లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 136


136వ ప్రకరణము

మిస్సోరి నదికి పశ్చిమమున ఐయోవాలోని కౌన్సిల్ బ్లఫ్ సమీపములోనున్న వింటర్ క్వార్టర్స్, ఇశ్రాయేలీయుల శిబిరము, ఓమాహ ప్రదేశములో ప్రవక్తయైన బ్రిగంయంగ్ ద్వారా ఇవ్వబడిన ప్రభువు చిత్తము మరియు వాక్కు.

1–16, పశ్చిమదిశగా చేయు ప్రయాణము కొరకు ఇశ్రాయేలు సమాజమును ఏవిధముగా వ్యవస్థీకరించవలెనో వివరించబడెను; 17–27, అనేక సువార్త ప్రమాణములను బట్టి జీవించవలెనని పరిశుద్ధులు ఆజ్ఞాపించబడిరి; 28–33, పరిశుద్ధులు గానము, నాట్యము, ప్రార్థన చేసి జ్ఞానము నేర్చుకొనవలెను; 34–42, వారు ఘనతపొందటకు, దుష్టులు శిక్షింపబడుటకు ప్రవక్తలు చంపబడిరి.

1 పశ్చిమమునకు వారి ప్రయాణములో ఇశ్రాయేలు సమాజమును గూర్చి ప్రభువు చిత్తము మరియు వాక్కు:

2 యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ ప్రజలందరు, వారితో ప్రయాణము చేయువారు ప్రభువైన మన దేవుని ఆజ్ఞలు, కట్టడలన్నింటిని గైకొనునట్లు ఒక వాగ్దానము, నిబంధన చేసుకొని బృందములుగా వ్యవస్థీకరించబడవలెను.

3 పన్నెండుమంది అపొస్తలుల నిర్దేశములో వారిపైన ఒక అధ్యక్షుడు, అతనికి ఇద్దరు సలహాదారులతో పాటు ఆ బృందములు నాయకులతో నూరుమందిగా, ఏబది మందిగా, పదిమందిగా వ్యవస్థీకరించబడవలెను.

4 మనము దేవుని విధులన్నింటిని బట్టి నడుచుకొందుము అనునది మన నిబంధనగా ఉండును.

5 వారు చేయగలిగినంతవరకు ప్రతి బృందము ఎడ్లను, బండ్లను, సరుకులను, వస్త్రములను, వారి ప్రయాణమునకు కావలసిన ఇతర సామాగ్రిని సమకూర్చుకొనవలెను.

6 బృందములు వ్యవస్థీకరించబడిన తరువాత, అక్కడ నిలిచియుండు వారికొరకు కావలసినవి సిద్ధపరచుటకు తమ శక్తితో ముందుకు రావలెను.

7 ప్రతి బృందము తమ నాయకులు, అధ్యక్షులతో మరుసటి వసంతకాలములో ఎంతమంది వెళ్ళగలరో నిర్ణయించవలెను; తరువాత ఎడ్లను, విత్తనములను, వ్యవసాయ పనిముట్లను తీసుకొనివెళ్ళుటకు, వసంతకాలపు పంటవేయుటకు సమస్తము సిద్ధముచేయుటకు అగ్రగాములుగా వెళ్ళుటకు కావలసినంతమంది బలవంతులు, నైపుణ్యముగల పురుషులను ఎన్నుకొనవలెను.

8 ప్రతి బృందము వారు కలిగియున్న ఆస్థి భాగమునుబట్టి బీదలను, విధవరాండ్రను, తండ్రిలేనివారిని, సైనికదళములో చేరినవారి కుటుంబములను తీసుకొనివెళ్ళుటకు సమాన భాగములను భరించవలెను, తద్వారా విధవరాండ్రు, తండ్రిలేనివారి మొరలు ఈ జనులకు విరోధముగా ప్రభువు చెవులలోకి రాకుండా ఉండును.

9 ఈ కాలములో వెళ్ళకుండా నిలిచియుండు వారికొరకు ప్రతి బృందము గృహములను, ధాన్యమును పండించుటకు పొలములను సిద్ధపరచవలెను; ఈ ప్రజలను గూర్చి ప్రభువు చిత్తము ఇదియే.

10 ప్రభువు సీయోను గుడారమును స్థిరపరచు స్థలమునకు ఈ ప్రజలను తీసుకొనివెళ్ళుటకు ప్రతి మనుష్యుడు తనకున్న పలుకుబడిని, ఆస్థిని ఉపయోగించవలెను.

11 నిర్మలమైన హృదయముతో, సమస్త విశ్వాస్యతయందు దీనిని మీరు చేసిన యెడల మీరు దీవించబడుదురు; మీ పశువులు, మీ మందలు, మీ పొలములు, మీ గృహములు, మీ కుటుంబముల విషయములో మీరు దీవించబడుదురు.

12 నా సేవకులైన ఎజ్రా టి. బెన్సన్, ఎరాస్టస్ స్నో ఒక బృందమును వ్యవస్థీకరించవలెను.

13 నా సేవకులైన ఓర్సన్ ప్రాట్, విల్ఫర్డ్ ఉడ్రఫ్‌లు ఒక బృందమును వ్యవస్థీకరించవలెను.

14 అంతేకాక, నా సేవకులైన అమాస లైమన్, జార్జ్ ఎ. స్మిత్ ఒక బృందమును వ్యవస్థీకరించవలెను.

15 అధ్యక్షులను, వందమందికి, ఏబదిమందికి, పదిమందికి నాయకులను నియమించవలెను.

16 నియమించబడియున్న నా సేవకులు వెళ్ళి దీనిని, నా చిత్తమును పరిశుద్ధులకు బోధించవలెను, తద్వారా ప్రశాంతమైన ప్రదేశమునకు వెళ్ళుటకు వారు సిద్ధపడుదురు.

17 మీ త్రోవను వెళ్ళి నేను చెప్పినట్లుగా చేయుడి, మీ శత్రువులను గూర్చి భయపడకుడి; ఏలయనగా నా కార్యమును ఆపుటకు వారు శక్తిని కలిగియుండరు.

18 నా యుక్త కాలములో సీయోను విమోచింపబడును.

19 ఎవడైనను నా ఉపదేశమును అంగీకరించక తనకుతానుగా ముందుకు సాగుటకు ప్రయత్నించిన యెడల, అతడు శక్తిని కలిగియుండడు మరియు అతని అవివేకము ప్రత్యక్షపరచబడును.

20 మీరు వెదకుడి; మీరు ఒకరికొకరు చేసుకొనిన వాగ్దానములను నెరవేర్చుడి; మీ సహోదరునికి చెందిన దానిని ఆశించకుడి.

21 ప్రభువు నామమును వ్యర్థముగా ఉచ్చరించు దుష్ట కార్యమునకు మీరు దూరముగానుండుడి, ఏలయనగా నేను మీ దేవుడైన ప్రభువును, అనగా మీ పితరుల దేవుడను, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను.

22 ఐగుప్తు దేశమునుండి ఇశ్రాయేలు సంతానమును నడిపించినది నేనే; నా ఇశ్రాయేలు జనాంగమును రక్షించుటకు అంత్యదినములలో నా బాహువు చాపబడియున్నది.

23 ఒకనితోనొకరు జగడములాడుటను మానుడి; ఒకరిని గూర్చి మరొకరు చెడుగా మాట్లాడుటను మానుడి.

24 మద్యమును సేవించుట మానుడి; మీ మాటలు ఒకరికొకరు ఆత్మీయాభివృద్ధిని కలుగజేయు విధముగా ఉండవలెను.

25 నీ పొరుగువాని నుండి అప్పు తీసుకొనిన యెడల, నీవు అప్పుగా తీసుకొనినది తిరిగి చెల్లించవలెను; నీవు తిరిగి చెల్లించలేని యెడల, అతడు నిన్ను నిందించకుండునట్లు నీవు వెళ్ళి నీ పొరుగువానికి చెప్పవలెను.

26 నీ పొరుగువాడు పోగొట్టుకొనిన దానిని నీవు వెదకవలసి ఉన్నప్పుడు, దానిని తిరికి వానికి అప్పగించువరకు నీవు శ్రద్ధగా వెదకవలెను.

27 నీవు తెలివిగల గృహనిర్వాహకునిగా ఉండునట్లు నీవు కలిగియున్నది కాపాడుకొనుటలో శ్రద్ధవహించవలెను; ఏలయనగా అది దేవుడైన నీ ప్రభువు యొక్క ఉచిత బహుమానము, నీవు ఆయన గృహనిర్వాహకుడవైయున్నావు.

28 నీకు సంతోషము కలిగినయెడల, గానముతోను, సంగీతముతోను, నాట్యముతోను, కృతజ్ఞతాస్తుతులతోను ప్రభువును స్తుతించుము.

29 నీకు దుఃఖము కలిగిన యెడల, నీ ఆత్మ ఆనందించునట్లు నీ దేవుడైన ప్రభువును వినయముతో ప్రార్థించుము.

30 నీ శత్రువులకు భయపడకుము, ఏలయనగా వారు నా చేతులలో ఉన్నారు, నా ఇష్టప్రకారము వారికి నేను చేసెదను.

31 వారికిచ్చుటకు నేను కలిగియున్న మహిమ అనగా సీయోను మహిమను పొందుటకు సిద్ధపడునట్లు నా జనులు అన్నివిషయములలో పరీక్షించబడవలెను; గద్దింపును సహింపనివాడు నా రాజ్యమునకు యోగ్యుడు కాడు.

32 అజ్ఞానముతో ఉన్నవాడు తననుతాను తగ్గించుకొని, అతని దేవుడైన ప్రభువును ప్రార్థించుట ద్వారా జ్ఞానమును నేర్చుకొనవలెను, తద్వారా అతడు చూచునట్లు అతని కండ్లు తెరువబడును, వినునట్లు అతని చెవులు తెరువబడును;

33 ఏలయనగా దీనులకు, నలిగినవారికి వెలుగునిచ్చుటకు, భక్తిహీనులను నిందించుటకు లోకములోనికి నా ఆత్మ పంపబడెను.

34 మీ సహోదరులు మిమ్ములను, మీ సాక్ష్యమును తిరస్కరించిరి, దేశము కూడా మిమ్ములను బయటకు తరిమివేసెను;

35 మరియు ప్రసవించు స్త్రీ ప్రసవవేదనలు పడునట్లు ఇప్పుడు ఉపద్రవ దినము అనగా రోదించు దినము వచ్చుచున్నది; వారు వేగముగా, అతి వేగముగా పశ్చాత్తాపపడని యెడల వారి దుఃఖము గొప్పగానుండును.

36 ఏలయనగా వారు ప్రవక్తలను వారియొద్దకు పంపబడిన వారిని చంపిరి; వారు నిరపరాధ రక్తమును చిందించిరి, అది నేలనుండి వారికి విరోధముగా మొరపెట్టుచున్నది.

37 కాబట్టి, ఈ సంగతులను గూర్చి ఆశ్చర్యపడకుడి, ఏలయనగా మీరు ఇంకను పవిత్రులు కారు; నా మహిమను మీరు ఇంకను సహింపలేరు; కానీ నేను మీకు ఇచ్చియున్న నా వాక్యములన్నిటిని పాటించుటలో మీరు విశ్వాసముగానుండిన యెడల, ఆదాము నుండి అబ్రాహాము వరకు, అబ్రాహాము నుండి మోషే వరకు, మోషే నుండి యేసు క్రీస్తు మరియు ఆయన అపొస్తలుల వరకు, యేసు క్రీస్తు మరియు ఆయన అపొస్తలుల నుండి నా కార్యమును ముందుకు తెచ్చుటకు నా పరిశుద్ధ దూతల ద్వారా, పరిచర్య చేయు నా సేవకుల ద్వారా, పరలోకము నుండి నా స్వరము ద్వారా నేను పిలిచియున్న జోసెఫ్ స్మిత్ వరకు దానిని మీరు చూచెదరు;

38 అతడు ఆ పునాదిని వేసి, నమ్మకముగానుండెను; అతడిని నేను నా యొద్దకు తీసుకొనిపోయితిని.

39 అతని మరణమును గూర్చి అనేకులు విస్మయమొందిరి; కానీ అతడు ఘనతనొందుటకు, దుష్టులు నాశనమగుటకు అతడు తన సాక్ష్యమును తన రక్తముతో ముద్రించుట అవసరమైయుండెను.

40 నేను మిమ్ములను మీ శత్రువుల నుండి విడిపించి, అందును బట్టి నా నామమును గూర్చి ఒక సాక్ష్యమును మీకు ఇచ్చియుండలేదా?

41 కాబట్టి, ఇప్పుడు నా సంఘ జనులారా ఆలకించుడి; పెద్దలైన మీరు కలిసి వినుడి; మీరు నా రాజ్యమును పొందియున్నారు.

42 నా ఆజ్ఞలన్నిటిని పాటించుటలో శ్రద్ధగలిగియుండుడి, లేనియెడల మీ యొద్దకు తీర్పులు వచ్చును, మీరు విశ్వాసమును కోల్పోవుదురు, మీ శత్రువులు మిమ్ములను జయించెదరు. ప్రస్తుతము ఇక దేనిని బయలుపరచను. ఆమేన్, ఆమేన్.