సర్వసభ్య సమావేశము
నిలిచియుండు ఫలము
2024 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


నిలిచియుండు ఫలము

నిత్యత్వం కొరకు వాగ్దానం చేయబడిన దీవెనలను కలిగి ఉండాలంటే, మన విధులకు పరిశుద్ధాత్మ ముద్రను కలిగి ఉండటం చాలా అవసరం.

చిన్న పిల్లవాడిగా నేను, పండిన తాజా పీచ్ పండ్లను ఇష్టపడేవాడిని. ఈ రోజు వరకు కూడా, రసవంతమైన, పండిన పీచ్ పండ్లను దాని కమ్మని రుచితో కొరికి తినాలనే ఆలోచన నా నోరూరిస్తుంది. పూర్తిగా పక్వానికి వచ్చిన పీచ్ పండ్లు కోయబడినప్పుడు, అవి రెండు నుండి నాలుగు రోజుల వరకు చెడిపోకుండా ఉంటాయి. మా వంటగదిలో మా అమ్మ మరియు నా తోబుట్టువులతో చేరడం నాకు చాలా మధురమైన జ్ఞాపకాలను కలిగి ఉంది, ఎందుకంటే మేము పండించిన పీచ్ పండ్లను రాబోయే శీతాకాలం కోసం సీసాలలో మూసివేసి భద్రపరుస్తాము. మేము పీచ్ పండ్లను సరిగ్గా భద్రపరిస్తే, ఈ రుచికరమైన పండ్లు కేవలం రెండు నుండి నాలుగు రోజులు మాత్రమే కాకుండా చాలా సంవత్సరాలు ఉంటాయి. పీచ్ పండ్లను సరిగ్గా సిద్ధం చేసి, వేడి చేస్తే, సీలు తీసేవరకు పండు భద్రపరచబడుతుంది.

“మీ ఫలము నిలిచియుండుటకు… వెళ్ళి ఫలించుటకు”1 క్రీస్తు మనలను నిర్దేశించారు. అయితే ఆయన పీచ్ పండ్ల గురించి మాట్లాడటం లేదు. ఆయన తన పిల్లలకు దేవుని ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నారు. మనం దేవునితో నిబంధనలను చేసుకొని పాటిస్తే, మన నిబంధనలతో అనుబంధించబడిన దీవెనలు ఈ జీవిత కాలానికి మించి విస్తరిస్తాయి, మనపై శాశ్వతంగా ముద్రించబడతాయి లేదా భద్రపరచబడతాయి, అది నిత్యత్వము కోసం నిలిచియుండే ఫలముగా మారుతుంది.

పరిశుద్ధాత్మ, వాగ్దాన పరిశుద్ధాత్మగా తన దైవిక పాత్రలో, వారి నిబంధనలకు విశ్వాసంగా ఉన్నవారిపై ప్రతి విధిని ముద్రిస్తాడు, తద్వారా అవి మరణానంతరం కూడా చెల్లుబాటు అవుతాయి.2 మనం నిలిచియున్న ఫలంగా మారి, నిత్యత్వం కొరకు వాగ్దానం చేయబడిన దీవెనలను కలిగి ఉండాలంటే, మన విధులకు పరిశుద్ధాత్మ ముద్రను కలిగి ఉండటం చాలా అవసరం.

ప్రత్యేకంగా మనం ఉన్నతస్థితిని పొందాలంటే ఇది చాలా ముఖ్యమైనది.3 అధ్యక్షులు నెల్సన్ బోధించినట్లుగా: “మనం ముగింపును దృష్టిలో పెట్టుకుని ప్రారంభించాలి. నిశ్చయంగా, మనలో ప్రతిఒక్కరికీ, మనం ఎక్కువగా సాధించాలనుకునే ‘ముగింపు’ మన కుటుంబాలతో శాశ్వంతగా జీవించడమే, అక్కడ మన పరలోక తండ్రి అయిన దేవుడు మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు సన్నిధిలో మనం ఉన్నతస్థితిలో ఉంటాము.”4 అధ్యక్షులు నెల్సన్ ఇలా కూడా అన్నారు: “సిలెస్టియల్ వివాహం అనేది నిత్య జీవితానికి సిద్ధపడడంలో కీలకమైన భాగము. ఒక వ్యక్తి సరైన వ్యక్తిని, సరైన స్థలంలో, సరైన అధికారం ద్వారా వివాహం చేసుకోవడం మరియు ఆ పరిశుద్ధ నిబంధనకు విశ్వాసంగా విధేయత చూపడం అవసరం. అప్పుడు ఒకరు దేవుని సిలెస్టియల్ రాజ్యంలో ఉన్నతస్థితిని పొందుతారని నిశ్చయించుకోవచ్చు.”5

ఉన్నతస్థితి యొక్క దీవెనలు ఏవి? భార్యాభర్తలుగా కలిసి నిత్యత్వము కోసం దేవుని సన్నిధిలో నివసించడం, వారసత్వంగా “సింహాసనాలు, రాజ్యాలు, ప్రభుత్వములు మరియు అధికారములు, … మరియు ఎప్పటికీ సంతానమును కలిగియుండి, నిరంతరము కొనసాగడం”6 మరియు తండ్రి అయిన దేవుడు కలిగియున్న సర్వస్యాన్ని పొందడాన్ని అవి కలిగి ఉన్నాయి.7

ప్రభువు జోసెఫ్ స్మిత్ ద్వారా ఇలా బయల్పరిచారు:

“సిలెస్టియల్ మహిమలో మూడు పరలోకములు లేదా తరగతులు కలవు;

వాటిలో అత్యున్నతమైన దానిని పొందుటకు, ఒక మనుష్యుడు ఈ యాజకత్వపు క్రమములోనికి (అనగా వివాహము యొక్క నూతన మరియు శాశ్వతమైన నిబంధనలోనికి) ప్రవేశించవలెను;

అతడు ఆవిధముగా చేయని యెడల, దానిని అతడు పొందలేడు.

“అతడు మరొకదానిలో ప్రవేశించగలడు గాని, అతని రాజ్యము దానితో అంతమగును; అతడు వృద్ధిని పొందలేడు.”8

ఒకరు సిలెస్టియల్ రాజ్యంలో ఉండవచ్చని లేదా దేవుని సన్నిధిలో నివసించవచ్చని మరియు ఒంటరిగా ఉండవచ్చని మనం ఇక్కడ నేర్చుకుంటాము. కానీ సిలెస్టియల్ రాజ్యం యొక్క అత్యున్నత స్థాయిలో ఉన్నతంగా ఉండాలంటే, ఒకరు సరైన అధికారం ద్వారా వివాహంలోకి ప్రవేశించాలి మరియు ఆ వివాహంలో చేసిన నిబంధనలకు యథార్థంగా ఉండాలి. ఈ నిబంధనలకు మనం విశ్వాసపాత్రంగా ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానము మన వివాహ నిబంధనకు ముద్ర వేయగలదు.9 అలా ముద్రించబడిన దీవెనలు నిలిచియున్న ఫలము అవుతాయి.

వివాహము యొక్క నూతన మరియు శాశ్వతమైన నిబంధనను విశ్వాసంగా పాటించడానికి ఏమి అవసరం?

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఈ శాశ్వతమైన వివాహ నిబంధనలోనికి ప్రవేశించినప్పుడు రెండు రకాల బంధాలు ఉన్నాయని బోధించారు: భార్యాభర్తల మధ్య పార్శ్వ బంధం (పార్శ్వ బంధం అనేది అదే స్థాయిలో ఉన్న ఒకరితో ఒప్పందము) మరియు దేవునిలో నిలువు బంధం (నిలువు బంధం అనేది మొదటి వ్యక్తి కంటే ఉన్నత స్థాయి గలవారితో ఒప్పందము).10 ఉన్నతస్థితి యొక్క దీవెనలు మనపై ముద్రించబడి, ఈ జీవితం తర్వాత కూడా నిలిచివుండాలంటే, నిబంధన యొక్క పార్శ్వ మరియు నిలువు బంధాలపట్ల మనం నిజాయితీగా వుండాలి.

మీ జీవిత భాగస్వామితో పార్శ్వ బంధాన్ని కొనసాగించడానికి “[మీ] భార్యను [లేదా భర్తను] మీ పూర్ణ హృదయంతో ప్రేమించవలెను మరియు … ఆమెను [లేదా అతనిని] తప్ప వేరెవరిని నీవు హత్తుకొనియుండరాదు,”11 అని దేవుడు మనకు ఉపదేశించారు. పెళ్లయిన వారికి, ఆమెను లేదా అతడిని హత్తుకొనియుండటం అంటే అర్థం, మీరు ప్రేమలో కలిసి ఒకరికొకరు సలహాలు ఇస్తారు, మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటారు మరియు శ్రద్ధ వహిస్తారు, బయటి ఆసక్తుల కంటే మీ జీవిత భాగస్వామితో సమయానికి ప్రాధాన్యత ఇస్తారు మరియు మీ బలహీనతలను అధిగమించడంలో మీకు సహాయం చేయమని మీరు దేవుడిని ప్రార్థిస్తారు.12 సరసాలాడుట లేదా డేటింగ్‌తో సహా మీ వివాహానికి వెలుపల ఎలాంటి భావోద్వేగ సాన్నిహిత్యం లేదా లైంగిక సంబంధాలు లేవని మరియు వ్యామోహమును ప్రేరేపించే అశ్లీలత లేదని కూడా దీని అర్థం.13

నిబంధనలో పార్శ్వ బంధాన్ని ఉంచడానికి, ప్రతీ భాగస్వామి వివాహంలో ఉండాలని కోరుకోవాలి. అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ ఇటీవల ఇలా బోధించారు: “అతడు లేదా ఆమె ఇష్టానికి విరుద్ధంగా ఎవరినీ ముద్రవేయు సంబంధానికి ఆయన [దేవుడు] బలవంతం చేయరని కూడా మనకు తెలుసు. నిబంధనలను పాటించే వారందరికీ ముద్ర వేయబడిన సంబంధం యొక్క దీవెనలు హామీ ఇవ్వబడతాయి, అయితే అర్హత లేని లేదా ఇష్టపడని మరొక వ్యక్తితో ముద్రవేయు బంధానికి బలవంతం చేయకూడదు.”14

అధ్యక్షులు నెల్సన్ సూచించిన నిలువు బంధం ఏమిటి? నిలువు బంధం మనం దేవునితో చేసుకున్నది.

దేవునితో నిలువు బంధాన్ని ఉంచుకోవడానికి, విధేయత, త్యాగం, సువార్త, పవిత్రత మరియు సమర్పణ చట్టాలకు సంబంధించి మనం చేసిన దేవాలయ నిబంధనలకు మనం యథార్థంగా ఉండాలి. మన శాశ్వతమైన సహవాసిని స్వీకరించడానికి మరియు నీతివంతమైన జీవిత భాగస్వామిగా మరియు తల్లిదండ్రులుగా ఉండటానికి కూడా మనము దేవునితో నిబంధన చేస్తాము. మనము నిలువు బంధాన్ని పాటించినపుడు, అబ్రాహాము నిబంధన ద్వారా దేవుని కుటుంబంలో భాగమయ్యే దీవెనలకు మనము అర్హత పొందుతాము, అందులో వంశ క్రమము, సువార్త మరియు యాజకత్వం యొక్క దీవెనలు ఉన్నాయి.15 ఈ దీవెనలు కూడా నిలిచియుండు ఫలమే.

నూతన మరియు శాశ్వతమైన నిబంధనలోనికి ప్రవేశించే వారందరూ యథార్థంగా ఉంటారని మరియు నిత్యత్వమంతటి కోసం వారిపై దీవెనలు ముద్రించబడతాయని మేము ఆశిస్తున్నాము, కొన్నిసార్లు ఆ లక్ష్యం మనకు అందనిదిగా కనిపిస్తుంది. నా పరిచర్య అంతటా నేను నిబంధనలు చేసే మరియు పాటించే సభ్యులను ఎదుర్కొన్నాను, కానీ వారి జీవిత భాగస్వామి అలా చేయరు. మర్త్యత్వములో ఎన్నడూ వివాహం చేసుకునే అవకాశం లేక ఒంటరిగా ఉన్నవారు కూడా ఉన్నారు. మరియు వారి వివాహ నిబంధనలలో నమ్మకంగా లేని వారు కూడా ఉన్నారు. ఈ ప్రతీఒక్క పరిస్థితులలో వ్యక్తులకు ఏమి జరుగుతుంది?

  1. మీరు వరము పొందినపుడు మీరు చేసిన నిబంధనలకు మీరు నమ్మకంగా ఉంటే, మీ జీవిత భాగస్వామి అతడి లేదా ఆమె నిబంధనలను ఉల్లంఘించినప్పటికీ లేదా వివాహం నుండి వైదొలిగినప్పటికీ, వరములో మీకు వాగ్దానమివ్వబడిన వ్యక్తిగత దీవెనలను మీరు పొందుతారు. మీరు ముద్రవేయబడి, తర్వాత విడాకులు తీసుకున్నట్లయితే మరియు మీ ముద్ర రద్దు చేయబడకపోతే, మీరు విశ్వాసపాత్రంగా ఉన్నట్లయితే ఆ ముద్ర యొక్క వ్యక్తిగత దీవెనలు మీ కోసం అమలులో ఉంటాయి.16

    కొన్నిసార్లు, నమ్మకద్రోహం మరియు నిజమైన బాధ కలిగించే భావాల కారణంగా, నమ్మకమైన జీవిత భాగస్వామి నమ్మకద్రోహియైన తన జీవిత భాగస్వామితో భూమిపై మరియు నిత్యత్వము కోసం వీలైనంత దూరంగా ఉండటానికి తమ ముద్రను రద్దు చేసుకోవాలనుకోవచ్చు. మీరు పశ్చాత్తాపపడని మాజీ జీవిత భాగస్వామితో ఎలాగైనా ముడిపడి ఉంటారేమోనని ఆందోళన చెందుతుంటే, గుర్తుంచుకోండి, మీరు అలా వుండరు! అతని లేదా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా నిత్యత్వము అంతటా ముద్ర వేయబడిన సంబంధంలో ఉండాలని దేవుడు ఎవరినీ కోరరు. మన కోరికలు మరియు ఎంపికలు అనుమతించే ప్రతీ ఆశీర్వాదాన్ని మనం పొందుతామని పరలోక తండ్రి నిశ్చయపరుస్తారు.17

    అయినప్పటికీ, ఇంకా ముద్ర రద్దు చేయబడాలి అనుకుంటే, కర్తృత్వము గౌరవించబడుతుంది. కొన్ని విధానాలను అనుసరించవచ్చు. అయితే ఇది మామూలుగా చేయకూడదు! ప్రథమ అధ్యక్షత్వము భూమిపై మరియు పరలోకములో బంధించడానికి తాళపుచెవులను కలిగియున్నారు ప్రథమ అధ్యక్షత్వము ముద్ర రద్దును మంజూరు చేసిన తర్వాత, ఆ ముద్రకు సంబంధించిన దీవెనలు అమలులో ఉండవు; అవి పార్శ్వంగా మరియు నిలువుగా రద్దు చేయబడతాయి. ఉన్నతస్థితి యొక్క దీవెనలను పొందాలంటే, ఈ జీవితంలో లేదా తదుపరి జీవితంలో ఈ నూతన మరియు శాశ్వతమైన నిబంధనలోకి ప్రవేశించడానికి మరియు నమ్మకంగా పాటించటానికి సిద్ధంగా ఉన్నామని మనం చూపాలి.

  2. సంఘములో ఒంటరి సభ్యులుగా ఉన్నవారు దయచేసి గుర్తుంచుకోండి, “ప్రభువు యొక్క సొంత విధానంలో మరియు సమయములో, ఆయన నమ్మకమైన పరిశుద్ధుల నుండి ఎటువంటి ఆశీర్వాదాలు నిలిపివేయబడవు. ప్రభువు ప్రతీ వ్యక్తిని వారి హృదయపూర్వక [కోరికలతో] పాటు క్రియల ప్రకారం తీర్పు తీర్చును మరియు బహుమానమిచ్చును.”18

  3. మీరు దేవాలయ నిబంధనలపట్ల నమ్మకంగా ఉండకపోతే, నిరీక్షణ ఉందా? అవును! యేసు క్రీస్తు యొక్క సువార్త నిరీక్షణ యొక్క సువార్త! ఆ నిరీక్షణ యేసు క్రీస్తు ద్వారా నిష్కపటమైన పశ్చాత్తాపంతో మరియు విధేయతతో క్రీస్తు బోధలను అనుసరించుట ద్వారా వస్తుంది. వ్యక్తులు ఘోరమైన తప్పులు చేయడం, పరిశుద్ధమైన నిబంధనలను ఉల్లంఘించడం నేను చూశాను. నిజాయితీగా పశ్చాత్తాపపడి, క్షమించబడి, నిబంధన మార్గానికి తిరిగి వచ్చేవారిని నేను క్రమం తప్పకుండా చూస్తాను. మీరు మీ దేవాలయ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే, యేసు క్రీస్తు వైపు తిరగమని, మీ బిషప్పువద్ద సలహా పొందమని, పశ్చాత్తాపపడి, యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం కారణంగా లభించే శక్తివంతమైన స్వస్థత శక్తికి మీ ఆత్మను తెరవమని నేను మిమ్మల్ని కోరుతున్నాను.

సహోదర సహోదరీలారా, మన ప్రేమగల పరలోక తండ్రి మనకు నిబంధనలను ఇచ్చారు, తద్వారా ఆయన మన కోసం ఉంచిన అన్నింటికి మనకు ప్రాప్యత ఉంటుంది. దేవుని నుండి వచ్చిన ఈ పరిశుద్ధమైన ఆశీర్వాదాలు భూసంబంధమైన పండ్లన్నింటి కంటే చాలా రుచికరమైనవి. మన దేవాలయ ఒప్పందాలకు మనం నమ్మకంగా ఉన్నప్పుడు అవి మన కోసం శాశ్వతంగా భద్రపరచబడతాయి మరియు నిలిచియుండే ఫలముగా మారతాయి.

దేవుడు భూమిపై బంధించే అధికారాన్ని పునఃస్థాపించారు కాబట్టి, అది పరలోకంలో బంధింపబడుతుందని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆ అధికారం యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘములో కనుగొనబడింది. ఇది ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహము చేత నిర్వహించబడుతుంది మరియు అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఆధ్వర్యంలో అమలు చేయబడుతుంది. వివాహం యొక్క నూతన మరియు శాశ్వతమైన నిబంధనలోకి ప్రవేశించి, ఆ నిబంధనను కొనసాగించే వారు తమ నియంత్రణకు మించిన పరిస్థితులతో సంబంధం లేకుండా పరిపూర్ణంగా మారి మరియు చివరికి తండ్రి మహిమ యొక్క సంపూర్ణతను పొందగలరు.19

మన నిబంధనలకు సంబంధించి వాగ్దానము చేయబడిన ఈ ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానము ద్వారా మనపై ముద్రించబడతాయి మరియు శాశ్వతంగా ఎప్పటికీ నిలిచియుండు ఫలముగా మారతాయి. ఆవిధంగా నేను యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. యోహాను 15:16.

  2. డేల్ జి. రెన్‌లండ్, “నిబంధనల ద్వారా దేవుని శక్తి పొందుట,” లియహోనా 2023 మే, 35–38; సిద్ధాంతము మరియు నిబంధనలు 132:7 చూడండి.

  3. ఒక విధి పరలోకంలో మరియు భూమిపై చలామణిలో ఉన్నప్పుడు అది ముద్ర వేయబడుతుంది, ఎందుకంటే అది అధికారం ఉన్న వ్యక్తిచే నిర్వహించబడుతుంది మరియు పరిశుద్ధాత్మచే ధృవీకరించబడుతుంది.

    “ముద్రవేయు అధికారము అనేది కొన్ని దేవాలయ విధులకు మాత్రమే వర్తిస్తుందని మనము భావిస్తాము, అయితే మరణం దాటి ఏవైనా విధులు చలామణి అయ్యేలా చేయడానికి మరియు బంధింపబడి ఉండటానికి ఆ అధికారం అవసరం. ఉదాహరణకు, ముద్రవేయు శక్తి మీ బాప్తిస్మంపై చట్టబద్ధత యొక్క ముద్రను అనుగ్రహిస్తుంది, ఇది ఇక్కడ మరియు పరలోకములో గుర్తించబడుతుంది. అంతిమంగా, అన్ని యాజకత్వ విధులు సంఘ అధ్యక్షుడి తాళపుచెవుల క్రింద నిర్వహించబడతాయి మరియు అధ్యక్షులు జోసెఫ్ ఫీల్డింగ్ స్మిత్ వివరించినట్లుగా, ‘ఆయన [సంఘ అధ్యక్షుడు] మాకు అధికారం ఇచ్చారు, ఆయన మన యాజకత్వంలో ముద్రవేయు శక్తిని ఉంచారు, ఎందుకంటే ఆయన ఆ తాళపుచెవులను కలిగియున్నారు’ [quoted by Harold B. Lee, in Conference Report, Oct. 1944, 75]” (డి. టాడ్ క్రిస్టాఫర్‌సన్, “ముద్రవేయు శక్తి,” లియహోనా, నవ. 2023, 20).

    “పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానము చేత ముద్రించబడిన ఒక కార్యము పరిశుద్ధాత్మచే ధ్రువీకరించబడింది; అదియే ప్రభువుచేత ఆమోదించబడినది. … ఎవరూ పరిశుద్ధాత్మతో అబద్ధమాడలేరు మరియు గుర్తించబడకుండా ఉండరు. … ఈ సూత్రాలు సంఘములోని ప్రతీ ఇతర విధి మరియు పనితీరుకు కూడా వర్తిస్తాయి. ఆ విధంగా [ఒక వివాహంలో] రెండు పక్షాలు న్యాయమైనవి మరియు నిజమైనవి’ [సిద్ధాంతము మరియు నిబంధనలు 76:53] అయితే, వారు అర్హులైనట్లయితే, వారి దేవాలయ వివాహంపై ఒక ఆమోద ముద్ర వేయబడుతుంది; వారు అయోగ్యులైతే, వారు ఆత్మ ద్వారా సమర్థించబడరు మరియు పరిశుద్ధాత్మ యొక్క ధ్రువీకరణ నిలిపివేయబడుతుంది. తదుపరి యోగ్యత ముద్రను అమలులోకి తెస్తుంది మరియు అవినీతి ఏదైనా ముద్రను విచ్ఛిన్నం చేస్తుంది” (Bruce R. McConkie, “Holy Spirit of Promise,” in Preparing for an Eternal Marriage Student Manual [2003], 136).

    పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానమే ప్రతి విధిపై ఆమోద ముద్రను వేసే పరిశుద్ధాత్మ: బాప్తిస్మము, నిర్ధారణ, నియామకము, వివాహం. విశ్వాసం ద్వారా దీవెనలు లభిస్తాయనేది ఆ వాగ్దానం. ఒక వ్యక్తి నిబంధనను ఉల్లంఘిస్తే, అది బాప్తిస్మము, నియామకము, వివాహం లేదా మరేదైనా సరే, ఆత్మ ఆమోద ముద్రను ఉపసంహరించుకుంటుంది మరియు ఆశీర్వాదాలు పొందబడవు. విశ్వసనీయత ఆధారంగా ప్రతిఫలం యొక్క వాగ్దానంతో ప్రతీ విధి ముద్ర వేయబడింది. నిబంధనలు ఉల్లంఘించబడిన చోట పరిశుద్ధాత్మ ఆమోద ముద్రను ఉపసంహరించుకుంటుంది” (Joseph Fielding Smith, Doctrines of Salvation, comp. Bruce R. McConkie [1954], 1:45).

  4. Russell M. Nelson, Heart of the Matter: What 100 Years of Living Have Taught Me (2023), 15. మృతుల పునరుత్థానము తరువాత సామర్థ్యము కావాలంటే, అన్ని నిబంధనలు పరిశుద్ధాత్మ వాగ్దానము ద్వారా ముద్ర వేయబడాలి” (సిద్ధాంతము మరియు నిబంధనలు 132:7 చూడండి).

  5. Russell M. Nelson, “Celestial Marriage,” Liahona, Nov. 2008, 94.

  6. సిద్ధాంతము మరియు నిబంధనలు 132:19.

  7. సిద్ధాంతము మరియు నిబంధనలు 84:38 చూడండి.

  8. సిద్ధాంతము మరియు నిబంధనలు 131:1–4.

  9. సిద్ధాంతము మరియు నిబంధనలు 132:19–20 చూడండి. ఆ అత్యున్నత గమ్యస్థానం—సిలెస్టియల్ రాజ్యములో ఉన్నతస్థితి అనేది యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క కేంద్రము” (డాలిన్ హెచ్. ఓక్స్, “మహిమ రాజ్యములు,” లియహోనా, నవ. 2023, 26).

  10. “వివాహాలు మరియు కుటుంబాలు ఒక ప్రత్యేక ప్రేమను సృష్టించే ప్రత్యేకమైన పార్శ్వ బంధాన్ని పంచుకున్నట్లే, నూతన మరియు శాశ్వతమైన వివాహ నిబంధనలో మనం ప్రవేశించినప్పుడు, దేవునికి నిలువు నిబంధన ద్వారా మనల్ని మనం బంధించినప్పుడు క్రొత్త సంబంధం ఏర్పడుతుంది” ( Russell M. Nelson, Heart of the Matter, 41–42).

  11. సిద్ధాంతము మరియు నిబంధనలు 42:22; ప్రధాన చేతి పుస్తకం: యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము‌లో సేవ చేయుట, 38.6, 16 కూడా చూడండి ఇక్కడ వివాహాన్ని చర్చిస్తున్నప్పుడు, నేను దేవుని చట్టం ప్రకారం వివాహాన్ని సూచిస్తున్నాను, ఇది వివాహాన్ని పురుషుడు మరియు స్త్రీ మధ్య చట్టబద్ధమైన మరియు న్యాయమైన కలయికగా నిర్వచిస్తుంది (”కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన,” సువార్త గ్రంథాలయం చూడండి).

  12. కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన,” సువార్త గ్రంథాలయం చూడండి.

  13. సిద్ధాంతము మరియు నిబంధనలు 42:22–24 చూడండి.

  14. డాలిన్ హెచ్. ఓక్స్, “మహిమ రాజ్యములు,” 29; వివరణ చేర్చబడింది.

  15. సిద్ధాంతము మరియు నిబంధనలు 86:8–11; 113:8; అబ్రాహాము 2:9–11 చూడండి.

  16. ప్రధాన చేతి పుస్తకం, 38.4.1 చూడండి.

    నేను స్విట్జర్లాండ్‌లో పూర్తి-కాల సువార్త సేవ చేస్తున్నప్పుడు, నా సహచరుడు మరియు నేను 60 ఏళ్ల అద్భుతమైన స్విస్ జంటతో సువార్తను పంచుకున్నాము. పునఃస్థాపించబడిన యేసు క్రీస్తు సంఘము గురించి మేము ఈ జంటకు బోధిస్తున్నప్పుడు, మేము బోధిస్తున్నదానిపై ఆ స్త్రీ గొప్ప ఆసక్తిని కనబరిచింది. తరువాతి కొన్ని వారాల్లో, దేవుని నుండి సరైన అధికారంతో యేసు క్రీస్తు యొక్క సంఘము పునఃస్థాపించబడిందని, జీవించి ఉన్న ప్రవక్తలు మరియు అపొస్తలుల ద్వారా యేసు క్రీస్తు తన సంఘమును నిర్దేశిస్తారనే వాస్తవికత యొక్క సాక్ష్యాన్ని ఆమె పొందింది. పునఃస్థాపన యొక్క అత్యంత ఉత్కృష్టమైన సిద్ధాంతాలలో ఒకటైన శాశ్వత వివాహానికి అవకాశం గురించి ఈ జంటకు బోధించడానికి మేము ఎదురుచూస్తున్నాము. అయితే ఆశ్చర్యకరంగా, మేము ఈ దంపతులకు నిత్య వివాహం యొక్క సిద్ధాంతం గురించి బోధిస్తున్నప్పుడు, స్విస్ మహిళ తన భర్తతో నిత్యత్వమంతా కలిసిగా ఉండటానికి ఆసక్తి లేదని వ్యాఖ్యానించింది. ఆమెకు, పరలోకం అంటే తాను 36 సంవత్సరాలుగా వివాహబంధంలో ఉన్న భర్తతో కలిసుండటం కాదు. ఈ సోదరి బాప్తిస్మం తీసుకుంది, కానీ ఆమె భర్త బాప్తిస్మం తీసుకోలేదు. వారు దేవాలయంలో ఎప్పుడూ ముద్ర వేయబడలేదు.

    అయితే, చాలామందికి, వారు వివాహం చేసుకున్న వ్యక్తి లేకుండా పరలోకం పరలోకముగా ఉండదు. మీరు ప్రేమించిన జీవిత భాగస్వామితో శాశ్వతంగా ఉండడం, నిజంగా పరలోకంలా అనిపిస్తుంది. ఎల్డర్ జెఫ్రీ హాలండ్ తన ప్రియమైన భార్య పాట్ గురించి పంచుకున్నట్లుగా, “ఆమె లేకుండా పరలోకం పరలోకంగా ఉండదు” (see “Scott Taylor: For Elder Holland, Heaven without His Wife and Children ‘Wouldn’t Be Heaven for Me,’” Church News, July 22, 2023, thechurchnews.com).

  17. డాలిన్ హెచ్. ఓక్స్, “మహిమ రాజ్యములు,” 26.

  18. Russell M. Nelson, “Celestial Marriage,” 94.

  19. యోహాను 15:16 చూడండి.