సర్వసభ్య సమావేశము
సేవ చేయడానికి ముందుగా నియమించబడ్డారు
2024 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


సేవ చేయడానికి ముందుగా నియమించబడ్డారు

మన పరలోక తండ్రి మీ వ్యక్తిగత పూర్వనియామకమును మీకు బయలుపరచాలని కోరుకుంటున్నారు మరియు మీరు ఆయన చిత్తాన్ని నేర్చుకొని అనుసరించాలని కోరినప్పుడు ఆయన అలా చేస్తారు.

ఈ సాయంత్రం, నేను సంఘములోని యువత, తరువాతి తరానికి ప్రామాణిక సాధనాలుగా ఉన్న యువకులు మరియు యువతుల భావితరంతో మాట్లాడుతున్నాను.

2013 అక్టోబరులో, మన ప్రియమైన ప్రవక్త, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా ప్రకటించారు: “మీ పరలోక తండ్రి మిమ్మల్ని చాలా కాలంగా ఎరుగును. మీరు ఆయన కుమారుడు లేదా కుమార్తెగా, ఈ ఖచ్చితమైన సమయంలో భూమిపైకి రావడానికి, భూమిపై ఆయన గొప్ప కార్యములలో నాయకులుగా ఉండటానికి ఆయనచే ఎన్నుకోబడ్డారు.”1

రెండు సంవత్సరాల క్రితం, అధ్యక్షులు నెల్సన్ ఇలా కొనసాగించారు:

“యోగ్యుడైన, సమర్థుడైన ప్రతీ యువకుడు సువార్తసేవ కోసం సిద్ధపడి, సేవ చేయాలని ప్రభువు కోరారని ఈ రోజు నేను బలంగా ధృవీకరిస్తున్నాను. కడవరి దిన పరిశుద్ధ యువకులకు, సువార్త సేవ అనేది ఒక యాజకత్వ బాధ్యత. యువకులైన మీరు, ఇశ్రాయేలీయుల వాగ్దాన సమకూర్పు జరుగుతున్న ఈ సమయం కొరకు ప్రత్యేకించబడ్డారు. …

“యౌవనులు మరియు సమర్థులైన సహోదరీలైన మీ కొరకు, ఒక సువార్తసేవ అనేది శక్తివంతమైనదే, కానీ ఐచ్ఛికమైన అవకాశం. … మీరు సువార్తసేవ చేయాలని ప్రభువు కోరుతున్నారో లేదో తెలుసుకోవడానికి ప్రార్థించండి మరియు పరిశుద్ధాత్మ మీ హృదయానికి, మనస్సుకు జవాబిస్తారు.”2

ఇశ్రాయేలీయులను సమకూర్చుటలో ఈసారి ప్రభువు మన కాలపు యువతను ప్రత్యేకపరచి ఉంచడం గురించి మన ప్రవక్త యొక్క సూచనలు మరియు మీరు ఏమి చేయాలని ప్రభువు కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి ప్రార్థన చేయమని ఆయన అడిగిన ఆహ్వానం, పాక్షికంగా, మీరు జీవించిన జీవితం మరియు మిమ్మల్ని ఆశీర్వదించడం గురించిన సూచనలు, మీరు ఈ భూమిపై పుట్టకముందే దేవుని నుండి పొందారు.3 ఈ భూమిపై జన్మించిన మనమందరం మొదట మన పరలోక తండ్రితో ఆయన ఆత్మీయ సంతానముగా జీవించాము.4 ప్రభువు మోషేతో ఇలా ప్రకటించారు, “దేవుడును ప్రభువునైన నేను, … భూమి మీద అవి భౌతికముగా సృజింపకమునుపు, సమస్తమును ఆత్మీయముగా సృజించితిని.”5

ఆయన మిమ్మల్ని ఆత్మీయంగా సృజించినప్పుడు, ఆయన మిమ్మల్ని తన ఆత్మ కుమారులు మరియు కుమార్తెలుగా ప్రేమించారు మరియు మీలో ప్రతీ ఒక్కరిలో ఒక దైవిక స్వభావం మరియు శాశ్వతమైన గమ్యమును పొందుపరిచారు.6

మీ పూర్వ మర్త్య జీవితములో, “మీరు మీ గుర్తింపును అభివృద్ధి చేసుకున్నారు మరియు మీ ఆత్మీయ సామర్థ్యాలను పెంచుకున్నారు.”7 మీ కోసం మీరు ఎంపిక చేసుకునే సామర్థ్యమైన కర్తృత్వమనే బహుమతితో మీరు ఆశీర్వదించబడ్డారు మరియు మీరు పరలోక తండ్రి యొక్క సంతోష ప్రణాళికను అనుసరించాలనే నిర్ణయం వంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు, అంటే “భౌతిక శరీరాన్ని పొందడం మరియు పురోగతి చెందడానికి భూసంబంధమైన అనుభవాన్ని పొందడం … మరియు చివరికి నిత్యజీవితానికి వారసులుగా [మీ] దైవిక గమ్యమును గ్రహించడం.”8 ఈ నిర్ణయం మీ పూర్వ మర్త్య జీవితంలో అప్పుడు మీ జీవితాన్ని ప్రభావితం చేసింది మరియు ఇప్పుడు కూడా మీ జీవితాన్ని ప్రభావితం చేయడం కొనసాగిస్తూనే ఉంది.9 మీ పూర్వ మర్త్య జీవితంలో జీవిస్తున్న దేవుని బిడ్డగా, మీరు “మేధస్సులో ఎదిగారు మరియు మీరు సత్యాన్ని ప్రేమించడం నేర్చుకున్నారు.”10

మీరు పుట్టకముందే, భూమిపై మీ మర్త్య జీవితంలో నిర్దిష్ట నియమితకార్యములను నెరవేర్చడానికి దేవుడు మీలో ప్రతి ఒక్కరినీ నియమించారు.11 మీరు యోగ్యులుగా ఉన్నట్లయితే, ఆ పూర్వ మర్త్యత్వ శాసనము యొక్క ఆశీర్వాదాలు మీకు ఈ జీవితంలో అన్ని రకాల అవకాశాలను కలిగిస్తాయి, సంఘములో సేవ చేయడానికి మరియు ఈ రోజు భూమిపై జరుగుతున్న అతి ముఖ్యమైన కార్యమైన ఇశ్రాయేలీయులను సమకూర్చుటలో పాల్గొనడానికి అవకాశాలు అందులో ఉన్నాయి.12 ఆ పూర్వ మర్త్య జీవిత వాగ్దానాలు మరియు ఆశీర్వాదాలు మీ పూర్వనియామకము అని పిలువబడతాయి. “పూర్వనియామకము యొక్క సిద్ధాంతము సంఘ సభ్యులందరికి అన్వయిస్తుంది.”13 మీరు నిర్దిష్ట పిలుపులు లేదా బాధ్యతలను స్వీకరిస్తారని పూర్వనియామకము హామీ ఇవ్వదు. మీ పూర్వ మర్త్య జీవితంలో, నీతి కార్యముల ఫలితంగా పూర్వనియామకము వచ్చినట్లు, ఈ జీవితంలో కూడా మీరు నీతిని సాధించిన ఫలితంగా ఈ ఆశీర్వాదాలు మరియు అవకాశాలు వస్తాయి.14 మీరు యోగ్యులని నిరూపించుకున్నప్పుడు మరియు నిబంధన మార్గంలో పురోగమిస్తున్నప్పుడు, మీరు మీ యువతుల తరగతి లేదా యాజకత్వ సమూహములో సేవ చేసే అవకాశాలను పొందుతారు. మీరు దేవాలయములో సేవ చేయడానికి, పరిచర్య చేసే సహోదరుడు లేదా సహోదరి కావడానికి మరియు యేసు క్రీస్తు శిష్యునిగా సువార్త సేవ చేయడానికి దీవించబడతారు.

మీ పూర్వనియామకము గురించి తెలుసుకోవడం మరియు అర్థం చేసుకోవడం ఎందుకు ముఖ్యమైనది? సందేహాలు ఎక్కువగా ఉన్న ఒక రోజు, చాలా మంది తమ నిజమైన గుర్తింపును తెలుసుకోవాలనుకున్నప్పుడు, ఈ భూమిపై మనం “పూర్వ మర్త్యత్వము, మర్త్యత్వము మరియు నిత్యత్వము యొక్క గుర్తింపు మరియు ప్రయోజనం యొక్క ముఖ్యమైన లక్షణాలతో” పుట్టకముందే దేవుడు మనలో ప్రతీ ఒక్కరికి వ్యక్తిగతంగా తెలుసని మరియు మనల్ని ఆశీర్వదించారనే వాస్తవం, మన మనస్సుకు మరియు హృదయానికి మధురమైన శాంతిని మరియు భరోసాను తెస్తుంది.15 మీరు ఎవరో తెలుసుకోవడం అనేది, మీరు ఈ భూమిపై పుట్టకముందే మీకు దేవుడు ముందుగా నిర్ణయించి ప్రసాదించిన ఆశీర్వాదాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. మన పరలోక తండ్రి మీ వ్యక్తిగత పూర్వనియామకమును మీకు బయలుపరచాలని కోరుకుంటున్నారు మరియు మీరు ఆయన చిత్తాన్ని నేర్చుకొని అనుసరించాలని కోరినప్పుడు ఆయన అలా చేస్తారు.16

అధ్యక్షులు నెల్సన్ యొక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లను చదవడం నాకు చాలా ఇష్టం. నాకు ఇష్టమైన వాటిలో ఒకటి 2022, జూలై 20 నాటిది. ఆయన ఇలా వ్రాసారు:

“ప్రభువు మీతో నేరుగా మాట్లాడుతున్నట్లయితే, అది మీ నిజమైన గుర్తింపును మీరు అర్థం చేసుకునేలా చేసే మొదటి విషయం అని నేను నమ్ముతున్నాను. నా ప్రియమైన మిత్రులారా, మీరు అక్షరాలా దేవుని ఆత్మీయ సంతానము. …

“… దాని గురించి తప్పు చేయకండి: మీ సామర్థ్యం దైవికమైనది. మీ శ్రద్ధగల పరిశోధనతో, మీరు ఏమవుతారో దేవుడు మీకు క్షణ దర్శనాన్ని ఇస్తాడు.”17

నా గుర్తింపు మరియు నా జీవితంలో దేవుని ప్రణాళికను కనుగొనడం గురించి నా భూసంబంధమైన తండ్రి నాకు ఎలా నేర్పించారో నేను మీతో పంచుకోవచ్చా?

నాకు 13 ఏళ్లు ఉన్నప్పుడు ఒక శనివారం ఉదయం, నా వారపు పనుల్లో భాగంగా గడ్డి కోస్తున్నాను. నేను పని పూర్తి చేసాక, మా ఇంటి వెనుక తలుపు మూసివేయడం విని, మా నాన్న నన్ను తనతో చేరమని పిలుస్తున్నట్లు చూశాను. నేను వెనుక వాకిలివైపు నడిచాను మరియు ఆయన నన్ను మెట్ల మీద తనతోపాటు కూర్చోమని ఆహ్వానించారు. అది ఒక అందమైన ఉదయం. మా భుజాలు తగిలేంత దగ్గరగా ఆయన నాతో కూర్చున్నట్లు నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆయన నన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం ప్రారంభించారు. జీవితంలో నా లక్ష్యాలు ఏమిటని ఆయన నన్ను అడిగారు. నేను అనుకున్నాను, “సరే, ఇది సులభం.” నాకు రెండు విషయాలు ఖచ్చితంగా తెలుసు: నేను పొడవుగా ఉండాలనుకున్నాను మరియు నేను తరచుగా శిబిరాలకు వెళ్లాలనుకుంటున్నాను. నేను ఒక సాధారణ ఆత్మను. ఆయన నవ్వి, ఒక క్షణం ఆగి ఇలా అన్నారు: “స్టీవ్, నాకు చాలా ముఖ్యమైనదొకటి నీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు చెప్పేది నీ మనస్సులో మరియు నీ ఆత్మపై చెరగని ముద్ర వేసేలా చేయమని మన పరలోక తండ్రిని నేను ప్రార్థించాను, తద్వారా నువ్వు ఎప్పటికీ మరచిపోకుండా ఉంటావు.

ఆ క్షణంలో నా దృష్టి అంతా మా నాన్నపై ఉంది. ఆయన తిరిగి నా కళ్ళలోకి చూస్తూ, “కుమారుడా, నీ జీవితంలోని వ్యక్తిగత సమయాలను కాపాడుకో” అన్నారు. ఆయన మాటల అర్థం నా హృదయంలో లోతుగా మునిగిపోయేలా సుదీర్ఘ విరామం ఇచ్చారు.

తర్వాత ఆయన ఇలా కొనసాగించారు: “నీకు తెలుసా, ఆ సమయాల్లో నీవొక్కడివే వుంటావు, నువ్వు ఏమి చేస్తున్నావో మరెవరికీ తెలియదు? ఆ సమయాలు, ‘నేను ఇప్పుడు ఏమి చేసినా ఎవరినీ అది ప్రభావితం చేయదని, నన్ను మాత్రమేనని’ నువ్వు భావించే సమయాలు?”

తరువాత ఆయన ఇలా అన్నారు, “నీ జీవితంలోని ఇతర సమయాల కంటే, వ్యక్తిగత సమయాల్లో నువ్వు చేసే పనులు నువ్వు ఎదుర్కొనే సవాళ్లను మరియు హృదయ వేదనను ఎలా ఎదుర్కొంటావు అనే దానిపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి; మరియు నీ జీవితంలోని వ్యక్తిగత సమయాల్లో నువ్వు చేసేది కూడా నీ జీవితంలోని ఇతర సమయాల కంటే, నువ్వు అనుభవించే విజయాలు మరియు ఆనందాన్ని నువ్వు ఎలా ఎదుర్కొంటావు అనే దానిపై కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది.”

మా నాన్న ఆయన మనసులోని కోరికను పొందారు. ఆయన స్వరం యొక్క ధ్వని, శబ్దం మరియు ఆయన మాటలలో నేను అనుభవించిన ప్రేమ ఆ రోజు నా మనస్సులో మరియు నా ఆత్మపై చెరగని ముద్ర వేసింది.

నా చిన్ననాటి ఇంటి మెట్లపై ఆ రోజు జరిగిన గొప్ప అద్భుతం ఏమిటంటే, నా జీవితంలోని వ్యక్తిగత సమయాల్లో, నేను బయల్పాటును పొందేందుకు ప్రార్థనలో దేవుని యొద్దకు వెళ్లగలను అని నేను సంవత్సరాలుగా తెలుసుకున్నాను. దేవుని యొక్క పూర్వనియామక దీవెనల గురించి నేను ఎలా నేర్చుకోవాలో అప్పుడు మా నాన్న నాకు బోధిస్తున్నారు. ఆ వ్యక్తిగత సమయాల్లో, మోర్మన్ గ్రంథము దేవుని వాక్యమని నేను తెలుసుకున్నాను. ఒక సువార్త సేవ చేయడానికి దేవుడు నన్ను ముందుగా నియమించాడని నేను తెలుసుకున్నాను. దేవునికి నేను తెలుసునని, నా ప్రార్థనలను వింటాడని మరియు సమాధానమిస్తాడని నేను తెలుసుకున్నాను. యేసే క్రీస్తని, మన రక్షకుడని మరియు మన విమోచకుడని నేను తెలుసుకున్నాను.

మా నాన్నతో చిరస్మరణీయమైన ఆ రోజు నుండి నేను చాలా తప్పులు చేసినప్పటికీ, నా జీవితంలోని వ్యక్తిగత సమయాలను కాపాడుకోవడానికి ప్రయత్నించడం జీవితపు తుఫానుల మధ్య ఒక లంగరుగా నిలిచిపోయింది మరియు సురక్షితమైన పరలోకమును మరియు స్వస్థతను, మన రక్షకుని ప్రేమ యొక్క బలపరిచే ఆశీర్వాదాలను మరియు ప్రాయశ్చిత్త త్యాగమును కోరుకునేలా చేసింది.

నా యువ సహోదర సహోదరీలారా, మీరు మీ జీవితంలోని వ్యక్తిగత సమయాన్ని ఆరోగ్యకరమైన వినోదంతో, ఉత్తేజపరిచే సంగీతాన్ని వింటూ, లేఖనములను చదువుతూ, క్రమం తప్పకుండా అర్థవంతమైన ప్రార్థనలు చేస్తూ, మీ గోత్రజనకుని దీవెనను పొందడానికి మరియు ధ్యానించడానికి ప్రయత్నించినప్పుడు, మీరు బయల్పాటును పొందుతారు. అధ్యక్షులు నెల్సన్ మాటల్లో చెప్పాలంటే, “ఈ జీవితం నిజంగా మీరు ఎలాంటి జీవితాన్ని శాశ్వతంగా జీవించాలనుకుంటున్నారో నిర్ణయించుకోవలసిన సమయం అనే సత్యానికి మీ కళ్ళు బాగా తెరవబడతాయి.”18

పరలోకంలో ఉన్న మన తండ్రి మీ ప్రార్థనలకు, ప్రత్యేకించి మీ జీవితంలోని వ్యక్తిగత సమయాల్లో చేసే ప్రార్థనలకు జవాబిస్తారు. ఆయన మీ పూర్వనియామకపు బహుమతులు మరియు ప్రతిభలను మీకు వెల్లడి చేస్తారు మరియు మీరు హృదయపూర్వకంగా అడిగి తెలుసుకోవాలని కోరుకుంటే, ఆయన ప్రేమ మిమ్మల్ని చుట్టుముట్టినట్లు మీరు భావిస్తారు. మీరు మీ జీవితంలోని వ్యక్తిగత సమయాలను కాపాడుకోవడం ద్వారా, సువార్త యొక్క విధులు మరియు నిబంధనలలో మీ భాగస్వామ్యం మరింత అర్థవంతంగా ఉంటుంది. మీరు ఆయనతో చేసే నిబంధనలతో మీరు మరింత పూర్తిగా దేవునికి కట్టుబడి ఉంటారు మరియు ఆయన మీకు చేసిన వాగ్దానాలలో గొప్ప నిరీక్షణ, విశ్వాసం మరియు హామీని కలిగి ఉండటానికి మీరు పైకెత్తబడతారు. మీరు మీ కోసం దేవుని ప్రణాళికను తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నారని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు మనలో ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని మరియు మనకై మనం ఈ కనులు తెరిపించే అనుభవాన్ని పొందాలని ఆహ్వానించడానికి ఆయన ప్రపంచం కొరకు తన ప్రవక్తను ప్రేరేపించారు.19 మన రక్షకుని ప్రాయశ్చిత్త త్యాగం యొక్క వాస్తవికతను మరియు శక్తిని గూర్చి నేను సాక్ష్యమిస్తున్నాను, అది దేవుడు ముందుగా నిర్ణయించిన అన్ని ఆశీర్వాదాల ప్రకారం జీవించడాన్ని మరియు ఆనందించడాన్ని సాధ్యం చేస్తుంది, యేసు క్రీస్తు నామంలో, ఆమేన్.

వివరణలు

  1. Russell M. Nelson, “Decisions for Eternity,” Liahona, Nov. 2013, 107.

  2. రస్సెల్ ఎమ్. నెల్సన్, “శాంతికరమైన సువార్తను బోధించుట,” లియహోనా, మే 2022, 6.

  3. See Russell M. Nelson, “Hope of Israel” (worldwide youth devotional, June 3, 2018), Gospel Library: “మన పరలోక తండ్రి తన మిక్కిలి ఘనమైన ఆత్మలలో అనేకమందిని—బహుశా, ఈ చివరి దశ కొరకు—ఆయన శ్రేష్టమైన జట్టును దాచి ఉంచారని నేను చెప్పగలను. ఆ ఘనమైన ఆత్మలు—ఆ శ్రేష్టమైన ఆటగాళ్లు, ఆ నాయకులు— మీరే!”

  4. యిర్మీయా 1:5 చూడండి.

  5. మోషే 3:5

  6. కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన,” సువార్త గ్రంథాలయం; “Young Women Theme,” Gospel Library; “Aaronic Priesthood Quorum Theme,” Gospel Library చూడండి.

  7. Topics and Questions, “Premortal Life: Overview,” Gospel Library.

  8. కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన,” సువార్త గ్రంథాలయం.

  9. ఆల్మా 13:1–4 చూడండి.

  10. Topics and Questions, “Premortal Life: Overview,” Gospel Library; సిద్ధాంతము మరియు నిబంధనలు 138:55–56 కూడా చూడండి.

  11. See Topics and Questions, “Foreordination,” Gospel Library.

  12. See Russell M. Nelson, “Hope of Israel.”

  13. Topics and Questions, “Foreordination,” Gospel Library; యిర్మీయా 1:5; “What Is the Relationship between Foreordination and Agency?,” Liahona, Oct. 2023, 47; Guide to the Scriptures, “Foreordination,” Gospel Library కూడా చూడండి.

  14. ఆల్మా 13:1–4; సిద్ధాంతము మరియు నిబంధనలు 130:20–21 చూడండి.

  15. కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన,” సువార్త గ్రంథాలయం.

  16. యిర్మీయా 1:5 చూడండి.

  17. Russell M. Nelson, Instagram, July 20, 2022, Instagram.com/russellmnelson.

  18. Russell M. Nelson, “Choices for Eternity” (worldwide devotional for young adults, May 15, 2022), Gospel Library.

  19. రస్సెల్ ఎమ్. నెల్సన్, “సంఘము కొరకు బయల్పాటు, మన జీవితాల కొరకు బయల్పాటు,” లియహోనా, మే 2018, 93–96 చూడండి.