సర్వసభ్య సమావేశము
సమాధానపరచువారు కావాలి
2023 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


సమాధానపరచువారు కావాలి

వివాదం లేదా సయోధ్యను ఎంచుకోవడానికి మీకు కర్తృత్వం ఉంది. ఇప్పుడు మరియు ఎల్లప్పుడు, సమాధారపరచువారిగా ఉండేందుకు ఎంచుకోమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, మీతో ఉండుట ఆనందకరము. గత ఆరు నెలల్లో, నిరంతరం మీరు నా మనస్సులో, నా ప్రార్థనలలో నిలిచారు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుండగా, మీరు వినాలని ప్రభువు కోరిన దానిని పరిశుద్ధాత్మ మీకు తెలియజేయాలని నేను ప్రార్థిస్తున్నాను.

చాలాకాలం క్రితం నేను శస్త్రచికిత్స గురించి నేర్చుకొనేటప్పుడు, నేను ఒక సర్జన్‌కి సహాయం చేస్తున్నాను, ఆయన అత్యంత అంటువ్యాధి గ్యాంగ్రీన్‌తో నిండిన కాలిని కోసి తీసివేస్తున్నారు. శస్త్రచికిత్స చాలా కష్టమైనది. అప్పుడు, ఆ ఒత్తిడికి తోడు, బృందంలో ఒకరు పనిని సరిగ్గా నిర్వర్తించలేదు మరియు సర్జన్ కోపంతో రగిలిపోయాడు. తన ప్రకోపం మధ్యలో, ఆయన క్రిములతో నిండిన శస్త్రవైద్యుని కత్తిని విసిరివేసారు. అది నా ముంజేతిపై పడింది!

అదుపు తప్పిన సర్జన్ తప్ప—శస్త్రచికిత్స గదిలో ప్రతీఒక్కరు—శస్త్రచికిత్స అభ్యాసం యొక్క ఈ ప్రమాదకరమైన ఉల్లంఘన చేత భయభ్రాంతులయ్యారు. కృతజ్ఞతగా, నాకు వ్యాధి సోకలేదు. కానీ ఈ అనుభవం నాపై శాశ్వత ముద్ర వేసింది. ఆ క్షణంలో, నా శస్త్రచికిత్స గదిలో ఏమి జరిగినా సరే, నేను ఎన్నడూ నా భావావేశాలపై అదుపు తప్పనని నాతో నేను వాగ్దానం చేసుకున్నాను. అది శస్త్రవైద్యుని కత్తి అయినా లేదా మాటలైనా—ఎన్నడూ కోపంలో ఏదీ విసిరివేయనని కూడా ఆరోజు నేను ప్రమాణం చేసాను.

దశాబ్దాల తర్వాత, ఇప్పుడు కూడా, ఈ రోజు మన పౌర సంభాషణ మరియు చాలా వ్యక్తిగత సంబంధాలను ప్రభావితం చేసే విషపూరితమైన వివాదం కంటే నా చేతిమీద పడిన కలుషితమైన కత్తి ఎక్కువ విషపూరితమైనదా అని నేను ఆశ్చర్యపోతుంటాను. ఈ భిన్న ధృవాలు మరియు ఉద్వేగభరితమైన విభేదాల యుగంలో నాగరికత మరియు మర్యాద కనుమరుగైపోయినట్లు అనిపిస్తోంది.

అసభ్యత, తప్పులెంచడం మరియు ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం సర్వసాధారణమయ్యాయి. చాలామంది పండితులు, రాజకీయ నాయకులు, వినోదకారులు మరియు ఇతర ప్రభావశీలులు నిరంతరం అవమానకరంగా మాట్లాడుతున్నారు. చాలామంది తమతో ఏకీభవించని వారెవరినైనా ఖండించడం, దూషించడం, నిందించడం పూర్తిగా ఆమోదయోగ్యమైనదని నమ్ముతున్నందుకు నేను చాలా విచారిస్తున్నాను. చాలామంది దయనీయమైన మరియు పదునైన విమర్శలతో మరొకరి పేరు ప్రఖ్యాతులను దెబ్బతీయడానికి ఆసక్తిగా ఉన్నారు.

కోపం ఎప్పుడూ ఒప్పించదు. శత్రుత్వం ఎవరినీ నిర్మించదు. వివాదం ఎన్నడూ ప్రేరేపిత పరిష్కారాలకు దారితీయదు. విచారకరంగా, మనం కొన్నిసార్లు మన సంఘ సభ్యులలో కూడా వివాదాస్పద ప్రవర్తనను చూస్తాము. తమ భాగస్వాములను, పిల్లలను చిన్నచూపు చూసేవారు, ఇతరులను నియంత్రించడానికి కోపతాపాలను ఉపయోగించేవారు మరియు “నిశ్శబ్దంగా ఉంటూ” కుటుంబ సభ్యులను శిక్షించేవారి గురించి మనం వింటుంటాము. తోటి పిల్లలను వేధించే యువత మరియు పిల్లలు, తమ సహోద్యోగుల పరువు తీసే ఉద్యోగుల గురించి మనం వింటుంటాము.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, అలా జరుగకూడదు. యేసు క్రీస్తు యొక్క శిష్యులుగా మనం—ప్రత్యేకించి మన మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు, ఇతరులతో సంభాషించే విధానంలో మాదిరికరంగా ఉండాలి. ఒక వ్యక్తి ఇతరులను ఎంత ప్రేమగా ఆదరిస్తాడనే దానిని బట్టి, ఆ వ్యక్తి యేసు క్రీస్తు యొక్క నిజమైన అనుచరుడు అవునో కాదో సులువుగా గుర్తించవచ్చు.

రెండు అర్థగోళాలలోని అనుచరులకు ఆయన ప్రసంగాలలో రక్షకుడు దీనిని స్పష్టం చేసారు. “హృదయశుద్ధి గలవారు ధన్యులు,” అని ఆయన అన్నారు1 “నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంప కూడ త్రిప్పుము,”2 అన్నారాయన. తరువాత, మనలో ప్రతీఒక్కరిని సవాలు చేసే హితబోధ చేసారాయన: “మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ములను శపించు వారిని దీవించుడి, మిమ్ములను ద్వేషించు వారికి మేలు చేయుడి; మరియు మిమ్ములను దౌర్జన్యముగా ఉపయోగించుకొని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి.”3

ఆయన మరణానికి ముందు, ఆయన వారిని ప్రేమించినట్టే, వారును ఒకరినొకరు ప్రేమింపవలెను అని తన పన్నెండుమంది అపొస్తలులను రక్షకుడు ఆజ్ఞాపించారు.4 మరియు తరువాత, “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు,”5 అని ఆయన జతచేసారు.

రక్షకుని సందేశము స్పష్టమైనది: పరిస్థితి ఎంత కష్టంగా ఉన్నప్పటికీ— ఆయన నిజమైన శిష్యులు నిర్మించి, ఉద్ధరించి, ప్రోత్సహించి, ఒప్పించి, ప్రేరేపిస్తారు. యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులు సమాధానపరచువారు.6

నేడు మట్టల ఆదివారము. భూమిపై ఎప్పుడో నమోదు చేయబడిన అత్యంత ముఖ్యమైన మరియు అతీతమైన సంఘటనను జరుపుకోవడానికి మనం సిద్ధపడుతున్నాము, అది ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము మరియు పునరుత్థానము. రక్షకుడిని మనం గౌరవించగల ఉత్తమ విధానాలలో ఒకటి సమాధానపరచువారిగా కావడం.7

రక్షకుని ప్రాయశ్చిత్తము వివాదముతో కలిపి—సమస్త చెడును జయించడాన్ని మనకు సాధ్యం చేసింది. మరోలా ఆలోచిస్తూ మోసపోకండి: వివాదము చెడ్డది! “వివాదము యొక్క ఆత్మను” కలిగియున్నవాడు ఆయన సంబంధి కాడు, కానీ “వివాదము యొక్క తండ్రియైన అపవాది సంబంధియై యున్నాడు; మరియు వారు ఒకరితోనొకరు కోపముతో పోరాడునట్లు మనుష్యుల హృదయాలను [అపవాది] పురిగొల్పును,”8 అని యేసు క్రీస్తు ప్రకటించారు. వారు గ్రహించారో లేదో, కానీ వివాదాన్ని పెంపొందించేవారు సాతాను చేసిన దానినే చేస్తున్నారు. “ఎవడును ఇద్దరు యాజమానులకు దాసుడుగా నుండనేరడు.”9 మన మాటల దాడితో సాతానుకు సహకరిస్తూ, ఇంకా మనం దేవునికి సేవచేయగలమని మనం ఆలోచించలేము.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, మనం ఒకరినొకరం ఎలా ఆదరిస్తామనేది ముఖ్యం! ఇంటివద్ద, సంఘములో, పని వద్ద మరియు అంతర్జాలంలో మనం ఇతరులతో మరియు ఇతరుల గురించి ఎలా మాట్లాడతాము అనేది ముఖ్యమైనది. ఈరోజు, ఉన్నతమైన, పరిశుద్ధమైన విధానంలో ఇతరులతో సంభాషించమని నేను మనల్ని అడుగుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. మనం మరొకరి గురించి—అతని ముఖం మీదనైనా లేదా ఆమె వెనుక అయినా—చెప్పడానికి “పవిత్రమైనది, రమ్యమైనది, ఖ్యాతిగలది లేదా పొగడదగినది ఏదైనా ఉన్నయెడల,”10 అది మన సంభాషణ యొక్క ప్రమాణం కావాలి.

మీ వార్డులో ఒక జంట విడాకులు తీసుకున్నా లేదా ఒక యువ సువార్తికుడు ముందుగానే ఇంటికి వచ్చేసినా లేదా ఒక యుక్తవయస్కుడు తన సాక్ష్యాన్ని సందేహించినా, వారికి మీ తీర్పు అవసరం లేదు. మీ మాటలు మరియు చర్యలలో ప్రతిబింబించే యేసు క్రీస్తు ప్రేమను వారు అనుభవించాలి.

సామాజిక మాధ్యమంలో ఒక స్నేహితుడు మీరు నమ్మే ప్రతీదానిని ఉల్లంఘించేలా బలమైన రాజకీయ లేదా సామాజిక అభిప్రాయాలను కలిగియున్నట్లయితే, కోపంతో, బాధాకరమైన ప్రతిస్పందన సహాయపడదు. ఇతరులతో సత్సంబంధాలు నెలకొల్పడానికి మీ నుండి చాలా ఎక్కువ అవసరమవుతుంది, కానీ సరిగ్గా మీ స్నేహితునికి కావలసింది కూడా అదే.

వివాదం ఆత్మను తరిమివేస్తుంది—ప్రతీసారి. విభేదాలను పరిష్కరించడానికి ముఖాముఖి తేల్చుకోవడమే మార్గము అనే తప్పుడు భావనను వివాదం బలపరుస్తుంది; కానీ అది సరికాదు. వివాదం ఒక ఎంపిక. సమాధానపరచడం ఒక ఎంపిక. వివాదం లేదా సయోధ్యను ఎంచుకోవడానికి మీకు కర్తృత్వం ఉంది. ఇప్పుడు మరియు ఎల్లప్పుడు, సమాధారపరచువారిగా ఉండేందుకు ఎంచుకోమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను.11

సహోదర సహోదరీలారా, మనం నిజంగా ప్రపంచాన్ని మార్చగలం—ఒకసారి ఒక వ్యక్తి మరియు ఒక సంభాషణతో. ఎలా? పరస్పర గౌరవంతో మరియు గౌరవప్రదమైన సంభాషణతో నిజాయితీగల భేదాభిప్రాయాలను ఎలా నిర్వహించాలో చూపడం ద్వారా.

భేదాభిప్రాయాలు జీవితంలో భాగము. ప్రతీరోజు నేను ప్రభువు యొక్క అంకితమైన సేవకులతో పనిచేస్తాను, వారు ఒక విషయాన్ని ఎల్లప్పుడూ ఒకే విధంగా చూడరు. మేము చర్చించే ప్రతీ విషయం—ప్రత్యేకించి సున్నితమైన విషయాల గురించి వారి ఆలోచనలు మరియు నిజాయితీగల భావాలను నేను వినాలనుకుంటున్నానని వారికి తెలుసు.

చిత్రం
అధ్యక్షుడు డాలిన్ హెచ్. ఓక్స్ మరియు అధ్యక్షుడు హెన్రీ బి. ఐరింగ్

నా ఇద్దరు ఉత్తమ సలహాదారులు, అధ్యక్షులు డాలిన్ హెచ్ ఓక్స్ మరియు అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్, తమ భావాలను వ్యక్తపరిచే విషయంలో మాదిరికరంగా ఉంటారు—ప్రత్యేకించి భిన్నాభిప్రాయాలు కలిగియున్నప్పుడు. ఒకరిపట్ల మరొకరు స్వచ్ఛమైన ప్రేమ కలిగియుండి వారలా చేస్తారు. తనకు బాగా తెలుసు కాబట్టి తన స్థానాన్ని కఠినంగా సమర్థించుకోవాలని కూడా ఏ ఒక్కరు సూచించరు. మరొకరితో పోటీ పడాల్సిన అవసరం ఏ ఒక్కరిలో కనిపించదు. ప్రతీఒక్కరు దాతృత్వము, “క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమ”12 తో నింపబడియున్నందున, మా చర్చలు ప్రభువు యొక్క ఆత్మచేత నడిపించబడతాయి. ఈ ఇద్ధరు గొప్ప వ్యక్తులను నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను మరియు గౌరవిస్తాను!

దాతృత్వము, వివాదానికి విరుగుడు. దాతృత్వమనేది ఆత్మీయ బహుమానము, అది స్వార్థపరుడు, సంరక్షకుడు, గర్విష్ఠి మరియు అసూయపరుడైన ప్రకృతి సంబంధియైన మనుష్యుని విసర్జించడానికి మనకు సహాయపడుతుంది. దాతృత్వమనేది యేసు క్రీస్తు యొక్క నిజమైన అనుచరుని ప్రధాన లక్షణం.13 దాతృత్వము సమాధానపరచువారిని నిర్వచిస్తుంది.

మనల్ని మనం దేవుని యెదుట తగ్గించుకొని, మన హృదయముల యొక్క పూర్ణ శక్తితో ప్రార్థన చేసినప్పుడు, దేవుడు మనకు దాతృత్వాన్ని దయచేస్తారు.14

ఈ దివ్యమైన బహుమానంతో దీవించబడిన వారు దీర్ఘ-శాంతము మరియు దయ గలవారు. వారు మత్సరపడరు, స్వప్రయోజనమును విచారించుకొనరు. వారు త్వరగా కోపపడరు, అపకారమును మనస్సులో ఉంచుకొనరు.15

సహోదర సహోదరీలారా, నేడు మనల్ని కష్టపెడుతున్న వివాదానికి జవాబు క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమ. ఒకరిపై ఒకరు భారాలను మోపడానికి బదులుగా, “ఒకరి భారములు ఒకరు భరించుటకు”16 దాతృత్వము మనల్ని ముందుకు నడిపిస్తుంది. క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమ “అన్ని సమయములలో, అన్ని విషయములలో”17ప్రత్యేకించి ఉద్రిక్త పరిస్థితులలో దేవునికి సాక్షులుగా నిలబడుటకు మనల్ని అనుమతిస్తుంది. క్రీస్తు యొక్క స్త్రీ పురుషులు—ప్రత్యేకించి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నప్పుడు, ఎలా మాట్లాడతారు మరియు వ్యవహరిస్తారు అని చూపడానికి దాతృత్వము మనల్ని అనుమతిస్తుంది.

ఇప్పుడు, “శాంతి కోసం దేనినైనా వదులుకోవడం”18 గురించి నేను మాట్లాడడం లేదు. మీరు సంస్కారంలో పాలుపొందినప్పుడు మీరు చేసే నిబంధనలను పాటించడానికి అనుగుణంగా ఉండే విధానాలలో ఇతరులను ఆదరించడం గురించి నేను మాట్లాడుతున్నాను. రక్షకుడిని ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకుంటామని మీరు నిబంధన చేస్తారు. ఉద్రిక్తతతో కూడిన మరియు వివాదంతో నిండిన పరిస్థితులలో, యేసు క్రీస్తును జ్ఞాపకముంచుకోమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఆయన చేసేవిధంగా చేయడానికి లేదా చెప్పడానికి ధైర్యం మరియు జ్ఞానం కలిగియుండాలని ప్రార్థించండి. సమాధానకర్తయగు అధిపతిని మనం అనుసరించినప్పుడు, మనం ఆయన సమాధానకర్తలుగా అవుతాము.

మీకు తెలిసిన వారెవరికో ఈ సందేశం నిజంగా సహాయపడుతుందని ఈ నిమిషంలో మీరు ఆలోచిస్తుండవచ్చు. బహుశా, మీతో మంచిగా ఉండేందుకు ఇది అతనికి లేదా ఆమెకు సహాయపడుతుందని మీరు ఆశిస్తుండవచ్చు. ఇది సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను! కానీ, సమాధానపరచువారిగా అగుట నుండి మిమ్మల్ని నిరోధించే గర్వము లేదా అసూయ తునకలు ఉన్నాయేమోనని మీ అంతరంగ భావాలను మీరు పరీక్షించుకుంటారని కూడా నేను ఆశిస్తున్నాను.19

ఇశ్రాయేలీయులను సమకూర్చుటలో సహాయపడడం గురించి మరియు నిత్యత్వము వరకు నిలిచియుండే బంధాలను పెంపొందించడం గురించి మీరు తీవ్రంగా ఆలోచిస్తున్నట్లయితే, పగను విడిచిపెట్టే సమయం ఇదే. నా మార్గం లేదా ఏ మార్గం లేదు అని నొక్కి చెప్పడం మానేయడానికి సమయం ఇదే. మిమ్మల్ని బాధపెడతారేమో అనే భయంతో ఇతరులు అతి జాగ్రత్తగా మసలుకొనేలా చేసే విషయాలను మానేయడానికి సమయం ఇదే. మీ యుద్ధ ఆయుధాలను పాతిపెట్టవలసిన సమయం ఇదే.20 మీ మాటల ఆయుధాగారం అవమానాలు మరియు ఆరోపణలతో నిండి ఉంటే, వాటిని దూరంగా ఉంచే సమయం ఇదే.21 క్రీస్తునందు ఆత్మీయంగా బలమైన పురుషునిగా లేదా స్త్రీగా మీరు ఉదయిస్తారు.

మన తపనలో దేవాలయం మనకు సహాయపడగలదు. అక్కడ మనం, సమస్త వివాదానికి ప్రేరేపకుడైన సాతానును జయించడానికి మనకు సామర్థ్యాన్నిచ్చే దేవుని శక్తిని వరంగా పొందుతాము.22 అతడి ప్రభావాన్ని మీ సంబంధాల నుండి తీసివేయండి! మనం ఒక అపార్థాన్ని తొలగించిన లేదా అవమానాన్ని తీసుకోవడానికి నిరాకరించిన ప్రతీసారి మనం అపవాదిని మందలిస్తామని కూడా గమనించండి. దానికి బదులుగా, యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యుల లక్షణమైన మృదు కనికరమును మనం చూపగలము. సమాధానపరచువారు అపవాదిని నిరోధిస్తారు.

మనుష్యులుగా మనం కొండ పైన నిజమైన వెలుగుగా—“మరుగైయుండని” వెలుగుగా మారదాం.23 క్లిష్టమైన విషయాలను పరిష్కరించడానికి శాంతియుతమైన, గౌరవప్రదమైన మార్గముందని మరియు అసమ్మతులపై పనిచేయడానికి తెలివైన మార్గముందని చూపుదాం. యేసు క్రీస్తు యొక్క నిజమైన అనుచరులు చూపే దాతృత్వాన్ని మీరు చూపినప్పుడు, ప్రభువు మీ ప్రయత్నాలను మీ ఉన్నతమైన ఊహకు మించి హెచ్చిస్తారు.

సువార్త వల ప్రపంచంలోనే అతి పెద్ద వల. దేవుడు “నల్లవారైనా తెల్లవారైనా, బందీలైనా స్వతంత్రులైనా, పురుషులైనా స్త్రీలైనా” అందరినీ తన వద్దకు రమ్మని ఆహ్వానించారు.24 ప్రతీఒక్కరి కోసం స్థలముంది. అయినప్పటికీ, పక్షపాతం, ఖండించడం లేదా ఏ రకమైన వివాదానికైనా స్థలం లేదు.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, ఇతరులను నిర్మించడంలో తమ జీవితాలను గడిపే వారికి ఇంకా ఉత్తమమైనది రావలసి ఉంది. మీరు ఇతరులను ఆదరించే విధానము యొక్క కోణంలో మీ శిష్యత్వాన్ని పరీక్షించుకోమని నేడు నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీ ప్రవర్తన ఉన్నతంగా, గౌరవప్రదంగా మరియు యేసు క్రీస్తు యొక్క నిజమైన అనుచరునికి ప్రతినిధిగా ఉండేందుకు అవసరమైన సర్దుబాట్లు చేసుకోమని నేను మిమ్మల్ని దీవిస్తున్నాను.

కలహాన్ని వేడుకోలుతో, శత్రుత్వాన్ని గ్రహింపుతో మరియు వివాదాన్ని శాంతితో భర్తీచేయమని నేను మిమ్మల్ని దీవిస్తున్నాను.

దేవుడు జీవిస్తున్నాడు! యేసే క్రీస్తు. ఆయన ఈ సంఘానికి అధిపతిగా ఉన్నారు. మనం ఆయన సేవకులము. సమాధానపరచువారిగా మారడానికి ఆయన మనకు సహాయపడతారు. ఈవిధంగా యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.