సర్వసభ్య సమావేశము
యేసు క్రీస్తు ద్వారా నిబంధన విశ్వాసం
2024 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


యేసు క్రీస్తు ద్వారా నిబంధన విశ్వాసం

మనం ప్రభువు మందిరంలోకి ప్రవేశించినప్పుడు, మనం క్రీస్తు యొక్క ఉన్నతమైన మరియు పరిశుద్ధమైన శిష్యులుగా మారడాన్ని నేర్చుకునే పవిత్ర ప్రయాణాన్ని ప్రారంభిస్తాం.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ వారాంతంలో మన నాయకుల నుండి మనం వినబోయే ప్రేరేపిత సందేశాల ద్వారా మనం ఆధ్యాత్మికంగా పునరుద్ధరించబడాలని మరియు “యేసు క్రీస్తు ద్వారా నిబంధన విశ్వాసం” అని పిలవడానికి నేను ఇష్టపడే దానిలో సంతోషించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ విశ్వాసం తమ నిబంధనలను పాటించేవారికి దేవుడు వాగ్దానం చేసే ఆశీర్వాదాలను పొందేందుకు నిశ్శబ్దమైన, నిశ్చయమైన హామీ మరియు ఇది మన కాపు సవాళ్ళతో కూడిన పరిస్థితుల మధ్య చాలా అవసరం.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారి ప్రేరేపిత నాయకత్వం క్రింద, ప్రపంచవ్యాప్తంగా ప్రభువు యొక్క క్రొత్త మందిరాల నిర్మాణం సంఘ సభ్యుల మధ్య గొప్ప ఆనందాన్ని కలిగించింది మరియు ప్రభువు రాజ్య విస్తరణకు ముఖ్యమైన చిహ్నంగా పనిచేస్తుంది.

గత అక్టోబరులో ఫెదర్ రివర్ కాలిఫోర్నియా దేవాలయం యొక్క ప్రతిష్ఠాపనలో విస్మయపరిచిన నా అనుభవంపై ప్రతిబింబిస్తూ, కొన్నిసార్లు మనం మన నగరాలు మరియు సమాజాలలో కొత్త దేవాలయాలను కలిగి ఉండాలనే ఉత్సాహంలో మునిగిపోయి, దేవాలయంలో చేసిన పవిత్ర నిబంధనల యొక్క పరిశుద్ధమైన ప్రయోజనాన్ని విస్మరిస్తామా అని నేను ఆశ్చర్యపోయాను.

ప్రతి దేవాలయం ముందు భాగంలో “యెహోవా పరిశుద్ధుడు” అనే గంభీరమైన ప్రకటన వ్రాయబడింది.1 ఈ ప్రేరేపిత పదాలు, మనం ప్రభువు మందిరంలోకి ప్రవేశించినప్పుడు, మనం క్రీస్తు యొక్క ఉన్నతమైన మరియు పరిశుద్ధమైన శిష్యులుగా మారడాన్ని నేర్చుకునే పవిత్ర ప్రయాణాన్ని ప్రారంభిస్తామనడానికి స్పష్టమైన ఆహ్వానం. మనం దేవుని యెదుట పరిశుద్ధతతో నిబంధనలను చేసుకుంటూ, రక్షకుని అనుసరించడానికి కట్టుబడి ఉన్నప్పుడు, మన హృదయాలను మార్చుకోవడానికి, మన ఆత్మలను పునరుద్ధరించుకోవడానికి మరియు ఆయనతో మన సంబంధాన్ని మరింతగా పెంచుకోవడానికి మనం శక్తిని పొందుతాము. అలాంటి ప్రయత్నం మన ఆత్మలకు పవిత్రతను తెస్తుంది, దేవుడు మరియు యేసు క్రీస్తుతో పవిత్రమైన బంధాన్ని ఏర్పరుస్తుంది, వారు నిత్యజీవం యొక్క బహుమతిని మనం వారసత్వంగా పొందగలమని వాగ్దానం చేస్తారు.2 ఈ పవిత్ర ప్రయాణం యొక్క ఫలితం ఏమిటంటే, యేసు క్రీస్తు ద్వారా చేసిన మన నిబంధనలలో మన రోజువారీ జీవితాల కోసం మనం పరిశుద్ధమైన మరియు ఉన్నతమైన విశ్వాసాన్ని పొందుతాము.

అలాంటి విశ్వాసం దేవునితో మనకున్న దైవిక సంబంధానికి పరాకాష్ట, అది యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్త త్యాగం పట్ల మన భక్తిని, కృతజ్ఞతను పెంచుకోవడంలో మనకు సహాయపడగలదు. అది ఇతరులను ప్రేమించే మరియు సేవ చేసే మన సామర్థ్యాన్ని బలపరుస్తుంది మరియు పెరుగుతున్న అంధకారపు, నిరుత్సాహపరిచే అపరిశుద్ధ ప్రపంచంలో జీవించడానికి మన ఆత్మలను బలపరుస్తుంది. ప్రత్యేకించి జీవితం కష్టంగా ఉన్నప్పుడు, శ్రమలు చాలా కాలంగా ఉన్నప్పుడు లేదా పరిస్థితులు కష్టంగా ఉన్నప్పుడు, శత్రువు మన హృదయాలలో లోతుగా నాటడానికి ప్రయత్నించే సందేహం, నిరాశ, భయం, నిస్పృహ, హృదయ వేదన మరియు నిస్సహాయత యొక్క బీజాలను అధిగమించడానికి అది మనకు శక్తినిస్తుంది. నేటి ప్రాపంచిక సవాళ్ళ యొక్క బలమైన గాలికి మనం మొగ్గు చూపుతున్నప్పుడు మనలో ప్రతి ఒక్కరికీ ఈ బైబిలు వచనం మంచి సలహాను అందిస్తుంది: “కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి.”3

ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసు క్రీస్తు ద్వారా ప్రభువు మందిరంలో చేసిన నిబంధనలపై నిజమైన విశ్వాసాన్ని పొందిన వారు ఈ జీవితంలో మనం ప్రవేశం కలిగియుండగల అత్యంత శక్తివంతమైన శక్తులలో ఒకదాన్ని కలిగి ఉంటారు.

రండి, నన్ను అనుసరించండిలో ఈ సంవత్సరం మోర్మన్ గ్రంథమును మనం అధ్యయనం చేసినందున, ప్రభువు ఆజ్ఞాపించిన విధంగా పలకలను పొందేందుకు ఎదురుదెబ్బలు మరియు సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడు నీఫై తన విశ్వసనీయత ద్వారా ఈ రకమైన నిబంధన విశ్వాసం యొక్క శక్తిని ఎలా అందంగా ఉదహరించాడో మనం చూశాము. లేమన్, లెముయెల్‌ల భయం మరియు విశ్వాస లేమి వల్ల నీఫై చాలా బాధపడినప్పటికీ, ప్రభువు వారికి పలకలను అందిస్తారని నమ్మకంగా నిలిచాడు. అతడు తన సహోదరులతో ఇలా చెప్పాడు, “ప్రభువు జీవముతోడు, మన జీవముతోడు, ప్రభువు మనకు ఆజ్ఞాపించిన కార్యమును సాధించునంత వరకు అరణ్యములోనున్న మన తండ్రి యొద్దకు మనము వెళ్ళము.”4 ప్రభువు వాగ్దానాలపై నీఫైకి ఉన్న నమ్మకం కారణంగా, అతను ఏమి చేయమని ఆజ్ఞాపించబడ్డాడో దాన్ని సాధించగలిగాడు.5 తరువాత, అతని దర్శనంలో, నీఫై ఈ రకమైన విశ్వాసం యొక్క ప్రభావాన్ని చూసి, ఇలా వ్రాసాడు, “గొఱ్ఱెపిల్ల సంఘము యొక్క పరిశుద్ధులపైన, ప్రభువు నిబంధన జనులపైన దేవుని గొఱ్ఱెపిల్ల యొక్క శక్తి దిగివచ్చుట నీఫైయను నేను చూచితిని; వారు గొప్ప మహిమయందు పరిశుద్ధతను, దేవుని శక్తిని ఆయుధములుగా ధరించుకొనియుండిరి.”6

జీవిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు వారిని బలపరుస్తూ, దేవుని పిల్లల జీవితాల్లోకి ప్రభువు యొక్క ప్రేమపూర్వక వాగ్దానాలు మరియు శక్తి ప్రవహించడాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. ఒకరోజు నా భార్య దేవాలయంలో ఆరాధన ముగించుకుని ఇంటికి వచ్చి, అక్కడ తాను అనుభవించిన సంఘటనలు ఆమెను లోతుగా తాకినట్లు నాకు చెప్పింది. ఆమె ప్రభువు మందిరంలోకి ప్రవేశించినప్పుడు, చక్రాల కుర్చీ‌లో ఉన్న ఒక వ్యక్తి చాలా నెమ్మదిగా కదులుతుండడం మరియు ఒక స్త్రీ కర్ర పట్టుకొని చాలా కష్టంగా నడుచుకుంటూ వెళుతుండడం ఆమె చూసింది, ఇద్దరూ ధైర్యంగా ప్రభువును ఆయన మందిరంలో ఆరాధించడానికి వస్తున్నారు. నా భార్య ఆరంభవిధి ప్రాంతంలోకి వెళుతుండగా, ఒక చేతిని కోల్పోయి, మరో చేతిలో కొంత భాగాన్ని మాత్రమే కలిగి ఉన్న ఒక ప్రియమైన సోదరి, ఆమెకు ఇచ్చిన ఏ పనినైనా అందంగా, దివ్యంగా నిర్వర్తించడం చూసింది.

నేను, నా భార్య ఆ అనుభవం గురించి మాట్లాడుకున్నప్పుడు, వారి వ్యక్తిగత జీవిత పరిస్థితులు ఏవైనప్పటికీ దేవుని మందిరంలో ఆయనతో చేసిన పరిశుద్ధ నిబంధనల ద్వారా దేవుడు అందించే నిత్య వాగ్దానాలపై స్వచ్ఛమైన మరియు హృదయపూర్వక విశ్వాసం మాత్రమే ఆ గడ్డకట్టే చలిలో ఆ అద్భుతమైన క్రీస్తు శిష్యులు తమ ఇళ్ళను విడిచిపెట్టగలిగేలా చేయగలదని మేము నిర్ధారించాము.

నా ప్రియమైన స్నేహితులారా, మనం కలిగి ఉండగలిగేది ఒక్కటి ఉంటే—రాబోయే పరీక్షలు మరియు శ్రమలలో ప్రతీ ఒక్కరికి సహాయం చేసేలా మన పిల్లలకు మరియు మనవళ్లకు మనం అందజేయగలిగేది ఏదైనా ఉంటే—అది యేసు క్రీస్తు ద్వారా చేసిన నిబంధనలపై విశ్వాసమే. అటువంటి దైవిక ఆస్తిని పొందడం, “నా శిష్యులు పరిశుద్ధ స్థలములలో కదలక నిలిచియుందురు”7 అని ప్రభువు తన నమ్మకమైన అనుచరులకు వాగ్దానం చేసినట్లు జీవించడానికి వారికి సహాయం చేస్తుంది.

యేసు క్రీస్తు ద్వారా మనం అలాంటి విశ్వాసాన్ని ఎలా పొందగలం? అది వినయం, మన జీవితాలను రక్షకునిపై కేంద్రీకరించడం, యేసు క్రీస్తు సువార్త సూత్రాల ప్రకారం జీవించడం, రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క విధులను పొందడం మరియు ఆయన పరిశుద్ధ మందిరములో దేవునితో మనం చేసే నిబంధనలను గౌరవించడం ద్వారా వస్తుంది.

2019 అక్టోబరు సర్వసభ్య సమావేశంలో తన ముగింపు వ్యాఖ్యలలో, మన ప్రియమైన ప్రవక్త నిబంధన విశ్వాసాన్ని సాధించడంలో ఒక ముఖ్యమైన దశ గురించి మనకు గుర్తు చేశారు: “ప్రభువు యొక్క మందిరములో ప్రవేశించుటకు వ్యక్తిగత యోగ్యతకు వ్యక్తిగత ఆత్మీయ సిద్ధపాటు అవసరము. వ్యక్తిగత యోగ్యతకు ప్రభువు వలే ఎక్కువగా అగుటకు, ఒక నిజాయితీగల పౌరునిగా ఉండుటకు, ఒక మంచి మాదిరిగా ఉండుటకు, మరియు ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా ఉండుటకు మనస్సు, హృదయము యొక్క పూర్తి మార్పు అవసరమగును.”8 కాబట్టి, దేవాలయంలోకి ప్రవేశించడానికి మనం మన సన్నద్ధతను మార్చుకుంటే, దేవాలయంలో మన అనుభవాన్ని మనం మార్చుకుంటాము, అది దేవాలయం వెలుపల మన జీవితాలను మారుస్తుంది. “అప్పుడు నీ ఆత్మస్థైర్యము దేవుని సముఖమందు బలమైనదిగా ఎదుగును; యాజకత్వపు సిద్ధాంతము ఆకాశమునుండి కురియు మంచుబిందువుల వలే నీ ఆత్మ మీదకు దిగివచ్చును.”9

నాకు తెలిసిన ఒక బిషప్పు ప్రాథమికలోని పెద్దపిల్లల తరగతిని “ప్రాథమిక” తరగతి‌గా కాకుండా “దేవాలయ సిద్ధపాటు” తరగతి‌గా సూచిస్తారు. జనవరిలో బిషప్పు తరగతి సభ్యులను, వారి బోధకులను తన కార్యాలయానికి పిలుస్తారు, అక్కడ వారు దేవాలయంలో ప్రవేశించడానికి సిద్ధపడడంలో సంవత్సరమంతా ఎలా గడుపుతారో మాట్లాడుకుంటారు. వారికి వర్తించే దేవాలయ సిఫారసు మౌఖిక ప్రశ్నలను చర్చించడానికి బిషప్పు సమయం తీసుకుంటారు, తర్వాత అవి వారి ప్రాథమిక పాఠాలలో చేర్చబడతాయి. సంవత్సరం తర్వాత బిషప్పు కార్యాలయానికి వచ్చినప్పుడు, వారు నమ్మకంగా, నిబంధన విశ్వాసంతో ఉండి, దేవాలయ సిఫారసును పొందడానికి మరియు ప్రభువు మందిరంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉండేలా సిద్ధపడేందుకు ఆయన పిల్లలను ఆహ్వానిస్తారు. ఈ సంవత్సరం బిషప్పు నలుగురు యువతులను కలిగియున్నారు, వారు చాలా ఉత్సాహంగా, సిద్ధంగా, దేవాలయానికి వెళ్లడానికి నమ్మకంగా ఉన్నారు, బిషప్పు తమ సిఫారసులను నూతన సంవత్సరం రోజున ఉదయం 12:01 గంటలకు ముద్రించాలని వారు కోరుకున్నారు.

సిద్ధపాటు మొదటిసారి దేవాలయానికి వెళ్లే వారికి మాత్రమే కాదు. మనమందరం ప్రభువు మందిరానికి వెళ్ళడానికి నిరంతరం సిద్ధపడాలి. నాకు తెలిసిన ఒక స్టేకు “గృహ కేంద్రీకృతమైనది, సంఘ సహకారమివ్వబడినది మరియు దేవాలయానికి కట్టుబడి ఉంటుంది” అనే నినాదాన్ని స్వీకరించింది. బద్ధుడైయుండడం 10 అనేది ఒక ఆసక్తికరమైన పదం, దాని అర్థం ఒక దిశపై దృష్టి కేంద్రీకరించడం, అయితే దాని అర్థం బిగించడం లేదా భద్రపరచడం, పరిష్కరించడం మరియు నిర్ణయించడం, ఖచ్చితమైనది అని కూడా. కాబట్టి దేవాలయానికి బద్ధులైయుండడం మనల్ని రక్షకుని దగ్గర భద్రపరుస్తుంది, యేసు క్రీస్తు ద్వారా నిబంధన విశ్వాసాన్ని కలిగి ఉండేలా చూసుకుంటూ మనకు సరైన దిశను, స్థిరత్వాన్ని ఇస్తుంది. కాబట్టి, దేవాలయం సమీపంలో ఉన్నా లేదా దూరంగా ఉన్నా, ప్రభువుతో ఆయన మందిరంలో మన తదుపరి సమయాన్ని నిర్ణయించుకోవడం ద్వారా మనమందరం ఉద్దేశపూర్వకంగా అలాంటి బంధాన్ని పెంచుకోవాలి.11

ఇలా చెప్పడం ద్వారా మన ప్రియమైన ప్రవక్త, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఈ ముఖ్య సూత్రాల గురించి మనకు జ్ఞాపకం చేసారు: “దేవాలయం మన విశ్వాసాన్ని, ఆత్మీయ స్థైర్యాన్ని బలోపేతం చేసే ముఖ్యమైన భాగంగా ఉన్నది, ఎందుకంటే రక్షకుడు మరియు ఆయన సిద్ధాంతము దేవాలయంలో అత్యంత కీలకమైన భాగాలుగా ఉన్నాయి. బోధన ద్వారా మరియు ఆత్మ ద్వారా దేవాలయంలో బోధింబడే ప్రతీ విషయము యేసు క్రీస్తుపై మన అవగాహనను పెంచుతుంది. పవిత్రమైన యాజకత్వ నిబంధనల ద్వారా ఆయన ఆవశ్యకమైన విధులు మనల్ని ఆయనతో బంధించి ఉంచుతాయి. తరువాత, మనం మన నిబంధనలను పాటించినప్పుడు, ఆయన యొక్క స్వస్థపరిచే, బలపరిచే శక్తిని ఆయన మనకు వరముగా ఇస్తారు. ఓహ్, రాబోయే రోజుల్లో ఆయన శక్తి మనకు ఎంతో అవసరం.”12

మన పరలోక తండ్రితో ఆయన నామంలో మనం నిబంధనలను చేసుకుంటున్నప్పుడు, సరిగ్గా ఎలా ప్రవర్తించాలో గొప్ప స్పష్టతతో అర్థం చేసుకోవడానికి మనం సిద్ధపడాలని రక్షకుడు కోరుకుంటున్నారు. మన విశేషాధికారాలు, వాగ్దానాలు మరియు బాధ్యతలను అనుభవించడానికి మనం సిద్ధంగా ఉండాలి; ఈ జీవితంలో మనకు అవసరమైన ఆధ్యాత్మిక అంతర్దృష్టులు మరియు మేల్కొలుపులను కలిగి ఉండటానికి సిద్ధంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. మన జీవితాలను ఆయనపై మరియు ఆయన మందిరంలో మనం చేసే విధులు మరియు నిబంధనలపై కేంద్రీకరించడానికి మన సంకల్పంలో చిన్న కోరికను లేదా నీతివంతమైన ప్రయత్నాన్ని ప్రభువు చూసినప్పుడు, ఆయన తన పరిపూర్ణ మార్గంలో మనకు అవసరమైన అద్భుతాలు మరియు సున్నితమైన దయతో మనల్ని ఆశీర్వదిస్తారని నాకు తెలుసు.

మనము ఉన్నతమైన మరియు పరిశుద్ధమైన మార్గాలలో రూపాంతరం చెందగల ప్రదేశం ప్రభువు యొక్క మందిరం. కాబట్టి, మనము దేవాలయం నుండి బయటికి నడిచినప్పుడు, నిబంధనలలోని వాగ్దానాలపై మన ఆశతో రూపాంతరం చెంది, ఉన్నతము నుండి శక్తితో సన్నద్ధులమై, మనతో పాటు దేవాలయాన్ని మన ఇళ్లలోకి మరియు జీవితాలలోకి తీసుకువెళతాము. ప్రభువు మందిరం యొక్క ఆత్మను మనలో కలిగియుండడం మనల్ని పూర్తిగా మారుస్తుందని నేను మీకు హామీ ఇస్తున్నాను.

మన జీవితాల్లో ప్రభువు యొక్క ఆత్మ నిర్బంధము లేకుండా ఉండాలని మనం కోరుకుంటే, మనం ఎవరి పట్లా దయలేని భావాలను కలిగి ఉండలేము మరియు ఉండకూడదు అని దేవాలయం ద్వారా మనకు తెలుసు. దయలేని భావాలు లేదా ఆలోచనలకు మన హృదయాలలో లేదా మనస్సులలో చోటు కల్పించడం, సామాజిక మాధ్యమంలో లేదా మన ఇళ్లలో దయలేని మాటలు మరియు చర్యలను ఉత్పత్తి చేస్తుంది, దీని వలన ప్రభువు యొక్క ఆత్మ మన హృదయాల నుండి వైదొలగుతుంది. కాబట్టి, దయచేసి మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి, బదులుగా, మీ విశ్వాసం బలంగా ఉండనివ్వండి.

కొనసాగుతున్న మరియు వేగవంతమైన దేవాలయాల నిర్మాణం మనల్ని ఉత్తేజపరుస్తుంది, స్ఫూర్తినిస్తుంది మరియు ఆశీర్వదిస్తుంది. ఇంకా ముఖ్యమైనది, మనం దేవాలయంలోకి ప్రవేశించడానికి మన సన్నద్ధతను మార్చుకున్నప్పుడు, దేవాలయంలో మన అనుభవాన్ని మనం మార్చుకుంటాము, అది దేవాలయం వెలుపల మన జీవితాలను మారుస్తుంది. ఈ పరివర్తన యేసు క్రీస్తు ద్వారా దేవునితో చేసిన మన పరిశుద్ధ నిబంధనలపై విశ్వాసంతో మనల్ని నింపుతుంది. దేవుడు జీవిస్తున్నాడు, యేసు మన రక్షకుడు మరియు ఇది భూమిపై పునఃస్థాపించబడిన ఆయన సంఘము. మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో నేను ఈ సత్యాలను భక్తిపూర్వకంగా ప్రకటిస్తున్నాను, ఆమేన్.