి, ఆగష్టు 30, 2023.

  26. సిద్ధాంతము మరియు నిబంధనలు 1:30.

  27. అపొస్తలుల కార్యములు 5:38-39.

  28. రస్సెల్ ఎమ్. నెల్సన్, “లోకమును జయించి, విశ్రాంతి కనుగొనుడి,లియహోనా, నవ. 2022, 95.