సర్వసభ్య సమావేశము
మిమ్మల్ని గృహానికి తీసుకురావడమే దేవుని ఉద్దేశం
2024 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


మిమ్మల్ని గృహానికి తీసుకురావడమే దేవుని ఉద్దేశం

తన ప్రియమైన పిల్లల కోసం తండ్రి యొక్క ప్రణాళికకు సంబంధించిన సమస్తము ప్రతి ఒక్కరినీ గృహానికి తీసుకురావడానికి రూపొందించబడింది.

ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అపొస్తలుడిగా సేవ చేయడానికి అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ద్వారా వచ్చిన పిలుపుకు నేను సర్దుబాటు చేసుకొనే ప్రక్రియను ప్రారంభించినప్పుడు మీ ప్రార్థనల కొరకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక అపొస్తులునిగా పిలువబడుట ఎంత వినయపూర్వకంగా భావించబడిందో బహుశా మీరు బాగా ఊహించవచ్చు, ఇది ముఖ్యమైన మార్పుల ద్వారా గుర్తించబడిన సమయం మరియు గంభీరమైన ఆత్మ పరీశీలనలో నిమగ్నమైన సమయం. రక్షకునికి ఏ హోదాలోనైనా సేవ చేయడం మరియు నిరీక్షణతో కూడిన ఆయన సువార్త యొక్క శుభవార్తలను పంచుకోవడంలో మీతో నిమగ్నమై ఉండటం ఎంతో గౌరవప్రదమైనది.

అంతకుమించి, ప్రతీ కొత్త అపొస్తలుడి వెనుక విస్మయం చెందిన ఒక అత్తగారు ఉంటారని చెప్పబడింది. ఇది నిజంగా చెప్పబడిందో లేదో నాకు తెలియదు, కానీ ఈ సందర్భంలో, అది నిజం కావచ్చు. మా అత్తగారు ఇప్పుడు మాతో లేరు అనే వాస్తవం ఆమె ఆశ్చర్యాన్ని ఏమాత్రం తగ్గించకపోవచ్చని నేను అనుకుంటున్నాను.

చాలా నెలల క్రితం, నేను మరియు నా భార్య వివిధ సంఘ నియామకముల నిమిత్తం వేరే దేశాన్ని సందర్శిస్తున్నప్పుడు, నేను ఒక తెల్లవారుజామున నిద్రలేచి, మా హోటల్ కిటికీ బయటికి అలసిన కళ్ళతో చూశాను. క్రింద రద్దీగా ఉండే వీధిలో అవరోధం ఏర్పాటు చేయబడడం, కార్లు కంచె వద్దకు చేరుకున్నప్పుడు వాటిని తిప్పి పంపడానికి సమీపంలో ఒక పోలీసు ఉండడం నేను చూశాను. మొదట, కొన్ని కార్లు మాత్రమే రహదారి వెంట ప్రయాణించాయి మరియు వెనక్కి తిప్పబడ్డాయి. అయితే సమయం గడిచేకొద్దీ, రద్దీ పెరిగిపోవడంతో, కార్ల వరుసలు పెరగటం ప్రారంభించాయి.

రద్దీని అడ్డుకోవడంలో మరియు ప్రజలను తిప్పి పంపడంలో పోలీసు తన అధికారాన్ని బట్టి సంతృప్తి చెందినట్లుగా నేను పైన కిటికీలో నుండి గమనించాను. వాస్తవానికి, ఒక్కొక్క కారు ఆ అడ్డంకిని సమీపిస్తున్నప్పుడు, అతను తన అడుగులో ఒక స్ప్రింగును ఉంచి వడివడిగా తిరుగుతూ నృత్యం చేయడం ప్రారంభించినట్లుగా అనిపించింది. ఏ చోదకుడైనా అవరోధం గురించి విసుగు చెందితే, ఆ పోలీసు సహాయకరంగా లేదా సానుభూతిపరంగా ఉన్నట్లు కనిపించలేదు. అతను తన తలను పదే పదే అడ్డంగా ఊపుతూ వ్యతిరేక దిశవైపు సూచించాడు.

నా స్నేహితులారా, మర్త్య జీవిత మార్గంలోని నా తోటి శిష్యులారా, మన తండ్రి యొక్క అందమైన ప్రణాళిక, ఇంకా ఆయన “అద్భుతమైన” ప్రణాళిక,1 మిమ్మల్ని గృహానికి తీసుకురావడానికి రూపొందించబడింది, దూరంగా ఉంచడానికి కాదు.2 మిమ్మల్ని వెనుతిరిగి పంపివేయడానికి ఎవరూ అవరోధాన్ని నిర్మించలేదు మరియు ఏ ఒకరినీ అక్కడ నిలబెట్టలేదు. వాస్తవానికి ఇది ఖచ్చితంగా దానికి వ్యతిరేకమైనది. దేవుడు నిరంతరం మీతో అనుబంధాన్ని కోరుతూనే ఉన్నాడు. ఆయన “తన పిల్లలందరూ తన వద్దకు తిరిగి రావాలని కోరుకుంటున్నారు”3 మరియు ఆయన మిమ్మల్ని తిరిగి తీసుకురావడానికి సాధ్యమైన ప్రతీ చర్యను ఉపయోగిస్తారు.

మీకు మరియు నాకు మర్త్యత్వము యొక్క విస్తారమైన శుద్ధిచేయు అనుభవాలను పొందడానికి, ఆయనను ఎన్నుకోవడానికి దేవుడు మనకు ఇచ్చిన నైతిక కర్తృత్వమును ఉపయోగించుకోవడానికి,4 నేర్చుకోవడానికి, ఎదగడానికి, తప్పులు చేయడానికి, పశ్చాత్తాపం చెందడానికి, దేవుడిని మరియు మన పొరుగువారిని ప్రేమించడానికి మరియు ఒక రోజు ఆయన గృహానికి తిరిగి వెళ్ళడానికి అవకాశం కల్పించే స్పష్టమైన ఉద్దేశ్యంతో ప్రేమగల మన తండ్రి ఈ భూమి యొక్క సృష్టిని పర్యవేక్షించారు.

మానవ అనుభవాన్ని పూర్తి స్థాయిలో జీవించడానికి, ఆయన మిగతా పిల్లలు అనుసరించుటకు ఒక మాదిరిని అందించడానికి, ప్రాయశ్చిత్తం చేయడానికి మరియు విమోచించడానికి ఆయన తన ప్రశస్థమైన ప్రియమైన కుమారుడిని పతనమైన ఈ ప్రపంచానికి పంపారు. క్రీస్తు యొక్క గొప్ప ప్రాయశ్చిత్త బహుమానము మన నిత్య గృహము నుండి మనల్ని వేరుచేసే భౌతిక మరియు ఆత్మీయ మరణం యొక్క ప్రతీ అడ్డంకిని తొలగిస్తుంది.

తన ప్రియమైన పిల్లల కోసం తండ్రి యొక్క ప్రణాళికకు సంబంధించిన సమస్తము ప్రతి ఒక్కరినీ గృహానికి తీసుకురావడానికి రూపొందించబడింది.

దేవుని దూతలు, ఆయన ప్రవక్తలు, పునఃస్థాపించబడిన లేఖనములో ఈ ప్రణాళికను ఏమని పిలుస్తారు? వారు దానిని విమోచన ప్రణాళిక,5 కనికరము యొక్క ప్రణాళిక,6 సంతోషము యొక్క గొప్ప ప్రణాళిక7 మరియు “నా అద్వితీయ కుమారుని రక్తము ద్వారా” సమస్త మానవాళికి ఇవ్వబడిన రక్షణ ప్రణాళిక8 అని పిలిచారు.

తండ్రి యొక్క గొప్ప సంతోష ప్రణాళిక యొక్క ఉద్దేశ్యం, ఇక్కడ, ఇప్పుడు మరియు నిత్యత్వములలో మీ ఆనందము. ఇది మీ ఆనందాన్ని నిరోధించడానికి మరియు బదులుగా చింతను, భయాన్ని కలిగించడానికి కాదు.

వాస్తవానికి తండ్రి యొక్క విమోచన ప్రణాళిక ఉద్దేశ్యం, మీ యొక్క విమోచన, యేసు క్రీస్తు యొక్క బాధలు మరియు మరణం ద్వారా మనం రక్షించబడుట,9 పాపం మరియు మరణం యొక్క చెర నుండి విముక్తి పొందుట అయ్యున్నది. మీరు ఉన్న స్థితిలో మిమ్మల్ని వదిలేయడం కాదు.

తండ్రి యొక్క కనికరము యొక్క ప్రణాళిక ఉద్దేశ్యం, మీరు మళ్ళీ ఆయన వైపు తిరిగి ఆయన పట్ల విశ్వసనీయత యొక్క మీ నిబంధనను గౌరవించినప్పుడు ఆయన దయను విస్తరించుట. ఇది దయను తిరస్కరించడం మరియు బాధను, దుఃఖాన్ని కలిగించడం కాదు.

వాస్తవానికి తండ్రి యొక్క రక్షణ ప్రణాళిక ఉద్దేశ్యం, మీరు “యేసు యొక్క సాక్ష్యాన్ని” పొంది10 ఆయనకు మీ పూర్ణాత్మలను అర్పించినప్పుడు,11 సిలెస్టియల్ రాజ్యం యొక్క మహిమలో మీకు రక్షణ కల్పించడం. అది మిమ్మల్ని దూరంగా ఉంచడానికి కాదు.

దీని అర్థం మనం మన జీవితాలను ఎలా గడుపుతున్నామనే దానికి సంబంధించినదా? మనం మన కర్తృత్వమును ఉపయోగించడానికి ఎంచుకున్న మార్గం ముఖ్యమైనది కాదా? మనం దేవుని ఆజ్ఞలను పాటించాలా వద్దా అనేదానికి సంబంధించినదా? లేదు, అస్సలు కాదు. మనం పరివర్తన చెంది, పశ్చాత్తాపపడి, ఆయన వద్దకు చేరుకోవడమే ఆయన మర్త్య పరిచర్య సమయంలో యేసు యొక్క అత్యంత స్థిరమైన ఆహ్వానాలలో మరియు విన్నపాలలో ఒకటి.12 నైతిక ప్రవర్తన యొక్క ఉన్నత ప్రమాణాన్ని జీవించాలనే ఆయన బోధనలన్నింటిలో మొదటినుంచి అంతర్లీనంగా ఉన్నది,13 వ్యక్తిగత పురోగతికి, క్రీస్తులో పరివర్తనాత్మక విశ్వాసానికి, హృదయంలో బలమైన మార్పుకు పిలుపు.14

మన స్వార్థపూరితమైన మరియు అహంకారపూరితమైన ప్రేరణలను అధిగమించి, మనము ప్రకృతి సంబంధియైన మనుష్యుని విడిచి,15 “వెళ్లి ఇక పాపము చేయకూడదని”16, మనము ఆలోచించే మరియు ప్రవర్తించే విధానంలో గొప్ప మార్పు రావాలని దేవుడు కోరుతున్నారు.

మనల్ని రక్షించడం, విమోచించడం, కరుణించడం, తద్వారా మనకు సంతోషం కలిగించడం అనేది తండ్రి యొక్క సర్వోత్తమ ప్రణాళిక యొక్క ఉద్దేశ్యమని మనం విశ్వసిస్తే, ఈ గొప్ప ప్రణాళిక తీసుకొని వచ్చిన కుమారుని యొక్క ఉద్దేశ్యం ఏమిటి?

కుమారుడు తానే మనతో ఇలా చెప్పారు: “నా చిత్తమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదుగాని, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని”17

దయగల తండ్రి యొక్క చిత్తమే యేసు చిత్తం! తన తండ్రి పిల్లలలో ప్రతీ ఒక్కరు కూడా ప్రణాళిక యొక్క అంతిమ లక్ష్యాన్ని—వారితో నిత్యజీవాన్ని పొందేలా చేయాలని ఆయన కోరుతున్నారు. ఈ దైవిక సామర్థ్యము నుండి ఎవ్వరూ మినహాయించబడలేదు.

మీరు ఎప్పటికీ అంచనాలకు చేరుకోలేరని లేదా క్రీస్తు యొక్క అనంతమైన ప్రాయశ్చిత్తం ప్రేమపూర్వకంగా నన్ను తప్ప ప్రతి ఒక్కరినీ దయతో చేరుకుంటుంది అని మీరు ఆందోళనకు గురైతే, మీరు అపార్థం చేసుకుంటున్నారు. అనంతమైనది అంటే అనంతమైనది. ఈ అనంతమైన ప్రాయశ్చిత్తం మిమ్మల్ని మరియు మీరు ఇష్టపడే వారిని చేరుకుంటుంది.18

నీఫై ఈ అందమైన సత్యాన్ని ఇలా వివరించాడు: “ఆయన లోకమునకు ప్రయోజనకరమైన దానిని తప్ప మరిదేనిని చేయడు; ఏలయనగా ఆయన తన ప్రాణమును పణంగాపెట్టి మనుష్యులందరినీ తన వైపు ఆకర్షించునంతగా లోకమును ప్రేమించెను. అందువలన ఆయన రక్షణలో పాలుపొందమని ఆయన అందరిని ఆజ్ఞాపించును.”19

రక్షకుడు, గొఱ్ఱెలకు మంచి కాపరి, తప్పిపోయిన తన గొఱ్ఱె దొరికే వరకు ఆయన వెతుకుతూ వెళ్తారు.20 “ఎవ్వరూ నశించిపోవడానికి” ఆయన ఇష్టపడరు.21

“కనికరము గల నా బాహువు మీ వైపు చాపబడినది మరియు వచ్చు వానిని నేను చేర్చుకొందును.”22

“మీ మధ్య రోగులెవరైనా ఉన్నారా? వారిని ఇక్కడకు తీసుకురండి. కుంటివారు, గ్రుడ్డివారు లేదా కదలలేని వారు, వికలాంగులు, కుష్ఠువారు, ఊచకాలు చేతులు గలవారు, చెవిటి వారు లేదా ఏ విధముగానైనా బాధింపబడిన వారు మీలోనున్నారా? వారిని ఇక్కడకు తీసుకురండి, నేను వారిని స్వస్థపరిచెదను, ఏలయనగా నేను మీ యెడల కనికరము కలిగియున్నాను.”23

ఆయన రక్తస్రావ రోగము కలిగిన స్త్రీని త్రోసిపుచ్చలేదు, ఆయన కుష్టురోగి నుండి వెనక్కి తగ్గలేదు, వ్యభిచారం చేసిన స్త్రీని తిరస్కరించలేదు, వారి పాపం ఏదైనప్పటికీ, పశ్చాత్తాపపడిన వారిని నిరాకరించలేదు. మీరు మీ విరిగిన హృదయాలతో మరియు నలిగిన ఆత్మలతో ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని లేదా మీరు ప్రేమించే వారిని నిరాకరించరు. అది ఆయన ఉద్దేశం లేదా ఆయన రూపకల్పన కాదు, లేదా ఆయన ప్రణాళిక, ప్రయోజనం, కోరిక లేదా ఆశ కాదు.

లేదు, ఆయన అవరోధాలు మరియు అడ్డంకులు పెట్టరు; ఆయన వాటిని తొలగిస్తారు. ఆయన మిమ్మల్ని దూరంగా ఉంచరు; ఆయన మిమ్మల్ని లోపలికి ఆహ్వానిస్తున్నారు.24 ఆయన పరిచర్య మొత్తం ఈ ఉద్దేశ్యానికి సంబంధించిన సజీవ ప్రకటన.

ఖచ్చితంగా ఆయన ప్రాయశ్చిత్త త్యాగం ఉంది, ఇది మనం అర్థం చేసుకోవడం కష్టం, తెలుసుకోవటానికి ఇది మన మర్త్య సామర్థ్యానికి మించినది. కానీ, మరియు ఇది ఒక ముఖ్యమైన “కానీ,” దీనిని మనము అర్థం చేసుకోగలము, తెలుసుకోగలము, ఇది ఆయన ప్రాయశ్చిత్త త్యాగం యొక్క పవిత్రమైన, రక్షించే ఉద్దేశం.

యేసు శిలువపై మరణించినప్పుడు దేవాలయపు తెర రెండుగా చీలిపోయింది—ఇది ఆయన వైపు తిరిగి, ఆయనను విశ్వసించి, ఆయనపై తమ భారాలను మోపి, నిబంధన అనుసంధానం ద్వారా ఆయన కాడిని వారిపైకి తీసుకునే వారందరికీ తండ్రి సన్నిధికి తిరిగి వెళ్లే అవకాశం విశాలంగా తెరిచి ఉందని సూచిస్తుంది.25

మరో మాటలో చెప్పాలంటే, తండ్రి ప్రణాళిక అవరోధాలకు సంబంధించినది కాదు. అలా ఎప్పుడూ లేదు; అలా ఎప్పటికీ ఉండదు. మనం చేయవలసిన పనులు, పాటించవలసిన ఆజ్ఞలు, మార్చుకోవలసిన మన స్వభావాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. అయితే ఆయన దయ వలన, అవి మన పరిధిలో ఉన్నాయి, మన సామర్థ్యాన్ని మించి లేవు.

ఇది మంచి వార్త! ఈ సాధారణ సత్యాల కొరకు నేను చెప్పలేనంతగా కృతజ్ఞుడను. తండ్రి యొక్క రూపకల్పన, ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశ్యం, ఆయన సంకల్పం, ఆయన కోరిక మరియు ఆయన ఆశ అన్నీ మిమ్మల్ని స్వస్థపరచడానికి, అన్నీ మీకు శాంతిని ఇవ్వడానికి, అన్నీ మిమ్మల్ని మరియు మీరు ఇష్టపడే వారిని గృహానికి చేర్చడానికి ఉద్దేశించబడినవి. వీటన్నింటి గురించి ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నామములో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. రస్సెల్ ఎమ్. నెల్సన్, “సిలెస్టియల్‌గా ఆలోచించండి!,” లియహోనా, నవ. 2023, 117, 118.

  2. 2 నీఫై 26:25, 27 చూడండి.

  3. ప్రధాన చేతిపుస్తకం: యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘములో సేవ చేయుట, 1.1, సువార్త గ్రంథాలయం.

  4. మోషే 7:33 చూడండి.

  5. జేకబ్ 6:8; ఆల్మా 12:30 చూడండి.

  6. ఆల్మా 42:15 చూడండి.

  7. ఆల్మా 42:8, 16 చూడండి.

  8. మోషే 6:62

  9. సిద్ధాంతము మరియు నిబంధనలు 45:4 చూడండి.

  10. సిద్ధాంతము మరియు నిబంధనలు 76:50–70.

  11. ఓంనై 1:26 చూడండి.

  12. మత్తయి 4:17 చూడండి.

  13. మత్తయి 5–7 చూడండి. ఉదాహరణకు, మత్తయి 5:43–44లో, రక్షకుడు తన శిష్యులకు, “నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా.” ఆయనను అనుసరించడానికి వారు “[తమ] శత్రువులను ప్రేమించడం” కూడా అవసరం.

  14. మోషైయ 5:2 చూడండి. యేసు క్రీస్తు యొక్క దయ మన జీవితాల్లోకి రావాలంటే, మనం ఆయన వైపుకు తిరిగి రావాలి. “పశ్చాత్తాపము యొక్క షరతులపై ఆధారపడి ఈ అద్భుతమైన విమోచన ప్రణాళిక పనిచేయును … ; ఏలయనగా ఈ షరతులు లేనియెడల, న్యాయము యొక్క పనిని నాశనము చేయుట తప్ప కనికరము ఏ ఫలితమునివ్వదు” (ఆల్మా 42:13) అని చిన్నవాడగు అల్మా బోధించాడు.

  15. మోషైయ 3:19 చూడండి.

  16. యోహాను 8:11.

  17. యోహాను 6:38.

  18. See Russell M. Nelson, “The Atonement,” Ensign, Nov. 1996, 35:: “ఆయన ప్రాయశ్చిత్తం అనంతమైనది—అంతం లేనిది. అంతులేని మరణం నుండి మానవాళి అంతా రక్షించబడటం కూడా అనంతమైనది. ఇది ఆయన అపారమైన బాధల పరంగా అనంతమైనది. ఇది కాలంలో అనంతమైనది, జంతుబలి యొక్క మునుపటి నమూనాకు ముగింపు పలికింది. ఇది అనంతమైన పరిధిలో ఉంది—ఇది అందరి కొరకు ఒకసారి చేయవలసి ఉంది. మరియు ప్రాయశ్చిత్తం యొక్క దయ అనంతమైన వ్యక్తులకు మాత్రమే కాకుండా, ఆయనచే సృష్టించబడిన అనంతమైన లోకాలకు కూడా విస్తరించింది. ఇది మానవ స్థాయి కొలతకు లేదా మర్త్య గ్రహణశక్తికి మించి అనంతమైనది.”

  19. 2 నీఫై 26:24.

  20. లూకా 15:4 చూడండి.

  21. 2 పేతురు 3:9; సిద్ధాంతము మరియు నిబంధనలు 18:11–12 చూడండి.

  22. 3 నీఫై 9:14.

  23. 3 నీఫై 17:7; 6వ వచనము కూడా చూడండి.

  24. కొంతమంది వ్యక్తులు పరలోక రాజ్యాన్ని వారసత్వంగా పొందరని సూచించే యేసు క్రీస్తు బోధనలలో, ఈ ఫలితం వారి పట్ల తాను కోరుతున్నది కాదని, వారి స్వంత ఎంపికల ఫలితమని ఆయన స్పష్టం చేశారు (మత్తయి 7:13–14, 21–25 చూడండి).

  25. మత్తయి 27:50–51; హెబ్రీయులకు 9:6–12 చూడండి.