సర్వసభ్య సమావేశము
మరుగైయున్న అగ్ని కదలికలు
2024 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


మరుగైయున్న అగ్ని కదలికలు

దేవుడు మనం చేసే ప్రతి ప్రార్థనను వింటారు మరియు మన పరిపూర్ణత కోసం ఆయన చెప్పిన మార్గానికి అనుగుణంగా వాటిలో ప్రతిదానికి స్పందిస్తారు.

సహోదర సహోదరీలారా, నేను చివరిసారిగా 2022 అక్టోబరు‌లో ఈ వేదిక‌ను ఎక్కినప్పటి నుండి బాధాకరమైన పాఠం నేర్చుకున్నాను. ఆ పాఠం ఏమిటంటే: మీరు ఆమోదయోగ్యమైన ప్రసంగం ఇవ్వకపోతే, మీరు తదుపరి అనేక సమావేశాల నుండి నిషేధించబడవచ్చు. దీనిలో మొదటి సభ‌లో ముందుగానే నేను నియమించబడియుండడాన్ని మీరు చూడవచ్చు. మీరు చూడలేనిది ఏమిటంటే, నేను చాలా సున్నితమైన గొళ్ళెంతో ఉన్న నేలతలుపు మీద నిలబడి ఉన్నాను. ఈ ప్రసంగం సరిగ్గా జరగకపోతే, నేను మిమ్మల్ని మరికొన్ని సమావేశాల వరకు చూడను.

ఈ అందమైన గాయకబృందంతో ఆ అందమైన కీర్తన స్ఫూర్తితో, నేను ఇటీవల కొన్ని పాఠాలు నేర్చుకున్నాను, ప్రభువు సహాయంతో, ఈ రోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అది దీనిని చాలా వ్యక్తిగత ప్రసంగంగా మార్చుతుంది.

ఇటీవలి అనుభవాలలో అత్యంత వ్యక్తిగతమైనది మరియు బాధాకరమైనది నా ప్రియమైన భార్య పాట్ మరణం. ఆమె నాకు తెలిసిన గొప్ప మహిళ—ఒక పరిపూర్ణమైన భార్య మరియు తల్లి, ఆమె స్వచ్ఛత, ఆమె భావవ్యక్తీకరణ యొక్క బహుమానం మరియు ఆమె ఆధ్యాత్మికత గురించి నేను ఏమని చెప్పను. ఆమె ఒకసారి “మీ సృష్టి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడం” అనే శీర్షికతో ఒక ప్రసంగం ఇచ్చింది. ఆమె తన సృష్టి యొక్క ఉద్దేశాన్ని ఎవరూ ఆశించనంత విజయవంతంగా నెరవేర్చినట్లు నాకు అనిపిస్తోంది. ఆమె దేవుని యొక్క పరిపూర్ణమైన కుమార్తె, క్రీస్తు యొక్క సుగుణాలకు మాదిరి. నా జీవితంలో 60 సంవత్సరాలు ఆమెతో గడపినందుకు నేను చాలా అదృష్టవంతుడిని. నేను యోగ్యుడనని నిరూపించుకుంటే, మేము ముద్రవేయబడడానికి అర్థము నేను ఆమెతో నిత్యత్వమును గడపగలను.

నా భార్య సమాధి చేయబడిన 48 గంటల తర్వాత మరొక అనుభవం మొదలైంది. ఆ సమయంలో, నేను తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాను. నేను అక్కడున్న ఆరు వారాలలో మొదటి నాలుగు వారాలు అత్యవసర చికిత్సా విభాగం లోపల మరియు బయట స్పృహలో ఉండి, లేకుండా గడిపాను.

వాస్తవంగా ఆ సమయంలో ఆసుపత్రిలో నా అనుభవమంతా నా జ్ఞాపకం నుండి కోల్పోబడింది. నా జ్ఞాపకం నుండి కోల్పోబడనిది ఏమిటంటే, ఆసుపత్రి వెలుపల, నిత్యత్వం యొక్క అంచుగా అనిపించిన దాని నుండి బయటికి నా ప్రయాణం. నేను ఇక్కడ ఆ అనుభవం గురించి పూర్తిగా చెప్పలేను, కానీ నేను అందుకున్న దానిలో కొంత భాగం ఒక ఆజ్ఞయని—మరింత ఆవశ్యకతతో, మరింత సమర్పణతో, రక్షకునిపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి, ఆయన వాక్యంపై మరింత విశ్వాసంతో నా పరిచర్యకు తిరిగి రావాలనే ప్రోత్సాహం అని చెప్పగలను.

దాదాపు 200 సంవత్సరాల క్రితం పన్నెండుమందికి ఇచ్చిన బయల్పాటు యొక్క నా స్వంత వ్యక్తిగత భాషాంతరాన్ని నేను పొందుతున్నాను అనేలా చేసింది నా అనుభవం:

“నా నామమును గూర్చి నీవు సాక్ష్యమిచ్చెదవు … [మరియు] నా వాక్యమును నీవు భూదిగంతముల వరకు చేరవేయుదువు. …

“… ప్రతి ఉదయము, ప్రతి దినము, నీ హెచ్చరిక స్వరమును ముందుకు సాగనీయుము; రాత్రి సమీపించినప్పుడు, నీ ప్రసంగము వలన భూలోకవాసులను నిద్రించనియ్యకుము. …

“లేచి[,] … నీ సిలువనెత్తుకొని [మరియు] నన్ను వెంబడించుము.”1

నా ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఆ అనుభవం కలిగినప్పటి నుండి, నేను ప్రతిదినం పగలు మరియు రాత్రి వేళల్లో ఒక అపొస్తలునిగా నా ప్రోత్సాహము మరియు హెచ్చరిక స్వరాన్ని ఎక్కడ వినిపించగలనో తెలుసుకోవడానికి, నా శిలువను ఎత్తుకోవడానికి మరింత తీవ్రంగా ప్రయత్నించాను.

అది నష్టం, అనారోగ్యం మరియు బాధ యొక్క ఆ నెలల్లో వచ్చిన మూడవ సత్యానికి నన్ను నడిపిస్తుంది. ఇది ఈ సంఘము యొక్క దృఢమైన ప్రార్థనలు—మీ ప్రార్థనల కొరకు— పునరుద్ధరించబడిన సాక్ష్యము మరియు అంతులేని కృతజ్ఞత, వాటిలో నేను లబ్ధి పొందాను. వదలకుండా అడిగిన విధవరాలి2 వలె నా తరఫున పరలోక జోక్యాన్ని పదేపదే కోరిన వేలాది మంది ప్రజల ప్రార్థనల కొరకు నేను ఎప్పటికీ కృతజ్ఞుడనై ఉంటాను. నేను యాజకత్వ దీవెనలు పొందాను మరియు సంఘమంతటా అనేక యాదృచ్ఛిక వార్డులు చేసినట్లుగా, నా కోసం నా ఉన్నత పాఠశాల తరగతివారు ఉపవాసం చేయడం చూసాను. దాదాపు సంఘములోని ప్రతీ దేవాలయం యొక్క ప్రార్థన జాబితాలో నా పేరు స్పష్టంగా ఉంది.

వీటన్నిటికీ నా ప్రగాఢ కృతజ్ఞతగా, నేను జి. కె. చెస్టర్టన్‌తో చేరతాను, అతను ఒకసారి ఇలా అన్నాడు, “ధన్యవాదాలు అనేది ఆలోచన యొక్క అత్యున్నత రూపం; మరియు … కృతజ్ఞత అనేది ఆశ్చర్యంతో రెట్టింపైన ఆనందం.”3 “ఆశ్చర్యంతో రెట్టింపైన నా స్వీయానందంతో” మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను మరియు మీ ప్రార్థనలను విని నా జీవితాన్ని ఆశీర్వదించిన నా పరలోక తండ్రికి ధన్యవాదాలు.

సహోదర సహోదరీలారా, దేవుడు మనం చేసే ప్రతి ప్రార్థనను వింటారని మరియు మన పరిపూర్ణత కోసం ఆయన చెప్పిన మార్గానికి అనుగుణంగా ప్రతిదానికి ప్రతిస్పందిస్తారని నేను సాక్ష్యమిస్తున్నాను. దాదాపు ఒకే సమయంలో చాలామంది నా ఆరోగ్యం బాగుపడాలని ప్రార్థిస్తున్నారని, నాతో సహా సమాన సంఖ్యలో నా భార్య ఆరోగ్యం బాగుపడాలని ప్రార్థిస్తున్నారని నేను గుర్తించాను. పాట్ కోసం చేసిన ప్రార్థనలకు నేను కోరుకున్న విధంగా సమాధానం లభించనప్పటికీ, ఆ రెండు ప్రార్థనలు దైవికంగా కరుణామయుడైన పరలోక తండ్రికి వినిపించాయని మరియు సమాధానమివ్వబడ్డాయని నేను సాక్ష్యమిస్తున్నాను. దేవునికి మాత్రమే తెలిసిన కారణాల వల్ల ప్రార్థనలకు మనం ఆశించే దానికంటే భిన్నంగా సమాధానం ఇవ్వబడుతుంది—కానీ అవి వినిపించుకోబడతాయి మరియు విఫలం కాని ఆయన ప్రేమ మరియు సమయం ప్రకారం వాటికి సమాధానం ఇవ్వబడుతుంది.

మనం “సరియైనదానిని అడిగినట్లయితే,”4 మనం ఎప్పుడు, ఎక్కడ లేదా దేని గురించి ప్రార్థించాలి అనేదానికి పరిమితులు లేవు. బయల్పాటుల ప్రకారం, మనం “ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు”5 ఉండాలి. “నీతిమంతుల [జనుల] విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదైయుండును”7 అనే నమ్మకంతో, “మన చుట్టూ ఉన్న వారి కోసం”6 మనం ప్రార్థించాలని అమ్యులెక్ చెప్పాడు. బిగ్గరగా ప్రార్థించే అవకాశమున్న చోట మనం గట్టిగా ప్రార్థించాలి.8 అది ఆచరణాత్మకం కాకపోతే, మన హృదయంలో నిశ్శబ్దంగా ప్రార్థించాలి.9 మన ప్రార్థనలు “మరుగైయున్న అగ్ని కదలిక[లు]”10 అని, రక్షకుని ప్రకారం, ఎల్లప్పుడూ నిత్య తండ్రి అయిన దేవునికి ఆయన అద్వితీయ కుమారుని పేరిట సమర్పించబడాలని మనం పాడతాము.11

నా ప్రియమైన మిత్రులారా, మన ప్రార్థనలు మన మధురమైన సమయం,12 మన అత్యంత “నిజాయితీగల కోరిక,”13 మన ఆరాధన యొక్క సరళమైన, స్వచ్ఛమైన రూపం.14 మనం వ్యక్తిగతంగా, మన కుటుంబాలలో మరియు అన్ని పరిమాణాల సమూహాలలో ప్రార్థన చేయాలి.15 శోధనకు వ్యతిరేకంగా మనం ప్రార్థనను ఒక కవచంగా ఉపయోగించాలి,16 మరియు ప్రార్థన చేయకూడదని మనకు ఎప్పుడైనా అనిపిస్తే, ఏ సమయంలోనైనా మరియు అన్ని సమయాల్లో తన పిల్లలతో సంభాషించడానికి ఆరాటపడే దేవుని నుండి సంకోచం రాదని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. నిజానికి, మనల్ని ప్రార్థించకుండా చేసే కొన్ని ప్రయత్నాలు నేరుగా విరోధి నుండి వస్తాయి.17 ఎలా ప్రార్థించాలో లేదా దేని కోసం ప్రార్థించాలో ఖచ్చితంగా మనకు తెలియనప్పుడు, మనం ప్రారంభించాలి మరియు మనం అర్పించాల్సిన ప్రార్థనలో పరిశుద్ధాత్మ మనల్ని నడిపించే వరకు కొనసాగించాలి.18 మన శత్రువులు మరియు మనల్ని నిర్లక్ష్యంగా ఉపయోగించే వారి కోసం ప్రార్థించేటప్పుడు ఈ విధానంలో మనం ప్రార్థించవలసి ఉంటుంది.19

అంతిమంగా, చాలా తరచుగా ప్రార్థించిన రక్షకుని ఉదాహరణను మనం చూడవచ్చు. కానీ యేసు ప్రార్థించాల్సిన అవసరం ఉందని భావించడం నాకు ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తుంది. ఆయన పరిపూర్ణుడు కాదా? ఆయన దేని గురించి ప్రార్థించాలి? ఆయన కూడా మనతో పాటు “[తండ్రి] ముఖమును వెదకాలని, ఆయన మాటను విశ్వసించాలని మరియు ఆయన కృపను నమ్మాలని” కోరుకుంటున్నారని నేను గ్రహించాను.20 అయినప్పటికీ, అనేక సమయాల్లో ఆయన తనతో ఉన్నవారిని విడిచిపెట్టి, పరలోకంలో ఉన్న తన తండ్రికి ప్రార్థించారు.21 ఇతర సమయాల్లో, ఆయన కొంతమంది సహచరులతో కలిసి ప్రార్థించారు. తర్వాత ఆయన కొండమీద శిష్యుల యొక్క పెద్ద సమూహము తరఫున పరలోకాన్ని వెదికారు. కొన్నిసార్లు ప్రార్థన ఆయన వస్త్రములను వెలుగువలె తెల్లగా చేసింది.22 మరికొన్నిసార్లు ఆయన ముఖమును సూర్యునివలె ప్రకాశింపజేసింది.23 కొన్నిసార్లు ప్రార్థించడానికి ఆయన నిలబడ్డారు, కొన్నిసార్లు మోకరిల్లి ప్రార్థించారు, కనీసం ఒక్కసారైనా ప్రార్థనలో ఆయన సాగిలపడ్డారు.24

ఆయన వేదనపడి “మరింత ఆతురముగా”25 ప్రార్థన చేయడాన్ని లూకా వర్ణించాడు. అయితే పరిపూర్ణుడైన వ్యక్తి మరింత ఆతురముగా ఎలా ప్రార్థిస్తాడు? ఆయన ప్రార్థనలన్నీ గంభీరంగా ఉన్నాయని మనం ఊహిస్తున్నాము, అయినప్పటికీ ఆయన ప్రాయశ్చిత్త త్యాగాన్ని నెరవేర్చడంలో మరియు ప్రతీఒక్కరి బాధను భరించడం ద్వారా, చివరకి తన అర్పణ యొక్క భారం మూలంగా ప్రతి స్వేద రంధ్రము రక్తం చిందిస్తుండగా ఆయన మరింతగా ప్రాధేయపడుతూ ప్రార్థన చేయాలని భావించారు.

మరణంపై క్రీస్తు యొక్క విజయం మరియు ఇటీవల ఆయన నాకు మర్త్యత్వంలో మరికొన్ని వారాలు లేదా నెలల కాలం బహుమానంగా ఇచ్చిన నేపథ్యంలో, నిత్యజీవం యొక్క వాస్తవికత మరియు దాని కోసం మన ప్రణాళికలో మనం ఆలోచన కలిగి ఉండవలసిన అవసరత గురించి నేను గంభీరమైన సాక్ష్యమిస్తున్నాను.

క్రీస్తు వచ్చినప్పుడు—మాసిపోయిన బాప్తిస్మపు రికార్డులో జాబితా చేయబడిన నామమాత్రపు సభ్యులుగా కాకుండా, పూర్తి నిబద్ధతతో, నమ్మకంగా విశ్వసించేవారిగా, నిబంధనను పాటించే శిష్యులుగా ఆయన మనల్ని గుర్తించాల్సిన అవసరం ఉందని నేను సాక్ష్యమిస్తున్నాను. ఇది మనందరికీ అత్యవసరమైన విషయం, అలా కానట్లయితే ఈ వినాశకర ఆహ్వానాన్ని మనం వింటాము: “నేను మిమ్మును ఎన్నడును ఎరుగను,”26 లేదా, జోసెఫ్ స్మిత్ ఆ వాక్యభాగాన్ని అనువదించినట్లుగా, “[మీరు] నన్ను ఎన్నడూ ఎరిగియుండలేదు.”27

అదృష్టవశాత్తూ, ఈ పని కోసం మనకు సహాయం—చాలా సహాయం అందుతుంది. దేవదూతలు, అద్భుతాలు మరియు పరిశుద్ధ యాజకత్వం యొక్క వాగ్దానాలను మనం నమ్మాలి. పరిశుద్ధాత్మ వరమును, మంచి కుటుంబాలు, స్నేహితుల ప్రభావాన్ని మరియు క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమ యొక్క శక్తిని మనం నమ్మాలి. బయల్పాటు, ప్రవక్తలు, దీర్ఘదర్శులు, బయల్పాటుదారులు మరియు అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్‌ను మనం నమ్మాలి. ప్రార్థన, మనవి మరియు వ్యక్తిగత నీతి ద్వారా, మనం నిజంగా “సీయోను పర్వతమునకు, … సజీవుడగు దేవుని పట్టణమునకు, అన్నిటికంటె పరిశుద్ధమైన పరలోక ప్రదేశమునకు”28 రాగలమని మనం నమ్మాలి.

సహోదర సహోదరీలారా, మనం మన పాపాల గురించి పశ్చాత్తాపపడి, ధైర్యంగా “కృపాసనం”29 వద్దకు వచ్చి, మన హృదయపూర్వక విన్నపాలను ఆయన ముందు వదిలిపెట్టినప్పుడు, మన నిత్య తండ్రి మరియు విధేయుడైన, పరిపూర్ణంగా స్వచ్ఛమైన ఆయన కుమారుని దయతో మనం కనికరం పొందుతాము మరియు క్షమాపణను కనుగొంటాము. అప్పుడు, యోబు మరియు శుద్ధి చేయబడిన విశ్వాసులందరితోపాటు, మనం అర్థం చేసుకోలేని “అద్భుతమైన”30 ప్రపంచాన్ని చూస్తాము. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.