సర్వసభ్య సమావేశము
“ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి”
2024 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


“ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి”

మనము ఊరకయుండగలము మరియు దేవుడు మన పరలోక తండ్రి అని, మనం ఆయన బిడ్డలమని మరియు యేసు క్రీస్తు మన రక్షకుడని తెలుసుకోగలము.

ప్రభువు యొక్క కొత్త మందిరం కోసం ఇటీవల బహిరంగ సందర్శన మరియు మీడియా దినోత్సవం సందర్భంగా, నేను పరిశుద్ధమైన నిర్మాణం యొక్క పర్యటనలో జర్నలిస్టుల బృందానికి నాయకత్వం వహించాను. యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘములో దేవాలయాల ఉద్దేశాలను నేను వర్ణించాను మరియు వారి అనేక శ్రేష్ఠమైన ప్రశ్నలకు జవాబిచ్చాను.

సిలెస్టియల్ గదిలో ప్రవేశించకముందు, ప్రభువు గృహములో ఈ ప్రత్యేక గది ఈ జీవితం తరువాత మనము తిరిగి వెళ్ళే పరలోక గృహము యొక్క శాంతిని, అందాన్ని ప్రతీకాత్మకంగా సూచిస్తుందని నేను వివరించాను. సిలెస్టియల్ గదిలో ఉండగా మనము మాట్లాడకూడదని, కానీ ప్రయాణంలో ముందుకు సాగి ఆగిన తరువాత ఏ ప్రశ్నలకైనా నేను సంతోషంగా జవాబిస్తానని మా అతిథులకు సూచించాను.

సిలెస్టియల్ గది దాటి, తరువాత ప్రదేశంలో మేము సమావేశమయ్యాక, వారు గమనించినవి ఏవైనా పంచుకోమని మా అతిథులను నేను అడిగాను. జర్నలిస్టులలో ఒకరు భావావేశంతో చెప్పారు, “నా మొత్తం జీవితంలో నేను ఇటువంటిది ఎన్నడూ అనుభూతి చెందలేదు. ప్రపంచంలో ఇటువంటిది ఉన్నదని నాకసలు తెలియదు, ఇటువంటి ప్రశాంతత సాధ్యమవుతుందని మాత్రం నేను నమ్మలేదు.”

ఈ వ్యక్తి యొక్క ప్రకటనలో చిత్తశుద్ధిని మరియు నిష్కపటతను బట్టి నేను ఆశ్చర్యపడ్డాను. జర్నలిస్టు యొక్క స్పందన మా బాహ్య వాతావరణంలోని గందరగోళాన్ని జయించి, శ్రుతి చేస్తూ--నిశ్చలత యొక్క ముఖ్యమైన అంశాన్ని గుర్తించింది.

జర్నలిస్టు యొక్క వ్యాఖ్యను నేను తరువాత లోతుగా ఆలోచించి, తరచుగా తీవ్రంగా వేగవంతమైన మన ఆధునిక జీవితాలు— మన ఆసక్తిని కోరే తీరికలేనితనం, శబ్దాలు, అంతరాయాలు, పరధ్యానాలు మరియు మళ్ళింపులపై—పర్యాలోచన చేసినప్పుడు, ఒక లేఖనము నా మనస్సులోనికి వచ్చింది: “ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి.”1

మన జీవితాలలో నిశ్చలత యొక్క ఉన్నతమైన మరియు పరిశుద్ధమైన కోణాన్ని మనం పరిగణించినప్పుడు పరిశుద్ధాత్మ మనలో ప్రతి ఒక్కరికి జ్ఞానోదయం కలిగించాలని నేను ప్రార్థిస్తున్నాను—ఆత్మ యొక్క అంతర్గత ఆధ్యాత్మిక నిశ్చలత, దేవుడు మన పరలోక తండ్రి అని, మనం ఆయన బిడ్డలమని మరియు యేసు క్రీస్తు మన రక్షకుడని తెలుసుకోవడానికి, గుర్తుంచుకోవడానికి వీలు కలిగిస్తుంది. ఈ అసాధారణమైన దీవెన “ప్రభువు యొక్క నిబంధన జనులుగా”2 మారడానికి విశ్వాసంగా ప్రయాసపడే సంఘ సభ్యులందరికి లభ్యమవుతుంది.

ఊరకుండుడి

1833లో, మిస్సోరీలోని పరిశుద్ధులు తీవ్రమైన హింసకు గురయ్యారు. అల్లరిమూకలు వారిని జాక్సన్ కౌంటీలోని వారి ఇళ్ల నుండి తరిమికొట్టారు మరియు కొందరు సంఘ సభ్యులు సమీపంలోని ఇతర జిల్లాలలో తమనుతాము స్థాపించుకోవడానికి ప్రయత్నించారు. కానీ హింస కొనసాగింది మరియు మరణ బెదిరింపులు చాలా ఉన్నాయి. ఈ కష్టమైన పరిస్థితులలో, ఒహైయోలోని కర్ట్‌లాండ్‌లో ప్రవక్త జోసెఫ్ స్మిత్‌కు ప్రభువు క్రింది సూచనను బయల్పరిచారు:

“కాబట్టి, సీయోను గూర్చి మీ హృదయాలందు ఆదరణ పొందుడి; ఏలయనగా, సర్వ శరీరులు నా వశములోనున్నారు; ఊరకుండుడి నేనే దేవుడనని తెలుసుకొనుడి.”3

“ఉరకుండుడి” అన్న ప్రభువు యొక్క ఉపదేశం కేవలం మాట్లాడకపోవడం లేదా కదలకపోవడం కంటే చాలా ఎక్కువైనదని నేను నమ్ముతున్నాను. బహుశా మన కోసం ఆయన ఉద్దేశము “అన్ని సమయములలో, అన్ని విషయములలో, [మనము] ఉండు అన్ని స్థలములలో” ఆయనపై, ఆయన శక్తిపై ఆధారపడుటకు జ్ఞాపకముంచుకొనుట.4 కాబట్టి, “ఉరకుండుడి” అనేది మనల్ని కష్టమైన పనులను చేయడానికి మరియు అధిగమించడానికి బలపరిచే ఆత్మ యొక్క ఆధ్యాత్మిక నిశ్చలతకు అంతిమ మూలమైన రక్షకునిపై విఫలముకాని దృష్టి సారించాలని గుర్తు చేసే విధానము కావచ్చు.

బండపై కట్టబడుట

నిజమైన విశ్వాసము ఎల్లప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు పై —నిత్య తండ్రి యొక్క దైవిక మరియు అద్వితీయ కుమారునిగా ఆయనయందు మరియు ఆయనపై, ఆయన నెరవేర్చిన విమోచన నియమితకార్యముపై దృష్టిసారిస్తుంది.

“ఆయన ధర్మశాస్త్రము యొక్క అవసరాలను చెల్లించెను మరియు ఆయన యందు విశ్వాసము కలిగిన వారందరినీ ఆయన హక్కుగా కోరును; ఆయనయందు విశ్వాసము కలిగిన వారు ప్రతి మంచి సంగతిని హత్తుకొందురు; అందువలన ఆయన నరుల సంతానము యొక్క హేతువును వాదించును.”5

యేసు క్రీస్తు మన విమోచకుడు, 6 మన మధ్యవర్తి, 7 మరియు నిత్య తండ్రితో మన న్యాయవాది8 మరియు మన జీవితాల యొక్క ఆత్మీయ పునాదిని మనం నిర్మించాల్సిన బండ.

హీలమన్ ఇలా వివరించాడు, “ఇప్పుడు నా కుమారులారా! జ్ఞాపకముంచుకొనుడి, మీరు మీ పునాదిని దేవుని కుమారుడైన క్రీస్తు మరియు మన విమోచకుని యొక్క బండపై కట్టవలెనని జ్ఞాపకముంచుకొనుడి; అపవాది తన బలమైన గాలులను, సుడిగాలి యందు అతని బాణములను పంపునప్పుడు, అతని సమస్త వడగళ్ళు మరియు బలమైన గాలివాన మిమ్ములను కొట్టునప్పుడు, దౌర్భాగ్యపు అగాధము మరియు అంతము లేని శ్రమకు మిమ్ములను క్రిందికి లాగుకొనిపోవుటకు అది మీపై ఏ శక్తి కలిగియుండదు, ఏలయనగా మీరు కట్టబడిన ఆ పునాది ఒక నిశ్చయమైన పునాది మరియు మనుష్యులు ఆ పునాదిపై కట్టబడిన యెడల ఎన్నటికీ పడిపోరు.”9

మన జీవితాల పునాదిని మనం నిర్మించుకోవలసిన “బండగా” క్రీస్తు యొక్క ప్రతీకవాదం చాలా బోధనాత్మకమైనది. ఈ వచనములో రక్షకుడు పునాది కాదని దయచేసి గమనించండి. బదులుగా, మన వ్యక్తిగత ఆత్మీయ పునాదిని ఆయనపై కట్టాలని మనము బోధించబడ్డాము.10

పునాది అనేది భూమికి అనుసంధానించే భవనం యొక్క భాగం. బలమైన పునాది ప్రకృతి సంబంధమైన విపత్తులు మరియు అనేక ఇతర నాశనకరమైన శక్తుల నుండి భద్రతను అందిస్తుంది. సరైన పునాది అంతర్లీనంగా ఉన్న మట్టిపై ఎక్కువ భారం మోపకుండా ఉండటానికి మరియు నిర్మాణము కొరకు ఒక స్థాయి ఉపరితలాన్ని అందించడానికి పెద్ద ప్రదేశంలో నిర్మాణం యొక్క బరువును పంపిణీ చేస్తుంది.

చిత్రం
బలమైన పునాది కలిగిన ఇల్లు.

కాలక్రమేణా ఒక నిర్మాణము దృఢంగా మరియు స్థిరంగా నిలిచి ఉండాలంటే, భూమికి మరియు పునాదికి మధ్య బలమైన, ఆధారపడదగిన అనుసంధానం అవసరము. నిర్దిష్ట రకాలైన నిర్మాణాల కోసం, ప్రధాన కొయ్యలు మరియు స్టీలు కడ్డీ‌లను భవనం యొక్క పునాదిని నేల మరియు కంకర వంటి ఉపరితల పదార్థాల క్రింద ఉన్న గట్టి, దృఢమైన శిలలను “ఆధారశిల”కు జోడించడానికి ఉపయోగించవచ్చు.

చిత్రం
ఆధారశిలకు జతపరచబడిన ఇల్లు.

అదేవిధంగా, మనము స్థిరంగా, దృఢంగా నిలిచి ఉండాలంటే, మన జీవితాల యొక్క పునాది క్రీస్తు యొక్క బండకు జతపరచబడాలి. పునఃస్థాపించబడిన రక్షకుని సువార్త యొక్క పరిశుద్ధ నిబంధనలు మరియు విధులు ఆధారశిలకు ఒక భవనాన్ని జోడించడానికి ఉపయోగించబడిన ప్రధాన కొయ్యలు మరియు స్టీలు కడ్డీ‌లతో పోల్చబడవచ్చు. పరిశుద్ధ నిబంధనలను పొంది, సమీక్షించి, జ్ఞాపకముంచుకొని, పరిశుద్ధ నిబంధనలను క్రొత్తవిగా చేసుకొన్న ప్రతీసారి మన ఆత్మీయ లంగరులు యేసు క్రీస్తు యొక్క “బండకు” స్థిరంగా, దృఢంగా భద్రపరచబడతాయి.

“అందువలన దేవుని యందు విశ్వాసముంచు వాడెవడైనను నిశ్చయముగా మేలైన లోకము కొరకు, అనగా దేవుని యొక్క కుడిచేతి వైపున ఒక స్థలము కొరకు నిరీక్షించును; ఆ నిరీక్షణ విశ్వాసమును బట్టి వచ్చును, అది మనుష్యుల ఆత్మలకు ఒక లంగరు వంటిది, అది నిశ్చయముగా నిలకడగా ఎల్లప్పుడు సత్‌క్రియలలో వృద్ధి పొందుచూ దేవుడిని మహిమపరచుటకు వారు నడిపింపబడునట్లు చేయును.”11

“కొంతకాలమైన తరువాత,” క్రమంగా పెరుగుతూ “[మన] ఆలోచనలు నిరంతరము సుగుణముతో అలంకరింపబడతాయి,”12 మన “ఆత్మస్థైర్యము దేవుని సముఖమందు బలమైనదిగా ఎదుగుతుంది”13 మరియు “పరిశుద్ధాత్మ [మన] నిరంతర సహచరునిగా ఉంటాడు. మనము ఎక్కువగా కట్టబడి, స్థిరంగా వేరుపారి, స్థిరపరచబడతాము.14 మన జీవితాల పునాది రక్షకునిపై కట్టబడినప్పుడు, దేవుడు మన పరలోక తండ్రి అని, మనం ఆయన బిడ్డలమని మరియు యేసు క్రీస్తు మన రక్షకుడని ఒక ఆత్మీయ హామిని కలిగియుండుటకు—“ఊరకుండుటకు” మనము దీవించబడ్డాము.

పవిత్ర సమయాలు, పరిశుద్ధ స్థలాలు మరియు గృహము

మన ఆత్మల యొక్క ఈ అంతర్గత నిశ్చలతను అనుభవించడానికి మరియు తెలుసుకోవడానికి మనకు సహాయం చేయడానికి ప్రభువు మనకు పవిత్ర సమయాలు, పరిశుద్ధ స్థలాలు రెండింటినీ అందజేస్తారు.

ఉదాహరణకు, సబ్బాతు అనేది దేవుని యొక్క దినము, తండ్రిని జ్ఞాపకముంచుకోవడానికి మరియు ఆయన కుమారుని నామములో ఆరాధించడానికి, యాజకత్వ విధులలో పాల్గొనడానికి మరియు పవిత్ర నిబంధనలు పొంది, క్రొత్తవిగా చేసుకోవడానికి నియమించబడిన ఒక పవిత్ర సమయము. ప్రతీ వారము మన గృహ అధ్యయనములో మరియు “పరిశుద్ధులతో ఏక పట్టణస్థులుగా”15 సంస్కారములో మరియు ఇతర సమావేశాలందు మనము ప్రభువును ఆరాధిస్తాము. ఆయన పరిశుద్ధ దినమున, మన ఆలోచనలు, క్రియలు మరియు ప్రవర్తన మనము దేవునికి ఇచ్చే సంకేతాలు మరియు ఆయన కొరకు మన ప్రేమ యొక్క సూచిక.16 ప్రతీ ఆదివారము, మనము కోరుకుంటే, మనము ఊరకయుండగలము మరియు దేవుడు మన పరలోక తండ్రి అని, మనం ఆయన బిడ్డలమని మరియు యేసు క్రీస్తు మన రక్షకుడని తెలుసుకోగలము.

మన సబ్బాతు ఆరాధన యొక్క ప్రధాన లక్షణం “[ప్రభువు యొక్క] పరిశుద్ధ దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళి, [మన] సంస్కారములను అర్పించుట.”17 “ప్రార్థనా మందిరా[లు]” అనగా మనము సబ్బాతు దినమున సమకూడే సమావేశ గృహాలు మరియు అనుమతించబడిన ఇతర భవనాలు—భక్తిగల గౌరవము, ఆరాధన, మరియు అభ్యాసము యొక్క పరిశుద్ధ ప్రదేశాలు. ప్రతీ సమావేశ గృహము మరియు భవనము యాజకత్వ అధికారము చేత ప్రతిష్ఠించబడుతుంది, అక్కడ ప్రభువు యొక్క ఆత్మ నివసిస్తుంది మరియు దేవుని పిల్లలు వచ్చి “విమోచకుని గూర్చి తెలుసుకోవచ్చు.”18 మనము కోరుకుంటే, మనము ఆరాధించే పరిశుద్ధ స్థలములలో మనం “ఊరక” ఉండగలము మరియు దేవుడు మన పరలోక తండ్రి అని, మనం ఆయన బిడ్డలమని మరియు యేసు క్రీస్తు మన రక్షకుడని ఇంకా నిశ్చయముగా తెలుసుకోగలము.

దేవాలయము మరొక పరిశుద్ధ స్థలము, దేవుడిని ఆరాధించడానికి, సేవ చేయడానికి మరియు నిత్య సత్యములను నేర్చుకోవడానికి ప్రత్యేకంగా నియమించబడింది. మనము ప్రభువు మందిరంలో మనం తరచుగా వెళ్ళే ఇతర ప్రదేశాలకు భిన్నంగా ఆలోచిస్తాము, ప్రవర్తిస్తాము మరియు దుస్తులు ధరిస్తాము. ఆయన పరిశుద్ధ గృహములో, మనము కోరుకుంటే, మనము ఊరకయుండగలము మరియు దేవుడు మన పరలోక తండ్రి అని, మనం ఆయన బిడ్డలమని మరియు యేసు క్రీస్తు మన రక్షకుడని తెలుసుకోగలము.

పవిత్ర సమయం మరియు పరిశుద్ధ స్థలముల యొక్క ప్రధాన ఉద్దేశాలు ఖచ్చితంగా ఒకేవిధంగా ఉన్నాయి: మన పరలోక తండ్రి మరియు ఆయన ప్రణాళిక, ప్రభువైన యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తము, పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానవృద్ధి కలిగించే శక్తి, రక్షకుని యొక్క పునఃస్థాపించబడిన సువార్త యొక్క పవిత్ర విధులు మరియు నిబంధనలకు సంబంధించిన వాగ్దానాలపై పదే పదే మన ఆసక్తిని కేంద్రీకరించుట.

ఈరోజు నేను ముందు నొక్కి చెప్పిన సూత్రమును మరలా చెప్తాను. మన గృహాలు పవిత్ర సమయము మరియు పరిశుద్ధ స్థలము రెండింటి యొక్క అంతిమ కలయకగా ఉండాలి, అక్కడ వ్యక్తులు, కుటుంబాలు “ఊరక” ఉండగలరు మరియు దేవుడు మన పరలోక తండ్రి అని, మనం ఆయన బిడ్డలమని మరియు యేసు క్రీస్తు మన రక్షకుడని తెలుసుకోగలరు. సబ్బాతునాడు ప్రభువు మందిరంలో ఆరాధించడానికి మన గృహాలను విడిచి వెళ్ళుట నిశ్చయంగా ఆవశ్యకమైనది. ఆత్మీయ దృష్టి కోణముతో మరియు ఆ పరిశుద్ధ స్థలములలో, కార్యక్రమాలలో పొందిన బలముతో మన గృహాలకు తిరిగి వెళ్ళినప్పుడు మాత్రమే మనము మర్త్య జీవితం యొక్క ప్రధాన ఉద్దేశ్యాలపై మన దృష్టిని కాపాడుకోగలము మరియు పతనమైన మన లోకంలో చాలా ప్రబలమైన శోధనలను జయించగలము.

కొనసాగుతున్న మన సబ్బాతు, దేవాలయము మరియు గృహ అనుభవాలు పరిశుద్ధాత్మ శక్తితో, తండ్రి మరియు కుమారునితో కొనసాగుతున్న బలమైన నిబంధన సంబంధంతో మరియు దేవుని యొక్క నిత్య వాగ్దానాలందు “పరిపూర్ణమైన ప్రకాశవంతమైన నిరీక్షణతో”19 మనల్ని పటిష్ఠపరుస్తాయి.

గృహము మరియు సంఘము క్రీస్తునందు ఒకటిగా కలిపి సమకూర్చబడినప్పుడు,20 మనము అన్నివైపులా ఇబ్బంది పెట్టబడవచ్చు, కానీ మనము మన మనస్సులలో, హృదయాలలో నిరాశ చెందము. మన పరిస్థితులు మరియు కష్టాల చేత మనం కలవరపడవచ్చు, కానీ మనము నిరాశ చెందము. మనము హింసించబడవచ్చు, కానీ మనం ఎన్నడూ ఒంటరిగా లేమని కూడా గుర్తిస్తాము.21 మనము స్థిరముగా, దృఢముగా, మరియు యథార్థముగా మారడానికి ఆత్మీయ బలాన్ని పొందగలము.

వాగ్దానము మరియు సాక్ష్యము

యేసు క్రీస్తు యొక్క “బండ” పై మన జీవితాల యొక్క పునాదిని మనం నిర్మించినప్పుడు, ఆత్మ యొక్క వ్యక్తిగత, ఆత్మీయ నిశ్చలతను పొందడానికి పరిశుద్ధాత్మ చేత మనం దీవించబడగలము, అది దేవుడు మన పరలోక తండ్రి అని, మనం ఆయన బిడ్డలమని, యేసు క్రీస్తు మన రక్షకుడని, మనము కష్టమైన విషయాలను చేయడానికి మరియు జయించడానికి దీవించబడగలమని తెలుసుకోవడానికి, గుర్తుంచుకోవడానికి వీలు కలిగిస్తుందని నేను వాగ్దానము చేస్తున్నాను.

దేవుడు మన పరలోక తండ్రి అని, మనము ఆయన పిల్లలమని, యేసు క్రీస్తు మన విమోచకుడని మరియు మన రక్షణ యొక్క “బండ” అని నేను సంతోషంగా సాక్ష్యమిస్తున్నాను. ఆవిధంగా నేను ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.