సర్వసభ్య సమావేశము
స్తంభాలు మరియు కిరణాలు
2024 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


స్తంభాలు మరియు కిరణాలు

మనం కూడా మన స్వంత కాంతి స్తంభాన్ని కలిగి ఉండవచ్చు—ఒక్కొక్కసారి ఒక్కొక్క కిరణం చొప్పున.

నా సందేశం అధిక ఆధ్యాత్మిక అనుభవాలను పొందలేనందున తమ సాక్ష్యాలను గురించి ఆందోళన చెందే వారి కోసం. నేను కొంత శాంతిని, హామీని అందిస్తానని ఆశిస్తున్నాను.

యేసు క్రీస్తు సువార్త యొక్క పునఃస్థాపన వెలుగు మరియు సత్యం యొక్క విస్ఫోటనంతో ప్రారంభమైంది! అప్‌స్టేట్ న్యూయార్క్‌లో జోసెఫ్ స్మిత్ అనే చాలా సాధారణ పేరుతో ఉన్న ఒక యవ్వనుడు ప్రార్థన చేయడానికి చెట్ల వనములోకి ప్రవేశిస్తాడు. అతను తన ఆత్మ మరియు దేవుని ముందు తన స్థితి గురించి ఆందోళన చెందుతాడు. అతను తన పాపాలకు క్షమాపణ కోరతాడు. మరియు అతను ఏ సంఘములో చేరాలనే విషయంలో అయోమయంతో ఉంటాడు. అతనికి స్పష్టత మరియు శాంతి అవసరం—అతనికి వెలుగు మరియు జ్ఞానం అవసరం.1

జోసెఫ్ మోకరిల్లి ప్రార్థన చేస్తూ, “[తన] హృదయవాంఛలను దేవునికి అర్పించుచున్నప్పుడు” దట్టమైన చీకటి అతనిని ఆవరిస్తుంది. చెడ్డది, అణచివేయునది మరియు నిజమైనది ఏదో అతనిని ఆపడానికి ప్రయత్నిస్తుంది—అతను మాట్లాడలేకుండా అతని నాలుకను కట్టివేస్తుంది. చీకటి శక్తులు ఎంత తీవ్రమవుతాయంటే, తాను చనిపోతానని జోసెఫ్ భావిస్తాడు. కానీ అతను “[అతన్ని] స్వాధీనం చేసుకున్న ఈ శత్రువు యొక్క శక్తి నుండి [అతన్ని] విడిపించమని దేవునికి మొరపెట్టడానికి [తన] బలమునంతటిని ఉపయోగిస్తాడు.” ఆపై, “[అతను] నిరాశలో మునిగిపోయి [తననుతాను] నాశనమునకు అప్పగించుకోవడానికి సిద్ధంగా ఉన్న క్షణంలో,” అతను ఇకపై తట్టుకోగలడో లేదో అతనికి తెలియనప్పుడు, చీకటిని మరియు అతని ఆత్మ యొక్క శత్రువును చెదరగొడుతూ ఒక అద్భుతమైన కాంతి వనమును నింపుతుంది.2

సూర్యకాంతిని మించిన ఒక “కాంతి స్తంభం” క్రమంగా అతనిపైకి దిగుతుంది. ఒక వ్యక్తి కనిపిస్తారు, తరువాత మరొక వ్యక్తి.3 వారి “తేజస్సు, మహిమ వర్ణనాతీతముగా ఉంటుంది.” మొదట, మన పరలోక తండ్రి, అతన్ని పేరు పెట్టి పిలిచి, “మరొకరిని చూపిస్తూ అంటారు—[జోసెఫ్!] ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన మాట వినుము!4

ఆ వెలుగు మరియు సత్యం యొక్క ఆకస్మిక విస్ఫోటనంతో పునఃస్థాపన ప్రారంభమైంది. దైవిక బయల్పాటు మరియు ఆశీర్వాదాలు వరదలా ముంచెత్తాయి: క్రొత్త లేఖనం, పునఃస్థాపించబడిన యాజకత్వ అధికారం, అపొస్తలులు మరియు ప్రవక్తలు, విధులు మరియు నిబంధనలు, ప్రభువు యొక్క నిజమైన మరియు సజీవమైన సంఘము యొక్క పునఃస్థాపన, ఇది ఏదో ఒక రోజు భూమిని యేసు క్రీస్తు మరియు పునఃస్థాపించబడిన ఆయన సువార్త యొక్క వెలుగు మరియు సాక్ష్యంతో నింపుతుంది.

అదంతా, ఇంకా చాలా ఎక్కువ, ఒక బాలుడి యొక్క నిరాశతో కూడిన ప్రార్థన మరియు కాంతి స్తంభంతో ప్రారంభమైంది.

మనకు కూడా నిరాశతో కూడిన మన స్వంత అవసరాలు ఉన్నాయి. మనకు కూడా ఆధ్యాత్మిక గందరగోళం మరియు ప్రాపంచిక అంధకారం నుండి విముక్తి అవసరం. మనము కూడ మనకై మనం నేర్చుకోవాల్సిన అవసరముంది.5 “పునఃస్థాపన యొక్క మహిమకరమైన వెలుగులో [మనల్ని మనం] నిమగ్నం చేసుకోవాలని” అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మనల్ని ఆహ్వానించడానికి అదొక కారణం.6

పునఃస్థాపన యొక్క గొప్ప సత్యాలలో ఒకటి ఏమిటంటే, పరలోకాలు తెరువబడి ఉన్నాయి—మనం కూడా పై నుండి వెలుగు మరియు జ్ఞానాన్ని పొందగలము. అది నిజమని నేను సాక్ష్యమిస్తున్నాను.

కానీ మనం ఆధ్యాత్మిక ఉచ్చు గురించి జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు విశ్వాసపాత్రులైన సంఘ సభ్యులు నిరుత్సాహపడతారు మరియు దూరంగా వెళ్లిపోతారు, ఎందుకంటే వారు అధిక ఆధ్యాత్మిక అనుభవాలు కలిగియుండలేదు—ఎందుకంటే వారు తమ స్వంత కాంతి స్తంభాన్ని అనుభవించలేదు. అధ్యక్షులు స్పెన్సర్ డబ్ల్యు. కింబల్ ఇలా హెచ్చరించారు, “ఎల్లప్పుడూ అద్భుతమైన వాటిని ఆశిస్తూ, చాలామంది బయల్పరచబడిన సందేశం యొక్క స్థిరమైన ప్రవాహాన్ని పూర్తిగా కోల్పోతారు.”7

అధ్యక్షులు జోసెఫ్ ఎఫ్. స్మిత్ ఇలా గుర్తుచేసుకున్నారు, “ప్రభువు నా నుండి [నా చిన్నతనంలో] అద్భుతాలను నిలిపివేసారు మరియు నాకు సత్యాన్ని, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, ఇచ్చట కొంత అచ్చట కొంత ఇచ్చెదనని చూపించారు.”8

అది ప్రభువు యొక్క విలక్షణమైన నమూనా, సహోదర సహోదరీలారా. మనకు ఒక కాంతి స్తంభాన్ని పంపే బదులు, ప్రభువు మనకు ఒక కాంతి కిరణాన్ని పంపుతారు, ఆపై మరొకటి, తర్వాత ఇంకొకటి పంపుతారు.

ఆ కాంతి కిరణాలు నిరంతరం మనపై క్రుమ్మరించబడుతూనే ఉంటాయి. యేసు క్రీస్తు “లోకమునకు వెలుగును … జీవమునైయున్నాడు”9 అని, ఆయన “ఆత్మ లోకములోనికి వచ్చే ప్రతి పురుషునికి [మరియు స్త్రీకి] వెలుగునిస్తుంది” 10 అని మరియు ఆయన వెలుగు “అన్నిటికీ జీవమునిస్తూ, అనంత విశ్వమును నింపుతుంది” 11 అని లేఖనాలు బోధిస్తాయి. క్రీస్తు యొక్క వెలుగు అక్షరాలా మన చుట్టూ ఉంది.

మనము పరిశుద్ధాత్మ వరమును పొంది, విశ్వాసాన్ని సాధన చేయడానికి, పశ్చాత్తాపపడడానికి మరియు మన నిబంధనలను గౌరవించడానికి కృషిచేస్తున్నట్లయితే, ఈ దైవిక కిరణాలను నిరంతరం పొందడానికి మనం అర్హులవుతాం. ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ గారి చిరస్మరణీయ వాక్యములో, “మనము ‘బయల్పాటులో జీవిస్తున్నాము.’”12

ఇంకా, మనలో ప్రతి ఒక్కరూ భిన్నంగా ఉంటారు. ఏ ఇద్దరు వ్యక్తులు దేవుని వెలుగు మరియు సత్యాన్ని సరిగ్గా ఒకే విధంగా అనుభవించరు. మీరు ప్రభువు యొక్క వెలుగు మరియు ఆత్మను ఎలా అనుభవిస్తారో ఆలోచించడానికి కొంత సమయాన్ని వెచ్చించండి.

మీకు ఆందోళన కలిగించిన “[ఒక] విషయమును గూర్చి మీ మనస్సుకు శాంతిని [కలుగజేసినట్లుగా]” వెలుగు మరియు సాక్ష్యం యొక్క ఈ విస్ఫోటనాలను మీరు అనుభవించి ఉండవచ్చు.13

లేదా “మీ మనస్సులోను, మీ హృదయంలోను”14 స్థిరపడి, ఎవరికైనా సహాయం చేయడం వంటిదేదైనా మంచిని చేయమని మిమ్మల్ని ప్రోత్సహించే ఒక మనోభావనగా—నిమ్మళముగా మాటలాడు ఒక స్వరంగా అనుభవించి ఉండవచ్చు.

బహుశా మీరు సంఘములో ఒక తరగతిలో—లేదా ఒక యువజన శిబిరంలో—ఉన్నారు మరియు యేసు క్రీస్తును అనుసరించి, విశ్వాసంగా ఉండాలనే బలమైన కోరికను భావించియుండవచ్చు.15 బహుశా మీరు నిలబడి, మీరు నిజమనుకున్న సాక్ష్యాన్ని పంచుకున్నారు, ఆ తర్వాత అది నిజమని భావించియుండవచ్చు.

లేదా మీరు ప్రార్థన చేస్తూ ఉండవచ్చు మరియు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడనే సంతోషకరమైన హామీని అనుభవించి ఉండవచ్చు.16

యేసు క్రీస్తు గురించి ఎవరైనా సాక్ష్యమివ్వడాన్ని మీరు విని ఉండవచ్చు మరియు అది మీ హృదయాన్ని తాకి మిమ్మల్ని నిరీక్షణతో నింపియుండవచ్చు.17

బహుశా మీరు మోర్మన్ గ్రంథం చదువుతున్నారు మరియు దేవుడు మీ కోసమే దానిని అక్కడ ఉంచినట్లు ఒక వచనం మీ ఆత్మతో మాట్లాడియుండవచ్చు—తర్వాత ఆయన చేసినట్లు మీరు గ్రహించియుండవచ్చు.18

మీరు ఇతరులకు సేవ చేస్తున్నప్పుడు వారికోసం దేవుని ప్రేమను మీరు అనుభవించి ఉండవచ్చు.19

నిరాశ లేదా ఆందోళన కారణంగా ఆ క్షణంలో మీరు ఆత్మను అనుభవించడానికి కష్టపడియుండవచ్చు, కానీ గతంలోకి చూసి, “ప్రభువు యొక్క మృదు కనికరములను”20 గుర్తించే బహుమతిని కలిగి ఉండవచ్చు.

నా ఉద్దేశ్యం ఏమిటంటే, సాక్ష్యం యొక్క పరలోక కిరణాలను పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇవి వాటిలో కొన్ని మాత్రమే. అవి నాటకీయంగా ఉండకపోవచ్చు, కానీ అవన్నీ మన సాక్ష్యాల్లో భాగంగా ఉన్నాయి.

సహోదర సహోదరీలారా, నేను కాంతి స్తంభాన్ని చూడలేదు, కానీ మీలాగే నేను చాలా దివ్య కిరణాలను అనుభవించాను. సంవత్సరాలుగా, నేను అలాంటి అనుభవాలను విలువైనవిగా యెంచాను. నేను చేసినప్పుడు నేను దానిని కనుగొన్నాను, నేను వాటిని ఇంకా ఎక్కువగా గుర్తించి, జ్ఞాపకముంచుకుంటాను. ఇవి నా స్వంత జీవితం నుండి కొన్ని ఉదాహరణలు. అవి కొందరిని అంతగా ఆకట్టుకోకపోవచ్చు, కానీ అవి నాకు విలువైనవి.

ఒకసారి బాప్తిస్మం సమయంలో నేను రౌడీ యువకుడిగా ఉన్నట్లు గుర్తు. సమావేశం ప్రారంభం కాబోతుండగా, ఆత్మ నన్ను కూర్చోమని మరియు భక్తితో ఉండమని కోరినట్లు నేను భావించాను. నేను కూర్చుని, మిగిలిన సమావేశమంతా నిశ్శబ్దంగా ఉన్నాను.

నా సువార్తసేవ‌కు ముందు, నా సాక్ష్యం తగినంత బలంగా లేదని నేను భయపడ్డాను. మా కుటుంబంలో ఎవరూ ఎన్నడూ సువార్తసేవ చేయలేదు మరియు నేను చేయగలనో లేదో నాకు తెలియదు. యేసు క్రీస్తు గురించి మరింత నిర్దిష్టమైన సాక్ష్యాన్ని పొందేందుకు నేను తీవ్రంగా అధ్యయనం చేయడం మరియు ప్రార్థించడం నాకు గుర్తుంది. అప్పుడు ఒకరోజు, నేను పరలోక తండ్రిని ప్రాధేయపడుతున్నప్పుడు, నేను వెలుగు మరియు వెచ్చదనం యొక్క శక్తివంతమైన భావాన్ని అనుభవించాను. మరియు నాకు తెలుసు. నాకు అప్పుడే తెలిసింది.

నేను పెద్దల సమూహంలో సేవ చేయడానికి పిలువబడతానని నాకు చెప్తున్న “ప్రత్యక్ష సంభాషణ” భావనతో ఒక రాత్రి మేల్కొనడం నాకు గుర్తుంది.21 రెండు వారాల తర్వాత నేను పిలువబడ్డాను.

నేను వినాలని ఆశిస్తున్న సాక్ష్యంగా ఒక స్నేహితుడికి నేను చెప్పిన ఖచ్చితమైన పదాలను పన్నెండుమంది అపొస్తలుల సమూహం యొక్క ఒక సభ్యుడు పలికిన సర్వసభ్య సమావేశం నాకు గుర్తుంది.

అతని గుండె ఆగిపోయిన తర్వాత, దూరంగా ఉన్న ఒక చిన్న ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై అపస్మారక స్థితిలో పడి ఉన్న ప్రియమైన స్నేహితుడి కోసం ప్రార్థన చేయడానికి వందలాది సోదరులతో మోకరిల్లడం నాకు గుర్తుంది. మేము అతని ప్రాణాల కోసం మనవి చేయడానికి మా హృదయాలను ఏకం చేస్తున్నప్పుడు, అతను మేల్కొని తన గొంతు నుండి వెంటిలేటర్‌ను తొలగించాడు. అతను ఈరోజు స్టేకు అధ్యక్షునిగా సేవచేస్తున్నాడు.

నా జీవితంలో అపారమైన లోటును కలిగించి, చాలా త్వరగా మరణించిన ఒక ప్రియమైన స్నేహితుడు మరియు గురువు గురించి ఒక స్పష్టమైన కల తర్వాత బలమైన ఆధ్యాత్మిక భావాలతో మేల్కొన్నట్లు నాకు గుర్తుంది. అతను నవ్వుతూ ఆనందంగా ఉన్నాడు. అతను బాగానే ఉన్నాడని నాకు తెలుసు.

ఇవి నా కిరణాలలో కొన్ని. మీకు మీ స్వంత అనుభవాలు—వెలుగుతో నిండిన మీ స్వంత సాక్ష్యపు విస్ఫోటనాలు ఉన్నాయి. మనం ఈ కిరణాలను గుర్తించి, గుర్తుంచుకొని, “ఏకముగా సమకూర్చినప్పుడు”22 అద్భుతమైనది మరియు శక్తివంతమైనది ఏదో జరగడం ప్రారంభమవుతుంది. “వెలుగు వెలుగును అంటిపెట్టుకొనియుంటుంది”—“సత్యము సత్యమును హత్తుకొనియుంటుంది.”23 సాక్ష్యం యొక్క ఒక కిరణం యొక్క వాస్తవికత మరియు శక్తి మరొకదానితో, ఆపై మరొకటి, తర్వాత ఇంకొకదానితో మిళితమై బలపరుస్తుంది. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, ఇక్కడ ఒక కిరణం మరియు అక్కడ ఒక కిరణం—ఒక్కొక్కసారి ఒక్కొక్క చిన్న, విలువైన ఆధ్యాత్మిక క్షణం—అలా మనలో వెలుగుతో నిండిన, ఆధ్యాత్మిక అనుభవాల యొక్క ప్రధాన భాగం పెరుగుతుంది. బహుశా పూర్తి సాక్ష్యాన్ని ఏర్పరచడానికి ఏ ఒక్క కిరణం బలంగా లేదా ప్రకాశవంతంగా లేకపోవచ్చు, కానీ అవన్నీ కలిసి సందేహపు చీకటి జయించలేని ఒక వెలుగుగా మారవచ్చు.

“అప్పుడు, ఇది వాస్తవము కాదా?” అని ఆల్మా అడుగుతున్నాడు. “అవును, అని నేను మీతో చెప్పుచున్నాను, ఏలయనగా అది వెలుగైయున్నది.”24

“దేవుని నుండి కలిగినది వెలుగైయున్నది; వెలుగును పొందినవాడు దేవునియందు కొనసాగినయెడల, మరింత వెలుగును పొందును; పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు ఆ వెలుగు అంతకంతకు తేజరిల్లును”25 అని ప్రభువు మనకు బోధిస్తున్నారు.

సహోదర సహోదరీలారా, సమయానుకూలంగా మరియు “అధిక శ్రద్ధ”26 చేత మనం కూడా మన స్వంత కాంతి స్తంభాన్ని కలిగి ఉండగలము—ఒక్కొక్కసారి ఒక్కొక్క కిరణం చొప్పున. మరియు ఆ స్తంభం మధ్యలో, మనం కూడా ప్రేమగల పరలోక తండ్రిని కనుగొంటాము, మనల్ని పేరు పెట్టి పిలుస్తూ, మన రక్షకుడైన యేసు క్రీస్తు వైపు చూపిస్తూ, “ఈయన మాట వినుము!” అని మనలను ఆహ్వానిస్తున్నట్లుగా.

యేసు క్రీస్తు సమస్త లోకానికి—మీ వ్యక్తిగత ప్రపంచానికి మరియు నా జీవితానికి వెలుగును జీవమునైయున్నారని నేను ఆయన గురించి సాక్ష్యమిస్తున్నాను.

ఆయన నిజమైన, సజీవమైన దేవుని యొక్క నిజమైన, సజీవమైన కుమారుడని మరియు ఆయన ఈ నిజమైన, సజీవమైన సంఘానికి అధిపతిగా ఉన్నారని, ఇది ఆయన నిజమైన, సజీవమైన ప్రవక్తలు మరియు అపొస్తలులచే నడిపించబడి, మార్గనిర్దేశం చేయబడుతుందని నేను సాక్ష్యమిస్తున్నాను.

మనము ఆయన మహిమాన్వితమైన వెలుగును గుర్తించి, స్వీకరించి, లోకపు అంధకారానికి పైగా ఆయనను ఎంచుకుందాం—ఎల్లప్పుడూ మరియు శాశ్వతంగా. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:10–13 చూడండి.

  2. జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:14-16 చూడండి.

  3. See Joseph Smith, Journal, Nov. 9–11, 1835, 24, josephsmithpapers.org.

  4. జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:17.

  5. జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:20 చూడండి. జోసెఫ్ స్మిత్ మొదటి దర్శనం తర్వాత ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, అతని తల్లి అతను బాగానే ఉన్నాడా అని అడిగింది. అతను ఇలా బదులిచ్చాడు, “నేను బాగానే ఉన్నాను. … ప్రెస్బిటేరియనిజం నిజం కాదని నేను స్వయంగా నేర్చుకున్నాను” (వివరణ చేర్చబడింది).

  6. రస్సెల్ ఎమ్. నెల్సన్, “ముగింపు వ్యాఖ్యలు,” లియహోనా, నవ. 2019, 122.

  7. Spencer W. Kimball, in Conference Report, Munich Germany Area Conference, 1973, 77; quoted in Graham W. Doxey, “The Voice Is Still Small,” Ensign, Nov. 1991, 25.

  8. Teachings of Presidents of the Church: Joseph F. Smith (1998), 201: “నేను బాలుడిగా పరిచర్యను ప్రారంభించినప్పుడు, సాక్ష్యం పొందేందుకు నేను తరచూ బయటికి వెళ్లి, నాకు కొన్ని అద్భుతమైన విషయాలను చూపించమని ప్రభువును అడిగేవాడిని. కానీ ప్రభువు నా నుండి అద్భుతాలను నిలిపివేసి, నఖశిఖ పర్యంతం నాకు సత్యాన్ని తెలియజేసే వరకు మరియు సందేహం, భయం నా నుండి పూర్తిగా తొలగించబడే వరకు, ఆయన నాకు సత్యాన్ని ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, ఇచ్చట కొంత, అచ్చట కొంతగా చూపించారు. ఆయన దీన్ని చేయడానికి పరలోకం నుండి ఒక దేవదూతను పంపాల్సిన అవసరం లేదు లేదా ప్రధాన దేవదూత బూర‌తో మాట్లాడాల్సిన అవసరం లేదు. సజీవుడైన దేవుని ఆత్మ యొక్క నిమ్మళమైన స్వరం యొక్క గుసగుసల ద్వారా, ఆయన నేను కలిగియున్న సాక్ష్యాన్ని నాకిచ్చారు. ఈ సూత్రం మరియు శక్తి ద్వారా ఆయన మనుష్యులందరికీ సత్యం గురించిన జ్ఞానాన్ని అందజేస్తారు, అది వారితో ఉండిపోతుంది మరియు అది దేవునికి తెలిసినట్లుగా సత్యాన్ని వారు తెలుసుకునేలా చేస్తుంది మరియు క్రీస్తు చేసినట్లుగా తండ్రి చిత్తాన్ని చేసేలా చేస్తుంది.”

  9. మోషైయ 16:9.

  10. సిద్ధాంతము మరియు నిబంధనలు 84:46; యోహాను 1:9 కూడా చూడండి.

  11. సిద్ధాంతము మరియు నిబంధనలు 88:12-13.

  12. డేవిడ్ ఎ. బెడ్నార్, బయల్పాటు ఆత్మ (2021), 7.

  13. సిద్ధాంతము మరియు నిబంధనలు 6:23.

  14. సిద్ధాంతము మరియు నిబంధనలు 8:2; హీలమన్ 5:30 కూడా చూడండి.

  15. మోషైయ 5:2; సిద్ధాంతము మరియు నిబంధనలు 11:12 చూడండి.

  16. 2 నీఫై 4:21 ; హీలమన్ 5:44 చూడండి.

  17. ఇతరుల సాక్ష్యాన్ని విశ్వసించే సామర్థ్యాన్ని ఆత్మీయ బహుమానంగా ప్రభువు గుర్తించారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 46:13–14 చూడండి).

  18. లేఖనము యొక్క మాటలు “నా ఆత్మ ద్వారా మీకివ్వబడినవి, … నా శక్తి ద్వారా తప్ప వాటిని మీరు కలిగియుండలేరు; కాబట్టి, నా స్వరమును వింటిరని, నా మాటలు తెలియునని మీరు సాక్ష్యము చెప్పగలరు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 18:35–36) అని ఆధునిక బయల్పాటు బోధిస్తుంది.

  19. మోషైయ 2:17; మొరోనై 7:45-48 చూడండి.

  20. 1 నీఫై 1:20. “చెప్పిన దానికంటే ఎక్కువగా అర్థం చేసుకొని, మన జీవితాల్లో ప్రభువు యొక్క అనేక మృదు కనికరములందు ఆనందించడం” గురించి (“పరిచర్య,” లియహోనా, మే 2023, 18) మరియు “వెనుకకు చూసినప్పుడు మన జీవితాలలో ప్రభువు హస్తం తరచు ఎలా స్పష్టంగా ఉంటుంది” (“Always Remember Him,” Liahona, May 2016, 108) అనే దాని గురించి ఎల్డర్ గెరిట్ డబ్ల్యు. గాంగ్ మాట్లాడారు. ఆ క్షణంలో మనం దానిని గుర్తించకపోయినా లేదా అనుభూతి చెందకపోయినా, మన జీవితాల్లో ప్రభువు హస్తాన్ని కృతజ్ఞతతో గుర్తించి, అంగీకరించే బహుమానం శక్తివంతమైనది. లేఖనాలు తరచుగా గుర్తుంచుకోవడమనే ఆధ్యాత్మిక శక్తి గురించి మాట్లాడతాయి (హీలమన్ 5:9–12; సిద్ధాంతము మరియు నిబంధనలు 20:77, 79 చూడండి), అది బయల్పాటుకు ముందు సూచనగా ఉంటుంది (మొరోనై 10:3–4 చూడండి).

  21. జోసెఫ్ స్మిత్ ఇలా బోధించారు: “ఒక వ్యక్తి బయల్పాటు ఆత్మ యొక్క మొదటి సూచనను గమనించడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు; ఉదాహరణకు, మీరు స్వచ్ఛమైన తెలివితేటలు మీలోకి ప్రవహిస్తున్నట్లు భావించినప్పుడు, అది మీకు ఆకస్మిక ఆలోచనలను అందించవచ్చు, తద్వారా దానిని గమనించడం ద్వారా, అదే రోజు లేదా త్వరలో అది నెరవేరినట్లు మీరు కనుగొనవచ్చు; (అనగా) దేవుని ఆత్మ ద్వారా మీ మనస్సులకు అందించబడిన విషయాలు నెరవేరుతాయి; మరియు ఆ విధంగా దేవుని ఆత్మను తెలుసుకొని దానిని అర్థం చేసుకోవడం ద్వారా, మీరు క్రీస్తు యేసులో పరిపూర్ణులయ్యే వరకు మీరు బయల్పాటు సూత్రంలోకి ఎదగవచ్చు” (Teachings of Presidents of the Church: Joseph Smith [2007], 132).

  22. ఎఫెసీయులకు 1:10.

  23. సిద్ధాంతము మరియు నిబంధనలు 88:40: “ఏలయనగా మేధస్సు మేధస్సును అంటిపెట్టుకొనియుండును; జ్ఞానము జ్ఞానమును స్వీకరించును; సత్యము సత్యమును హత్తుకొనియుండును; సద్గుణము సద్గుణమును ప్రేమించును; వెలుగు వెలుగును అంటిపెట్టికొనియుండును.”

  24. ఆల్మా 32:35. ఈ కాంతితో నిండిన అనుభవాలు, తరచుగా చిన్నవిగా ఉన్నప్పటికీ, ప్రతి కోణంలోనూ వాస్తవమైనవని ఆల్మా నొక్కిచెప్పాడు. వాటిని కలిపి ఒక శక్తివంతమైన మొత్తంగా రూపొందించినప్పుడు వాటి వాస్తవికత మరింత శక్తివంతమవుతుంది.

  25. సిద్ధాంతము మరియు నిబంధనలు 50:24.

  26. ఆల్మా 32:41.