సర్వసభ్య సమావేశము
ప్రభువునందు నమ్మకముంచుము
2024 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


ప్రభువునందు నమ్మకముంచుము

మనం ఆయనను విశ్వసించడానికి ఇష్టపడే స్థాయికి మాత్రమే దేవునితో మన సంబంధం పెరుగుతుంది.

మా కుటుంబంలో మేము కొన్నిసార్లు “ది క్రేజీ ట్రస్ట్ ఎక్సర్‌సైజ్” అని పిలిచే ఒక ఆట ఆడతాము. మీరు కూడా ఈ ఆట ఆడి ఉండవచ్చు. ఈ ఆటలో, ఇద్దరు వ్యక్తులు, ఒకరి వీపును మరొకరి వైపు చూపుతూ కొన్ని అడుగుల దూరంలో నిలబడియుంటారు. వెనుక ఉన్న వ్యక్తి నుండి వచ్చిన సంకేతాన్ని బట్టి, ముందు ఉన్న వ్యక్తి, చేతులు చాచి వేచియున్న తన స్నేహితుడి చేతుల్లోకి వెనుకకు పడిపోతాడు.

నమ్మకమే అన్ని సంబంధాలకు పునాది. “నేను అవతలి వ్యక్తిని విశ్వసించవచ్చా?” అనేది ఏదైనా సంబంధంలో ప్రవేశించేముందు అడిగే మొదటి ప్రశ్న. వ్యక్తులు ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే సంబంధం ఏర్పడుతుంది. ఒక వ్యక్తి పూర్తిగా నమ్మి, మరొకరు నమ్మకూడదని ఎంచుకుంటే అది సంబంధం కాదు.

మనలో ప్రతీ ఒక్కరు “ప్రేమగల పరలోక తండ్రి యొక్క ప్రియమైన ఆత్మీయ కుమారుడు లేదా కుమార్తెయైయున్నారు.1 కానీ, ఆత్మీయ వంశావళి ఒక పునాదిని అందించినప్పటికీ, అది తనంతట తాను దేవునితో అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పరచుకోదు. మనము ఆయనను విశ్వసించాలని ఎంచుకున్నప్పుడు మాత్రమే సంబంధం ఏర్పడుతుంది.

పరలోక తండ్రి తన ఆత్మీయ పిల్లల్లో ప్రతీఒక్కరితో సన్నిహిత వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకోవాలని ఆశిస్తున్నారు.2 యేసు ప్రార్థన చేసినప్పుడు ఆ కోరికను ఇలా వ్యక్తపరిచారు, “వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచు వారందరును ఏకమైయుండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను.”3 ప్రతీ ఆత్మీయ బిడ్డతో దేవుడు కోరుకునే సంబంధం చాలా సన్నిహితమైనది మరియు వ్యక్తిగతమైనది, తద్వారా ఆయన తన వద్ద ఉన్నదంతా మరియు తనకున్న సర్వస్వమును మనలో ప్రతి ఒక్కరికీ పంచగలరు.4 ఆ విధమైన లోతైన, నిత్య సంబంధం పరిపూర్ణమైన మరియు సంపూర్ణమైన నమ్మకంపై నిర్మించబడినప్పుడే అభివృద్ధి చెందుతుంది.

తన వంతుగా, పరలోక తండ్రి తన ప్రతీ బిడ్డ యొక్క దైవిక సంభావ్యతపై తన సంపూర్ణ విశ్వాసాన్ని తెలియజేయడానికి ఆరంభం నుండి పనిచేశారు. మనం భూమిపైకి రాకముందు మన ఎదుగుదల మరియు పురోగమనం కోసం ఆయన అందించిన ప్రణాళికకు నమ్మకమే పునాదిగా ఉన్నది. ఆయన మనకు నిత్య చట్టాలను బోధిస్తారు, భూమిని సృష్టిస్తారు, మనకు మర్త్య శరీరాలను అందిస్తారు, మన కోసం ఎన్నుకునే అవకాశాన్ని బహుమతిగా ఇస్తారు మరియు మన స్వంత ఎంపికలు చేసుకోవడం ద్వారా మనం నేర్చుకోవడానికి మరియు ఎదగడానికి అనుమతిస్తారు. మనం ఆయన చట్టాలను అనుసరించాలని, ఆయనతో మరియు ఆయన కుమారునితో నిత్య జీవితాన్ని ఆస్వాదించడానికి తిరిగి రావాలని ఆయన కోరుకుంటున్నారు.

మనం ఎప్పుడూ మంచి ఎంపికలు చేయమని తెలుసుకుని, చెడు ఎంపికల పర్యవసానాల నుండి తప్పించుకోవడానికి ఆయన ఒక మార్గాన్ని కూడా మన కొరకు సిద్ధం చేశారు. మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి మరియు పశ్చాత్తాపం యొక్క షరతుతో మనల్ని మళ్లీ శుద్ధీకరించటానికి ఆయన మన కొరకు రక్షకుడిని—ఆయన కుమారుడైన యేసు క్రీస్తును అందించారు.5 పశ్చాత్తాపం అనే అమూల్యమైన బహుమతిని క్రమం తప్పకుండా ఉపయోగించమని ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నారు.6

ప్రత్యేకించి బిడ్డ తప్పులు చేసి దాని ఫలితంగా బాధపడే అవకాశం ఉందని తల్లిదండ్రులకు తెలిసినప్పుడు, వారి స్వంత నిర్ణయాలు తీసుకొనేలా పిల్లలను తగినంతగా విశ్వసించడం ఎంత కష్టమో ప్రతీ తల్లిదండ్రులకు తెలుసు. అయినప్పటికీ, మన దైవిక సాధ్యతను చేరుకోవడానికి మనకు సహాయపడే ఎంపికలు చేయడానికి పరలోక తండ్రి మనల్ని అనుమతిస్తున్నారు! ఎల్డర్ డేల్ జి. రెన్‌లండ్ బోధించినట్లుగా, “తల్లిదండ్రుల పెంపకం విషయములో, ఆయన లక్ష్యం, తన పిల్లలు సరైనది చేయడం కాదు; అది [ఆయన] పిల్లలు సరైనది చేయడానికి ఎన్నుకోవడం మరియు చివరికి ఆయనలా మార్పు చెందటం.”7

దేవునికి మనపై నమ్మకం ఉన్నప్పటికీ, మనం ఆయనను విశ్వసించడానికి ఇష్టపడే స్థాయికి మాత్రమే ఆయనతో మన సంబంధం పెరుగుతుంది. సవాలు ఏమిటంటే, మనం పతనమైన ప్రపంచంలో జీవిస్తున్నాము మరియు అవినీతి, తారుమారు, నమ్మక ద్రోహం లేదా ఇతర పరిస్థితుల ఫలితంగా విశ్వాసం కోల్పోవడాన్ని మనమందరం అనుభవించాము. ఒకసారి నమ్మకద్రోహం జరిగితే, మళ్లీ నమ్మడం కష్టంగా అనిపిస్తుంది. అపరిపూర్ణులైన మానవులతో ప్రతికూలమైన విశ్వాస అనుభవాలు పరిపూర్ణంగా పరలోక తండ్రిని విశ్వసించే మన సామర్థ్యాన్ని మరియు సుముఖతను ప్రభావితం చేస్తాయి.

చాలా సంవత్సరాల క్రితం, నా స్నేహితులిద్దరు లియోనిడ్ మరియు వాలెంటినా, సంఘములో సభ్యులు కావాలనే ఆసక్తిని వ్యక్తం చేశారు. లియోనిడ్ సువార్త నేర్చుకోవడం ప్రారంభించినప్పుడు, అతనికి ప్రార్థన చేయడం కష్టంగా అనిపించింది. లియోనిడ్ అంతకుముందు తన జీవితంలో, ఉన్నతాధికారులచేత అధికార దుర్వినియోగం, తారుమారు చేయబడటం మరియు నియంత్రణతో బాధపడ్డాడు మరియు అధికారంపై అపనమ్మకాన్ని పెంచుకున్నాడు. ఈ అనుభవాలు అతడు తన హృదయాన్ని తెరువగల మరియు పరలోక తండ్రికి తన వ్యక్తిగత భావాలను వ్యక్తపరచగల సామర్థ్యాన్ని ప్రభావితం చేశాయి. కాలం మరియు అధ్యయనంతో, లియోనిడ్ దేవుని యొక్క స్వభావాన్ని బాగా అర్థం చేసుకున్నాడు మరియు అతని పట్ల దేవుని ప్రేమను అనుభవించాడు. చివరికి, కృతజ్ఞతలు తెలియజేయడానికి మరియు దేవునిపట్ల తనకున్న ప్రేమను వ్యక్తపరచడానికి అతనికి ప్రార్థన ఒక సహజమైన మార్గంగా మారింది. దేవునిపై అతనికి పెరిగిన విశ్వాసం, చివరికి అతనిని మరియు వాలెంటినాను, దేవుని పట్ల మరియు ఒకరి పట్ల మరొకరు వారి సంబంధాన్ని బలోపేతం చేసుకోవటానికి పవిత్రమైన నిబంధనలలోకి ప్రవేశించేలా నడిపించింది.

గతములో నమ్మకాన్ని కోల్పోవడం వల్ల దేవుడిని విశ్వసించకుండా ఉంటే, దయచేసి లియోనిడ్ మాదిరిని అనుసరించండి. సహనముతో పరలోక తండ్రి గురించి, ఆయన స్వభావము గురించి, ఆయన లక్షణాలు మరియు ఆయన ఉద్దేశాల గురించి మరింత తెలుసుకోవడం కొనసాగించండి. మీ జీవితంలో ఆయన ప్రేమ మరియు శక్తిని భావిస్తున్న అనుభవాల కోసం వెతకండి మరియు నమోదు చేయండి. మనం దేవుని గురించి ఎంత ఎక్కువగా నేర్చుకుంటే, ఆయనను విశ్వసించడం అంత సులభం అవుతుందని మన సజీవ ప్రవక్త, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించారు.8

దేవుడిని నమ్మటం నేర్చుకోవడానికి కొన్నిసార్లు ఉత్తమమైన మార్గం, కేవలం ఆయనను నమ్మడమే. “ది క్రేజీ ట్రస్ట్ ఎక్సర్‌సైజ్” లాగా, కొన్నిసార్లు మనం వెనుకకు పడిపోవడానికి సిద్ధంగా ఉండాలి మరియు ఆయన మనల్ని పట్టుకునేలా చేయాలి. మన మర్త్య జీవితము ఒక పరీక్ష. మన స్వంత సామర్థ్యానికి మించి మనల్ని సాగదీసే సవాళ్లు తరచుగా వస్తుంటాయి. మన స్వంత జ్ఞానం మరియు అవగాహన సరిపోనప్పుడు, సహజంగా మనకు సహాయపడే వనరుల కోసం చూస్తాము. సమాచార-సంతృప్త ప్రపంచంలో, మన సవాళ్లకు వాటి పరిష్కారాలను ప్రచారం చేసే మూలాధారాల కొరత లేదు. అయినప్పటికీ, సామెతలలోని సరళమైన, శాశ్వతమైన సలహా ఉత్తమమైన ఉపదేశమును అందిస్తుంది: “నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము.”9 సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు ముందుగా మనం ఆయన తట్టు తిరగడం ద్వారా దేవునిపై మనకున్న నమ్మకాన్ని చూపిస్తాము.

నేను లా స్కూల్ పూర్తి చేసిన తర్వాత, మేము ఎక్కడ పని చేయాలి మరియు మా ఇంటిని ఎక్కడ నిర్మించాలనే ముఖ్యమైన నిర్ణయాన్ని మా కుటుంబం ఎదుర్కొంది. ప్రభువుతో మరియు ఒకరితో ఒకరు సలహా సమావేశం జరిపిన తర్వాత, తల్లిదండ్రులకు మరియు తోబుట్టువులకు దూరంగా మా కుటుంబాన్ని తూర్పు సంయుక్త రాష్ట్రాలకు తరలించాలని మేము నిర్దేశించుకున్నాము. ప్రారంభంలో, బాగానే ఉంది మరియు మా నిర్ణయాన్ని మేము నిర్ధారించుకున్నాము. కానీ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. న్యాయ సంస్థ శ్రామికశక్తిని తగ్గించింది మరియు మా కుమార్తె డోరా తీవ్ర వైద్యపరమైన సవాళ్లను, దీర్ఘకాలిక ప్రత్యేక అవసరాలను ఎదుర్కొంటున్న సమయంలోనే నేను ఉద్యోగం మరియు వైద్య బీమా రెండింటినీ కోల్పోయాను. ఈ సవాళ్లను ఎదుర్కొంటున్నపుడు, నాకు సంఘ పిలుపు వచ్చింది, దానికి గణనీయమైన సమయం మరియు నిబద్ధత అవసరం.

నేనెప్పుడూ అలాంటి సవాలును ఎదుర్కోలేదు మరియు ఉక్కిరిబిక్కిరి అయ్యాను. మేము తీసుకున్న నిర్ణయాన్ని మరియు దానితో కూడిన నిర్ధారణను మేము ప్రశ్నించడం ప్రారంభించాము. మేము ప్రభువును విశ్వసించాము మరియు విషయాలు ఫలించవలసి ఉంది. నేను వెనుకకు పడిపోయాను మరియు ఇప్పుడు ఎవరూ నన్ను పట్టుకోవడం లేదని నాకు అనిపించింది.

ఒకరోజు, “ఎందుకు అని అడగవద్దు; నేను ఏమి నేర్చుకోవాలనుకుంటున్నాను అని అడగండి” అనే మాటలు నా మనస్సులోకి మరియు హృదయంలోకి స్థిరంగా వచ్చాయి. ఇప్పుడు నేను మరింత గందరగోళానికి గురయ్యాను. నా మునుపటి నిర్ణయంతో నేను పోరాడుతున్న సమయంలోనే, దేవుడు తనను మరింత ఎక్కువగా నమ్మమని నన్ను ఆహ్వానిస్తున్నారు. ఇది నా జీవితంలో కీలకమైన సమయం—దేవునిపై నమ్మికయుంచడాన్ని నేర్చుకోవడానికి, ఆయనను విశ్వసించడమే ఉత్తమమైన మార్గం అని నేను గ్రహించిన క్షణమది. ఆ తదుపరి వారాల్లో, ప్రభువు మా కుటుంబాన్ని ఆశీర్వదించడానికి తన ప్రణాళికను అద్భుతంగా తెలియజేయడాన్ని నేను ఆశ్చర్యంతో చూశాను.

మనస్సును మరియు కండరాలను ఒత్తిడికి గురి చేయడం ద్వారా మాత్రమే మేధో సంబంధమైన పెరుగుదల మరియు శారీరక బలం కలుగుతాయని మంచి బోధకులకు మరియు శిక్షకులకు తెలుసు. అదేవిధంగా, ఆత్మను పరిశోధించే అనుభవాల ద్వారా తన ఆధ్యాత్మిక బోధనను విశ్వసించడం చేత ఎదగమని దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నారు. కాబట్టి, మనం గతంలో దేవునిపై ఎలాంటి నమ్మకాన్ని ప్రదర్శించినా, నమ్మకాన్ని పొడిగించే మరో అనుభవం ఇంకా ముందుంటుందని మనము ఖచ్చితంగా నిశ్చయించుకోవచ్చు. దేవుడు మన ఎదుగుదల మరియు పురోగతిపై దృష్టి సారించారు. ఆయన గొప్ప బోధకుడు, పరిపూర్ణమైన శిక్షకుడు, మన దైవిక సామర్థ్యాన్ని మరింత ఎక్కువగా గ్రహించడంలో మనకు సహాయం చేయడానికి ఆయన ఎల్లప్పుడూ మనల్ని విస్తరింపజేస్తారు. ఆయనను మరికాస్త ఎక్కువగా నమ్మాలనే భవిష్యత్తు ఆహ్వానాన్ని అది ఎల్లప్పుడూ కలిగి ఉంటుంది.

మనతో బలమైన సంబంధాలను ఏర్పరచుకొనేందుకు దేవుడు మనల్ని విస్తరింపజేయడానికి ఉపయోగించే నమూనాను మోర్మన్ గ్రంథము బోధిస్తుంది. ఇత్తడి పలకలను పొందేందుకు యెరూషలేముకు తిరిగి రావాలని అతడు, అతని సహోదరులు ఆజ్ఞాపించబడినప్పుడు, దేవునిపై నీఫై యొక్క నమ్మకం ఎలా పరీక్షించబడిందో మనము ఇటీవల రండి, నన్ను అనుసరించండిలో అధ్యయనం చేసాము. వారి ప్రారంభ ప్రయత్నాలు విఫలమైన తర్వాత, అతని సోదరులు విరమించుకున్నారు మరియు పలకలు లేకుండా తిరిగి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ నీఫై ప్రభువుపై పూర్తి నమ్మకాన్ని ఉంచాలని ఎంచుకున్నాడు మరియు పలకలను పొందడంలో విజయం సాధించాడు.10 అతని విల్లు విరిగిపోయి, ఆ కుటుంబం అరణ్యంలో ఆకలితో అలమటిస్తున్నప్పుడు, ఆ అనుభవం దేవునియందు నీఫై యొక్క నమ్మకాన్ని బలపరిచింది. మళ్ళీ, దేవునిపై నమ్మకం ఉంచడానికి నీఫై ఎన్నుకున్నాడు మరియు కుటుంబం రక్షించబడింది.11 ఈ వరుస అనుభవాలు నీఫైకి ఓడను నిర్మించే అపారమైన, నమ్మకాన్ని పెంచే పని కోసం దేవునిపై మరింత బలమైన నమ్మకాన్ని ఇచ్చాయి.12

ఈ అనుభవాల ద్వారా, నీఫై నిలకడగా మరియు నిరంతరం ఆయనను విశ్వసించడం ద్వారా దేవునితో తన సంబంధాన్ని బలోపేతం చేసుకున్నాడు. దేవుడు మనతో కూడా అదే నమూనాను ఉపయోగిస్తారు. ఆయనపై మన నమ్మకాన్ని బలోపేతం చేయడానికి మరియు మరింతగా పెంచుకోవడానికి ఆయన మనకు వ్యక్తిగత ఆహ్వానాలను అందజేస్తారు.13 ప్రతీసారి మనం ఆహ్వానాన్ని అంగీకరించి, చర్య తీసుకున్నప్పుడు, దేవునిపై మనకున్న నమ్మకం పెరుగుతుంది. మనము ఆహ్వానాన్ని విస్మరించినా లేదా తిరస్కరించినా, మనము కొత్త ఆహ్వానంపై చర్య తీసుకునే వరకు మన పురోగతి ఆగిపోతుంది.

శుభవార్త ఏమిటంటే, మనం గతంలో దేవునిపై నమ్మకం ఉంచడానికి ఎన్నుకున్నా లేదా ఎన్నుకోకపోయినా, ఈ రోజు మరియు ఇకమీదట ప్రతీరోజు దేవుడిని నమ్మడానికి మనం ఎంచుకోవచ్చు. మనం అలా చేసే ప్రతిసారీ, మనల్ని పట్టుకోవడానికి దేవుడు ఉంటారని మరియు మనం ఆయనతో, ఆయన కుమారునితో ఏకమయ్యే రోజు వరకు మన విశ్వాసం యొక్క సంబంధం మరింత బలంగా పెరుగుతుందని నేను వాగ్దానం చేస్తున్నాను. అప్పుడు నీఫై లాగా మనమూ ఇలా ప్రకటించవచ్చు, “ఓ ప్రభువా, నీ యందు నమ్మికయుంచియున్నాను, నేను శాశ్వతంగా నీ యందు నమ్మికయుంచెదను.”14 యేసు క్రీస్తు నామములో, ఆమేన్.