సర్వసభ్య సమావేశము
యాజకత్వ తాళపుచెవుల బహుమానమందు ఆనందించండి
2024 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


యాజకత్వ తాళపుచెవుల బహుమానమందు ఆనందించండి

ప్రభువు ఉద్దేశాలను నెరవేర్చడానికి మరియు పునఃస్థాపించబడిన సువార్తను అంగీకరించే వారందరినీ ఆశీర్వదించడానికి దేవుని యాజకత్వం ఎలా ఉపయోగించబడుతుంది అనేదానిని యాజకత్వ తాళపుచెవులు నియంత్రిస్తాయి.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ రోజు అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ గారికి, నాకు ఒక చారిత్రాత్మక దినము. 40 ఏళ్ళ క్రితం, 1984, ఏప్రిల్ 7వ తేదీన మేము పన్నెండుమంది అపొస్తలుల సమూహానికి పిలువబడ్డాము.1 దీనితో కలిపి, అప్పటినుండి ప్రతీ ఒక్క సర్వసభ్య సమావేశాన్ని మేము ఆనందించాము. మరోసారి మనం పవిత్రమైన ఆత్మ యొక్క క్రుమ్మరింపు చేత దీవించబడ్డాము. రాబోయే నెలల్లో మీరు ఈ సమావేశ సందేశాలను పదేపదే చదువుతారని నేనాశిస్తున్నాను.

నేను పుట్టినప్పుడు,2 సంఘములో నిర్వహణలో ఉన్న దేవాలయాలు ఆరు ఉండేవి—సెయింట్ జార్జ్, లోగన్, మాంటై మరియు యూటాలోని సాల్ట్ లేక్ సిటీలో; అలాగే కార్డ్‌స్టన్, ఆల్బెర్టా, కెనడాలో; మరియు లేయి, హవాయిలో ఒక్కొక్కటి చొప్పున. అంతకుముందు రెండు దేవాలయాలు కర్ట్‌లాండ్, ఒహైయో మరియు నావూ, ఇల్లినాయ్‌లో క్లుప్తంగా నిర్వహించబడ్డాయి. సంఘ సభ్యుల సమూహం పశ్చిమానికి వెళ్ళడంతో, పరిశుద్ధులు ఆ రెండు దేవాలయాలను వదిలి వెళ్ళవలసి వచ్చింది.

నావూ దేవాలయం అగ్నిప్రమాదంతో ధ్వంసమైంది. తరువాత అది అధ్యక్షులు గార్డన్ బి. హింక్లీ గారిచే పునర్నిర్మించబడి, ప్రతిష్ఠించబడింది.3 కర్ట్‌లాండ్ దేవాలయాన్ని సంఘ శత్రువులు అపవిత్రం చేశారు. తరువాత కర్ట్‌లాండ్ దేవాలయాన్ని Community of Christ [క్రీస్తు సంఘం] స్వాధీనం చేసుకుంది, అది చాలా సంవత్సరాలు దానిని స్వంతం చేసుకుంది.

గత నెలలో, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము నావూలోని అనేక ముఖ్యమైన చారిత్రక ప్రదేశాలతో పాటుగా, కర్ట్‌లాండ్ దేవాలయాన్ని కొనుగోలు చేసినట్లు మేము ప్రకటించాము. ఈ ఒప్పందానికి దారితీసిన క్రీస్తు సంఘానికి చెందిన నాయకులతో మేము జరిపిన స్నేహపూర్వక మరియు పరస్పర ప్రయోజనకరమైన చర్చలను మేము ఎంతో అభినందిస్తున్నాము.

చిత్రం
కర్ట్‌లాండ్ దేవాలయము.

యేసు క్రీస్తు సువార్త యొక్క పునఃస్థాపనలో కర్ట్‌లాండ్ దేవాలయానికి అసాధారణమైన ప్రాముఖ్యత ఉంది. అక్కడ జరిగిన అనేక సంఘటనలు సహస్రాబ్దాలుగా ప్రవచించబడ్డాయి మరియు అవి ప్రభువు యొక్క పునఃస్థాపించబడిన సంఘము తన కడవరి-దిన నియమితకార్యాన్ని నెరవేర్చడానికి అవసరమైనవి.

ఈ సంఘటనలలో అత్యంత ముఖ్యమైనది ఈస్టర్ ఆదివారం, 1836, ఏప్రిల్ 3న జరిగింది.4 ఆ రోజున, జోసెఫ్ స్మిత్ మరియు ఆలివర్ కౌడరీ అద్భుతమైన సందర్శనల శ్రేణిని అనుభవించారు. మొదట, ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యారు. రక్షకుని “నేత్రములు అగ్నిజ్వాలవలే ఉండెను; ఆయన తలవెంట్రుకలు తెల్లగా శుద్ధమైన హిమమువలే ఉండెను; ఆయన ముఖము మహాతేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలే ఉండెను; ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలే నుండెను”5 అని ప్రవక్త వ్రాసారు.

ఈ సందర్శన సమయంలో, ప్రభువు తన గుర్తింపును ధృవీకరించారు. “ఆదియు అంతమును నేనే; జీవించుచున్న వాడను నేనే, వధించబడిన వాడను నేనే; తండ్రితో మీ న్యాయవాదిగా ఉన్నాను”6 అని ఆయన అన్నారు.

తర్వాత యేసు క్రీస్తు తాను దేవాలయాన్ని తన ఇల్లుగా అంగీకరించినట్లు ప్రకటించారు మరియు ఈ అద్భుతమైన వాగ్దానం చేసారు: “కరుణతో ఈ మందిరములో నా జనులకు నన్ను నేను ప్రత్యక్షపరచుకొందును.”7

ఈ మహత్తరమైన వాగ్దానము నేడు ప్రతిష్ఠించబడిన ప్రతీ దేవాలయానికి వర్తిస్తుంది. ప్రభువు వాగ్దానం వ్యక్తిగతంగా మీకు ఏ అర్థాన్నిస్తుందో ఆలోచించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.

రక్షకుని సందర్శన తరువాత, మోషే ప్రత్యక్షమయ్యాడు. మోషే జోసెఫ్ స్మిత్‌కు ఇశ్రాయేలీయులను పోగుచేయుటకు మరియు పది గోత్రములను నడిపించుటకు తాళపుచెవులను అనుగ్రహించాడు.8

ఈ దర్శనం ముగిసినప్పుడు, “ఏలీయా ప్రత్యక్షమై అబ్రాహాము సువార్త యొక్క యుగమును జోసెఫ్‌కు ఇచ్చాడు”.9

అప్పుడు ఏలీయా ప్రవక్త ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షత రెండవ రాకడకు ముందు, “తండ్రుల హృదయములను పిల్లలతట్టును పిల్లల హృదయములను తండ్రులతట్టును త్రిప్పుటకు”10 ప్రభువు ఏలీయాను పంపుతారని మలాకీ చేసిన వాగ్దానాన్ని నెరవేర్చింది. ఏలీయా జోసెఫ్ స్మిత్‌కు ముద్రవేయు శక్తి యొక్క తాళపుచెవులను అనుగ్రహించాడు.11

ఈ తాళపుచెవులను ముగ్గురు పరలోక దూతలు ప్రభువు ఆధ్వర్యంలో భూమికి తిరిగి ఇవ్వడం యొక్క ప్రాముఖ్యత గురించి ఎక్కువగా చెప్పలేము. యాజకత్వ తాళపుచెవులు అధ్యక్షత్వము యొక్క అధికారం మరియు శక్తిని కలిగి ఉంటాయి. ప్రభువు ఉద్దేశాలను నెరవేర్చడానికి మరియు యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్తను అంగీకరించే వారందరినీ ఆశీర్వదించడానికి దేవుని యాజకత్వం ఎలా ఉపయోగించబడుతుంది అనేదానిని యాజకత్వ తాళపుచెవులు నియంత్రిస్తాయి.

సంఘము యొక్క ఏర్పాటుకు ముందు, పరలోక దూతలు ప్రవక్త జోసెఫ్‌కు అహరోను మరియు మెల్కీసెదెకు యాజకత్వాలను అనుగ్రహించారని మరియు రెండు యాజకత్వాల కొరకు తాళపుచెవులు ఇచ్చారని గమనించడం ముఖ్యం.12 ఈ తాళపుచెవులు 1830లో సంఘాన్ని ఏర్పాటు చేయడానికి జోసెఫ్ స్మిత్‌కు అధికారం ఇచ్చాయి.13

ఆ తర్వాత 1836లో కర్ట్‌లాండ్ దేవాలయంలో, ఈ మూడు అదనపు యాజకత్వ తాళపుచెవులను—అంటే, ఇశ్రాయేలీయులను పోగుచేయడానికి తాళపుచెవులు, అబ్రాహాము సువార్త యొక్క తాళపుచెవులు మరియు ముద్రవేయు శక్తి యొక్క తాళపుచెవులను అనుగ్రహించడం అవసరం. ఈ తాళపుచెవులు జోసెఫ్ స్మిత్‌కు—మరియు ప్రభువు సంఘము యొక్క తరువాతి అధ్యక్షులందరికి—ఇశ్రాయేలీయులను తెరకు ఇరువైపులా పోగుచేయడానికి, అబ్రాహాము దీవెనలతో నిబంధన పిల్లలందరినీ ఆశీర్వదించడానికి, యాజకత్వ విధులు మరియు నిబంధనలపై ఒక ఆమోద ముద్ర వేయడానికి మరియు కుటుంబాలను శాశ్వతంగా ముద్ర వేయడానికి అధికారం ఇచ్చాయి. ఈ యాజకత్వ తాళపుచెవుల శక్తి అనంతమైనది మరియు ఉత్కంఠభరితమైనది.

యాజకత్వ తాళపుచెవులు భూమికి పునఃస్థాపించబడకపోతే మీ జీవితం ఎలా భిన్నంగా ఉండేదో ఆలోచించండి.14 యాజకత్వ తాళపుచెవులు లేకుండా, మీరు దేవుని శక్తిని వరముగా పొందలేరు.15 యాజకత్వ తాళపుచెవులు లేకుండా, సంఘము ఒక ముఖ్యమైన బోధన మరియు మానవతా సంస్థగా మాత్రమే ఉపయోగపడుతుంది, కానీ అంతకన్నా ఎక్కువ కాదు. యాజకత్వ తాళపుచెవులు లేకుండా, మన ప్రియమైన వారితో శాశ్వతంగా బంధించేవి మరియు చివరికి దేవునితో జీవించడానికి మనల్ని అనుమతించే ముఖ్యమైన విధులు మరియు నిబంధనలకు మనలో ఏ ఒక్కరికీ ప్రవేశం ఉండదు.

యాజకత్వ తాళపుచెవులు భూమిపై ఉన్న ఇతర సంస్థల నుండి యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘమును వేరుచేస్తాయి. అనేక ఇతర సంస్థలు ఇక్కడ మర్త్యత్వంలో మీ జీవితాన్ని మెరుగుపరచగలవు మరియు మెరుగుపరుస్తాయి. కానీ మరణం తర్వాత మీ జీవితాన్ని ఏ ఇతర సంస్థ ప్రభావితం చేయలేదు మరియు చేయదు.16

అబ్రాహాముకు వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాలను నిబంధనను పాటించే ప్రతీ పురుషునికి, స్త్రీకి విస్తరించడానికి యాజకత్వ తాళపుచెవులు మనకు అధికారాన్ని ఇస్తాయి. దేవాలయ కార్యము దేవుని పిల్లలు ఎక్కడ, ఎప్పుడు జీవించారు లేదా ఇప్పుడు జీవిస్తున్నారా అనే దానితో సంబంధం లేకుండా అందరికీ ఈ అద్భుతమైన ఆశీర్వాదాలను అందుబాటులో ఉంచుతుంది. యాజకత్వ తాళపుచెవులు మరోసారి భూమిపైకి వచ్చినందుకు ఆనందిద్దాం!

క్రింది మూడు వ్యాఖ్యానాలను జాగ్రత్తగా పరిశీలించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను:

  1. ఇశ్రాయేలీయులను పోగుచేయడం దేవుడు ప్రతిచోటా తన పిల్లలు అందరినీ ప్రేమిస్తారనడానికి సాక్ష్యం.

  2. దేవుడు ప్రతిచోటా తన పిల్లలు అందరినీ ప్రేమిస్తారనడానికి అబ్రాహాము సువార్త అదనపు సాక్ష్యం. ఆయన “నల్లవారైనా తెల్లవారైనా, బందీలైనా స్వతంత్రులైనా, పురుషులైనా స్త్రీలైనా” అందరినీ తన వద్దకు రమ్మని ఆహ్వానిస్తారు; … అందరు దేవునికి ఒకేరీతిగా ఉన్నారు.17

  3. దేవుడు తన పిల్లలు అందరినీ ఎంతగా ప్రేమిస్తున్నారో మరియు వారిలో ప్రతి ఒక్కరూ ఇంటికి తన వద్దకు తిరిగి రావాలని కోరుకుంటున్నారో అనేదానికి ముద్రవేయు శక్తి దివ్యమైన సాక్ష్యం.

ప్రవక్త జోసెఫ్ స్మిత్ ద్వారా పునఃస్థాపించబడిన యాజకత్వ తాళపుచెవులు నిబంధనను పాటించే ప్రతీ పురుషుడు మరియు స్త్రీ నమ్మశక్యం కాని వ్యక్తిగత ఆధ్యాత్మిక విశేషాధికారాలను ఆనందించడాన్ని సాధ్యం చేస్తాయి. ఇక్కడ మళ్ళీ, కర్ట్‌లాండ్ దేవాలయం యొక్క పవిత్ర చరిత్ర నుండి మనం నేర్చుకోగలిగినది చాలా ఉంది.

జోసెఫ్ స్మిత్ చేసిన కర్ట్‌లాండ్ దేవాలయం యొక్క ప్రతిష్ఠాపన ప్రార్థన ఈ చివరి రోజుల్లో జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి దేవాలయం మీకు మరియు నాకు ఆధ్యాత్మికంగా ఎలా శక్తినిస్తుంది అనేదానిని బోధిస్తుంది. సిద్ధాంతము మరియు నిబంధనలు 109వ ప్రకరణములో నమోదు చేయబడిన ఆ ప్రార్థనను అధ్యయనం చేయమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. బయల్పాటు ద్వారా పొందబడిన ఆ ప్రతిష్ఠాపన ప్రార్థన దేవాలయం ఒక ప్రార్థనా మందిరము, ఉపవాస మందిరము, విశ్వాస మందిరము, అభ్యాస మందిరము, మహిమ మందిరము, క్రమమైన మందిరము, దేవుని మందిరము”18 అని బోధిస్తుంది.

ఈ లక్షణాల జాబితా దేవాలయ వర్ణన కంటే చాలా ఎక్కువైనది. ప్రభువు మందిరంలో సేవ చేసేవారికి మరియు ఆరాధించేవారికి ఏమి జరుగుతుందనే దాని గురించిన వాగ్దానమిది. వారు ప్రార్థనకు జవాబులు, వ్యక్తిగత బయల్పాటు, గొప్ప విశ్వాసం, బలం, ఓదార్పు, అధిక జ్ఞానం మరియు అధిక శక్తిని పొందుతారని ఆశించవచ్చు.

దేవాలయంలో గడిపే సమయం మీరు సిలెస్టియల్‌గా ఆలోచించడానికి మరియు మీరు నిజంగా ఎవరు, మీరు ఏమి కాగలరు మరియు మీరు ఎప్పటికీ ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండగలరు అనే అవగాహన పొందడానికి మీకు సహాయం చేస్తుంది. క్రమమైన దేవాలయ ఆరాధన మిమ్మల్ని మీరు చూసే విధానాన్ని మరియు దేవుని అద్భుతమైన ప్రణాళికలో మీరెలా భాగం కాగలరనే దానిని మెరుగుపరుస్తుంది. దానిని నేను మీకు వాగ్దానం చేస్తున్నాను.

దేవాలయంలో మనం “పరిశుద్ధాత్మ సంపూర్ణతను పొందగలము” అని కూడా మనకు వాగ్దానం చేయబడింది.19 నిత్య సత్యాన్ని కోరుకునే ప్రతీఒక్కరి కోసం పరలోకాలు తెరువబడతాయనే విషయంలో వాగ్దానానికి అర్థం ఏమిటో ఊహించండి.

దేవాలయంలో ఆరాధించే వారందరూ దూతలు “వారి యెడల ఆజ్ఞను కలిగియుండి”,20 దేవుని శక్తిని ధరించుకొని అక్కడి నుండి వెళ్తారని కూడా మనకు సూచించబడింది. వరము పొందిన స్త్రీ లేదా పురుషుడిగా, దేవుని శక్తిని ఆయుధముగా ధరించుకున్న మీరు ఒంటరిగా జీవితాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదని తెలుసుకోవడం మీ విశ్వాసాన్ని ఎంతగా పెంచుతుంది? దేవదూతలు మీకు నిజంగా సహాయం చేస్తారని తెలుసుకోవడం మీకు ఎలాంటి ధైర్యాన్ని ఇస్తుంది?

చివరగా, ప్రభువు మందిరములో ఆరాధించే వారిపై “ఏ దుష్ట కూడిక” జయించుటకు శక్తిని కలిగియుండదని మనం వాగ్దానమివ్వబడ్డాము.21

దేవాలయంలో సాధ్యం చేయబడిన ఆధ్యాత్మిక విశేషాధికారాలను అర్థం చేసుకోవడం నేడు మనలో ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమైనది.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, ఇదిగో నా వాగ్దానం. ఇనుపదండాన్ని గట్టిగా పట్టుకోవడానికి22 మీ పరిస్థితులు అనుమతించినంత క్రమంగా దేవాలయంలో ఆరాధించడం కంటే ఎక్కువగా మీకు ఏదీ సహాయం చేయదు. ప్రపంచంలోని అంధకారపు పొగమంచులను మీరు ఎదుర్కొన్నప్పుడు ఏదీ మిమ్మల్ని ఎక్కువగా రక్షించదు. ప్రభువైన యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తం గురించిన మీ సాక్ష్యాన్ని ఏదీ బలపరచదు లేదా దేవుని అద్భుతమైన ప్రణాళికను ఎక్కువగా అర్థం చేసుకోవడంలో ఏదీ మీకు సహాయం చేయదు. బాధాకరమైన సమయంలో ఏదీ మీ ఆత్మను ఎక్కువగా శాంతింపజేయదు. ఏదీ పరలోకాలను ఎక్కువగా తెరవదు. ఏదీ లేదు!

దేవాలయం మనలో ప్రతీ ఒక్కరి కోసం దేవుడు కలిగి ఉన్న గొప్ప ఆశీర్వాదాలకు ప్రవేశ ద్వారం, ఎందుకంటే అబ్రాహాముకు వాగ్దానం చేయబడిన అన్ని ఆశీర్వాదాలను మనం పొందగల ఏకైక స్థలం దేవాలయం.23 అందుకే దేవాలయ దీవెనలను సంఘ సభ్యులకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభువు ఆదేశాల మేరకు మేము మా శక్తి మేరకు అన్నీ చేస్తున్నాము. ఆ విధంగా, ఈ 15 ప్రదేశాలలో ప్రతి దానిలో ఒక కొత్త దేవాలయాన్ని నిర్మించాలని మేము ప్రణాళిక చేస్తున్నాము అని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము:

  • యుటురోవా, ఫ్రెంచ్ పాలినేషియా

  • చువావా, మెక్సికో

  • ఫ్లోరియానోపోలిస్, బ్రెజిల్

  • రోసారియో, అర్జెంటీనా

  • ఎడిన్‌బరా, స్కాట్లాండ్

  • బ్రిస్బేన్, ఆస్ట్రేలియా దక్షిణ ప్రాంతం

  • విక్టోరియా, బ్రిటీష్ కొలంబియా

  • యుమా, అరిజోనా

  • హ్యూస్టన్, టెక్సాస్ దక్షిణ ప్రాంతం

  • డెమోయిన్, ఐయోవా

  • సిన్సినాటి, ఒహైయో

  • హనలులు, హవాయి

  • వెస్ట్ జోర్డాన్, యూటా

  • లీహై, యూటా

  • మారకైబో, వెనిజువేలా

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, ఇదియే యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము. దానికి ఆయన అధిపతిగా ఉన్నారు. మనం ఆయన శిష్యులం.

యాజకత్వ తాళపుచెవుల పునఃస్థాపనలో మనం ఆనందిద్దాం, అది మనం పొందడానికి ఇష్టపడే మరియు యోగ్యులయ్యే ప్రతీ ఆధ్యాత్మిక ఆశీర్వాదాన్ని ఆస్వాదించడానికి మీకు, నాకు వీలు కల్పిస్తుంది. ఈవిధంగా యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.