సర్వసభ్య సమావేశము
దేవాలయాలు, భూమి అంతటా నిర్మించబడుతున్న ప్రభువు మందిరాలు
2024 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


దేవాలయాలు, భూమి అంతటా నిర్మించబడుతున్న ప్రభువు మందిరాలు

మీరు ఆయన పరిశుద్ధ మందిరానికి యోగ్యతతో మరియు ప్రార్థనతో వచ్చినప్పుడు, మీరు ఆయన శక్తి ద్వారా బలపరచబడతారు.

మనము ఇప్పుడే పాడిన అందమైన పదాలు మీకు నచ్చలేదా? “నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేస్తాను మరియు నిన్ను నిలబెడతాను, … నా నీతియుకమైన, సర్వశక్తిగల హస్తం చేత ఆదరిస్తాను.”1 తన పరిశుద్ధ మందిరానికి వచ్చినప్పుడు ప్రభువు అన్ని వయస్సుల పరిశుద్ధులను బలపరుస్తున్నారు. కిన్షాసా, జోల్లికోఫెన్, ఫుకుయోకా నుండి ఓక్లాండ్ వరకు యువత తమ స్వంత చొరవతో రావటం వలన దేవాలయ బాప్తిస్మపు తొట్టెలు నిండిపోయాయి. గతంలో, అత్యంత ప్రియమైన విధి పనివారు నెరిసిన జుట్టును కలిగి ఉన్నారు—కానీ ఇకపై అలా కాదు. పిలువబడిన సువార్తికులు, సేవా సువార్తికులు మరియు తిరిగి వచ్చిన సువార్తికులు ప్రతీ మూలలో ఉన్నారు. ప్రపంచమంతటా, మనలను ప్రభువు మందిరానికి ఆకర్షించే అనుభూతి పెరుగుతోంది.

కేవలం ఒక సంవత్సరం క్రితం, 70 సంవత్సరాలుగా సువార్తికులచే బోధించబడిన అమెరికాలోని తూర్పు తీరంలో నివసిస్తున్న 95 సంవత్సరాల వయస్సు గల ఒక ప్రియమైన కుటుంబ స్నేహితురాలు తన కుమార్తెతో, “నేను మీతో పాటు దేవాలయానికి వెళ్లాలనుకుంటున్నాను” అని చెప్పింది.

ఆమె కుమార్తె, “అమ్మా, ముందు నువ్వు బాప్తిస్మము తీసుకోవాలి” అని జవాబిచ్చింది.

చిత్రం
వృద్ధ సోదరి యొక్క బాప్తిస్మము.

“సరే, నేను బాప్తిస్మము తీసుకోవాలనుకుంటున్నాను” అని ఆమె బదులిచ్చింది. ఆమె బాప్తిస్మం పొందింది. కొన్ని రోజుల తరువాత, ఆమె భక్తిపూర్వకంగా దేవాలయ బాప్తిస్మపు తొట్టెలోకి ప్రవేశించింది. కేవలం ఒక నెల క్రితం, ఆమె తన స్వంత వరము అందుకుంది. “దేవుని జ్ఞానం మరియు శక్తి విస్తరిస్తోంది: భూమిపై ఉన్న తెర చిరిగిపోవడం ప్రారంభించింది”2

చిత్రం
దేవాలయము బయట వృద్ధ సోదరి.

ఇప్పుడు భూమి అంతటా తన పరిశుద్ధ దేవాలయాలను నిర్మించమని ప్రభువు తన ప్రవక్తను ఎందుకు నిర్దేశిస్తున్నారో మీరు ఆలోచించారా?3 ఈ నిర్దిష్ట సమయంలో, తన నిబంధన జనులకు వారి పవిత్రమైన దశమభాగాల ద్వారా, వందలకొద్దీ ప్రభువు యొక్క మందిరాలను నిర్మించడానికి అవసరమైన ఐశ్వర్యమును ఆయన ఎందుకు ఇస్తారు?

ఈ ఉదయం, అధ్యక్షుడు డాలిన్ హెచ్. ఓక్స్ ప్రపంచవ్యాప్తంగా నిర్మించబడుతున్న దేవాలయాల అందమైన దృశ్యాన్ని చూపించారు. కాథీ మరియు నేను ఇటీవల ఫిలిప్పీన్స్‌లో ఉన్నాము. ఈ అద్భుతం గురించి ఆలోచించండి: మనీలా దేవాలయం 1984లో ప్రతిష్ఠించబడింది. ఇది 2010లో సిబూ నగరములోని రెండవ దేవాలయం పూర్తి కావటానికి 26 సంవత్సరాల ముందు. ఇప్పుడు, 14 సంవత్సరాల తరువాత, 11 దేవాలయాలు నిర్మించబడ్డాయి, రూపకల్పన చేయబడ్డాయి లేదా ప్రతిష్ఠాపనకు సిద్ధపరచబడ్డాయి. ఉత్తరం నుండి దక్షిణం వరకు: లావోగ్, టుగెగరావ్, శాంటియాగో, ఉర్దానేటా, అలబాంగ్, నాగా, టాక్లోబన్ నగరము, ఇలోయిలో, బాకోలోడ్, కగాయన్ డి ఓరో మరియు దావో. దేవుని అద్భుత కార్యాలు చూడటానికి అద్భుతమైనవి, ఆశ్చర్యకరమైనవి!

చిత్రం
ఫిలిప్పీన్స్‌లోని దేవాలయాలు.

ప్రపంచవ్యాప్తంగా, దేవుని మందిరాలు మనకు దగ్గరగా వస్తున్నాయి. మన కాలములో ఎందుకు?

కడవరి దినములు

అంత్యదినములలో దేశములలో దుఃఖము కలుగునని,4 మనుష్యులు “స్వార్థ ప్రియులవుతారని,”5 “అన్ని సంగతులు సంక్షోభములోనుండునని,”6 గందరగోళం ఎక్కువగా ఉంటుందని7 మరియు “మనుష్యులు ధైర్యము చెడి కూలుదురని”8 ప్రభువు హెచ్చరించారు. పురుషులు మరియు స్త్రీల హృదయాలు వారిని కూల్చడాన్ని మనం ఖచ్చితంగా చూశాము: ప్రాపంచిక నయవంచన, ఆకర్షణీయమైన స్వరాల పరధ్యానం, ఆత్మీయ పోషణను నిర్లక్ష్యం చేయడం, శిష్యరికపు ఆవశ్యకాలపై అలసట.9 ఒకప్పుడు యేసు క్రీస్తునందు తనకున్న విశ్వాసం గురించి నిజాయితీగా మాట్లాడి, మోర్మన్ గ్రంథము గురించి సాక్ష్యమిచ్చి, దేవుని రాజ్యాన్ని నిర్మించడంలో ఆతృతగా సహాయంచేసి, ప్రస్తుతానికి, కనీసం సంఘముపైనున్న అతని లేదా ఆమె నమ్మకాలకు కూడా దూరంగా ఉంటున్న మీ ప్రియమైన వ్యక్తిని చూసి మీరు బాధపడి ఉండవచ్చు. మీకు నా సలహా ఏమిటంటే, నిరాశ చెందవద్దు! అంతా సవ్యంగా ఉంటుంది! దేవునికి, ఏదీ అసాధ్యం కాదు.10

ప్రవచించబడిన ఈ అల్లోకల్లోలములు మరియు లోకంలోని అవిశ్వాసముతో, నిబంధన జనులు ఉంటారని, ఆయన తిరిగి రావడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రజలు ఉంటారని; పరిశుద్ధ స్థలాలలో నిలబడి తమ చోటు నుండి కదలక నిలిచియుండు ప్రజలు ఉంటారని11 ప్రభువు వాగ్దానం చేసారు. అపవాది యొక్క వంచనను ఎదిరించి, వారి విశ్వాసాన్ని క్రమశిక్షణలో పెట్టి, సిలెస్టియల్‌గా ఆలోచిస్తూ, రక్షకుడైన యేసు క్రీస్తునందు పూర్తిగా విశ్వాసముంచే నీతిగల జనుల గురించి ఆయన చెప్పారు.

ఇప్పుడు ప్రభువు తన వందలాది దేవాలయాలను మనకు దగ్గరగా ఎందుకు తీసుకొస్తున్నారు? ఒక కారణం ఏమిటంటే, ప్రపంచంలోని కల్లోలం మరియు శోధనల మధ్య, ఆయన తన నిబంధన పరిశుద్ధులను బలపరుస్తానని మరియు దీవిస్తానని వాగ్దానం చేసారు.

కర్ట్‌లాండ్ దేవాలయం నుండి వాగ్దానాలు

ఈ పరిశుద్ధ గృహాలు మనల్ని ఎలా బలపరుస్తాయి, ఓదారుస్తాయి మరియు రక్షిస్తాయి? కర్ట్‌లాండ్ దేవాలయ ప్రతిష్ఠాపన సమయములో ప్రవక్త జోసెఫ్ స్మిత్ యొక్క అభ్యర్థనలలో మనకు ఒక సమాధానం లభిస్తుంది. “మేము పాడతాము మరియు మేము పరలోక సైన్యాలతో కేకలు వేస్తాము” అని పరిశుద్ధులు మొదటిసారి పాడింది ఈ దేవాలయంలోనే.”12 రక్షకుడు స్వయంగా ప్రత్యక్షమయ్యారు మరియు ప్రాచీన ప్రవక్తలు తిరిగి వచ్చారు, పునఃస్థాపించబడిన సువార్తకు అదనపు యాజకత్వ తాళపుచెవులను అనుగ్రహించారు.13

కర్టలాండ్ దేవాలయములో ఆ పవిత్రమైన సందర్భంలో, ప్రభువు యొక్క పరిశుద్ధ మందిరములో, యేసు క్రీస్తు నామమును వారిపై తీసుకొని, పరిశుద్ధులు దేవుని శక్తిని ఆయుధములుగా ధరించుకొని, ఆయన దూతల ఆజ్ఞను వారు కలిగియుండాలని మరియు వారు ప్రభువులో ఎదిగి, పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణతను పొందాలని ప్రవక్త ప్రార్థించారు.14 ప్రభువు మందిరములో మనం విశ్వాసంగా ఆరాధించినప్పుడు ఈ శక్తివంతమైన మనవులు మన జీవితంలో నెరవేరుతాయి.

శక్తితో ఆయుధాలు ధరించారు

ఆయన మందిరములో, మనం వాస్తవంగా పరలోక శక్తితో వరమివ్వబడతాము.15 యేసు క్రీస్తునందు మన విశ్వాసం మరియు ఆయన పట్ల మనకున్న ప్రేమ ధృవీకరించబడుతుంది మరియు బలపరచబడుతుంది. మన నిజమైన గుర్తింపు మరియు జీవిత ఉద్దేశాల గురించి మనకు ఆత్మీయంగా భరోసా ఇవ్వబడుతుంది.16 మనం విశ్వాసపాత్రంగా ఉన్నప్పుడు శోధనలు మరియు పరధ్యానాల నుండి రక్షణతో మనం దీవించబడతాము. మన కష్టాలు మరియు మన బాధల నుండి ఆయన మనలను లేవనెత్తినప్పుడు మన రక్షకుని ప్రేమను మనం అనుభవిస్తాము. మనము దేవుని శక్తిని ఆయుధములుగా ధరించుకొనియున్నాము.

ఆయన నామము మనపై ఉంది

ఆయన పవిత్ర మందిరములో, మనం ఆయన నామమును మరింత పూర్తిగా మనపైకి తీసుకుంటాము. మనము బాప్తిస్మము పొందినప్పుడు, ఆయనపై మనకున్న నమ్మకాన్ని మరియు ఆయన ఆజ్ఞలను పాటించడానికి మన సుముఖతను తెలియజేస్తాము. దేవాలయంలో, మన నిబంధనల ద్వారా, ఆయనను ఎప్పటికీ అనుసరిస్తామని పవిత్రంగా వాగ్దానం చేస్తాము.

చిత్రం
హీబర్ వ్యాలీ యూటా దేవాలయం యొక్క వర్ణన.

ఈ సంఘములోని యువత అద్భుతంగా ఉన్నారు. ఈ కష్టమైన లోకంలో, వారు క్రీస్తు నామాన్ని తమపైకి తీసుకుంటారు. యూటాలోని హీబర్ పట్టణంలో, దేవాలయ నిర్మాణ ప్రణాళికకు సంబంధించిన వివరాలను చర్చించడానికి బహిరంగ సమావేశం జరిగింది. ప్రస్తావించబడిన దేవాలయానికి తమ మద్దతును తెలియజేయడానికి వచ్చిన మూడు వందలమంది యువతచేత పక్కనే ఉన్న పార్కు నిండిపోయింది. ఒక యువకుడు, బహిరంగ వేదికలో ప్రభుత్వ నాయకులతో మాట్లాడుతూ, ధైర్యంగా ఇలా వివరించాడు, “నేను దేవాలయంలో వివాహం చేసుకోవాలని ఆశిస్తున్నాను. నన్ను నేను శుద్ధిగా మరియు పరిశుద్ధంగా ఉంచుకోవడానికి [దేవాలయం నాకు సహాయం చేస్తుంది]. మరొకరు ఈ దేవాలయాన్ని వెలుగు మరియు నిరీక్షణ యొక్క చిహ్నంగా వర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నసంఘములోని యువతీ యువకులు యేసు క్రీస్తు నామాన్ని స్వీకరిస్తున్నారు.17

చిత్రం
హీబర్ పట్టణంలో పార్కును నింపుతున్న యువత.

దేవదూతలు మన మధ్యనున్నారు

కర్ట్‌లాండ్ దేవాలయంలో, “దేవదూతలు [ఆయన పరిశుద్ధుల యెడల] ఆజ్ఞను కలిగియుండాలని” ప్రవక్త జోసెఫ్ ప్రార్థించారు.”18 మన పూర్వీకుల కొరకు దేవాలయములో నిరంతరం విధులను నిర్వహించడం తెరను దాటి జీవితం కొనసాగుతుందనే మధురమైన మరియు ఖచ్చితమైన ధృవీకరణను తెస్తుందని నా దృఢ విశ్వాసం.

ప్రభువు మందిరంలో మనకుగల అనేక అనుభవాలు బహిరంగంగా పంచుకోలేనంత పరిశుద్ధమైనవి అయినప్పటికీ, కొన్నింటిని మనం పంచుకోవచ్చు. నలభై సంవత్సరాల క్రితం, ఫ్లోరిడాలో నివసిస్తుండగా, కాథీ, నేను జార్జియా, అట్లాంటాలోని దేవాలయానికి ప్రయాణించాము. 1984, మే 9, బుధవారం రాత్రి, మేము దేవాలయములో ఒక సమావేశమును పూర్తి చేస్తున్నప్పుడు, విధి పనివారు ఒకరు నన్ను సంప్రదించి, కేవలం ఒక ఆరంభపు సిద్ధపాటు విధి చేయడానికి నాకు సమయం ఉందా అని అడిగారు. నేను ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి పేరు అసాధారణమైనది. ఆయన పేరు ఎలీజర్ సెర్సీ.

మరుసటి రోజు దేవాలయమంతా పరిశుద్ధులతో నిండిపోయింది. నేను ఆ రోజు నా రెండవ వరమును నిర్వహించడానికి సిద్ధమైనప్పుడు, నేను ప్రాతినిధ్యం వహించే వ్యక్తి పేరు నాకు ఇవ్వబడింది. ఆశ్చర్యకరంగా, ముందు రాత్రి నాకు ఇవ్వబడి అదే వ్యక్తి పేరు, ఎలీజర్ సెర్సీ. వరము పూర్తి అయినప్పుడు నేను ప్రభువు యొక్క ఆత్మను అనుభూతిచెందాను. మధ్యాహ్నం తరువాత, మేము ఇంకా దేవాలయములో వుండగా, ఇప్పుడు అట్లాంటాలో నివసిస్తున్న వృద్ధురాలు, కుటుంబ స్నేహితురాలైన, సహోదరి డాలీ ఫెర్నాండెజ్‌ని కాథీ చూసింది. తన కుటుంబంలోని మగ సభ్యులెవరూ తనతో లేకపోవడంతో, ఆమె తన తండ్రి యొక్క తల్లిదండ్రులతో తన తండ్రిని ముద్ర వేయడంలో నన్ను సహాయం చేయమని అడిగింది. నేను గౌరవంగా భావించాను.

ఈ పవిత్రమైన విధి కొరకు నేను బలిపీఠం చివర మోకరిల్లినప్పుడు, నా మనస్సులో ఇప్పుడు లిఖించబడిన పేరు, ఆమె తండ్రి, ఎలీజర్ సెర్సీ అని నేను మరోసారి విన్నాను. ఈ జీవితం తరువాత, అతని మర్త్య జీవితంలో ఎలీజర్ సెర్సీ అని పిలువబడే వ్యక్తిని నేను కలుసుకుంటానని మరియు ఆలింగనం చేసుకుంటానని నేను పూర్తిగా నమ్ముతున్నాను.

ప్రభువు మందిరంలో మనకుగల అనేక అనుభవాలు చాలావరకు నాటకీయ జోక్యానికి మించి ఆనందకరమైన శాంతిని మరియు ప్రశాంతమైన ప్రత్యక్షతను తీసుకువస్తాయి. కానీ నిశ్చయంగా ఉండండి: దేవదూతలు మనపై ఆజ్ఞ కలిగి ఉంటారు!

పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణత

మనము సంఘ సభ్యునిగా ధృవీకరించబడినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క బహుమతి మనకు ఇవ్వబడుతుంది. ప్రతీ వారం మన రక్షకుని జ్ఞాపకార్థం మనం రొట్టె మరియు నీటిని యోగ్యతగా తీసుకుంటే, ఆయన ఆత్మ ఎల్లప్పుడూ మనతో ఉంటుందని మనం వాగ్దానం చేయబడ్డాము.19 భూమిపై అత్యంత పరిశుద్ధ స్థలమైన ప్రభువు మందిరానికి మనము సమ్మతిగల హృదయములతో వచ్చినప్పుడు, మనము ప్రభువులో ఎదుగుతాము మరియు “పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణతను పొందుతాము.”20 పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, మనం శాంతి, ఆనందం మరియు చెప్పలేని నిరీక్షణతో నింపబడ్డాము.21 మనం పరిశుద్ధ స్థలాలకు వెలుపల ఉన్నట్లు కనుగొన్నప్పుడు కూడా ఆయన శిష్యులుగా ఉండగలిగే శక్తిని పొందుతాము.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా ప్రకటించారు: “మన రక్షకుడు, విమోచకుడైన యేసు క్రీస్తు, ఇప్పుడు మరియు ఆయన మరలా తిరిగి వచ్చే మధ్య కాలంలో, ఆయన గొప్ప అద్భుతకార్యములలో కొన్నిటిని నెరవేరుస్తారు. తండ్రియైన దేవుడు … యేసు క్రీస్తు ఈ సంఘముపైగా ఘనత, మహిమయందు … అధ్యక్షత్వము వహిస్తారనే అద్భుతమైన సూచనలను మనము చూస్తాము”22 భూమిని ప్రభువు యొక్క మందిరాలతో నింపడం ఒక గొప్ప కార్యము మరియు అద్భుతమైన సూచన.23

నా ప్రియమైన మిత్రులారా, మనం చేయగలిగితే మరియు ఇప్పటికే దేవాలయానికి మన హాజరును పెంచుకోకపోతే, ప్రభువు మందిరంలో ఆరాధించడానికి మనం క్రమంగా ఎక్కువ సమయాన్ని కనుగొందాం. ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడిన దేవాలయాల కొరకు—స్థలాలు కొనుగోలు చేయబడాలని, ప్రభుత్వాలు ప్రణాళికలను ఆమోదించాలని, ప్రతిభావంతులైన పనివారు వారి బహుమానాలను ఘనపరచాలని మరియు ఆ పరిశుద్ధమైన సమర్పణలు పరలోకము యొక్క ఆమోదాన్ని మరియు దేవదూతల సందర్శనను తీసుకురావాలని మనం ప్రార్థిద్దాం.

వాగ్దానాలు

దేవాలయము వాస్తవంగా ప్రభువు యొక్క మందిరము. మీరు ఆయన పవిత్ర మందిరానికి యోగ్యతతో మరియు ప్రార్థనతో వచ్చినప్పుడు, మీరు ఆయన శక్తిని ఆయుధాలుగా కలిగియుంటారని, ఆయన పేరు మీపైన ఉంటుందని, ఆయన దూతలు మీపై ఆజ్ఞను కలిగియుంటారని మరియు మీరు పరిశుద్ధాత్మ దీవెనలో వృద్ధి చెందుతారని నేను మీకు వాగ్దానం చేస్తున్నాను.

ప్రభువు ఇలా వాగ్దానం చేసారు, “తన పాపములను విడిచిపెట్టి, నా నామమును బట్టి ప్రార్థన చేయుచు, నా మాటకు లోబడి, నా ఆజ్ఞలను గైకొని నా యొద్దకు వచ్చు ప్రతీ ఆత్మ నా ముఖమును చూచి, నేను ఉన్నవాడను అని తెలుసుకొనును.”24 క్రీస్తు ముఖాన్ని చూడడానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి మరియు ఆయన పవిత్ర మందిరంలో కంటే ఉత్తమమైన స్థలం మరొకటి లేదు.25

గందరగోళము మరియు అల్లోలకల్లోలములున్న ఈ దినములలో, మన దేవాలయాల్లో ప్రతీ ఒక్కటి ఆయన మందిరమని మరియు మనలను భద్రపరచి, మనలను రక్షించడానికి మరియు తన పవిత్ర దేవదూతలందరితో రక్షకుడు, బలము, శక్తితో మరియు గొప్ప మహిమతో తిరిగి వచ్చే మహిమకరమైన రోజు కోసం మనలను సిద్ధం చేయడానికి సహాయపడుతుందని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. “How Firm a Foundation,” Hymns, no. 85.

  2. “The Spirit of God,” Hymns, no. 2.

  3. ప్రస్తుతం 182 నిర్వహించబడుతున్న దేవాలయాలున్నాయి. ఆరు పునర్నిర్మాణ దశలో ఉన్నాయి. ఏడు దేవాలయాలు ప్రతిష్ఠాపన కోసం ఎదురు చూస్తున్నాయి, మరొకటి పునఃప్రతిష్ఠ కోసం వేచియున్నది. 45 నిర్మాణంలో ఉన్నాయి మరియు 94 ప్రకటించబడ్డాయి లేదా ప్రణాళిక మరియు రూపకల్పనలో ఉన్నాయి.

  4. లూకా 21:10 చూడండి.

  5. 2 తిమోతి 3:2.

  6. సిద్ధాంతము మరియు నిబంధనలు 88:91.

  7. ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ ఇలా అన్నారు: “ఓడను చుక్కాని ఏవిధంగా నడిపిస్తుందో, అదేవిధంగా సువార్త సూత్రాలు మిమ్మల్ని, నన్ను నడిపిస్తాయి. సరైన సూత్రాలు మన మార్గాన్ని కనుగొనటానికి మరియు దృఢంగా, బలంగా మరియు స్థిరంగా నిలబడటానికి వీలు కల్పిస్తాయి, తద్వారా మన సమతుల్యతను కోల్పోకుండా, చీకటి మరియు గందరగోళం అనే కడవరి-దిన తుఫానులలో పడిపోకుండా చేస్తాయి” (“నా సువార్త సూత్రములు,” లియహోనా, మే 2021, 126).

  8. సిద్ధాంతము మరియు నిబంధనలు 45:26.

  9. “ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను” (మత్తయి 16:24).

  10. లూకా 1:37 చూడండి.

  11. సిద్ధాంతము మరియు నిబంధనలు 87:8 చూడండి.

  12. Hymns, no. 2.

  13. సిద్ధాంతము మరియు నిబంధనలు 110 చూడండి. ఈ సమయానికి ముందు, ప్రవక్త జోసెఫ్ స్మిత్ అహరోను యాజకత్వమును మరియు దాని తాళపుచెవులను బాప్తిస్మమిచ్చు యోహాను నుండి పొందాడు మరియు అతను మెల్కీసెదెకు యాజకత్వమును మరియు దాని తాళపుచెవులను అపొస్తలులైన పేతురు, యాకోబు, యోహానుల నుండి పొందాడు (సిద్ధాంతము మరియు నిబంధనలు 13:1; 27:12–13 చూడండి).

  14. సిద్ధాంతము మరియు నిబంధనలు 109:15; 22వ వచనము కూడా చూడండి.

  15. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా అన్నారు: “మన అన్వేషణలో దేవాలయం మనకు సహాయపడగలదు. అక్కడ మనం, సమస్త వివాదానికి ప్రేరేపకుడైన సాతానును జయించడానికి మనకు సామర్థ్యాన్నిచ్చే దేవుని శక్తిని వరంగా పొందుతాము” (“సమాధానపరచువారు కావాలి,” లియహోనా, మే 2023, 101).

  16. See Russell M. Nelson, “Choices for Eternity” (worldwide devotional for young adults, May 15, 2022), Gospel Library.

  17. Elder Colin Stauffer, personal correspondence, Jan. 30, 2024.

  18. సిద్ధాంతము మరియు నిబంధనలు 109:22

  19. సిద్ధాంతము మరియు నిబంధనలు 20:77, 79 చూడండి.

  20. సిద్ధాంతము మరియు నిబంధనలు 109:15.

  21. రోమా 15:13 చూడండి.

  22. రస్సెల్ ఎమ్. నెల్సన్, “సంఘము కొరకు బయల్పాటు, మన జీవితాల కొరకు బయల్పాటు,” లియహోనా, మే 2018, 96.

  23. బ్రిగమ్ యంగ్ ఇలా అన్నారు, “సువార్తను వినడానికి మరియు పాటించడానికి అవకాశం లేకుండా చనిపోయిన వారి కోసం మనం వందల కొద్దీ దేవాలయాలను మరియు అక్కడ పనిచేయడానికి వేలాదిమంది పురుషులను మరియు స్త్రీలను కలిగియున్నాము” (Teaching of the Presidents of the Church: Brigham Young, [1997], 312). మరియు అధ్యక్షుడు ఎజ్రా టాఫ్ట్ బెన్సన్ ఇలా అన్నారు: “ఉత్తర మరియు దక్షిణ అమెరికా, పసిఫిక్ ద్వీపాలు, ఐరోపా మరియు ఇతర ప్రాంతాలలో దేవాలయాలు కనిపిస్తాయని మా పూర్వీకులు ప్రవచించారు. ఈ విమోచన కార్యం ఆ స్థాయిలో జరగాలంటే వందలాది దేవాలయాలు కావాలి” (The Teachings of Ezra Taft Benson [1988], 247).

  24. సిద్ధాంతము మరియు నిబంధనలు 93:1.

  25. ఎల్డర్ డేవిడ్ బి. హెయిట్ ఇలా చెప్పారు:

    “కొందరు నిజంగా రక్షకుడిని చూశారనేది నిజం, కానీ ఒకరు నిఘంటువును సంప్రదించినప్పుడు, చూశారు అనే పదానికి ఆయనను తెలుసుకోవడం, ఆయనను గుర్తించడం, ఆయనను మరియు ఆయన పనిని గుర్తించడం, ఆయనను గ్రహించడం, ఆయన ప్రాముఖ్యతను గ్రహించడం లేదా ఆయనను అర్థం చేసుకోవడం వంటి అనేక ఇతర అర్థాలు ఉన్నాయని తెలుసుకుంటారు.

    “అటువంటి పరలోకపు జ్ఞానోదయం మరియు ఆశీర్వాదాలు మనలో ప్రతీఒక్కరికి అందుబాటులో ఉన్నాయి” (“Temples and Work Therein,” Ensign, Nov. 1990, 61).